Sunday, 5 July 2015

మండు వేసవిలో సుఖ సంసారం :: డా. జి వి పూర్ణచందు

మండు వేసవిలో సుఖ సంసారం
డా. జి వి పూర్ణచందు
నలదమయంతు లిద్దఱు మనః ప్రభావానల బాధ్యమానులై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవ నందనమ్ములన్
నలిన దళంబులన్ మృదు మృణాళములన్ ఘనసార పాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల( జందన చారు చర్చలన్
ఇది నన్నయ గారి పద్యం. ఎలాంటి ఏసీలూ లేని ఆ రోజుల్లో ఎండామండిత కాలంలో సుఖంగా సరస సాంగత్యాలకు సౌకర్యవంతంగా ఉండేవి కావు. అందుకని, మండు వేసవిలో  చల్లదనం కంటికి, వంటికీ, ఇంటికీ ఆనక, ఆ ఉక్కపోతలోనే కొత్త దంపతులైన నలదమయంతులు హానీమూన్ ‘సలిపా’రని వర్ణిస్తాడు ఈ పద్యంలో నన్నయ గారు. సలపరింత అంటే, పుండు పోటెత్తడం. ఆ ఎండాకాలంలో నలదమయంతులు ఆనంద డోలికల్లో తేలియాడిందేమీ లేదనటానికి ‘సలిపా’రనే పదం వాడి ఉంటాడు నన్నయ గారు. ఎంత ఏసీలో జీవించే వారికైనా, కరెంటు పోతే, ‘ఏసీ’ ‘తీసీ’గా మారిపోయి, ఇదే దుస్థితి తప్పదు కదా!

పూర్వకవులు సాధారణంగా వసంత మాసాన్ని, శారద రాత్రుల్నీ సుఖవికాసాలకు అనువైన కాలంగా వర్ణిస్తారు. కానీ, నన్నయ గారు ‘దీర్ఘవాసరనిశల్’ అంటే, ఎప్పుడు క్యాలెండర్లో తేదీ మారుతుందా... అనిపించే సుదీర్ఘ దివారాత్రాల రోజుల్లో కొత్త దంపతులైన నల దమయంతుల్ని తెచ్చి కలిపాడు. మనః ప్రభావాన్ని అంటే, మన్మథ తాప బెడదని తప్పించు కోవటానికి ఆ నవదంపతులు పడిన అవస్థ ఊహించుకోవాల్సిందే!

ముప్పై వేల ఎకరాల రాజధాని ఊరింతలు ఏవీ లేని సత్తెకాలం కాబట్టి, ఆ రోజుల్లో పూలతోటలు, తామరకొలనులూ వగైరా ‘ఉన్న’ రోజులు కాబట్టి, తామర పూల రేకులు, తామర కాడలతో(మృదు మృణాళములన్ ), పన్నీటి జల్లులతో (సలిల ధారలన్) అక్కడ వేసవి కాలక్షేపం చేసారట. వాళ్లకు చల్ల దనం  అనేది ఏ మాత్రం అయినా దొరికిందంటే గంధం చెక్కని కొద్దిగా పచ్చ కర్పూరం పలుకులతో (ఘనసార పాంసులన్) అరగదీసి గంథం తీసి అది వొంటికి రాసుకోవటం (చందన చారు చర్చ) వలన మాత్రమే! అది  రాసుకున్నాక లేత ఆకులు (నలిన దళంబులన్) పరుపులా పరుచుకుని వాటిమీద ‘వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడ్డారు’ అని చెప్పటం కోసం ‘సలిపారు’ అనే పదం వాడాడు నన్నయ గారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంథా లనే ఐదు గుణాల్లో శబ్దం తప్ప తక్కినవన్నీ అక్కడున్నట్టు నన్నయ్యగారి వర్ణన ధ్వనిస్తోంది. 

సుఖజీవనానికి చల్లగాలిమర(ఏసీ మిషను) ఒకటి ఉండి ఉంటే వేసవిలో రతి వైభవాన్ని వర్ణించటానికి కలాలు, పేజీలు సరిపోయేవి కాదు. వేసవి శృంగారం గురించి చెప్పేదేముంటుందని, ‘సలిపారు’ అనేసి ఊరుకున్నాడు నన్నయ గారు. అప్పో సొప్పో చేసి ఏసీ పెట్టించుకున్నప్పటికీ కరెంటు సమస్య ‘సలపరింత’ పెట్టేది ఖాయం కదా!
 అందుకని,30వేల ఎకరాల కొత్త రాజధానిలో ‘బృందావనం ఫౌంటైన్లూ, నందనవనాలూ, తామర కొలనులూ, కాసిని మంచిగంథం చెక్కలూ, పచ్చకర్పూరం పలుకులూ వగైరా శీతల ఉపచర్య సామగ్రి జనసామాన్యానికి అందుబాటులో ఉండటం అవసరం’ అని కొత్త ప్రభువులకు నన్నయగారి ఈ పద్యం సూచిస్తోందన్నమాట! చెరువుల్నీ, తోటల్నీ తొలగించి, భవనాలు కడుతున్నందున ఈ శీతల సామగ్రిని జనసామాన్యం కోసం ప్రభుత్వమే సమకూర్చాలని నన్నయ గారి భావన!  

వేసవిలో వడ కొట్టకుండా, విరేచనాలు కాకుండా, ఒళ్ళు పేలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు గానీ, నన్నయ చెప్పిన ‘సలప’రింతని తప్పించుకోవటానికి ముందుసరి ఏర్పాట్లు చేసుకునే ధ్యాస చాలా తక్కువ మందికి ఉంటుంది. దీర్ఘవాసర నిశల్లో సుఖ సంసారానికి సులువైన మార్గాలు నన్నయగారి ఈ పద్యంలోనే ఉన్నాయి. ఆయన పచ్చకర్పూరం గంథం మిశ్రమాన్ని వంటికి పూసుకుని శీతలోపచారాలు చేసుకోవాలన్నాడు. కానీ, ఈ మిశ్రమాన్నే కడుపులోకి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.   

మంచి గంథం చెక్కని సంపాదించండి. సానమీద ఒకటి రెండు పచ్చకర్పూరం పలుకులతో ఈ గంథం చెక్కని అరగ దీయండి. అలా వచ్చిన సానగంధాన్ని ఒక పళ్ళెంలో వేసి పావుగంట సేపు ఆరనిస్తే, అది మాత్ర కట్టుకునేందుకు వీలుగా గట్టి పడుతుంది. బఠాణి గింజలంత ఉండలు చేసుకుని రోజూ ఒకటి లేక రెండు మాత్రలు కడుపులోకి తీసుకుని పాలు తాగండి. ఈ గంథం+పచ్చకర్పూర మిశ్రమం శరీరంలో ఊష్మాన్ని తగ్గిస్తుంది. పై పూతగా వంటికి రాసుకుంటే ఎంత చల్లదనాన్నిస్తుందో, కడుపు లోకి తీసుకున్నా అంత చలవనిస్తుంది. లైంగిక శక్తినీ, ఆసక్తినీ పెంచుతుంది. తక్కువ మోతాదులో తీసుకోవాలి! పచ్చ కర్పూరం అతిగా వాడకూడదు. జలుబు చేస్తుంది.

 ‘అపార్ట్‘మెంట్ల సంస్కృతి పెరిగాక గాలీ వెలుతురు గురించి ఆలోచించటం మానేసి, సీలింగు ఫ్యాన్లూ, పగటి దీపాలు, ఏసీల మీద ఆధార పడ్డ ప్రజలకు కరెంటు లేని సమయంలో నలదమయంతుల సలపరింత అనుభవంలోకి వస్తుంది. గాలీ వెల్తురూ రాకుండా, ఫ్యాన్లతోనూ ఏసీలతోనూ వదిలిన గాలినే పీలుస్తూ జీవించే విధంగా ఇళ్ళు కట్టుకుంటూ, సుఖాన్ని భూతద్దంతో వెదుక్కోవటం మనకు మనం చేసుకుంటున్న అన్యాయం.