Tuesday, 2 September 2014

బూతు సందేశాల ఇచ్చిపుచ్చులాట- సెక్స్‘టిజం డా. జి వి పూర్ణచందు

బూతు సందేశాల ఇచ్చిపుచ్చులాట- సెక్స్టిజం
డా. జి వి పూర్ణచందు
ఒక స్వల్పవర్గం మేథావులు ఆధునిక సాంకేతిక ప్రయోగాలతో ఎక్కడలేని అద్భుతాలనూ ఆవిష్కరిస్తూ ఉంటేమేథా సంపత్తి శూన్యం అయిన అధునిక అత్యధికులు ఆ సాంకేతికతను దుర్వినియోగ పరచుకోవటాన్నే నాగరికతగా భావిస్తున్నారు. టివీల దగ్గరనుండీ సెల్ఫోన్లవరకూ సాంకేతికతని మేథావులు జనసామాన్యానికి చేరువ చేస్తుంటే వాటి వినియోగం ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతోందో మనందరికీ తెల్సు.
సెక్స్టింగ్(Sexting)సెల్ఫోన్లలో ఇప్పుడొక కొత్త ఆట. ఫోనుద్వారా సెక్సు సందేశాలు పంపటం 21వ శతాబ్దినాటి ఈ ఆటలో ముఖ్యాంశం. Sex  మరియు Texting అంటే లైంగిక మరియు సందేశాలు పంపటం. ఈ రెండు పదాలూ కలిపి స్క్స్టింగ్ అంటున్నారు. ఇదొక ఆట! సెక్స్టిష్టులు ఆడే సెక్స్ట్ (sext) ఆట. సెల్ఫోన్ ద్వారా నగ్న, అర్థనగ్న బొమ్మలు, లోదుస్తుల్లో తమ ఫొటోలు, నాన్వెజ్ జోకులు, ఆ ఇద్దరూ సెక్సులో పాల్గొంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వర్ణనలూ రాసి మెసేజిలు పంపుకోవటం ఈ ఆటలో ప్రథానం.
ఆగష్టు 2012,  మెరియం వెబ్ష్టర్ నిఘంటువులో సెక్స్ట్, సెక్స్టింగ్, సెక్స్టిష్ట్ పదాలు చేరాయని వికిపీడియా చెప్తోంది. ఈ ఆట లండన్లో మొదలై, ఆష్ట్రేలియా, అమెరికా రాష్ట్రాలు, కెనడాలకు విస్తరించింది. ఆ రెండు దేశాలకూ చేరిందంటే, ఇండియాకు ఆగమేగాల మీద చేరుతుంది.
పూర్వం హంస రాయబారాలు, కాకి రాయబారాలు, పావురం రాయబారాలు ఉండేవని మన సాహిత్య అధారాల ద్వారా తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు మిరపకాయ టపాలు పంపేవాడట. తీవ్రవాదులు ఇప్పుడు -మెయిల్ సందేశాలను ఎక్కువగా వాడుతున్నారు. అమ్మాయిలూ అబ్బాయిలూ మాత్రం సెల్ సందేశాలకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. బాగా  ఉచిత మెస్సేజీ లిచ్చే ప్యాకేజీలకు యువతీ యువకులు ఎగబడటాన్ని మనం గమనించవచ్చు. ఆ వయసులో వాళ్ళు వందల్లో పంపే సందేశాలు ఏవుంటాయని అడక్కండి. ఛాటింగ్ అనేది ఒక సాంకేతిక విప్లవం. లోకం మునిగి పోతున్నా పట్టని ఒక గొప్ప ఔదార్యాన్ని ఇది చాటర్లకు కలిగిస్తుంది.
మిథిలా నగరం మొత్తం మునిగి పోయినా నేను బాధపడను,ఇందులో నాదంటూ పోయేదేమీ లేదన్నాడట జనక మహారాజు. ఆయన్ని గొప్పగా పొగిడి. రోము తగలబడుతుంటే వయొలీన్ వాయించాడని నీరో చక్రవర్తిని తిట్టడం అన్యాయం. ఈ ఇద్దరినీ మించిన నిర్లిప్తత, పట్టని తనం, ఎవడేమైపోతే మనకెందుకనే గొప్ప గుణాలను మనుషుల్లో ఈ ఛాటింగ్ పెంపు చేస్తుంది. సెక్సు కుతి తీరటానికి తప్ప ఇంతకు మించి వీటిలో వాళ్ళకు ఉపయోగపడేదేదీ ఉండదు.
సెక్స్టిజం సెల్లు సందేశాల్ని పెద్దవాళ్ళు చూసి ఇదేవిటని అడిగారనుకోండి,  పిల్లలు ధైర్యంగా ఇలా అంటున్నారు: ఏవుందండీ ఇందులో... ఇది కేవలం సందేశాలు ఇచ్చి పుచ్చుకోవటమే! ఇంతలోనే శీలం పోతుందా? కడుపొచ్చేస్తుందా...? అని! ఇలా యువతీ యువకులు తామేదో ఎదిరించి మాట్లాడుతున్నామని కూడా అనుకోవటం లేదు. ఇచ్చిపుచ్చులాట (Sexting) అనేది చాలా కామన్ విషయం అనీ, మోడర్న్ ఏజిలో ఇలాంటివి సహజం అనీ, తల్లిదండ్రులు వీటిని చూసీ చూడనట్టు పోవాలనీ వాళ్ళలో చాలామంది అనుకుంటున్నారు. కాదు, అంటున్నారు.
ఒకప్పుడు ఆడపిల్లలు వాళ్ళీడు మగ పిల్లలవైపు చూస్తేనే పెద్ద తప్పు చేసేసినట్టు భావించేవాళ్ళు. చేతి వేళ్ళు తగిలితే చాలు కొంపలంటుకున్నట్టే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా కావులించుకుని ముద్దు పెట్టుకున్నా తప్పు లేదంటున్నారు. ఒకప్పుడు సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఆలోచనలను చేయటాన్ని అభివృద్ధి నిరోధకత అనే వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు కళ్ళలో పడితే వ్యతిరేకించటాన్ని అభివృద్ధి నిరోధకత, ఛాందసవాదం, సాంప్రదాయవాదంతిరోగమనం అంటున్నారు. ఒకప్పుడు భావకవిత్వం అంతా ఇలాంటి సందేశాలతోనే నిండి ఉండేది. ఇప్పుడు సెక్స్టిష్టులు తమ సందేశాల్లో అద్భుతమైన కవిత్వాలు రాస్తున్నారు. కృష్ణశాస్త్రి, వేదుల వీళ్ళముందు పనికి రారన్నంత గొప్ప కవిత్వం ఈ ఇచ్చిపుచ్చులాట సందేశాల్లో జాలువారుతుంటుంది. కాలం తీరు ఇది. భావ కవుల్ని పొగిడి వీళ్ళని తెగడటం కూడా సబబు కాదేమో!
న్యూ హాంప్షైర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక పరిశోధనలో 1,560 మంది చిన్న పిల్లల సెల్ఫోన్లు తెరిచి చూస్తే, వాటిలో కూడా 9.6%  సెక్స్టింగ్ సందేశాలు, బూతు బొమ్మలు (pornography), నగ్న- అర్థ నగ్న దృశ్యాలు (రిస్కీ ఫొటోలు),  ఉన్నట్టు తేలింది. 18-20 ఏళ్ళ మధ్య అమెరికన్ యువతీ యువకుల్లో 20% మంది సెక్స్టిష్టులున్నారని తాజా అంచనాలు చెప్తున్నాయి. సెక్స్టిష్టుల్లో 61%     మగవాళ్ళుండగా, 48% ఆడవాళ్ళు ఈ ప్రణయసందేశాలకు అలవాటు పడి ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.
లోకం పోకడ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో, భారతదేశం లాంటి ఎదిగీ ఎదగని పరిణతి కలిగిన దేశం మీద వీటి ప్రభావం ఎలా ఉండబోతోందో గ్రహించటం అవసరమే! ప్రతీ పెరుగుదలకూ ఒక విరుగుదలని కూడా వెదుక్కోవాలి. మానసిక శాస్త్రవేత్తలు ఈ అంశంమీద దృష్టి సారించి పరిశీలన చేస్తున్నారు. ఫేస్ బుక్ లాంటి వాటిల్లో కూడా ఎవడో ఒకడు ఒక దృశ్యాన్ని పెడతాడు. యువత దాన్ని షేర్ చేస్తుంటారు. ఇందులో సెక్సు కుతి కొంతమేర ఉన్నప్పటికీ, ఎక్కువ లైకులు కొట్టించుకుని, ఆ లైకుల సంఖ్యని ఒక గొప్పగా మిత్ర బృందంతో చెప్పుకోవాలనే తాపత్రయాన్ని చాలామంది కుర్రాళ్లలో తరచూ చూస్తూనే ఉంటాం. ఇది ఒక విధమైన ఎగ్జిబిషనిజం. ప్రదర్శనా తత్త్వం. గుంభనంగా జరుపుకునే అతి రహస్య విషయాలను ఇలా రికార్డేడ్ గా పంపటాన్ని తప్పకుండా మనో వికారంగానే భావించవలసి ఉంటుంది.  మనో వికారాలు యువతీ యువకుల్లో లైంగికతని(sexuality) వక్రమార్గాన పట్టిస్తాయి. అది వారి నిండు లైంగిక జీవితానికి తప్పకుండాదెబ్బ కలిగిస్తాయి. భవిష్యత్తులో లైంగిక వేధింపులక్కూడా ఇది దారి తీయవచ్చు.

తల్లిదండ్రులు ఉపాధ్యాయులూ ఒక కంట కనిపెట్టకపోతే భావి భారత పౌరుల ధ్యాస పక్కకు మళ్ళి పోతుంది. 

No comments:

Post a Comment