ఆంధ్రదీపిక ప్రశస్తి
డా. జి వి. పూర్ణచందు.
“నేను మామిడి వంశాంబునిధి విధుండ
సూరనాహ్వయు పౌత్రుండసు జనహితుడ
వేంకనార్యుని పుత్రుండ వినుత యశుండ
వేంకటార్యసమాఖ్యచే వెలయువాడ”
‘పండితరాయ’, ‘బాలామర’, ‘సాహిత్య చక్రవర్తి’ బిరుదాలు పొందిన మామిడి వెంకటార్య పండితులు యావద్భారత దేశంలోనే తొలి ఆధునిక అకారాది నిఘాంటువులకు ఆది పలికాడు. సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో పండితుడు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో అనువాదకుడు. తండ్రి మామిడి వెంకన్న. తాత సూరన్న ఆయన స్వయంగా నూతనత్వం అమరే లాగా నవ్యాంధ్రత్వం నిండేలాగా ‘ఆంధ్రదీపిక’ అనే నిఘంటువును కూర్చి ప్రచురించాడు.“ఆంధ్ర శబ్దజాల సంకేతరచనాచాతురీధురీణంబగు నీయాంధ్ర దీపికా నామక గ్రంథంబు సేయ సమకట్టితి. సంకేతం బెట్టిదనిన సకల శబ్దంబులు నాద్యక్షర క్రమంబు చేత కూర్చబడుచున్నవి” అని ఆయనే స్వయంగా ఒక వివరణ ఇచ్చారు.
ఆద్యక్షరాలు వరుస క్రమంలో ఉండేలా కూర్చటం ఏ సాంకేతిక ఉపకరణాలూ లేని ఆ కాలంలో, నేటికి రెండువందల ఏళ్ళక్రితం, దేశంలోనే తొలిసారిగా మామిడి వెంకయ్యగారు వంటరిగా కష్టించి సాధించి సత్తా చాటుకున్నారు.
అచ్చు యంత్రాలు వ్యాప్తిలోకి రానున్నాయనీ, పుస్తక ప్రచురణ రంగం ఒక కొత్త విప్లవాన్ని సృష్టించ నుందనీ, సాంకేతికాభివృద్ధి కనుచూపు మేరలో ఉందని గ్రహించి, అందుకు తగ్గట్టుగా తెలుగు నిఘంటువు నొకదాన్ని అత్యాధునిక పోకడలతో కూర్చాలనే ముందు చూపుతో కూడిన ఆలోచన 18౦6(1816 అని కొందరంటారు) లోనే ఒక తెలుగువాడికి వచ్చిందంటే, అది అద్భుతమైన విషయమే!
*** *** ***
“కోశవాన్ ఆచార్య:”” అన్నారు. కోశాన్ని అంటే నిఘంటువుల్ని నమిలి మింగినవాడు, పుక్కిలిపట్టిన వాడు, దాన్ని జీర్ణించుకున్నవాడూ మాత్రమే ఆచార్యుడని ఒక వ్యవహారం ఉండేది. భాష మీద పట్టున్నవాడికి శాస్త్రాలు దాశ్యం చేస్తాయి. భాష అనే ఒక జ్యోతి లేకపోతే ఈ లోకం అంధకారమయమే అవుతుంది. ఈ విషయాన్ని అందరికన్నా ముందు గ్రహించ గలిగింది నిఘంటు కర్తలే!
నితరాం=నిజంగా, ఘృయతి=చెప్పేది నిఘంటువు. నిజంగా చెప్పేది, నిజం చెప్పేది, సూటిగా చెప్పేది, విడమరచి చెప్పేది, అర్థఙ్ఞానాన్ని కలిగించేది, గౌరవంగా చదివేది, గౌరవనీయ వేదాలు, ఉపనిషత్తులు తదితర సాహిత్యాదుల నుండి శబ్దాలు ఏర్చి కూర్చినదీ నిఘంటువు అని స్థూలంగా ఒక నిర్వచనం చెప్పుకోవచ్చు.
‘ఘటి’అంటే, భాష! దీన్నిబట్టి కూడా శబ్ద స్వరూప స్వభావాల్ని తెలియ జెప్పేది నిఘంటువని భావార్థం! వైదిక భాషకు సంబంధించిన నిఘంటువుల్ని నిరుక్తం అంటారు. పాణిని కారణంగా లౌకిక సంస్కృతం ప్రాచుర్యం లోకొచ్చింది. తరువాతి కాలాలలో వెలువడిన శబ్దకోశాలు, వ్యాకరణాలు, నిఘంటువులూ వీటన్నింటికీ పాణినీయం, నిరుక్తాదులు ఆధారాలై నిలిచాయి.
సమాజం ఎదిగే కొద్దీ, భాషల్లో శబ్ద సంపద పెరుగుతుంది. సమాజ అవసరాలు పెరిగే కొద్దీ కొత్త పదాల పుట్టుక అనివార్యం అవుతుంది. కొత్త పరికరాలు, పనిముట్లు, వివిధ సామాజిక కార్యాలు వాడకంలోకి వచ్చేకొద్దీ భాషలో నుడులు కొత్తగా ఏర్పడ తాయి. వాటిలో కొన్ని తద్భవాలు, కొన్ని తత్సమాలు కూడా ఉండవచ్చు. అందువలన పాత నిఘంటువుల్ని ఎప్పటి కప్పుడు పెంపు చేసుకోవటం, కొత్తవి తయారు చేసుకోవటం, అంతకు మునుపు వదిలివేయబడ్డ పదాలను కలుపు కోవటం... ఈ కృషి నిరంతరంగా జరగవలసి ఉంటుంది. నిఘంటి నిర్మాతలకు ఇదంతా పెనుసవాలే!
ప్రచురణరంగం లేని ఆ కాలంలో తర్క వ్యాకరణ శబ్దాది విషయాలకు ప్రాచుర్యం కలగటానికి ఆ నాటి కవులు పద్యాల్లోనో లేక శ్లోకాల్లోనో వ్రాసేవారు. అందువలన భట్టీయం వేసి ఙ్ఞాపకం పెట్టుకోవటానికి ధారణా సౌలభ్యం సమకూరింది.
17వ శతాబ్ది నాయకరాజుల కాలం నాటి గణపవరపు వేంకటకవి తనకాలానికి 24 రకాల సంస్కృత నిఘంటువులు వాడుకలో ఉన్నట్టు చెప్పాడు. నిజానికి 1225 లోనే డిక్షనరీ అనే మాట వాడకంలోకి వచ్చింది. డిక్షనరీ అంటే ‘గుర్తుంచుకో వలసినది’ ని అర్థం. అమరకోశం లాగా ధారణ చేయటానికి వీలుగా ఆనాటి లాటిన్ నిఘంటువులు ఉండేవి. ఆంధ్రనిఘంటువులు పద్యాన్ని లేదా శ్లోకాన్ని ఆశ్రయించి పదకోశాలను నిర్మించారు.
చౌడప్ప నిఘంటువు (చౌడప్పసీసాలు) లో ఈ చిన్ని ఉదాహరణ పరిశీలించండి:
“విరియనా పువ్వు/సీవిరియనా కల్లు/ వావిరియనా చెట్టు/కావిరియు-పొగయు/ (విరి అంటే పువ్వు. సీవిరి అంటే కల్లు. వావిరి అంటే చెట్టు. కావిరి అంటే పొగ)
పరియనా డాలు/ రూపరి యనా సొగసు/మేపరియనా తిండి/తేపరన తెగువ...” (పరి అంటే డాలు, రూపరి అంటే సొగసు. మేపరి అంటే తిండి. తేపరి అంటే తెగువ)
ఇది తొలినాటి నిఘంటు స్వరూపం. ఙ్ఞాపకం పెట్టుకునేందుకు వీలుగా చేసిన ఒక ప్రయత్నం. ఇలాగే, అచ్చ తెలుగు కోశంలో నానార్థవర్గం అధ్యాయంలో ఒక సీసపద్యం ఇలా సాగుతుంది:
గౌరన నేనుగు, కాహళి విలసిల్లు: గౌరు అనే పదానికి ఏనుగు, కాహళి(బాకా) అని అర్థాలు
డంబు నాగను గాంతి డంబము నగు: డంబు అంటే కాంతి, డంబం(ఆడంబరం) అని అర్థాలు.
అచ్చుయంత్రాల వ్యాప్తి పెరిగాక పరిస్థితి మారింది. ఇవ్వాళ, 2X2=4అని చెప్పటానికి కాలిక్యులేటర్ ఉపయోగిస్తూ, బుర్ర ఉపయోగించటం మానేసినట్టే, శబ్దాలను ధారణ చేయటం కూడా మానేసి పుస్తకం తెరిచి చూడటం అలవాటయ్యింది. లేఅకపోతే ఇంటర్నెట్ తెరిచి హనుమంతుడు సీతను వెదికినట్టు వెదకటంలా వెదకులాటకు అలవాటు పడిపోతున్నాం. యస్య ఙ్ఞానగుణదయాసింధో అని, అమరకోశం చెప్పటం మొదలుపెడితే “గోడ దూకితే అదే సందో...” అని మనుషులు తప్పించుకుంటారనే వ్యంగ్యోక్తి ఇందుకే పుట్టింది!
ఆ రోజుల్లో ధారణా పటిమ అనేది సామాన్యుడి సొత్తు. ధారణ వలన మెదడు శక్తిమంతం అవుతుంది. ఈ రోజున అది అత్యంత స్వల్ప సంఖ్యలో ఉన్న మేథావులకు పరిమితం అయ్యింది. మొన్న మొన్నటి దాకా వ్రేలికొనల మీద వందలకొద్దీ టెలిఫోను నెంబర్లు గుర్తు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మన ఇంటికే ఫోను చెయ్యాలంటే నెంబరు కొట్టకుండా కాంటాక్ట్సులోకి వెళ్తున్నాం. కాలక్రమంలో ధారణ చేయటాన్ని మనిషి మానుకుంటే మెదడు ఙ్ఞాపకం పెట్టుకునే శక్తిని క్రమేపీ కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆంధ్రదీపిక అనేక కొత్త పదరూపాలను ఆవిష్కరించింది. వాటిని చదివి గుర్తు పెట్టుకో గలిగితేనే భాషపైన పట్టుదొరుకుతుంది ఇతర నిఘంటువుల గురించి అలా ఉంచితే, ప్రతి రోజూ రెండూ లేక మూడు పేజీలు ఆంధ్రదీపికని క్రమంతప్పకుండా చదివితే నలబై వేల తెలుగు పదాల పైన సాధికారికత దక్కుతుంది. పైగా మ్ర్దడు పదునెక్కుతుంది.
*** *** ***
ఇతరులకన్నా భిన్నంగా చెప్పాలనే తపన ప్రతి రచయితకూ సహజంగా ఉంటుంది. ఎక్కువ సంస్కృత భూయిష్టంగా రాయాలని ఒకరు చూస్తే, ఒక్క సంస్కృత పదం కూడా లేకుండా రాయాలని మరొకరు ప్రయత్నించటం సహజం. పాల్కురికి సోమనాథుడి బసవపురాణం దేశీయమైన భావాలకూ, పదాలకూ అద్దంపట్టిన తొలి ప్రజాసాహిత్యంగా చెప్పవలసిన రచన.
సోమనాథుడి తరువాత ఇలాంటి రచనలు ఒక ఉద్యమంగా వచ్చి ఉండాల్సింది. కానీ, అచ్చమైన తెలుగు పదాలతో సాహిత్య సృష్టి చేస్తే రస భావాదులు పుష్టిగా ఉండవనే భయంతో కవులు ఆ ప్రయత్నాలను విరమించుకుని నలుగురు నడిచే సంస్కృతం బాటే పట్టారు. అందువలన తెలుగు నిఘంటువుల రాక బాగా ఆలస్యం అయ్యింది. కారణం ఏదైనా కానీండి, దేశీయమైన రచనలు ఎక్కువగా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ, నన్నెచోడుడి కుమారసంభవం లాంటివి కొన్ని రచనలు కాలగర్భంలోంచి బయటకొచ్చి కావ్యగౌరవాలను దక్కించుకున్నాయి. అన్నమయ ఎన్నేళ్ళ అఙ్ఞాతవాసం తరువాత వేటూరివారి పుణ్యమా అని వెలుగు చూడగలిగాడూ...? అలాగే, ఇంకా మరికొన్ని కొత్త దేశీయ రచనలు ముందు కాలంలో వెలుగులోకొతయని అశిద్దాం.
నిఘంటు నిర్మాణంలో ప్రముఖులైన కొందరు కవులు కావ్యాలలో వాడిన పదాలకు ప్రాధాన్యత దక్కింది. కానీ, దేశీయతని తమ రచనలలో ప్రతిబింబించిన కవుల రచనలలోని అచ్చమైన తెలుగు పదాలు, ఒకనాటి ప్రజల నాల్కల మీద నానిన పదాలు కనుమరుగై పోసాగాయి. చీపురు రోకలి లాంటి వాడుక పదాలను నిఘంటుకర్తలు విస్మరించటాన్ని గిడుగువారు సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనంలో తీవ్రంగా దుయ్యబట్టారు. ఇవన్నీ నిఘంటుకర్తల దృష్టి లోపాలే! తెలుగు శబ్దాలన్నింటినీ ఎలాంటి వివక్షా లేకుండా నిఘంటువుల్లోకి చేర్చాలనేది ఒక ఆశయంగా నిఘంటు నిర్మాణం జరగాలి.
బ్రౌన్ నిఘంటువు(1852) పూర్తయ్యే నాటికే గోడౌన్, కాంపౌండ్, బేరర్, మస్తర్, లాంటి విదేశీ పదాలు జన వ్యవహారాని కొచ్చేశాయి. జమీందార్, రైతు, లోటా, ఆయా లాంటి హిందీ పదాలు కూడా తెలుగు పదాలు గానే చెలామణి కొచ్చాయి. అలాంటి చాలా వాటిని ఆంధ్రదీపికలో చేర్చేందుకు ప్రయత్నించారు మామిడి వెంకయ్యగారు.
ఆంధ్రదీపికలో లోట- శబ్దానికి ‘లోట= చిన్న పాత్రము’ అని అర్థం ఇచ్చారు. బ్రౌన్ ఈ అర్థాన్ని మరింత విస్తృత పరిచి, lota= ఒక కంచు పాత్రకు భారతీయ నామం అనీ, చెంబు అనీ రెండు అర్థాల్ని అందించాడు. ఆంధ్రదీపికను ఆధారంగా తీసుకుని బ్రౌన్ దొర తన తెలుగు ఇంగ్లీషు, ఇంగ్లీషూ తెలుగు, మిశ్రమ నిఘంటులు ఈ నిఘంటు త్రయాన్ని మెరుగు పర్చుకున్నాడనేది నిర్వివాద విషయం.
మహమ్మదీయ బాలలకు జరిపించే ‘సున్తీ’ని ఆంధ్రదీపికలో ‘సున్నతి’ అనే హిందీ శబ్దం అనీ, ఉపనయన సమయంలో శిశ్నము కొనతోలుని ఛేదించటం అనీ, మహమ్మదీయుల, యెహోదీల ఆచార విశేషం అని విపులీకరణ కనిపిస్తుంది. బ్రౌన్ “circumcission: సున్నతి” అని అర్థం ఇచ్చాడు. బ్రౌన్ తరువాత వందేళ్ళకు వచ్చిన సూర్యారాయంధ్ర నిఘంటువులో సుంతీ గానీ సున్నతిగానీ కనిపించదు. ఎందుకు కనిపించదూ? పదాలను రద్దు చేసేందుకో, నిషేధించేందుకో, దాచి వేసేందుకో నిఘంటు కర్తలు ప్రయత్నించ కూడదని ఆంధ్రదీపిక, బ్రౌన్ నిఘంటువులు హెచ్చరిస్తునాయి.
ఓ విద్యుఛ్ఛక్తి ఇంకా వినియోగంలోకి రాని కాలంలో ఎలెక్ట్రిక్ శబ్దానికి బ్రౌన్ ఇచ్చిన అర్థాలు చూడండి: “ఆశ్చర్యకరమైన అద్భుతమైన, ఆకర్షణాపకర్షణ శక్తిగల, మహనీయమైన, అంతర్గతాగ్ని సంబంధమైన, మెరుపు, పిడుగుతోకూడా పడే అగ్ని, చకుముకి రాతిలోని నిప్పులాగా తట్టితే పడేటిది..” ఇన్ని అర్థాలిచ్చాడు. ఇప్పుడు మనం విద్యుఛ్ఛక్తి అంటున్న కరెంటు గురించి వాళ్ళకు ఆనాటికి ఏమాత్రం తెలియన్ రోజులవి. ఆంధ్రదీపికలో విద్యుత్తు శబ్దానికి మెరపు, సంధ్య మెరుగు లేనిది అనే అర్థాలు కనిపిస్తాయి, ఆంధ్రదీపిక రచన జరిగిన ముప్పయేళ్ళ తరువాత బ్రౌన్ నిఘంటువు కూర్పు జరిగింది. కాబట్టే సాంకేతికంగా మరింత సమాచారాన్ని బ్రౌన్ ఇవ్వగలిగాడని అర్థం అవుతోంది. ఆంధ్రదీపిక 18౦6లో వెలువడగా బ్రౌన్ నిఘంటు త్రయం 1852, 1853, 1854 సంవత్సరాలలో వరుసగా వచ్చాయి.
Grammar and vocabulary of the Gentoo Language గ్రంథానికి ముందు మాటలు వ్రాస్తూ, బ్రౌన్‘దొరగారు మామిడి వెంకయ్య గారిని ఇలా ప్రస్తుతిస్తాడు: “The assistance of this man in the compilation of both grammar and vocabulary has been of the greatest advantage” అని! బ్రౌన్ పైన మామిడి వారి ప్రభావం ఘనంగానే ఉందని ఒప్పుకోవాలి.
ఆంధ్ర శబ్ద చింతామణి (1860) బ్రౌన్ నిఘంటువువెలువడిన వెంటనే విడుదలైన నిఘంటు గ్రంథం- తిరునగరి రామానుజయ్య కూర్పు ఇది. 14090 సంఖ్య కలిగి బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలో దీని ప్రతి దొరుకుతోంది. ఆంధ్ర శబ్ద చింతామణి పేరుతో సరస్వతి తిరువేంగడాచార్యులు, వి రాజకృష్ణమాచార్యులు 1865లో ఇంకో నిఘంటువు రూపొందించారు. అక్కడ పదిలంగా ఉన్న నిఘంటువుల్లో ఈ క్రింది అపురూపమైన గ్రంథాలున్నాయి.
ఆంధ్రనామ సంగ్రహం (లక్ష్మణుడు పి.ఇ.),
ఆంధ్రనామశేషము (సూరయ్య, ఎ.బి),
ఆంధ్ర నిఘంటు చతుష్కము (శ్రీనివాస జగన్నాథ స్వామి),
ఆంధ్రపదకరము (వీరప్పరాజు?),
ఆంధ్రపదపారిజాతము (జగన్నాథుడు)
ఆంధ్ర శబ్దతత్త్వము (శేషగిరిశాస్త్రి)
కవిశిరోభూషణం (అహోబల పండితీయం)
1898లో తెలుగు పండితుల తొలి కాంగ్రెస్ (సదస్సు) నివేదిక ఒకటి ఈ కేటలాగులో కనిపిస్తోంది. దీన్ని రామకృష్ణమాచార్యులు రూపొందించినట్టు కేటలాగులో ఉంది. ఇది చదివితే తెలుగు నిఘంటు నిర్మాణంలో తొలినాటి పరిణామాల గురించి అవగాహన కలుగుతుంది. బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీలో ఆంధ్రదీపిక ఉంది కానీ అది రంగనాయకులు శ్రేష్టిగారి పేరుతో ఉంది. వెంకయ్యగారి ‘ఆంధ్రదీపిక’ కూ దీనికీ తేడా ఉన్నదేమో పరిశీలించవలసి ఉంది. రంగనాయకులు శ్రేష్టి మామిడి వెంకయ్య గారి తరువాతి కాలం వాడు. ఆయన స్వేచ్ఛగా వెంకయ్య గారి ఆంధ్రదీపికని తన పేరుతో వేసుకున్నాడా? లేక వెంకయ్య గారే అంగీకరిచి ఇచ్చేశారా? లేక రెండూ వేర్వేరు నిఘంటువులా అనేది స్పష్టం కాలేదు.
*** *** ***
ఎ. డి. క్యాంప్‘బెల్ తన వ్యాకరణ గ్రంథంలో వెంకయ్యగారి గురించి ఇలా వ్రాశాడు: “Mamidi Vencaya, the author of the Andhra Dipica, an excellent dictionary of Telugu, has in his preface to this work, introduced a concise analysis of the language.” అని! క్యాంప్‘బెల్ క్యాంప్బెల్ 1824లో బళ్ళారి కలెక్టరుగా పని చేసిన కాలం అది! క్యాంప్‘బెల్ (1821),జేసీ మోరీస్ (1835 – 1839) వీళ్ళంతా మామిడివారిని అనుసరించిన వారుగానే కనిపిస్తారు.
క్యాంప్‘బెల్, బ్రౌన్, లక్ష్మీనారాయణీయం (అచ్చాంధ్రనిఘంటువు), శబ్దార్థ చంద్రిక, ఆంధ్ర వాచస్పత్యం, శబ్దార్థ దీపిక ఇవన్నీ ఆంధ్రదీపిక వెలుగులో రూపొందిన నిఘంటువులు. “అన్ని నిఘంటువులకు ఆంధ్ర దీపిక తల్లి యనవలెను” శుద్ధ చైతన్యస్వామి ఆంధ్రదీపిక 1965 మచిలీపట్టణం ప్రచురణకు వ్రాసిన ముందు మాటల్లో పేర్కొన్నారు.
బ్రౌన్ మచిలీపట్టణంలో కలెక్టరుగా పనిచేసిన కాలంలోనే ఆయనకు పండితులతో చర్చలకు ఎక్కువ అవకాశం కలిగింది. నన్నయాదుల ప్రయోగాలకు సరైన భావార్థాలను పండితుల నుండి పొందలేక పోవటం వలన బ్రౌన్ బాగా అసంతృప్తి చెందాడు ఒక్కో పండితుడుకీ నెలకి మూడు వేలకు మించి స్వంతంగా జీతాలిచ్చి పెట్టుకున్నాడు. కానీ, ఆయనకు మామిడి వెంకయ్య గారి ఆంధ్రదీపిక ఎక్కువ సహాయపడిందని ఆయనే చెప్పుకున్నాడు. “…the last work tombe described is one that deserves honorable mention being the Telugu Dictionary compiled by mamidivenkayya, a learned Merchant (Komati) of Masulipatnam, who died in 1834. The work is arranged alphabetically in European method and every word that is found in the ancient lyrics, is briefly explained in Telugu or Sanskrit. The work will always be of value to those who study the poets. The title is `Andhradeepica’….”
1936సూర్య రాయాంధ్ర నిఘంటువు వెలువడింది., జయంతి రామయ్య పంతులుగారు దీనికి ముందు మాటలు వ్రాస్తూ, “ఆంధ్రభాషలోని పదములు తత్సములు, ఆచ్ఛికములు, అన్యదేశ్యములు, వైకృతములు, దేశ్యములు నని మూడు విధములుగా విభాగించవచ్చును. ఆచ్ఛికములు వైకృతములు, దేశ్యములు నని రెందు విధములు. గ్రామ్యము అను విభాగ మొక్కటి కలదు గాని, గ్రామ్య శబ్దములు లక్షణ విరుద్ధములై బహువిధములుగా నుండుటచే వాని నీ గ్రంథమున జేర్పలేదు” అని చెప్పుకున్నారు. గ్రామ్యశబ్దాలు లక్ష్య విరుద్ధాలుగా ఉంటాయని దీని సంపాదక వర్గం ఎందుకు భావించిందో తెలియదు. అదే సిద్ధాంతమో అర్థం కాదు..
ఆఫీసు, కుర్చీ, కూర, టూకించు(సంగ్రహించు)గోలీ, గోళ్ళు లాంటి వాడుక పదాలు ఆంఢ్రదీపికలో చోటు చేసుకున్నాయి. ‘కమ్మకట్టు’ అంటే “వ్రాత పూర్వకంగా సేవజేయటానికి ఒడంబడినవాడు” లాంటి అర్థాలు కనిపిస్తాయి. నేటికి 200 ఏళ్ళనాటి వాడుక పదాలను ఈ నిఘంటువులో మనం చాలా చూడవచ్చు. పెంపు చేసిన నిఘంటువులు కొత్తగా అనేకం పుట్టుకొస్తున్న మాట నిజం. కానీ వాటిలో సంస్కృత పదాలను మరిన్ని తెచ్చి నింపడం కాకుండా నేటి ప్రజలు మాట్లాడుకుంటున్న పదాలకు, జాతీయాలకు, సామెతలకు ఎక్కువ భాగం కల్పించాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రదీపిక అకారాది క్రమంలో నిఘంటువుల కూర్పుకు భారతదేశంలోనే మొదటి అడుగు వేసిన నిఘంటువు. మామిడివెంకయ్య అందుకు కారకుడు మరొక ఏడాది కాలంలో ఆంధ్రదీపిక ద్విశతాబ్ది జరగ బోతోంది.
ప్రజల నాలుకల మీద ఆడుతున్న పదాలను ఏర్చి కూర్చి అచ్చమైన ఆంధ్రదీపికను రూపొందించటానికి కృషి చేయగలగటమే మామిడివెంకటార్యకు మనం ఇవ్వగలిగిన నివాళి.