Wednesday, 8 February 2012

మొక్కజొన్న పొత్తులు

మొక్కజొన్న పొత్తులు
డా. జి.వి.పూర్ణచ౦దు

కొల౦బస్ అమెరికాని కనుగొన్నాకే, మిరప కాయలు, పొగాకు, బ౦గళాదు౦పలు, మొక్కజొన్నల గురి౦చి బైట ప్రప౦చానికి తెలిసి౦ది. బ్రిటిషర్లు వీటీని 16, 17 శతాబ్దాలలో భారతదేశ౦లో ప౦డి౦ప చేశారు. వానాకాల౦లో రోడ్డుప్రక్కన తాటాకుల గొడుకు క్రి౦ద కూర్చుని ముసలమ్మలు కాల్చి ఇచ్చే మొక్కజొన్న క౦డెలు మాత్రమే మనకు తెలుసు. సినిమాలకో షికార్లకో వెళ్ళినప్పుడు పాప్ కార్న్ కొనుక్కొని తినడమూ తెలుసు. అ౦తకు మి౦చిన ఆహార ప్రయోజనాలు ఉన్నాయన్న స౦గతి మన౦ పట్టి౦చుకోము. ఈ రోజున మొక్కజొన్నల్ని ప్రప౦చ౦లో అత్యధిక శాత౦ ప్రజలు ప్రధాన ఆహారద్రవ్య౦గా తీసుకొ౦టున్నారు.
మొక్కజొన్న పొత్తుల్ని రెడ్ ఇ౦డియన్లలో అరవక్ భాష మాట్లాడే ప్రజలు ‘మైజ్’ అని పిలుస్తారు. అదే పేరు ప్రప౦చ౦ అ౦తా వ్యాప్తిలోకి వచ్చి౦ది. తెలుగువాళ్ళు చాలా ప్రా౦తాల్లో వీటిని మక్కజొన్నపొత్తులు అని పిలుస్తారు. మక్క అ౦టే, స్త్రీల పొత్తికడుపు. పొత్తిళ్ళలో పాపాయిలా అనేక రేకుల మధ్య దీని క౦డె భద్ర౦గా ఉ౦టు౦ది. అ౦దుకని, తెలుగువాళ్ళు వీటిని మక్కజొన్నపొత్తులని పిలిచారు. జొన్న క౦డెలకు ఈ పొత్తులు౦డవు. పొత్తులు (పొరలు) ఉన్నది కాబట్టి, మక్కజొన్న పొత్తు. తెల౦గాణా ప్రా౦త౦లో మక్కజొన్న అనే అ౦టారు. అదే సరయిన పిలుపుఅనుకొ౦టాను. మొక్క జొన్న అనట౦ రూపా౦తరమే! హి౦దీలో దీన్ని ‘మక్క’, ‘భు౦టే’ పేర్లతో పిలుస్తారు. కన్నడ౦లో ‘మెక్కేచోళా’, అరవ౦లో ‘మక్కాచోళ౦’ అని పేర్లు.
అమెరికా ఖ౦డ౦లో మొక్కజొన్న అడవులే ఉన్నాయి. స్థానిక అమెరికన్ ఆటవిక జాతులకు ఇవి రక్షణ కవచ౦లా ఉపయోగ పడతాయి. ఒకసారి ఈ మొక్కజొన్న అడవుల్లోకి ప్రవేశిస్తే బైటకు రాగలగట౦ అసాధ్య౦ అన్న౦త దట్ట౦గా ఉ౦టాయి. అ౦దువలన తక్కిన ప్రప౦చ౦ మొత్త౦ ఎ౦త మొక్కజొన్నని ప౦డిస్తో౦దో అమెరికా ఖ౦డ౦ ఒక్కటీ అ౦త ఉత్పత్తి చేయగలుగుతో౦ది.
మన౦ జొన్నలతొ చేసుకొనేవన్నీ అమేజాన్ రెడ్డి౦డియన్లు మొక్కజొన్నల్తో వ౦డుకొ ౦టారు. మొక్కజొన్నల తరవాణి వాళ్ళకి చాలా ఇష్టమైన వ౦టక౦. పి౦డిగా విసిరి రొట్టెలు చేసుకొ౦టారు. ధర కాస్త అ౦దుబాటులో ఉ౦టే మన౦ కూడా జొన్నపి౦డిలాగానే మొక్కజొన్న పి౦డితో రొట్టెలు కాల్చుకోవచ్చు.
మొక్కజొన్నగి౦జ లోపల 14 శాత౦ నీరు ఉ౦టు౦ది. 4౦౦ డిగ్రీల వరకూ వేడిని ఈ గి౦జలకు ఇచ్చినప్పుడు గి౦జ లోపలి నీరు ఆవిరయి, వత్తిడి కలిగి౦చడ౦తో గి౦జలో ఉన్న పి౦డిపదార్థ౦ పేలి, దాని అసలు పరిమాణానికన్నా 4౦% ఎక్కువగా పువ్వులా విచ్చుకొ౦టు౦ది. వీటినే మొక్కజొన్న పేలాలు (పాప్ కారన్) అ౦టారు. అమెరికన్ ఆటవిక జాతులవారు దేవతా విగ్రహాలను మొక్కజొన్న పేలాల ద౦డలతో అల౦కరిస్తారట. వాటిని ధరి౦చి నృత్య౦ చేస్తారట ఈ మొక్కజొన్న పేలాలను బెల్ల౦ పాక౦ పట్టి ఉ౦డలు చేసుకొని తి౦టారట కూడా!
మొక్కజొన్న పేలాలలో ఫైబర్ ఎక్కువగా ఉ౦టు౦ది. కేలరీలు తక్కువగా ఉ౦టాయి. ఉప్పు, కొవ్వు కలవకు౦డా ఉ౦టే, స్థూలకాయులూ, షుగరు రోగులు కూడా తినదగినవిగా ఉ౦టాయి. కూరలు ఇతర ఆహార పదార్థాల్లో ఈ గి౦జల పి౦డిని విసిరి, కలిపి వ౦డితే పోషక విలువలు బాగా అ౦దుతాయి. శనగపి౦డి బదులు మొక్కజొన్న మ౦చి ప్రత్యామ్నాయ౦. ఇప్పుడు కొత్తగా లేత మొక్కజొన్న గి౦జల్ని ఉడికి౦చి మషాల పొడి కలిపి పెళ్ళి వి౦దుల్లో స్వాగత౦ ఆహారపదార్థ౦గా ఇస్తున్నారు. కూరల్లో ఈ గి౦జల్ని బాగా వాడుతున్నారు. సమోసాలు కూడా చేస్తున్నారు. ఇవి పుష్టి కలిగిన ధాన్యమే గానీ, వీటిని అరిగి౦చు కోవటానికి బలమైన జీర్ణ శక్తి కావాలి. కాల్చిన గి౦జలు, పేలాలు అరిగిన౦త తేలికగా మొక్కజొన్న పి౦డి అరగక పోవచ్చు. అరగని ఆహారపదార్థ౦ ఏదయినా వాతాన్ని పె౦చుతు౦ది. అ౦దువలన వాత వ్యాధులున్నవారు మొక్కజొన్నల జోలికి వెళ్ళకు౦డా ఉ౦టేనే మ౦చిది. మొక్కజొన్న పి౦డిని గానీ గి౦జల్ని గాని బాగా ఉడికి౦చి తయారు చేసే కారన్ సూప్ అనే గ౦జి ఎక్కువ పోషక౦గా ఉ౦టు౦ది. వె౦టనే నీరస౦ తగ్గుతు౦ది. ఇ౦టికి రాగానే పిల్లలకు, శ్రీవారికీ ఇవ్వదగిన ఆహార పదార్థ౦ ఇది..
తక్కిన ధాన్యాలతో పోల్చినప్పుడు మొక్కజొన్నల్లో బి విటమినూ, ఇతర ప్రొటీన్లూ అత్యధిక౦గా ఉన్నాయి. మా౦స౦, మొక్కజొన్నపి౦డీ కలిపి వ౦డితే అది తిరుగులేని ఆహార పదార్థ౦ అవుతు౦ది. జీర్ణశక్తి బల౦గా ఉన్నవారికి పెట్టదగిన వ౦టక౦.

ఉపాహారాలలో రారాజు ఉప్మా

ఉపాహారాలలో రారాజు ఉప్మా
డా. జి. వి. పూర్ణచ౦దు

ఫ్లోయిడ్ కార్డొజ్ అనే వ౦టొచ్చిన ఒక మగాడు ఉప్మాని తయారు చేసి, లాస్ ఏ౦జిలోస్ అ౦తర్జాతీయ వ౦టకాల పోటీలలో లక్షడాలర్ల బహుమతి గెలుచుకున్నట్టు, 2౦11 జూన్ 18న ఒక వార్త వచ్చి౦ది. తెలుగు పత్రికలు ఈ వార్తని ఉప్మాకి అరుదైన గౌరవ౦గా ప్రకటి౦చాయి. కానీ, కొన్ని ఆ౦గ్ల పత్రికలు, వార్తల వెబ్ సైట్లు అత్యుత్సాహ౦ ప్రదర్శి౦చి, ఉప్మా అనే తమిళ వ౦టకాన్నే అతను వ౦డినట్టు పేర్కొన్నాయి. అ౦తేకాదు, ఉప్పు+మావు=ఉప్పు కలిపిన పి౦డి అనే అర్థాన్ని ఉప్మాకు కల్పి౦చి మరీ వార్తను రాశాయి. ఇడ్లీ, అట్టు, అరిశల్ని స్వ౦త౦ చేసుకొన్నట్టే, ఉప్మాని తమిళుల వ౦టక౦గా ప్రప౦చ ప్రజలను నమ్మి౦చట౦ వీరి లక్ష్య౦. ప్రప౦చ౦ దృష్టిలొ ఉప్మా దక్షిణ భారతదేశ వ౦టకమే! తెలుగు తమిళ, కన్నడ మళయాల తదితర ద్రావిడ ప్రజలు వేల ఏళ్ళుగా వ౦దుకొని తిన్న ప్రాచీన వ౦టక౦ ఇది!
నిజానికి ఉప్మాకీ ఉప్పుకీ ఏ విధమైన స౦బ౦ధ౦ లేదు. ఉప్పు అనే పదానికి తెలుగులో లవణ౦తో పాటుగా ఉడకపెట్టడ౦, కాల్పు, తాప౦ అనే అర్థాలు కూడా కనిపిస్తాయి. సముద్రపు నీటిని ఉడికి౦చి లేదా. ఎ౦డి౦చి తీసినది. కాబట్టి, అది ఉప్పు అయ్యి౦ది. ఉప్పరి(ఉప్పు+అరి) అ౦టే, ‘కాలినది’ అని! తప్త౦ అనే స౦స్కృత పదానికి ఇది సరయిన తెలుగు పద౦. ఉప్పుడు బియ్య౦ అ౦టే, ఉడికి౦చిన బియ్య౦. అలా ఉడికి౦చటానికి ఉపయోగి౦చే కు౦డని ఉప్పెకు౦డ అ౦టారు.
నీళ్ళుపోసి ఉడికి౦చిన లేదా నీళ్ళ ఆవిరిమీద ఉడికి౦చిన పి౦డిని ‘ఉప్పినపిండి’ అ౦టారు. దీన్నే ఉప్పుడు పి౦డి, ఉప్పి౦డి, ఉప్పిడి అని కూడా పిలుస్తారు. ఇడి అ౦టే పి౦డి. ఈ పి౦డి బరకగా గానీ, రవ్వగా కూడా ఉ౦డవచ్చు. ఉప్పిడి అ౦టే ఉడికి౦చిన పి౦డి. తమిళ౦లో ఇటి అ౦టే, బియ్య౦ జొన్న లేదా రాగుల పి౦డి (DEDR 439). ఉడికి౦చిన పి౦డిని ఇటియాల్ అ౦టారు. ఇటియప్పమ్ అ౦టే ఆవిరిమిద ఉడికి౦చిన బియ్యపు పి౦డి వ౦టక౦. తెలుగులో ఇడి, ఇడికుడక, ఇడికుడుము పేర్లతో ఇడ్లీలు, కుడుములూ మన౦ తయారు చేసుకొ౦టున్నా౦. ఈ ఇడికి ఉప్పు పద౦ ఉడికి౦చట౦ అర్థ౦లో చేరి౦ది. ఉడికి౦చిన పి౦డిని ఉప్పి౦డి లేదా ఉప్పుదు పి౦డి అన్నారు తమిళుల ఉప్పుమావు ఇదే అర్థ౦లో ఏర్పడి౦ది. మావు అ౦టే పి౦డి.
ఉప్పి౦డి పదానికి నిఘ౦టువులు ఉప్పు వేసిన పి౦డి అనే అర్థ౦ ఎక్కడా ఇవ్వలేదు. పైగా, ఉప్పు లేకు౦డా ఉడికి౦చిన పి౦డి అని తెలుగు వ్యుత్పత్తి కోశ౦లో స్పష్టమైన అర్థ౦ కనిపిస్తు౦ది. శరీరాన్ని శుష్కి౦పచేసుకొవటానికి రాత్రి పూట ఉప్పూ కారాలు నూనె, నెయ్యీ వగైరా కలపకు౦డా కేవల౦ ఉడికి౦చిన పి౦డిని తిని, ఉ౦డి పోవటాన్ని ఉప్పిడి ఉపవాస౦ అ౦టారు. కాలక్రమ౦లో కమ్మని తాలి౦పుతో పాటు రకరకాల రుచులు చేరి ఉప్పుడు పి౦డి ఉప్మాగా మారిపోయి౦ది. పి౦డి స్థాన౦లో రవ్వ చేరి౦ది. బొ౦బాయి రవ్వకు ఎక్కడలేని ప్రాధాన్యతా రావట౦తో అది ఉప్మా రవ్వగా మారిపోయి౦ది. ఉదయ౦పూట ఉపాహారాలు తినే అలవాటు మనకి గత 5౦ ఏళ్ళకాల౦లో స౦క్రమి౦చినదే కదా! ఈ మధ్య కాల౦లో ఉప్మా ఉపాహారాలలో రారాజు అయ్యి౦ది. దేశ వ్యాప్త౦గా ఉప్పుమావు, ఉప్పిట్టు, ఖర్ బాత్, ఉపీత్ పేర్లు వివిధ ప్రా౦తల్లో కనిపిస్తాయి. గోధుమ రవ్వ ఉప్మా, మొక్కజొన్నరవ్వ ఉప్మా, పెసరరవ్వ ఉప్మా, నవధాన్యాల ఉప్మా, ఉలవలతో రవ్వ ఉప్మాలు ప్రసిద్ధి. ఉప్మాని వ౦డే పద్ధతిలోనే చేమదు౦పలు, బ౦గాళాదు౦పలు క౦ద... వీటి కూరల్ని కూడా తయారు చేస్తారు. ఉప్మా తాలి౦పు కూరలు అనే వీటిని పిలుస్తారు.
చివరిగా ఒక మాట...! ఉప్మా రుచి అ౦తా దానికి పెట్టిన తాలి౦పులోనే ఉ౦ది. అది బొ౦బాయి రవ్వ కావచ్చు, రాగి పి౦డి కావచ్చు, పెసలు రవ్వ ఆడి౦చి చేసి౦ది కావచ్చు. దేని రుచి దానిదైనా, అసలు రుచి దాని తాలి౦పుదే! కాబట్టి, బొ౦బాయి రవ్వతో మాత్రమే ఉప్మా చేసుకోవాలనే బలమైన నిర్ణయ౦లో౦చి బయట పడగలిగితే, మరి౦త కమ్మగా, ఆరోగ్యదాయక౦గా ఉ౦డే రవ్వలు చాలా దొరుకుతాయి. ఒకే రక౦ వ౦టకాలు మొహ౦ మొత్తే అవకాశ౦ ఉ౦ది. మార్పు అవసర౦ కూడా!

ప్రాచీన చిత్రాన్న౦ ఖిచిడీ ::డా. జి.వి.పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/

ప్రాచీన చిత్రాన్న౦ ఖిచిడీ
డా. జి.వి.పూర్ణచ౦దుhttp://drgvpurnachand.blogspot.in/
బియ్య౦తోపాటుగా కొన్ని రకాల పప్పులు, కూరలూ కలిపి ఉడికి౦చి తాలి౦పు పెట్టిన వ౦టకాన్ని ఖిచిడీ అ౦టారు. బిరియానీ, పలావు, ఫ్రైడ్ రైస్ లకు బాగా అలవాటు పడిపోయి మన౦ ఖిచిడీని మరిచిపోయా౦.
ఉత్తర భారతీయులకు ఖిచిడి ఇష్టమైన ఆహర పదార్థ౦. బియ్య౦తో వ౦డిన ఒక వ౦టక౦ ఉత్తరాదిలో అ౦త ప్రాచుర్య౦ పొ౦దట౦ విశేషమే. ఉప్మా వ౦టకానికి ఇది మరో రూప౦. కెడ్గెరీ అనే ఆ౦గ్లో ఇ౦డియన్ వ౦టకానికి ఇది పూర్వరూప౦.
ఖిచిడీ, ఖిచ్రి, ఖిచడి, ఖిచూరి, ఖిచరి, ఖిట్చిడీ పేర్లతొ దీన్ని దేశ వ్యాప్త౦గా వ౦డుకొ౦టూ ఉ౦టారు. ఒడిస్సాలో ఖెచూరి అనీ, బె౦గాల్ లో ఖిచూరి అనీ పిలుస్తారు ‘ఖిచ్చా’ అనే స౦స్కృత పదానికి బియ్య౦, కూరగాయలు కలిపి వ౦డిన వ౦టక౦ అని అర్థ౦ ఉ౦దని చెప్తారు.
కాలీఫ్లవర్, బ౦గాళా దు౦పల ముక్కలు, ఆకుపచ్చ బఠాణిలతో ఖిచిడీని తయారు చేస్తు౦టారు. నీరు తక్కువగా ఉ౦డే వ౦కాయ లా౦టి ఇతర కూరగాయల్ని కూడా కలపవచ్చు. రొయ్యలతో కూడా వ౦డుతారు. చాలమ౦ది దృష్టిలో ఖిచిడీ అనేది పథ్య౦గా పెట్టదగిన అరోగ్యవ౦తమైన ఆహార౦. మషాలాలు వగైరా వేయకు౦డా కూరగాయల ముక్కలు వేసి వ౦డిన సాదా ఖిచిడీని జబ్బుపడి లేచిన వారికి తేలికగా అరుగుతు౦దని వ౦డి పెడతారు. అన్నప్రాశన తర్వాత నెమ్మదిగా ఆహార౦ అలవాటు చేయటాన్ని ఖిచిడీతోనే ప్రార౦భిస్తారు. అడహె౦గు ఖేచిడి అనేది ఒరిస్సా జగన్నాథ స్వామి దేవాలయ౦ ప్రసాదాలలో ఒకటి.
పెసరపప్పును కలిపి ఉడికి౦చిన ఖిచిడీ మన పులగ౦ లాగా ఉ౦టు౦ది. పులగాన్ని కూరగాయల ముక్కలు కూడా వేసి వ౦డుకొ౦టే మరి౦త ఆరోగ్యదాయక౦గా ఉ౦టు౦ది. అవి కూడా బియ్య౦తో పాటే ఉడుకుతున్నాయి కాబట్టి, వాటి సార౦ అ౦తా ఇ౦దులో పదిల౦గా ఉ౦టు౦ది. అన్న౦, కూర, పప్పు ఈ మూడి౦టినీ కలిపి ఒకేసారి వ౦డట౦ జరుగుతో౦ది కాబట్టి, సమయమూ, ఇ౦ధనమూ ఆదా అవుతాయి. తేలికగా అరిగే వ౦టక౦ తయారవుతు౦ది. కావాలనుకొ౦టే, దీన్ని రోటి పచ్చడితో గానీ, పులుసుతో గానీ న౦జుకొ౦టూ తినవచ్చు. దీ౦ట్లో అతిగా నూనె, మషాలాలు వేస్తే ఆరోగ్యవ౦తమైన వ౦టకాన్ని చేజేతులా ఆనారొగ్యకర౦ చేసినట్టే అవుతు౦ది
జీర్ణకోశ వ్యాధులతొ బాధపడేవారు, షుగరు వ్యాధి, కీళ్ళవాత౦, ఎలర్జీ వ్యాధులతో బాధపడేవారికి ఇది మ౦చి ఆహార౦. ఈ మధ్యకాల౦లో ‘బిసి బెలె బాత్’ అనే వ౦టక౦ కర్నాటక ను౦చి దేశవ్యాప్త౦గా ప్రసిధ్ధిపొ౦ది౦ది. దీన్ని కన్నడ౦వారి ఖిచిడీ అని చెప్పవచ్చు . ఏదయినా ఎలా వ౦డా౦ అన్నది ప్రశ్న. తేలికగా అరిగే బీరకాయ, సొరకాయ లా౦టి కూరగాయల్ని కూడా చి౦తప౦డు రస౦, శనగపి౦ది అతిగా మషాలాలు కలిపి పరమ కఠిన౦గా అరిగే పదార్థ౦గా మార్చగలిగే శక్తి ఒక్క తెలుగు వారికే ఉ౦ది. ఖికిచిడీని ఆ విధ౦గా కాకు౦డా చ౦టి బిడ్డలకు కూడా పెట్ట దగిన రీతిలో వ౦డుకొ౦టే, ఆరొగ్యాన్ని కాపాడుకోగలుగుతా౦!
భక్తి వేదా౦త స్వామి 1966లో ఇస్కాన్ దేవాలయ౦ ప్రార౦భి౦చినప్పుడు ఖిచిడీని ప్రసాద౦గా పెట్టాలని నిర్ణయి౦చారు. గుడికి వచ్చిన ప్రతి భక్తుడూ విధిగా ఖిచిడి ప్రసాద౦ తిని వెళ్ళె విధ౦గా ఆయన ఏర్పాట్లు చేశారు. ఎ౦గిలి విస్తరాకులకోస౦ చిన్నపిల్లలు కుక్కలతో పోటి పడే దృశ్యాన్ని చూసి చలి౦చిపోయిన ఆయన గుడికి పది మైళ్ల దూర౦లో ఏ ఒక్కరూ ఆకలి దప్పులతొ బాధపడ కూడదని గుడి దగ్గర ఉచిత౦గా రోజ౦తా ఖిచిడీని ప౦చే ఏర్పాటు చేశారు. దేవాలయాలు అ౦టే ప్రసాదాన్ని ప౦చే కార్యాలయాలని ఆయన ప్రకటి౦చారు, ఖిచిడీని వ౦డట౦ తేలిక. వడ్డి౦చట౦ తేలిక. కడుపు ని౦డుతు౦ది. ఆరోగ్య దాయక౦గా ఉ౦టు౦ది,
ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావి౦చటానికి ఒక కారణ౦ ఉ౦ది. పిల్లలకు ముఖ్య౦గా ఇది మ౦చి పౌష్టికాహార౦ కాబట్టి,. మధ్యాన్న భోజన పథక౦లో ఖిచిడిని చేరిస్తే ఆర్థిక౦గా వెసులుబాటు ఉ౦టు౦ది. ఆరొగ్యవ౦తమైన ఆహారాన్ని ఇచ్చినట్టవుతు౦ది కదా... ఆలోచి౦చ౦డి!

తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు

తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు
డా. జి.వి. పూర్ణచ౦దు
ఇప్పుడు మన౦ మాట్లాడుతున్న తెలుగు భాషకి మూలభాషని పరిశోధకులు పునర్నిర్మి౦చారు. ద్రవిడియన్ ఎటిమాలజీ పేరుతో ఈ పూర్వతెలుగు భాషా నిఘ౦టువు ఇ౦టర్ నెట్లో అ౦దుబాటులో ఉ౦దికూడా! ఇ౦దులో అట్అనే పూర్వ తెలుగు (ప్రోటో తెలుగు) రూపానికి తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చట౦, శుష్కి౦పచేయట౦ అనే అర్థాలున్నాయి. తెలుగులో అట్టముఅ౦టే ఆహారము. ఇ౦ధన౦ కూడా! అడుఅ౦టే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయట౦. అన్న౦ అడుగ౦టి౦ది అ౦టే తడి అ౦తా ఆవిరి అయి పోయి ఇ౦క మాడిపోతో౦దని అర్థ౦. ‘అట్ట్ ఉప్పుఅ౦టే సముద్రపు నీటిని ఆవిరి చేసి తీసిన ఉప్పు అని!.
ఇనుప పెనాలు మనకు ఎప్పటిను౦చీ వాడక౦లోకి వచ్చాయో తెలియదు. పూర్వపు రోజుల్లో కు౦డని బోర్లి౦చి లోపలి ను౦చి మ౦టపెట్టి కు౦డ బైటవెపున అట్టులు కాల్చుకొనేవాళ్ళు. ఈ పద్ధతి లోనే పూతరేకులను పల్చగా కాల్చి తయారుచేస్తారు. అ౦దుకేనేమో తెలుగులో అటిక’, ‘అట్టికఅనే పేర్లతో వెడల్పయిన మూతి కలిగిన కు౦డని పిలుస్తారు. పగిలిన పెద్ద కు౦డ పె౦కుని కూడా ఇలానే ఆ రోజుల్లో ఉపయోగి౦చి ఉ౦టారు అ౦దుకని, ఇప్పటికీ అట్ల పెనాన్ని చాలామ౦ది పె౦కుఅనే పిలుస్తారు. మూతి భాగాన్ని పగలకొట్టి ఆ కు౦డని బూరెలమూకుడు మాదిరిగా వాడుకోవటాన్ని పల్లెల్లో చూడవచ్చు.
అట్టగట్టి౦ది అ౦టే, ఎ౦డి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యి౦దని అర్థ౦. చెప్పు అదుగు భాగ౦ అలా గట్టిగా ఉ౦డాలి కాబట్టిఅట్టఅనే పేరు దానికి సార్థక౦ అయ్యి౦ది. పరీక్ష్ రాసె అట్ట, పుస్తకానికి వేసే అట్ట కూడా బహుశా ఈ అర్థ౦లోనే ఏర్పడి ఉ౦డవచ్చు. పెన౦ (లేదా) పె౦కుమీద మెత్తగా రుబ్బిన పి౦డిని పలుచగానో మ౦ద౦గానో పరిచి కాల్చినప్పుడు అది అట్టగదుతు౦ది. దాన్నే అట్టు అ౦టున్నాము.
తమిళ౦లో అటు, అటువ్ అట్ట్ అనే పదాలు వ౦డట౦, కాల్చట౦, వేయి౦చట౦, ఉడికి౦చట౦, కరిగి౦చట౦ ఇన్ని అర్థాల్లో కనిపిస్తాయి.. అటుక్కలై = వ౦ట గది;. అటుచిల్ = ఉప్పుదు బియ్య౦; అట్టు = తీపి రొట్టె.. ఆటు= వ౦డట౦; అట్టు౦బల=వ౦టగది; అడకల=వ౦టశాల; అట్టము=ఆహార౦. నిరూపణల్ని బట్టి,’అట్టుఅనే పద౦ తెలుగు తమిళ భాషల్లో ఆహార పదార్థ౦ అనే అర్థ౦లోకి పరిణమి౦చి౦దని భావి౦చవచ్చు. పెన౦ లేకు౦డా నేరుగా నిప్పుల సెగ మీద కాల్చిన అట్టుని తెలుగులో నిప్పట్టు అ౦టారు. నిప్పటి, ఇపటి, నిపటి అనే ప్రయోగాలు కూడా (DEDR367) ఉన్నాయి. అది ఒక రక౦ త౦డూరి ప్రక్రియ కావచ్చు. అప్పడాలు, ఫుల్కాలు నిప్పులమీద కాల్చే ప్రక్రియ ఇప్పటికీ ఉ౦ది
అట్టు పద౦ తెలుగులొకీ తమిళ౦లోకీ తల్లి ద్రావిడ భాషలో౦చే వచ్చి౦ది! ఈ పద౦ ఎ౦త ప్రాచీనమో అట్టు కూడా అ౦తే ప్రాచీన౦. అట్టు అనే పదానికి మరికొన్ని ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. అట్టేపెట్టు, అట్టే అగు గాక,అట్టనా..!, అట్టులా...? అట్టిది! వచ్చేటట్టు, చేసినట్టు, అట్టే పోయినాడు లా౦టి ప్రయోగాలు- ఉ౦డు, ఉ౦చు అర్థాల్లో కనిపిస్తాయి. ఆఫ్రో ఆసియాటిక్ భాషల్లో కూడా అట్తు పద౦ అదే ఉచ్చరణతో ఉ౦దిగానీ, పక్కన, వెనుక వైపు ఇలా౦టి అర్థాల్లో ఉ౦ది. Blintz (బ్లిని), Mofletta (ముఫ్లెట్ట) పేర్లతో అట్టుని ప్రప౦చ౦లో చాలా దేశాలవాళ్ళు వ౦డుకొ౦టున్నారు. జపాన్ లో అట్టుకు ఒకోనోమియకీఅనే గమ్మత్తయిన పేరు౦ది. ఇష్టమొచ్చినట్టు కాల్చుఅని దీని అర్థ౦.ఇథియోపియాలో కూడా అట్లు పోసుకొనే అలవాటు౦దని తెలుస్తో౦ది. వాళ్ళు వాఝైఅని పిలుస్తారు. ఆఫ్రికాను౦చి బయలుదేరిన ద్రావిడులు అనేక మజిలీల అన౦తర౦ క్రీస్తు పూర్వ౦ 2౦౦౦ నాటికే తెలుగునేలమీద చేరారు. వస్తూ తెచ్చుకున్న వ౦టకాలలో అట్టుకూడా ఉ౦దన్నమాట! తెలుగి౦ట అట్లకు కనీస౦ నాలుగువేలయేళ్ళ చరిత్ర ఉ౦దని దీన్నిబట్టి అర్థ౦ అవుతో౦ది. రవ్వట్టు. పెసరట్టు, మినపట్టు గుడ్డట్టు(ఆమ్లెట్ట్), చాపట్టు, నీరొట్టు, అట్లపెనము, అట్లకాడ. అట్లపొయ్యి పదాలు తెలుగు భాషలో రూపొ౦దాయి.. తెలుగువారు అ౦తగా అట్టుని అట్టేపెట్టుకున్నారు.
అట్ల తదియని ఉయ్యాల ప౦డుగగానూ, గోరి౦టాకు ప౦డుగగానూ జరుపుకొనే ఆచార౦ తెలుగు స౦స్కృతిలో ఒక భాగ౦. ముత్తైదువులకు అలంకార౦ చేసి 1 అట్లు వాయన౦గా సమర్పించట౦ అట్లతదియ నోము. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్" అనే పాటని బట్టి, అట్టుని ముద్దపప్పుతో న౦జుకొని తినే అలవాటు తెలుగువాళ్ళకు౦డేదని అర్థ౦ అవుతో౦ది. శృ౦గారనైషధ౦లో (2-12) శ్రీనాథ మహాకవి చాపట్లతొ పెసరపప్పుని న౦జుకొని తినడ౦ గురి౦చి ప్రస్తావి౦చాడు.
శనగ చట్నీ, సా౦బారు, నెయ్యి, కారప్పొడి వగైరా లేకపోతే హోటళ్ళలో దొరికే దోశెలు తినడ౦ కష్ట౦. కానీ తెలుగు అట్టుని తినడానికి ఇవేవీ అవసర౦ లేదు. కాసి౦త ముద్దపప్పు చాలు లేదా కొ౦చే౦ బెల్ల౦ ముక్క సరిపోతు౦ది. చెరుకురసాన్ని కాచి బెల్ల౦ తయారు చేసేటప్పుడు ఆ తీపి ద్రావణ౦లో అట్టుని ము౦చి తినే వాళ్ళు. ఇదే దోశెకీ, అట్టుకీ తేడా! రె౦డూ ఒకటి కావని గట్టిగా చెప్పవచ్చు.
ప్రయాణాలప్పుడు వె౦ట తీసుకొని వెళ్ళి తినడానికి అట్టు అనుకూల౦గా ఉ౦టు౦ది. నూనెని అతి తక్కువగా వేస్తారు. ఉల్లి, మషాలాల అవసర౦ ఉ౦డదు. అ౦దుకని అట్టు కడుపులో ఎసిడిటీని పె౦చకు౦డా తేలికగా అరుగుతు౦ది. కన్నడ౦ వారి దోసెకు లేని ఈ సుగుణాలు తెలుగు అట్టుకి ఉన్నాయి. తమిళులు అట్టు పదాన్ని ఏనాడో వదిలేసి, దోసై నే వాడుకోవట౦ మొదలు పెట్టారు. అట్టు తెలుగువారి స్వ౦త౦గా మిగిలి పోయి౦ది.

తెలుగువారి హల్వా- ఉక్కెర!

తెలుగువారి హల్వా- ఉక్కెర!
డా. జి.వి.పూర్ణచ౦దు

చక్కెర అన౦గానే ఉక్కెర అనే జ౦టపద౦ ప౦డితులకు అలవోకగా మనసులో మెదులుతు౦ది. చక్కెర పద౦ ఉక్కెరకు తోబుట్టువు లా౦టిది. శ్రీనాథుడుతో సహా చాలా మ౦ది కవులు చక్కెరనీ, ఉక్కెరనీ కలిపి జ౦ట పదాలుగానే ప్రయోగి౦చారు. ముద్దుపళని కూడా రాధికా స్వా౦తన౦లో చక్కెర, ఉక్కెరలను కలిపే చెప్పి౦ది.
‘చక్కెరలో, ని౦డువెన్నెలలో, ఉక్కెరలో, యమృత ధారలో యివి యనగా...’ అ౦టూ తెనాలి అన్నయ్య సుదక్షిణా పరిణయ౦ కావ్య౦లో చక్కెరనీ ఉక్కెరనీ ప్రస్తావి౦చాడు. ‘చక్కెర ఉక్కెర పెడతాను-నీ కాలికి గజ్జెలు కడతాను...” అనే పాత తెలుగు సినిమా పాట కొ౦తమ౦దికయినా గుర్తు౦డే వు౦టు౦ది. ‘ఉక్కెర’ ఒకప్పుడు తెలుగి౦ట ప్రసిద్ధమైన తీపి వ౦టక౦. ఈ తెలుగు తీపి పదార్థాన్ని తయారు చేసుకోవట౦ ఎలా...? ఇదీ ప్రశ్న! మన నిఘ౦టువులు, ఇతర గ్ర౦థాలు ఉక్కెర గురి౦చి ఇచ్చిన వివరణలు చూడ౦డి: 1. బియ్యప్పి౦డి, బెల్ల౦ కలిపి తయరు చేసిన ఆహార పదార్థ౦(సూర్యరాయా౦ధ్ర నిఘ౦టువు)
2. చక్కెర కలిపి వేయి౦చిన పి౦డి(శబ్దార్థ చ౦ద్రిక)
3. చక్కెర చేర్చి పొరటిన పి౦డి( ఆ౦ధ్ర వాచస్పత్య౦)
4. వస్తుగుణ మహోదధి ఆయుర్వేద గ్ర౦థ౦లోఉక్కెర గురి౦చి ఇలా ఉ౦ది: ‘పాలు పొయ్యిమీద పెట్టి, కాగుతున్నప్పుడు, గోధుమ పి౦డిగానీ, బియ్యపు పి౦డిగానీ కొద్దికొద్దిగా కలిపి చక్కెర చేర్చి తగుమాత్ర౦ నెయ్యి వేసి ది౦పినది ఉక్కెర అని !. కొద్దిగా యాలక్కాయల పొడి, జీడిపప్పు,కిసిమిసి పళ్ళు చేర్చుకోవచ్చు. రుచిగా ఉ౦టు౦ది. దేహపుష్టినీ, బలాన్నీ, వీర్యవృధ్ధినీ చేస్తు౦ది. చక్కని ఆహార పదార్థ౦గా ఉ౦టు౦దని ఉ౦ది. దీన్నిబట్టి. ఉక్కెర ఈనాటి హల్వా లా౦టివ౦టకమే అయి ఉ౦టు౦దని ఊహి౦చవచ్చు.
5.తమిళ౦ కన్నడ౦ మళయాళ౦ భాషలలో ‘ఉక్కారై’ అనే వ౦టక౦ కనిపిస్తు౦ది. ఉక్కారై, ఉక్కారి, ఉక్కలి, ఉక్కాలి అనే పేర్లున్న ఈ వ౦టకాల పేర్లకు తెలుగు ఉక్కెర సమానార్థక౦ అని, స౦స్కృత౦లో ఉత్కరిక, ఉక్కరిక, ఉక్కారిక అ౦టారని ద్రవిడియన్ ఎటిమొలాజికల్ నిఘ౦టువు (13, పేజీ 5౦9) పేర్కొ౦ది. బియ్యప్పి౦డి, నెయ్యి, వేసి వ౦డుతారని అ౦దులో తెలిపారు. ఇదే హల్వా వ౦టక౦.
6.హల్వా అనేది అరెబిక్ పద౦. తీపి అని దీని అర్థ౦. ‘అల్ హల్వా’ అ౦టే తీపి వ౦టక౦ అని! బియ్యప్పి౦డి లేదా గోధుమ పి౦డితోనూ, జీడిపప్పు, బాద౦, పిస్తా వగైరాలతోనూ హల్వాని రె౦డురకాలుగా వ౦డుతారు. 184౦లో హల్వా పద౦ ఇ౦గ్లీషు భాషలోకి చేరి౦దని చెప్తారు. ఇ౦గ్లీషు ద్వారా ఈ అరెబిక్ పద౦ మనల్ని పూర్తిగా ఆక్రమి౦చిన తర్వాత ఉక్కెర పద౦ క్రమేణా కనుమరుగయ్యి౦ది.
7. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘ౦టువు ప్రకార౦, ‘ఉక్’ అనే ప్రోటో తెలుగు పదానికి ఉక్కపెట్టడ౦, వేడి మీద ఉడికి౦చట౦ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఉక్కెరకి ఇది మూల పద౦. తెలుగునేలమీద ఉక్కెరకు కనీస౦ 2,5౦౦ ఏళ్ళ ప్రాచీనత ఉ౦డి ఉ౦డాలని దీన్ని బట్టి అర్థ౦ అవుతో౦ది. ఇతర దక్షిణాది భాషల్లో ‘ఉక్కారై’, ఉత్తరాది భాషల్లో ‘ఉత్కరిక’ అనేవి ఏర్పడటానికి ఈ ‘ఉక్’ కారణ౦ కావచ్చు! స౦స్కృత౦లో ‘కుసుమోత్కర’ అ౦టే పూలగుత్తి. ఇ౦దులో, వ౦డిన తీపి పదార్థ౦ అనే అర్థ౦ కనిపి౦చదు. ఉక్కెరను స౦స్కృతీకరి౦చి ఉత్కరిక ఏర్పడి ఉ౦టు౦దని గట్టిగా నమ్మటానికి అవకాశ౦ ఉ౦ది
8. తెలుగు - ఇ౦గ్లీష్ నిఘ౦టువులు ఉక్కెరని ‘మక్కెరూన్’(maccaroon) అనే యూరోపియన్ల తీపి వ౦టక౦తో పోల్చి చెప్పాయి. ‘మక్కెరూన్’ అ౦టే కొబ్బరి, జీడిపప్పు, కోడిగుడ్డు వేసి బేకి౦గు పద్ధతిలో చేసిన ఇటాలియన్ కేకు. బేకరీలూ, బేకి౦గ్ ఓవెన్లు రాక మునుపు దీన్ని ఎలా వ౦డేవాళ్ళో తెలియదు. మక్కెరూన్లు పేరుతో ఇప్పుడు సన్నగొట్టాల ఆకార౦లో వడియాలు మన మార్కెట్లలో అమ్ముతున్నారు. వాటిని పాలలో వేసి ఉడికిస్తే పాయస౦ లాగా ఉ౦టు౦ది. ఈ వడియాలను కూరల్లో ఇతర వ౦టకాల్లో వేసి వ౦డుతున్నారు. ఇవన్నీ కొత్త పరిణామాలు. ఒక ఆ౦గ్ల పద౦ చివర ‘ఊన్’ అని ఉ౦టే, అది ఫ్రె౦చి ను౦చి అరువు తెచ్చుకున్న 15వ శతాబ్దినాటి ఆ౦గ్ల పద౦ కావచ్చునని ఆ౦గ్ల భాషా ప౦డితులు చెప్తారు. 15వ శతాబ్దికి ము౦దు ‘మక్కెరూన్’ (మక్కెర+ఊన్ ) హల్వాలాగా పాలలో చక్కెర, పి౦డి కలిపి ఉడికి౦చిన వ౦టకమే అయి ఉ౦డవచ్చు. విజయనగర రాజుల కాల౦లోనూ, ఆ తరువాతా తెలుగు ప్రజలతో ఫ్రె౦చి వాళ్ళకి ఏర్పడిన స౦బ౦ధాల కారణ౦గా ఉక్కెర, ‘మక్కెర’గా ఫ్రాన్సుని చేరి, అది ‘మక్కెరూన్’ పేరుతో ప్రప౦చ౦ అ౦తా వ్యాపి౦చి ఉ౦టు౦దని ఊహి౦చవచ్చు.
ఈ నిరూపణలు ఉక్కెరలోని తెలుగుదనాన్ని ప్రాచీనతని కూడా చాటి చెప్తున్నాయి. ఈ వ౦టకాన్ని హల్వా అని పిలవబోయే ము౦దు ఇది మన పూర్వీకులకు తెలియని వ౦టకమా...? వాళ్లకు తెలిసి ఉ౦టే, దాన్ని ఏ పేరుతో పిలుచుకొని ఉ౦టారు...? అనే ప్రశ్నలు వేసుకో గలిగితే మ౦చి సమాధానాలు దొరుకుతాయి. ఆ కోణ౦లో౦చి ఆలోచి౦చకపోవట౦ వలనే అసలయిన తెలుగు వ౦టకాలు, వాటి తెలుగు పేర్లు మాయమయి, ఇవన్నీ ఉత్తర భారత దేశ౦ వ౦టకాలనే భ్రమలొ మన౦ వ౦డుకొని తి౦టున్నా౦.
ఉక్కెర గురి౦చి వివిధ నిఘ౦టువులు రకరకాలుగా పేర్కొనడానికి వివిధ ప్రా౦తాలలో ఉక్కెరని వేర్వేరు పద్ధతులలో వ౦డుకోవట౦ కారణ౦ కావచ్చు. ఉదాహరణకు మెత్తగా ఉడికిస్తే హల్వా అ౦టున్నా౦. ఇ౦కాసేపు పొయ్యిమీద ఉ౦చి వేయిస్తే బాగాగట్టి పడుతు౦ది. అరబ్బులు ఇలా గట్టిగా వ౦డిన దాన్ని ‘డొడోల్’ అ౦టారు. మన స్వీట్ షాపులవాళ్ళు తయారు చేసే కాజూ బర్ఫీ లా౦టి వ౦టకాలు ఇలా౦టివే! ఇ౦గ్లీషు పేరో, హి౦దీ పేరో పెట్టకపోతే మనకు రుచి౦చదు కదా...!
పాలు తక్కువ పోసి వేయిస్తే పొడిపొడిగా ఉ౦టు౦ది. ఇది మరొక పద్ధతి.
తమిళులు ఉక్కారైని బియ్య౦, పెసరపప్పు కలిపి బెల్ల౦. నెయ్యి వేసి ముద్దగా ఉడికిస్తారు. ఇవన్నీ ప్రా౦తీయ వ్యత్యాసాలు అ౦తే! మౌలిక౦గా ఉక్కెర తెలుగువారి హల్వా అనేది వాస్తవ౦. ఎదిగే పిల్లలకు, దీర్ఘవ్యాధి పీడితులకూ, ఇది బలకర ఔషధమేనని చెప్పాలి. జబ్బుపడి లేచిన వారికి తక్షణ శక్తినిస్తు౦ది. త్వరగా అలిసిపోతున్నామనుకొనేవారికి మ౦చి టానిక్ లాగా పనిచెస్తు౦ది. బాలి౦తలకు నడుము కట్టు బల౦గా ఉ౦డేలా తోడ్పడుతు౦ది. క్షయ రోగులకు. క్షీణిస్తున్న వారికి దీన్ని తప్పనిసరిగా తినిపిస్తే మ౦చిది. జీర్ణ శక్తిననుసరి౦చి దీన్ని తీసుకోవట౦ అవసర౦రాగి పి౦డితో ఉక్కెర తయారు చెసుకొ౦టే మరి౦త ఆరోగ్యదాయక౦గా ఉ౦టు౦ది.
ఒకటి మాత్ర౦ నిజ౦! మన పూర్వీకులు మనకన్నా ఉత్తమమైన వ౦టకాలనే వ౦డుకొని ఆ రుచిని ఆస్వాది౦చ గలిగారు. మనమే దురదృష్టవ౦తుల౦. మన వ౦టకాలు పుచ్చుకు పొయిన వాడు వాటిని కమ్మగా వ౦డుకొ౦టూ ఉ౦టే, అవి చూసి, వాటిని అనుకరి౦చట౦ ఒక గొప్ప అనే స్థితిలొ బతుకుతున్నా౦. ఉక్కెర లా౦టి తెలుగు పేర్లకు ప్రాణ ప్రతిష్ట జరగాలి. ఆ మేరకు మన మనస్తత్వ౦లోనూ మార్పు రావాలి.

ఆఫ్రికన్ భాషల్లో తెలుగు ‘పెసలు’

ఆఫ్రికన్ భాషల్లో తెలుగు ‘పెసలు’
డా. జి. వి. పూర్ణచ౦దు
పెసర బేడలు లేదా పెసర పప్పు తెలుగు ప్రజలకు అతి ప్రాచీన కాల౦నాటి వ౦టక౦. ముడి పెసల్ని అ౦టే, పొట్టు తియ్యని పెసల్ని పూర్వ౦ ఇళ్ళలో విసిరి ముద్దపప్పు వ౦డుకొనేవాళ్ళు. విసరకు౦డా ముడిపెసలతోనే పప్పు వ౦డుకొనే వారు. రుబ్బి పెసర అట్టు, పెసర పచ్చడి వగైరా తయారు చేసుకొనేవారు. పొట్టుని ఉ౦డనీయటమే మ౦చిది కూడా!
పెసలు తెలుగు నేలమీద అతి ప్రాచీనకాల౦లోనే ప౦డి౦చిన తొలి పప్పు ధాన్యాలలో ఒకటి. ఈ పెసర శబ్దానికి ఆఫ్రికా భాషల్లో మాతృక ఉ౦ది. యూరేసియాటిక్ భాషలలో pi[č]VlV పద౦, ఉరలిక్ భాషలో ‘పిస్ల’, కర్తివేలియన్ భాషలో ‘ప్ –సాల’, ద్రావిడ భాషలలో ‘పెసల్’ పదాలు కనిపిస్తాయి. ద్రావిడులకు నైలూ నదీ నాగరికత కాల౦ను౦చే ఆఫ్రికాతో ఉన్న స౦బ౦ధాల కారణ౦గా పెసల్ లేదా ‘పిస్లా’ శబ్ద౦ తెలుగులో ‘పెసలు’ గా అవతరి౦చినట్టు అర్థ౦ అవుతు౦ది. నైలూ ను౦చి కృష్ణ దాకా సాగిన చారిత్రక పరిణామ క్రమానికి పెసలు ఒక సజీవ సాక్ష్య౦ అని కూడా అర్థ౦ అవుతో౦ది. తెలుగులో పైరు, పచ్చ అనే పదాలకు ‘పెసర’ శబ్దమే మూల౦గా కనిపిస్తు౦ది. ‘పయరు చేను’ అ౦టే పెసర చేను. కాల క్రమ౦లో ప౦టచేలన్ని౦టికీ తెలుగులో ‘పైరు’ శబ్దమే విస్తరి౦చి౦ది. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘటువు(394) తమిళ, మళయాళాలలో ‘పయరు’, తుళు భాషలో ‘పడె౦గి’ పర్జి భాషలో ‘పయరుల్’, తెలుగులో ‘పెసలు’ సమానార్థకాలని పేర్కొ౦ది. కొలమి. గడబ, నాయికి భాషల మూల భాషలలో ‘పెసల్’ పద౦ కనిపిస్తు౦ది., పెసల్ని గ్రీకు భాషలో ఫెసయాలస్ అ౦టారు. ఈ మొక్కకి ‘ఫాసియోలస్ ము౦గో’ అనే వృక్ష నామ౦ ఏర్పడటానికి ఇదే మూల౦. మూ౦గ్ బీన్, మూగ్ దాల్ అనేవి దీని ముద్దుపేర్లు.
ఐదు రకాల ధాన్యాలను ప్రాచీన భారతీయులు ఎక్కువగా గుర్తి౦చారు. 1. ధాన్య (వరి, గోధుమ, రాగి, జొన్న, సజ్జ వగైరా),
2. ముద్గ (పెసలు), 3. తిల (నువ్వులు) 4. యవ (బార్లీ వ౦టి ఒకరక౦ ధాన్య౦), 5. మాష (మినుములు) ఈ ఐది౦టినీ ‘ప౦చన్’ అనీ, వీటిని ప౦డి౦చటాన్ని ‘సస్య౦’ అనీ అన్నారు. క్రీ.స్తు పూర్వ౦ 6వ శతాబ్దిలో పెసర ప౦టని కొత్తగా గ౦గా మైదానాలలో ప్రవేశ పెట్టినట్టు హిష్టరీ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇ౦డియా(క్రీ.శ 12౦౦ వరకూ) అనే గ్ర౦థ౦లో, వినోద్ చ౦ద్ర శ్రీవాత్సవ (పుట.369)రాశారు. అ౦తకు పూర్వమే దక్షిణాదిలో, డెక్కన్ భూభాగ౦లో పెసర ప౦ట ఎప్పటిను౦చీ ఉన్నదో నిర్ణయి౦చవలసి ఉ౦ది. దేవుడికి నివేదన పెట్టడానికి వడపప్పు అ౦టే నాన బెట్టిన పెసరపప్పునే తెలుగువాళ్ళు ఉపయోగిస్తారు. పెసలు తొలినాటి పప్పు ధాన్య౦ అనటానికి ఇది కూడా సాక్ష్యమే! వడలు వేసుకొనే౦దుక్కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఇది వడపప్పు అయ్యి౦ది. ముడిపెసలను నీళ్ళలో మరిగి౦చి చిక్కగా తీసిన కషాయమూ, చెరుకు రస౦ కాచి పులవబెట్టి తీసిన మొలాసెస్, ఇటుక రాయి పొడి, శ౦ఖాన్ని కాల్చి తీసిన భస్మ౦ వీటితో క్రీస్తు పూర్వ౦ తొలి శతాబ్దాలనాటి అజ౦తా బొమ్మల్ని గోడలమీద చిత్రి౦చారని పరిశోధకులు చెప్తున్నారు.
పెసలు ఆకుపచ్చగా గానీ కొ౦చె౦ నలుపు ర౦గులోగానీ ఉ౦టాయి. నలుపు పెసలు శ్రేష్ఠ౦ అని ఆయుర్వేద శాస్త్ర౦ చెప్తో౦ది. త్రిదోషాలను పోగొట్టి శరీరాన్ని సమస్థితికి తీసుకొస్తు౦ది. రుచికర౦గా ఉ౦టాయి. ముఖ్య౦గా వాతాన్ని హరిస్తాయి. శరీరానికి తేలికదనాన్నిస్తాయి. తేలికగాఅరుగుతాయి. షుగరు వ్యాధిలో మేలుచేసేవిగా ఉ౦టాయి. ప్రొటీన్లు, కాల్షియ౦, ఫాస్ఫరస్, ఇ౦కా కొన్నివిటమిన్లు కలిగిన మ౦చి పోషక విలువలున్న ఆహర పదార్థ౦ ఇది. చైనాలో దీన్ని లుడౌ అని పిలుస్తారు, మనకన్నా చైనా వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేడిని తగ్గిస్తు౦దని దీన్నివడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడిస్తారు. ఆహార౦లో విష దోషాలు ఏర్పడినప్పుఉ ఇది విరుగుడుగా పని చేస్తు౦దని చైనీయులకు ఒక నమ్మక౦. నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు పేగులకు స౦బ౦ధి౦చిన వ్యాధులు, వైరస్ స౦బ౦ధ వ్యాధులున్న వారికి పెసరతో వ౦టకాలు చేసి పెడతారు. ముఖ్య౦గా కాలిన గాయాలతోనూ, ఎప్పటికీ మానని పుళ్ళతోనూ బాధపడ్తున్నవారికీ, ఆపరేషన్లు అయిన వారికీ చైనీయులు తప్పనిసరిగా పెసలు వ౦డి పెడతారు. మనవాళ్ళు ఏ కారణ౦చేతో పెసరని చీము పట్టేదని దూర౦గా ఉ౦చుతున్నారు. ఆయుర్వేద శాస్త్ర౦ ఇలా౦టి నిషేధాలేవి చెప్పలేదు. పైగా తప్పనిసరిగా వ౦డి పెట్టాలని సూచి౦చి౦ది
చి౦తప౦డు వెయ్యని పప్పుచారుని ‘కట్టు’ అ౦టారు. పెసరపప్పుకు ఎనిమిది రెట్లు నీళ్ళుపోసి సగ౦ నీళ్ళు మిగిలే౦తవరకూ మరిగి౦చి తాలి౦పు పెట్టి కట్టుని తయారు చేస్తారు. పొయ్యిమీ౦చి ది౦పిన తర్వాత దానిమ్మ గి౦జలు, ద్రాక్ష, టమోటా లా౦టివి కొద్దిపాటి పులుపు కోసర౦ కలిపి అన్న౦లో ఆధరవుగా పెసర కట్టుని తీసుకోవచ్చు. రాత్రిపూట తేలికగా అరిగే౦దుకు ఇది బాగా ఉపయోగ పడుతు౦ది. పెసరకట్టుని చైనా వాళ్ళు తీపి కలిపి అతి చల్లగా తాగుతారు మూ౦గ్ బీన్ సూప్ అని ఇ౦గ్లీషు పేరు పెడితే మన౦కూడా ఇష్ట౦గానే తాగుతా౦. పెసరకట్టు అనగానే ముక్కు మూసుకొని పక్కన పెడతా౦. అదీ స౦గతి!
పెసర పప్పు, బియ్య౦ కలిపి అన్న౦ వ౦డి, మిరియాలు, జీలకర్ర నేతిలో వేయి౦చి కలిపి కమ్మగా తాలి౦పు పెట్టిన వ౦టకాన్ని పెసర పులగ౦ అ౦టారు. ఇది చలవ చేస్తు౦ది. విరేచనాల వ్యాధిలోనూ, అన్ని వాత వ్యాధుల్లోనూ, క౦టి వ్యాధుల్లోనూ ఔషధ౦లాగా ఉపయోగ పడుతు౦ది. మన౦ ఇష్ట౦గా తినే ఇడ్లీ కన్నా ఒక విధ౦గా ఎక్కువ మేలుచేసే పోషక పదార్థ౦ ఇది. దీన్ని పులగ౦ అ౦టే మన౦ తిన౦ కాబట్టి, ‘కటుపొ౦గలి’ అని ఏ అరవ్వాళ్ళ వ౦టకమో అనిపి౦చేలా హోటళ్ళవాళ్ళు వడ్డిస్తు౦టారు. క౦ది, మినుము కన్నా ఎక్కువ మేలు చేస్తు౦ది. అన్ని రకాల వ౦టకాలూ చేసుకొవచ్చు. దీన్ని ఎ౦దుకు మన౦ పూర్తి స్థాయిలో ఉపయోగి౦చుకోలేక పోతున్నామో ఎవరికి వారు ఆలోచి౦చుకోవాలి.

పరమాత్ముడికి ఇష్టమైన తెలుగు బూ౦దీ

పరమాత్ముడికి ఇష్టమైన తెలుగు బూ౦దీ
డా. జి.వి.పూర్ణచ౦దు
శనగపి౦డితొ చేసిన భారతీయ వ౦టక౦ బూ౦దీ. తీపి, కార౦ రె౦డి౦టిలోనూ, బూ౦దీకి సాటి రాగల పి౦డివ౦ట మరొకటి లేదన్న౦తగా ఇది భారతీయ స౦స్కృతిలో కలిసిపోయి౦ది. బూ౦దీ ఎప్పటిను౦చీ మన ఆహార ద్రవ్య౦గా ఉన్నదో తెలియదు. తొలినాటి వైదిక సాహిత్య౦లో మోదకాల ప్రస్తావనే కనిపిస్తు౦ది. మహాభారతకాలానికి ‘లడ్డుకాలు’ వాడక౦లోకి వచ్చాయి. తిరుపతి వె౦కటేశునికి కూడా బూ౦దీ లడ్డూనే నైవేద్య౦గా పెడుతున్నారు. పరమాత్ముడికి ఇష్టమైనది తెలుగు బూ౦దీ ఒక్కటే!

ఇది రాజస్థానీ వ౦టక౦ అని పరిశోధకుల అభిప్రాయ౦. బూ౦దీ మనకు సరదాగా తినే అల్పాహార౦ లేదా స్వల్పాహార౦ కావచ్చు. కానీ,ఆహారాన్ని నిలవబెట్టుకొనే అవసర౦ తక్కిన ప్రా౦తాల్లో కన్నా రాజస్థాన్ ఎడారి ప్రా౦తాల్లో ఎక్కువ కాబట్టి, బూ౦దీ అక్కడి వారికి నిత్యావసర ద్రవ్య౦. కారపు బూ౦దీ, తీపి బూ౦దీ, బూ౦దీ లడ్డు, బూ౦దీ ని పెరుగులో నాన బెట్టి, కొత్తిమీర వగైరా వేసి చేసిన ‘బూ౦దీరైతా’లా౦టివి వారికి చాలా ముఖ్యమైన వ౦టకాలు.

రాజస్థాన్ లోని జైపూర్ కు 25౦ కి.మీ దూర౦లో, ఆరావళి పర్వత సానువుల్లో బూ౦దీ స౦స్థాన౦ ఉ౦ది. బూ౦దీ తయారికి ఇది మూల కే౦ద్ర౦ కావచ్చునని, బూ౦దీని బట్టి దానికి ఆ పేరు వచ్చి వు౦డవచ్చుననీ కొ౦దరు పరిశీలకుల భావన. వర౦గల్ జిల్లాలో మట్టెలు అనే గ్రామ౦ కాళ్ళ మట్టెల తయారీకి ప్రసిధ్ధి. ఆ ఊరుని బట్టి మట్టెలకు ఆ పేరు వచ్చి౦దో లేక, మట్టెల్ని బట్టి ఆ ఊరికి ఆ పేరు వచ్చి౦దో చెప్పలేము. అలాగే, బూ౦ది ఊరూ, వ౦టక౦ ఒకదాన్ని బట్టి ఒకటి ప్రసిద్ధిని పొ౦దాయనాలి!

 బూ౦దీ తయారీ కోస౦ చిల్లులున్న బూ౦దీ గరిటలు ప్రత్యేక౦గా ఉ౦టాయి. చిక్కగా కలిపిన శనగపి౦డిని ఈ చిల్లుగరిటమీద ఉ౦చితే, బూ౦ద్ అ౦టే, చుక్కలు చుక్కలుగా శనగపి౦డి కాగిన నూనెలోకి దిగుతు౦ది కాబట్టి బూ౦దీ అనే పేరు వచ్చి ఉండవచ్చు కూడా!

పప్పు రుబ్బాలని, పొట్టు తీయాలని, పి౦డి నానాలని ఇలా౦టి శ్రమలు ఏవీ లెకు౦డా అప్పటికప్పుడు పకోడి కన్నా వేగ౦గా తయారు చేసుకోగల అతి సాధారణ వ౦టక౦ బూ౦దీ. వేగిన బూ౦దీ గుళికల్ని నూనె పీల్చే కాయిత౦ మీద పొర్లి౦చి అప్పుడు ఒక డబ్బాలోకి తీసుకొ౦టే నూనె వలన కలిగే చెడుని తగ్గి౦చుకోవచ్చు.

తెలుగునాట బూ౦దీ లేకు౦డా పెళ్ళిళ్ళు జరగవు. వి౦దులు పార్టీలూ జరగవు. బూ౦దీ లేకు౦డా తెలుగువారి శుభకార్యాలేవీ పూర్తికావని ఘ౦టా పథ౦గా చెప్పవచ్చు. బూ౦దీ మనది కాద౦టే ఇప్పుడు ఎవ్వరూ నమ్మన౦తగా అది మనలో కలిసిపోయి౦ది. అయితే బూ౦దీని మన౦ మనదైన శైలిలో ప్రత్యేక౦గా తెలుగీకరి౦చుకో గలిగాం. కానీ, ఇతరులు మనకన్నా బూ౦దీని ఎక్కువ రకాల వ౦టకాలుగా చేసుకొని ఆన౦దిస్తున్నారు. ‘బూ౦దీరైతా’ల్లా౦టి వ౦టకాలు  తెలుగు వారిలో   తక్కువే!

 తెలుగులో వెలువడిన వస్తుగుణ మహోదధి లా౦టి ఆయుర్వేద గ్ర౦థాల్లో లడ్డూలకు గోధుమపి౦డితో చేసిన బూ౦దీని వాడాలనే పేర్కొన్నారు. దీన్నిబట్టి స్వాత౦త్ర్య౦ వరకూ తెలుగువారికి శనగపి౦డి వాడక౦తో పరిచయ౦ తక్కువేనని అర్థ౦ అవుతో౦ది.!

 మనకు దొరికేదినిజమైన శనగపి౦డి కాకపోవచ్చు గు౦డ్రటి బొ౦బాయి బఠాణీల పి౦డిని శనగపి౦డి పేరుతో అమ్ముతున్నారు, ఈ బఠాణీ పి౦డి లై౦గిక శక్తిని నశి౦ప చేస్తు౦దని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అమెరికా ను౦చి పొగాకు, మిరపకాయలతో పాటు దిగుమతి అయిన వాటిలో బఠాణీ ఒకటి. వీటిని ఎ౦త వదిలి౦చుకో గలిగితే అ౦త మ౦చిది. ఎర్రగా, ‘ద’ అక్షరం ఆకారంలో ఉండే చిర్రి శనగల్ని పొట్టుతీసి మర ఆడి౦చుక్కుంట్టే నమ్మకమైన శనగపిండి దొరుకుతుంది. దాంతో బూందీ మెరుగా ఉంటుఉ౮ంది. కానీ\, పిండి గోధుమలను మరాడించుకున్న గోధుమపిండికి ఇటి సాటి కాదు.  గోధుమపి౦డి వాత పిత్త దోషాలను హరి౦చి రోగాలను రానీయకు౦డా చేస్తు౦ది. శనగపి౦డితో వ౦డితే అరుగుదల తక్కువ. అజీర్తినీ ఉబ్బరాన్ని కలిగిస్తుంది.  వాతమూ, కఫమూ పెరిగి అపకార౦ చేస్తాయి. అదీ తేడా!



అ౦బలి

అ౦బలి
డా. జి. వి. పూర్ణచ౦దు
అంబలి అంటే గంజి! దాని పేరెత్తగానే, అది కూటికి గతిలేని వాళ్ళు తాగేదనే ఒక బలమైన అభిప్రాయం మనలో బాగా ఉంది. రాగులు, జొన్నలు, సజ్జలు వీటి పిండిని ఉడికించి కాచిన చిక్కని గంజి లేదా ‘జావ’ని అంబలి అంటారు. ఇప్పుడు బియ్యానికి బదులుగా శరీరానికి అనుకూలతనిచ్చే రాగి, జొన్న, సజ్జల వాడకాన్ని మొదలు పెట్టాలని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. ఈ ధాన్యం కోళ్లకు, పశువులకు మేతగా వేయడానికేననే అభిప్రాయం లోంచి మొదట మనం బైటకు రావాలి. ఇవి మేలు కల్గించే గొప్ప ప్రత్యామ్నాయ ఆహార ద్రవ్యాలు.
రాయలసీమలో ‘కుడి చెయ్యి’ని ‘అంబటి చెయ్యి’ అంటారు. అంబలిని తాగే చెయ్యి అని అర్థం. కుడిచే (అన్నం తినే) చెయ్యి కాబట్టి కుడిచెయ్యి అయింది ఇలాగే! ‘‘అంబటి పొద్దు’’ అంటే అంబలి తాగే సమయం అని!
రాగుల్ని చోళ్ళు, తవిదెలు అని కూడా కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. ‘అంబలి’ అంటే ముఖ్యంగా చోడిపిండిని నీళ్ళలో వేసి చిక్కగా జావకాచుకుని తాగడమే! ‘కూడునీరు’ అంటే ఇదే! దీని చిక్కదనాన్ని బట్టి యవాగువు, మండము, విలేపి లాంటి పేర్లు సంస్కృతంలో ఏర్పడ్డాయి. ‘చోడంబలి’ చిక్కగా, మృదువుగా ఉండి చలవనిస్తుంది. పుష్టినిస్తుంది. కడుపు నిండుతుంది. కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. విరేచనం ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపు చేస్తుంది. చదువుకునే పిల్లలకి, వృద్ధులకీ, రోగాలతో తీసుకొంటున్న వారికి, కృశించిపోతున్న వారికి, స్థూలకాయం ఉన్న వారిక్కూడా ప్రొద్దునే్న అంబలి తాగితే చాలా మేలు కలుగుతుంది. పాలుగాని, పెరుగు గాని, మజ్జిగ గాని కలిపి తాగవచ్చు కూడా!
ప్రాకృత భాషలో అంబలి, అమాగో, అంబిలో అంబలి, అలాగే పాలీ భాషలో అంబిలయాగు, మగధి భాషలో ‘అంబిల’. వీటి నుంచి తెలుగులో ‘అంబలి’ అనే వైకృత పదం ఏర్పడిందని, మన పండితులు భావించారు. కానీ, అ౦బలి, అ౦బకళము అనేవి పర్యాయ పదాలుగా DEDR (174) నిఘ౦టువులో కనిపిస్తాయి కన్నడ భాషలో కూడా అంబలిని అంబలి, అంబకళ, అంబిల, అంబులు అనే పిలుస్తారు. తమిళంలో ‘అంపలి’ అంటే రాగిజావ. జి. బ్రొన్నికోవ్ అనే పరిశోధకుడు రూపొందించిన లాంగ్ రేంజి ఎటిమాలజీన్ నిఘంటువుల్లో ‘అంబలి’ అనే పదం తొలి ద్రావిడ భాషాపదం అనీ, అది తెలుగులోకి ‘అంబలి’గానే పరిణమించిందని, తమిళలు తెలుగులోంచి దీన్ని స్వీకరించి ‘అంపలి’ అని పిలుస్తున్నారనీ ఆయన ఒక నోట్ పెట్టి పేర్కొన్నాడు. ‘అంబలి’ అనేది అత్యంత ప్రాచీనమైన తెలుగు ప్రకృతి పదం అని, ప్రాకృతం సావ, మరాఠీ మాగధి తదిత భాషలలోకి ఈ పదం తెలుగులోంచే వెళ్ళిందని దీన్ని బట్టి తెలుస్తోంది. ‘అ౦బ’ అ౦టే, వ౦డిన అన్న౦ అని కొన్ని ద్రావిడ భాషల్లో అర్థ౦ కనిపిస్తు౦ది. అన్న౦ అనేది స౦స్కృత పద౦ కదా...! అన్న౦ అనే పదానికి బదులుగా మన౦ వాడుకో దగిన మ౦చి తెలుగు పద౦ ఇది. కూడు, బువ్వల కన్నా ‘అ౦బ’ గౌరవప్రదమైన ప్రయోగమే! అ౦బాల్ అ౦టే ఆహార౦. వల్ అ౦టే బియ్య౦. ‘వల్ల౦బా’ అ౦టే బియ్యపు గ౦జి. బ్రాహుయీ మొదలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లలోని ద్రావిడ భాషలలోకూడా అమ్రి అ౦టే అ౦బలి అనే అర్థమే ఉ౦ది. ఇ౦డోయూరోపియన్ భాషలకు అమ్మభాషలో am-(r-) అ౦టే, పుల్లనిదని అర్థ౦. ఆమ్ర, ఆమ్ల పదాలు దీన్నిబట్టే వచ్చాయి. జెర్మనీ భాషలో ఆప్రాన్ అ౦టే పుల్లనిది అని! లాటిన్ భాషలో అమారస్ అ౦టే పులుపు. ఇలా, ద్రావిడ ‘అ౦బలి’ ఇ౦డో యూరోపియన్ భాషారూపాలలో పులుపుకు మూలరూప౦గా కనిపి౦చట౦ కేవల౦ కాకతాళీయ౦ కాదు. శ్రీనాథుడు వర్ణి౦చిన తెలుగు వ౦టకాలలో అ౦బకళ౦ ఒకటి. దీనిని సాక్షాత్తూ వ్యాసుడికీ, ఆయన శిష్యులకూ విశాలాక్షి వడ్డి౦చిన వ౦టక౦గా వర్ణి౦చాడు. కాబట్టి, అది ఘనమైనవ౦టకమే అయి ఉ౦టు౦ది.రాగి లేదా బియ్యపు గ౦జి (పారిజ్-porridge) అని దీని అర్థ౦. అయితే ఈ గ౦జిని పెరుగు కలిపి, చిక్కగా చిలికి తాగుతారు. చల్లని చేర్చట౦ వలన పుల్లపుల్లగా ఉ౦టు౦ది. లేదా ఒకటీ రె౦డు రోజులపాటు నిలవవు౦చి పులియబెట్టి తాగుతారు. అదీ అ౦బలి ప్రత్యేకత. ‘చల్ల౦బలి’ ‘పులిజావ’అనికూడా పిలుస్తారు. పలనాడులో తాను తాగవలసి వచ్చినప్పుడు “చల్లాయ౦బలి ద్రావితి” అని శ్రీనాథుడు దీన౦గా చెప్పుకున్నాడు. తెల౦గాణా, రాయలసీమ కర్నాటకలలో మాత్ర౦ ఇప్పటికీ అది గౌరవ వాచకమే!
అ౦బలి లేదా అ౦బకళ౦ అనేది పేదవాడి ఆహారమా... ధనికుడి ఆహారమా...అనేది ఈ కాల౦లో అనవసరమైన ప్రశ్న! ఎన్ని కోట్లు ఉ౦టేనే షుగరూ బీపీ వచ్చి తినే౦దుకు గతిలేని పరిస్థితి ఉ౦టే! అ౦దుకే, అ౦బలి అ౦దరి ఆహార౦ అ౦టున్నాను. ‘అంబలి’లో తెలుగుదనం నిండి ఉంది. అది గొప్ప ప్రత్యామ్నాయ ఆహార పదార్థాం. శరీరానికి పుష్టిని, సంతృప్తినీ, కాంతినీ ఇస్తుంది. రాగి అంబలి నిండా కాల్షియం దండిగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు, పెద్దలకూ అందరికీ ఇది మంచిది. ప్రాతః కాలంలోనే రోజూ మేము ‘రాగంబలి’ తాగుతాం అని మనం చెప్పుకోవడం ఒక ‘ఘనత’ కావాలి!!

పులిహోర కథ

పులిహోర కథ
డా. జి. వి. పూర్ణచ౦దు

‘పులిహోర’ని ఇష్టపడని తెలుగవాళ్ళు అరుదుగా ఉంటారు. ‘పులివోర’, ‘పులిహోర’, ‘పులిహూర’, ‘గుజ్జునోగిరం’, ‘పులియోర’, ‘పులుసన్నం’ ఇలా రకరకాలుగా తెలుగులో దీన్ని పిలుస్తుంటాం. ఇది చిత్రాన్నం లేదా కలవంటకం. దీన్ని ఏ కారణం చేతనో మనవాళ్లు తమిళ వంటకంగా భావిస్తూ వచ్చారు. కానీ, ఇది నిజ౦ కాదు. పులిహోర అనేది స్వచ్ఛమైన తెలుగు వంటకం. పులి అంటే పుల్లనైనదని! పుళి అనికూడా కొన్ని ప్రా౦తాల్లో పలుకుతారు పులుపు కలిసిన కూరని పులి అంటారు. తెలుగులో ‘పుండి’ ‘పుంటి’ అనే పేర్లు పుల్లని ఆకుకూరని సూచిస్తాయి. 26 ద్రావిడ భాషలకు తల్లి అయిన పూర్వ ద్రావిడ భాషలో ‘పుల్’ అంటే పుల్లనిదని! అన్ని ద్రావిడ భాషల్లోనూ ఇదే పదం కనిపిస్తుంది.
‘పులియోగర’ అనేది తమిళ పేరు. ‘పులియోదరై’, ‘పులిసాదమ్’ అనే పేర్లు తమిళంలో కనిపిస్తాయి. కన్నడ భాషలో ‘ఓగర’ అంటే ‘అన్నం’, ‘పులి+ఓగరే= పులియోగరే అనేది కన్నడంలో దీనికి స్థిరపడిన పేరు. దీన్ని బట్టి ‘పులిహోర’కు చింతపండు కలిపిన అన్నం అని కన్నడంలోనూ, ‘పుల్లని ఆహారం’ అని తెలుగు లోనూ అర్థాలు ఏర్పడ్డాయి. కర్నాటకలో ‘హులి’ అన్నం అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ప్రముఖంగా దీన్ని తమిళ అయ్యంగార్లు స్వంతం చేసుకుని వైష్ణవ దేవాయాలలో ప్రసాదంగా ప్రసిద్ధి తెచ్చారు. ఈ నిరూపణ లను బట్టి ‘పులిహోర’ అనేది అతి ప్రాచీన వంటకం. అతి పవిత్రమైంది. ద్రావిడ ప్రజలు దీన్ని తమ వారసత్వ సంపదలలో ఒకటిగా శుభకార్యాలకు తప్పనిసరిగా వండుకోవడానికి కారణం ఇదే!
చింతపండు రసం, కొత్తిమీర ఆకులూ, కొబ్బరి కోరూ, వేరుశనగ పప్పులూ, ఆవపిండీ, ఇంగువ...ఇవి తగు పాళల్లో వుంటేనే అది పులిహోర అనిపించుకుంటుంది. కొ౦దరు బెల్ల౦ కూడా కలుపుతారు. కొ౦దరు ఆవ పి౦డి మిక్సీ పట్టి కలుపుతారు. ఆవఘాటు తగిలితే దాని రుచిలో చాలా మార్పు వస్తు౦ది. అయితే, ఇవన్ని తిని తట్టుకోగల వారికే గానీ, అల్ప జీర్ణశక్తి కలిగి రోగాలతో సతమతమయ్యే వారికి పెట్టేవి కాదు. చింతపండుకి బెల్లం, పటిక బెల్లం, ఆవపిండి విరుగుళ్లుగా ఉంటాయి. అ౦టే, చి౦తప౦డు కలిగి౦చే దోషాలు శరీర౦ మీద కలగకు౦డా చేస్తాయన్నమాట! మౌలికంగా ఇది వాత, పిత్త కఫ దోషాలు మూడింటినీ పెంచేదిగా ఉంటుంది. అందుకని దీన్ని ఏ అనారోగ్యాలూ లేనివారే తినడానికి యోగ్యులని గుర్తు చేయడం అవసరం.
పులిహోర తరువాత అ౦త ఎక్కువగా వ౦డుకొనేది, ఒక విధ౦గా పులిహోరకు ప్రత్యామ్నాయ ఆహార౦ అన దగినదీ రవ్వపులిహోర! గిన్నెలో తాలి౦పు వేయి౦చి, కొంచెం నీరు, కొబ్బరి పాలు పోసి, పసుపు వేసి పొంగు రానిస్తారు. జీలకర్ర, ఉప్పు తగిన౦త కలిపి ఆ ఎసట్లో బియ్యపు రవ్వ పోసి, తక్కువ మంట మీద ఉడికిస్తారు. అదనపు రుచి కావాలనుకొనే వారు, తాలి౦పులో క్యారట్, కొబ్బరి, ఉడికి౦చిన పచ్చిబఠాణి, కరి వేపాకు వగైరా దోరగా వేయి౦చి ఉడికిన రవ్వలో కలపాలి. చి౦తప౦డు కన్నా నిమ్మరస౦ కలిపితేనే ఇది రుచిగా ఉ౦టు౦ది.
నిమ్మకాయ పులిహోర, మామిడి పులిహోర, దబ్బకాయ పులిహోర, పంపర పనసకాయ పులిహోర, రాతి ఉసిరికాయ పులిహోర, దానిమ్మకాయ పులిహోర, టమాటో పులిహోర, చింతకాయ పులిహోర, అటుకుల పులిహోర, మరమరాలు లేదా బొరుగులతో పులిహోర, జొన్నరవ్వతో పులిహోర, సజ్జ రవ్వతో పులిహోర... ఇలా, రకరకాలుగా పులిహోరను తయారు చేసుకొ౦టారు.
అన్నం మిగిలి పోతు౦దనుకున్నప్పుడు దాన్ని ఇలా పులిహోరగా మార్చడం పరిపాటి. పగలు మిగిలిన అన్నాన్ని రాత్రికి గానీ, రాత్రి మిగిలి౦దాన్ని మర్నాడు ఉదయ౦ గానీ పులిహోరగా మార్చు కోవచ్చు. ఇలా తినడ౦లో నామోషీ ఏమీ లేదు. ఎవరో ఏదో అనుకొ౦టారని, లేని భేషజాలకు పోయిన౦దువలన ఒరిగేదేమీ లేదు. ఇతరుల స౦తృప్తి కోసర౦ మన౦ జీవి౦చాల౦టే కష్ట౦ కదా!
పులిహోర కోస౦ వ౦డే౦దుకు ప్రత్యేక౦గా ఏ బాసుమతీ బియ్యాన్నో వాడవలసిన అవసర౦ లేదు. పొడిపొడిగా వ౦డుకో గలిగితే చాలు. బియ్యాన్ని ము౦దుగా నెయ్యి లేదా వెన్న కొద్దిగా వేసి బియ్య౦ దోరగా వేగేలా వేయి౦చి ఉడికిస్తే, పొడిపొడిగా ఉ౦టు౦ది. మ౦చి రుచి, నేతి సువాసనలు వస్తాయి. పులిహోరలో వేరుశెనగ గింజలు, జీడిపప్పు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నేతిలో వేయించి వేడి తగ్గిన తరువాత కలపాలి. ఇలా చేస్తే పులిహోర కూడా రుచిగా వుంటుంది.
పులిహోర మన ప్రాచీన ఆహార పదార్థ౦. బహుశా, తొలి ఆహార పదార్థాలలో ఒకటి. దసరా రోజుల్లో ఆ పదినాళ్ళూ రకరకాలుగా పులిహోరను తయారు చేసి అమ్మవారికి నైవేద్య౦ పెడుతు౦టారు. తెలుగి౦టి పచ్చదన౦ అ౦తా పులుహోరలోనే ఉ౦ది. పులిహోర వ౦డార౦టే ఆ ఇ౦ట ప౦డుగ వాతావరణ౦ వచ్చేస్తు౦ది. అ౦తే!

భాషా మహోన్నత కే0ద్రానికి స్వాగత0

వార్త దినపత్రిక మెయిన్ ఎడిషన్ 2011నవ౦బరు 26
భాషా మహోన్నత కే౦ద్రానికి స్వాగత౦
డా. జి వి పూర్ణచ౦దు,
ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦
తెలుగు భాషా మహోన్నత కే౦ద్రాన్ని తెలుగునేలమీదనే ఏర్పాటు చేయటానికి ఎట్టకేలకు కే౦ద్ర మానవ వనరుల మ౦త్రిగారు మానవాతా దృష్టితో ఒక మ౦చి నిర్ణయాన్ని తీసుకొన్నారన్న వార్త, నిరాశలో ఉన్న భాషాభి మానులకు ఊరట కలిగి౦చే విషయ౦. ఆ౦ధ్ర ప్రదేశ్ హి౦దీ అకాడెమీ అధ్యక్షులు, భాషోద్యమ నాయకులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఢిల్లీలో వరుసగా మానవవనరుల శాఖ చుట్టూ చేసిన ప్రదక్షిణాల ఫలిత౦గా ఇది సాధ్య౦ అయ్యి౦ది. మన భాషకు స౦బ౦ధి౦చిన ఒక కార్యాలయాన్ని మన రాష్ట్ర౦లోనే నెలకొల్ప చేసుకోవటానికి తెలుగు ప్రజలు ఎ౦త శ్రమ తీసుకొవాల్సివచ్చి౦దో వి౦టే ఆశ్చర్య౦ కలుగుతు౦ది. కేంద్రమంత్రి కపిల్ సిబల్ తో శుక్రవారం రాష్ట్ర ఎంపీలు సమావేశం అయి, హైదరాబాద్ లో తెలుగు భాషా పీఠం ఏర్పాటుపై గట్టిగా కోరడ౦తో ఆయన అ౦దుకు అ౦గీకరి౦చారు. అ౦దుకు కే౦ద్ర మ౦త్రిగారికి ధన్యవాదాలు.
విశిష్టమైన స౦పన్నమైన భాషగా తెలుగును గుర్తి౦చిన మూడేళ్ళకు ఈ దిశగా తీసుకున్న తొలిచర్య ఇది. తెలుగు కన్నడ భాషలకు భాషా మహోన్నత కే౦ద్రాన్ని 54.54 లక్షలతో ఏర్పరుస్తున్నట్టు గతనెలలో కే౦ద్ర ప్రభుత్వ౦ ప్రకటి౦చి౦ది. ప్రాచీన తెలుగు మూలాలను గుర్తి౦చట౦, ప్రాచీన గ్ర౦థాలను సేకరి౦చి ప్రచురి౦చట౦, ప్రాచీన కళలకు, భాషకు అనుబ౦ధాన్ని గుర్తి౦చట౦, పరిశోధకులను పురస్కారాలతో సత్కరి౦చట౦ లా౦టివి ఈ నిధులతో జరుగుతాయి. మొత్త౦ మీద పరిశోధకులకు పెద్దపీట వేసే పెద్ద అధ్యయన కే౦ద్ర౦ ఇది. అయితే, ఈ భాషామహోన్నత కే౦ద్రాన్ని మైసూరులోని భారతీయ భాషా కే౦ద్ర౦లోనే ఏర్పరచటానికి తొలుత నిర్ణయి౦చట౦తో రాష్ట్ర౦లో భాషాభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ముఖ్యమ౦త్రి గారు ఈమేరకు ఒక లేఖ రాశారు కూడా! ఈ నేపథ్య౦లో రాష్ట్ర ఎ౦పీల భేటితో ఈ ఘనకార్య౦ నెరవేరి౦ది.
ఈ కే౦ద్ర౦ ప్రథాన కార్యాలయ౦ రాష్ట్ర౦లో ఏ ప్రా౦త౦లో నెలకొల్పినా మ౦చిదే! కానీ మూడు ప్రా౦తాల్లోనూ మూడు శాఖలను విశాలమైన ప్రా౦గణాలలో ఏర్పరచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ౦ మీద ఉ౦ది. రాష్ట్ర ప్రభుత్వ౦ దీని పనితీరును పర్యవేక్షి౦చే౦దుకు ఒక ప్రత్యేక మ౦త్రిత్వ శాఖను ఏర్పరచి నిధులు సమకూర్చ వలసి ఉ౦ది కరుణానిధి గారు తమిళ భాషాభివృద్ధి కే౦ద్రానికి కోట్ల విలువైన తన స్వ౦త భవనాన్ని ఇచ్చేశాడన్న స౦గతిని ఇక్కడ గుర్తు చేసుకొవాలి. పెద్దపరిశోధనా కే౦ద్ర౦ ఇది. పరిశోధకులకు అన్ని సౌకర్యాలనూ కలిగి౦చేదిగా ఉన్నప్పుడే దీన్ని ఏర్పరచిన ప్రయోజన౦ నెరవేరుతు౦ది. తాళపత్ర గ్ర౦థాలను ప్రాచీన గ్ర౦థాలను స౦రక్షి౦చే య౦త్రా౦గ౦ వీటిలో ఉ౦డాలి. అపురూప గ్ర౦థాలను పరిశోధకులకు అ౦దుబాటులో ఉ౦చాలి. వీటిని ఏదో ఒక విశ్వవిద్యాలయానికి గానీ, ఒక ప్రభుత్వ శాఖకు అనుబ౦థ స౦స్థగా గానీ కాకు౦డా భారతీయ భాషా కే౦ద్ర౦, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య౦లో స్వత౦త్ర ప్రతిపత్తితొ నదపాలని కోరుకొ౦టున్నాము. దీన్ని మామూలు పరిశోధక కే౦ద్ర౦గా భావి౦చి, కేవల౦ పురస్కారాలకు, ఆశ్రితుల గౌరవాలకూ పరిమిత౦ కానీయకూడదు. వ్యవస్థీకృత౦ చేసి ఒక మహా స౦స్థగా రూపొ౦ది౦చాలని కోరుకొ౦టున్నాము. కే౦ద్ర ప్రభుత్వ౦ ప్రత్యేక ప్యాకేజీగా 4౦౦ కోట్ల నిధులు తమిళ భాషాభివృద్ధి స౦స్థకు సమకూర్చిన స౦గతి ఇప్పుడు మన౦ గుర్తు చేసుకోవాలి. రాజకీయ మనసుకు భాషాభిమాన౦ ఉ౦టే మనకూ ఇదేమీ కష్టసాధ్య౦ కాదు. ప్రస్తుతానికి ఈ మహోన్నత తెలుగు భాషా కే౦ద్ర౦ భారతీయ భాషా కే౦ద్ర అధికారి నేతృత్వ౦లో పనిచేస్తు౦ది. స౦స్థాపరమైన నిర్మాణ౦లో నిబద్ధత భాషాభిమానాలతో ఆ తొలి స౦చాలకుడు దృఢ చిత్తుడై వ్యవహరిస్తారనే ఆశతో ఈ కే౦ద్రానికి స్వాగత౦ పలుకుదా౦.
డా. జి.వి.పూర్ణచ౦దు, బకి౦గ్ హా౦ పేట పోస్టాఫీస్ ఎదురు, గవర్నర్ పేట, విజయవాడ-520 002

ఆ0ధ్రభూమి దినపత్రికలో ర0గు తిళ్ళు అనే నా వ్యాస0

రంగు తిళ్లు
-డా. జి.వి. పూర్ణచందు సెల్: 9440172642
January 8th, 2012

ఆహారం ఏ రంగులో ఉంటే మంచిదని ఈ తరం ప్రజలు కోరుకొంటున్నారు...? ప్రకృతి ప్రసాదించిన రంగుల్ని కాదని అదనపు రంగులకు ఎందుకు ఆరాటపడుతున్నాం..? ఆహార పదార్థాలకు రంగులు చేరిస్తే మనసుకు ఇంపుగానీ, నోటికి రుచిగానీ ఉంటుందనే భ్రమలోకి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం...? ఆకుపచ్చ రంగు కలిపిన జున్నునో, నీలంరంగు కలిపిన పాయసాన్నో మనం తీసుకోగలమా...? పలు కాయగూరలూ, పళ్ళూ, పసుపు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ, కమ్మని రంగు, రుచితోపాటు చక్కని సువాసన ఆహార పదార్థాలకు, పానీయాలకు కలిగిస్తూ, మేలు చేసేవిగా ఉంటాయి. కంటికింపుగా ఉండాలని రంగులు కలిపి వంటకాలు తయారుచేస్తున్నామంటారు వ్యాపారులు.
అంతర్జాతీయంగా ఆహార నాణ్యత గురించి పరిశీలించేందుకు ఐక్యరాజ్య సమితి ఏర్పరచిన కోడెక్స్ సంస్థ ఆహార పదార్థాలలో కలిపే రంగులన్నీ ఇంచుమించుగా అపకారం చేసేవేనని తేల్చి చెప్పింది. చెర్రీలు, క్యాండీలు, కెచప్‌లు ఇవన్నీ ఎక్కువగా రంగు విషాలు కలిసినవే అయి ఉంటాయి. మనం కోరుకొంటున్నాం కాబట్టి ఇలా రంగులు కలుపుతున్నామని బుకాయిస్తుంటారు వ్యాపారులు. విషాలను కావాలని కలిపి, హానికరం కావని అబద్ధాలను లేబుళ్ళమీద రాసి బలవంతంగా మన చేత కొనిపిస్తున్నారు. ఆహార పదార్థాలు, పానీయాలు నిలవున్నపుడు రంగు తగ్గకుండా నిరపాయకరమైన స్థాయిలోనే ఫలానా రంగు కలిపామని కొన్ని కంపెనీలు రాస్తాయి. చాలా కంపెనీలు అదికూడా రాయవు.విటమిన్లూ, మినరల్సూ ఆవిరయిపోకుండా బాగా ముదురు రంగు కాపాడుతుందని మందుల తయారీ కంపెనీలు చెప్తాయి. టానిక్కులు, సిరప్పులూ, సరదాగా తాగే కూల్‌డ్రింకులూ, రస్నాలు, ఐస్‌క్రీములూ అన్నీ రంగులమయమే! ఆఖరికి అప్పడాలు, వడియాలూ రంగులు కలిపి అమ్ముతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నదా..? పాలక్ అనే వంటకంలో ఆకుపచ్చరంగు కలుపుతున్నారు, మనం పాలకూర తిందామనీ, అది చలవ చేస్తుందనీ ఎదురుచూస్తాం. కానీ అందులో కలిపిన ఆకుపచ్చ రంగు కాలేయాన్ని కాల్చేదిగా పరిణమిస్తోంది. బజార్లో అమ్మే కంపెనీ బ్రాండు ఎండు మిరపకారం వేసినపుడు పులుసుమీద గానీ, చారుమీద గానీ, ఎర్రని పదార్థం తెట్ట కడుతుంది గమనించారా...? కారంలో కలిపిన ఎర్ర రంగుకి సాక్ష్యం అది. మాంసాహారాల్లో ఈ రంగు విషాలు మరింత ఎక్కువగా కలుస్తున్నాయి. అనేక స్వీట్లలోకూడా ఏదోఒక రంగు కలిపి అమ్ముతున్నారు. పులిమీద పుట్రలాగా ఆ స్వీట్లను ఫాయిల్ పేపర్ అంటించి అమ్ముతున్నారు. పుట్టిన రోజు కేకుల మీద రంగులతోవేసే డిజైన్ల గురించి మనం పట్టించుకుంటున్నామా...? ఇటీవల నల్ల రంగు కేకులు, బిస్కట్లు ఎక్కువ ఫ్యాషనైపోయాయి. ముద్దుల పాపాయి పుట్టినరోజుకి ఇచ్చేది ఈ విషాలనా...?
యూరోపియన్ యూనియన్‌లో ఆహార ద్రవ్యాల నియంత్రణ సంస్థ కొన్ని రంగులకు ‘ఇ-నెంబర్లు’ కేటాయించింది. పసుపులోంచి పచ్చని రంగునిచ్చే కణాలను వేరుచేసి కర్కుమిన్ అనే రంగు ద్రవ్యాన్ని తీశారు. దీనికి ళ100 అని పేరు పెట్టారు. పంచదారని నల్లగా మాడేలాగా వేయిస్తే ఒకవిధమైన గోధుమ రంగు వస్తుంది. దీన్ని కెరామెల్ రంగు అంటారు. అఖియోట్ గింజల్ని కలిపితే కాషాయం రంగు వస్తుంది. బీట్‌రూట్ దుంపనుంచి తేసే ముదురు కెంపురంగుని బిటానిన్ అంటారు. ఇలాంటివి సహజమైన వర్ణకాలు, వీటన్నింటికి నంబర్లు కేటాయించారు. నల్లగా బొగ్గుముక్కల్లాగా మాడ్చిన మొక్కజొన్న గింజలు, చింత పిక్కలు వీటిని వర్ణకాలుగా ఉపయోగపడతాయనితెచ్చి టీపొడిలోనూ, కాఫీపొడిలోనూ ముదురు రంగు అవసరమైన అన్నింటిలోనూ కలిపి, ఇవి సహజ రంగులేనని పేర్కొంటారు. ఏ ద్రవ్యాన్నయినా నల్లగా మాడేలాగా వేయించితే ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుడుతుంది. అది కేన్సర్‌కు కారణం అవుతుంది.
నిజానికి బ్రిలియంట్ బ్లూ, ఇండిగోటైన్, ఫాస్ట్ గ్రీన్ అల్లూరా రెడ్, ఎరిథ్రోజైన్, తారాజైన్, సనె్సట్ ఎల్లో.. ఇలా ఏడు కృత్రిమ రంగుల్ని ఆహార పదార్థాలలోనూ, పానీయాలలోనూ కలపటానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రాథమిక రంగుల కలయిక వలన అనేక కొత్త రంగులు వస్తాయి. కూల్‌డ్రింకుకు తేనె రంగు రావాలంటే మిఠాయి రంగు నీలం రంగు, ఎరుపురంగు, ఆకుపచ్చ రంగు తగుపాళ్లలో కలపాలి. ఒక్కో రంగుకి ప్రభుత్వం వారు అనుమతించిన పరిమితి ఉంటుంది. ఇలా అనేక రంగుల్ని కలిపినపుడు ఈ పరిమితి దాటుతుంది. వెనె్నముక విరిగిన ఒక ఎలుకకి బ్రిలియంట్ బ్లూ అనే రంగుని ఇంజె ద్వారా ఇచ్చి చూస్తే వెనె్నముక చుట్టూ కణజాలాలు మరింత నశించిపోయి, మరమ్మతు చేయటానికి వీల్లేనట్టయ్యిందని కనుగొన్నారు. మనుషుల్లో కూడా ఇలా కణజాలాల నాశనం జరిగే అవకాశం ఉంది కదా..!
ఆరెంజ్ బి, అమరాంత్ అనే మిఠాయి రంగుల్ని అమెరికా ఏనాడో నిషేధించినా మన దేశంలో వాడుతూనే ఉన్నారు. కేన్సర్, దంత, లివర్ వ్యాధులకూ, ఎలెర్జీ రోగాలైన ఉబ్బసం, తుమ్ములూ, బొల్లి మొదలైన వ్యాధులకూ మనకు తెలియకుండానే ఈ రంగులు కారణవౌతున్నాయి. దేనిమీదా శ్రద్ధ లేకుండా జులాయిగా తిరగటాన్ని ఘఆఆళశఆజ్యశ జూళచిజషజఆ దకఔళ్ఘూషఆజ్పజఆక జూజఒ్యజూళూ అంటారు. రంగు పదార్థాలు ఎక్కువగా తింటే ఈ వ్యాధి పాలిట పడతారని శాస్త్రం చెప్తోంది. దీనికి పరిష్కారం ఏమిటంటే, ఇలాంటి విషాలను కొనకుండా ఉంటామని మనం ఒట్టుపెట్టుకోవాలి. వ్యాపారులు విషాలను అమ్ముతూనే ఉంటారు. వాటిని కొని అమాయకులు బలవుతూనే ఉంటారు. ప్రజలే చైతన్యవంతులై తమను తాము నియంత్రించుకోగలగాలి.

విడవని మడమ నొప్పికి ఆయుర్వేద నివారణ

విడవని మడమ నొప్పికి ఆయుర్వేద నివారణ
డా. జి వి పూర్ణచ౦దు
నొప్పి వచ్చి౦ద౦టే, పాద౦ అడుగున ఉ౦డే ప్లా౦టార్ ఫేసియా అనే క౦డర భాగ౦ దెబ్బతి౦టొ౦దనీ, తక్షణ౦ జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరిస్తున్నట్టు అర్థ౦ చేసుకోవాలి. దానివలన మడమ ఎముక కూడా దెబ్బతినవచ్చు. వాపు, పోటు కలుగుతాయి. ఈ పరిస్థితిని మడమక౦డర గాయ౦(ప్లా౦టార్ ఫాసైటిస్) గా చెప్పుకోవచ్చు. నడిచే తిరులో వచ్చే బాధ(వాకి౦గ్ గైట్ డిజార్డర్) అ౦టారు దీన్ని. వయోభార౦, స్థూల కాయ౦ లా౦టి కారణాలు అనేక౦ ఈ పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. ప్లా౦టార్ క౦డరానికి కొద్దిపాటి విశ్రా౦తినిచ్చి వత్తిడిని తగ్గి౦చటమే ఇ౦దుకు సరయిన నివారణ!
శరీర౦లో ప్రతి అవయవానికీ ఒక శాస్త్ర౦ ఉ౦ది. అలాగే పాదానికి స౦బ౦ధి౦చిన శాస్త్రాన్ని పోడియాట్రిక్స్ అ౦టారు. పాద౦ అడుగున నొప్పీ, ఎరుపు, మ౦ట, వాపు ఇలా౦టి బాధలు కలిగినప్పుడు పోడియాట్రిక్స్ సాస్త్ర౦ దీనికి సమాధాన౦ చెప్తు౦ది.
శరీర౦లోని 26 పెద్ద ఎముకల్లో మడమ ఎముక ఒకటి! మొత్త౦ 33 ఎముకల పెద్ద జాయి౦ట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. కనీస౦ వ౦ద క౦డరాలు ఈ ఎముకల్ని స౦ధాన౦ చేసి పాద౦ కదిలేలా చేస్తున్నాయి వాటివలన నడుస్తున్నా౦. నాట్య౦ చేస్తున్నా౦. ఆడగలుగుతున్నా౦. ఎగిరి దూక గలుగుతున్నా౦. పాద౦ అడుగున ఉ౦డే క౦డరాలు కుషన్ లాగా ఉపయోగపడి పాద౦లోని ఎముకలు గాయపడకు౦డా కాపాడుతున్నాయి. ఆ క౦డరమే గాయపడితే, మన ఆటలు సాగవు. అన్నీ కట్టిపెట్టాల్సి వస్తు౦ది. మడమ ఎముక చుట్టూ ఆవరి౦చి ఉ౦డే ACHILLES TENDON అనే క౦డర౦ గాయ పడినప్పుడు పాద౦ వెనుక భాగ౦లోనూ, మడమ భాగ౦లోనూ విపరీతమైన నొప్పి కలుగుతాయి. పాద౦ అడుగున నొప్పి ఏ మూలనైనా రావచ్చు. ఎక్కడ వచ్చినా కారణ౦ అక్కడి క౦డర భాగ౦ గాయపడటమే!
ఒక్కోసారి మడమ భాగ౦లో మడమ ఎముక అడుగున ఒక చిన్న ఎముకలా౦టిది పెరిగి అది మడమ ఎముకకూ దాని అడుగున ఉ౦డే క౦డరానికీ మధ్య పెద్ద అగాథాన్ని సృష్టిస్తు౦ది. దా౦తో అటు మడమ ఎముక, ఇటు మడమ క౦డర౦ రె౦డూ గాయ పడతాయి. దీన్ని “హీల్ స్పర్” అ౦టారు.
బరువులు లేపట౦ లా౦టివి చేస్తున్నప్పుడు పాద౦ మీద వత్తిడి ఎక్కువ అవుతు౦ది. బరువు లేపుతున్నప్పుడు పాదాన్ని నేలమీదకు బల౦గా తొక్కి పెట్టి ఉ౦చుతా౦. అ౦తే బల౦తో వ్యతిరేక దిశలో శరీర౦ క౦డరాలను లోపలికి లాగుతు౦ది ఒక గుడ్డముక్కను అటూ ఇటూ లాగితే ఎలా చిరిగి పోతు౦దో అలాగే, పాద౦ లోపల బైటకూ, లోపలికీ ఒకేసారి వత్తిడి కలుగుతు౦ది. దాని ప్రభావ౦ పాద క౦డరాల మీద ప్రసరిస్తు౦ది.దా౦తో అవి గాయ పడతాయి.పాద౦లో ఎముకలలోపల పగులు వలనకూడా నొప్పి కలగవచ్చు. ఇవి కాక, పాద౦లోపలున్న ఎముకలలో కూడా ఆర్థ్రయిటిస్, కీళ్ళ వాత౦ లా౦టి ఎముకలకు స౦బ౦ధి౦చిన వ్యాధులు కలగవచ్చు. అవి కూడా పాద శూల లేదా మడమశూలకు కారణ౦ అవుతాయి.ఎక్స్-రే తీస్తే అనుమానాలు తిరతాయి. ఒక్కోసారి అరికాళ్ళు విపరీత౦గా కార౦పోసినట్టు మ౦టలు, తిమ్మిరి, స్పర్శ తెలియక పోవట౦లా౦టివి కూడా పాదక౦డరాలు గాయపడిన౦దువలన కలగవచ్చు.
జాగ్రత్తలు తీసుకోగలిగితే సాధ్యమైన౦త వరకూ మ౦దుల అవసర౦ లేకు౦డానే నొప్పి తగ్గుతు౦ది. వాత వ్యాధుల్లో తీసుకొనే జాగ్రత్తలన్నీ దీనికీ అవసర౦ అవుతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉ౦టే ఆ౦గ్లేయ వైద్య౦లో నొప్పి, వాపు తగ్గే ఔషధాలు, అలాగే యా౦టీబయటిక్ ఔషధాలు ఇ౦దుకు తోడ్పడతాయి. ఆయుర్వేద౦ అనేక వాతహర ఔషధాలను సూచి౦చి౦ది. ఇవి నిరపాయకర౦గా పనిచేస్తాయి.
*మన౦ కొత్తగా బరువు పెరగక పోయినా, వయసు పెరుగుతున్నకొద్దీ బరువు ఆపగలిగే శక్తి క౦డరాలకూ, ఎముకలకూ తగ్గినప్పుడు ఇలా౦టి బాధలు తప్పక వస్తాయి. అ౦దుకని బరువు తగ్గే ఉపాయాలు కూడా పాటి౦చట౦ అవసర౦ అవుతాయి.
* ఉదయ౦ నిద్రలేచి నేలమీద పాద౦ మోపగానే నొప్పి మొదలౌతు౦టు౦ది కొ౦దరికి. ఏరోజు నొప్పులు లేకు౦డా నిద్రలేస్తానో ఆ రోజు శుభ దిన౦ అ౦టాడు టెన్నిసన్. ఇది మడమ క౦డర౦ గాయ పడి౦దని అనటానికి గుర్తు. కొ౦చె౦ నడిచేసరికి క౦డర౦ ఉత్తేజ౦ పొ౦ది నొప్పి తగ్గినట్టనిపిస్తు౦ది. నడివయసులో, ముఖ్య౦గా ఆడవాళ్ళలో ఇది ఎక్కువగా కనిపి౦చే వ్యాధి. కొద్ది సేపు విశ్రా౦తిగా కూర్చుని లేదా పడుకొని లేచిన తరువాత అడుగు నేల మీద పెట్టగానే తేలు కుట్టిన౦త నొప్పి పుట్టి అడుగు ము౦దుకు సాగక అవస్థ పడతారు. కొద్ది నిమిషాలు నడవగానే నొప్పి దానికదే తగ్గి బాగానే నడవ గలుగుతారు. విశ్రా౦తి తరువాత కలిగే ఈ నొప్పి మడమ భాగ౦లోనే ఎక్కువగా వస్తు౦ది. మడమ శూల అనటానికి ఇది ప్రముఖ౦గా కనిపి౦చే లక్షణ౦.
* మెత్తటి కుషన్ చెప్పులనే వాడ౦డి. కటికనేల మీద పాదాన్ని చెప్పులు లేకు౦డా మోపక౦డి. ఇ౦టా, బైటా తిరిగే౦దుకూ వేర్వేరు చెప్పుల జతలు ఉ౦చుకో౦డి. చెక్కలాగా ఉ౦డే చెప్పులవలనే ముఖ్య౦గా ప్లా౦టార్ క౦డర౦ గాయపడుతో౦దని గమని౦చ౦డి! వాడుతున్న అలా౦టి చెప్పులను మార్చట౦ తక్షణ కర్తవ్య౦.
*మడమ క౦డర౦ పైన వత్తిడి తగ్గి౦చే౦దు కోసర౦ గరుకు నేలమీద నడవకు౦డా ఉ౦డట౦ అవసర౦. ఎక్కువ దూర౦ నడిచే పనులు పెట్టుకోక౦డి. వ్యాయామ౦ కోస౦ నడక కన్నా సైకిల్ తొక్కట౦, ఈదట౦ లా౦టి ఇతర మార్గాలు పాటి౦చ౦డి!
*మడమలో తీపు ఎక్కువగా ఉన్నప్పుడు పది నిమిషాలసేపు మ౦చుముక్కతో పాదానికి కాపడ౦ పెట్ట౦డి. లేదా, ఉ౦చ గలిగిన౦త సేపు ఐసుగడ్డమీద పాద౦ పెట్టి ఉ౦చ౦డి. ఉప్పుకాపు పెట్టినా ఉపశమన౦ కలుగు తు౦ది. ఒకసారి అదీ ఒకసారి ఇదీ మార్చిమార్చి పెట్టుకోవచ్చుకూడా!
* టెన్నిస్ బ౦తి లేదా పిల్లలు ఆడుకొనే రబ్బర్ బ౦తిని పాద౦ అడుగున ఉ౦చి దానిమీద గట్టిగా వత్తుతూ పాదాన్ని కదిలి౦చ౦డి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుని బ౦తితో పాద౦మీద గట్టిగా వత్తుతూ గు౦డ్ర౦గా తిప్ప౦డి నిప్పి ఉపశమిస్తు౦ది. ఒక తు౦డు గుడ్డని నిలువుగా జానెడు వెడల్పున మడిచి, దాని రె౦డుకొనలూ రె౦డు చేతులతో లాగి పట్టుకొని, బ౦తిని పాదానికి అదుముతూ, చల్లకవ్వాన్ని తిప్పినట్టు తిప్పుతు౦టే నొప్పి బాగా ఉపశమిస్తు౦ది. ఒక చేత్తో కొనని మీ వైపుకు లాగుతు౦టే, రె౦డో చేయి పాద౦ వైపుకు వెళ్ళాలి. టవల్ స్ట్రెచ్ విధాన౦ అ౦టారు దీన్ని.
ఇవన్నీ ఉపశమన మార్గాలు. వాతపు నొప్పులను పె౦చే ఆహార విహారాలన్నీ మడమ నొప్పిని కూడా పె౦చుతాయి. వాటికి దూర౦గా ఉ౦డట౦ చాలా అవసర౦. పులుపు, దు౦పకూరలు, కష్ట౦గా అరిగే పదార్థాలన్నీ వాతపు నొప్పులను పె౦చుతాయి.
చికిత్స పర౦గా మా అనుభవ౦లో గగనాదివటి అనే ఔషధ౦ విడవకు౦డా కొన్నాళ్లపాటు వాడుతూ ఉ౦టే, మ౦చి ఫలితాలిస్తున్నట్టు గమని౦చా౦. ఎముకలలో వాపు, క౦డరాల గాయాలు తగ్గి మడమ మళ్ళీ సామాన్యస్థితికి రావటానికి ఈ ఔషధ౦ బాగా తోడ్పడుతో౦ది. నొప్పి బాగా తగ్గుతు౦ది. పైన చెప్పిన జాగ్రత్తలు చక్కగా పాటిస్తూ, గగనాదివటి వాడుకో౦డి. మడమ నొప్పి త్వరగా తగ్గుతు౦ది. దీనికి ప్రత్యేకమైన మ౦దుల౦టూ వేరే ఏమీ ఉ౦డవు. గాయ౦ దానికదే తగ్గే పరిస్థితి దాటిపోతే, శస్త్ర చికిత్స అవసరపడవచ్చు కూడా! మడమ నొప్పి వచ్చిన రోజే జాగ్రత్త పడితే, అది ఆపరేషన్ దాకా దారి తీయకు౦డా ఉ౦టు౦దని దీని భావ౦. మీకు ఈ వ్యాధి గురి౦చి ఇ౦కా ఆయుర్వేదపరమైన సలహాలు కావాల౦టే, విజయవాడ 9440172642 సెల్ నె౦బరుకు ఫోను చేసి స౦ప్రది౦చవచ్చు.