Saturday, 30 January 2016

అన్నమయ్య వంటకాలు :: డా. జి వి పూర్ణచందు

అన్నమయ్య వంటకాలు డా. జి. వి. పూర్ణచందు

ఇందిర వడ్డించ నింపుగను/చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు/పెక్కైన సయిదంపు పేణులును
సక్కెర రాసులు సద్యోఘృతములు/కిక్కిరియ నారగించవో స్వామి
మీరిన కెళంగు మిరియపు దాళింపు/గూరలు కమ్మనికూరలును
సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ
పిండివంటలును పెరుగులు/మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే వేంకటస్వామీ"
అన్నమయ్య వర్ణించిన వేంకటస్వామి దివ్యాన్నాల పట్టిక ఇది. వీటిని ఇందిరాదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని చిందకుండా అంటే ఒక్క మెతుక్కూడా వదలకుండా భుజించవో స్వామీ…అంటున్నాడు అన్నమయ్య.
అక్కాళ పాశాలు: నేతి పాయసాలు
అప్పాలు,వడలు: బూరెలు, గారెలు
పెక్కైన సయిదంపు పేణులు: అనేక రకాల గోధుమ సేమ్యా వంటకాలు
చక్కెర రాసులు, సద్యోఘృతములు: పంచదారతో చేసిన క్రొన్నేతి వంటకాలు
మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: మిరియాల పొడి చల్లి వండిన తాళింపు కూరలు
కమ్మని కూరలును సారంపుబచ్చళ్ళు: కమ్మని కూరలు, చక్కని సుగంధ ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్ళు
చవులుగ నిట్టే కూరిమితో జేకొనవో స్వామీ: ఇట్టే నోరూరే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్యా స్వామీ
పిండివంటలును పెరుగులు: ఇంకా అనేక పిండివంటలు, పెరుగుతో చేసిన వంటకాలు
కిక్కిరియ నారగించవో స్వామి: అన్నీ దగ్గరగా పెట్టుకుని ఆరగించవయ్యా స్వామీ!
వీటిని 500 యేళ్ళ క్రితం అన్నమయ్య కాలంలో దేవుడికి పెట్టిన నైవేద్యంగా భావించవచ్చు. ‘ఋగ్వేద ఆర్యులు’ గ్రంథంలో రాహుల్ సాంకృత్యాయన్ చెప్పినట్టు, తమ దేవుడికి ఏ ఆహారం నైవేద్యంగా పెట్టుకున్నారో అది ఆ కాలం నాటి ప్రజల ఆహారం. అన్నమయ్య చెప్పిన వంటకాలను కూడా ఆ నాటి ప్రజల ఆహారంగా భావించవలసి ఉంటుంది. బూరెలు గారెలు, నేతి స్వీట్లు, మిరియాలు వేసి వండిన తాలింపు కూరలు, సుగంర్థ భరిత పచ్చళ్ళు, పెరుగు వంటకాలు, పాలవంటకాలూ ఉన్నాయి.
ఇవే గదా ఇప్పుడు మనం తింటున్నవీ...అని అడగొచ్చు. కానీ, ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది...! చింతపండు రసం కలిపినవీ, అల్లం-వెల్లుల్లి దట్టించినవీ, నూనె వరదలు కట్టేలా వండిన వేపుడుకూరలు, ఎర్రగా మంటెత్తే కొరివి కారాలు, ఊరుగాయల్లాంటి మనం తింటున్న భయంకర వంటకాలేవీ అన్నమయ్య వంటకాల పట్టికలో లేవు. 500 యేళ్ళ ఆధునికతలో చింతపండు, మిరప కారం, నల్లగా వేయించిన కూరబొగ్గుల్నిమాత్రమే సాధించామని అన్నమయ్య వంటకాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. యాంటీ బయటిక్సు లేకుండానే మన పూర్వులు కమ్మగా వండుకుని తిన్నారు, జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందించారు.
మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయాన్నే పెరుగు/చల్లన్నం తినటం మన ఆచారం. అది ఇప్పుడు నామోషీ అయ్యింది. దాని స్థానంలో ఇడ్లీ, అట్టు, పూరీ బజ్జీ, పునుగులు తినటం నాగరికం అయ్యింది. అన్నమయ్య కాలానికి మిరప కాయలు మనకింకా పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ, మాగాయలాంటి ఊరగాయలు అప్పటి ప్రజలకు తెలీవు. అల్లం, శొంఠి మిరియాలనే కారపు రుచికి వాడుకునే వాళ్ళు. మిరపకారపు ఊరుగాయలు, చింతపండు పులుసు కూరలు ఎరుగరు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం.
ప్రపంచీకరణం పాలిట పడ్ద మనకు పీజ్జాలు, బర్గర్లు పవిత్ర వంటకాలైనాయి. ఏడుకొండలవాడి దగ్గరికి సూటూ బూటూ వేసుకుని వెళ్ళి హాయ్ చెప్పి, ఐదు నక్షత్రాల చాక్లేట్లు నైవేద్యం పెట్టటం గొప్పగా భావించే రోజులు ఎక్కువ దూరంలో ఏమీ లేవు.