Saturday 9 May 2020

అమ్మకడుపులో నేర్చిందే అమ్మభాష:: డా. జి వి పూర్ణచందు


అమ్మకడుపులో నేర్చిందే అమ్మభాష:: డాజి వి పూర్ణచందు
పుట్టిన కొన్ని గంటల లోపే చంటి బిడ్డ అమ్మభాషకూ, పరభాషకూ ధ్వనిలో తేడా గుర్తించగలడని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. ధ్వనుల పరిఙ్ఞానం గంటల బిడ్డకు ఎక్కడిది? అమ్మకడుపులో ఉన్నప్పుడేఅమ్మధ్వనిని గ్రహించ గలగటమే ఇందుకు కారణం అని తాజా పరిశోధనలు చెప్తున్నాయి.  తనను లాలించే వ్యక్తుల్ని కూడా కొత్తగా పుట్టిన పిల్లలు గుర్తించగలరు.
నెలరోజుల వయసు శిశువుల మెదడులో జరుగుతున్న పరిణామాల్ని న్యూరోఇమేజింగ్ పద్ధతిలో చేసిన అధ్యయనంలో బిడ్డ తనను సాకుతున్న తల్లి లేదా దాది స్పర్శను గుర్తించగలుగుతున్నట్టు నిర్థారించారు. తల్లి స్పర్శ తగిలినప్పుడు మెదడులో రక్తప్రసారం పెరగటాన్ని కూడా గుర్తించారు.   
పుట్టటానికి ఇంకా నాలుగైదు నెలల ముందునుండే, అమ్మ కడుపులోనే బిడ్డలు తొలుతగా నేర్చుకునేది  అమ్మభాషనే! పుట్టగానే బిడ్డ గుర్తించ గలిగేది కూడా అమ్మగొంతునీ, అమ్మమాటనే! పదాలు, వాటి అర్థాలు తెలియక పోవచ్చు. కానీ, బిడ్డ ఏడుపులో అనేక భావాలూ, అర్ధాలూ మాతృభాషలోనే ఉంటాయి.
అమ్మ కడుపులో ఉన్న కాలంలోనే శబ్దాలతో పాటు, రుచులూ, వాసనల్ని కూడా బిడ్ద ఆస్వాదించ గలుగుతాడు. పుట్టిన తరువాత ఆస్వాదన కొనసాగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఏడవనెలలోనే బిడ్డ నాలుకమీద రుచిని తెలియచేసే కేంద్రాలు (Taste buds) ఏర్పడతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తిన్న భోజన పదార్ధాల సుగంథాన్ని కూడా బిడ్డ గ్రహిస్తాడని, దాన్ని బాగా ఙ్ఞాపకం పెట్టుకుంటాడని కూడా చెప్తున్నారు. పుట్టిన తరువాత బిడ్డకు ఏవేవి తినిపిస్తామో వాటిని రుచికరంగానూ, ఇష్టంగానూ  గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తినడం వలన బిడ్డకు వాటిపైన ఇష్టత పెరుగుతుందని కూడా గుర్తించారు.
అమ్మకడుపులో 7వనెల శిశువుగా ఉన్నప్పుడే నాడీవ్యవస్థ, జ్ఞానేంద్రియ వ్యవస్థ యంత్రాంగం ప్రారంభం అవుతుంది. చివరి 3-4 నెలల కాలంలో శరీర వ్యవస్థలన్నీ పరిణతి పొందుతున్న కొద్దీ గర్భస్థ శిశువు అమ్మ మాట్లాడే ధ్వనిని ఆకళింపు చేసుకోవటం ప్రారంభిస్తాడు. అది ధ్వని ఆకళింపు మాత్రమే! కడుపులో ఉండగానే అఆఇఈ లు వచ్చేస్తాయని దీని అర్ధం కాదు. మాతృభాష ఆకళింపు మాత్రమే జరుగుతుంది.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ & బ్రైన్ సైన్సెస్ కు చెందిన Patricia Kuhl అనే పరిశోధకుడు చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చివరి 10 వారాల కాలంలో గర్భస్థ శిశువు అమ్మభాష లోని అచ్చుల్ని ఎక్కువగా గ్రహించ గల్గుతాడని ప్రకటించాడు.
భాషకు అచ్చులు మూలం. పసిపిల్లల భాషంతా అచ్చులు ప్రధానంగా నడుస్తాయి. పుట్టి, ఎదిగే కొద్దీ అచ్చులతో హల్లుల్ని  ముడిపెట్టడం నేరుస్తాడు. 30 గంటల వయసున్న పసిబిడ్డలు వాళ్ల అమ్మ భాషలోని అచ్చుల్ని ఎలా ఆకళింపు చేసుకుంటున్నారో కంప్యూటర్ల సాయంతో విశ్లేషించి నిర్ధారణకొచ్చారు శాస్త్రవేత్తలు.
ఇది గర్భస్థ శిశువులకు తల్లి మాటలు యదాతథంగా అర్ధం అవుతాయని కాదు. భాషా పదాల ధ్వని స్వరూపాన్ని (speech sounds) అమ్మకడుపులోనే ఆకళింపు చేసుకునే ఒక ప్రయత్నం. చక్కగా తెలుగులో మాట్లాడే గర్భవతి గర్భాన పెరిగే బిడ్డకు తెలుగు మాటల ధ్వని బాగా అవగతం అవుతుంది.
గర్భంలో ఉన్న కాలంలోనూ, జన్మించాక ఎదుగుతున్న కాలంలోనూ మాతృభాష  ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ‘సైకో లింగ్విస్టిక్స్అనే శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధనాంశం ఇది. పదాలను పలకటం లోని ఉచ్చ, మధ్య, మంద్ర స్థాయిల ఆకళింపు భాషను గ్రహించటంలో మొదటి అంకంగా శాస్త్రం చెప్తుంది. 2009 నవంబర్ 5 కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో సైకో లింగ్విస్టిక్స్అ౦శ౦మీద తొలి పరిశోధన వెలువడింది.
జెర్మనీ లోని ఉర్జ్బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే శాస్త్రవేత్త Human fetuses are able to memorize sounds from the external world by the last trimester of pregnancy with a particular sensitivity to melody contour in both music and language అని పేర్కొన్నారు.
బిడ్డ పుట్టడానికి చివరి 3-4 నెలలు భాషకు సంబంధించి కీలకమైన సమయం. బైట ధ్వనుల్ని కూడా బిడ్డ గ్రహించే ప్రయత్నం చేస్తాడప్పుడు.తల్లిభాషా పదాలలోని లయ కొంత ఆకళింపు కొస్తుంది. ప్రసవించాక వీలైనంత త్వరగా తల్లులు బిడ్డతో మాట్లాడటం మొదలు పెడితే, బిడ్డ సౌకర్యవంతంగా భావిస్తాడు. perceptual preference అంటారు దీన్ని. పలకరించతానికొచ్చిన బంధుమిత్రులు ఆ బిడ్దని హల్లో హౌ డు యూ డు అంటూ పలకరిస్తే బిడ్డ అయోమయానికి లోనై ఏడుస్తాడు.
గర్భంలో ఉండగా తాను నేర్చిన స్వల్పమాత్రపు భాషలోనే బిడ్డ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? తన ధ్వనులతో మాట్లాడతాడు. బిడ్డ ఏడిస్తే ఒక్కో కారణానికి ఆ ఏడుపు ఒక్కో తీరున ఉండటం గమనిస్తూనే ఉంటాం కదా! బిడ్డ పుట్టి, ఎదుగుతున్న క్రమంలో మనం ధ్వనుల్ని నేర్పిస్తాం. భాషించటం నేర్పిస్తాం. కానీ, ఇంకా పుట్టకుండానే, అమ్మ కడుపులోనే నేర్చుకోవటాలన్నీ స్వయంగా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ. దీన్ని “pre-adaptation for learning language (పుట్టకమునుపే భాష నేర్చుకునే యత్నం)” అ౦టారు.
మాతృభాష ప్రభావంతో బిడ్డ మనసు రూపొందుతోంది, మాతృభాషలోనే అది పరిణతి పొందుతోంది. మాతృభాషకు అతీతంగా బిడ్డను పె౦చాలంటే అది బిడ్డలో మనో దౌర్బల్యానికి కారనం అవుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు పిల్లలు. ప్రాథమిక విద్యలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతుందని పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన శ్రీమతి కథ్లీన్ వెర్క్ స్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు బిడ్దకి తెలుగు రాకుండా ఇంగ్లీషు నేర్పితే ఆ ఇంగ్లీషుని అర్థం చేసుకునే యంత్రాంగం విపలమై బిడ్డ తక్కువ తెలివితేతలతో మనో దౌర్బల్యుడౌతాడు.
పరిశోధనల నిరూపణ కోసం శ్రీమతి కథ్లీన్ వెర్క్ అప్పుడే పుట్టిన 60 మంది శిశువుల తొలిరోదన ధ్వని తరంగాలను రికార్డ్ చేశారు. సద్యోజాత శిశువుల తొలి రోదనం (first cry) మీద జరిగిన తొలి పరిశోధన ఇది. అరవై మంది పిల్లల్లో 30 మంది ఫ్రెంచి తల్లులకు, 30 మంది జెర్మన్ తల్లులకూ పుట్టినవాళ్ళు.  బిడ్డలు పుట్టిన మొదటి ఐదు రోజులపాటు బిడ్డల రోదన ధ్వనుల్ని విశ్లేషించి, ఫ్రెంచి తల్లులకు పుట్టిన బిడ్డల ఏడుపు తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయిలోకి ఆరోహణ క్రమంలోనూ, జెర్మనీ తల్లులకు పుట్టిన బిడ్డల ఏడుపు హెచ్చు స్థాయి నుండీ కిందకు అవరోహణ క్రమంలోనూ ఉన్నట్టుగా గమనించారు.
సాధారణంగా ఎక్కువ జెర్మన్ పదాలు పై స్థాయి నుంచి కింది స్థాయికి వస్తాయని, ఎక్కువ ఫ్రెంచి పదాలు కిందిస్థాయి నుంచి పై స్థాయికి వెడతాయనీ విశ్లేషకుల భావన. ఉదాహరణకు, ఫ్రెంచి భాషలో తండ్రిని “papaa” అని ఆరోహణంలో పలికితే, జెర్మన్ భాషలో “paapa” అని అవరోహణంలో పలుకుతారట.  పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ముందు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువ స్థాయిలో ఉన్నదా అని పరిశీలించారు. ఆకలి, అసౌకర్య౦, నొప్పి, వంటరి తనం ఇలాంటి కారణాలతో పసికూనలు చేసే రోదనలను వర్గీకరించుకుని విశ్లేషించారు. జెర్మన్ బిడ్డల ఏడుపు హెచ్చుస్థాయి నుంచి తగ్గుస్థాయికి అవరోహణ క్రమంలో ఉండగా, ఫ్రెంచి బిడ్డల రోదనం దిగువస్థాయి నుంచి పై స్థాయికి ఆరోహణ క్రమంలో ఉన్నట్టు తేలింది.“వా...వ్హ్అని ఏడ్చే బిడ్డకీహ్వ...వా...” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉండటాన్ని విధ౦గా గమని౦చారు.
ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంచి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారు. చంటి బిడ్డ ఏడుపులోనూ భాష ఉంటుంది. మాతృభాషలో మనో భావాలను వెల్లడించే ప్రయత్నం (ability to actively produce language) అనేది పుట్టిన క్షణంనుంచే బిడ్డ మొదలు పెడతాడని అర్థం అవుతోంది. దాన్ని వెల్లడి చేయటానికి బిడ్ద చేసే ప్రయత్నమే ఏడుపు.
తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీఅంటే యాసని(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారన్నమాట. తమిళం, తెలుగు, సంస్కృతం మొదలైన భాషలలో లయపరంగా తేడాలు ఉన్నట్టే, జెర్మనీ, ఫ్రెంచి భాషల లయల లోనూ  తేడాలను గమనించారు. 
ఫ్రెంచి భాషా పదాల్లో అధిక బాగం ఇలా అరోహణక్రమంలోనూ, జెర్మన్ భాషాపదాల్లో అవరోహణ క్రమం లోనూ ఉంటాయని, వారి బిడ్డల మొదటి ఏడుపు కూడా అందుకు అనుగుణంగానే ఉందని పరిశోధనలో తేలింది. వివిధ ధ్వనులే భాషలో వర్ణాలుగా ఏర్పడుతున్నాయి. వివిధ వర్ణాలు కలిసి భాషాపదాలు అవుతున్నాయి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ధ్వనుల్ని ఆకళింపు  చేసుకుంటే, పుట్టాక బిడ్డ ఆ ధ్వనుల్ని కూడబలుక్కోవటం మొదలెడతాడు.  
నిఃశ్వాసోఛ్చ్వాస సంక్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస సంక్షోభ స్వప్న సంభవాన్అని సుశ్రుతుడి సిద్ధాంతం ఇదే చెప్తోంది.
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనో భావాలు ప్రభావం చూపుతాయి. అలాగే,  బిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరించటం వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగు తాయని సిద్ధా౦తం చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడటం మొదలౌ తాయి.  కాబట్టి, 4 నెల గర్భవతినిదౌహృదినిఅ౦టారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రె౦డు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగటంలో మాతృభాష ముఖ్య పాత్ర నిర్వహిస్తోంది.
మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతధ౦గా వినిపి౦చవు. నీటిలో చేపలు వాటి శరీరా౦గాలనుంచి, ఎముకలనుంచీ మెదడుకు చేరిన ధ్వని తరంగాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటిలో౦చి తల్లి భాషను స్వీకరించటం ప్రారంభిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడించారు. గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదళ్ళు ధ్వని తరంగాలను స్వీకరించ గలుగుతాయని కూడా ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.  
నోరులేని జంతువులు కూడా తమ మనోభావాలను ధ్వనుల ద్వారా, సైగల ద్వారా వ్యక్త పరుస్తాయి. భాష రానిదే భావ వ్యక్తీకరణ ఏర్పడదనే వాదన సరికాదు. భావ వ్యక్తీకరణను బిడ్డ, అమ్మ కడుపులోనే సాధన చేస్తున్నాడు. అందుకు అమ్మభాష దోహదపడుతోంది. పుట్టాక కూడా అమ్మభాషలోనే బిడ్డ పెరగాలి. ప్రాధమిక విద్యలో నేర్చే అంశాలను అమ్మభాషలో ఆకళింపు చేసుకోవటానికి, తద్వారా ఎక్కువ సమాచారాన్ని గ్రహించటానికి బిడ్డకు వీలు కుదురుతుంది.

ఆచార్య ఉమామహేశ్వరరావు గారపాటి 16 మే 2017 ప్రతిలిపిలో
వ్యాసంపై ఇలా వ్యాఖ్యానించారు
అమ్మభాషను అనుకరించేందుకు చేసే ప్రయత్నమే బిడ్డ తొలి ఏడుపు అనీ, దీన్ని పుట్టిన తర్వాత భాష నేర్చేందుకు వేసే తొలి అడుగులుగా గుర్తించడం, విద్యామాధ్యమంగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషను నిషేధిస్తే భాషాపరమైన అవ్యవస్థ ఏర్పడుతుందని భాషా శాస్త్రజ్ఞులు గుర్తించటం మన పాలకులకూ ఆంగ్లభాషా మాధ్యమ ప్రణాళికలను తయారు చేస్తున్న వారికీ కనువిప్పు కావాలి. విషయాన్ని రచయిత చక్కగా వ్యాసంలో పొందుపరిచారు. వ్యాసాన్ని అందరం చదవాలి పదిమందితో చదివించాలి.