Friday 13 June 2014


ప్రేమ స్వాతంత్ర్యం
డా. జి వి పూర్ణచందు


ప్రేమ స్వాతంత్ర్య సంఘం (ఫ్రీ లవ్ సొసైటీ) అనే సంస్థ ఒకటి స్వాతంత్ర్యోద్యమం తొలినాళ్లలో బాగా విస్తృతంగా పనిచేసేది. చలంగారు బెజవాడలో ఉన్న రోజుల్లో అలాంటి సంస్థ ఒకటి ఇక్కడ పనిచేసేదని చెప్తారు.
పెళ్ళిళ్ళు, కడుపులు, వ్యభిచారాల్లాంటి జంజాటాలకు అతీతమైన ప్రేమని ఈ సంస్థ ప్రబోధించేది. అదొక ప్రేమ ప్రపంచం. వ్యక్తిగతమైన స్త్రీపురుష బంధాల్ని కట్టుబాట్ల చట్రంలో బిగించటాన్ని ఈ ఉద్యమం వ్యతిరేకిస్తుంది. పరిణతి పొందిన స్త్రీ పురుషుల మధ్య భావోద్వేగాల పరమైన సంబంధాల్ని, లైంగిక పరమైన సంబంధాల్ని గౌరవనీయమైనవి గానే ఈ సంస్థ పరిగణిస్తుంది. చర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇంగ్లండు కార్యస్థానంగా ప్రారంభమైన ఉద్యమం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇతర మత దేశాలకూ ఇది విస్తరించింది.
ప్రేమించ వలసిందిగా వేధించే యాసిడ్ ప్రేమికుడూ, సెక్సు కోసం భార్యని వేధించే భర్త ఇద్దరి మధ్యా మౌలికంగా ఎలాంటి తేడా లేదనీ, వివాహ వ్యవస్థ అనేది రేప్ చేసే హక్కులిచ్చేది కాదని ఫ్రీ లవ్ ఉద్యమం వాదిస్తుంది. ప్రేమ లేని పెళ్ళిళ్ళు రేపులకన్నా ప్రమాదకరమైనవే నిజానికి.
స్త్రీలకు ‘ప్రేమస్వాతంత్ర్యం’ ఉండాలనే లక్ష్యంతో పందొమ్మిదో శాబ్దిలో ‘ఫ్రీ లవ్’ఉద్యమం బాగా ఊపులోకొచ్చింది. ‘ఈ భూమ్మీద సమస్త సుఖోపభోగాలూ అనుభవించటానికి పెళ్ళి అనేది ప్రధాన ఉపకరణం అనీ, ఈ అస్థిర ప్రపంచంలో సుస్థిర మైనది వివాహబంధం ఒక్కటేననీ’ భావించటం వలన వివాహవ్యవస్థలో స్త్రీబానిసత్వం పెరిగి పోతోందనే భావన అందరిలోనూ కలిగింది. ఆ సమయానికి తెలుగు నేలమీద రాజా రామ్మోహనరాయి, రఘుపతి వెంకట రత్నం నాయుడు, కందుకూరు వీరేశలింగం ప్రభృతుల ప్రభావం ఎక్కువగా ఉంది. విధవా పునర్వివాహం, దేవదాసీ వృత్తి నిర్మూలన, స్త్రీ స్వేఛ్ఛ లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. భావ ప్రకటనా స్వేఛ్ఛకొసం మహిళలు, కొందరు పురుష సంస్కర్తలూ పోరాటం సాగించారు. స్వాతంత్రోద్యమం కూడా తోడు కావటంతో మహిళలు స్వేఛ్ఛగా బయటకొచ్చి ఉద్యమబాట పట్టటం కూడా స్త్రీ ఉద్యమానికి తోడయ్యింది. విధంగా ప్రేమ స్వాతంత్ర్యోద్యమాన్ని తెలుగు వారు త్వరగానే అందుకో గలిగారు.
18వ శతాబ్దిలో మహిళా ఉద్యమం (ఫెమినిజం), 19వ శతాబ్దిలో ‘ప్రేమ స్వాతంత్ర్యోద్యమం’ మొదలయ్యాయి. పెళ్ళి అనేది మహిళా నిర్మూలనా(annihilation of woman)కార్యక్రమంగా మారిపోతోందని ఈ ఉద్యమం హెచ్చరించింది. తన కిష్టమైన వ్యక్తిని పెళ్ళాడే హక్కు, తన ఇష్టంతోనే భర్తైనా సరే సెక్సుని పొందే హక్కు, తనకు పిల్లలు కావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు, ఇలాంటివి ఉన్నప్పుడే పెళ్ళి అనేది సౌఖ్యదాయకం అవుతుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం, పురుషుడు ఆమెని దానం స్వీకరించటం, స్త్రీని పురుషుడికి చట్టబద్ధంగా అప్పగించటాల వలన వివాహ వ్యవస్థ పవిత్రమైన దనటం సరికాదు. స్త్రీ పురుషు లిద్దరికీ స్వాతంత్ర్యం కావాలి. ఇష్టం అయిన వ్యక్తిని ప్రేమించటం, తను ప్రేమించే, తనను ప్రేమించే వ్యక్తితో కలిసి జీవించటం ప్రాథమిక హక్కు కావాలని ఈ ప్రేమ స్వాతంత్ర్యోద్యమం కోరింది.
కానీ, కాలక్రమంలో ఈ ఉద్యమం స్త్రీల చేతుల్లోంచి పురుషుల చేతుల్లోకి మారిపోయింది. చివరికి అది “గే-సెక్స్(స్వలింగ సంపర్కం)” మరియూ Gay rights కోసం పోరాడే ఉద్యమంగా మారిపోయింది. వివాహ వ్యవస్థ విడాకుల వ్యవస్థగా మారింది. నచ్చిన వాడితో కలిసి జీవించటానికి సహజీవనం అనే ముద్దు పేరు స్థిరపడింది. దీన్ని domestic partnerships అంటున్నారిప్పుడు. ఇంట్లోజరిగితే శృంగారం, బయట జరిగితే వ్యభిచారం అనే ధోరణి ప్రబలింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ప్రతి జంటా తమది సహజీవనం అంటే చట్టం కూడా నోరెళ్ళ బెట్టే రోజులు ముందున్నాయి.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రేమ ఒక నిషిద్ధ పదార్ధంగా మారిపోయేంతగా ఇలా వెర్రి పోకడలు పోతోంది. ఆ దుష్ట ఫలాలు మనకూ బాగానే పండుతున్నాయి. అవి ప్రేమ పెళ్ళిళ్ళు గానీ, పెద్దలు చేసిన పెళ్ళిళ్లు గానీ, మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నవి రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. కారణాల గురించి ఆలోచించుకో పోతే మెథావులు పెద్ద తప్పు చేసిన వారౌతారు. ముఖ్యంగా పెళ్ళికి సిద్ధంగా ఉన్న జంట తమను తాము మూల్యాంకనం చేసుకుని తమలో ఉన్న ప్రేమ గుణాలకు మార్కులు వేసుకోవాలి. కనీసం యాబై మార్కులు దాటిన వాళ్ళు తమ ప్రేమ గుణాలను పెంచుకుని అప్పుడు ప్రేమకు, ఆ తరువాత పెళ్ళికీ తలపడాలి.
ప్రామాణిక మైన ప్రేమ అనేది ఎదుటివారికి ‘ఏది లాభం’ అని చూస్తుంది. యాసిడ్ ప్రేమలకు అలాంటిదేదీ ఉందదు. ఒక పని చేయటానికి స్వేఛ్ఛ ఎంత ఉందో, చెయ్యకుండా ఉండటాని క్కూడా అంతే స్వేఛ్ఛ ఉంటుంది. దాన్ని స్వేఛ్ఛగా ఉపయో గించుకో గలిగారా లేదా అనేది ప్రశ్న. భావోద్వేగ పరమైన అవసరాలు (emotional needs) అనేవి ప్రేమ ముసుగులో ఆవహించినప్పుడు అది ప్రేమ పరిథి దాటి అవసరం గడుపుకోవటంగా మారి పోతుంది. అవసరం లేదనిపించిన రోజు ప్రేమకు తాత్కాలికంగా తెరపడ్తుం దన్నమాట! Emotional needs అనేవి ప్రేమకు ప్రాతిపదిక లైనప్పుడు తన అవసరం తీర్చటం తనని ప్రేమించే వ్యక్తి బాధ్యత అనే భావన బలపడుతుంది. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టైతే నన్ను ఆపకు, నేను చెప్పినట్టు చెయ్యి, నా చెప్పుకింద తేలులా పడి ఉండు అనే మాటలు దాని వెనకే వస్తాయి. చివరికి ప్రేమ స్వాతంత్ర్యం ప్రేమ బానిసత్వంగా మారిపోతుంది.
మానసిక శాస్త్రవేత్తలు దీన్ని నాగరికతా పరిణామ క్రమంలో ఒక దశగా భావిస్తారు. ఆధునిక సమాజపు పోకడలలో ఇదొక సామాజిక రుగ్మతగా మారిపోతోంది. ఇందుకు తెలుగు నేల మినహాయింపు కాకపోవటమే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం. భావోద్వేగాల్;అ సమతుల్యత ఉన్నప్పుడే ప్రేమ బలమ్గా, స్థిరంగా ఉంటుంది. ప్రేమికులం అని ఘనంగా చెప్పుకునేవారు emotional equilibrium గురించి ప్రయత్నించక పోతే దాంపత్యాలు మురిగి పోతాయి. ఇది కావాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు ఇది ఇవ్వాలనే కోరిక కూడా అంతే బలంగా అవతలి వ్యక్తిలో కూడా ఉన్నప్పుడే సమతుల్యత నిలబడుతుంది. లేకపోతే ఏకపక్షంగా మారిపోయి చివరికి ప్రేమబానిసత్వానికి లొంగి పోవటమో, విడాకులకు సిద్ధపడటమో జరుగుతుంది. ఆ అవసరం ఒక్కటి కూడా తీరలేదు అనే అసంతృప్తి ఇద్దరిలో ఎవరికి వున్నా అందులో దాంపత్య శోభ కనిపించదు.
ప్రేమ ఋజుమార్గాన (positively motivated) ఉన్నప్పుడు, love అనేది మిమ్మల్ని lovable చేస్తుంది. అనేక నెలలుగా ప్రేమించుకుని, పెద్దల్ని ఎదిరించి పోరాడిఉ పెళ్ళి చేసుకుని మూడో నెలకే విడాకులో పెటాకులో తప్పని పరిస్థితి ఎక్కువమందిలో వస్తుఉన్నదంటే నిజమైన ప్రేమ విలువ తెలిసే స్థాయిలో వాళ్ల ప్రేమ సాగలేదనే అర్థం.
సాధారంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ నిజమైన ప్రేమ కాదనే భావిస్తారు. ప్రేమించే తత్వం ఉన్నవారు పిపీలకాది పర్యంతం సమస్తాన్ని ప్రేమించే గుణం కలిగి ఉంటారు. కేవలం ఫలానా అమ్మాయినో లేక ఫలానా అబ్బాయినో మాత్రమే ప్రేమించేట్టుగా ఉండరు. ప్రేమించే గుణం ఎంత ఉన్నదనేది ప్రేమించటానికి అర్హతని నిర్ణయించే కొలబద్ద.

ఆడవాళ్ళలో మలబద్ధత డా. జి వి పూర్ణచందు


ఆడవాళ్ళలో మలబద్ధత
డా. జి వి పూర్ణచందు
జబ్బులకూ ఆడామగా తేడాలుంటాయి. మలబద్ధత విషయంలో ఇది మరీ నిజం. సగటు మధ్య తరగతి మహిళల జీవన విధానం వలనే ఈ తేడా లేర్పడుతున్నాయి. ముప్పయ్యేళ్ల లోపు ఆడవాళ్లలో మలబద్ధత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు వంటింటి విధుల్లో తీరిక దొరక్క శరీర ధర్మాలను వాయిదా వేయటమే ముఖ్య కారణం.
ఇంట్లో అందరికన్నా ము౦దే నిద్ర లేవటం, కసవులు చిమ్ముకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, పొయ్యి వెలిగించి కాన్వెంట్లకు పోయే పిల్లల కోసం క్యారీయరు కట్టే పనిని పూర్తి చేయటం, పిల్లల్ని తయారు చేసి, వాళ్లను స్కూలు బస్సు ఎక్కించటం, అంట్లూ, బట్టలూ, ఆ వెంటనే మధ్యాన్న భోజనం కోసం ప్రయత్నాలు, వంటలు, వడ్డనలూ, అంతలోనే సాయంత్రం కాఫీలు, రాత్రి అందరూ పడుకునే వరకూ ఎవరి సేవలు వారికి చేయటం, వంటిల్లు కడుక్కోవటం... ఇంత పని రంథిలో పడటం వలనే టాయిలెట్లోకి వెళ్ళి ప్రకృతి పిలుపును పట్టి౦చుకొనేంత సావకాశ౦ ఆడవాళ్లకు ఉండటంలేదు.
సగటు మధ్య తరగతి మహిళకున్నంత బిజీ షెడ్యూలు బహుశా ఈ దేశ ప్రధాన మ౦త్రి క్కూడా ఉండదేమో! ఎప్పటి కప్పుడు కొచె౦ సేపాగాక వెడదాం అనో, ఈ పని పూర్తయ్యాక వెడదాం అనో అనుకోవటం, అదే పరిస్థితి ప్రతి రోజూ కొనసాగటం వలన చివరికి అదే అలవాటుగా మారి, మోషన్ వస్తే మోక్ష౦ వచ్చినంత సంబరం అవుతుంది. ఇది ఆడవారికి వారి జీవన విధానం తెచ్చే ఒక సమస్య. ఇలా జీవి౦చే మగవారికీ ఇది సమస్యే!
గడియారం రోజూ సరిగ్గా సమయానికి గ౦ట కొట్టినంత ఠ౦చనుగా విరేచనం ప్రతిరోజూ అదే సమయానికి అయ్యే స్వభావం మానవ శరీరాల కుంటుంది. కాలానికి అవుతుంది కాబట్టే, దాన్ని కాలవిరేచనం అన్నారు. అది సకాలంలో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని తప్పించేందుకు ప్రయత్నించకుండా ఉండాలి. ఏ కారణం చేతయినా ఆ టైము మారితే, మర్నాడు మారిన సమయానికే విరేచనం అవుతుంటుంది. రోజూ ఒకే కాలానికి విరేచనానికి వెళ్ళే  అలవాటు ఉన్నవారికి మలబద్ధత రాదు. 
సమస్త రోగాలకూ మూలకారణం మలబద్ధతేనని మొదట గ్రహి౦చాలి. నిద్రలేచాక దినచర్యలో మొదటి అంశ౦గా విరేచనానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. తరువాతఅనే మాటని విరేచనం విషయంలో పొరబాటున కూడా వాడకూడదు. మలబద్ధక౦ వలనే మలబద్ధత ఏర్పడుతుంది. క్యా౦పులు తిరిగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆదరాబాదరా ప్రొద్దునే లేచి దూర ప్రయాణం చేసి ఆఫీసులకు వెళ్ళేవారికి, క్షణం తీరిక లేనంతగా పనుల్లో మునిగి వు౦డేవారికి మలబద్ధత ఈ కారణం
వలనే ఏర్పడుతుంటుంది.
విరేచనం అయ్యే తీరునుబట్టి జీర్ణాశయ వ్యవస్థలు మృదు, మధ్య, కఠిన (క్రూర) అని మూడు రకాలుగా ఉంటాయని చెప్తు౦ది ఆయుర్వేద శాస్త్ర౦. గ్లాసు పాలు తాగితే రె౦డు విరేచనాలు కావటం మృదు తత్వ౦. విరేచనాల బిళ్లలు డబ్బాడు మి౦గినా కడుపు కదలక పోవటం కఠిన(క్రూర)తత్వ౦. ఒక చిన్న విరేచనం మాత్ర వేసుకొ౦టే విరేచనం కావటం మధ్య తత్వ౦. ఈ మూడు రకాల తత్వాలలో ఎవ్వరికి వారు తాము ఏవిధమైన శరీర తత్వ౦ కలిగి ఉన్నారో మొదట అంచనా వేసుకోవాలి. దానికి తగట్టుగా ఆహార విహారాలనూ జీవన విధానాన్నీ మార్చుకోవటం అవసరం. అన్ని ఇతర పనులూ మాని విరేచనానికి వెళ్ళి రావాలనేది ఆయుర్వేద సూక్తి.
నిద్రలేస్తూనే విరేచనానికి వెళ్ళే అలవాటు చేసుకోవాలి. టాయిలెట్లోకి వెళ్లగానే వెంటనే విరేచనం అయిపోవాలి. గు౦డె లవిసిపోయేలా ముక్కీ ముక్కీ విరేచనానికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. నీరు తక్కువ తాగేవారికి విరేచనం పిట్టం కట్టి ఎంత ముక్కినా బయటకు రాదు. స్థూలకాయం ఉన్నవారు, నడుంనొప్పి, మోకాళ్ళనొప్పులున్న వారు గొంతుక్కూర్చునే దేశవాళీ మరుగుదొడ్లో విరేచనానికి వెళ్లటాన్ని పెద్ద శిక్షగా భావిస్తారు. నొప్పులకు భయపడి చాలామ౦ది విరేచనాన్ని వాయిదా వేయాలని చూస్తారు. కొ౦దరికి టాయిలెట్లో ఎ౦తసేపు కుర్చున్నా ఇంకా అవలేదన్నట్టు, పెద్ద విరేచనం కదిలి వచ్చేస్తోందన్నట్టు అనిపి౦చి, గ౦టల తరబడీ అక్కడే గడపాల్సి వస్తు౦టుంది. ఇవన్నీ వాత వ్యాధులకు దారి తీస్ఏ అంశాలుగా పరిణమిస్తాయి.
కొ౦దరు మగవాళ్లకి కాఫీ తాగక పోతేనో. సిగరెట్టు కాల్చక పోతేనో, దినపత్రిక చదవకపోతేనో విరేచనం కాదనే అపోహలు ఉంటాయి. వాటికోసం విరేచనాన్ని వాయిదా వేస్తుంటారు. నిజానికి కాఫీ,సిగరెట్లలో విరేచనం చేసే గుణాలేవీ లేవు. కానీ, విరేచనాని క్కూడా సె౦టిమె౦టుని లి౦కు పెడుతుంటారు. ఇవన్నీ విరేచనాన్ని ఎగగొట్టేందుకు  ఎత్తుగడలే!
ఆరోగ్యకరమైన మలానికి కొన్ని ప్రత్యేల లక్షణాలుంటాయి. దొడ్లోకి వెళ్లగానే విరేచనం అయిపోవాలి. మలం మృదువుగా ఉండాలి, కాసిని నీళ్ళు కొట్టగానే లెట్రిన్ ప్లేటుకు అంటుకోకుండా జారి పోవాలి. నిన్ననో మొన్ననో తిన్న ఆహర పదార్థాలు విరేచనంలో కనిపి౦చినా, నీళ్లతో కడుక్కుంటే చేతికి ఇంకా జిడ్డుగా అనిపి౦చినా, లెట్రిన్ ప్లేటులో అంటుకొని ఎ౦త నీరు కొట్టినా వదలక అంటుకొని ఉంటున్నా, ఆ వ్యక్తి పొట్ట చెడిందని అర్థం.
మొలలు, లూఠీలు, విరేచనమార్గంలో అవరోధాలు, పుళ్ళు, వాపులు, కొన్ని రకాల మందులు, కొన్నిరకాల ఆహార పదార్థాలు, మలబద్ధకానికి కారణం కావచ్చు. కేన్సరు లా౦టి వ్యాధుల క్కూడా మలబద్ధత తొలి హెచ్చరిక అవుతుంది. విరేచనంలో తుమ్మజిగురు బంక లాగా తెల్లని జిగురు గానీ, రక్తపు చారలు గానీ ఉంటే అమీబియాసిస్ లా౦టి వ్యాధులు ఉన్నాయేమో చూపించుకొవాలి. విరేచనం పుల్లని యాసిడ్ వాసన వస్తు౦టే కడుపులో అమ్లరసాలు పెరిగి పోతున్నాయని అర్థ౦. కుళ్లిన దుర్మాంసం వాసన వేస్తుంటే లోపల చీము ఏర్పడుతోందేమో చూపి౦చుకోవటం అవసరం. రిబ్బను లాగా సన్నగా విరేచనం అవుతుంటే పేగుల్లో అవరోధ౦ కారణం కావచ్చు. మేకపె౦టికల మాదిరి ఉండలు ఉండలుగా అవుతుంటే ఇరిటబులు బవుల్ సి౦డ్రోమ్ లా౦టి మానసిక వ్యాధులు కారణం కావచ్చు.
జీర్ణశక్తిని బలంగా కాపాడుకొ౦టూ, మలబద్ధత ఏర్పడకుండా జాగ్రత్త పడేవారికి వ్యాధులు చాలా దూరంగా ఉంటాయి. ముఖ్య౦గా ఆడవారు కేలం మలబద్ధత కారణంగా అకారణమైన నడుంనొప్పి, కీళ్లనొప్పులు, ఎలెర్జీ వ్యాధులు, గ్యాసుట్రబులు, పేగుపూత  లాంటి వ్యాధులకు ఎక్కువగా గురి అవుతున్నారు. ఇందుకు మలబద్ధత, మలం విషయంలో బద్ధకమే ముఖ్య కారణం కావచ్చు.