Tuesday 8 July 2014

అందమైన అక్షరాల్లా పొందికైన తెలుగమ్మాయి :: డా. జి వి పూర్ణచందు

అందమైన అక్షరాల్లా పొందికైన తెలుగమ్మాయి
డా. జి వి పూర్ణచందు

కన్నులు దీర్ఘముల్, నగుమొగంబవురా! తలకట్టు తమ్మి పూ
పున్నమ చందమామలకు(; బొక్కిలి చక్కదనంబు(జెప్ప(గా
నున్నదె? మేలు బంతులు పయోధరముల్; మఱి కౌనుసున్నయౌ
నెన్నిక కెక్కు వ్రాతఫల మివ్వరవర్ణినికి న్నిజంబుగన్
కొందరి వ్రాత ఫలం గొప్పగా పెట్టి పుట్టినట్టు ఉంటుందిట. వ్రాతఫలం అంటే బ్రహ్మగారి రాత వలన కలిగిన అదృష్టం.
ఈ అదృష్టం ఎవరికి దక్కిందీ...? ఒక వరవర్ణినికి! అఆఇఈ అక్షరమాలని వర్ణమాల అంటాం కదా...అలాంటి వరవర్ణసంపద కలిగిన భాష లాంటిది ఆమె! మంచి శరీర వర్ణం కలిగినదనీ, వరాలన్నింటినీ కలిపి చేసిన గొప్ప వర్ణన లాంటిదనీ  కూడా దీనికి అర్ధాలు చెప్పుకోవచ్చు. ఆ వరవర్ణిని వ్రాతఫలమా అన్నట్టుగా ఉన్నదంటాడు.
రైవతకోత్సవానికి వచ్చిన సుభద్రని చూసి యతి వేషంలో ఉన్న అర్జునుడు తనలో తాను అనుకుంటున్న మాటలివి!
చేమకూర వేంకట కవి విజయవిలాసం కావ్యంలో తళుక్కున మెరిసిన ఈ పద్యంలో తెలుగక్షరాల ఔన్నత్య వర్ణన అంతర్లీనంగా కనిపిస్తుంది. 17వ శతాబ్ది తొలిపాదం నాటి చేమకూర వెంకటకవి తంజావూరు రఘునాథ నాయకుడి ఆస్థానంలో ఉండేవాడు. బహుశా ఈ విజయవిలాసమే ప్రబంధాలలో చివరిది కావచ్చునని పండితుల భావన. ప్రతి పద్యంలోనూ ఏదో ఒక చమక్కు ఉండేలా ఈ కావ్యాన్ని వ్రాశాడు.
ఇది సుభద్రకు ఆపాదిస్తూ చేసిన ఓ తెలుగమ్మాయి వర్ణన.
తన అక్షరాలను వెన్నెట్లో ఆడుకునే ఆడపిల్లల్తో పోల్చుకున్న తిలక్ ఆలోచనలకు ఈ పద్యం ఒక ప్రేరకం.
అందమైన అక్షరాల్లా పొందికగా ఉన్నది సుభద్ర అని చెప్పదలచాడు కవి. తాను తెలుగు వాడు కాబట్టి, వ్రాస్తున్నది తెలుగు ప్రబంధ కావ్యం కాబట్టి, తన తెలుగు అక్షరాల్లా ఆమె అందంగా ఉందని ఒక అద్భుత భావన చేశాడు.
తెలుగు వ్రాతపతిని చూసినప్పుడు దీర్ఘాలు, తలకట్లు, సున్నాలు ఎంతో అందంగా అమరిన పంక్తులు ఇవన్నీ మన వ్రాతఫలమా అన్నట్టు చూడముచ్చటగా ఉంటాయి. సుభద్ర కూడా అలానే ఉన్నదిట!
ఆమె కన్నులు దీర్ఘాల్లా ఉన్నాయి. ఆమె నవ్వుముఖం తలకట్టు (గుడి)లాగా, తుమ్మిపూవులాగా, పున్నమి చంద్రుడిలాగా గుండ్రంగా వెలిగి పోతోంది. ఇంక పొక్కిలి అంటే నాభి. దాని (శ అక్షరం లాగా శంఖాకృతిలోఉన్న) అందం చెప్పనక్కరలేనంత గొప్పగా ఉంది. ఇలా వర్ణిస్తూ, పయోధరాల దగ్గరకు వచ్చే సరికి అవి  మేలు బంతుల్లా ఉన్నాయంటాడు... పైకి ఈ అర్ధంలోనే అన్నట్టు కనిపిస్తుందిగానీ, ఒక మహా కవి అంత స్థాయి తక్కువగా అని ఉంటాడా...? లేదు ఇంకేదో నిగూడార్ధం ఉండే ఉంటుంది...! ఇక్కడ మనం వ్రాతఫలం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, మేలుబంతులు అంటే చక్కగా అక్షరాలు పొదిగిన వ్రాత పంక్తులతో ఆమె పాలిండ్లను పోల్చాడన్నమాట కవి. పాలిండ్ల విషయంలో పంక్తిని బంతి అనటమే చమత్కారం. ఇంక నడుము విషయానికి వస్తే, అది ఉన్నట్టా లేనట్టా అన్నట్టు సున్నాలాగా ఉందంటాడు.

చేమకూర వేంకట కవి మాతృభాషాభిమానం అంతా ఈ పద్యంలో గూడు కట్టుకుని ఉంది. తెలుగు భాషలోని అక్షర సోయగాన్ని ఒక మహా సౌందర్యవతి అవయవ శోభతో పోల్చే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. మన భాష వరవర్ణిని అనీ, మనది వ్రాతఫలం కలిగిన అంటే అద్భుత సాహిత్య సంపద కలిగిన భాష అనీ చాటి చెప్పదలచుకున్నాడాయన. మహాకవి కాబట్టి మన అక్షర వైభవాన్ని సుభద్రకు ఆపాదిస్తూ ఈ పద్యం వ్రాశాడు. అది మన వ్రాతఫలం.