Tuesday 30 December 2014

“నాంచారమ్మ కథ” డా. జి వి పూర్ణచందు


“నాంచారమ్మ కథ”
డా. జి వి పూర్ణచందు
“అలరుల నందనంబున
అలరారుచు నొక్క కన్య యావిర్భవమై
అలసీత మున్ను భూమిని
చెలువుగ నుదయించినట్లు శ్రీయొప్పారెన్”
          శ్రీ విల్లిపుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవిని మోక్ష సంపదలిచ్చేది కాబట్టి చూడికొడుత్తవళ్ అని తమిళులు పిలుస్తారు. ‘చూడికొడుత్త నా(చ్చారు’ ఆమె పేరు. నాచ్చియార్ అని ‘య’కారంతో పలకాలి. ఈమెనే `నాంచారు’ అంటారు తెలుగువాళ్ళు. తెలుగువాళ్లలో నాంచారయ్యలూ, నాంచారమ్మలూ చాలామంది ఉన్నారు. ఈమెకు ఆండాల్ (రక్షకురాలు), కోదై (పూలమాల), అనే పేర్లుకూడా ఉన్నాయి. కోదై అనేది తమిళభాషలో ప్రాచీన రూపం ‘గోద’ అనేది దాని ఆధునిక రూపంగా పండితులు చెప్తారు.  కృష్ణదేవరాయలు ఈ గోదాదేవి జీవిత చరిత్రని ఆముక్తమాల్యద కావ్యంగా మలిచాడు.
పండుని కొరికి తియ్యగా ఉన్నదాన్నే శబరి రాముడికి సమర్పించినట్టు , నాంచారు కూడా తాను ధరించి బాగున్నదని సంతృప్తి చెందాకనే పూలమాలను స్వామికి సమర్పించేది. జనకుడికి తన పొలంలో సీతాదేవి దొరికినట్టు, విష్ణుచిత్తుడికి తన పూలతోటలో, తులసి మొక్కల దగ్గర ఈ నాంచారు దొరికింది. జనకుని కుమార్తెగా, రాముని భార్యగా సీత పూజనీయం ఐతే, విష్ణుచిత్తుని కుమార్తెగా, ఆ శ్రీ మహావిష్ణువు భార్యగా, భూదేవి అవతారంగా నాంచారు పూజ లందుకుంది. ఇది అతి సామాన్యుడిక్కూడా తట్టే పోలిక.
కానీ, కృష్ణదేవరాయలు ఆ పుష్పవనంలోఒక్కబాలంకనుగొనెఅని మాత్రమే ఆముక్తమాల్యద కావ్యంలో వ్రాశాడు. ‘అయోనిజ’ లాగా సీతాదేవి దొరికిందని వ్రాయలేదు. ఆ పూలతోటలో కాముకులు స్వేఛ్ఛగా తిరగటాన్ని అదే ఆశ్వాసంలో “ఒకనాడామ్రాంకు రౌఘం” అనే పద్యంలో వర్ణించటం చేత, ఏ పెళ్ళికాని తల్లో, తండ్రో ఆ పసిగుడ్డుని ఈ పూలతోటలో వదిలి వెళ్ళినట్టు నర్మగర్భంగా సూచించాడు.
దేవాతామూర్తిగా పూజలందుకున్న వ్యక్తి చరిత్ర కాబట్టి ఎన్ని మహత్తుల నైనా ఆపాదించి రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రాయలు సామాజిక దృష్టి తోనే ఆముక్తమాల్యద కావ్య రచనచేశాడని దీన్ని బట్టి భావించాలి.
కానీ, సీత పొలంలో దొరికినట్టే, గోదాదేవి పూదోటలో దొరికినట్టు రాయల తరువాతి కవులు పోల్చే ప్రయత్నం చేశారు. పైన పేర్కొన్న పద్యం 17వ శతాబ్దికి చెందిన నందవర భాష్కర శేషాచలామాత్యుడు గారి “నా(చ్చారు పరిణయం” కావ్యంలోది అలరులు నిండిన ఆ తోటలో అలరారె ఒక పాపాయి అలనాడు సీత భూమిలో దొరికి నట్టు చెలువుగ ఉదయించింది వెలుగులు నిండగా!” అంటాడీ పద్యంలో నందవరకవి. తాళ్ళపాక తిరువేంగళ నాథుడు కూడా ‘పరమయోగి విలాసం’లో ఇదే అర్థంలో వర్ణించాడు. ఎవరి భక్తి వాళ్ళది! కొందరికి దేవుడు ముఖ్యం. కొందరికి సమాజమేదేవుడు!
          నా(చ్చారుపరిణయంకావ్యాన్ని‘రాజుపాళయం’లో తెలుగుని కాపాడాలనే ఏకైక నినాదంతో ఆవిర్భవించిన తెలుగు విద్యాలయం పక్షాన 1987లో ప్రచురించారు. యక్షగాన సాంప్రదాయంలో వెలువడిన గొప్ప కావ్యం ఇది.
 రాజుపాళ్యం తెలుగు విద్యాలయ వ్యవస్థాపకులు కీ. శే. ముదునూరి జగన్నాథ రాజు తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయుడు. ఆయన బహుభాషా ప్రవీణ. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో కూడా అనేక రచనలు చేసిన వ్యక్తి. తమిళనాడులో  నివసిస్తున్న తెలుగు వాళ్ళు తమ మనుగడను కాపాడుకుంటూ, తమ భాషను కాపాడుకుంటూ పడుతున్న శ్రమని జగన్నాథ రాజు గారి రచనల్లో మనం గమనించవచ్చు. 2013 డిసెంబరులో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి రాజుపాళ్యం పరిసరాల్లో తెలుగు వారి స్థితిగతులను అధ్యయనం చేయటానికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంలో కీ.శే. ముదునూరి జగన్నాథ రాజుగారి ఇంటిని సందర్శించాము. ఆయన కుమార్తె, అల్లుడు రాధాకృష్ణరాజుగారు అంకితభావంతో జగన్నాథరాజు గారి స్మృతుల్ని పదిలపరచిన తీరు ఆశ్చర్యం కలిగించింది. రెండస్థులమేడలో జగన్నాథ రాజుగారి గ్రంథాలను వాళ్ళిద్దరూ పెద్ద తెలుగు గ్రంథాలయంగా నడుపుతున్నారు. పెద్దల ఆశయాలను కొనసాగించే సంతతి అపురూపం అయిన ఈ రోజుల్లో జగన్నాథ రాజుగారిని వాళ్ళు చిరస్మరణీయుణ్ణి చేస్తున్నారు.


వంటింటి నుండి మింటింటిదాకా... మహిళాభిరామం! డా. జి వి పూర్ణచందు

వంటింటి నుండి మింటింటిదాకా... మహిళాభిరామం!
డా. జి వి పూర్ణచందు

లేచింది, నిద్రలేచింది మహిళాలోకం అంటూ వ్యంగ్య భాణాలు ఎన్ని తగిలినా  మహిళా శక్తి ఒక నిర్ణాయకమైనదిగానే  రాణిస్తోంది. వంటింటినుండి మింటింటిదాకా, గగనసీమలు దాటగలిగిన మహిళా శక్తిని ఆపగలిగే శక్తి మగాళ్ళకు లేదిప్పుడు.
మహిళ అంటే చదువుల తల్లి. మహిళ అంటే ఐశ్వర్య లక్శ్మి.మహిళ అంటే ఆదిశక్తి. మహిళ అంటే విఙ్ఞానగని. ‘విఙ్ఞానఘని’ కూడా! కలాలూ పడుతున్నారు, హలాలూ పడ్తున్నారు, వస్తాదులకన్నా మిన్నగా కుస్తీలూ పడుతున్నారు. పాలిస్తున్నారు, శాసిస్తున్నారు. భవిష్యత్తును శ్వాసిస్తున్నారు.
మణిపూర్‌లోని మారుమూల పల్లెలో ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన ‘మేరీకోమ్’ ఎన్నో అవాంతరాలను దాటి అంతర్జాతీయ బాక్సర్‌గా పేరు తెచ్చుకో గలిగింది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఐదుసార్లు అంతర్జాతీయ బాక్సర్‌గా నిలిచింది. ఆమె జీవితం ఎంతోమంది యువతులకు స్ఫూర్తిదాయకమైంది. కష్టాలు వెన్నాడినా కఠోర శ్రమ చేస్తే అద్భుతాలను సాధించవచ్చని మేరీకోమ్ నిరూపించింది, శారీరక, మానసిక వికాసానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి బాక్సింగ్‌కు మించిన క్రీడ మరొకటి లేదని ఇప్పుడు చాలామంది యువతులు భావిస్తున్నారు.
          ప్రపంచాన్ని మహిళలు నడిపిస్తే ఆయుధాల ఖర్చు సైనిక వ్యయాలూ తగ్గిపోతాయనీ, ప్రపంచంలో మానవులంతా తన కన్నబిడ్డల్లాంటివాళ్ళే ననుకోగలిగే మనసు మహిళలకే ఉంటుంది కాబట్టి స్త్రీలకు ప్రపంచనాయకత్వం అప్పగిస్తే యుద్ధాల పీడ తగ్గిపోయి, విశ్వశాంతి సుసాధ్యం అవుతుందనీ మహిళాభ్యుదయ నాయకులంటారు.
ఆడవాళ్ళ ఆలోచనా తీరు మాగాళ్ళు రూపొందించే పాలనా వ్యవస్థకు అందదు. అందుకునే దృష్టికూడా వాళ్ళకు లేదు. అందుకే మహిళాభ్యుదయం మనదేశంలో కొంచెం ఆలస్యంగా నడుస్తుంది.
అరవై యేళ్ళ ముసిలోడికి ఏడేళ్ళ బాలికనివ్వటానికి తాంబూలా లిచ్చేసి, తన్నుకు చావమంటాడుకన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు. మాట మాత్రం అయినా చెప్పలేదేమని భార్య అడిగితే ఆడముం..లతోనా వ్యవహారాలు?”.అని ఈసడిస్తాడు. అది అప్పటి మాట. ఈ రోజున అలా అనగలిగే ధైర్యం మగాళ్ళకు లేదు. “మా అమ్మాయి ఓకే చేస్తే మీకు కబురు పెడతాను” అంటున్నాడు పిల్లతండ్రి. అది మహిళాభ్యుదయం సాధించిన ఒక ముందడుగు.
భారతదేశంలో ఇలాంటి ముందడుగులు వేగంగా పడాలంటే కొంచెం కష్టమే! పురుషుడి చుట్టూ అల్లుకున్న సామాజిక వ్యవస్థ మహిళల నిర్ణాయక శక్తిని అడ్డుకుంటుంది. కంప్యూటర్ యుగం అని చెప్పుకుంటున్నా రకాల అణచివేతలు తప్పటం లేదు. అన్ని అవరోధాలూ అధిగమించి సమాజంలో ఉన్నత స్థానాలకు పోటీ పడుతూ ఆడవాళ్ళు బయటికొస్తున్న కొద్దీ, లింగ వివక్ష, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగాలలో పనిభారం, శారీరక మానసిక ఒత్తిడి ఇంటా బయటా బరువు బాధ్యతలు అన్నీ భరిస్తున్నా ఇంట్లో మామూలు గృహిణి బాధ్యతల విషయంలో మగాళ్ల ఈసడింపులు మామూలుగానే ఉంటున్నాయి.  బయట తన ఆఫీసులో బాసే అయినా ఇంట్లో బానిసే అన్నట్టుంది చాలా మంది ఉద్యోగినుల పరిస్థితి. అందువలన, స్త్రీశక్తి తాబేలు నడక నడుస్తోంది. మహిళాభ్యుదయ లక్ష్యం లూపులైనులో నిలబడిపోతోంది.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడిచిన రోజుల్లో  ముత్తాత నుండి మునిమనవరాలిదాకా అనేకమంది ఉండేవారు కాబట్టి, ఆ రొజుల్లో మానవ సంబంధాల గురించి, స్త్రీ పురుషుల పరస్పర గౌరవ సంబంధాల గురించి పౌష్టిక ఆహారం గురించి, పిల్లలకు గ్రహింపు ఎక్కువగా ఉండేది. మనం పరిమిత కుటుంబంలోకీ, ఇంకా అత్యంత పరిమిత కుటుంబ వ్యవస్థలోకీ మారాక ఈనాటి తరానికి సామాజిక జీవన వ్యవస్థ గురించి ప్రతీదీ వివరించి చెప్పవలసిన పరిస్థితి ఉంది. హాస్టళ్లలో చదువులు, ర్యాంకుల వేట, అమెరికా ఉద్యోగాల కారణంగా తల్లిదండ్రులతో కూడా పిల్లలకు బలమైన బంధాలు ఏర్పడటం రానురానూ తగ్గిపోతోంది. అందువలన ఆరోగ్యవంతమైన కుటుంబవ్యవస్థ గురించిన అవగాహన ఈ తరానికి అంతగా ఉండటంలేదు.
‘మహిళాభిరామం’ అంటే మహిళలకు సముచితస్థానం కల్పించడానికి, సమాజ వైఖరిలో మార్పు తేవడం అని! మన విద్యా విధానం మహిళా సాధికారత పరంగా ఉండాలి. తమ హక్కులగురించి ఆడపిల్లలు తెలుసుకునేలాగానూ, స్త్రీల సమాన హక్కులను గౌరవించే బాధ్యతని మగపిల్లలు గ్రహించేలాగానూ పాఠ్యాంశాలు ఉండాలి. సెక్సు ఎడ్యుకేషన్ కాదు. ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఈ తరానికి అవసరం. మహిళా సాధాకారికత గురించి అపోహలు లేని అవగాహనని ఆడ మగ ఇద్దరికీ సమానంగా కలిగించే చదువులు స్త్రీ పురుషుల మధ్య పరస్పర గౌరవం గురించి బోధించే చదువులు కావాలిప్పుడు!
ఏ దేశంలో మహిళలు జాగృతంగా ఉంటారో ఆ దేశంలో శాంతి వర్థిల్లుతుంది. ఆడవాళ్ల చదువుని వ్యతిరేకించే ఉగ్రవాదులతో పోరాడిన ‘మలాలా’ అత్యంత పిన్న వయసులో నోబెల్  శాంతి బహుమతిని గెలుచుకున్న వ్యక్తిగానూ, తొలి పాకిస్తానీ మహిళగానూ  ఆదర్శప్రాయంగా నిలబడింది. పోరాట పటిమను అలవాటు చేసుకుంటే పోయేదేమీ లేదు... అశాంతి, అఙ్ఞానం, అవిద్య, అవమానాలు తప్ప!
మహిళా చైతన్యానికి కంకణధారిగా, మరోమరియా మాంటిస్సోరీగా ఙ్ఞానదాత డా. కోటేశ్వరమ్మగారు నేర్పించే చదువులు ఇలా ‘మహిళాభిరామభావన’ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మహిళలకు  తమ హక్కులు తెలిసేలా వాళ్ళ ఙ్ఞానం పెరిగేందుకు ‘మాంటిస్సోరీ మాత నిర్వహించే కార్యక్రమాలు గొప్పవి. ఎందరో ప్రముఖ మహిళల జీవిత చరిత్రల్ని ఆమె వ్రాశారు. సమాజ అభ్యున్నతిలో మహిళల భాగస్వామ్యం పైన అత్యధిక రచనలు చేసిన వ్యక్తిగా ఆమె కీర్తి గడించారు.తమ విద్యార్థినుల్లో ఆత్మగౌరవం పెంపొందింపచేయటం, మనోబలాన్ని నూరిపోయటం, మార్గదర్శనం చేయటం ఆమె బోధనావిధానంగా ఉంటుంది.   
బెజవాడ మాంటిస్సోరీ విద్యాసంస్థలు ఈ రోజున వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఇంచుమించు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి తెలుగు మహిళా జాగృతికే అంకితమైన డా. వేగే కోటేశ్వరమ్మగారి చదువుల గుడి ‘మహిళాభిరామాలయం’గా నిలిచింది. ఆ చదువులతల్లికి ప్రణామాలు.  
                     



Monday 22 December 2014

కా... కా... కవులు :: డా. జి వి పూర్ణచందు

కా... కా... కవులు
డా. జి వి పూర్ణచందు
నింబ వృక్షమునందు నెగడు కాకములట్లు..., పల్లెలయందూర బందులట్లు..., అవివేకులగు నరపతుల చెంత బందలగు పండితులు గొందఱుందురట్టి వారికిని జేయుదును గొన్ని వందనములు
పూర్వ కవులు తమ కావ్యాలలో ఉపోద్ఘాతాలు వ్రాసేప్పుడు మంచి కవుల్నిపొగుడుతూ(సుకవిస్తుతి), చెడ్డకవుల్ని తిడుతూ(కుకవినింద) వ్రాయటం ఒక ఆచారంగా పాటించేవారు. తాను మంచికవుల కోవలోకి వస్తానని చెప్పుకోవటం కూడా కొందరి ఉద్ధేశం కావచ్చు. అడగందే అమ్మైనా పెట్టనట్టు చెప్పుకోనిదే తెలియదనే భావన కూడా ఉండవచ్చు.
19 శతాబ్దినాటి భరతాభ్యుదయంకావ్యంలో మాడభూషి వేంకటాచార్యకవి చేసిన కుకవినిందపద్యం ఇది. ఆనాటి బ్రిటిష్యుగంలో తెలుగు కవుల పరిస్థితికి, ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తెలుగు కవుల పరిస్థితికి ఏమీ తేడా లేదని ఈ పద్యం చదివితే అర్థం అవుతుంది.
నింబవృక్షమునందు నెగడు కాకములట్లు: వేపచెట్టు మీద చేరిన కాకుల్లాగా కొందరు కవులు ఉంటారు
పల్లెలందూరబందులట్లు: పల్లెల్లో మురుగ్గుంటల్లో దొర్లే ఊరపందుల్లాగా ఇంకొందరుంటారు
అవివేకులగు నరపతులచెంత బందలగు పండితులు గొందఱుందురు: జమీందార్లు, వ్యాపార్లు, డబ్బున్నఆసాములు, వీళ్ళకి సాహిత్యం గురించి ఏమీ తెలియక పోయినప్పటికీ కాకా ఘనులైన కొందరు వాళ్లని ఆశ్రయించి బతుకుతుంటారు.
అట్టి వారికిని జేయుదును గొన్ని వందనములు: అలాంటి కా...కా... కవులకు వందనం చేస్తున్నాను...అంటాడు కవి.
కవులకూ, కళాకారులకు సంబంధించిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కాలంలో అయినా, కాలంలో అయినా ఇలా వేపచెట్టు మీద కాకులూ, బురదలో పొర్లే ఊరపందులూ, కాకారాయుళ్ళతో నిండి ఉండటం, వాళ్ళవలన అవి భ్రష్టు పట్టటం అనాదిగా ఉన్నదే! తెనాలి రామకృష్ణ సినిమాలో రాజదర్శనం కోరిన కవికి ఎవరు ఎలా అడ్డుపడతారో చక్కగా చూపిస్తాడు.  బ్రిటీష్ యుగంలో ఇది మితిమీరింది. జమీందార్లు, భూస్వాములూ, రాజా బిరుదు కోసం తాపత్రయపడే వాళ్ళూ చాలా మంది అపర భోజుడనిపించుకోవాలనే తపనతో కవులకు, కళాకారులకూ ఎంగిలి చెయ్యి విదిల్చి, కన్నీటి తుడుపు సాయం చేసిన వాళ్ళే ఎక్కువ! ఆ రోజుల్లో కూడా కవులలో పూట గడవని వాళ్ళూ, రాజాదరణని ఒక యోగ్యతగా భావించిన వాళ్ళూ ఇద్దరూ ఉండేవాళ్ళు. కానీ, నాలుగు పొగడుబోతు పద్యాలు ఆశువుగా దట్టించి, ఇచ్చింది పుచ్చుకు పోయే వసూలు కవిరాజుల్ని ముఖ్యంగా వేపచెట్టు మీద కాకులతో పోల్చాడు కవి!
స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితి ఘోరంగా మారింది. వేపచెట్లూ, వాటి మీద కాకులూ... బురదలూ, వాటిలో పొర్లే పందులూ... పేర్ల మార్పుతో మరింత అసహ్యంగా కొనసాగాయి. రాజాలూ, జమీందార్లు పోయి కవుల్నీ కళాకారుల్ని పోషించే బాధ్యతని అకాడెమీలూ, సాంస్కృతిక శాఖలు, వ్యాపారం చేసుకునే ఇతర సాహితీ సాంస్కృతిక సంస్థలూ స్వీకరించాక వాటికి విలువ కూడా తగ్గి పోయింది.  
నార్లవారితో వేసిన కమిటీ అకాడెమీల రద్దును సూచించింది. కానీ, తరువాత కాకా బాకాల ప్రాధాన్యత పెరిగిందే గానీ తగ్గలేదు. పైగా వీళ్ళ వలన జరిగే నష్టం పావలా అయితే, అకాడెమీలను రద్దు చేసినందు వలన కలిగిన నష్టం
రూపాయి అయ్యింది. అది ఇప్పుడు పూడ్చ లేనిది కూడా!
చిన్న చిన్న సంస్థలనుండి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సంస్థల వరకూ ఇచ్చే పురస్కారాలు, పుస్తక ప్రచురణ సహకారాలు అర్హులకు చేరటంలో దారుణమైన అన్యాయం జరుగుతోంది. బాపూగారికి పద్మశ్రీ ఇవ్వకపోతే అవమానం పద్మశ్రీలు ఇచ్చే వ్యవస్థకు గానీ, బాపూ గారికి కాదు కదా!
కవిగారు ఇలా అన్నాడు: నిష్కారుణ్య మాత్సర్య భావమె కాకాఘను లుండకున్న నల దేవానాం ప్రియశ్రేణి కెట్లమరుం గీర్తి?నిష్కారుణ్య మాత్సర్య బావాలున్న కాకా ఘనులే ఉండకపోతే దేవానాం ప్రియులకు కీర్తి ఎలా అమరు తుందని ప్రశ్నిస్తాడు.
తంజావూరు నాయకరాజు అచ్యుతప్ప నాయకుడు 16 శతాబ్దిలో తెలుగు యక్షగాన మేళా కోసం కళాకారులకు జీవనభృతిని కల్పిస్తూ మేలట్టూరు అనే ఊరు ఏర్పరిచాడు. అలాగే శాహాజీ అనే తంజావూరు మరాఠారాజు తన రాజ్యం లోని తెలుగు కవులందరి కోసం తిరువశ వల్లూరు లేదా శాహాజీ పురం గ్రామాన్ని ఇచ్చాడు. భాగవతులైన నాట్య కళా కారులకు తానీషా ప్రభువు కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చాడు. అందుకే, వాళ్ళు జనం నాలుకలమీద బతికున్నారు. ఇవ్వని వాణ్ణి తలచుకునేదేం ఉంటుందీ...?
తిరుపతి వెంకటకవులకు బహుమానం ఇద్దామని ఆత్మకూరు జమీందారు అనుకున్నాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక అధికారి(అధిక+అరి)అడ్డుపడి, వాళ్ళు సొల్లు కవిత్వం చెప్తారనీ, పండితులు కాదనీ, ఇలాంటి కానుకలు పండితుల కిస్తే పుణ్యం వస్తుందనీ అన్నాడట. దాంతో జమీందారుగారు తన ప్రయత్నం విరమించుకున్నాడు. అది తెలిసి తిరుపతి కవులు శనిగ్రహంఅనే పేరుతో అధికారి మీద 27 పద్యాల చిన్న పుస్తకం వ్రాశారు. కుంకా! పాపమటంచు నెంచక వృథా కొండెమ్ములన్ రాజుతో బింక మొప్పగ జెప్పి యాతని మదిన్ ద్వేషమ్ము పుట్టించి తీవింకం జేసెడిదేమి లేదు కద? నిన్నేమందుము? పైన మా చంకన్నాకు చండాల! శనిగ్రహంబ...ఇలా ఉంటాయా తిట్లు.

చంకన్నాకు చండాలా అని తిట్టినంత మాత్రాన, పదవిని అడ్డం పెట్టుకునే అలాంటి శనిగ్రహాలకు ఊడేదేం ఉండక పోవచ్చు. కానీ, మహా కవుల తిట్లు తగలవా? ముఖ్యంగా కవులూ, కళాకారుల దగ్గరా, అవేవీ కాని వాళ్ళ దగ్గరా డబ్బులు తీసుకుని పురస్కారాలిచ్చే వాణిజ్య సాంస్కృతిక సంస్థల వాళ్ళకి మాడభూషి వారు తిట్టిన పందులు దొర్లే బురద, కాకులు చేరే వేపచెట్టు తిట్లు తప్పక తగులుతాయి.