Friday 28 February 2014

నల్లేరు వడియాలు :: డా.జివి.పూర్ణచందు

 నల్లేరు వడియాలు

డా.జివి.పూర్ణచందు

తింటానికి ఇంకేమీ దొరకలేదా...నల్లేరుకాడలు తిని బతకాలా..అని ఎవరూ అనుకోకుండా ఉంటే ఎముకలు మెత్తపడిపోయే పరిస్థితులకూఎముకలు విరిగి అతకటం ఆలశ్యం అవుతున్న పరిస్థితులకూ నల్లేరు ఆహార వైద్యమేనని గుర్తించ గలుగుతాం. నల్లేరుమీది బండిలాగా మన నడక సాగాలంటేమనం అప్పుడప్పుడూ అయినా నల్లేరు కాడలతో నచ్చిన వంటకాన్ని చేసుకు తినాలన్నమాట! గిరిజన వైద్యంలో పాము కరిచిన చోట రాగి రేకు గానీ రాగి పైసా గానీ ఉంచి దానిమీద నల్లేరు కాడలను దంచిన గుజ్జుని పట్టించి కట్టు గడతారు. విష౦ ఎక్కకుండా ఉంటుందని అనుభవ వైద్య౦. సాక్షాత్తూ విషానికే విరుగుడయిన ఈ నల్లేరు శరీరంలో విషదోషాలకు ఇంకెంత విరుగుడుగా పని చేస్తుందో ఆలోచించండీ...!

అనాలోచితంగా ఆవేశపడే వాళ్ళు౦టారనిఒక చమత్కార కవి నల్లేరుకాడలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఒక సరదా తెలుగు చాటువులో కనిపిస్తుంది
         నల్లీనదీ సంయుక్తం/విచారఫలమేవచ
         గోపత్నీ సమాయత్తం/గ్రామ చూర్ణంచ వ్యంజనం

         ఈ చాటువుని ఎవరు రాశారో తెలియదు గానీగొప్ప వంటకాన్ని మాత్రం చక్కగా విడమరిచారు. నల్లీ నదీ సంయుక్తం” అంటే నల్లి అనే ఏరు= నల్లేరుతో ఈ వంటకం తయారౌతోందన్నమాట. అందులో కలప వలసిన వాటిని చెప్తూ, “విచారఫలమేవచ” అంటున్నాడు. విచారఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు అవుతుంది. లేత నల్లేరు కాడల్ని తీసుకొని దంచితగినంత చింతపండు వేసి రుబ్బుతూ, “గోపత్నీ సమాయత్తం” -గోపత్నిని సమాయత్తం చేసుకోమంటున్నాడు. గోపత్నిని తెలుగులోకి మారిస్తే ఆవు+ఆలు=ఆవాలు అవుతుంది. నల్లేరు చింతపండు కలిపి రుబ్బుతూ అందులో తగినంత ఆవపిండి కలిపి, “గ్రామచూర్ణం” తయారు చేసుకోమంటున్నాడు. గ్రామచూర్ణాన్ని తెలుగులోకి మారిస్తే ఊరుపిండి అవుతుంది. వడియాలు పెట్టుకొనేందుకు మినప్పప్పు వేసి రుబ్బిన పిండిని ఊరుపిండిఊరుబిండి లేక ఊర్బిండి అంటారు. ఆ పిండితో వడియాలు పెట్టుకుంటే కమ్మగా నేతిలో వేయించుకొని తినవచ్చు. రుచికరంగా ఉంటాయి. ఎముక పుష్టినిస్తాయి. లేదా అట్లు పోసుకొని తినవచ్చు. లేక మినప్పప్పు కలపకుండా తక్కినవాటిని యథా విధిగా రుబ్బి తాలింపు పెట్టుకుంటే నల్లేరు కాడల పచ్చడి అవుతుంది. వీటిలో ఏది చేసుకున్నా మంచిదే! ఈ నల్లేరు వడియాలను చాదువడియాలు” అంటారు. ఇంత అందమైన పేరు ఈ వడియాల కుందంటేమన పూర్వీకులు ఈ నల్లేరు కాడల్ని తోటకూర కాడలుగా వంటకాలు చేసుకోవటానికి బాగానే వాడే వారని అర్థం! మనం ఇలాంటివి పోగొట్టుకుంటేసాంస్కృతిక వారసత్వాన్నే కాదుసాంస్కృతిక సంపదను కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం.
లేత నల్లేరుకాడలను కణుపుల దగ్గర నరికి వాటిని తీసేస్తేలేత కాడలు వంటకాలకు పనికొస్తాయి. చింతపండును వేయమన్నారు కదా అని వేసేయకుండా చాలా తక్కువగా వాడండి. నల్లేరుకు కడుపులో నొప్పి తగ్గి౦చే గుణం ఉంది. చింతపండు అతిగా వాడితే ఆ గుణం దెబ్బతింటుంది. పైనేం కారణంగా ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ అకారణంగా వచ్చే దగ్గు జలుబుఆయాసం తగ్గి౦చటానికి ఇది మంచి ఔషధం. కాడల్నితరిగి కుమ్ములో పెట్టిగానీకుక్కర్లో పెట్టిగానీ ఉడికించి రసం తీసిరెండుమూడు చె౦చాల మోతాదులో తీసుకొని సమానంగా తేనె కలుపుకొని తాగితే ఏ గుణాలు వస్తాయో అవే గుణాలు నల్లేరు పచ్చడికినల్లేరు దోశెలకునల్లేరు వడియాలకు ఉంటాయని ఇక్కడ మనం గమనించాలి.
నల్లేరు కాడల్ని పైన చెప్పినవాటిల్లో మీకిష్టమైన వంటకంగా చేసుకొని కమ్మగా తినండి. ఎలర్జీ వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఎముక పుష్టినిస్తుంది. కీళ్ళు అరిగిపోయాయని డాక్టర్లు చెప్పే మోకాళ్ళ నొప్పినడుం నొప్పివెన్నునొప్పి తగ్గటానికి ఇది మంచి ఉపాయం. మొలల తీవ్రతను తగ్గిస్తుంది. విరేచనం అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. అజీర్తిని పోగొడుతుంది. నల్లేరు వడియాలు కఫ దోషాలను పోగొడతాయి. నల్లేరు అట్లు వాతాన్ని తగ్గిస్తాయి. నల్లేరు కాడల పచ్చడి కీళ్ళనొప్పుల్నీకాళ్ళనొప్పుల్నీనడు౦ నొప్పినీపైత్యాన్ని తగిస్తుంది. అయితే పరిమితంగా తినాలి. లేకపోతే వేడి చేస్తుందంటారు. వాతాన్ని తగ్గి౦చే ద్రవ్యాలు
 వేడిని సహజంగా పెంచుతాయి. బదులుగా చలవ చేసేవి తీసుకో గలిగితే వేడి కలగదు.

నల్లేరు కాడలు రోడ్డు పక్కన కంపలమీద తీగలా పాకుతూ పెరుగుతాయి. నడి వయసు దాటిన పెద్దవాళ్ళకీఎదిగే శరీరులైన పిల్లలకు తప్పనిసరిగా నల్లేరు కాడల వంటకాలు పెడుతూ ఉండాలి.

వృక్షశాస్త్ర పరంగా సిస్సస్ క్వాడ్రా౦గ్యులారిస్” అనే పేరుతో పిలిచే ఈ నలు పలకల కాడలున్న నల్లేరు కాడల్నీ. ఆకుల్ని కూడా ఎండించి మెత్తగా దంచిన పొడిని జీర్ణకోశ వ్యాధుల్లో ప్రయోగిస్తుంటారు. బహిష్టు సక్రమంగా రాని స్త్రీలకు నల్లేరు కాడ మేలుచేస్తుందని శాస్త్రం చెప్తో౦ది. మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలకు నల్లేరు కాడల అవసరం ఎంతయినా ఉందన్నమాట! ఆ వయసులోనే ఎముకలు శక్తినీధృఢత్వాన్నీ కోల్పోయిగోగుపుల్లల్లాగా తయారవుతాయి. పళ్లలోంచిచిగుళ్లలోంచి రక్తం కారుతున్న స్కర్వీ వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. 
ఎముకలు విరిగినచోట అనుభవం మీద కట్లు కట్టే వారిలో చాలామంది నల్లేరు గుజ్జును పట్టించి కట్టు కడుతుంటారు. నల్లేరులో కాల్షియమ్ ఆగ్జలేట్స్కెరోటీన్ బాగా ఉన్నాయి. సి విటమిన్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ చెడకుండామనకు దక్కాలంటేచాదు వడియాలుదొశెలుపచ్చడి లాంటి వంటకాలను నల్లేరు కాడలతో చేసుకోవటం అవసరం. మూత్రంలోంచి కాల్షియం ఆగ్జలేట్ పలుకులు పోతున్నవారు తప్ప అందరూ దీన్ని అనుమానం లేకుండా తినవచ్చు. ఎక్కువసేపు ఊడికించకుండానూ, వేయించకుండానూ వండకుంటే సి విటమిన్” పూర్తిగా దక్కుతుంది.