Sunday 7 June 2015

పేదకూళ్ళు - జాతికూళ్ళు :: డా. జి.వి. పూర్ణచందు

పేదకూళ్ళు - జాతికూళ్ళు
డా. జి.వి. పూర్ణచందు

గురుగుం జెంచలి దుమ్మి లేదగిరిసాకుం దింత్రిణీపల్లవో
త్కరముం గూడ బొరంటి నూనియలతో గట్టారు కుట్టారుకో
గిరము ల్మెక్కి, తమిం బసుల్పొలము వో గ్రేపు ల్మెయి న్నాక, మే
కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్”

గురుగుకూర, పులిచెంచలికూర, తుమ్మికూర, లేత గరిసాకు, చింత చిగురు... బహుశా ఈ తరం వాళ్ళకి ఈ ఆకుకూరలు పెద్దగా తెలియక పోవచ్చు. చింతచెట్లు ఆంధ్ర ప్రాంతానికి బాటచెట్లుగాఉన్నా, చింతచిగురు అత్యంత ఖరీదైన ఆకుకూరయ్యింది.

కృష్ణదేవరాయలు వర్షాకాలంలో రెడ్డి దొరలు ఇలాంటి ఆకుకూరలతో ఆధరవులు వండుకునే వారంటాడు ఈపద్యంలో! అదేమీ పేదకూడు కాదు, ఆనాటి మధ్య తరగతి ప్రజల ఆహారం. ఆకుకూరని ఉడకబెట్టి నీళ్ళు పిండేసి, ఉడికించిన పెసరపప్పుని కలిపి, నూనె వేసి పొరటిన పొడికూర గురించి ఈ పద్యంలో చెప్తడు. దీన్ని ఫలానా కూర పొరటు అనేవాళ్ళు.

రాయలవారు ఇన్ని ఆకు కూరలు చెప్పాడు గానీ ఇందులో గోంగూర గురించి లేదు. వీటిని వండుకోవటానికి చింతపండు, మిరపకాయలు కూడా చెప్పలేదు. రాయల వారి కాలం తర్వాతే మిరపకాయలు తెలుగిళ్ళని ఆక్రమించాయి. మన వంటకాల స్వరూప స్వభావాలను మార్చేశాయి.

తెలుగు వారి ఆహార  చరిత్రను మిరపకారానికి ముందు యుగం, తరువాతి యుగం అని రెండుయుగాలుగా విభజించ వలసి ఉంటుంది. మిరప కాయలకు తెలుగువారు బాగా అలవాటుపడ్డాక, డచ్చి, పోర్చుగీసులు ఆనాటి తెలుగు వాళ్ల చేత  రకరకాల ఊరగాయల్ని, నిలవుండే ఇతర వంటకాల్ని తయారు చేయించి, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేసే వాళ్లు. అలా, మిరపకాయల కారంతో పెట్టే ఊరుగాయలను తెలుగువారు స్వంతం చేసుకున్నారు. క్రమేణా, తెలుగు వంటకాలు మిరప కాయల చుట్టూ, అనుపానంగా చింతపండు చుట్టూ పరిభ్రమించాయి. ఆవకాయ లేదా ఈనాటి ఊరుగాయ చరిత్ర ఇలా ప్రారంభ మయ్యింది. గోంగూర కూడా అలానే తెలుగు దనానికి పర్యాయం అయ్యింది.

 మిరప కారాన్ని, చింతపండునీ ఉపయోగించి రకరకాల ప్రయోగాలు చేసి ఊరుగాయల్ని, ఊరు పళ్లనీ తయారు చేయటం నేర్చారు. టమోటా, దోస, ఉసిరి వగైరా పళ్లతో పెట్టే వాటిని ఊరుపళ్ళు అన్నారు. ఈ మిరపకాయలు లేని రోజుల్లో చాలా స్వల్పంగా మిరియాల పొడి, శొంఠి, పిప్పళ్ళు వగైరా కారపు ద్రవ్యాల తోనే తెలుగు వంటకాలు తయారయ్యేవి! మిరప రాకతో అవన్నీ వంటగది లోంచి అదృశ్యం అయిపోయాయి.

రాయలవారు చెప్పిన ఈ పద్యం జడివానలు కురిసే వానాకాలంలో ధనికులైన రెడ్లు ఎంత నిశ్చింతగా జీవించారో, చెప్తుంది. ఈ పద్యం రెండోభాగంలో కట్టారు కుట్టారు కోగిరముల్మెక్కి అంటాడు. ఆరికలు అనేవి ఒక రకమైన తృణధాన్యం. వాటిలో ఖనిజాలు, లవణాలు బాగా ఉన్నాయి. బియ్యం కన్నా బలకరంగా,  ఆరోగ్య కరంగా ఉంటాయి. వీటిని కొండలు గుట్టల మీద పోడు వ్యవసాయం చేసి పండించారట. అందుకే, గుట్ట ఆరికలుఅన్నాడు.  బాగా ఆరిన (కడు+ఆరు=కట్టారు) కట్టారు గుట్టారికల అన్నాన్ని జడివాన కురుస్తున్నప్పుడు రెడ్లు తృప్తిగా తిన్నారట.

ఇది మనకు ఉపయోగపడే సమాచారమే! పెద్ద పచారీ కొట్లలో ఇప్పటికీ ఆరికలు దొరుకు తున్నాయి. వాటితో అన్నాన్ని వండుకోవచ్చు. లేదా మరపట్టిన పిండితో రోటీలు చేసుకోవచ్చు.
ఆరోజుల్లోఆరికల్నిఇంకో కూడు గతిలేక తిన్నారేమో గానీ, నేటి రోజుల్లో షుగరు, స్థూలకాయం తగ్గటానికి తప్పకుండా తినవలసిన ధాన్యం అయ్యాయి

పశువులు పొలానికి పోగా దూడలు మాత్రం రైతుల పెరళ్ళలో తిరుగుతూ మంచం ఎక్కి పడుకున్న రెడ్డి దొరగారి పాదాలను నాకుతున్నాయట. ఆమంచం కూడా కుంపట్ల మంచం. వేడి కోసం కుంపట్లో ఎండు మేకపెంటికల్ని ఉంచి, వెలిగించి మంచం కింద పెట్టి మం ఎక్కి పడుకునే వారట.

ఆహారానికి పేదా ధనిక భేదం లేదు. ఉప్పుకూడా కొనలేని పేదవాడి కేవల కారపు అన్నాన్ని ‘గొడ్డు కారం’ అంటారు. ధనికులు తినే ఆహారంలో గొడ్డుకారం, గొడ్డు పులుపు, గొడ్డు ఉప్పు కూడా ఉంటాయి. అదీ తేడా! పేద కూళ్ళలో కనిపించే దేశీయత, జాతీయతఅనేవి సంపన్న భోజనంలోనూ ఉన్నప్పుడే అది జాతికూడు అవుతుంది.