“అరచేతిలో కంప్యూటర్ ఆవిష్కరించిన స్టీవ్ జాబ్స్”
డా. జి. వి. పూర్ణచందు
{కంప్యూటర్ అనే ఒక గొప్ప యంత్రాన్ని వ్యక్తిగత యంత్రంగా మార్చి, దాన్ని జేబులో అమర్చగలిగిన అమెరికన్ సాంకేతిక నిపుణుడు స్టీవ్ జాబ్స్ అనే స్టీవెన్ పాల్ జాబ్స్, 2011 అక్టోబర్ 5న కాలం చేశారు. యాపిల్ కంప్యూటర్ కంపెనీ వ్యవస్థాపకుడు. కంప్యూటర్ ని సామాన్య మానవుడిముంగిట చేర్చటంలో ప్రథాన పాత్రవహి0చాడు. iPod, iPhone, iPad, iCloud లాంటి చిట్టి కంప్యూటర్ల ఆవిష్కర్త. 338 సాంకేతిక ఉపకరణాలకు పేటే0ట్ హక్కులు కలిగి ఉన్న అసాధారణ ప్రతిభావంతుడు. ఇతరులకన్నా వేరుగా ఆలోచించటం ఆయన నైజ0. ఈ ప్రపంచం స్వరూపాన్ని మార్చేయ గలగాలని తలపెట్టి, మార్చి చూపినవాడు. సమాచార సాంకేతికతని సామాన్యుడి ముంగిటకు చేర్చినవాడు. ప్రతిరోజూ ఇదే తనకు చివరి రోజన్నంతగా కష్టపడి పని చేసినవాడు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ల్ గేట్స్, వాల్ట్ డిస్నీ కంపెనీ అధినేత బాగ్ ఐగర్, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వీళ్ళ0తా స్టీవ్ జాబ్స్ మరణంతో సమాచార సాంకేతికతకు తీవ్ర విఘాతం జరిగిందని అన్నారు ఆధునిక సాంకేతికతకు పితామహుడనదగిన స్టీవ్ జాబ్స్ కు నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసం}
“నేను త్వరలోనే చచ్చిపొతాననే జ్ఞాపకమే ఒక సాధనంగా గొప్ప పనులు చేయాలనే తాపత్రయాన్ని నాలో కలిగిస్తూ వచ్చింది. బయటి నుంచి వచ్చే వత్తిళ్ళు, సన్మానాలు, సత్కారాలు, వైఫల్యాలు, సిగ్గుపడే పరిస్థితులు ఇవన్నీ ఆ మృత్యు ముఖం ముందు వెలవెల పోయాయి. ఏది అసలైనదో, ఏది ముఖ్యమైనదో అది మాత్రమే మిగిలింది. నీలో పరాజయాన్ని తెచ్చిపెట్టే అంశాలను తొలగించుకోవాలంటే, చావు దగ్గరలోనే ఉందనే భావన ఎప్పుడూ నీకు గుర్తుకు వస్తూ ఉండాలి. నీలో దాచుకొవాల్సింది ఏమీలేదు. మన హృదయాన్నే అనుసరించక వేరే దారి లేదు. మనకున్న సమయం చాలా తక్కువ. దాన్ని వృధా చేసుకోవద్దు. ఇతరుల మాదిరి ఆలోచించటం, ఇతరుల ఆలోచనల ఫలితాలమీద జీవించటం వలన ఉపయోగం లేదు. ఇతరుల అభిప్రాయాల ధ్వనులు నీ ఆత్మ ధ్వనిని ముంచేయకుండా చూసుకోవాలి” (స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల నుద్ధేశించి 2005లో స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగంలోంచి...)
స్టీవ్ జాబ్స్ 1955 ఫిబ్రవరి 24న విస్కాన్సిన్ లోని గ్రీన్ బేలో ఒక సిరియా మహమ్మదీయుడికి జన్మి0చాడు. ఆర్మీనియా కుటుంబానికి దత్తు వెళ్ళాడు. హైస్కూల్ చదువు కాలిఫోర్నియాలో పూర్తి చేశాడు హైస్కూల్లో చదివేటప్పుడే సెలవల్లో హ్యూలెట్స్ పెకార్డ్స్ కంపెనీలో తాత్కాలికోద్యోగిగా పనిచేశాడు. అక్కడే తనకన్నా ఐదేళ్ళ పెద్దవాడయిన స్టీవ్ వోజ్నైక్ అనే డిజైనర్ తో స్నేహం కుదిరింది. హోమ్ బ్రూ అనే కంప్యూటర్ క్లబ్ లో చేరి వాళ్ళ సమావేశాలకు వెళ్తూ కంప్యూటర్ రంగం మీద ఆసక్తి పెంచుకొన్నాడు. 1972లో పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. ఒక సెమిస్టర్ అయ్యాక ఆ చదువు నచ్చక వేదాంతం, విదేశీ సంస్కృతులలోకి మారాడు. కాలేజీలో చేరిన తర్వాత కూడా స్థానికంగా హరేకృష్ణ దేవాలయం నుంచి ప్రసాదం తెచ్చుకొని కడుపు నింపుకుంటూ, వారా0తంలో వాళ్ళు పెట్టే అన్నం తింటూ,
కోక్ బాటిళ్లు అమ్ముకుంటూ, ఆడిటింగ్ క్లాసులకు వెళ్ళి వాణిజ్య పరమైన పరిజ్ఞానాన్ని పెంచుకొన్నాడు. మొదటినుంచీ ఆధ్యాత్మిక మార్గం మీదే మక్కువ ఎక్కువ. భారత దేశానికి వచ్చి ఇక్కడ ఆధ్యాత్మికతని అధ్యయనం చేయాలనుకున్నాడు. అందుకు డబ్బుకోసం అటారీ వీడియోగేముల కంపెనీలో చేరాడు. కొంత డబ్బు సంపాదించి ప్రాణమిత్రుడు డేనియల్ తో కలిసి భారత్ వచ్చాడు. నీమ్ కరోలీబాబా కై0చీ ఆశ్రమంలో ఆధ్యాత్మిక శిక్షణ పొ0దాడు. నున్నగా గుండుగీయించుకొని బౌధ్ధాన్ని స్వీకరించి మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చుకొన్నాడు. కట్టుపంచె ధోవతితోనే అమెరికా తిరిగి వెళ్లాడు. మళ్ళీ అదే వీడియో గేముల కంపెనీ లో ఉద్యొగం కుదిరింది. కంపెనీ యజమాని ఒక సర్క్యూట్ బోర్డులో చిప్ప్స్ సంఖ్యని తగ్గించ గలిగితే ప్రతి చిప్ప్ కీ 100 డాలర్లు ఇస్తానని చెప్పాడు. జాబ్స్ ఈ విషయాన్ని స్టీవ్ వోజ్నైక్ తో సంప్రదించాడు. వచ్చిన డబ్బు ఇద్దరూ చెరిసగం పంచుకొనేట్టు అనుకొని ఆ సర్క్యూట్ బోర్డ్ లోంచి 50 చిప్ప్స్ ని తొలగించ గలిగారు. సాంకేతిక నిపుణుడిగా ఇది జాబ్స్ తొలి అడుగు. కానీ, అటారి యజమాని 5,000 డాలర్లు ఇవ్వవలసి ఉండగా, 700 డాలర్లే ఇచ్చాడట! ఇది తొలి గుణపాఠం
జాబ్స్ ప్రేరణతో స్టీవ్ వోజ్నైక్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బైటకు వచ్చాడు. ఆశలూ, ఆశయాలూ ఉన్నాయి గానీ,
ఇద్దరి దగ్గరా చిల్లిగవ్వలేదు. సై0టిఫిక్ కేలిక్యులేటర్ లాంటి విలువైన తమ వస్తువులను అమ్మిన డబ్బుతో యిద్దరూ కలిసి 1976 ఏప్రియల్ 1న ‘యాపిల్ కంపెనీ’ స్థాపించారు. సిలికాన్ లోయలోని జాబ్స్ స్వంత కుటుంబ గ్యారేజీలో ఈ కంపెనీ తన ఉత్పత్తి ప్రారంభి0చింది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీతో మొదలెట్టి వ్యక్తిగత కంప్యూటర్ తయారు చేయగలిగే స్థితికి వచ్చారు. ఆ దశలో ఇంటెల్ ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ ఎ. సి. మైక్ మర్కులా జూనియర్ ముందుకు వచ్చి ప్రోత్సహి0చాడు. వాళ్ళు తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్ ఖరీదు 666.66 డాలర్లు. అది బాగా విజయవంతమయ్యింది. వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభి0చారు 1980 నాటికి మూడు అధునాతన వెర్షన్లను విడుదల చేసి యాపిల్ కంపెనీ పీసీల కంపెనీ గా ప్రఖ్యాతి గా0చింది. 1Mhz ప్రోసెసర్, 4K ర్యామ్ లతో పాటుగా ఆడియొ కేసెట్ పెట్టుకొనే అవకాశాలతో యాపిల్ II కంప్యూటర్ అత్యధికంగా ప్రజల్ని అకట్టుకొంది. వీళ్ళ మొదటి మకి0తోష్ కంప్యూటర్ 1984 టీ వీ తెరతో మరిన్ని అద్భుతాలను ఆవిష్కరించింది. 1980లో యాపిల్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అయ్యింది. ఆ సమయానికి జాబ్ వయసు 25 ఏళ్ళు. ఆదాయం 165 మిలియన్ డాలర్లు. కోట్లకొద్దీ ధనం వచ్చిపడుతున్నకొద్దీ, అంతేసంఖ్యలో శత్రువులూ పెరగసాగారు. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈయన వ్యవహార శైలి నచ్చని వాళ్ళే ఎక్కువ. అమెరికాని కుదిపేసిన 1984 ఆర్థికమాంద్య ప్రభావం సమాచార సాంకేతికత పైన కూడా ప్రసరించటంతో యాపిల్ కంపెనీ నష్టాల బాట పట్టింది. ఆ సమయంలో కంప్యూటర్ హార్డ్ వేర్ లో కొత్త మార్పులు తీసుకురాగా జాన్ స్కల్లీ అనే డైరెక్టర్ జాబ్స్ ని అడ్డుకున్నాడు. తక్కిన డైరెక్టర్లు స్కల్లీకే వంతపాడటంతో 1985లోయాపిల్ కంపెనీ నుంచి జాబ్స్ వైదొలగాడు. నిజానికి పెప్సి కంపెనీ సహాధ్యక్షుడైన స్కల్లీ ని ఎంతకాలం ఈ పంచదార రంగునీళ్ళు అమ్ముకొంటావు...అంటూ, యాపిల్ కంపెనీ లోకి తీసుకొచ్చినవాడు స్టీవ్ జాబ్సే! అతను వచ్చాక అభిప్రాయ బేధాలేర్పడి చివరికి, తెచ్చినవాడే బయటకు పోవాల్సి వచ్చింది. ఇది మరొక గుణపాఠం
అయితే, జాబ్స్ రంగ నిష్క్రమణం చెయ్యలేదు. ‘కంప్యూటర్ రంగంలో తరువాతి అడుగు’ అనే అర్థం వచ్చేలా NeXT కంప్యూటర్ సంస్థని స్థాపించి హార్డ్ వేర్ లో అనేక గొప్ప ఆవిష్కరణలను ప్రవేశ పెట్టాడు. పోష్ట్ స్క్రిప్ట్, మాగ్నెటో ఆప్టికల్ డివైస్ లు, ఇంకా మరికొన్ని ఉపకరణాలను నెక్స్ట్ కంపెనీ ద్వారా పరిచయం చేశాడు. ఇ-మైల్ లో గ్రాఫిక్స్ ని ప్రవేశపెట్టి, ఎంపికచేసిన చోట క్లిక్ చేస్తే వివరాలు వచ్చే పద్ధతుల్ని తెచ్చాడు. కంప్యూటర్లోనే ఈథర్నెట్ పోర్ట్ అమర్చి ఇచ్చాడు. అంతర్ వ్యక్తిగత (interpersonal) కంప్యూటర్ ని తీసుకొచ్చి కంప్యూటర్ల ద్వారా సమాచారం మార్చుకొనే విధానాన్ని సృష్టించాడు. ఇవన్నీ నెక్స్ట్ కంపెనీ ద్వారా సాధించిన విజయాలు.
జాబ్స్ బైటకు వెళ్ళిపోయాక యాపిల్ కంపెనీ మరింత దిగజార సాగింది. దాంతో కళ్ళు తెరిచిన యాపిల్ కంపెనీ 1996లో NeXT కంపెనీని 429 మిలియన్ డాలర్లకు తామే కొనుగోలు చేసి, జాబ్స్ ని తిరిగి యాపిల్ కంపెనీ సలహాదారుగా ఒక ఏడాది తరువాత తాత్కాలిక సి ఇ ఓ గా జాబ్స్ ని నియమించారు. అలా తన మాతృ సంస్థ తిరిగి తన చేతుల్లోకి వచ్చాక సాహసోపేతమైన కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాడు జాబ్స్. దండగమారి ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి, సహకరించని ఉద్యోగులను పనిలోనుండి తొలగించాడు. కంపెనీని లాభాల బాటలోకి మళ్ళించాడు. ఆ ఊపులో వచ్చిందే iMac అనే ఆల్ ఇన్ వన్ కంప్యూటర్. 2001 అక్టోబర్ లో 5 జీబీ నిలవ సదుపాయం ఉన్న iPod పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్‌ని ఆవిష్కరించి ఒక విప్లవాన్ని సృష్టించాడు. MP3ప్లేయర్‌ని తెచ్చి మార్కెట్ ని ఊపేశాడు. 2007లో iPhone ని తెచ్చి సెల్లులార్ వ్యవస్థనీ కంప్యూటర్ వ్యవస్థనీ కొత్తమలుపులు తిప్పాడు. ఎక్కడికి వెళ్లాలొ అక్కడికి కాదు, ఎక్కడికి వెళ్తోందో అక్కడికి నా ప్రయాణం అన్నాడు.
టచ్ స్క్రీన్ సదుపాయంతో iPad ని తీసుకు వచ్చి కంప్యూటర్ ని అరచేతిలో బంధించటంలో జాబ్స్ అసాధారణ ప్రతిభని కనబరిచాడు. జాబ్స్ నేతృత్వంలో తాజా ఐ-ఫోన్ ఉపకరణమే చివరి ఆవిష్కరణ. ఇంత చేసినా యాపిల్ కంపెనీలొ ఆయన జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు మాత్రమేనట. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే సి ఇ ఓ గా స్టీవ్ జాబ్స్ పేరు గిన్నీస్ బుక్‌లో నమోదయింది. జాబ్స్‌కు ప్రస్తుతం ఆపిల్ కంపెనీలో 7,500,000 షేర్లున్నాయి. 2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్థి విలువ 5.7 బిలియన్ డాలర్లు.
ఇదిలా ఉండగా, 1986లో లూకాస్ ఆర్ట్స్ అనే కంప్యూటర్ యానిమేషన్ విభాగాన్ని 10 మిలియన్ డాలర్లకు కొని, ‘పిక్సర్ యానిమేషన్ స్టూడియో’ ఏర్పరిచాడు. దానిద్వారా యానిమేషన్ చిత్రాలు నిర్మించి, పంపిణీ దారులుగా డిస్నీ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1995లో టాయ్ స్టోరీ గొప్ప విజయం సాధి0చింది. ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్స్టర్స్. ఇంక్, ఫైండింగ్ నీమో, ది ఇన్‌క్రెడిబుల్స్, కార్స్, రాటటూయి లాంటి చిత్రాలు నిర్మించాడు. పిక్సర్ కంపెనీ మంచి లాభాల బాటలొ ఉండటంతో డిస్నీ కంపెనీయే 7.4 బిలియన్ డాలర్లకు పిక్సర్ కంపెనీని కొనుగోలుచెసింది. జాబ్స్ డిస్నీ కంపెనీ గవర్నర్ బాడీలో చేరాడు. ఈ విధంగా వినోద రంగంలో కూడా కంప్యూటర్ వినియోగాన్ని ప్రవేశపెట్టి యానిమేషన్ విప్లవానికి కారకుడయ్యాడు స్టీవ్ జాబ్స్ .
స్వంత పరిశోధన లేకుండా సాంకేతిక ఉపకరణాలను తయారు చేసే వాళ్ల0టే జాబ్స్ ఇష్టపడేవాడు కాదు. ఈ మాటే అన్నాడని కోపగించుకొని డెల్ల్ కంపెనీ యజమాని ‘నీ యాపిల్ కంపెనీని కొంటాను అప్పుడేం చేస్తావ్...?’ అనడిగాట. దానికి బదులుగా జాబ్స్ ‘నా షేర్ హోల్డర్ల0దరికీ డబ్బులు తిరిగిచ్చేసి కంపెనీకి తాళం వేస్తాను”
అన్నాడు. ఒక సంవత్సరకాలంలోనే యాపిల్ కంపెనీ డెల్ల్ కంపెనీ ఆస్తుల్ని అధిగమి0చింది. అప్పుడు జాబ్స్ అన్నాడట... ‘షేర్ మార్కేట్ సెంటిమెంట్లను బట్టి కాదు, స్వశక్తిని బట్టి భవిష్యత్తుని నమ్ముకోవా’లని!
2004లో జాబ్స్ కి పేంక్రియాజ్ కేన్సర్ వచ్చినట్టు కనుగొన్నారు. 2009లో లివర్ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేశారు. తనకు చివరి ఘడియలు సమీపించినట్టు గ్రహించి, జాబ్స్ 2011 ఆగష్టు 24న యాపిల్ కంపెనీ సి ఇ ఓ గా రాజీనామా చేశాడు. ‘టిమ్ కుక్’ ని తన వారసుడిగా ప్రకటించాలని కంపెనీని కోరాడు. కంప్యూటర్లో టైపు చేసుకొన్న ముఖ్యమైన డాక్యుమెంట్ సేవ్ కాకుండానే డెలెట్ అయిపోయినట్టు, స్టీవ్ జాబ్స్ వెళ్ళిపోయాడు. అంతటి నూతనత్వం, సహజత్వం, నిబద్ధత కలిగిన మరో వ్యక్తిని చూడగలుగుతాం అనుకోవటం అత్యాశే అవుతుంది. తాను నమ్మిన బుద్ధుడి మార్గంలో ‘సంఘం శరణం గచ్చామి’ అంటూ నడిచి, వెళ్ళిపోయాడు స్టీవ్ జాబ్స్.