ఓ విచారఫలం కథ
డా. జి వి పూర్ణచందు
చింతపండుని విచారఫలం అని ఒక కవి చమత్కరించాడు.
మనకి ఈ చింత ఎక్కడిది...? ప్రపంచం అంతా దీన్ని టామరిండ్ అని పిలుస్తారు. “టామర్ ఎ హింద్”
అంటే,భారతదేశపు పుల్ల ఖర్జూరం అని!
ఉత్తర భారత దేశంలో ఇమ్లీ,అమ్లీ పేర్లు ఎక్కువగా
ప్రసిధ్ధి. సంస్కృతంలో చించాఫలం లేక తింత్రిణీ అంటారు. వివిధ ద్రావిడ భాషల్లో చింత,
చింతం, ఇంతం, సింత, హిత్త, ఇత్త, ఈత లాంటి పేర్లున్నాయని “డిఇడిఆర్2529”
చెప్తోంది. ద్రవిడియన్ ఎటిమాలజీ అనే మరో నిఘంటువు మూల దక్షిణద్రావిడ భాషలో “సింత్”, అలాగే మూల తెలుగు భాషలో
“చింత్” తెలుగు వ్యావహారికంలో “చింత” పదాలు ఏర్పడ్డాయని
పేర్కొ౦ది. మూల గోండీ భాషలో సిత్-అ, సిత్త, హిత్త, ఈత లాంటి పదాలు ఏర్పడ్డాయి.
దీన్నిబట్టి, ఇంగ్లీషులో టామరిండ్, తెలుగులో చింత ఈ రె౦డు
పేర్లకు “ఈత” Indian date-palm tree అనే పేరు మూలం అని
భావి౦చవచ్చు.
16వ శతాబ్ది తరువాతే అమెరికన్ ఖండానికి చింత
చెట్టు తెలిసింది. ఇప్పుడక్కడ అది విస్తారంగా పండుతోంది. మెక్సికోలో దీన్నిపల్పరిండో
అంటారు. ఆహార పదార్థాలలోకన్నా ఔషధ తయారీ ప్రరిశ్రమలలో దీని వాడకం ఎక్కువ.
చింతచిగురు, చింతపూలు, చింతపండు ఈ మూడింటికీ
నొప్పులనూ, వాపులనూ తగ్గి౦చే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్ర౦పేర్కొ౦ది. బెణికిన
చోట చింతపండు పట్టు వేయట౦ మనకు తెలుసు. నొప్పి, వాపులను తగ్గి౦చే ఆయింట్‘మె౦ట్‘ల
తయారీలో వీటిని ఇప్పుడు విస్తారంగా వాడుతున్నారు. గోంగూర పచ్చడి, పెసర పప్పు,
చింతపండు పులుసు...ఇవి తెలుగు వారి ఇష్ట దైవాలు. ఈ మూడింటికీ ఆఫ్రికా ఖండమే మూలం.
ఆఫ్రికన్లకూ మనకూ సమానంగా దొరికే ఇలాంటి ఆహార ద్రవ్యాలు వండే తీరులో కూడా వారికీ మనకీ
పోలిక ఉంది.చింతచిగురు చవకగా దొరుకుతుంది. చింతపండుకు
ప్రత్యామ్నాయం చింతచిగురే! శరీరానికి ఇనుము వంటబట్టేలా చేయటానికీ, రక్తధాతు వృద్ధికీ,
కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురును మించిన ఔషధం లేదు.
చిన్నకుండ లేదా ముంతలో రె౦డు గ్లాసుల నీళ్ళు
పోసి, అందులో చింత చిగురు ఎండించి దంచిన పొడిని ఒక చె౦చాడు కలిపి,
తుప్పు పట్టని కొత్త ఇనుప మేకు అందులో వేసి నీళ్ళు సగం మరిగేంతవరకూ కాచి,
వడగట్టి తాగితే రక్తహీనత, లివర్ వ్యాధులూ, కామెర్లూ త్వరగా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు,
యుక్తవయసు ఆడపిల్లలకు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలకూ, వృధ్ధులకూ ఇది గొప్ప
ఔషధం. మేకును జాగ్రత్త చేసుకొని రోజూ ఈ “చింతచిగురు టీ” తాగవచ్చు. ఫిల్లిప్పైన్స్
లో దీన్ని మలేరియా జ్వరం తగ్గటానికి తాగిస్తారు. ఈజిప్ట్ లో చల్లని వేసవి పానీయంగా
తాగుతారు.
పోషక విలువలను లెక్కించి చూస్తే, చింతపండు, చింతకాయలకన్నా చింత
చిగురు ఎక్కువ ప్రయోజనకారి. చింతపండులో ప్రొటీన్లు 3.10 గ్రాములుంటే, చింతచిగురులో 5.8 గ్రాములు
ఉన్నాయి. అపకారం చేసే తార్తారిక్ యాసిడ్ చింతపండులో ఉన్న౦తగా చింతచిగురులో ఉండదు. గ్లూకోజు,
ఫ్రక్టోజు లాంటి పంచదార పదార్థాలు చింతపండులో 30-40%ఉన్నాయి. రకరకాల పళ్ళు షుగర్
వ్యాధిని ఎలా పెంచుతాయో చింతపండుకూడా అలానే పెంచుతుంది.
రక్త౦లొ కొలెస్ట్రాల్ మీద చింతపండు ప్రభావం
గురించి 2౦౦5లో కెనడా విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి, పరిమితంగా తినే వారిలో
2% కొలెస్ట్రాల్ తగ్గగా, అతిగా తినే వారిలో 8% పెరిగిందని కనుగొన్నారు. అంటే,
చింతపండు ఒక ఔషధం లాంటిదనీ, దాన్ని పరిమితంగా తీసుకోవాలనీ అర్ధం. అల్సర్లు, కీళ్ళవాతం,
ఎలెర్జీ వ్యాధుల్లో కూడా చింతపండు అపకారమే చేస్తుంది. “వామన కాయలు”
అంటే, లేత చింతకాయలు పైత్యం చేస్తాయి. వాత, కఫ వ్యాధుల్ని ఉబ్బసాన్నీ
పెంచుతాయి.అన్నమయ్య ఒక కీర్తనలో “చింతకాయ కజ్జ౦”
అనే పదం ప్రయోగించాడు. తీపిబూందీని “పూసకజ్జెం” అంటారు. ఈ కజ్జెం చింతపండుతో
చేస్తే తినడానికి పనికిరాదు కదా... అలా వాడకానికి పనికిరానిదాన్ని చింతకాయకజ్జెం అన్నాడు
అన్నమయ్య.
చింతపువ్వ౦త, చింతాకంత అంటూ చిన్నవాటిని
పోలుస్తుంటాం. “చింతాకు ముడుగు తరి”, “చింతెలుగు”
అనే పదాలకు చీకటి పడబోయేముందు సన్నని సందె వెలుగు అని అర్ధం.
చింతకాయల్ని దంచి ఊరగాయ పెట్టేప్పుడు,
గింజలు ఏరేస్తారు. వాటిని నీళ్ళలో వేసి మరిగిస్తే, చిక్కని పుల్లని “చింతంబలి”,
“చింతగంజి” లేదా “చింతసరి” తయారవుతుంది. తగినంత ఉప్పూ కారం తాలింపు పెట్టుకొని తాగితే రుచికరం, జీర్ణశక్తిని పెంచుతుంది. పండిన చింతకాయ పెంకుని “చింతగుల్ల”
అంటారు.
చింతపండుని అంటుకొన్న ఈనెల్ని “చింతనరాలు”
లేక “చింత ఉట్టి” అంటారు. చింతపండు లోపల గింజల్ని చింతపిక్కలంటారు. సీలింగ్ ఫ్యాను
తగిలించటానికి పైన శ్లాబుకు గానీ దూలానికి గానీ తగిలించే కొక్కేన్ని చింతకాయ అంటారు.
“చింతకుండి” అంటే ఇనప ఊచ. ఆగ్రహ౦ ప్రదర్శి౦చాడు అనటానికి కళ్ళలో చింతనిప్పులు
కురిపించాడంటాం.
చింత కర్రని పొయ్యిలో పెడితే ఎర్రని నిప్పులు
వస్తాయి. చాలా సేపు ఆ వేడి నిలబడి ఉంటుంది. ఆబూడిదను నీళ్ళలో కలిపి వడకట్టి ఆ నీటిని
ఒకరాత్రంతా నిలవ బెడతారు. తెల్లవారేసరికి అడుగున తెల్లటి ముద్ద పేరుకుంటుంది. దాన్ని
“చించాక్షారం” అని పిలుస్తారు. ఇది పేగుపూతను, జీర్ణకోశ వ్యాధుల్నీ
తగ్గి౦చట౦లో గొప్పఔషధంగా పనిచేస్తుంది.ఇప్పటి పిల్లలకు “చింతబరికె”
అంటే తెలియదు. ఒకప్పుడు స్కూలు మాష్టర్ల దగ్గర చింతకొమ్మే బెత్త౦! అదే పాఠాలు చెప్పేది.
కాబట్టి, నాణ్యమైన చదువులు వచ్చేవి.చింతచెట్టుమీద బ్రహ్మరాక్షసి ఉంటుందనే నమ్మకం
మనకే కాదు, ఆఫ్రికన్లకూ ఉన్నదట! అతిగా తింటే చింతపండే పెద్ద బ్రహ్మరాక్షసి.