Sunday 20 September 2020

కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు :: డా. జి వి పూర్ణచందు

 

కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు

డా. జి వి పూర్ణచందు

దేవుడికి వందనం అనే స్థితి నుంచి, దేశానికి వందనం అనే స్థాయికి భారతీయులను మళ్లించిన వాడు బంకించంద్ర చటర్జీ. దేశమంటే మట్టికాదనీ, మనుషులనీ అంటూ, తన దేశభక్తి గీతం ద్వారా స్వదేశీ బావనను రగిలించి తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన వాడు గురజాడ.

1905లో మొత్తం దేశాన్ని కదిలించి వేసిన వందేమాతరం ఉద్యమం లోంచే స్వదేశీ ఉద్యమం పుట్టింది. “జల్దుకొని కళలెల్ల నేర్చుకు/దేశి సరుకులు నించవోయి” అనే వాక్యాలు గురజాడ స్వదేశీ ఉద్యమానికి తార్కాణాలు.

“నాది ప్రజల ఉద్యమందానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వొదులుకోలేను” అని తన డైరీలో 1911మార్చి, 27న గురజాడ రాసుకొన్న మాటలు ఆయనను నవయుగ నిర్మాతగా భాసిల్లచేశాయి. 

“విద్యలనెరయ నించిన యాంగిలేయులు”(1912) అనీ, “కన్నుకానని వస్తుతత్త్వము కాంచనేర్పరు లింగిరీజులు; కల్ల నొల్లరు; వారి విద్యల కరచి సత్యము నెరసితిన్” అనీ ఆంగ్లేయులను మెచ్చినప్పటికీ, ఆంగ్లేయ సంస్కృతి పట్ల గురజాడ విముఖతే ప్రదర్శించారు.

“పాశ్చాత్య నాగరికత కొన్ని అంధవిశ్వాసాలను పోగొట్టుతున్న మాట యదార్థమే అయినప్పటికీ, అది ప్రబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. ఇది సంపూర్ణ స్వాతంత్ర్యము కాదు, నామమాత్రమైనది.” ( గురజాడ డైరీ-1901, పుట215/సం: అవసరాల);

“శతాబ్దాల  తరబడి రాజకీయ బానిసత్వం వలన మరుగు పడి ఉన్న ఉదాత్త జాతీయ మనః ప్రవృత్తిని విద్యావంతులైన హిందువులకు బహిర్గతం చేసి, వారిలో వారి ప్రభావానికి లోనౌతున్న వ్యక్తులలో అట్టి వృత్తినే కలిగించటానికే ఇది దోహద పడును.(గోమఠం శ్రీనివాసాచార్యులు గారి హరిశ్చంద్ర నాటకం ఇంగ్లీషు అనువాదానికి గురజాడ పీఠిక)

స్వదేశీ ఉద్యమం గురించి చెప్పిన ఈ వాక్యాలు  గురజాడ వారి నిబద్ధతను చాటుతాయి.

గురజాడ స్వహస్తంతో వ్రాసిన “దేశభక్తి” గీతం చిత్తుప్రతిలో “నిన్నవచ్చా రింగిలీషులు/మొన్నవచ్చిరి ముసల్మను; లటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి, వేరులు బెట్టుకోకోయి” అనే చరణం ఉంది. దీన్ని కొందరు గురజాడ ప్రదర్శించిన ఆంగ్లేయానుకూలతగా భావిస్తారు.  నిజానికి ఇది అన్ని కులాల, మతాల వారికీ దేశమే దేవత అనే భావన బలపడుతున్నదశలో అందుకు ప్రతిబంధకంగా నిలిచే వారికి చేసిన హెచ్చరిక.  హిందూ శబ్దాన్ని దేశీయులనే అర్ధంలో గాక, మతస్థులనే అర్ధంలో ప్రయోగించి, ఈ దేశంలో అన్యమతస్థులకు తావులేదని వాదించే వాళ్ళకి ఇది అంటించిన చురక.

గురజాడకు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధాలు బాగానే నడిచాయి. తన డైరీలో 1887 అక్టోబరు,27న విజయనగరం కాంగ్రెస్ సభలో తాను పాల్గొన్నట్టు రాసుకున్నారు. కానీ, కాంగ్రెస్ లోని మితవాద ధోరణులపట్ల ఆయన తన విసుగుదలని కన్యాశుల్కంలో ఎన్నో పాత్రల ద్వారా ప్రదర్శిస్తారు.

“తమ్ముడూ! గిరీశంగారు గొప్పవారష్రా?” అని బుచ్చమ్మ అడిగితే, వెంకటేశం “గొప్పవారంటే  అలా యిలాగా అనుకున్నావా యేవిటీ? సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారు” అంటాడు. “అతగాడెవరు?” అనడిగితే, వాడికి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కుని, “అందరికంటే మరీ గొప్పవాడు” అనేస్తాడు. దేశాన్ని గిరీశంగారు “యెలా మరమ్మత్తు చేస్తున్నార్రా? ’ అనడుగుతుంది. దానికి వెంకటేశం చెప్పిన సమాధానం ఇది: “నావంటి కుర్రాళ్లకు చదువు చెప్పడం, (నెమ్మళంగా) చుట్టనేర్పడం, గట్టిగా నాచ్చి కొశ్చన్ అనగా సానివాళ్ల నందరినీ  దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం ఒహటి. ఇప్పుడు తెలిసిందా...?” అని సమాధానం చెప్తాడు వెంకటేశం. ‘నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం’ అని ఈనాటకంలో ఒక బొడ్డూడని కుర్రాడే అన్నప్పటికీ, అది గిరీశం అభిప్రాయంగానే కన్పిస్తుంది. అందుకే మరో సీనులో, గిరీశమే అంటాడు: “ఒక సంవత్సరం గానీ నాకు దేవుడు దివాన్గిరీ యిస్తే, బీమునిపట్టణానికి పాల సముద్రం, విశాఖపట్టణానికి మంచినీళ్ళ సముద్రం , కళింగపట్టణానికి చెరకు సముద్రం తెస్తాను” అని. ఇక్కడ దివాన్గిరీ అంటే కాంగ్రెస్ పదవి. “పొలిటికల్ మహాస్త్రం అంటే, “ఒకడు చెప్పిందల్లా బాగుందండవే! సమ్మోహనాస్త్రం అంటే అదే కదా...!”, “ఒపీనియన్లు అప్పుడప్పుడు చేంజి చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడు” లాంటి సంభాషణల్లో కనిపించే ఆనాటి పొలిటీషియన్ నేషనల్ కాంగ్రెస్ వాడే! దేశంలో రాజకీయ సంస్థ ఆనాడు అదొక్కటే కాబట్టి!

“మొన్న బంగాళీవాడు (బహుశా బిపిన్ చంద్రపాల్ కావచ్చు)ఈ ఊర్లో లెక్చరిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ...?”

“పెళ్ళి ఆపడానికి బ్రహ్మ శక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాథ్ బానర్జీ వచ్చి చెప్పినా మీ తండ్రి వినడు”

“మొన్న మనం వచ్చిన బండి వాడికి నాషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు లెక్చరు ఇచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్ల ఊరు హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెసు వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజెస్ లో లెక్చర్లు యంత మాత్రం కార్యం లేదు...”

(దేవుణ్ణి ఉద్దేశించి) యిలాంటి చిక్కులు పెట్టావంటే, హెవెన్ లో చిన్న నేషనల్ కాంగ్రెస్ లేవదీస్తాను”

“అన్ని మతాలూ పరిశీలించి వాటి యస్సెన్స్ నిగ్గుతీసి ఒక కొత్తమతాన్ని ఏర్పాటు చేశాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలింప చేస్తాను” లాంటివెన్నో ఆనాటి రాజకీయపక్షుల మీద వ్యంగ్యాలు కన్యాశుల్కంలో కనిపిస్తాయి.

 “దేశాభిమానం నాకు కద్దని/వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్/పూని యేదైనాను ఒక మేల్/కూర్చి జనులకు చూపవోయ్” దేశభక్తి గీతంలోని ఈ చరణంలో వొట్టి గొప్పలు చెప్పుకోవద్దంటూ పెట్టిన వాత ఎవరిని ఉద్దేశించో తెలియాలి.

నేషనల్ కాంగ్రేసుకు ఆ తొలినాళ్లలోనే అంతగా వాతలు పెట్టటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్ర విభజనకు నిరసనగా బెంగాలీలు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో వందేమాతరం గీతం బెంగాలంతా ప్రతిధ్వనించింది. అది వందేమాతరం ఉద్యమంగా ప్రసిద్ధి పొంది దేశం అంతా వ్యాపించింది.

1906 కలకత్తా కాంగ్రెస్ ‘స్వరాజ్యం, స్వదేశీ, జాతీయ విద్య’ ఈ మూడు అంశాలు లక్ష్యాలుగా కొన్ని తీర్మానాలను ఆమోదించింది. బ్రిటీష్ అనుకూలత ద్వారా దేశానికి మంచి సాధించుకోవాలనే ధోరణిలో నేషనల్ కాంగ్రెసును నడుపుకొస్తున్న సర్ ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు “బోయ్ కాట్” లాంటి పదజాలం పట్ల వ్యతిరేకత కనపరచారు. లాలాలజపతి రాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాలు ప్రభృతుల నాయకత్వంలో కొందరు అతివాదులు ఈ మార్గాన్ని వ్యతిరేకించి, బ్రిటిష్ వారి పైన పోరాటానికి సిద్ధపడ్దారు.ఈ ముగ్గురినీ లాల్ బాల్ పాల్ త్రయంగా పేర్కొంటారు. వీళ్లని అతివాదులనీ, చేంజర్స్ అనీ పిలవ సాగారు.

ఆ మరుసటి సంవత్సరం 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలొ అతివాదులకూ, మితవాదులకూ తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. మితవాదులు రాస్ విహారీ ఘోష్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచించగా, అతివాదుల పక్షాన లాలాలజపతి రాయ్ ని పోటీకి నిలబెడుతున్నట్టు వేదిక మీదనుంచి తిలక్ ప్రతిపాదించాడు. ఆయన అలా ప్రసంగిస్తూ ఉండగా జనం లోంచి ఒక బూటు వచ్చి వేదికపైన ఉన్న ఫిరోజ్ షా మెహతా చెంపకు తగిలి, పక్కనేఉన్న సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడింది.

 బూటుని మెహతా, బెనర్జీల వర్గం వాళ్ళు తిలక్ మీదకు విసిరితే అది గురి తప్పి సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడిందో...లేక తిలక్ వర్గీయులే మెహతా బెనర్జీల మీదకు విసిరారో ఎవరికీ తెలియదు. బూటు వచ్చి తగిలింది. నువ్వంటే నువ్వని కారణాన్ని ఎదుటివారిమీదకు నెట్టుకుంటూ సభలో గందరగోళం సృష్టించారంతా!

దీనికి,తాను ప్రత్యక్ష సాక్షినంటూ, టంగుటూరి ప్రకాశంగారు “నా జీవిత యాత్ర” గ్రంథంలో కొన్ని విషయాలు ఉటంకించారు. ఈ సంఘటనకు ఒక నేపథ్యాన్ని ఆయన ఇలా విశ్లేషించారు:

 “నాగాపురం నుంచి వచ్చిన ప్రతినిధులు లాఠీ కర్రలతో ‘తిలక్ మహరాజుకీ జై’ అనుకొంటూ వేదిక మీదకు ఉరికారు. తరువాత గలాటా పెరిగి ఉభయ పక్షాలవాళ్ళూ కుర్చీలూ, బెంచీలు కూడా చేత బట్టి విజృంభించారు. అనేకమందికి గాయాలు తగిలి రక్తం స్రవించింది” అదీ సంఘటన. సరిగ్గా నేటి పరిస్థితికి నాటి పరిస్థితి నకలుగానే ఉంది.

“ఆ కాలంలో కాంగ్రెస్ కి ఫిరోజిషా మెహతా నియంతవంటి వాడే! కాంగ్రెస్ సంఘాలు అనిగానీ, ప్రతినిధుల్ని ఎన్నుకోవడం గానీ, ప్రతినిధులు ప్రెసిడెంటును ఎన్నుకోవటం గాని ఏమీ లేవు. మెహతా ఎవరి మీద కటాక్ష వీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రేస్ అధ్యక్షులు. తీవ్ర వాదులైన తిలక్ లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురయిన ముఖ్యులు” అనేది ప్రకాశంగారి అభిప్రాయం.

ఇలాంటి పరిస్థితుల్లో, ఆనాడు కాంగ్రెస్ పెద్దలను మంచి చేసుకుని విజిటింగ్ కార్డు పదవి అయినా పొందగలిగితే, ప్రభుత్వాదరణ దొరికేదని దీన్ని బట్టి తెలుస్తోంది. గురజాడ లాంటి ఆలోచనా పరుడు ఈ సంస్కృతిని ఆమోదించ గలడా? అందుకే, దేశభక్తి గురించి ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని మితవాద కాంగ్రెసుకే చురక వేశాడు.

1907 లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర రాష్ట్ర పర్యటన సమయంలో విశాఖపట్టణంలో ఆయనకు అంతగా ఆదరణ రాలేదు. కాకినాడలో ఒకమోస్తరుగా విజయవంతం అయ్యింది. తరువాత రాజమండ్రిలో జరిగిన సభ అద్భుతాలను ఆవిష్కరించింది. తెలుగువారిలో స్వాతంత్ర్య దీప్తిని నింపిన ఒక గొప్ప సభగా చరిత్రలో నిలిచిపోయింది. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తూ, “భరత ఖండంబు పాడియావు” అనే పద్యాన్ని చిలకమర్తివారు ఈ సభలొనే ఆశువుగా చెప్పారు.

ఆ తరువాత బిపిన్ చంద్రపాల్ బెజవాడ, మచిలీపట్టణాల్లో కూడా ప్రసంగించారు. తెలుగునాట స్వాతంత్ర్య కాంక్ష కలవారందరినీ ఏకం చేసి, తన నాయకత్వం లోకి తెచ్చుకున్నారు. వందేమాతరం ఉద్యమం తరువాత దేశంలో అతివాదులు తెలుగునేలమీద సాధించిన తొలి విజయం ఇది. అతివాదానికి గురజాడ అనుకూలమా...ప్రతికూలమా అనేది సున్నితమైన విషయం.

1897 నుంచీ 1912 వరకూ సంస్థాన వారసత్వ దావా విషయంలో అప్పారావు గారు తలమునకలుగా ఉన్న సమయం అది. ఆ కారణంగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు పెట్టుకో లేకపోయినప్పటికీ, కన్యాశుల్కం నాటకంలో  జాతీయ, అంతర్జాతీయ విషయాలు కూడా ప్రస్తావిస్తూ మితవాదుల ఆలోచనా ధోరణుల్ని ఎండగట్టారు.

హవల్దార్ పాత్ర- సారా కొట్టు సీను: కుంపిణీ నమ్మక్ తిన్నతరువాత ప్రాణం ఉన్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే పించను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకి వెయ్యమా?”

        “రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు? అని మునసబు రెట్టించి అడుగుతాడు. దానికి హవల్దారు, “మొన్నగాక మొన్న యింగిరీజ్ రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలాడా లేదా? అప్పుడేవైందో, యిప్పుడూ అదే అవుతుంది. మా రాణి చల్లగా ఉండాలి...!”

“సీమరాణి ఆ కాళీమాయి అవుతారం కాదా?” అనడిగితే, “కాళీ గీళీ జాంతానై-ఆ రాముడి అవుతారం”

నేషనల్ కాంగ్రెస్ మితవాదుల సగటు ఆలోచనాధోరణిని ఈ సంభాషణలు తేటతెల్లం చేస్తున్నాయి. మనుషులు చేసిన దేవుళ్ళారా...! మీ పేరేమిటి? కథలో కనిపించే శైవ వైష్ణవ భేదాలు కూడా ఈ సంభాషణలో అదనంగా ధ్వనిస్తాయి.

          కన్యాశుల్కం నాటకంలో సార్వజనీనత, సార్వకాలీనతలు కొట్టొచ్చినట్టు కనిపించటానికి గురజాడ ప్రదర్శించిన ఈ రాజకీయ చైతన్యమే కారణం. బ్రిటిష్ వారితో మంచిగా వ్యవహరిస్తూ, ఎదురు తిరక్కుండా నమ్రతగా ఉంటూ, దేశానికి స్వాతంత్ర్యాన్ని బ్రతిమాలో బామాలో తెచ్చుకోవాలనే మితవాదుల ఆలోచనని ఏ మాత్రం అంగీకరించ లేదనటానికి ఈ నాటకంలో ఇలాంటి సంభాషణలు అనేకం సాక్ష్యం.

Sunday 6 September 2020

సౌందర్యశాస్త్ర గ్రంథం ‘హరమేఖలా’

 

సౌందర్యశాస్త్ర గ్రంథం ‘హరమేఖలా’

తిరుమల రామచంద్రగారి అనువాద ప్రతిభ

డా||జి. వి. పూర్ణచందు,B.A.M.S.,

అందంగా ఆకర్షణీయంగా ఉండాలనే తపన. మనిషికే ఉంటుంది. జంతువులకు ఉండదు. మనిషికీ జంతువుకూ మౌలికమైన తేడాలలో ఇది ముఖ్యమైంది. ఏ కుక్కా, ఏ కోతీ, ఏ గేదే, ఏ ఆవూ, తాను అందంగా అలంకరించుకుని తిరగాలనుకోవు.

సౌందర్య పిపాస మనిషి ప్రాథమిక లక్షణం. ఈరోజున సౌందర్య శాస్త్రం (cosmetology) అనేది పెద్ద శాస్త్రంగా రూపొందింది. సౌందర్య సాధనాలను తెలుసుకొని వాటిని నైపుణ్యతతో వాడుకోవటం నేర్పేది సౌందర్య శాస్త్రం. modification of beauty అనేది దీని లక్ష్యం. కానీ, ఈ శాస్త్రానికి మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. మూలాలు మాత్రమే కాదు, ఆధునిక కాస్మటాలజీలో లేని అనేక విశేషాంశాలు కూడా మన శాస్త్రాలలో ఉన్నాయి.

వేదాలతో మొదలుపెట్టి, మన ప్రతీ సాహిత్య గ్రంథాలన్నీ ‘సౌందర్యపరివర్తనం’ గురించి అంతో ఇంతో ప్రస్తావించాయి. ఆయుర్వేద శాస్త్రం ఈ విద్యకొక ప్రతిష్టను కల్పించింది. అంజనాలు, గంథాలు, లేపనాలు, కల్కాలు, కషాయాలెన్నో ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తాయి.

కస్తూరి తిలకం, కౌస్తుభ హారాలు, ముత్యాల ముక్కుపుడకలతో, కంగనాలతో, హరిచందన చర్చితాలతో దేవతల్ని అలంకరించి, ఆరాధిస్తూ, తమ సౌందర్యపిపాసను భారతీయులు చాటుకున్నారు. నీలాంజన సమాభాసం అని శని దేవతని, గుడాకేశి అని శివుణ్ణి ఇలా సౌందర్యపరమైన ఉపమానాలతో కొలుచుకున్నారు.

ఆధునిక సౌందర్యశాస్త్రం  అందంగా కనిపింపచేయటానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తాయి. hairstyling, skin care, cosmetics, manicures/pedicures, రోమాలను తొలగించేందుకు  waxing, threading vagairaa విధానాలే ప్రధానంగా కనిపిస్తాయి. కానీ పెదాలు ఎర్రగా కనిపిస్తే చాలదు, నోటి దుర్వాసన లేకుండా ఉండాలి. శరీరం పసిడి రంగులో మిసమిసలాడితే సరిపోదు, చెమట దుర్గంధం లేకుండా ఉండాలి. శారీరక, మానసిక స్వాస్థ్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని మన సౌందర్య శాస్త్రాలు రూపొందాయి.

వేద యుగంలో చ్యవనుడు తన యవ్వనాన్ని తిరిగిపొంది సుకన్యనను పెళ్ళాడిన కథ ఉంది. యవ్వనాన్ని తిరిగి ఇచ్చిన ఆ ఔషధాన్ని చ్యవనుడి పేరుతో చ్యవనప్రాశ అంటారు. దీనిని రసాయన చికిత్స అంటారు. ఇది సౌందర్య శాస్త్రంలో భాగమే!  వేదయుగాలలో మధువిద్య అనేది ఒకటి ఉండేది. రసాయన చికిత్సలు ఈ విద్యలోంచే అభివృద్ధి చెందాయని చెప్తారు.

ప్లాష్టిక్ సర్జరీ చేసిన తొలి వైద్యుడు సుశ్రుతుడు. రైనోప్లాష్టీ అంటే తెగిన ముక్కును సరిచేసే చికిత్స చేశాడాయన. ఆలేపం, పరిషేకం, ఉత్సాదనం, పాండుకర్మ, రోమ సంజననం లాంటి చికిత్సావిధానాలను ఆయుర్వేద శాస్త్రం అందించింది. సంహితా యుగాల తరువాత కౌటిలీయ అర్థశాస్త్రం, వాత్స్యాయన కామశాస్త్రం, అనంగ రంగ, కొక్కోకం లాంటి గ్రంథాల్లో సౌందర్య శాస్త్రాపరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి.

మహాభారతంలో ద్రౌపది ‘సైరంధ్రి’ పేరుతో అఙ్ఞాతవాసంలో లేడీ బ్యూటీషియన్ పాత్ర పోషించింది.

మైలసంతలో బహిరంగంగా స్త్రీలు ‘సుసరభిత్తి’ అనే ఒక ఔషధాన్ని అమ్మినట్టు వల్లభరాయుడి క్రీడాభిరామంలో ఉంది. సుసర అనే పువ్వు ‘ఆస్ట్రేలియన్ పుష్పం’గా ప్రసిద్ధి, రెడ్డి రాజుల కాలంలో అవచితిప్పయ్యశెట్టిగారు తెచ్చిన విదేశీ ద్రవ్యాలలో అది కూడా ఉన్నదేమో తెలీదు. అమితమైన చల్లదనాన్నిస్తుంది. దాని నిర్యాసాన్ని స్త్రీల మర్మావయవం పైన లేపనం చేస్తే యోనిదోషాలు పోతాయని దాన్ని వాడేవారు. ఇలా తెలుగువారి సౌందర్య, శృంగార ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలను సాహిత్యాధారాలు అనేకం మనకు అందిస్తున్నాయి.  

సౌందర్యశాస్త్ర పరమైన అంశాలన్నింటినీ ఒక చోట గుదిగుచ్చి పాఠ్యగంథంగా వెలువరించిన గ్రంథం హరమేఖల. శివుడి మాల అని దీని భావం. క్రీశ. 9వ శతాబ్దిలో  ప్రాకృత భాషలో ఈ గ్రంథరచన జరిగింది. ధరణీవరాహ రాజ్యం తనదని, మాధవుడు తన తండ్రి అనీ ఈ గ్రంథంలో మాహుకుడు చెప్పుకున్నాడు. హరమేఖల అనే పేరుని బట్టి రచయిత మాహుకుడు శివయోగి అని అర్థం అవుతోంది. ఇందులో ప్రాకృత శ్లోకాలను ‘ఛాయ’ లంటారు. వీటికి సంస్కృతంలో టీకలు దొరుకుతున్నాయి.

మొదట దీని ప్రతిని కొట్టాయంలోని నారాయణభట్టతిరి సంపాదించారు. 1938లో ట్రావెంకోర్ మహరాజా సహకారంతో కె. సాంబశివ శాస్త్రిగారు పరిష్కరించగా ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ వారు 4వ అధ్యాయం వరకూ మొదటి భాగంగానూ, 5వ అధ్యాయాన్ని రెండవ భాగంగానూ ప్రచురించారు.

వేటూరి శంకర శాస్త్రిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి సోదరుడౌతారు. ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు, చరిత్రకారుడు కూడా! ముక్త్యాల రాజావారి ఆస్థాన వైద్యుడాయన.  వైద్యకళ మాసపత్రిక నడుపుతుండేవారు. ఆయన ఈ గ్రంథాన్ని సంపాదించి తెలుగులోకి అనువదించే విషయమై శ్రీ తిరుమల రామచంద్రగారితో సంప్రదించారు. ప్రాకృత శ్లోకాలకు, సంస్కృత టీకకు కొన్ని చోట్ల పొంతన కుదరటం లేదని ప్రాకృతం సంస్కృతం సమానంగా తెలిసిన రామచంద్ర గారి సహాయం అర్థించారాయన. ఆ ఇద్దరూ కలిసి చేసిన అనువాదమే తెలుగు ‘హరమేఖల’.

ధర్మార్థ కామమోక్షాల ఙ్ఞానం కలిగిన వారిని విదగ్ధులు అంటారు. అలాంటి వారికోసమే ఈ విదగ్ధానురాగ కృతిని ప్రయోగమాలగా వెలువరిస్తున్నట్టు మాహుకుడు పేర్కొన్నాడు. పుత్తలిక పేరుతో చేతబడుల మంత్రాలు, వశీకరణ, విఘటన, తాంత్రిక యోగాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని నేటి కాలమానపరిస్థితులకు అసాధ్యమైన యోగాలు, అంశాలు కూడా ఉండటంతో వాటిని పరిహరించి, సాధ్యమైనంత అందుబాటులో ఉన్న యోగాలను మాత్రమే ఈ గ్రంథంలో చేర్చటం జరిగింది. మొదటి అధ్యాయం అంతా వేశ్యలకు సంబంధించిన విషయాలు కావటంతో దాన్ని వదిలేసి, రెండవ అధ్యాయం నుండే తెలుగు హరమేఖలను మొదలు పెట్టారు. గ్రంథాంతంలో కొన్ని ద్రవ్యాల అకారాది పట్టికని ‘హరమేఖల నిఘంటువు’ పేరుతో అనుబంధంగా ఇచ్చారు.

ఈ గ్రంథంలో ఇప్పటి తరంవారు గృహవైద్యంగా చేసుకోదగిన కొన్ని యోగాలకు తిరుమల రామచంద్రగారు శ్రమించి చేసిన అనువాదాలను కొంత  పరిచయం చేస్తాను.

బాగా పండిన మారేడు గుజ్జును తలకు పట్టించి బెల్లంపాకంతో తలంటితే అట్టలు కట్టిన కేశాలు మెత్తబడి చిక్కు విడతాయి.

మామిడి టేంకలోని జీడిని త్రిఫలా చూర్ణాన్ని, తామరకొలను దగ్గరి నల్ల బురదని, మెత్తగా ఉండే ఇనుపరజనుని కలిపి గుంటకలగరాకు రసంతో నూరి, సమానంగా బియ్యపు గంజిని కలిపి తలకు పట్టిస్తే నెరిసిన వెంట్రుకలు తుమ్మెద గుంపులా నల్లబడతాయి.

జాజికాయ, జాపత్రి దాల్చినచెక్క, మరువం ఈ నాల్గింటిని మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు కట్టి ఆరబెడితే గట్టి పడతాయి. ఒక్కమాత్రని బుగ్గనపెట్టుకుని చప్పరిస్తుంటే నోటి దుర్వాసన పోతుంది.

ఏలకులు, అగరు అనే సుగంథ ద్రవ్యం, గంధం,బిరియానీ ఆకు, కలువ పూరేకులు వీటిని దంచిన పొడిని పావుచెంఛా మోతాదులో గ్లాసునీళ్లలో కలిపి కొంతసేపు నాననిచ్చి తాగితే శరీరంలోంచి పరిమళం బయటకు వస్తుంది. 

సున్నం ఎక్కువై తాంబూలం వలన నోరు పొక్కితే నువ్వుల నూనె గానీ, చల్లని గంజిగానీ  నోట్లో పోసుకుని పుక్కిలిస్తే పొక్కడం, నోటిపూత తగ్గుతాయి.

రేగు గింజల్ని మెత్తగా దంచి బెల్లం, తేనె, వెన్న కలిపి ముఖానికి లేపనం చేస్తే మంగు లేదా శోభి మచ్చలు పోతాయి.

నేలతాటిగడ్డల చూర్ణాన్ని గేదె వెన్నతో కలిపి ఒక పాత్రలో ఉంచి, ధాన్యపు రాశిలో వారం రోజులపాటు మాగనిచ్చి, దాన్ని చెవులకు పట్టిస్తే చెవి తమ్మలు పెరుగుతాయి. స్తనాలకు పట్టిస్తే స్తన పరిమాణం పెరుగుతుంది.

దానిమ్మకాయల బెరడుని నీళ్లలో వేసి బాగా నూరి వడగట్టి, ఆ నీటికి సమానంగా తెల్లావాల నూనె కలిపి నీరంతా ఇగిరిపోయే దాకా మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవులు, స్తనాలు, పురుషాంగాలమీద  మర్దిస్తే అవి గట్టిపడి జారిపోకుండా ఉంటాయి.

జిల్లేడాకుల్ని సైంధవలవణంతో నూరి పుటం పెట్టి చేసిన భస్మాన్ని నీళ్లలో కలిపి తాగితే అసాధ్యమైన లివర్ జబ్బులు తగ్గుతాయి.  

అరిటాకుల్ని నూరి పుటపాకం పద్ధతిలో భస్మం చేసి ఒక చెంచాపొడిని నీళ్లలో కలిపి తాగితే లివర్ స్ప్లీన్ వ్యాధులు తగ్గుతాయి.

పసుపుకొమ్ములు మెత్తగా దంచిన పొడిని తేనెతో తీసుకుని ఉసిరికాయల రసంతో రోజూ తాగితే షుగరు వ్యాధి, ఇతర మూత్ర వ్యాధులు తగ్గుతాయి.

అరచెంచా పిప్పళ్ల పొడిని నెయ్యి, తేనె చేర్చి, గ్లాసుపాలలో కలిపి తాగితే కరోనాలంటి విషజ్వరాలను ఎదుర్కొనేశక్తి శరీరానికి వస్తుంది. “పిప్పలీ చూర్ణం ఘృత మధు మిశ్రితం,క్వథిత దుగ్ధ సంయుక్తమ్ పీతమ్ విషమజ్వర కాస  హృద్రోగాన్ వినాశయతి” అంటూ మాహుకుడు చెప్పిన ఈ చిన్న ఔషధం నిజమైన ఇమ్యూనిటీ బూష్టర్‘గా ఈ కరోనా సమయంలో పనిచేస్తుంది.

పిప్పళ్ళపొడికి సమానంగా త్రిఫలా చూర్ణం కలిపిన పొడిని ఒక చెంచా మోతాదులో తీసుకుని తేనె కలిపి తిని ఆతరువాత భోజనం చేస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది, కఫం దరి చేరదు. కరోనా వ్యాధి నివారణకు ఇది కూడా మంచి ఉపాయం.

బార్లీ గింజల్ని నువ్వుల నూనెలో నల్లగా మాడేలా మూడుసార్లు వేయించి దంచిన మసిని వెన్నపూస కలిపి లేపనం చేస్తే కాలిన పుండ్లు, గాయాలు అసాధ్య వ్రణాలు త్వరగా తగ్గుతాయి.

పసుపు కొమ్ముల్ని చింతాకుని కలిపి నూరి, ఒక చెంచామోతాదులో కాసిని నీళ్లలో కలిపి తాగితే ఆటలమ్మ వ్యాధి, పొంగు లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి.

ఒక భాగం నల్లనువ్వులు, రెండుభాగాలు బావంచాలను (psoraline seeds) కలిపి మెత్తగా దంచి తేనెతో కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని 1-2 మాత్రలు రోజూ ఉద్యాన్నే తీసుకుంటూ ఉంటే బొల్లి వ్యాధి త్వరగా తగ్గుతుంది.

 బావంచాలను చిక్కటి పాలలో వేసి తోడు పెట్టి, ఆ పెరుగుని బాగా చిలికి తీసిన వెన్నని తేనె కలిపి తింటే బొల్లి తగ్గుతుంది. 1-2 చెంచాల మోతాదులో తీసుకోవచ్చు.

ఈ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఎక్కువగా సౌందర్య సాధనాల విషయలు కనిపిస్తాయి. కచ్చూరాలు, జటామాంసి, దాల్చిన చెక్క, ప్రియాంగువు వీటిని మెత్తగా దంచిన పొడిని నీళ్ళలో వేసి కాస్తే ఆ నీరు పన్నీరులా సుగంధభరితంగా ఉంటుంది. దానితో స్నానం చేస్తే శరీర పరిమళం పెరుగుతుంది. ఈ పొడికి సమానంగా పెసర పిండి లేదా శనగపిండి కలిపి నలుగు పెట్టుకుని ఈ స్నానం చేస్తే మంచిది.

ఈ విధంగా వందలాది యోగాలను మాహుకుడు 1100 సంవత్సరాల క్రితం మానవాళి వినియోగార్థం హరమేఖలా గ్రంథంలో అందించాడు. చరక సుశ్రుత, వాగ్భాటాలకు 10 వశతాబ్ది తరువాత వ్యాఖ్యానాలు వ్రాసిన రచయితలు మాహుకుణ్ణి చాల సందర్భాలలో ఉటంకించారు.

ఈ గ్రంథాన్ని తెలుగు చేయటంలో సంస్కృతానువాదాల లోపాలను మూల ప్రాకృత ఛాయలతో సరి చూసుకుంటూ వ్రాయటానికి రామచంద్రగారు చాలా శ్రమపడవలసి వచ్చింది. సంస్కృత పండితులైనంత మాత్రాన ఆయుర్వేద సంస్కృత శ్లోకాలు అంత తేలికగా పట్టుబడవు. అందుకు ఆయుర్వేదానుభవం కావాలి. వేటూరి శంకరశాస్త్రిగారు ఆ లోపం లేకుండా సహకరించటంతో ప్రామాణికమైన అనువాద గ్రంథంగా హరమేఖల రూపొందింది.