Monday 9 June 2014

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు - డా|| జి.వి.పూర్ణచందు

అన్నమయ్య పలుకుబడులు - నేటి అవసరాలు

డా|| జి.వి.పూర్ణచందు


'ఒక్క సంకీర్తనె చాలు ఒద్దికె మమ్ము రక్షింపగ
తక్కినవి భండారాన దాచి వుండనీ'' అంటూ ముప్పది వేల పాటల సృష్టికర్తపదకవితా పితామహుడు అన్నమయ్య ఆ సృష్టికర్తను శాసించగలిగాడు. ప్రజల కష్టసుఖాలు శ్వాసించగలిగాడు కాబట్టే వాటిని స్వామికి తన పాటలో నివేదించగలిగాడు!
''నేనొక్కడ లేకుండితె నీ కృపకు పాత్రమేదిఅనీ, నా వల్లనె కీర్తి పొందేవు నీవు - '' అనీ దేవుడితో చెప్పగలిగాడు. భక్తులులేని దేవుడికి గుర్తింపు ఉండదు పొమ్మన్నాడు.
''జనతాభిమతాధిక దానరతుడు'' అంటూనే,''నీవే నేరవుగాని/ నిన్ను పండించేము నేము/దైవమా!నీకంటే నీ దాసులెనేర్పరులు'' అని హెచ్చరిస్తాడు.
దాసులు చేస్తున్నదేమిటంటేఆయన చెరువులో నీళ్లు తెచ్చిఆయన నెత్తినే గుమ్మరించి వరాలు పొందుతున్నారట! ఇదే భావాన్ని పురందరదాసు కూడా ఇలా తిప్పి చెప్తాడు...చెరువులోని నీటిని/ తిరిగి చెరువులోనే పోసి/వరాలను పొందిన భక్తుల వలె కన్పించండి....హరికరుణ వలన సంపదను/ హరికి సమర్పించి/ఆనందంగా జీవించండి'' అని!
''అందరికీ శ్రీ హరే అంతరాత్మ'' అనటం ఒక సంస్కర్త హృదయాన్ని చాటుతోంది.
కానీఅన్నమయ్య రచనలు దాదాపు ఐదు శతాబ్దాలుగా మరుగున పడిపోయి ఎవరికీ కాన రాకపోవటానికి కారణాలు అంతుబట్టవు. ఆయన ''సంస్కృత దాసుడు'' కాకపోవటంపామర భాషలోనే రాయటంఅగ్రవర్ణాధి పత్యానికి దోహదం చేయకపోవటం లాంటి కారణాల వలన అన్నమయ్య తామ్రపత్రాలన్నీ చీకటి కొట్లో బందీలై ఉండవచ్చు.
ఆళ్వారులతో సమానమైన భక్తి ప్రపత్తులు ఉన్నప్పటికీ తమిళుడు గానీతమిళ దేశీయుడుగానీ కాకపోవటం కూడా ఈ చీకటి బందీకి దోహదపడి ఉండవచ్చు. కడపటి విజయనగర రాజులు తమ ఉనికిని కాపాడుకోవటం మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి రావటాన కూడా ఈ నిరాదరణజరిగి ఉండొచ్చు.అన్నమయ్య తరువాత తెరమరుగైన ఆయన పదసాహిత్యం వేటూరి ప్రభాకరశాస్త్రి కృషి ఫలితంగా వ్యావహారిక భాషోద్యమకాలంలో ''వెలుగు''లోకి వచ్చింది.
ఇప్పుడు వాటిని కొత్తగా చదివేవారికి అన్నమయ్య పలుకుబడులునుడికారాలు చూస్తుంటేఅచ్చమైన జనం కవి రచనా వైదుష్యం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆయన ప్రయోగించిన కొన్ని పదబంధాలను పరిశీలిద్దాం...
(1) నీర్వంక తుంగ : పారుతన్న ఏటిఒడ్డున నిలబడి చూడండి- ఒడ్డున పెరిగిన తుంగమొక్కలు తలలు వంచుకుని ఆనీటిని తాకుతున్నప్పుడువాలున ప్రవహిస్తున్న నీటి ఒరవడితో పాటు కొట్టుకుపోతున్నాయా.. అన్నట్టు కన్పిస్తాయి. ఇదొక భ్రమ. నీరు వంకనేపోతున్నట్లు తుంగలు కల్పిస్తున్న భ్రమ. ''నీర్వంక తుంగ మాయె మనసు'' అనే ప్రయోగంలో ఈ భ్రమను వివరిస్తాడు అన్నమయ్య. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉండే వ్యక్తులను ఆయన నా ''నీరొంక తుంగ'' లంటాడు. రోజుకొక రాజకీయ పార్టీలోకి వలసలు వేగంగా జరుగుతున్న ఈ రోజుల్లో మనిషి ఒక పార్టీలోనే ఉన్న మనసు వేరు పార్టీ మీద ఉన్న వాళ్ళు నీరొంక తుంగలనిపించు కుంటారు. మనతో కలిసే నడిచాడుగా నిన్నటి దాకా..'' అని ఆ తర్వాత ఈ పార్టీ వారు ఆశ్చర్యపోతారు.
(2) అంగడికెత్తిన దివ్వె = అందరికీ ఉపయోగపడే విధంగా వెలిగించిన దీపం. వీధి దీపానికి ఈ పదబంధం అతికినట్టు సరిపోతుంది!
(3) అంగడి నమ్మి కొను : ''ఆపదలంగడి నమ్మి కొనరో పాపాత్ములు పైపై బడకా..'' అంటాడు. అందులోనే పడి కొట్టుకొంటున్నాడనిపాపకూపంలోంచి బైటపడలేకపోతు న్నాడని చెప్పటం.
(4) అంకడిబడు= పారిపోవటంబజార్నపడటం
(5) అడవుల వెన్నెలలు = పైపై తళుకులు
(6) అప్పలప్పలు : పిల్లల్ని ముద్దుగా పిలవడం
(7) అలుగువారు = అలుగు అంటే తూము.  చెరువునిండాక తూముల్లోంచి నీళ్ళు పారతాయి. తమ కడుపు నిండాక ఇఅతరుల గురించి ఆలోచించటం అనే వ్యంగ్యం
(8) ఆడుగొల = స్త్రీ హింస
(9) ఇరవ చూపు = చోటు చూపించటం
(10) ఇనుము దాగిన నీరగు = అందమైన అనుభవాన్ని పొందలేక పోవటం.''ఊహల నా భోగమెల్ల ఒళ్లబట్టె నంటామంటే, /దాహము తోడ నినుము దాగిన నీరాయగా!''
(11) ఈడు వెట్టడం : సమానం చేయటం. ''చక్కని కన్నుల సూర్య చంద్రులుగా గలవాడు/ఎక్కుడుగా కిందఱిలో నీడు వెట్టేదా?''
(12) ఉప్పవడమగు = ''ఉప్పవడము గావయ్యా ఉయ్యాల మంచము మీద'' = మేలుకోమని కోరటం.
(13) ఊరులేని పొలిమేర = ఉండదని చెప్పటానికి చేసే ప్రయోగం.
(14) యేకట తీరు = సంతృప్తి కలిగిందని చెప్పటం: ''నీ యేకట దీఱద యింకాను''
(15) ఎసరెత్తు = అసలుకే ఎసరు పెట్టడం'' కొసరుచు నాతో గూటమిసెసే/ యెసరెత్తకు మీ యింకానూ''
(16) యేటిలో పైరు = అశాశ్వతము-వృథా ప్రయాస
(17) ఏరు గుడిచి కాలువు పొగుడు= ఒకదాని వలన లాభం పొందిఅంతకన్నా చిన్నదాన్ని పొగడటం. తెలివితక్కువతనం
(18) ఒగరు తీపగు = బాధే సౌఖ్యమనే భావన!
(19) ఒత్తి గొట్టాన పెట్టు= పిండిని పిసికి గొట్టంలో పెట్టి నూనెలో ఒత్తి కారప్పూసను వండుతారు''. బాధించటం ఒత్తిగొట్టాన బెట్టగని లేదు ఓరి నీ చిత్తమింతే కానీ''
(20) కఱ తలయోగి= కొందరికి ఎక్కేందుకు మెట్లుండవు. కొందరికి దిగేందుకు మెట్లుండవు. ఎక్కేమెట్లులేని ఉన్నతస్థితి చేరిన వాడిని 'కరతల యోగి'' అన్నాడు అన్నమయ్య
(21) కాకుసేయు = చీకాకు పెట్టటం.
(22) కూరవండి కసవేరగోరు = కమ్మని కూరవండుకొనిగడ్డికోసం వెదకటంతగని పనులు
(23) కెల్లు రేగు = చెలరేగటం : ''కెల్లు రేగె దేహమందే!''
(24) కొంకి తెంచి ముడిగొంటేకుఱ్కు = బావిలోనీళ్ళు తోడ టానికి చేంతాడు కొసలు విడిపోయాయని కత్తిరించి ముడి వేసుకొంటూపోతే కొన్నాళ్ళకు చేంతాడు కురుచపోతుంది.
(25) కొంగు రొక్కాము = ''పాకెట్‌ మనీ'' లాంటి ప్రయోగం. అప్పటికప్పుడు అవసరానికి ఉపయోగపడే డబ్బు;
(26) కొండలకేగు = కొండలకేగెనుసత్యము'' కథకంచికి చేరిందనటం లాంటిది!
(27) గరివడు = ఇక్కడే స్థిరంగా నిలిచిపోవటం '' కలకాలమిందుననే గరివడె బ్రతుకు''
(28) గాడికట్టు = పాతుకుపోవడం
(29) గాలిపోవు : పరువు పోవుగాలి పోయిందనటం!
(30) చలివాపు = సిగ్గుసంకోచములను తొలగించారు.
చలివాపి ఆపెనిడ సరిచేసులాడుకొంటా..
(31) చవిగొన్న కూరలకుమేలుంకీడు గొనియాడు= తినేసి సరిపడుతుందా లేదా అని ఆలోచించి చింతించటం వృథా..
(32) చిగురులో చేగయగు = చిగురుగా ఉన్నప్పుడే చేవ దేరిందనటం.
(33) చిమడబెట్టు= మనసు కుతకుతలాడిపోవడం: ''చింతచే నీ మనసు చిమడబెట్టేవు''
(34) చుట్టపు పగలు = మిత్రులుగా కన్పించే శత్రువులు
(35) చే బంగారం = అందుబాటులో ఉన్నది.


అన్నమయ్య పలుకుబడులన్నీ ఆనాటి ప్రజలు మాట్లాడుకున్న తెలుగుభాషగా భావించాలి. వాటిలో కొన్ని సీమప్రాంతంలో నేటికీ వాడుకలో ఉన్నాయి. ఈనాటి భాషలో వాటిని 'మాండలికంఅంటున్నాం. ఈనాటి మాండలికాలన్నీ ఒకప్పటి తెలుగు భాషాపదాలే! ఆనాటి తెలుగు ప్రజలందరూ మాట్లాడుకున్నవే! ఈనాటికీ మాండలికాలను ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా'' పొంతకూటి కుండ''(అందరి హక్కు)గా చేయగలిగినందువలన ప్రయోజనం ఉంటుంది. నేటి అవసరాలకు తగిన పదాలను నాటి భాషలోంచి ఏరుకోవటంలో విజ్ఞత ఉంటుంది.

ప్రేమస్వాతంత్ర్యం :: డా. జి వి పూర్ణచందు


ప్రేమస్వాతంత్ర్యం
డా. జి వి పూర్ణచందు
ప్రేమ స్వాతంత్ర్య సంఘం (ఫ్రీ లవ్ సొసైటీ) అనే సంస్థ ఒకటి స్వాతంత్ర్యోద్యమం తొలినాళ్లలో బాగా విస్తృతంగా పనిచేసేది. చలంగారు బెజవాడలో ఉన్న రోజుల్లో అలాంటి సంస్థ ఒకటి ఇక్కడ పనిచేసేదని చెప్తారు.
పెళ్ళిళ్ళు, కడుపులు, వ్యభిచారాల్లాంటి జంజాటాలకు అతీతమైన ప్రేమని సంస్థ ప్రబోధించేది. అదొక ప్రేమ ప్రపంచం. వ్యక్తిగతమైన స్త్రీపురుష బంధాల్ని కట్టుబాట్ల చట్రంలో బిగించటాన్ని ఉద్యమం వ్యతిరేకిస్తుంది. పరిణతి పొందిన స్త్రీ పురుషుల మధ్య భావోద్వేగాల పరమైన సంబంధాల్ని, లైంగిక పరమైన సంబంధాల్ని గౌరవనీయమైనవి గానే సంస్థ పరిగణిస్తుంది. చర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఇంగ్లండు కార్యస్థానంగా ప్రారంభమైన ఉద్యమం ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర మత దేశాలకూ ఇది విస్తరించింది.
ప్రేమించవలసిందిగా వేధించే యాసిడ్ ప్రేమికుడికి,సెక్సు కోసం భార్యని వేధించే భర్తకీ మధ్య మనస్తత్వ పరంగా ఎలాంటి తేడా లేదనీ, వివాహవ్యవస్థ అనేది రేప్ చేసే హక్కులిచ్చేది కాదని ఫ్రీ లవ్ ఉద్యమం’ వాదిస్తుంది. ప్రేమలేని పెళ్ళిళ్ళు రేప్ చేయటం కన్నా ప్రమాదకరమైనవే!
స్త్రీలకుప్రేమస్వాతంత్ర్యం ఉండాలనే లక్ష్యంతో పందొమ్మిదో శాబ్దిలో ఫ్రీ లవ్ఉద్యమం బాగా ఊపులోకొచ్చింది. భూమ్మీద సమస్త సుఖోపభోగాలూ అనుభవించటానికి పెళ్ళి ప్రధాన ఉపకరణం అనీ, అస్థిర ప్రపంచంలో సుస్థిర మైంది వివాహబంధం ఒక్కటేననీభావించటం వలన వివాహవ్యవస్థలో స్త్రీబానిసత్వం పెరిగి పోతోందనే భావన అందరిలోనూ కలిగింది. ఆ సమయానికి తెలుగు నేలమీద రాజా రామ్మోహనరాయి, రఘుపతి వేంకటరత్నం నాయుడు, కందుకూరు వీరేశలింగం ప్రభృతుల ప్రభావం ఎక్కువగా ఉంది. విధవా పునర్వివాహం, దేవదాసీ వృత్తి నిర్మూలన, స్త్రీ స్వేఛ్ఛ లాంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. భావ ప్రకటనా స్వేఛ్ఛ కోసం మహిళలు, పురుష సంస్కర్తలూ పోరాటం సాగించారు. స్వాతంత్రోద్యమం కూడా తోడు కావటంతో మహిళలు స్వేఛ్ఛగా బయటకొచ్చి ఉద్యమ బాట పట్టటం కూడా స్త్రీ ఉద్యమానికి తోడయ్యింది.  ఆ విధంగా ‘ప్రేమ స్వాతంత్ర్యోద్య’మాన్ని తెలుగు వారు త్వరగానే అందుకో గలిగారు.  
18వ శతాబ్దిలో మహిళా ఉద్యమం (ఫెమినిజం), 19వ శతాబ్దిలో ప్రేమ స్వాతంత్ర్యోద్యమం మొదలయ్యాయి. పెళ్ళి అనేది మహిళా నిర్మూలనా(annihilation of woman)కార్యక్రమంగా మారిపోతోందని ఈ ఉద్యమం హెచ్చరించింది. తన కిష్టమైన వ్యక్తిని పెళ్ళాడే హక్కు, తన ఇష్టంతోనే భర్తైనా సరే సెక్సుని పొందే హక్కు, తనకు పిల్లలు కావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు, ఇలాంటివి ఉన్నప్పుడే పెళ్ళి అనేది సౌఖ్యదాయకం అవుతుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం, పురుషుడు ఆమెని దానం స్వీకరించటం, స్త్రీని పురుషుడికి చట్టబద్ధంగా అప్పగించటాల వలన మాత్రమే వివాహ వ్యవస్థ పవిత్రమైందనటం సరికాదు. స్త్రీ పురుషు లిద్దరికీ స్వాతంత్ర్యం కావాలి. ఇష్టం అయిన వ్యక్తిని ప్రేమించటం, తను ప్రేమించే, తనను ప్రేమించే వ్యక్తితో కలిసి జీవించటం ప్రాథమిక హక్కు కావాలని ఈ ప్రేమ స్వాతంత్ర్యోద్యమం కోరింది.
కానీ, కాలక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం స్త్రీల చేతుల్లోంచి పురుషుల చేతుల్లోకి మారిపోయింది.  చివరికి అది గే-సెక్స్(స్వలింగ సంపర్కం)  మరియూ Gay rights కోసం పోరాడే ఉద్యమంగా మారిపోయింది.
కాల వైపరీత్యమే అనండి, లేక తప్పనిసరి పరిణామమే అనండి... వివాహ వ్యవస్థ విడాకుల వ్యవస్థగా మారింది. నచ్చిన వాడితో కలిసి జీవించటానికి సహజీవనం అనే ముద్దు పేరు స్థిరపడింది. దీన్ని domestic partnership అంటున్నారిప్పుడు. ఇంట్లోజరిగితే శృంగారం, బయట జరిగితే వ్యభిచారం అనే ధోరణి ప్రబలింది. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ప్రతి జంటా తమది సహజీవనం అంటే చట్టం కూడా నోరెళ్ళ బెట్టే రోజులు ముందున్నాయి.మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రేమ ఒక నిషిద్ధ పదార్ధంగా మారిపోయేంతగా ఇలా వెర్రి పోకడలు పోతోంది. ఆ దుష్ట ఫలాలు మనకూ బాగానే పండుతున్నాయి.
 ప్రేమ పెళ్ళిళ్ళు గానీ, పెద్దలు చేసిన పెళ్ళిళ్లు గానీ, చాలావరకూ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోవటానికి కారణాల గురించి ఆలోచించక  పోతే మేథావులు పెద్ద తప్పు చేసిన వారౌతారు. ముఖ్యంగా పెళ్ళికి సిద్ధంగా ఉన్న జంట తమను తాము మూల్యాంకనం చేసుకుని తమలో ఉన్న ప్రేమ గుణాలకు మార్కులు వేసుకోవాలి. కనీసం యాబై మార్కులు దాటిన వాళ్ళు తమ ప్రేమ గుణాలను పెంచుకుని అప్పుడు ప్రేమకు, ఆ తరువాత పెళ్ళికీ తలపడాలి. దంపతులు కాగోరేవారికి ఈ విషయాన్ని తప్పకుండా తెలియ జెప్పాలి.
నేటి కాలపు ప్రేమ ముసుగులో భావోద్వేగ పరమైన అవసరాలు (emotional needs) ఆవహించినప్పుడు అది ప్రేమ పరిథి దాటిపోతుంది. కేవలం అవసరం గడుపుకోవటంగా మారిపోతుంది. అవసరం లేదనిపించిన రోజు ప్రేమకు తాత్కాలికంగా తెరపడ్తుం దన్నమాట! పైన చెప్పుకున్న Emotional needs అనేవి ప్రేమకు ప్రాతిపదిక లైనప్పుడు మగాడు తన అవసరం తీర్చవలసిన బాధ్యత  తనను ప్రేమించే వ్యక్తిదే ననే భావన బలపడుతుంది. “నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టైతే నన్ను ఆపకు... నేను చెప్పినట్టు చెయ్యి... నా చెప్పుకింద తేలులా పడి ఉండు...” అనే మాటలు మొదలౌతాయి. చివరికి ‘ప్రేమ స్వాతంత్ర్యం’ అనేది ప్రేమ బానిసత్వం అవుతుంది.
మానసిక శాస్త్రవేత్తలు దీన్ని, ఆధునిక సమాజపు పోకడలలో ఒక రుగ్మతగా భావిస్తారు. ఇందుకు తెలుగు నేల మినహాయింపు కాకపోవటమే ఆందోళన చెందాల్సిన విషయం. భావోద్వేగాల సమతుల్యత (emotional equilibrium) ఉన్నప్పుడే ప్రేమ బలంగా, స్థిరంగా ఉంటుంది. ‘ఇది కావాలి’ అనే కోరిక బలంగా ఉన్నప్పుడు ‘ఇది ఇవ్వాలనే’ కోరిక కూడా అంతే బలంగా అవతలి వ్యక్తిలో కూడా ఉన్నప్పుడే సమతుల్యత నిలబడుతుంది. లేకపోతే ఏకపక్షంగా మారిపోయి చివరికి ‘ప్రేమబానిసత్వా’నికి లొంగి పోవటమో, విడాకులకు సిద్ధపడటమో జరుగుతుంది. ‘నా అవసరం ఒక్కటి కూడా తీరలేదు అనే అసంతృప్తి ఇద్దరిలో ఎవరికి వున్నా అందులో దాంపత్య శోభ కనిపించదు. ప్రేమికులం అని ఘనంగా చెప్పుకునేవారు ఈ సమతుల్యత గురించి ఆలోచించక పోతే దాంపత్యాలు మురిగి పోతాయి.
 “ప్రేమ ఋజుమార్గాన (positively motivated) ఉన్నప్పుడు, love అనేది మిమ్మల్ని lovable చేస్తుంది” అంటుంది మానస శాస్త్రం. అనేక నెలలుగా ప్రేమించుకుని, పెద్దల్ని ఎదిరించి పోరాడి పెళ్ళి చేసుకుని మూడో నెలకే విడాకులో, పెటాకులో తప్పని పరిస్థితి ఎక్కువమందిలో వస్తున్నదంటే నిజమైన ప్రేమ విలువ తెలిసే స్థాయిలో వాళ్ల ప్రేమ సాగలేదనే అర్థం.
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రేమ నిజమైన ప్రేమ కాదనే భావిస్తారు. ప్రేమించే తత్వం ఉన్నవారు పిపీలకాది పర్యంతం సమస్తాన్ని ప్రేమించే గుణం కలిగి ఉండాలి. కేవలం ఫలానా అమ్మాయినో లేక ఫలానా అబ్బాయినో మాత్రమే ప్రేమించేట్టుగా ఉండరు. ప్రేమించే గుణం ఎంత ఉందనేది ప్రేమించటానికి అర్హతని నిర్ణయించే ఒక కొలబద్ద. ఎవరికి వారే ఆ కొలబద్దగా తమను తాము విశ్లేషణ చేసుకోవటం మొదట జరగాలి. అదే జరిగితే విడాకులదాకా వెళ్ళిన వాళ్ళు కూడా కలిసి పడగ్గదికి వెళ్ళగలుగుతారు.