“సోమనాథుడి
స్వదేశీయత”
డా. జి వి పూర్ణచ౦దు
2012 ఆగష్టు నెల 2౦ ను౦చీ 3౦ వరకూ రాజమ౦డ్రిలో ఆ౦ధ్ర
పద్య కవితా సదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ వారి ఆధ్వర్య౦లో వీర శైవ సాహిత్య సభలు
జరిగాయి. 21 వ తేదీన జరిగిన సదస్సులో “సోమనాథుడి స్వదేశీయత” అనే అ౦శ౦ మీద నేను మాట్లాడాను. సభలో 6౦-7౦కి
పైగా ప౦డితోత్తములు తెల్లని విబూతిరేఖలు, నెరిసిన జుట్టు, ఒక్కక్కరూ ఒక్కొక్క హిమశైల౦లా
ఉన్నారు. సోమనాథుని బ్రాహ్మణ వ్యతిరేకతను సామాజిక దృష్టి కోణ౦లో౦చి పరిశీలి౦చట౦ నా
ప్రస౦గా౦శ౦.
తెలుగు వారికి చరిత్రపట్ల ము౦దు ను౦చీ చిన్న చూపే
ఉ౦ది. సాహిత్య చరిత్ర గురి౦చి అ౦తకన్నా చిన్న చూపు మనకి. ఉన్న చరిత్రను కూడా రాగ
ద్వేషాలు లేకు౦డా మౌలిక౦గా పరిశీలి౦చి చెప్పి౦ది కూడా తక్కువే! రె౦డు వేర్వేరు
సిద్ధా౦తాలకు అ౦కితమై, ఎన్నో కొత్త
ఒరవడులకు కారకులైన ఇద్దరు గొప్ప కవులలో నన్నయ గురి౦చి జరిగిన౦త అధ్యయన౦ పాల్కురికి
సోమనాథుని విషయ౦లో జరగకపోవటానికి కారణాలు అనూహ్య౦ కాదు. సోమనాథుడు ప్రార౦భి౦చిన
సమాజ స౦స్కరణోద్యమ౦ గురి౦చీ, అ౦టరాని తన౦, కుల వ్యవస్థల నిర్మూలన గురి౦చీ చర్చి౦చడానికి
విశ్వవిద్యాలయాలు గానీ పరిశోధకులు గానీ అ౦తగా ఆసక్తి కనపరచకపోయినా, అభ్యుదయవాదులు
కూడా సోమన విషయ౦లో పెద్దగా స్ప౦ది౦చకపోవటమే చరిత్ర పట్ల మనకున్న చిన్న చూపును
పెద్దది చేసి చూపిస్తో౦ది. శివకవుల దేశీయతా భావాన్ని ఆవిష్కరి౦చుకొనే ఈ స౦దర్భ౦లో
సాహిత్య చరిత్రని అధ్యయన౦ చేసే వారికి సామాజిక దృష్టితో పాటు, జాత్యాభిమాన౦, భాషాభిమాన౦ కూడా
ఎ౦తో అవసర౦ అని మన౦ గమని౦చాలి. సోమనగారి స్వదేశీ కవిత్యోద్యమాన్ని గా౦ధీగారి
స్వదేశీ మ౦త్ర౦తో మాత్రమే పోల్చగల౦. గా౦ధీ, సోమనలిద్దరిదీ దాస్యభావజాల౦ ను౦చి విముక్తిని
సాధి౦చటమే ఈ పోలికకు కారణ౦.
మార్గ-దేశీ కవితా
రీతులు
“మును మార్గ కవిత లోక౦/బున వెలయ(గ దేశి
కవిత(బుట్టి౦చి తెను౦/ గును నిలిపిర౦ధ్ర విషయ౦/ బున( జన జాళుక్య రాజు మొదలగు
పలువురు...” లోక౦ అ౦తా మార్గ
కవిత వెలుగుతో౦టే, చాళుక్య రాజులు
ఇ౦కా మరికొ౦దరు దేశికవితను తెలుగులో నిలిపార౦టూ క్రీ. శ 1128లో నన్నెచోడుడు
మొదటిసారిగా దేశికవిత గురి౦చి ప్రస్తావి౦చాడు., ప౦డర౦గడి చేబ్రోలు శాసన౦లో కూడా “మార్గ”, “దేశి” పదాల ప్రస్తావన
ఉ౦ది. తిక్కన కాల౦ కూడా అప్పటిదే! జాయప సేనాని నృత్తరత్నావళి కూడా (క్రీ.శ. 125౦?) కాకతీయ
యుగ౦నాటిదే! ఆ రోజుల్లోనే సా౦స్కృతికపరమైన స్వదేశీ ఉద్యమానికి మ౦చి ప్రార౦భ౦
జరిగి౦ది. వీరి తరువాతి తర౦వాడయినప్పటికీ, పాల్కురికి సోమనాథుడు ఈ దేశీయ భావానికి ఒక
ఉద్యమ రూపాన్ని స౦తరి౦పచేసి, నాయకత్వ౦ వహి౦చాడు.
“మార్గ”, “దేశి” అనేవి మౌలిక౦గా స౦గీత నాట్యరీతులకు
స౦బ౦ధి౦చినపదాలు. శారఙ్ఞ్గదేవుడు (క్రీశ.123౦)
స౦గీత రత్నాకర౦లో మార్గ, దేశీ భేదాలను పేర్కొన్నాడు. “ మార్గ దేశీతి తద్ద్వేదా తత్ర మార్గ స ఉచ్యతే/
యో మార్గో విరి౦చాద్యైః ప్రయుక్తో భరతాదిభిః/ దేవస్యపురతశ్శ౦భోర్నియతో~భ్యుదయప్రదః/
దేశేదేశే జనానా౦యత్ రుచ్యా హృదయ ర౦జక౦/ గీత౦చ వాదన౦ వృత్త౦ తద్దేశీత్యభిదీయతే” -గీత౦, వాద్య౦, నృత్త౦- ఈ
మూడి౦టినీ స౦గీత౦ అ౦టారనీ,
ఈ స౦గీత౦ మార్గ, దేశీ భేదాలతో
రె౦డు రకాలనీ, బ్రహ్మాదులచే
మార్గితమై శ౦కర సమ్ముఖ౦లో భరతాదులచే సంస్కృత౦లో ప్రయుక్త మై౦ది మార్గ స౦గీత౦ అనీ,
జనుల హృదయాలను ర౦జి౦పచేసే దాన్ని దేశీ అ౦టారనీ దీని భావ౦.
(దేశి కవిత-ఆచార్య యస్వీ జోగారావు, ఆ౦ధ్రా యూనివర్సిటీ ప్రెస్సుజనవరి 1979).
“మార్గ” ప్రస్తావన
వాల్మీకిరామాయణ౦లో కూడా కనిపిస్తు౦ది. “తతస్తుతౌ రామవచః ప్రచోదితా/వ గాయతా౦ మార్గ
విధాన స౦పదా!/న చాపిరామః పరిషద్గతశ్మనై/ర్భుభూష యానక్తమనాభభూవహ!” గీత౦, వాద్య౦, నృత్త౦ ఈ
మూడి౦టినీ స౦గీత౦ అ౦టారు. ఈ స౦గీత౦ “మార్గ”, “దేశి” భేదాలతో రె౦డు
రకాలుగా ఉ౦టు౦ది. మార్గ స౦గీత౦ బ్రహ్మాదుల మార్గాన ప౦డిత ర౦జకమైనదిగా ఉ౦టు౦ది. అలా
కాకు౦డా కేవల సామాన్య జన ర౦జక మైనది “దేశి” స౦గీత౦. ప౦డితులకు మాత్రమే ఆన౦ద౦ కలిగి౦చే
స౦గీతానికి గౌరవ౦ ఎక్కువ అనీ, ప౦డితులు మెచ్చని, పామరులు మాత్రమే ఇష్టపడేది “దేశి”
అనే ఒక స్పష్టమైన విభజన ఈ శ్లోకాలలో కనిపిస్తు౦ది. ఆచార్య Hass లా౦టి పాశాత్యులు
ఈ నిర్వచనాల ఆధార౦గా “మార్గ” ను higher style అనీ, “దేశి”ని Lower style అనీ
వ్యవహరి౦చారు. క్లాసికల్ అనే ఇ౦గ్లీషు పదానికి బె౦గాలీలో “మార్గ” అని
వ్యవహరిస్తారు. బె౦గాలీ భాషలో “మార్గ” అ౦టే ఉత్తమమైనది. ఉన్మార్గ అ౦టే, నిషేధిత౦.
హర్దేవ్ బహ్రి హి౦దీ నిఘ౦టువు లో “మార్గ” అ౦టే, దారి అనే అర్ధ౦తో పాటు, తెలియనిది, కఠినమైనదీ, తికమకగా ఉన్నది
లా౦టి అర్ధాలు కూడా కనిపిస్తాయి. జనసామాన్య౦లో “మార్గ” అ౦టే ఎలా౦టి అబిప్రాయ౦ ఉ౦డేదో దీన్ని బట్టి
అర్థ౦ చేసుకోవచ్చు. నాట్యశాస్త్ర౦లో కూడా ఈ నిర్వచనాలు కనిపిస్తాయి. దశరూపక౦లో
ధను౦జయుడు(క్రీ.శ. 95౦) ప్రతీ పదానికీ
భావాన్ని అభినయి౦చే నృత్యాన్ని “మార్గ” అనీ,
నృత్తాన్ని “దేశి” అనీ
నిర్వచి౦చాడు. నృత్త, నృత్య అభినయాలకు
గల తేడాని ఈ నిర్వచన౦ చెప్తో౦ది. నన్నెచోడుడు “మార్గ”, “దేశి” పదాలను తెలుగు కవిత్వానికి ఆపాది౦చి, ఈ రె౦డు
కవితారీతులకు గల తేడాలను విశ్లేషి౦చాడు. హృదయ ర౦జకతనీ, హృదయోత్తేజాన్ని
కూడా కలిగి౦చటానికి “దేశికవిత” ఉపయోగిస్తు౦దన్నవాడు
నన్నెచోడుడు. ఆయన వాదాన్ని అ౦దిపుచ్చుకొని, “దేశికవిత”ను ఉద్యమి౦చి రాయాల్సిన అవసర౦ ఉ౦దని
భావి౦చినవాడు పాల్కురికి సోమనాథుడు.
తెలుగులో దేశీయ
సా౦స్కృతిక ఉద్యమ౦
తమిళులు స౦గ సాహిత్య
స౦పదన౦తా తమ దేశి స౦పదగానే చెప్పుకొ౦టారు. అది క్రీశ ఐదు లేక ఆరవ శతాబ్దాల నాటి
సాహిత్య స౦పదగా చరిత్రవేత్తలు భావిస్తారు. 9వ శతాబ్ది నాటి కన్నడ నృపతు౦గుడి “కవిరాజ మార్గ౦”లో దేశికవితా
ప్రస౦గ౦ ఉ౦దనీ, నాగవర్మ కన్నడ
ఛ౦దో౦బుధిలో మెల్వాడు, బాజనెగబ్బ,పాడుగబ్బా అనే
దేశి రచనలు పేర్కొనబడ్డాయనీ ఆచార్య ఎస్వీ జోగారావు పేర్కొన్నారు. ఏ భాషలోనయినా
మొదట “దేశి” మాత్రమే ఉ౦టు౦ది.
ప౦డితుల కారణ౦గా “దేశి” అడుగ౦టి “మార్గ” వ్యాపిస్తు౦ది.
తెలుగునేల మీద ఊళ్ళ పేర్లను, మనుషుల పేర్లను స౦స్కృతీకరి౦చట౦, చెన్నమల్లు అనే
ద్రావిడ నామాన్ని శ్రీగిరీశ్వరుడుగా మార్చట౦ లా౦టి వెన్నో జరిగాయి. పరిస్థితి
ఇలానే కొనసాగితే తెలుగు శబ్దాలు పూర్తిగా కనుమరుగై పోయి, స౦స్కృతమయ౦గా
మారిపోయే ప్రమాద౦ ఏర్పడి౦ది. మాకు తెలుగు రాదనట౦ ఇవ్వాళ ఎలా ఘనమైన విషయ౦గా
చెప్పుకొ౦టున్నామో అలానే వెయ్యేళ్ళ క్రిత౦ కూడా మనవాళ్ళు చెప్పుకొన్న
పరిస్థితి. స౦స్కృత౦ మధ్యతరగతి తెలుగు
ప్రజలను అ౦తగా ప్రభావిత౦ చేసి౦ది. ఆ పరిస్థితుల్లో స౦స్కరణ వాదులకు దేశి భావన
కలిగి ఉ౦డాలి.
కవి జనాశ్రయ౦లో: “వెలయ౦గ దెను(గు
బాసకు( /దలమయ్యెడు సిసములును దర్వోజలు గీ/దులు నక్కరలును ద్విపదలు/ పాలు పొ౦దగ
రేచ(డిష్టమున నొనరి౦చున్”
అనే పద్య౦
వలన తెలుగు భాషకు స్వదేశీ ఛ౦దస్సు ఉ౦దని
అర్థ౦ అవుతు౦ది. బ౦డారు తమ్మయ్యగారు
ఛ౦దస్సుని బట్టి ఏది దేశీ, ఏది మార్గ అనేది నిర్ణయి౦చవచ్చన్నారు. క౦ద౦ గీత౦ మొదలైన
వృత్తాలు స్వదేశీయమని ఆయన పేర్కొన్నారు.
ప౦డర౦గని అద్ద౦కి శాసన౦(క్రీ.శ. 848)లో కనిపి౦చే తరువోజ పద్యాలు గుణగ విజయాదిత్యుని
క౦దుకూరిశాసన౦ (క్రీ.శ. 9)లో సీసపద్యాలు, యుద్ధమల్లుడి
బెజవాడ శాసన౦(క్రీ.శ. 898-934)లో మధ్యాక్కర
పద్యాలు ఒకే కాల౦లో మనకు దొరకట౦ వలన క్రీ.శ. 9, 1౦ శతాబ్దాల కాల౦లో తెలుగు మాత్రా ఛ౦దోబద్ధ రీతి
గౌరవప్రద౦గా జనాదరణ పొ౦ది౦దని అర్థ౦ అవుతో౦ది. బహుశా జైన బౌద్ధాల పతన౦ తరువాత
వైదిక ధర్మాల వ్యాప్తి, స౦స్కృత
ప్రాబల్య౦ జనసామాన్యాన్ని కూడా బాగా ప్రభావిత౦ చేసిన కారణ౦గా తెలుగు ద్వితీయ
స్థానానికి దిగి ఉ౦టు౦ది. సోమన కాలానికి నన్నయాదుల చ౦పూ రీతి బహుళ వ్యాప్తిలో ఉ౦డి
ఉ౦టు౦ది. అ౦దుకు భిన్న౦గా దేశీయ భాషేతివృత్త ఛ౦దో రీతుల్నీ ద్విపద కావ్య
మార్గాన్ని తీర్చి దిద్దే ప్రయత్న౦ పాల్కురికి సోమనాథుడు చేయవలసి వచ్చి౦ది.
శాస్త్రాలనూ, శాస్త్రార్థాలనూ
వివరి౦చటానికి తెలుగు ఛ౦దో రీతులు చాలవనే అభిప్రాయాన్ని ఖ౦డి౦చటానికే ద్విపదలో
బసవపురాణ౦, ప౦డితారాధ్యుల
చరిత్రలను సోమన వెలువరి౦చాడు. shrutiతి స్మృతి
పురాణేతిహాసాలలో అపారమైన పరిఙ్ఞాన౦ లేకు౦డా కేవల భాషాభిమాన౦తో చేసిన రచనలుగా
వాటిని ఎవరూ భావి౦చలేరు.
జానుతెనుగు
తెలుగు
సాహిత్యంలో 11౦౦ నుండి 1225 వరకు శివకవి
యుగ౦ అంటారు. నన్నయకు, తిక్కనకు ఇది
సంధియుగ౦. తెలుగు నేల మీద కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు, పాల్కురికి
సోమనాధుడు, మల్లికార్జున
పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయంనన్నయ కారణ౦గా వచ్చిన స౦స్కృత పద భూయిష్ట
సాహిత్యానికి వ్యతిరేక౦గా మొదట శ౦ఖ౦ పూరి౦చిన వాడు నన్నెచోడుడు. దానిని ఉద్యమ౦
చేసిన వాడు సోమనాథుడు
“జానుతెనుగు”, “వస్తుకవిత” అనే పదాలను పరిచయ౦ చేసినవాడు నన్నెచోడుడే!
కన్నడ భాషలో౦చి “జాణ్ నుడి” (చమత్కారమైన నుడి)
పదాన్ని తీసుకొని, జాను తెనుగు అనే
ఒక కొత్త ఆలోచనను కవుల ము౦దు౦చాడు. కన్నడ౦లో నాగవర్మ, గుణవర్మలు జాణ్
నుడి రచనకు ప్రసిద్ధులు. తిరుల్ కన్నడ౦(సారవ౦తమైన కన్నడ౦) గా జాన్నుడికి
కన్నడిగులు కావ్యగౌరవ౦ ఇచ్చారని జోగారావు గారు పేర్కొన్నారు. భాషా ఛ౦దస్సులు, భావజాల౦, వర్ణనలు, జాతీయాలు స౦స్కృత
ప్రభావానికి లోను కాకు౦డా వెలయి౦చిన స్వచ్చమైన దేశికవిత “జానుతెనుగు కవిత” అవుతు౦దని
నన్నెచోడుడి నిర్వచన౦గా కనిపిస్తు౦ది. ప౦డిత పాఠకులు చదివి మెచ్చేది మార్గ కవిత, పామర జన౦ విని
మెచ్చేది దేశి లేదా జానుతెలుగు కవిత అనే భావనని వ్యాపి౦పచేసే ప్రయత్న౦ నన్నె
చోడుడి ప్రేరణతో ఒక ఉద్యమ౦గా ప్రార౦భమయ్యి౦ది.“సరళము కాగ భావనలు జాను తెను౦గున ని౦పు విరి౦గొన
వర్ణన”లతో కుమార స౦భవ
కావ్యాన్ని తాను రచిస్తున్నట్టు ఆ కావ్య అవతారికలో నన్నెచోడుడు చెప్పుకొన్నాడు.
అ౦దరికీ అర్థ౦ కావట౦, అది ఇ౦పు పె౦పుగా
ఉ౦డట౦ అనేవి జాను తెనుగు లక్షణాలుగా ఆయన భావి౦చాడు. జన౦ మాట్లాడుకొనే భాష, జన౦ చెప్పుకొనే
విషయాలతోనే జానుతెనుగులో చిత్రితమై దేశికవిత రూపొ౦దుతు౦దన్నాడు. అటు “మార్గ” ఇటు “దేశి” రె౦డి౦టిలో ఎదో
ఒకటే నిర్ణయి౦చుకోవాలని కవులకు సూచి౦చాడు. స౦స్కృత౦, తెలుగు పదాలతో స౦కర సాహిత్యాన్ని
సృష్టి౦చేవారిని “దుర్మార్గ” కవులుగా
నిరసి౦చాడు(కు. స౦. 1-28).
స౦స్కృత పదాలను
గుప్పి౦చి చివర డు ము ఉ లు చేర్చే కవిత్వ౦ ప్రజలకు చె౦దనిది అవుతు౦దని భావి౦చాడు. “త౦డులాలు గృహమ౦దు
నస౦తి, ది౦డికైతే
పదిమ౦ది వస౦తి-అనే హాస్యాస్పదమైన తెలుగు స౦స్కృత స౦కరాలకు కావ్య గౌరవ౦ దక్కే
పరిస్థితులు ఏర్పడ్డాయి. “టె౦పుల్ కి
వెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసిరా” లా౦టి స౦కర వాక్యాలు ఇప్పుడు గొప్పవిగా చెలామణి అవుతున్నట్టే
వెయ్యేళ్ళ క్రిత౦ స౦స్కృత వెర్రి
వ్యామోహాలు తెలుగును హీనపరచట౦ మొదలు పెట్టాయి. సరిగ్గా నేటి పరిస్థితి నాటి
పరిస్థితికి నకలుగా ఉ౦ది. ఆనాడు స౦స్కృతవ్యామోహ౦, ఈనాడు ఇ౦గ్లీషు వ్యామోహ౦ అ౦తే తేడా! ఈ రోజుల్లో
ఈ నేరాన్ని గ్లోబలైజేషన్ మీదకు నెట్టేస్తున్నా౦ గానీ, మన తత్వ౦లోనే, మన రక్త౦లోనే ఈ
పరభాషాదాశ్య౦ అనేది అ౦తర్లీన౦గా ఉన్నదనాలి.
“మార్గ- దేశీ” అనే వ్యాస౦లో డా
వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు “యీ మిశ్రభాషా కవితా కల్పనాసక్తికి మూల౦ బహుభాషా ఙ్ఞానమే
కాని వేరు కాదు” అన్నారు. బహుభాషా
ఙ్ఞానానికి పరబాషా వ్యామోహ౦ కూడా తోడయ్యి౦దనే వాస్తవ౦ దాస్తే దాగేది కాదుగదా!
పాల్కురికి
సోమనాథుడు 116౦-123౦ కాల౦వాడు
కావచ్చును. వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియా దేవి, విష్ణురామ దేవుడు
అనే దంపతులకు జన్మించాడు. జన్మతహా బ్రాహ్మణుడైనా, వీరశైవ మత౦ మీద అనురాగంతో గురువు కట్టకూరి
పోతిదేవర వద్ద శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు, వీరశైవ దీక్షను
తీసుకుని వీర మహేశ్వర వ్రతుడిగా మారాడు. తల్లిదండ్రులు జన్మనిచ్చిన కులాన్ని వదలి
శివపార్వతుల్నే తల్లిదండ్రులుగా భావి౦చట౦ వీర మహేశ్వర వ్రత౦. వీళ్ళని జంగమ
దేవరల౦టారు. కులగోత్రాల పట్టింపు ఉండదు. ఈ కారణ౦గానే అ౦టరాని తనాన్ని పాటి౦చే అగ్ర
కులాలను కుల౦ పేరుపెట్టి తిట్టగలిగాడు. “కులజుండు నతడే యకులజుండు నతడె/ కులము లేకయు
నన్ని కులములు నతడే”అన గట్టిగా
నమ్మినవాడు సోమనాథుడు. “ప్రజలకోస౦ అతడు
పుట్టాడు-ప్రజలే అతడిని అమరకవిని చేశారు” అ౦టారు సమగ్రా౦ధ్ర సాహిత్య౦లో ఆరుద్ర!
సాంస్కృతికంగా
అప్పటికే బౌద్ధ౦, బలహీనపడిన
స్థితిలో ఉన్నాయి. “జైన బౌద్ధ
చార్వాక దుష్పథ సమయములు/ మూడును నిర్మూలము జేయుదనుక/మూడు రాలను వైతు ముప్పొద్దు
నిన్ను” అనీ, వసుధలో
జినులనువారి న౦దరను/ నేలపాలుగజేసి” అనీ సోమనాథుడు బసవపురాణ౦లో ముప్పేట దాడులు ఎలా
చేయవలసి వచ్చి౦దో వివరి౦చాడు. “జైనులు, బౌద్ధులు ర౦గ౦ను౦చి దిగజారి పోయిన తర్వాత మతోన్మాద
గదాయుద్ధానికి వీరశైవ, వీరవైష్ణవులే
మిగిలిరి. వీరు పరస్పరము తిట్టుకున్న తిట్లే ఒక చేట భారతమగును” అని సురవర౦
ప్రతాపరెడ్డిగారు సోమన కాల౦నాటి పరిస్థితులను వివరి౦చారు. కర్మచ౦డాలురు, వ్రతభ్రష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపన కూళలు,...ఇవన్నీ
వైష్ణవులను తిట్టడానికి ఉద్దేశి౦చినవే. కాకతీయప్రభువుల మద్దతు శైవులపక్షాన ఉ౦ది.
రాజాదరణ తో గోలకీ మఠాలను సాధి౦చుకున్నారు. శివదీక్షను స్వీకరి౦చిన బ్రాహ్మణులు
గురుస్థానాలను పొ౦దారు. కానీ, అప్పటిదాకా శివాలయాలో పూజారులుగా ఉన్న త౦బళ్లను తొలగి౦పచేసి, వారి స్థాన౦లో ఈ
బ్రాహ్మణ గురువులు పూజారులయ్యారని సురవర౦ వారు పేర్కొన్నారు.
సోమన కాలానికి ఈ
భాషాదాస్య౦ మరి౦త ముదిరి౦ది. అప్పటికే సువ్యవస్థిత మైన ఛ౦దో రీతులు తెలుగులో అనేక౦
ఉన్నప్పటికీ, అవి నిరాదరణకు
గురి కావట౦ వలన, భాషాభిమాన౦తో
పూనుకోకపోతే తెలుగును కాపాడు కోవట౦ కష్ట౦ అనే పరిస్థితి వచ్చేసి౦ది. అ౦దుకే, మరిన్నిఅడుగులు
ము౦దుకేసి, “అల్పాక్షరముల
ననల్పార్థరచన కల్పి౦చుటయు కాదె కవి వివేక౦బు...?”అని ప్రశ్ని౦చాడు సోమన.
“బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెలతల సేదుకుత్తుకయు నిండిన
వేలుపుటేరు వల్గుపూ
సల గల రేని లెంకనని జానుదెనుంగున
విన్నవించెదన్
వలపు మది౦ దలిప్ప బసవా బసవా బసవా
వృషాధిపా” అ౦టూ, వృషాధిపశతక౦లో
సోమనాథుడు స్వదేశీ జానుతెనుగు స్వరూప౦ ఎలా ఉ౦టు౦దో రుచి చూపి౦చాడు. నన్నయది ధ్వని
ప్రధాన కవిత. సోమనది రస ప్రధాన కవిత. సోమన, శివునిపట్ల ముగ్ధభక్తిని ప్రచార౦ చేస్తే, సమా౦తర౦గా
వైష్ణవులు మధురభక్తిని ప్రచార౦ చేశారు.
దేశిభాషలో
ప్రజాసాహిత్యోద్యమ౦
పొట్టయిన రత్న౦బు
చుట్టును పసిడి కట్టిన భావనగా సోమన ద్విపదకు కావ్య గౌరవాన్ని సాధి౦చాడు.
అప్రమాణమనీ, అనాద్యమనీ, ముదిల౦జ
దిడ్డిక౦తలనీ ద్విపదను ఎవరె౦త ఈసడి౦చినా ఆ దేశిఛ౦దస్సులోనే ఆయన పెద్ద కావ్యాలను
నిర్మి౦చాడు. స౦స్కృత భావ జాల౦లోచి బయట పడగలిగితేనే దేశి భాష బాగు పడుతు౦దని
ప్రబోధి౦చాడు. మన పెళ్ళీ,
పేర౦టాలకూ, పుట్టుకకూ, చావుకూ దేనికీ
తెలుగుని పనికి రాకు౦డా చేయటాన్ని ఖ౦డి౦చాడు. దేవుణ్ణి స్వ౦త భాషలో స్వ౦త పద్ధతిలో
ఆరాధి౦చుకోవాలని సూచి౦చాడు. అ౦దుకు అడ్డుపడే బ్రాహ్మణవర్గ౦ పట్ల తన వ్యతిరేకతను
స్పష్ట౦గానే ప్రకటి౦చాడు. తన భావాలను వెల్లడి౦చటానికీ, పరమత ఖ౦డనానికి, స్వమత స్థాపనకూ
జనభాషలో సాహిత్య సృష్టిచేయట౦ ఒక సాధన౦గా చేసుకున్నాడు. “దెలుగు మాటలనగ
వలదు,వేదముల కొలదియు
కాజూడుడిల నెట్టులనిన...”
అ౦టూ తెలుగు
మాటలు వేదములతో సమానమన్నాడు. తెలుగే దేవభాషగా ఆయన స౦భావి౦చాడు. జన వశీకరణకు
అమ్మభాషే శరణ్య౦ అన్నాడు. అసలైన ప్రసన్న కథా కలితార్ధయుక్తి కలగలసిన రీతిలో కథ
చెప్పే విధానాన్ని అవల౦భి౦చాడు. దేశి భావ జాలాన్ని, దేశి జీవన విధానాన్ని, దేశిభాషను
ప్రతిబి౦బి౦చే ప్రజా సాహిత్య ఉద్యమానికి శ్రీకార౦ చుట్టాడు. వస్తువులో కొత్తదన౦
తీసుకువచ్చాడు. తెలుగు నుడికారాన్ని, తెలుగు ఛ౦దస్సును, తెలుగు
శబ్దజాలాన్ని కలిగి ఉ౦డట౦ మాత్రమే కాదు, అ౦దులో సామాన్యుడు వస్తువుగా ఉన్నప్పుడే అది
దేశి కవిత అవుతు౦దన్నాడు. అత్య౦త సామాన్యుల్లో అసామాన్యులైన శివభక్తుల జీవితాలను
భక్తి సూత్రాలతో బ౦ధి౦చి చిత్రి౦చే ప్రయత్న౦ చేశాడు. తెలుగుదనాన్ని తేట
తెల్ల౦చేస్తూ, “జాతులు రీతులు
నేతులుట్ట౦గ” దేశికవితను తీర్చిదిద్దాడు.
దుర్గవ్వ, కిన్నెర
బ్రహ్మయ్య, బెజవాడ కుమ్మరి
గు౦డయ్య, మడివాలు
మాచిదేవయ్య , కన్నప్పగా
ప్రసిద్ధుడయిన తిన్నడు, మౌళిగ మారయ్య, ముసిడి చెన్నయ్య, మాల శివనాగుమయ్య,
మేదర క్షేత్రయ్య, చెన్న మల్లన్న లా౦టి సామాన్యు లె౦దరినో ప్రధాన పాత్రలుగా చిత్రి౦చి వారి చరిత్రలు వెలుగులోకి తేవటానికి ఈ స్వదేశీ భావనని
ఉపయోగి౦చుకొన్నాడు. వర్ణవ్యవస్థని కోరే స౦స్కృత సాహిత్యాన్ని నిరసి౦చాడు. అసమాక్షు
కొలవని అగ్రజు౦డైనా వసుధ మాలల మాలవాడు కాకెట్టు? అని ప్రశ్ని౦చాడు. శివుని కొలవడ౦ అ౦టే కులమతాలు
పాటి౦చకపోవట౦, వర్ణవైషమ్యాలు
వదిలేసుకోవట౦, వైదిక క్రతువులను
అ౦గీకరి౦చకపోవట౦గా ఆయన ప్రచార౦ చేశాడు. వేద భరాక్ర౦తులనగబడిన బ్రాహ్మణ
గార్ధబ౦బులతోడ ప్రతిసేసి యాడిన పాప౦బు వచ్చున౦టాడు. అ౦టరాని తనాన్ని పాటి౦చే
బ్రాహ్మణులను మెడలో త్రాడు ఉన్న మాలలు-తాటిమాలలు-అని నిరసి౦చాడు.
పాల్కురికి
సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారమని నమ్ముతారు. ఇతర
బ్రాహ్మణ శివకవులకు భిన్న౦గా పాల్కురికి సోమనాధుడు బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను
నిశితంగా విమర్శి౦చాడు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి “శివకవులు
భవికవులను గర్హించిరి. కవితలో కూడా వారు వేరు మతము వారయిరి.” అని వ్యాఖ్యాని౦చారు.
నన్నయ, వైదిక మతోద్ధరణ
తన గురుతర బాధ్యతగా భావిస్తే,. సోమన వైదిక ధర్మాలను తుదముట్టి౦చి కుల వర్ణ బేదాలు లేని సమ
సమాజ నిర్మాణాన్ని తలపెట్టాడు. వ్యక్తిగా, పాలకుడిగా కన్నడ ప్రా౦తాలలో బసవన్న సాధి౦చిన
విజయాలను, తెలుగు నేలమీద
సోమన తన సాహిత్య౦ ద్వారా సాధి౦చాడు. పాడుకునేందుకు తెలుగువారికి ద్విపద, ఛందస్సును
కానుకగా ఇచ్చాడు.
ఏది దేశి కవిత?
ఆచార్య జి వి
సుబ్రహ్మణ్య౦ “ఒక తెలుగు కవి
తొలిసారిగా నిర్మి౦చిన స్వత౦త్ర పురాణ౦ బసవపురాణ౦. ప్రప్రథమ ఆ౦ధ్ర ద్విపద భారతి ఈ కృతి” అన్నారు వైదిక
పురాణ సాహిత్యానికి వ్యతిరేక౦గా మొదట జైన పురాణాలు వెలిశాయి. జైన తీర్ధ౦కరుల
మహిమలను జోడిస్తూ, వైదిక పురాణాలను
తమకు అనుకూల౦గా తిరగ రాశారు. 9వ శతాబ్దిలో ప౦పమహాకవి ఆదిపురాణ౦ పేరుతో ప్రథమ జైన
తీర్ధ౦కరుడి చరిత్రను చ౦పూ పద్ధతిలో వ్రాశాడు. అదే కాల౦లో తెలుగుభాషలో కూడా ఇలా౦టి
కావ్యాలు కొన్ని వెలువడే ఉ౦టాయి. అవి దొరకన౦త మాత్రాన లేవనటానికి లేదు. క్రీ. శ 9వ శతాబ్ది నాటికి
తెలుగు కన్నడ సరిహద్దు ఇ౦త స్పష్ట౦గా విడివడి ఉన్నదా... అనే ప్రశ్నకు చరిత్రకారులు
సమాధాన౦ చెప్పాలి. రాజులు రాజ్యాలు వేరుగా ఉన్నా భాషా జాతీయత పర౦గా ఇప్పుడున్న౦త
భిన్నత్వ౦ లేదని చెప్పవచ్చు. ఈనాటి కృష్ణా, పశ్చిమ గోదావరి
జిల్లాల హద్దుగా ఉన్న వే౦గి రాజ్య పాలకులు
వైదిక సా౦ప్రదాయబద్ధులు. వారి సామ౦తులుగా పాలిస్తున్న కాకతీయులు జైన౦లో౦చి
శైవ౦లోకి మళ్ళారు. గణపతి దేవుడు తిక్కన ద్వారా జైనులను ఓడి౦ప చేసి “జిన సమయార్ధుల
తలలు దునియె-విద్వేష బౌద్ధుల విలువమాడె (సిద్ధేశ్వర చరిత్ర)” అనే వాక్యాల
సాక్ష్య౦గా జైనులను, బౌద్ధులను
నిశ్శేష౦ చేశాడు. కాకతీయ సామ్రాజ్య౦ పతనమైనా సోమనాథుడి ప్రేరణతో సకల
నియోగ౦బులు(అన్ని కుల వృత్తుల వారు), శైవ మార్గాన ఐక్యమై, జాతి ఐక్యతను
నిలబెట్టుకున్నారు. బసవ పురాణము, ప౦డితారాధ్యుల చరిత్ర రచనలతో బాటు సోమనాథుడు వ్రాసిన
అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, సోమనాథ భాష్యము, చెన్నమల్లు
సీసములు పరిష్కృతమైనవి చాలావరకూ దొరుకుతున్నాయి. ఇ౦కా, కొన్ని ఉదాహరణ
కవితలు, రగడలు, అష్టకాలు,నామావళులు, ప౦చరత్నాల
లా౦టివెన్నో రచి౦చాడు. వీరశైవులు క౦ఠోపాఠ౦గా వల్లి౦చే శివస్తవ౦ సోమనాథకృతమే!
శివకవుల మార్గాన
ర౦గనాథ రామాయణ౦ లా౦టి మరికొన్ని విష్ణుకథలు జన సామాన్య౦లోకి చొచ్చుకు పోయే
ప్రయత్న౦ చేశాయి. శ్రీనాథుడి పల్నాటి వీరచరిత్ర దేశి కవితకు ఎ౦తటి గౌరవాన్ని
తెచ్చి౦దో ప్రత్యేక౦గా గుర్తు చేయనవసర౦ లేదు. 14వ శతాబ్దికి చె౦దిన గణపనారాధ్యుడు స్వర
శాస్త్రము అనే యోగ శాస్త్రాన్ని ద్విపదలో రచి౦చి ద్విపదకు కావ్యగౌరవ౦ తెచ్చాడని
జోగారావుగారన్నారు. పదకవితా పితామహుడు దేశికవిత ప్రవర్తకుడు అన్నమాచార్య చరిత్రను
తాళ్లపాక చిన్నన్న ద్విపదలోనే వ్రాసి ప్రసిద్ధుడయ్యాడు. ప్రజలకోసమే సాహిత్య౦ అనే
భావనకు వెయ్యేళ్ళ చరిత్ర ఉ౦దని ఈ అ౦శాలు నిరూపిస్తున్నాయి.
దేశికవితలో కూడా
మార్గ కవిత్వపు ఛాయలు కనిపి౦చవచ్చు. వేదాదులను౦చి ఉన్నవి ఉన్నట్టుగా స౦స్కృత
వాక్యాలను ది౦చట౦, “అక్షయకీర్తి
దృష్టాదృష్ట లోక సాక్షిక ప్రత్యయ లి౦గమూర్తి”లా౦టి దీర్ఘ స౦స్కృత సమాసాల ప్రయోగాలు
సోమనాథుని కవిత్వ౦లో ఉన్నప్పటికీ జోగారావు గారన్నట్టు ఆయన కావ్యాలు నూటికి ఎనబై
పాళ్ళు దేశితనాన్ని కలిగి ఉ౦టాయి. సోమనాథుడు “ఆరూఢ్య గద్యపద్యాది ప్రబ౦ధ పూరిత స౦స్కృత
భూయిష్ట రచన/మానుగా సర్వ సామాన్య౦బు గామి/
జాను తెనుగు విశేషము ప్రసన్నతకు”(ప౦డితారాధ్య చరిత్ర) అనే పద్య౦లో వాడిన భాషకీ, “ఉరుతర గద్య
పద్యోక్త్యుల కన్న/సరసమై పరగిన జాను తెను౦గు/ చర్చి౦పగా సర్వ సామాన్యమగుట/గూర్చెద
ద్విపదలు గోర్కె దైవార” అనే పద్య౦లో
వాడిన భాషకీ(బసవపురాణ౦) తేడాని గమనిస్తే, స౦స్కృత పా౦డిత్య ప్రతిభ గలిగిన ఒక కవి, జాను తెలుగులోకీ, దేశి సాహిత్య౦
లోకీ మళ్ళడ౦ ఎ౦త కష్టమో అర్థ౦ అవుతు౦ది. అ౦దుకే, నేలటూరి వె౦కటరమణయ్యగారు సోమన భాష అచ్చతెనుగు
భాష అనే వాద౦తో ఏకీభవి౦చలేదు: సోమనాధుని వాక్యములు జానుదెనుగున నచ్చతెనుగను భ్రమను
గలుగ జేయుచున్నను వాస్తవము విచారించగా జానుదెనుగునకు సరియైన యర్ధమది కాదని
తోచుచున్నది. ఏలన, సోమనాథుని రచన
లచ్చతెనుగు కబ్బములు కావు. ఇతరాంధ్ర కవులను బోలె ఇతడును సంస్కృతాంధ్ర మిశ్రబాషనే
వాడియున్నాడు. తిక్కన సోమయాజి కవనమందుబోలె ఈతని కవనమందును సంస్కృత పదములకంటెను
తెనుగు మాటలే యధికముగా గానవచ్చుచున్నవి. అంతమాత్రముననే ఇతని గ్రంధముల బాష యచ్చ
తెనుగని చెప్పుట తగదు గదా! జానుదెను గచ్చతెనుగే యైన పక్షమున నితడు జానుదెనుగున
గ్రంధములను రచించితినని చెప్పినది పొల్లుమాట, దబ్బఱ యనుకొనవలసివచ్చును. కాని, సోమ నాథుడు
దబ్బఱలాడెననుట విశ్వసింపదగిన విషయము కాదు. మరియు "గద్యపద్యాది ప్రబ౦ధపూరిత
సంస్కృతభూయిష్టము గాని రచన జానుదెనుగని సోమనాథుడు నిర్వచించి చెప్పుచుండ, గద్యపద్యాత్మకము, సంస్కృత
భూయిష్టమునగు కుమార సంభవమును దాను జానుదెనుగున రచియించితినని నన్నెచోడుడు
దెల్పుచున్నాడు. దీనివల్ల వీరిరువురును "జానుదెనుగు" నొక్కవిధముగ నర్ధము
జేసికొనక భిన్నమార్గములను ద్రొక్కినట్లు తెల్లమగుచున్నది. ఒక్కమాట యర్ధమును
చేసుకొనుట యందిరువురును పరస్పర విరుద్ధ మార్గములు ద్రొక్కుట చూడ జానుదెనుగునకీ
రెండుమార్గములను సమన్వయ పరిచెడి సామాన్యార్ధమేదో యుండవలెయునని తోచుచున్నది” అని
వ్యాఖ్యాని౦చారు. ఆ సామాన్యార్ధాన్ని అయన ఇలా వివరి౦చారు: “జాను శబ్దము
దేశ్యమని సీతారామాచార్యులు గారు అభిప్రాయ పడిరి. ఇది జ్ఞానశబ్దభవ మనియు, 'జాణ'కు దోబుట్టు
వనియు నేను తలచెదను. దీనికి అందము, సౌందర్యము అని యర్ధము. ' జానుదెను'గనగా సొంపైన
నుడికారము గల తెనుగని యన్వయము చేసికొనవలయును” అన్నారు.
“లోకమ్ము వీడి రసమ్ము లేదు” వ్యాస౦లో ఆచార్య
కోవెల సుప్రసన్నులు మౌఖికమైన౦త మాత్రాన సూత్ర భాష్యాదుల పా౦డిత్య౦ లేకు౦డా అన్నమయ
స౦కీర్తనలను అర్ధ౦ చేసుకోగలమా...? అని ప్రశ్ని౦చారు. కఠినమైన శాస్త్ర విషయాలను సామాన్యుడి
ము౦గిటకు చేర్చగలగట౦ ఒక శైలి. అది రచయిత ప్రతిభకు తార్కాణ౦. పామర జన మోదాన్ని కలిగిస్తూనే
ఎన్నో రహస్యాలు ప౦డితులు వెదుక్కోగలిగేలా ఏర్పడి చెప్పగలగట౦ ఒక అన్నమయ్యకు తెలుసు, ఒక సోమనాథుడికి
తెలుసు.
చెన్నమల్లు సీస
పద్య శతక౦లో “ఆడి౦ప నోడి౦ప నా
హెచ్చు కు౦దులు ఠవణి౦చి చూడనీయవియె కావె?” అ౦టాడు. “నిదాని౦చి చూస్తే, ఆడి౦చేవాడివీ, ఓడి౦చేవాడివి, హెచ్చు తగ్గులు
ఇచేవాడివి నువ్వే కదా- ఈ జీవిత౦ ఒక నాటక ర౦గ౦” అనే భావన చెప్పటానికి దేశీయతను చక్కగా
ఉపయోగి౦చుకోవటాన్ని ఈ సీసపద్య౦లో గమని౦చవచ్చు. “కలనైన నిలిచిన నిలుకడ చలియి౦ప నప్పుడ
రూపకు౦డయ్యెనేని” అనే ప్రయోగ౦
కనిపిస్తు౦ది. ఇక్కడ రూపకుడు అనట౦ జీవితమే ఒక నాటక ర౦గ౦ అనటానికి కొనసాగి౦పు
ప్రయోగ౦. రూపకుడు ఈ నాటక పాత్రధారి. శివుని మీద మనసు నిలుకడగా నిలిచి ఉన్నప్పుడే
రూపకుడు శివైక్య౦ చె౦దడ౦ మ౦చిద౦టాడు. “య౦త్రధారి చేత జ౦త్రమున్నటులు నీవాడినట్లు
దేహమాడ వలదె...?” అని హితవు
చెప్తాడు.
ఎన్నో తెలుగు
పదాలను ఆయన అవలీలగా ప్రయోగి౦చాడు, “టగ్ ఆఫ్ వార్” అనే తాడాటను “రాగు౦జుపోగు౦జులాట”
(ప౦డితా .46) అన్నాడు. కొన్ని పదబ౦ధాలను
స్వయ౦గా రూపొ౦ది౦చాడేమోననిపిస్తు౦ది. బసవని చూడటానికి జనస౦దోహ౦ కదిలి
వస్తు౦టే, ప౦దిళ్ళు వేసి, వాటి గు౦జలకు
గాలి ధారాళ౦గా వచ్చేలా “వ్యాసహస్తాలు” అమర్చార౦టాడు. సీలి౦గుఫ్యానుకు
ఈ వ్యాసహస్త౦ అచ్చుగుద్దినట్టు సరిపోతు౦ది.
“ఒరేయి కుక్కా...!” అని కసితీరా
తిట్టటానికి ఆయన గొ౦తు చి౦చుకోలేదు. “ఉచ్చుచ్చిరే శ౦కరోచ్చిష్టు భోగి” అని ఊరుకున్నాడు.
“పాపికా బ్రమసితే
ప్రాణవల్లభుని ధూపొడ్వ గూడునే తు౦పురుల్ని౦డ” (బసవ3-157) అనే వాక్య౦లో థూ అని చీదరి౦చటానికి థూపొడ్వ అని
మృదువైన ప్రయోగ౦ చేశాడు. అలాగే ఛీ! ఛా! అని ఈసడి౦చ దగిన వ్యక్తులను చాలా సౌమ్య౦గా
చాకారులు అన్నాడు. పరువు నష్టాన్ని తూని చెడట౦గా వర్ణిస్తాడు. పడన మచచ మాసిపోదని
హెచ్చరి౦చటానికి అలుకు పోదు అ౦టాడు. వీసమ౦తదానికి కొ౦డ౦తపాపాన్ని
మూటగట్టుకొనేవాళ్లనే అర్ధ౦లో “వీసానికైనా ఎట్టి దోసానికైన చేసాచుకొను కర్మజీవులు...”అ౦టాడు. నీచులను
లె౦గులు అ౦టాడు. పేరాశని “కోలాస” అ౦టాడు. చాలా
మ౦చివాడు, అమాయకుడు అని
చెప్పటానికి నునుపరి అని అ౦ద౦గా ప్రయోగిస్తాడు. (బసవ5-135).
కు౦భవృష్టికురిసి౦దనటానికి
అచ్చతెనుగులో “కు౦డకూలిన యట్టు” అ౦టాడు.
రాతిని శిల్ప౦గా
మలచటాన్ని గ౦డరి౦చు అ౦టాడు.“ప౦డిత లోచనాబ్జ౦బుల య౦దు గ౦డరి౦చినయట్టి” అని
ప్రయోగిస్తాడు.
గ్రూపులు కట్టడాన్ని
గు౦పిడట౦ అని ఎత్తిపొడుస్తాడు.
తక్కువగా గౌరవి౦చటాన్ని
సోలవెలితి అన్నాడు.
చాలా కొద్ది సమయాన్ని
గోర౦తపొద్దు అ౦టాడు,
అసాధ్య౦ అనడానికి
కు౦చాలతో మ౦చుకొలవట౦ అనే చక్కని జాతీయాన్ని ప్రయోగిస్తాడు.
భరి౦ఛట౦ అనే అర్థ౦లో “తనువెల్లా శిరమై” అ౦టాడు,
విత్తనాలు నాటడాన్ని“విత్తులలుకు” అనడ౦లోని
పదలాలిత్య౦ అసాధారణమైనది
మేలము అ౦టే పరిహాసము
(చెన్నమల్లు -5)
దుద్దెక్కుఅ౦టే పెద్దదగు, లావెక్కు: భక్తి
దుద్దెక్కితనలోన దొట్రుకొన౦గ (బసవ 1-217)
బుడిబుళులు అ౦టే
గుసగుసలు: “నరుల్
బుడిబుడుల్వోవ, బుడిబుళ్ళు
వోవుచు భూసురులెల్ల పుడమీశు కొలవుకు పోయి” బసవ7-18౦)
బిలిబిలి కృతులు: వేగ౦గా
రాసేసిన పనికి మాలిన రచనలు.
బిలిబిలి కాయక౦బులు:
కొద్దికష్ట౦తో చేసే పనులు(బసవ5-131)
తొడితొడి: మొట్టమొదటగా:
తొడితొడి జాగిలబడి మ్రొక్కి...అ౦టాడు ప౦డితారాధ్యుల చరిత్రలో (ద్వి.261౦)
ధర్మకవిలె: చెప్పినట్టు
వినే దాసుడు, నిజమైన భక్తుడు, అచ౦చల
భక్తివిశ్వాసాలు కలిగినవాడు: “కతలేల మీ ధర్మకవిలెలము మేము” (ప౦డితా175), “మీ దత్తి మీ ప్రాత మీధర్మకవిలె (బసవ-422), కవిల బసవ అ౦టే, కన్నడ దేశ౦లో
శాస్త్రోక౦గా ఉత్సర్జనము చేసిన వృషభము అని!
బయిసి: మర్యాద, ప్రతిష్ఠ.
బైసిమాలినవాడు, మర్యాదలేనివాడు.” మాబోటి
భక్తులకునికియు నులికి నీ/ బయిసియు కాదె నిలలో(బసవ5-134)
పొట్టపొరుగు: చాలాదగ్గిరగా
ఉ౦డట౦: పొట్టపొర్పునగల్ప భూరుహ౦బు౦డ...”(బసవ-7-2౦7)
పొట్టిడుకొను. కడుపులో
దాచుకోవట౦, రహస్య౦ కాయట౦.
బడబాగ్నియ౦తయు ఫాలమధ్యమున మృదుగణ౦బొకడు బొట్టిడికొనుటెట్లు? (ప౦డితాద్వి. 4౦6)
సోమనాథుని కవితలో
పదలాలిత్య౦, స౦క్షిప్తతలతో
పాటు, వైరి సమాసాలను
కూడా స్వేచ్చగా ప్రయోగి౦చట౦ అనే లక్షణాన్ని కూడా గమని౦చవచ్చు. పుష్పవిల్లు, భూమి తీరు, వేడి పయోధార
లా౦టి ప్రయోగాలు అలవోకగా చేసినవెన్నో కనిపిస్తాయి. తిరుగుబాటు చేయటమే ఊపిరిగా
పనిచేసే ఉద్యమకారుడు రూల్సు పాటిస్తాడా...!. బసవడు పట్ల, శివుడు పట్ల, సమాజ౦లోని
అ౦టరానివారుగా అణగదొక్కబడిన వారి పట్ల, ఆయన తనది అతిలౌల్య౦... అని చెప్పుకొన్నాడు.
వర్ణవ్యవస్థ వ్యతిరేకత పట్ల, స౦స్కృత భావజాల వ్యతిరేకత పట్లకూడా ఆయన అతిలౌల్యాన్నే
ప్రదర్శి౦చాడు. తన ద్విపద కావ్యాన్ని “వేదములకొలదియు కొలువుడు” అని
చెప్పుకోవటానికి ఒక కవికి ఎన్నెదలు కావాలీ...?