Monday, 5 January 2015

ఫిబ్రవరి 21,22లలో విజయవాడలో 3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

         



ఫిబ్రవరి 21,22లలో విజయవాడలో
3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో 2015 ఫిబ్రవరి 21, 22 తేదీలలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. శ్రీ మండలి బుద్ధప్రసాద్ గౌరవాధ్యక్షులుగా, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా శ్రీ గుత్తికొండ సుబ్బారావు, డా. జి వి పూర్ణచందు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దాదాపు ౩౦ మంది ప్రముఖ రచయితలతో ఏర్పడిన కార్యనిర్వాహక వర్గం ఈ మహాసభలకు సారధ్యం వహిస్తోంది.
2013 సెప్టెంబరులో 3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించే ప్రయత్నంలో ఉండగా, ఆనాడు నెలకొన్న రాష్ట్ర విభజన పరిస్థితుల రీత్యా వాయిదాపడిన ఈ మహాసభలను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, 2015 ఫిబ్రవరి, 21, 22 తేదీలలో నిర్వహించాలని సంకల్పించాం. 2007లో నిర్వహించిన మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగు భాషోద్యమ నిర్మాణానికి దోహదపడగా, 2011లో జరిగిన రెండవ మహాసభలు ఇంటర్నెట్ మరియు ఇతర సాంకేతిక రంగాలలో తెలుగు వినియోగానికి సంబంధించి ప్రభుత్వపరంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించటానికి కారణభూత మయ్యాయి.
3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీపరులు, భాషాభిమానులూ ఒకే వేదికపైన కలిసి తెలుగుకు వెలుగు లిచ్చేందుకు స్ఫూర్తిదాయకమైన చర్చలు జరిపే అవకాశం ఏర్పడుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వారందరూ ఒకటేననే నినాదంతో, ప్రాంతాలకు అతీతంగా జరుగుతున్న ఈ 3 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగును ప్రపంచభాషగా నిలిపేందుకు మరో ముందడుగు కాగలవని విశ్వశిస్తున్నాం.    
          2013లో ఈ మహాసభలు వాయిదా పడే నాటికే దేశవ్యాప్తంగా 1500 మంది ప్రతినిధులుగా నమోదు కావటం ఈ మహాసభల పట్ల రచయితల్లోనూ, భాషాభిమానుల్లోనూ గల ఉత్సాహానికి తార్కాణం. గతంలో నమోదు చేసుకున్నవారు కొత్తగా ఎలాంటి రుసుమూ చెల్లించ వలసిన అవసరంలేదు. గతంలో ప్రకటించిన సదుపాయాలు, నియమాలూ ఈ సభలకూ వర్తిస్తాయని ప్రకటిస్తున్నాము.
మరిన్ని వివరాలకు గుత్తికొండసుబ్బారావు, అధ్యక్షులు, 9440167697, డా జి.వి.పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి 9440172642 లను  సంప్రదించ వలసిందిగా కోరుతున్నాం.




మండలి బుద్ధప్రసాద్,                                                         ఆచార్య యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్,   
గౌరవాధ్యక్షులు                                                                  కార్యనిర్వాహక అధ్యక్షులు  

గుత్తికొండ సుబ్బారావు,                                                           డా. జి వి పూర్ణచందు

    అధ్యక్షులు                                                                         ప్రధాన కార్యదర్శి