Thursday, 13 October 2016

కుదురు దారి :: డా. జి వి పూర్ణచందు

కుదురు దారి 
డా. జి వి పూర్ణచందు

సరిగా తెనుగు నేర్పు చక్కని యేర్పాటు నాటలేదటంచు కనంగ వలయు,
ఎల్లపల్కులకును తల్లి సంస్కృతమనుకొనుట తప్పని కనుగొనవలయు,
తెనుఁగు పుట్టును గుట్టు తెలిసికో, తెన్‘పల్కులెన్నొ కావలెనని యెఱుఁగ వలయు,
అవి నేర్చుకొనుటకు అనువగు తెరవులు కని, తెల్వి హెచ్చించుకొనగ వలయు,
ప్రాకృతము బాగుగా చదువంగవలయు
మదివిరియఁజేయ ఇంగ్లీషు చదువవలయు
తగిన పొత్తంబులన్ వ్రాసి తనర వలయు
ఇదియె తెనుఁగుతల్లిని కొల్చు కుదురుదారి

మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు కృష్ణాతీరంలో పుట్టి విశాఖ తీరంలో ‘కవిగారు’గా ప్రసిద్ధులైన తెలుగు భాషాభిమాని. భాషోద్యమ ప్రవర్తకుడు. తెలుగు వాళ్ళు ఆంగ్లాన్ని, సంస్కృతాన్ని బాగా చదవాలి. కానీ, వాళ్ళు ఆంగ్లమానస పుత్రులో సంస్కృత మానస పుత్రులో కాకూడదని, తెలుగుని స్వతంత్రభాషగా గుర్తించి, గౌరవించి తెలుగు పుత్రులుగా వెలగాలని చాటిన ఉద్యమ శీలి ఆయన

తెలుగు భాష దేశంలో రెంవ పెద్దభాష. హిందీ తరువాత దేశంలో ఎక్కువమంది ఈ భాషను మాట్లాడుతున్నారు. సంస్కృతం ఇంగ్లీషు ఇంకా ఇతరభాషలను తేలికగా ఇముడ్చుకోగల సౌలభ్యం ఈ భాషకు ఉంది. ఏ భాషా పదాన్నయినా దాని ఉచ్చారణను తెలుగులో వ్రాయగలిగే అనువు తెలుగు భాషకుంది. కాబట్టి, దీన్ని మహాభాషల్లో చేర్చాలని మొట్టమొదటిసారిగా కోరిన వ్యక్తి శ్రీ కవిగారు. వాడుక భాషకు గిడుగు చేసిన సేవ ఎంతటిదో అసలైన తెలుగు భాషకోసం, దాని విరివి(వికాసం) కోసం, దాని ‘కావలి’ కోసం కవిగారు చేసిన కృషి కూడా అంతటిది.

మనం ఆంధ్రులం, తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం గానీ మనలో ఆంధ్రత్వం, తెలుగుతనం కొరవడుతోంది. పేర్లలోనూ పలుకులోనూ, సంతకాల్లోనూ, ఆహార పానీయాల్లోనూ తెలుగుతనం పోతోంది. పండుగలు పబ్బాల్లోంచి తెలుగుతనంమాయమై పోయింది. చదువుల్లో తెలుగు ఎప్పుడో పోయింది. పాలనలో తెలుగు అసలు చేరనే లేదు. వీధుల్లో బడ్డీకొట్లలో కూడా ఇంగ్లీషు లోనే ‘తెలుగుతాంబూలాలు’ అమ్ముకుంటూన్నారు. పూటకూళ్ళ అయ్యలు అన్నాన్ని ‘రైసు’ అంటేనే జనం తింటున్నారని చెప్తున్నారు. అమ్మలు ‘మమ్మీ’లయ్యారు. 1930ల లోనే ఈ పరిస్థితి దాపురిస్తోందని వాపోయిన వ్యక్తి ‘కవిగారు’.
రోజువారీగా మనం మాట్లాడే మాటల్లో ఇంగ్లీషు, సంస్కృతాలను వదిలేస్తే మిగిలే తెలుగు తక్కువ. బస్సు రోడ్డున స్పీడు గా పోతోంది అనే 4 మాటల వాక్యంలో బస్సు, రోడ్డు, స్పీడు మూడూ పోతే, పోతోంది ఒక్కటే తెలుగు. అది కూడా ఎప్పుడు పోతుందో తెలీదు. కవిగారు వీలైనంత వరకు సంస్కృతం లేదా ఇంగ్లీషు లేకుండా తెలుగు మాట్లాడటం, వ్రాయటం గురించి విశేష కృషి, ప్రచారం చేశారు.

కవి గారు వ్రాసిన ఈ పద్యం వ్యాఖ్యానం అవసరం లేని తేటతెలుగులో ఉంది. “సరిగా తెనుగు నేర్పే చక్కని యేర్పాటు ఈ రోజుల్లో లేదు. ఎల్ల పలుకులకీ అంటే భాషలకీ తల్లి సంస్కృతమే అనటం తప్పు. తెలుగు పుట్టు గుట్టు తెలుసుకోండి.తెలుగు లో ఉన్న సంస్కృత మాటలు తెన్ పల్కులే (తెలుగు మాటలే) కావచ్చేమో పరిశోధించి కనుక్కోండి. చక్కని తెలుగు మాటల్ని నేర్చుకోవటానికి అనువైన తెరవులు అంటే పద్ధతులు తెలుసుకుని తెలివి పెంచుకోండి. ప్రాకృతాన్ని బాగా చదవండి. ఆ భాషలో అచ్చతెలుగుపదాలు అనేకం కన్పిస్తాయి. మనో వికాసం కోసం ఇంగ్లీషు కూడా నేర్చుకోండి. చక్కటి తెలుగులో మంచి పొత్తాలు (పుస్తకాలు) వ్రాసి గొప్పవాళ్ళు కండి. ఇదే తెలుగుతల్లిని కొలిచే కుదురు దారి” అంటారు `కవిగారు'.

తెలుగు భాష సంస్కృతం లోంచి పుట్టిందనే వాదాన్ని ఆయన ఒప్పలేదు. సంస్కృతం, తెలుగు అక్కచెల్లెళ్ళే గానీ అమ్మాకూతుళ్ళు కారని, తెలుగులో కనిపించే చాలా సంస్కృతం మాటలు తెలుగు పదాలే కావచ్చని, అవి తెలుగులోంచి సంస్కృతంలోకి వెళ్ళినవి కావచ్చని ఆయన గట్టిగా నమ్మారు. తెలుగు భాషని తెలుగు వాళ్ళకీ, తెలుగేతరులక్కూడా చక్కగా నేర్పేవాళ్ళు లేరని అభిప్రాయపడ్డారు. నిజమే! ఒక విదేశీయుడికి తెలుగు ఎలా నేర్పాలో మన పండితుల్లో ఎంతమందికి తెలుసు?

తెలుగు నేర్చుకుంటే తెలివి పెరుగుతుందనీ, ఇంగ్లీషు నేర్చుకుంటే మనో వికాసం కూడా కలుగుతుందనీ 80 యేళ్ళ క్రితం చాటిన మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారిని సముచిత రీతిలో గౌరవించుకోవటం మన ధర్మం. భాషాభివృద్ధికి కృషి చేసే వ్యక్తులకు ఆయన పేరుతో ప్రభుత్వం పురస్కారం ప్రకటిస్తే భాషను, భాషోద్యమాన్నీ గౌరవించుకొన్నట్టు అవుతుంది.