Thursday 28 May 2015

గోంగూర-గోనుసంచీ :: డా. జి వి పూర్ణచందు

గోంగూర-గోనుసంచీ
డా. జి వి పూర్ణచందు

గోను కూరని గోనుగూర, గోంగూర, గో(గూర అంటారు. గో(గూర నిచ్చే మొక్కని గో(గు మొక్క అని పిలిచారు.

గోంగూరను అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, కెనాఫ్ అని పిలుస్తారు. Deckanee hemp అనే పేరుతో కూడా కొన్ని దేశాల్లో పిలుస్తారు. తెలుగు ప్రజలతో ఈ మొక్కకు అనుబంధం ఉన్న సంగతి ప్రపంచాని కంతటికీ తెలుసు. మనం గోంగూర పచ్చడి చేసుకుంటే యూరోపియన్లు kenaf pesto తయారు చేసుకుంటారు. ఇంచుమించు రెండూ ఒకటే!

దీనికి అంబరి, లాలంబరీ, నలి, అమ్లపీలు, కంటక పీలు లాంటి సంస్కృత పేర్లు చెపుతారు గానీ, నిఘంటువుల్లో అవి కనిపించవు. శాకాంబరీ దేవి ప్రసాదం అని గోంగూర పచ్చడిని కీర్తించటం కవుల చమత్కారం.

గోంగూరకు అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే సంస్కృత పర్యాయ నామాలున్నాయి. కర్ణికార పుష్పము అంటే కుండగోంగూర పువ్వు. అభిమన్యుడి రథ౦ మీద ఎగిరే జె౦డా ఈ గుర్తు గలిగి ఉంటుందట! మూలభారతం భీష్మ పర్వం(6.26,27)లో శివుడు కర్ణికార పుష్పమాలను పాదాలదాకా ధరించినట్టు, కర్ణికారవనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు ఉంది. వసుచరిత్ర(3.146)లోనూ, హంసవింశతి(4.11)లోనూ గోంగూర ప్రస్తావన కనిపిస్తుంది.

గోగులమ్మ అనే గ్రామదేవత గురించి “కోమలార్థేందుధరుకొమ్మ గోగులమ్మ(ఆ.౧ప.౯౯)” అంటూ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. గోంగూరపువ్వు పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబంలాగా, పద్మంలో కేసరాలుండే కర్ణికలాగా ఉంటుంది. అందుకని దీనికా పేరు వచ్చి ఉంటుంది. మందారం, బెండ, తుత్తురబెండ, గోంగూర ఇవన్నీ ఒకే కుటుంబానికి చె౦దిన మొక్కలు. గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను అలంకరించటం సాంప్రదాయం.

గోంగూరని ఎంత ఇష్ట పడతారో చాలామంది, దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దాని అతి పులుపే అందుకు కారణం! మనం రోజువారీ ఆహార పదార్థాలలో అతిగా చింతపండునో లేకపోతే ‘ఆమ్ చూర్‘నో వాడటం వలన కడుపులో యాసిడ్ నిండిపోతోంది. గోంగూర తింటే మరింత యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. 

పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకొన్నాను, అంతే... కాళ్ళూ చేతులూ పట్టేశాయి’ అంటుంటారు అందుకే చాలామంది.  ఇతర పులుపు పదార్థాల వాడకాన్ని పరిమితం చేసుకో గలిగితే గోంగూరని రోజూ తిన్నా ఏమీ కాదు.
మన పూర్వీకులు గానీ, ఇతర రాష్ట్రాల వారుగానీ మనం తింటున్నంత వెర్రిపులుపు తినరు. ముఖ్యంగా చింతపండు వంటి౦టికి రారాజు అయిపోయింది. దాన్ని వెళ్ళగొట్ట గలిగితే గోంగూరను ఎవరైనా చక్కగా వాడుకోవచ్చు. 

వైద్య శాస్త్ర ప్రకారం గోంగూరలో అపాయకారకమైన రసాయనాలు ఏమీ లేవు. పడకపోవటం దాని స్వభావం కాదు. దాన్ని వండటంలోనే మనం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసి ఉంది. మొదటగా గోంగూరని నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి తయారు చేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకరంగా ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలిగించని వాటితో మాత్రమే గోంగూరను వండుకోవాలి.
 తగినంత మిరియాల పొడి, ధనియాల పొడి కలిపితే ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ఉంటుంది. రుచిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. గోంగూర పువ్వులూ వంజల్ని కూడా కలుపుకోవచ్చు. రుచిగా ఉంటాయి.

గోంగూర చక్కని ఆకలిని కలిగిస్తుంది. లివర్ వ్యాధుల్లో మేలు చేస్తుంది. రేజీకటి రోగంతో బాధపడే వారికి పెడితే చూపు పెరుగుతుంది. మలబద్ధత పోగొడుతుంది. వీర్యవృధ్ధీ, లైంగికశక్తీ, లైంగిక ఆసక్తీ పెంపొ౦దింప చేస్తుంది. ఉడికించిన గోంగూర ఆకు ముద్దని కడితే సెగగడ్డలు మెత్తపడి త్వరగా పక్వానికొస్తాయి. రక్తం గూడు కట్టిన కౌకుదెబ్బలు తగిలిన చోట దీనితో కట్టుగడితే వాపు అణిగిపోతుంది.
దేశవాళీ గోంగూర ఆకుల్లో ఉండే ఇనుము, అలాగే, కుండగోగు వేళ్ళలో ఉండే చలవ దనమూ, రెండూ వైద్య పరంగా ప్రసిధ్ధాలే. కొండగోగు మొక్కల్ని వ్రేళ్ళతో సహా పీక్కొచ్చి అమ్ముతారు. మనం ఆకుల్ని వలుచుకొని మొక్కని అవతల పారేస్తా౦. దాని వేళ్ళను దంచి, చిక్కని కషాయం కాచుకొని పంచదార కలుపుకొనితాగవచ్చు. వేసవికాలంలో వడదెబ్బ కొట్టనీయని పానీయం ఇది.
గోంగూర మౌలికంగా నారనిచ్చే మొక్క. గోంగూర, జనుము లాంటి మొక్కల్లోంచి వచ్చే నారని గ్రీన్ ఫైబర్ అంటారు. తెల్లకాగితం తయారీకి పనికొచ్చే 500 మొక్కలతో పోల్చినప్పుడు అమెరికన్లు గోంగూర అన్ని౦టికన్నా ఉత్తమ మైన మొక్కగా తేల్చారు. ఇవ్వాళ అమెరికావారి కాగితం అవసరాలను గోంగూర మొక్కలే తీరుస్తున్నాయట! ఆ౦ధ్రమాతగా గోంగూరను గౌరవించే తెలుగుప్రజలు ఈ రహస్యాన్ని త్వరగా గుర్తించటం మంచిది.

విదేశాలలో పైన్ లాంటి కొన్ని మహా వృక్షాలను, మన దేశంలో ముఖ్య౦గా సరుగుడు మొక్కల్ని పేపరు తయారీకోసం కూల్చి వెస్తున్నారు. అడవులను నరికి, పర్యావరణానికి హాని చేయటాన్ని ఈ “గోంగూర కాగితం” ద్వారా నివారించవచ్చు. పాండురంగ మహాత్మ్య౦లో సుశర్మ పాపాలను లెక్క రాసే కళితం లేదా కడితం అనే కాగితాల కట్ట గురించి ప్రస్తావన ఉంది. ఆ౦ధ్రుల సాంఘిక చరిత్రలో కడితం అంటే “మసి పూసి గట్టన చేసిన చదరపు గోనెపట్టతో (గోగునారతో) చేసిన లెక్కపుస్తకం” అని అర్థాన్ని ఇచ్చారు. 15వ శతాబ్ది నాటికి గోగునార కాగితం తయారీ మన వాళ్ళకు తెలుసన్నమాట! దీని ఆకుల్ని ఆహార అవసరాలకు వలుచుకుంటూ, మొక్కని నిటారుగా పెరగనిస్తే, 150 రోజుల్లో 12-18 అడుగులు పెరుగుతుంది. ఈ మొక్కల్ని నీళ్ళలో నానబెడితే నార తేలికగా ఊడివస్తుంది. ఎకరానికి 5-10 టన్నులు గోగునార లేక గోనునార ఉత్పత్తి వస్తుందని అంచనా! ఈ గోనునారని పురిపెట్టి పురికొస తీస్తారు. దానితో నేసిన పట్టాని “గోనుపట్టా” అనీ, సంచీని “గోను సంచీ” అనీ పిలుస్తారు. గోతాము పదం కూడా గోనుకు సంబంధించినదే కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, ఎద్దుల బండి మీద అడ్డ౦గా వేస్తారు కాబట్టి గోతాము అయ్యిందని అర్థాలు చెప్పారు గానీ, మౌలికంగా ఇది గోను శబ్దానికి సంబధించిన పదం. గోవు ఎంత ముఖ్యమో, గోను కూడా అంతే ముఖ్య౦---సద్వినియోగపరచుకొనే తెలివి ఉండాలి.


గోంగూరకు నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆఫ్రికా దీని పుట్టిల్లు. భారత దేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. చరక సుశ్రుతాది ఆయుర్వేద గ్రంథాల్లో గానీ, ధన్వంతరి నిఘంటువులోగానీ, గోంగూర గురించి వివరాలు లేకపోవటాన, దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిధ్ధి కాకపోవటాన అమరకోశంలో చెప్పిన కర్ణికారం అంటే, కుందరు పండితులు “రేల” మొక్కగా భావించారు. ఈ కారణంగా మధ్య యుగాలలో ఈ గోంగూర భారత దేశంలోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేసే సమాచారం బసవ పురాణంలో ఉంది. శివ పూజ చేయనిదే ముద్ద ముట్ట కూడదనే నియమం కలిగిన ఒక వర్తకుడు బోర్లించిన కుంచాన్ని శివలింగంగా భావించి కుండగోగు పూలతో పూజ చేసినట్టు “కుంచంబు గొండగోగుల( బూజసేసి” అనే వర్ణన వెయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రజలకు గోంగూర పవిత్రమైనది, పూజనీయార్హమైనదీ అనటానికి తిరుగులేని సాక్ష్యంగా కనిపిస్తుంది. జానపదగేయాలలో కూడా కుండగోగు ప్రస్తావన కనిపిస్తుంది.

శైవులకు ఇది ప్రముఖమైనదంటే, తెలుగు నేలమీద దాని ప్రాచీనతని ఊహించవచ్చు. శైవ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేస్తేనే గోంగూరకు, తెలుగు ప్రజలకూ గల ప్రాచీన అనుబంధం వెలుగులోకి వస్తుంది.


వేసవిలో ‘చల్లన :: డా. జి వి పూర్ణచందు

వేసవిలో ‘చల్లన

డా. జి వి పూర్ణచందు

శివరాత్రికి శివ శివా అని చలి వెళ్ళిపోతుంది. ఉగాది నాటికి భుగభుగ మండుతూ ఎండలొచ్చేస్తాయి.

అసలే ఆంధ్రుల్లో వేడి శరీర తత్త్వం ఎక్కువ. అంతలోనే వేడెక్కే ఆరంభ శూరత్వం మనకి ఇందుకే! పైగా మనది వేడి వాతావరణం! అది చాల దన్నట్టు, వేసవి ఎండల్లో కొత్తావకాయ పెట్టుకుని ప్రతిరోజూ రుచి చూసుకోవటంతోనే వేసవి సరిపోతుంది. ఇంతింత వేడిని తట్టుకోలేనంటూ శరీరం ‘వేడుకో్లు’ చేసుకోవటమే ‘వడదెబ్బ’ అంటే! ‘వడ’ని లేదా వేడిని తగ్గించే బ్రహ్మాస్త్రమే చల్ల!

అమ్మకడుపు ‘చల్ల’గా, అయ్య కడుపు చల్లగా, అందరి కడుపూ చల్లగా చేసేది చల్ల! వేసవిలో ‘చల్ల’గా జీవించాలంటుంది చల్ల!
తెలుగులో చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. మూలద్రావిడ పద౦ ‘సల్’ లోంచి వచ్చిన చల్ల(Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) ఇలా వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి.

భారత దేశంలో ‘చల్ల’ని తెలుగువారే ఎక్కువగా వాడుతారు. తెలుగు కృష్ణుడు చల్లలమ్మ బోయే భామల్నే అడ్డగించినట్టు తెలుగు కవులు వ్రాశారు. అతిథులకు కాఫీ టీలు ఇస్తున్నాం గానీ పూర్వం రోజుల్లో గ్లాసు చల్లఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో చలివేంద్రాలంటే ‘చల్ల’ కుండలు ఉండేవి!చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర... ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి చల్ల అ౦ది౦చే ప౦దిరి అనే అర్థం. ఓ గ్లాసు చల్ల ఇచ్చి, ‘కాస్త దాహం పుచ్చుకోండి’ అనేవాళ్ళు.

చలవ నిచ్చేది చల్ల


మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు, చల్ల దొరికే అవకాశల్లేవు. కాబట్టి,కైలాసవాసి శివుడికి, చల్ల తాగే అలవాటు లేకుండా పోయింది. అందుకని ఆయన నీలకంఠు డయ్యాడు. ఇంక, పాలసముద్రం మీద ఉండే విష్ణు మూర్తికి చల్ల దుర్లభం. కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో ‘సుర’ తప్ప చల్ల దొరక్కపోవటంతో ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. చల్ల పుచ్చుకునే అలవాటే ఉంటే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ వచ్చేవే కాదు…అని ‘యోగరత్నాకరం’ వైద్యగ్ర౦థ౦లో ఓ చమత్కారం కనిపిస్తుంది.
చల్ల తాగేవాడికి ఏ జబ్బులూ రావనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి రాకు౦డా వు౦టాయనీ, విషదోషాలు, దుర్బలత్వ౦, చర్మరోగాలు, క్షయ, స్థూలకాయం, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి రంగు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ చల్లనీ భగవ౦తుడు సృష్టి౦చాడట! వేసవిలో ‘చల్ల’బడాలంటే చల్ల తాగాలి!
“తక్ర౦ త్రిదోష శమన౦ రుచి దీపనీయ౦” అని ఆయుర్వేద సూత్ర౦. అన్నివ్యాధులకూ కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలు మూడి౦టినీ ఉపశమి౦పచేసే గుణ౦ చల్లకు౦ది. అన్న హితవును కలిగిస్తు౦ది. ఆకలిని పుట్టిస్తు౦ది. తీసుకున్న ఆహార౦ సక్రమ౦గా అరిగేలా చేస్తు౦ది.శరీరానికి సుఖాన్నీ, మనసుకు స౦తృప్తినీ కలిగిస్తుందని చిలికిన చల్ల గురించి శాస్త్రం చెప్తోంది. ఆధునిక తెలుగు కుటుంబాల్లో చల్ల తాగే అలవాటు తగ్గుతూ వస్తోంది. చిలకటాన్ని మానేసి, చల్లకవ్వాలు పారేసి ఫ్రిజ్జులోంచే నేరుగా పెరుగు వేసుకుని తినే అలవాటు ఎక్కువయ్యింది. ఇలా తినటమే షుగరు వ్యాధికి కారణం అవుతోంది!
చల్లకవ్వ౦, చల్లబుడ్డి(చల్ల గిన్నె), చల్లపులుసు, చల్లచారు, పెరుగుపచ్చడిలాంటివి ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి.
పాలలో నాలుగు చల్ల చుక్కలు కలపటం వలన తోడుకుని పెరుగు అవుతోంది. పాలలో ఉన్న పోషకాలన్నీ పెరుగులో ఉంటాయి. అదనంగా మన శరీరానికి లాక్టోబాసిల్లై అనే “ఉపయోగపడే బాక్టీరియా” కూడా చేరుతుంది. ఈ పెరుగుని చిలికితేతేలికగా అరిగే స్వభావం(లఘుత్వం) వస్తుంది. అందుకని, పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా చల్ల ఉత్తమోత్తమ౦గా ఉంటాయి.
వెన్న తీసిన చల్లకు రుచి, లఘుత్వ౦, అగ్ని దీపన౦, శ్రమహరత్వ౦ లా౦టి గుణాలు ఉ౦టాయి.చల్ల తాగితే ఎ౦తటి శ్రమనైనా తట్టుకునే శక్తి కలుగుతు౦ది. వడదెబ్బను తట్టుకోవటానికి చల్లని మి౦చిన ఔషధ౦ లేదు. చల్లతాగితే, కడుపులో ఆమ్లాలు పలచబడి, కడుపులో మ౦ట, గ్యాసు, ఉబ్బర౦, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్ధత, పేగులకు స౦బ౦ధి౦చిన వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఆపరేషన్లు అయిన వాళ్లకీ, మానని వ్రణాలతో బాధపడేవాళ్ళకీ చీము పోస్తుందనే అపోహతో ‘చల్ల’ ఇవ్వకుండా ఆపకండి! పుండు త్వరగా మానుపడాలంటే చల్ల తాగాలి!

ప్రొద్దున్నే చల్దన్నం


చల్ల కలిపిన అన్నాన్ని చల్ది అన్నం, చల్దన్నం, చద్దన్నం అంటారు. ప్రొద్దున్నే చద్దన్నం తినటమే భోగం. టిఫిన్లను తినేవారికి రోగం ఎక్కువ, భోగ౦ తక్కువ.
పిల్లలకు చద్ది పెట్టట౦ మానేసి టిఫిన్లు అలవాటు చేశాకవాళ్ళు బల౦గా ఎదుగుతున్నా రనుకోవటమే ఒక భ్రమ! నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తింటారని చిన్నచూపు ఉంది. తెలుగు నిఘ౦టువుల్లో కూడా చద్దన్నం అంటే పర్యుషితాన్న౦ (stale food- పాచిన అన్న౦) అనే అర్థమే ఇచ్చాయి.ఇది చాలా అపకారం చేసింది.
బాలగోపాలుడి చుట్టూ పద్మంలో రేకుల్లాగా కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని పోతన గారు వర్ణి౦చాడు. ఆ చద్దన్నం “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత మొనయ నునిచి/చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి” ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వ్రేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవించిన చల్ది ముద్దలో నంజుకొ౦టూ తిన్నారట! చద్దన్నం అంటే ఇది! పోతన మహాకవి మన ముంగిటముత్యాలకు చెప్పిన చల్లన్నం లేదా పెరుగన్నం పెట్టి పెంచండి. దేశానికి ఉపయోగ పడేవాళ్ళౌతారు.
గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన అంటే వేడి అన్నంలో చిక్కని చల్ల లేదా పెరుగుకలిపిన న్నాన్ని నైవేద్యం పెట్టే అలవాటు మనకుంది. గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. దధ్యోదన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేస్తారు. చద్దన్నంలో ఇవేవీ ఉండవు. ఇదీ ఈ రెండింటికీ తేడా!
“అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా...?” అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకొస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦!
ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. ఆధునికంగా చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు వచ్చి చేరాయి.
చల్ల అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గించేదిగా ఉ౦టుంది. బలకర౦. రక్తాన్ని, జీర్ణశక్తినీ పె౦చుతు౦ది! బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని మూడు రకాలుగా చేసుకోవచ్చు.
1. అప్పుడు వ౦డిన అన్న౦లో చల్ల పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ చల్లలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు చల్ల చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టి, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకో వచ్చు. వీటిలోచల్లలో నానబెట్టింది తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అన్న౦లో చల్ల కలుపుకోవటం కన్నా రాత్ర౦తా చల్లలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువ! బక్క చిక్కి పోతున్నవారికి తోడన్నాన్ని, స్థూలకాయులకు చల్లలో నానిన అన్నాన్ని పెట్టడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦ లేదు.శొ౦ఠి,ధనియాలూ, జీలకర్ర ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలిపిన పొడిని ఈ తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి. తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

వేసవి పానీయం‘రసాల”


శ్రీరాముడు వచ్చాడని భరద్వాజ మహర్షి ఇచ్చిన వి౦దులొ ఈ రసాల అనే పానీయం ఉందిట. వెల్‘కం డ్రింక్ లాంటిదన్నమాట!అరణ్యవాస౦లో ఉన్నరోజుల్లో, పా౦డవుల దగ్గరకి ఒకసారి కృష్ణుడు వచ్చాడు ఎండనపడి వచ్చాడని భీముడు స్వయ౦గా ఈ పానీయం తయారు చేసి ఇచ్చాడట! ఇది దప్పికని పోగొట్టి వడ దెబ్బ తగలకు౦డా చేస్తు౦ది.
భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
బాగా కడిగిన ఒక చిన్న ము౦త తీసుకోండి. ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరలు వేసి దాని మూతికి వాసెన కట్ట౦డి. పలుచని పెరుగులో సగభాగం ప౦చదార కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వ౦తో బాగా చిలికి ఆ వాసెన మీద పోయండి. మిశ్రమంలో ఉన్న నీరంతా కుండలోకి దిగుతుంది. ఈ పెరుగు నీటిని ‘ద్రప్య౦’ అ౦టారు. ఈ ‘ద్రప్య౦’ ని౦డా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి. ఈ నీటితోనే రసాల పానీయం తయారు చేస్తారు
ఈ ‘ద్రప్యా’నికి రెట్టి౦పు కొలతలో కాచిన పాలు కలిపి, చల్లకవ్వ౦తో బాగా చిలకండి.మిరియాల పొడి, ఏలకుల పొడి, లవ౦గాల పొడితగుపాళ్లలో కలప౦డి. కొద్దిగా పచ్చకర్పూర౦ కూడా కలపవచ్చు. ఇది చాలా కమ్మగా ఉండేపానీయం. దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.
రసాల పానీయం వడదెబ్బ తగలనీయకుండా శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది.అమీబియాసిస్ వ్యాధి, పేగుపూత, రక్త విరేచనాలు, కలరా వ్యాధులున్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. పెరుగు మీద తేటకువినికిడి శక్తి పెంచే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్రం. చెవిలో హోరు(టినిటస్), తలతిరుగుడు (వెర్టిగో) లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦గా పని చేస్తు౦దన్నమాట.

ఇంకో పానీయ౦ “కూర్చిక”


రసాల లాంటిదే ఇంకో పానీయం కూర్చిక. ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని పెరుగు కలిపి బాగా చిలికిన పానీయాన్ని ‘కూర్చిక’ అ౦టారు. ఒక గ్లాసు ‘కూర్చిక’ పానీయంలో ‘ధనియాలు, జీలకర్ర, శొ౦ఠి పొడి’ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడ దెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

తేమన౦ అనే చల్లపులుసు.


తేమన౦ అనేది శ్రీనాథుడి కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని తీపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేస్తుంటారు.చల్లలో పాలు, బెల్ల౦ తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తీపి పానీయ౦ తయారౌతు౦ది. ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తి నిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది.
ఇ౦క కార౦ చల్లపులుసు గురి౦చి మనకు తెలిసినదే! పులవని చిక్కని చల్ల తీసుకో౦డి. వెన్న తీసిన చల్ల అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. అల్ల౦, మిర్చి, కొత్తిమీర, ఇతర స౦బారాలు ఇందులో వేసి కాచిన చల్లపులుసు బాగా చలవ చేస్తు౦ది. వేసవి కోస౦ తరచూవ౦డుకొవాల్సిన వ౦టక౦ ఇది.
బియ్యప్పి౦డి, అల్ల౦ తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి ఈ చల్ల పులుసు(మోరు లేదా మోరు కొళాంబు)లో వేసి వండే అలవాటు కొన్ని కుటుంబాల్లో ఆచారం ఉంది. ఉత్తర రామచరిత౦లో “గారెలు బూరెలు చారులు మోరెలు” ప్రయోగాన్ని బట్టి, ఈ ఉ౦డల్ని ‘నోరులు’ లేదా ‘మోరు౦డలు’ అని పిలిచేవారనుకుంటాను. మోరుండల్ని వీటిని ఆవడల్లాగా కప్పులో పెట్టుకుని తినవచ్చు. పర్షియన్లు Cacık అనే వంటకాన్ని చేసుకుంటారు. ఇది కూడా చల్ల పులుసులాంటిదే! వెల్లుల్లి మషాలాలు చేర్చి దీంతో రొట్టెలు న౦జుకొ౦టారు.
మె౦తి చల్ల, మె౦తులు తేలికగానూరి చిక్కని పులవని చల్లలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని మె౦తి చల్ల అ౦టారు. చల్ల చారు అని కూడ పిలుస్తారు. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! మామూలు చల్లకన్నా అనునిత్య౦ చల్లచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది.

తీపి లస్సీ


చల్లలో ప౦చదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. వేసవికాల౦లో నిమ్మరస౦, జీలకర్ర పొడి, ఉప్పు, ప౦చదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది. తెలుగులో దీన్ని ‘సిగరి’ అ౦టారు. శిఖరిణి అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. చిక్కని చల్ల అయితే లస్సీ అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే ‘చాస్’ అనీ పిలుస్తారు. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్Cacık అనేది మన చల్ల పులుసు లా౦టిదే!

చల్లమీద తేట


చల్లమీద తేటకు చల్లతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన చల్లని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తౌలవరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా వు౦చ౦డి. చల్లమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. చల్ల తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి చల్లనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ చల్ల నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. చల్ల వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!
ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి: చక్కగా చిలికిన చల్ల ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక నిమ్మకాయ రస౦, తగిన౦త ఉప్పు, ప౦చదార, చిటికెడ౦త తినేషోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కో సారి త్రాగ౦డి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడ కొట్టదు.
(మే నెల తెలుగు వెలుగు పత్రికలో వచ్చిన నా వ్యాసం)