Monday, 6 April 2015

అచ్చతెలుగు మాటలాట :: డా. జి వి పూర్ణచందు

అచ్చతెలుగు మాటలాట
డా. జి వి పూర్ణచందు
అచ్చతెనుంగు పద్దె మొకటైనను గబ్బములోన నుండినన్
హెచ్చని యాడుచుందు రది యెన్నుచు, నేర్పున బొత్త మెల్ల ని
ట్లచ్చ తెనుంగున్నన్నుడువ నందుల చంద మెఱుంగు వారు నిన్
మెచ్చరొ, యబ్బురం బనరొ, మేలనరొ, కొనియాడరో నినున్
ఇది ఐదొందల యేళ్ళనాటి పొన్నెగంటి తెలగన్న కవి తాను అచ్చతెలుగులో యయాతి చరిత్ర కావ్యం వ్రాయాలని సంకల్పం చెప్పుకుంటూ, సంస్కృతపదం ఒక్కటి కూడా వాడకుండా పద్యం చెప్పాలనుకున్నాడు.
“కావ్యం (కబ్బం) మొత్తం వెదికితే అచ్చతెలుగు పద్యం(పద్దెం) ఒక్కటి కనిపిస్తే చాలు, మెచ్చుకుంటూ అదే గొప్ప (హెచ్చు) అంటారు. కవి పండితులకు సంస్కృత భాష మీద పట్టు సహజంగా ఉంటుంది. కాబట్టి, సంస్కృతం మాటల్ని అవలీలగా వాడేయగలరు. కానీ, అన్నీ అచ్చతెలుగు పదాల పద్యాలతోనే మొత్తం పద్దేలన్నీ చెప్పటానికి (నుడుప) నేర్పు కావాలి. నుడుపనేర్పు ఉంటే ఆ చందం (అందం) తెలిసినవారు మెచ్చకుండా ఉండగలరా? ఆహా! అనీ, ఇదే మంచిదని కొనియాడ కుండా ఉండగలరా?” అంటాడు ఈ పద్యంలొ తెలుగన్న!
ఏది అచ్చ తెనుగు? అనేది ప్రశ్న. అతిసామాన్య ప్రజల నాలుకల మీద ఆడేమాటలే అచ్చతెనుగు. ఈ మాటల్లో అనేక సంస్కృత పదాలు, ఇంగ్లీషు, పర్షియన్, ఉర్దూ, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి పదాల్ని సామాన్యులు మాట్లాడుతూనే ఉన్నారు. జనంలోకి వెళ్ళిపోయిన పదాలు విదేశీయమైనా స్వదేశీయంగా మార్చుకో లేక పోతే భాష ఎదుగుదల లేక గిడసబారి పోతుంది. అలాగని అయ్యిందానికీ, కాన్దానికీ సంస్కృతాంగ్ల పదాలను ఇష్టారాజ్యంగా ప్రయోగించటమూ తప్పే!
 చదువుకున్నవాళ్ళు ఏదైనా మాటని తెలుగులో పలకాలంటే సంస్కృత భాషలోకే వెడతారు. తెలుగులో అనవచ్చేమో అని ఆలోచించరు. Two wheelerని ద్విచక్ర వాహనం అనే గానీ రెండు చక్రాలబండి అనవచ్చనుకోరు. ఇంగ్లీషూ, సంస్కృతమూ ఎవరికి తెలియవో వాళ్ళకి తెలుగులో పదాలు పలుకుతాయి. సామాన్యుడు డ్రెడ్జరుని “తవ్వోడ (సముద్రం అడుగున ఇసుకని తవ్వి తీసే ఓడ)” అనగలడు. ఫ్లైవోవరుని ‘పైవంతెన’ అనగలడు. అలా అనలేనప్పుడు ఆ ఇంగ్లీషు లేదా సంస్కృతం మాటనే ఉన్నదున్నట్టు మన భాషలో కలిపేసుకో గలగటం మంచిది. పొన్నెగంటి తెలగన్నది కూడా ఇదే దృష్టి. ఆయన దేవతల పేర్లని ‘పాదం అడుగున నీళ్ళున్నవాడు’ లాంటి అనువాదాలతో హింస పెట్టకుండా చక్కగా తెలుగు పదాలుగానే ఈ కావ్యంలో వాడేశాడు, కావ్యం పేరే యయాతి చరిత్ర అని రెండు సంస్కృత పదాలతో ఉంటే ఇంక అచ్చతెలుగులో వ్రాసేదేవుంది? అని ఈసడించిన వాళ్ళున్నారు. కానీ, సంఙ్ఞావాచకాలను అంటే, పాత్రలూ, ప్రకృతి సంపదలు, పట్టణాలు, పనిముట్లు వీటి పేర్లను తెలుగులోకి మార్చాలనే ప్రయత్నం తాను చేయనన్నాడు. తెలుగు భాషాభివృద్ధికి ఇది ముఖ్యమైన విషయమే!
మనవి కాని వాటికి పేర్లు మన భాషలో ఉండవు. కంప్యూటర్, ఇంటర్నెట్ లాంటి మాటల్ని తెలుగు చేయలేక గణక యంత్రం, అంతర్జాలం అన్నందు వలన తెలుగు భాషకు ఒరిగేదేమీ ఉండదు. పైగా పూర్తి అర్థాన్ని అందించలేకపోవటాన్ని కూడా గమనించవచ్చు. పొన్నెగంటి తెలగన్న అలా తెలుగీకరించే పని తాను చేయబోనన్నాడు.
రైలు, రోడ్డు, ఫ్యాను, లాంటి మాటల్ని తెలుగుమాటలుగా తీసుకుంటే వచ్చే నష్టం లేకపోగా తెలుగు పొంగులెత్తు తుంది. రైలెక్కు, ఫ్యానెయ్యి లాంటి తెలుగు మాటలు ఏర్పడి పోయాయి. వీటిని దుష్టసమాసాలుగా ముద్ర వేయటానికి వీల్లేదు. సామాన్యుల వాడకంలో ఉన్న మాటల్నికనీసం వంద సంవత్సరాల కొకసారయినా దేశ్యపదాలుగా కలుపుకుంటే, భాష విచ్చుకుంటుంది. లేకపోతే వాడకం తప్పి ముడుచుకు పోతుంది.
చీపురు, రోలు, రోకలి లాంటి అచ్చ తెలుగు పదాలను తెలుగు నిఘంటువుల్లో చేర్చక పోవటం వలన, అన్ని తెలుగు మాటలకు ఆంగ్ల తర్జుమాలు కూర్చక పోవటం వలన విదేశీ పరిశోధకులకు తెలుగు మాటలు తెలియకుండా పోయాయి. అందువలన మనం చాలా నష్టపోయాం. మన మాటల పుట్టుక తెలియాలంటే ముందుగా వాటన్నింటినీ ఒక చోట చేర్చవలసి ఉంది. తమిళానికి లెక్సికాన్ (మహానిఘంటువు) గత శతాబ్ది మొదటి పావులోనే తయారయ్యింది. అందువలన పరిశోథనా రంగంలో వారికి చాలా మేలు జరిగింది. తెలుగు మాటలు జారుబాట పడుతుంటే మనం ఊరక చూస్తున్నాం.

తెలుగు నేల-ప్రాచీన తెలుగు ప్రజలు :: డా. జి వి పూర్ణచందు

తెలుగు నేల-ప్రాచీన తెలుగు ప్రజలు
డా. జి వి పూర్ణచందు
ఆంధ్ర దేశస్థ సర్వాపగాభంగాత్ రంగరంగముల శౌర్యములు నేర్చి
ఆత్మప్రలాప శౌర్యములు తాలిచి సుమిత్రా బోర్నియో ద్వీపతతులు గెలిచి
వంగ మహారాష్ట్ర హద్దులు పరిచయ స్థలములై వినయమ్ము సలుప మెలగి
ఈజిప్టు నుండి కృష్ణాజలమ్ములకు బోరంబాటగా పరాక్రమము జూపి
సకల దీవుల విజయధ్వజములు నాటి
తనదు తెరచాప వార్థిరాజునకు కట్టు
కోకగా పూర్వమాంధ్రుల నౌక రాజ్య
మమర జేసిన దేడు సంద్రముల మీద    
ఆంధ్రదేశంలోని సమస్త నదీతీర ప్రాంతాలలో వెలుగు లీనిన మహానాగరికతకు వారసులుగా తాము నేర్చిన శౌర్యాలను ప్రదర్శిస్తూ, సుమిత్రా బోర్నియో లాంటి అనేక ద్వీపాలను గెలుచుకుని ఆంధ్రరాజ్యాలు స్థాపించుకుని, వంగ మహారాష్ట్ర హద్దుల వరకూ ఉన్న భూములు ‘మాకు పరిచయాలే’ అన్నంతగా వినయ సంపన్నతతో మెలగుతూ, అటు ఈజిప్టులోని నైలూ నుండి ఇటు కృష్ణాజలాల వరకూ వర్తక వాణిజ్యాల కోసం రాకపోకలు విస్తృతంగా జరిపి, సముద్రం పైన తమదే ఆధిపత్యం అన్నంతగా సకల దీవుల్లోనూ విజయధ్వజాలు నాటిన తొలినాటి ఆంధ్రుల ప్రశస్తిని విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర పౌరుషంలో ప్రస్తుతిస్తాడు. సముద్ర రాజుకు తన తెరచాపను కట్టుకోకగా కట్టిన ఆంధ్రులు తమ ఆంధ్రరాజ్యాన్ని నౌకారాజ్యంగా ఏడు సముద్రాలమీదా అమర చేశారంటాడాయన. ప్రాచీనాంధ్రుల చరిత్రకు ఈ పద్యం అద్దం పడుతుంది.
క్రీస్తుశకం తొలినాళ్లలో కృష్ణాజిల్లా దివిసీమలో దొరికిన నాణాలలో divi అక్షరాలు ఆనాటి తెలుగువారి విదేశీ వర్తకాలకు సాక్ష్యం. చరిత్రకారులు ఈ విదేశీ వాణిజ్య సంబంధాలను భారత దేశపు ప్రాచీనవర్తక వైభవంగా గొప్పగా చిత్రించారు కూడా! కోడూరు ఓడరేవు భారత దేశంలోనే అత్యంత ప్రాచీన ఓడరేవు పట్టణంగా గుర్తించారు. భారత దేశం అనగానే జనం దృష్టి ఏ పాట్నా మీదకో, హస్తినాపురం మీదకో, బెంగాలు మీదకో పోతుంది గానీ తెలుగు వారి మీదకు రాదు. ఇక్కడ తెలుగునేలమీద సింధూ నాగరకతకు సమాంతరంగా జనజీవనం ఉండేదని, ప్రత్యేకమైన సంస్కృతి, ఇనుమును కరిగించగల పరిఙ్ఞానం కలిగిన వారనీ, అప్పటికి ఉత్తరాదివారికి ఇనుము తెలియదనీ ఒప్పుకుంటారు. కానీ, ఆ సంస్కృతిని తెలుగు సంస్కృతిగానో, కృష్ణా గోదావరీ లోయల నాగరికత గానో ప్రకటించటానికి ఇష్టపడరు.
బుద్దుడి కాలానికే ఆంధ్రపథం (ఆంధ్ర రాజ్యానికి దారి) పేరొందింది. ఆదిలాబాద్, నాందేడ్ ప్రాంతాల్లో ‘మూలక’ రాజ్యాలు కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో ‘అశ్మక’, ఆంధ్రనగరాలుగా ప్రసిద్ధాలు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ మ్యాపు పైన 55 ప్రాచీన బౌద్ధ స్థావరాల్ని గుర్తించి బెజవాడ కేంద్రంగా ఈ స్థావరాలను కలుపుతూ కొన్ని రేఖలు గీసి చూస్తే, 6 రహదారులుగా కనిపించాయి.
ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలనుండి కళింగ (ఒడీసా), మహరాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‘ఘడ్, తమిళనాడులలోకి భూమార్గాన వర్తక వాణిజ్యాలు నడిచిన ఈ రహదారుల్లోనే ప్రాచీన బౌద్ధ స్థావరాలు్ నెలకొన్నాయని దీన్ని బట్టి అర్థం అవుతోంది. 2008లో ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘నైలూ నుండి కృష్ణ దాకా’ అనే నా పుస్తకంలో ఈ వివరాలు పొందుపరిచాను.
నాగ, యక్ష, గరుడ జాతులు బహుశా ఈ నేలపైన నివసించిన తొలి జాతులవారు కావచ్చు. నాగులకు మోపిదేవి, యక్షులకు భట్టిప్రోలు, గరుడులకు గృధ్రవాడ (గుడివాడ) రాజధానులు కావచ్చు. వారితో పాటు ఈ నేలమీద తొలి ఆఫ్రికన్ ద్రావిడ జాతులు కూడా జీవించినట్టు భాషాపురావస్తు శాస్త్ర ఆధారాలను బట్టి భావిస్తున్నారు. కాకుళ అనే నది, ఎలకుర్రు లాంటి ఊరు పేర్లు నైలూ నదీతీర భాషల్లో కూడా కనిపిస్తాయి. కృష్ణాజిల్లా శ్రీకాకుళం వీళ్ళ రాజధాని నగరం కావచ్చు. ఆఫ్రికన్ ద్రవిడ జాతులు సముద్రమార్గాన కృష్ణా గోదావరి ముఖ ద్వారాల నుండి తొలిగా తెలుగునేలపైనే అడుగు పెట్టారని ఫ్రాంక్లిన్ సి సౌత్‘వర్త్ అనే పరిశోధకుడు చెప్పిన విషయాలు ముఖ్యమైనవి.
ఈ జాతుల ప్రజలు తెలుగువారుగా సహజీవనం సాగిస్తున్న కాలంలో ఆంధ్రవిష్ణువు సారధ్యాన ఉత్తరాదినుండి ఆంధ్రులు శ్రీకాకుళాన్ని జయించి ఇక్కడి తెలుగు ప్రజలతో మమేకమయ్యారని యేటుకూరి బలరామమూర్తిగారు వ్రాశారు. ఈ జాతులందరి భాషా సంస్కృతుల సమ్మేళనంగా పుట్టిందే తెలుగు భాష. జాతి పరంగా మనం ఆంధ్రులుగానూ, భాషపరంగా తెలుగు వారిగానూ మారటానికి ఇది చారిత్రక నేపథ్యం.  వెదికితే, కృష్ణాతీర ప్రాంతాల్లో గ్రామనామాలు ఆఫ్రికన్ గ్రామనామాలతో సమానంగా ఉన్నవి అనేకం కనిపించే అవకాశం ఉంది. బెజ లాంటి దేవతల పేర్లూ అక్కడ కనిపిస్తాయి. ఈ బెజదేవత పేరున బెజవాడ ఏర్పడి ఉండవచ్చు కూడా! “ఈజిప్టు నుండి కృష్ణాజలమ్ములకు బోరంబాటగా పరాక్రమము జూపి’’ అనడం వెనుక ఇంత కథ ఉంది. దక్షిణాదిలో తొలి ద్రావిడులు తెలుగువారే! తెలుగే ప్రాచీనం!