Tuesday, 7 June 2016

మగ ఏడుపులు డా. జి వి పూర్ణచందు


మగ ఏడుపులు
డా. జి వి పూర్ణచందు
ఱెక్కలు రావు పిల్లలకుఱేపట నుండియు మేతగానమిం
బొక్కుచు గూటిలో నెగసి పోవగ నేరవుమున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులు జూచుచున్న వతి  దీనతనెట్లు భరింతు నక్కటా!
(శ్రీ మదాంధ్ర మహా భాగవతము- 7/63)

భార్యలు ఊరెడితే భర్తలు ఎంజాయి చేస్తారని చాలా మంది కథలుకార్టూన్లు సృష్టిస్తారు గానీపిల్లల్ని ఇంట్లో వదిలి వెడితే అప్పుడు తెలుస్తుంది అయ్యగార్ల సంగతి. ఈ దేశంలో భర్త లేకపోయినా స్త్రీ జీవించగలదు. కానీ భార్య లేకపోతే భర్తకు ఒక్క పూట కూడా గడవదు. భర్త పోతే తోడుమనిషి పోయాడని ఏడుస్తుంది భార్య. భార్య పోతే ఇల్లెలా నడుస్తుందని ఏడుస్తాడు భర్త. వంటెవరు చేస్తారు?ఇల్లెవరు ఊడుస్తారుఅంట్లెవరు కడుగుతారుబట్టలెవరు ఉతుకుతారుపిల్లల్నెవరు సాకుతారు?అందుకని భార్య లేదని మగాళ్ళు ఏడుస్తారు. భార్య ఉన్నంత సేపూ వేధించుకు తినటం‘నుయ్యో గొయ్యో చూసుకుంటా’నని ఆమె ఏడవటం‘చస్తే చావుఈడ్చి పారేస్తా’... అని అతను అరవటం...ఇవి చాలా ఇళ్ళలో నిత్య కృత్యాలే! కానీఒక్క రోజు భార్య ఇంట్లో లేకపోతే తలకిందులై పోతాడు మగాడు.

ఇదేదో మహిళా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ఈ నాటి సామాజిక పరిస్థితి కాదు. పోతనగారి నాటికే ఈ ధోరణి ఉంది. ఆయన తన భాగవతంలో ఇలాంటి కథే ఒకటి చెప్పాడు: ఉశీవర రాజ్యాన్ని పాలించే సుయుఙ్ఞుడనే రాజు యుద్ధంలో మరణించాడు. శవం చుట్టూ చేరి భార్యలుబంధువులూ ఏడుస్తున్నారు. అది చూసి సాక్షాత్తూ యముడు ఓ బ్రాహ్మణ బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ ఏడ్చే వాళ్ళందరినీ ఊరడించేందుకోసం వాళ్లకు ఈశ్వర తత్వాన్ని బోధిస్తాడు. ఆ క్రమంలో ఈ ‘కథ చెప్పాడు...

అడవిలో ఓ చెట్టు మీద అడవి పిచ్చుకల జంట సుఖంగా ఉన్నాయి. ఆ సమయంలో ఓ వేటగాడొచ్చి “భార్యపిచ్చుక”ని పట్టి రెక్కలు విరిచి సంచీలో వేసుకున్నాడు. అప్పుడు “భర్తపిచ్చుక” ఏడుస్తూ ఇలా అంది: “అయ్యయ్యో! మన పిల్లలకు ఇంకా రెక్కలు కూడా రాలేదు. అవి ఎగర లేవు. తెల్లవారిం దగ్గర్నుంచీ అవి ఆకలో మొర్రో అంటూ గోలచేస్తాయి, నువ్వెప్పుడొచ్చి అన్నం పెడతావా... అని నీకోసం నిక్కినిక్కి చూస్తాయి. వాటి ఏడుపు వినటానికే భరించ లేనంతగా ఉంటుంది. ఇంకనుండి చచ్చినట్టు వాటికి ఆహారం నేనే తెచ్చి పెట్టవలసి వస్తుంది కదా!” అని భర్త పిచ్చుక ఏడ్చినట్టు వ్రాశాడు పోతన గారు.  “మగఏడుపులు” ఎలా ఉంటాయో ఈ పద్యం మనకు వివరిస్తోంది

బతికున్నంత కాలం భర్తలు అన్యాయం చేసినా, తన భర్త చనిపోయి తనకు అన్యాయం చేశాడనే అంటుంది భార్య. అనుకుంటుంది కూడా! కానీ, భర్తలు మాత్రం అలా అనుకోరు. అదే తేడా!
ఉశీవర దేశ రాజు పోయాడని అతని రాణులు ఏడ్చినప్పుడు యముడు వచ్చి,  భార్య పోతే ఏడ్చినఈ భర్త కథ చెప్పినట్టు పోతనగారు వ్రాశాడు. ఇందులో విచిత్రం ఏమీ లేదు. లోకం తీరు చెప్పాడు యముడు. అదే ఈశ్వర తత్త్వం అంటే! లోకాన్ని నడిపించేది ఈశ్వరు డైనప్పుడు లోకం తీరు ఈశ్వర తీరే అవుతుంది కదా! దాన్నే చెప్తున్నాడు ఈ పద్యంలో పోతన.

అందరు మగాళ్ళు ఇలానూ, అందరు ఆడాళ్ళు అలానూ ఏడవాలనే రూలేమీ లేదు. ఏడవటానికి కారణాలు వేరుగా  ఉంటాయనేది మాత్రం నిజం. సామాజిక వ్యవస్థ తీరే అంత! మనుషులందరూ పరస్పరం ఆధారపడి బతికితేనే అది సమాజం అనిపించుకుంటుంది. కానీ, భార్యా భర్తల విషయానికి వచ్చే సరికి మాత్రం భార్యని తాను పోషిస్తున్నానని, అందుకు కృతఙ్ఞతగా భార్య ఆజన్మాంతం అణిగి ఉండాలనీ భర్తల్లో ఓ బలమైన భావం సర్వత్రా కనిపిస్తుంది. భార్య సంపాదన మీద ఆధారపడి బతికే వాడిక్కూడా ఇలాంటి ఆలోచనే ఉంటుంది...తన వలనే కదా ఆమె సుఖంగా వుందని! అసలు రహస్యం ఆమె పోయినప్పుడే తెలుస్తుంది... అందుకే మగజాతి అలా ఏడుస్తుంది!