Sunday 26 April 2015

తెలుగు విద్యార్థి :: డా. జి వి పూర్ణచందు

తెలుగు విద్యార్థి
డా. జి వి పూర్ణచందు
తనయందు నఖిల భూతములందు నొకభంగి/సమహితత్వంబున జరుగువా(డు
పెద్దల బొదగన్న భృత్యుని కైవడి( చేరి నమస్కృతుల్ సేయువా(డు
కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన/మాతృభావన సేసి మరలువా(డు
తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను/దీనుల( గా(న జింతించువా(డు
సములయడ సోదర స్థితి జరుపువాడు/దైవతములంచు గురువుల( దలచువా(డు
లీలలందును బొంకులు లేనివా(డు/లలితమర్యాదు(డైన ప్రహ్లాదు(డధిప
          మనకు గుణనిథి లాంటి పరమ ‘పండితపుత్రులు’ వేల సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రహ్లాదుడి లాంటి రాక్షసపుత్రులు అరుదు. ‘పండితపుత్ర’ అనేది నీచవాచకం అయినప్పుడు ‘రాక్షసపుత్ర’ అనేది ఉత్తమ గుణవత్తర శబ్దం కావాలి కదా! కానీ, మన పాఠశాలలు ప్రహ్లాదుణ్ణి దృష్టిలో పెట్టుకుని, తమ విద్యార్థుల్ని ‘నాయనలారా! రాక్షసపుత్రులారా!’ అని పిలవ గలరా?
          “తన పట్ల అఖిల జీవరాశుల పట్ల ఒకే తీరులో ఉంటాడు. పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు కట్టుబానిస లాగా వంగి దణ్ణాలు పెట్టి గౌరవిస్తాడు. నదురుగా ఉన్న అమ్మాయి కనిపిస్తే, మా అమ్మలా ఉందనుకుంటూ, అటుతిరిగి వెళ్ళి పోతాడు. దీనుల్నీ, హీనుల్నీ తలిదండ్రుల మాదిరి ధర్మవత్సలతతో సాకుతాడు. స్నేహితుల్ని సోదరుల్లా, గురువుల్ని దేవుడిలా భావిస్తాడు. సరదాక్కూడా అబద్ధాలాడడు. అమిత ‘లలిత మర్యాదు’డితడు” అని ప్రహ్లాదుణ్ణి ఈ పద్యంలో పోతనగారు వర్ణిస్తాడు. స్కూలు వదిలి వెళ్ళేప్పుడు కాండక్టు సర్టిఫికేటు మీద పోతనగారు చెప్పిన ఈ తెలుగువిద్యార్థి లక్షణాలన్నీ వ్రాసి అవి ఆ విద్యార్థికి ఎంతంత ఉన్నాయో ధృవీకరించే పద్ధతి ఉంటే విద్యార్థుల్లో సమాజ అనుకూల భావాలను పెంపొందింప చేయటానికి వీలౌతుంది. అలాంటి లక్షణాలున్నవాణ్ణి గుర్తించి, ఉత్తమ విద్యార్థి పురస్కారం ఇవ్వాలి. రాక్షసపుత్రుడి ఘనత ఇది!
          హిరణ్యకశ్యపుడనే రాక్షస ప్రభువు విద్యావ్యవస్థకు ఇచ్చినంత గౌరవాన్ని రాక్షసేతర దైవసమానులైన ప్రభువు లెవరూ ఇచ్చినట్టు మన పురాణాల్లో కనిపించదు. అంతటి రాక్షసుడు “ఏయ్! పంతులూ! ఇంటికొచ్చి మా అబ్బాయికి పాఠాలు చెప్పు” అనలేదు. సామాన్యుడి లాగానే తన కొడుకుని అడవిలో ఉన్న మామూలు గవర్నమెంటు స్కూలుకే పంపాడు. చెప్పిన మాట వినక పోతే ‘రాజుగారి బిడ్డ అని చూడకుండా దండించ’ మన్నాడు. వీపు వాయకొట్టి మరీ చదువు చెప్పాలన్నాడు. అవసరమైతే తన మనుషుల్ని కూడా పంపించి దండించేందుకు ప్రయత్నించాడు. మన తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు మొట్టికాయలు మొట్టి చదువు చెప్పించటానికి సిద్ధంగా ఉన్నారా? అలసట కలగకుండా ఏ.సీ. స్కూళ్ళలో పరమ సుకుమారంగా, కష్టం అనేది తెలియకుండా, పల్లెత్తు మాట పడ నీయకుండా చదివించే తల్లిదండ్రుల కన్నా రాక్షసుడైనా సరే, హిరణ్యకశ్యపుడే గొప్పవాడు! ఇది హిరణ్యకశ్యపుడనే నాణానికి ఒక పార్శ్వం.
శ్రీ రాముణ్ణి వాల్మీకి ‘మర్యాదాపురుషోత్తము’డంటే, ప్రహ్లాదుణ్ణి పోతనగారు ‘లలితమర్యాదు’డనీ పిలిచారు. అంతటి లలిత మర్యాదుడే తండ్రి మీద తిరగబడ్డాడు. తండ్రి మీద అనటం కన్నా ప్రభుత్వం మీద తిరుగుబాటుగా దాన్ని భావించాలి. చదువుల్ని గౌరవించిన హిరణ్యకశ్యపుడు ఆ చదువుల్లో ఇతర దేవుళ్ల మీద విషం ఎక్కించాలని ప్రయత్నించాడు. అధికారం ఉందని, సిలబస్సు మార్చి పారేసి, తన ఘనతని పిల్లలకు బోధించమని ఆదేశించాడు. ఇది ఆ నాణానికి రెండో పార్శ్వం.
 స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కుటుంబం గురించి పాఠ్యాంశాల్లో ఊదర కొట్టిన అభినవ హిరణ్యకశ్యపులు ఈ దేశాన్ని యాబై ఏళ్ళకు పైబడి పాలించిన సంగతి మరిచిపోకూడదు. వాళ్ల తరువాత అధికారంలో కొచ్చిన వాళ్ళు కూడా తమ పార్టీ పెద్దల బయోడేటాలను పిల్లలతో భట్టీయం పట్టించాలని కోరుకుంటున్నారు. తెలుగు ప్రభువులు తక్కువేమీ తినలేదు. ఒక ప్రాంతంలో పుట్టినవాళ్లంతా చెడ్డవాళ్లనీ, మన ప్రాంతం వాళ్ళే మహానుభావులనీ పాఠ్యాంశాల్లో రాయాల్సిందిగా బహిరంగంగానే ఆదేశిస్తున్నారు. ఈ నవీన హిరణ్యకశ్యపుల గురించి మాట్లాడ లేకపోతే మనం పండితపుత్రులుగానే మిగిలిపోతాం.

ప్రభువులు స్వీయ ప్రచారం కోసం, రాజకీయ లబ్దికోసం పాఠ్యాంశాలతో ఇలా చెరలాడి చదువుల్ని అబద్ధాలతోనూ సంకుచితత్వంతోనూ నింపి ఎల్లకాలమూ పబ్బం గడుపుకోగలుగుతా మనుకోవటం పెద్దభ్రమ. ‘తెలుగువిద్యార్థి’ కూడా ఒకరోజున ప్రహ్లాదుడిలా ప్రభుత్వాల మీద తిరగబడే ప్రమాదం ఉంది. పిల్లల బుర్రల్లోకి విద్వేషం ఎక్కించాలనుకున్న హిరణ్యకశ్యపుడికి జరిగిన భంగపాటే చివరికి నేటి ప్రభువులకూ తప్పదనేది ప్రహ్లాదోపాఖ్యానం చెప్తున్న నీతి! చదువులు కుల, మత, ప్రాంతాల కతీతంగా ఉండాలి. నన్నయాదుల్ని ప్రాంతీయతా చట్రంలో బిగించాలను కోవటం కన్నా హిరణ్యకాశ్యపేయం ఇంకొకటుండదు! నిజానిజాలను గ్రహించగలిగే విఙ్ఞతని చదువు కలిగించాలి! మనం చదువుకుంటున్నది అందుకే!