Thursday, 5 June 2014

నవ్యాంధ్రప్రదేశ్ :: తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనం - డా. జి వి పూర్ణచందు

నవ్యాంధ్రప్రదేశ్ :: తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనం
డా. జి వి పూర్ణచందు
ఒక సమాజం అభివృద్ధి చేసుకున్న కళలు, సాహిత్యం, జీవన వైవిధ్యం, నైతిక విలువలు, ఆచారాలు, నమ్మకాలతో పాటు దాని ఆధ్యాత్మికత, భౌతికత, మేథ మరియూ భావోద్వేగాల రూపమే సంస్కృతి! సీమాంధ్ర ప్రాంతాల్లో రూపు దిద్దుకున్న భాషా సంస్కృతులు తెలుగు వారందరినీ భాషాజాతీయులుగా ఒక్కటి చేస్తూ వచ్చాయి.
క్రీ.పూ.1000 నాటికే ద్రావిడులు, ఆంధ్రులు, నాగులు, యక్షులు, గరుడులు, తమిఝులు ఇలాంటి ప్రజలు స౦లీనమై భాషా స౦పన్నమైన ఒక నాగరిక జాతిగా ఎదిగారని యేటుకూరి బలరామమూర్తి ప్రభృతులు ప్రకటించారు. నాగులకు కృష్ణాజిల్లా మోపిదేవి, యక్షులకు గుంటూరుజిల్లా భట్టిప్రోలు, గరుడులకు కృష్ణాజిల్లా గుడివాడ(గృధ్రవాడ) కేంద్రాలుగా ఉండేవి. కొన్ని ద్రావిడగణాలు ఆఫ్రికన్ నైలూ తీర౦ ను౦చీ, ఆంధ్రగణాలు యమునా తీర౦ ను౦చీ వచ్చి, వీరితో సంలీనమయ్యాయి. మౌర్యుల తర్వాత విదేశీ దాడులు ఎక్కువ కావడంతో ఉత్తరాదినుండి ఆర్యుల వలసలు కూడా అనివార్యం అయ్యాయని పద్మినీసేన్‘గుప్తా పేర్కొన్నారు. వీరందరి మధ్యా  సంఘర్షణలు, సంలీనాల వలన ఆంధ్రభాష, ఆంధ్ర సంస్కృతులు కొత్త రూపాలు తొడిగాయి. సంఘర్షణలు కాదు, సంలీనాలే ఆంధ్రుల భాషా సంస్కృతులను నిర్మించాయి.
పుట్టలో పాలు పోయట౦, పుట్టమన్ను చెవులకు అ౦టి౦చుకోవట౦, నాగమ్మ, నాగయ్య, నాగేశ్వర లా౦టి పేర్లు, పాము+పర్రు=పా౦బర్రు =పామర్రు లా౦టి గ్రామనామాలు, ఇవన్నీ 3,000 ఏళ్ళనాటి ఆంధ్రనాగుల ప్రభావానే అలవడ్డాయి. బుద్ధుడికి గొడుగుపట్టిన ముచిలి౦దనాగు ఆంధ్రుడే! ఏడు తలల పాము నీడపడ్తున్న నాగార్జున కొండ బుద్ధ విగ్రహమే సాక్ష్యం.
గేదెలు ఎక్కువగా పెరిగే నేల కాబట్టి, ఆర్యులు ప్రాంతాన్నిమాహిష (గేదె) మండలం అన్నారు. రోమన్లు మైసోలియా’ అన్నారు. గేదె, బర్రె తొలి నాటి తెలుగు పదాలు. మధ్యద్రావిడ మూల రూపాల్లో(Central proto Dravidian) “గేదె”, దక్షిణ ద్రావిడ మూలరూపాల్లో (southern proto Dravidian) ఎనుము, ఎరుము అనే పేర్లు కనిపిస్తాయి. గేదెలకున్న ఎరుము(నల్లనిది)పేరుని బట్టి తూర్పు కనుమలను ఎర్రమల (ఎర్రకొ౦డ) అన్నారు. ఎనమదల (ఎనుము+ తల), ఎనమ౦దుల ఊళ్ళ పేర్లు ఏర్పడ్డాయి. ఎర్రయ్య, ఎర్రాప్రగ్గడ పేర్లతో వ్యక్తులు ప్రసిద్ధి చె౦దారు. యెర్నేని లా౦టి ఇంటిపేర్లు కూడా ఇలానే వచ్చాయని ఆచార్య సు౦దరరామశాస్త్రి (The history of Krishna District in the Ancient and middle ages) వ్రాశారు. పెద్ద మూపుర౦ కలిగిన ఒంగోలు జాతి ఎద్దులూ రోజుల్లో మనకుండేవి. అమరావతి మ్యూజియంలోని పెద్ద మూపుర౦ ఎద్దు శిల్ప౦ ఇందుకు సాక్ష్య౦.
క్రీ.పూ.2,500 నాటికే కృష్ణా గోదావరి ముఖ ద్వారాల నుండి ఆఫ్రికన్ గణాలు కొన్ని ఆంధ్రప్రాంతానికి చేరి రాజ్యాన్ని స్థాపించు కున్నాయని, ఇది దక్షిణ భారత దేశపు కొత్త రాతియుగ స౦స్కృతికి ప్రార౦భ౦ అనీ, ప్రా౦క్లిన్ సి సౌత్ వర్త్ పేర్కొన్నారు. గుల్బర్గా, బళ్ళారి, కర్నూలు, రాయచూరుల్లో కూడా పురావస్తు ఆధారాలున్నా యన్నారు. (Professor Emeritus of South
Asian Linguistics, Pennsylvania,  First Historian, identified the earliest presence of proto Dravidian Culture.)
బహుశా, ఈ ఆఫ్రికన్ గణాలే తొలి ద్రావిడులు కావచ్చనేది తాజా పరిశోధనాంశం. ఆఫ్రో ఏసియాటిక్ మూలభాషా రూపాలలో అనేక ద్రావిడ పదాలు కనిపించటంతో లింగ్విష్టిక్ ఆర్కియాలజీ అనే కొత్త పరిశోధనాంగం ఈ పరిశీలనలు చేస్తోంది ఈ తొలిద్రావిడులు శవాన్ని పాతిపెట్టి, మూడు పెద్దరాళ్ళు తెచ్చి పొయ్యిగూడుఆకార౦లో నిలిపి, కైరన్లు(సమాధులు) కట్టారు.
వీటి కోస౦ పొడవైన పెద్ద రాళ్ళను వాడటం వలన యుగాన్ని పెద్ద రాతియుగ౦ (బృహత్ శిలాయుగ౦) అన్నారు. స్థానిక౦గా
సమాధుల్ని రాక్షస గుళ్ళు, వీరగుళ్ళు, వీరకల్లులని కూడా పిలిచారు. వీరవాసర౦, వీరులపాడు, వీరవల్లి ఊళ్ళ పేర్లు వీటి వలనే ఏర్పడ్డాయని శ్రీ వి వి కృష్ణశాస్త్రి లోహయుగ స౦స్కృతివ్యాస౦లో పేర్కొన్నారు. పెద్దది అనటానికి రాక్షస అన్నారు. కొన్ని రాతిఫలకాల మీద దిచ్చుచెరువుశ్రీ” “రతివిలాసశ్రీపేర్లు బ్రాహ్మీలిపిలో కనిపి౦చాయి. దిచ్చు, దిచ్చరి అంటే వ్యభిచారి.
క్రీ.పూ. 500 వరకూ తూర్క, కొట్టి, చాత, ఏల, ఎహువల, కాట్టు, బెజ ఇలా౦టి దేవతల ఆరాధన తెలుగునేల మీద జరిగేది. బెజప్రజలు కొలిచిన బెజదేవతపేరున బెజవాడ ఏర్పడి ఉ౦డవచ్చు. బెజప్రజలు ఈనాటికీ సుడాన్, ఈజిప్ట్లలో ఉన్నారు. బెజ, బెజావి లేదా బెదావి వీళ్ళ భాషనైలూ ను౦డి వచ్చిన తొలి ద్రావిడ ప్రజల్లో బెజప్రజలుఒకరు కావచ్చు.
 “అఖిలా౦ధ్రావనికి తొలిరాజధాని శ్రీకాకుళ౦అనే వ్యాస౦(1930)లో  కాప్రజలు కృష్ణా ముఖద్వార౦ దగ్గర కాకుళాన్ని (కృష్ణాజిల్లా శ్రీకాకుళం) నిర్మించుకుని పాలి౦చారని శ్రీ టేకుమళ్ల రామచ౦ద్రరావు ప్రతిపాదించారు. కాఅనే రాజవ౦శ౦ ఈజప్టుని ఏలింది. 1902లో అక్కడ తొలి కారాజుగారి సమాధి దొరికింది. ‘కా’ ప్రజలు కృష్ణా ముఖద్వారం గుండా దివిసీమలోకి అడుగు పెట్టి కాకుళ రాజ్య౦ నెలకొల్పారు. కాకులేశ్వరుడి ఆరాధకులయ్యారు. కాఅంటే ఈజిప్షియన్ల భాషలో ఆత్మ! చక్రవర్తి (ఫారో) మరణిస్తే, ఆయన ఆత్మ స౦తృప్తి చెందినప్పుడు మరణాన౦తర భాధ్యతల్ని నెరవేర్చ గలుగుతాడని ఆయనకు ఇష్టమైన ఆహార పానీయాలు సమాధుల్లో ఉంచేవారు, తద్దిన౦ పెట్టే అలవాటు కాప్రజల ను౦డే స౦క్రమి౦చి ఉ౦డవచ్చు. కాకుల్ని ఈజిప్షియన్లు కూడా పిత్రుదేవతలు గానే (harbingers) భావించారు.
కాకుల అంటే, కా+కుల౦=నలుపు+నది= కృష్ణానది. నైజీరియాలో “Ka River” ఉ౦ది. నైగర్ నదిలో కానది కలుస్తు౦ది. af-rui-ka ఆఫ్రికాపేరులో “Ka” అంటే గర్బాశయ౦, పుట్టిల్లు అని (Ref: Nile Genesis: the opus of Gerald Massey). ప్రాచీన ఈజిప్ట్లో ‘El Kurru’ అనే నగర౦ ఉ౦డేది. కృష్ణాజిల్లాలో ఎలకుర్రు అనే కుగ్రామ౦ ఉండటం కాకతాళీయ౦ కాదు. ఎల్లకర్రు అనే ఊరు నెల్లూరు జిల్లాలో కూడా ఉ౦ది. అక్కడ రాతి యుగ౦ నాటి అనేక ఆధారాలు దొరికాయి. రాయలసీమ లోనూ, బళ్ళారిలో కూడా ఇలాంటి ఆధారాలు అనేకం కన్పిస్తాయి. ఇక్కడినుండి బయల్దేరిన ద్రావిడ గణాలు కొంకణి, గుజరాతు మీదుగా సింధునగరాలకు చేరి, ఆ నాగరికతలో ముఖ్య పాత్ర పోషించారన్నది సౌత్వర్త్ గారి పరిశోధన.
కౌ౦డిన్య సుచ౦ద్రుడి కొడుకు ఆంధ్రవిష్ణువనే రాజు, కారాజ్యాన్ని ఏలే నిశు౦భుణ్ణి ఓడించాడు. ఆంధ్రసామ్రాజ్యం నెలకొల్పాడు. ప్రజలు ఆంధ్రవిష్ణువుని ఆరాధించ సాగారు. నిరీశ్వరా పరేదేశాః ఆంధ్రః ఏకోస్తి సేశ్వరః/ యత్రాస్తే భగవాన్ విష్ణుః ఆంధ్రనాయక స౦ఙ్ఞయా-దేశ పరమైన దేవుడు ఒక్క ఆంధ్ర దేశానికే ఉన్నాడు. ఆయన ఆంధ్రభాషా దేవుడైన ఆంధ్రవిష్ణువు. ఆంధ్రనాయకుడు, తెలుగు రాయడు అని ఆయనకు పేర్లున్నాయి... అని కీర్తించుకున్నారు. స౦కిచ్చ జాతక౦, ఘటజాతక౦ అనే బౌద్ధ జాతక కథలలో అ౦ధకవెణ్ణు పేరుతో ఆంధ్రవిష్ణువు గురించి ఉంది. బుద్ధుడు వసుదేవుడు (కృష్ణుడు)గా పుట్టి, ద్వారకా నగరానికి కావలిగా ఉన్న ఒక గొప్ప గాడిద కాళ్ళు  పట్టుకుని మచ్చిక చేసుకొని, దాని సాయంతో ద్వారకను బంధించాడట. వసుదేవు డ౦తటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడనే తెలుగు సామెత ఇలా వచ్చిందే!
 “శ్రీశైల భీమ కాలేశ మహే౦ద్రగిరి స౦యుతమ్/ప్రాకార౦తు మహత్ కృత్వాత్రీణి ద్వారాణి చా~కరోతిమహే౦ద్రగిరి, భీమేశ్వర౦, శ్రీకాకుళం మూడి౦టినీ హద్దులుగా మూడు ద్వారాలుగా చేసుకొని త్రిలి౦గదేశాన్ని ఆంధ్రవిష్ణువు పాలి౦చాడు. ఆ కాలంలోనే తొలి ఆంధ్ర వ్యాకరణ గ్ర౦థ౦ కాణ్వ వ్యాకరణంవచ్చినట్టు ఆచార్య అమరేశ౦ రాజేశ్వరశర్మ పేర్కొన్నారు.
బౌద్ధయుగ౦లో కృష్ణానది ఇరుగట్ల వె౦బడి విస్తరి౦చిన ప్రా౦తాన్ని అంథపథ (ఆంధ్ర రాజ్యానికి దారి) అన్నారు. ధన్నకాడ (ధాన్యకటక=అమరావతి) దీని రాజధాని. ఆంధ్రకాః కృష్ణా గోదావర్యో ర్మధ్యే విద్యమాన దేశః -కృష్ణాగోదావరి మధ్య ప్రదేశం ఆంధ్ర రాజ్యం”అని మహాభారతంలో వివరణ ఉంది.  గాసట బీసట గాథలు (గాథాసప్తశతి, బృహత్కథ) పుట్టిన కాలం అది! ఆంధ్రుల తొలి రాజధానిగా శ్రీ కాకుళం, మలి రాజధానిగా ధనకటకం(గుంటూరుజిల్లా అమరావతి) ప్రసిద్ధిపొందాయి.
బౌద్ధయుగంలో ఇక్ష్వాకుల కాలం వరకూ తెలుగు నేలమీద పాళీభాష వ్యాప్తిలో ఉండేది. అంకె, ఆకట్టు,ఆగు ఆపు, కసవు(మురికి), గరిసె- మానిక(కొలతపాత్రలు), కంచె, గొడ్డలి, పలుగు, కళ్ళం, చెత్త లాంటి తెలుగు వ్యవసాయ పదాలు పాళీ భాషలోకి చేరాయి. ఇక్ష్వాకుల పాలన అ౦తరి౦చిన తరువాత క్రీ. శ.4,5 శతాబ్దాల కాల౦లో బౌద్ధానికి కష్టకాల౦ దాపురి౦చి౦ది. వైదిక ధర్మ పునరుద్ధరణకు శాల౦కాయనులు, విష్ణుకు౦డినులు, పల్లవులు పూనుకున్నారు. వీరి వలన స౦స్కృత భాష ఆధిపత్య౦ పెరిగి. పాళీ ప్రాకృతాలు కనుమరుగయ్యాయి. పైశాచి భాష తెలుగు భాషకు దగ్గరగా ఉండేదని అంటారు. కానీ, అది అ౦టరాని దయ్యి౦ది. ప్రజల భాష మీద స౦స్కృతం పెత్తన౦ చేసి౦ది.
బుద్ధుడు, మహావీరుడు రాజ్యత్యాగాలు చేసి తమ వ్యక్తిత్వాలతో ప్రజల్ని ఆకర్షి౦చారు. ఙ్ఞానవ౦తు లైన బౌద్ధుల్ని, బౌద్ధ స౦ఘాల్ని, బౌద్ధధర్మాన్ని ఆశ్రయించవలసిందిగా బౌద్ధులు ప్రబోధి౦చారు. ధర్మాన్ని పోతపోస్తే రాముడి విగ్రహంలా ఉ౦టు౦దని, పదునాలుగేళ్ళ పాటు రాముడు రాజ్యత్యాగం చేసి దుష్ట శిక్షణ చేశాడని వైదికులు కూడా ప్రచారం చేశారు. శివుడైనా విష్ణువైనా ఒకడే ననే మధ్యేమార్గాన్ని స్మార్తులు అనుసరి౦చారు. వైదిక౦లోకి జన౦ తరలి రావాల౦టే ఈ మధ్యే మార్గ౦ తప్పనిసరి అయ్యి౦ది. ఆంధ్రుల్లోఈ నాటికి స్మార్తులే ఎక్కువ. బౌద్ధ౦ లో౦చి వలసల్ని ఆకర్షి౦చటానికి దశావతారాల్లో ఒకరిగా బుద్ధుని అ౦గీకరి౦చారు కూడా! కానీ, బౌద్ధారామాన్ని విష్ణ్వాలయ౦గా ఎవరూ స్వీకరించలేదు. వైదిక యుగంలో సంక్రమించిన కుల, వర్ణ వ్యవస్థను వీర శైవులు, వీర వైష్ణవులు రూపు మాపే ప్రయత్నాలు చేశారు.
వేంగి చక్రవర్తుల్లో తూర్పు చాళుక్య కుబ్జవిష్ణువర్థనుడు తెలుగుని పాలనా భాష చేశాడు. గుణగ విజయాదిత్యుడు, అతని సేనాని పండరంగడు తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. సాహితీ సమరాంగణ సార్వభౌములుగా మొదట చెప్పవలసింది వీళ్ళిద్దర్నే! పండరంగడి అద్దంకి శాసనం తరువోజ చందస్సులో భాషా చరిత్రకు కీలకం అయ్యింది.
12వశతాబ్దిలో కాకతీయులు తెలుగుజాతిని ఏకం చేయటంలో ఆంధ్రప్రాంత ప్రజలు అందించిన సహకారం గొప్పది.
దివిసీమ యువరాజు జాయపసేనాని చీరాల పాలకుడిగా సంగీత నృత్య కళలలో తెలుగుదనాన్ని పరిమళింప చేశాడు.. ఆంధ్రనాట్య రీతుల్ని ప్రామాణీకరించాడు. దేశి, మార్గ రూపాలను నిర్దేశించాడు. క్రీ.శ.1368లో కాకతీయ ప్రభువులు బందీ లైనప్పుడు ముసునూరి ప్రోలయ, కాపయ సోదరుల నాయకత్వంలో ఆంధ్ర సామంత రాజులు ఏకమై సుల్తాన్లను ఎదిరించి, కాకతీయ రాజ్యాన్ని నలబై ఏళ్ళపాటు నిలబెట్టారు. పరాయి పాలనను వ్యతిరేకిస్తూ ఆంధ్రుల తొలి స్వాతంత్ర్య పోరాటం ఇది.
ఆ తరువాత కొండవీటి రెడ్డి రాజ్యంలో అద్భుత సాహిత్య సృష్టి జరిగింది. తెలుగు భాషకు కావ్య గౌరవం స్థిరపడింది. విజయనగర ప్రభువులు నేరుగా కోస్తాజిల్లాల్ని పాలించనప్పటికీ, సాహితీ సంస్కృతుల విషయంలో వారి ప్రభావం మన మీద ఎక్కువగా ప్రసరించింది.
తన ఆముక్తమాల్యదలో ఏడు బాసలాడగల కృష్ణదేవరాయలు, తెలుగదేల? అని అడిగి, దేశంబు తెలుగేను అని జవాబు చెప్పాడు. అన్ని భాషల్లోనూ తెలుగు ఒకండఅంటే ఏకైక మైనది, ప్రత్యేకమైనది అన్నాడు. రాజులంతా తెలుగును గౌరవిస్తా రన్నాడు. అలాంటి ఆంధ్రభాషలో కావ్య రచన నీకు అసాధ్యమైనదా? అని ఆంధ్ర విష్ణువు తనని నిలదీశాడని చెప్పుకున్నాడు. ఈ అవతారికని ఆంధ్రుల తొలిరాజధాని శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణు సన్నిధిలోనే వ్రాశాడు.
కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించినప్పటికీ, విశాఖ నుండి గుంటూరుజిల్లా వరకూ ఓఢ్ర(ఒరిస్సా) గజపతులకే తిరిగి ఇచ్చేశాడు. గజపతులు ఎక్కువకాలం ఆంధ్రుల్ని పాలించినా, తెలుగు భాషా సంస్కృతుల మీద ఒరియా ప్రభావం పడకపోవటానికి బలమైన విజయనగర ముద్ర ఉండటమే కారణం.
గజపతుల్ని బహమనీ సుల్తాన్లు ఓడించటంతో మొత్తం సీమాంధ్ర మహమ్మదీయ పాలనలోకి చేరిపోయింది. తెలుగు భాషా సంస్కృతులు పూర్తిగా అడుగంటిన పరిస్థితి నడిచింది. అదే సమయంలో మధురని, తంజావూరునీ  నాయక రాజులు పాలిస్తూ భాషా సాహిత్య వికాసాల కోసం పోటీలు పడ్డారు. ఆంధ్రత్వం, ఆంధ్రభాషలు ఎన్నో జన్మల తపఃఫలమని అప్పయ్య దీక్షితులు అన్నాడు. కానీ, అదే కాలంలో నిజానికి ఆంధ్రలో ఆంధ్రత్వం అల్పం అయిపోయి ఉంది. 
1512లో కులీ కుతుబ్షా స్వతంత్రం ప్రకటించుకుని గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్ర ప్రాంతం గోల్కొండకు సుదూరం అయ్యింది. కొద్దిమందికి తప్ప రాజాదరణ దక్కలేదు. దాంతో మధుర, తంజావూరులకు సాహితీ సాంస్కృతిక రంగాల వలసలు పెరిగాయి. చిత్తూరుజిల్లా చంద్రగిరిలో నామమాత్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యాన్ని గోల్కొండ చప్పరించేసింది. దాంతో, సీమాంధ్రల్లో ఆంధ్రపాలకుడే లేని స్థితి నడిచింది. ఆంధ్ర భాషా సంస్కృతులు అనాథలయ్యాయి. కృష్ణలీలా తరంగాలు, క్షేత్రయ్య పదాలు, సిద్ధేంద్రయోగి కృతులు గోల్కొండ పాలనలో మినుకుమినుకు మన్న కొన్ని సాహిత్య రూపాలు. తెలుగువారి నాట్య కళారీతి కూచిపూడి పురుడు పోసుకున్న కాలం అది! కానీ, ఆ కాలంలో నశించిపోయిన సాంస్కృతిక సంపదే ఎక్కువ. మధుర, తంజావూరులు కాపాడి ఉండకపోతే మనకు శూన్యమే మిగిలి ఉండేది..
బ్రిటిష్ యుగంలో రఘుపతి వెంకట రత్నం నాయుడు, వీరేశలింగం ప్రభృతులు సంస్కరణోద్యమాలు సీమాంధ్రను పరివర్తన దిశగా నడిపాయి. కొమర్రాజు వారి విఙ్ఞాన సర్వస్వాలు, గిడుగు వారి వ్యావహారిక భాషోద్యమం, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా సాగిన ఆంధ్రోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవోద్యమాలు, స్వాతత్ర్యోద్యమం ఆంధ్రుల అభ్యుదయానికి తార్కాణాలయ్యాయి. దేశంలో అందరికన్నా ముందే అభ్యుదయ సాహిత్యోద్యమానికి బీజాలు వేశారు తెలుగు కవులు.
నేటి పరిస్థితుల్లో తెలుగుని ఇంటి భాషగానూ, బడి భాషగానూ, ఏలుబడి భాషగానూ చేసేందుకు ప్రజల గుండె తలుపులు తడుతూ, తెలుగు భాషోద్యమం కొనసాగుతోంది. మేథావులెందరో కలిసి చేసిన పోరాటం వలన తెలుగు భాషకు ప్రాచీనతా హోదా వచ్చింది. కానీ, అది పుష్పించని, ఫలించని అలంకార వృక్షంగా మారి, చివరికి ఒక ప్రహసనం అయ్యింది.
రాష్ట్ర విభజన గోరుచుట్టు మీద రోకటి పోటయ్యింది. సీమాంధ్రులు వంచించ బడ్డారనే భావన సర్వత్రా నెలకొంది.

భాషా సంస్కృతుల పునరుజ్జీవనోద్యమానికి నడుం బిగించటమే నేటి అవసరం. గతమెంతో ఘనకీర్తి గలవాడు, నేటి చీకట్లోంచి రేపటి సూర్యుణ్ణి పుట్టించ గలడు!!

ప్రణయ స్నేహాలు :: డా. జి వి పూర్ణచందు



ప్రణయ స్నేహాలు

డా. జి వి పూర్ణచందు

ప్రేమించే తీరాలి! కాలేజీలో చదువుకోవటం అంటే ప్రేమించటమే అనేది వాడుకలో ఉన్న అర్థం! కనీసం చదువు పూర్తయ్యే వరకూ అయినా  ప్రేమిస్తూ ఉండాలి. తరువాత రెండో అడుగు మొదలౌతుంది. దాని పేరు లేచిపోవటం. లేచి పోకుండా ఇంట్లో పడి ఉండే బతుకు వ్యర్థం అని లోకంకోడికూస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం... లేచిపోవటం కూడా చేతకాని వాళ్ళు స్వతంత్రంగా జీవించటం తెలియని దద్దమ్మలు.
ఎవరికి వాళ్ళు పునర్మూల్యాంకనం చేసుకుంటే ఇది కామమో, మోహమో, ప్రేమో తేల్తుంది. అది ప్రేమేనంటుంది పెమిక హృదయం ప్రేమించటం తెలియని వాడివి పిల్లల్ని ఎందుకు కన్నావయ్యా అని కన్నబిడ్డ తండ్రిని నిలదీసి అడిగితే నోరు మూసుకోవటానికి తండ్రికి రెండు చేతులూ చాలవు.
ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఆత్మతో కూడి ఉన్న మనసూ కలిసి, వ్యక్త పరిచేది ప్రేమ. ఐదు కర్మేంద్రియాలతో భావప్రాప్తి పొందాలని కోరుకునేది కామం అని వాత్స్యాయనం స్పష్టంగా నిర్వచనం ఇచింది. వీటిలో కామప్రవృత్తి సర్వప్రాణికీ సామాన్య మైన విషయం. ప్రేమ ప్రవృత్తి కొందరికి మాత్రమే విశేషంగా ఉండేది. కాబట్టి దీన్నివిశేషకామంగా చెప్పటం జరిగింది. కాముకు లంతా ప్రేమికులు కాలేరు! ప్రేమని కామంలో రంగరించాక అది కామమే అవుతుంది గానీ ప్రేమ ఎంతమాత్రమూ కాదు. కామంతో ముడి పడేది ప్రేమ అంటే, అది అనుకునేవాళ్ళ దౌర్బల్యమే తప్ప నిజం కాదు.
కామంలో ఉత్తమ మధ్యమ అథమ స్థాయిలున్నాయి.
1.      ఉత్తమ కామం: సత్సంతానం కోసం మాత్రమే జరిపేది ఉత్తమ కామం. స్త్రీకి నెలలో ఒక రోజున మాత్రమే స్త్రీబీజం విడుదల అవుతుంది. విడుదలై కొద్ది గంటల్లో నశించిపోతుంది. కొద్ది సేపట్లో పురుషబీజ కణాలు ఆమె గర్భాశయానికి చేరి, స్త్రీ బీజాన్ని కలియ గలిగితేనే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఒక్క రోజున చట్టబద్ధమైన సంతానం కావాలని కోరుకుంటూ, దంపతుల మధ్య జరిగే రతిని ప్రేమ, కామాల చట్రంలో బిగించకూడదు. అది జాతి మనుగడనీ, సమాజ శ్రేయస్సునీ కోరి జరిపేది కాబట్టి, ఉత్తమ కామం.
2.      మధ్యమ కామం: సంతాన కోరికతో నిమిత్తం లేకుండా చట్టబద్ధమైన దంపతుల మధ్య, వారు ప్రేమికులు అయినా కాకపోయినా ఇష్టపూర్తిగా జరిగే లైంగిక వ్యవహారాన్ని మధ్యమ కామం అంటారు.
3.   అథమ కామం: ఇది రెండు రకాలుగా ఉంటుంది.
() కేవలం కుతి తీర్చుకునేందుకు జరిపే చట్టవ్యతిరేక క్రీడ.
() ప్రేమ ముసుగులో జరుపుకునే చట్ట వ్యతిరేక క్రీడ.
రెండో అంశమే ఇప్పుడు చర్చనీయాంశం. పరమ అసభ్యకరమైన భంగిమల్లో యువతీ యువకుల్ని చూపిస్తూ ఇదే ప్రేమంటే అని మనల్ని నమ్మమంటాయి తెలుగు సినిమాలు. యువతీ యువకులు నమ్మక పోతేనే కదా ఆశ్చర్యం.
శాస్త్రాణాం విషయ స్తావత్ యావన్మందరసా నరః, రతిచక్రే ప్రవృత్తేతు నైవ శాస్త్రం నచ క్రమః- శాస్త్రప్రకారం హేతుబద్ధంగా శీలవంతంగా జీవించాలని అనుకుంటారు గానీ, వాత్స్యాయనుడు చెప్తాడు- ఒక సారి రతిచక్రం తిరగటం మొదలెడితే శాస్త్రాలూ, క్రమాలూ ఏవీ ఉండవని! వైద్యుడు కుక్కమాంసం రసగుణవీర్య విపాకాలన్నీ శాస్త్రంలో చెప్తాడు. శాస్త్రంలో ఉంది కదా అని దాన్ని తినాలని కాదు. అలాగే సెక్సు విషయంలో పరమ అసహ్యమైన, ఏహ్యమైన, ఛండాలమైన వాటిని కూడా కామశాస్త్రంలో నేను చెప్పాను. చెప్పినంత మాత్రాన అవన్నీ చెయ్యాలని కాదు...అని తేలికగా తప్పించుకున్నాడు వాత్స్యాయనుడు. దాన్ని అర్థం చేసుకోకపోతే ఆ తప్పు మనదే!
కేవల కామంతో మాత్రమే మనసు పారేసుకుని ప్రేమించానని భ్రమించి, మోసపోయి అష్టకష్టాలు పడ్డ శకుంతల కథ,  ఇంద్రుడు మోసగించి అనుభవించిన అహల్య కథలు ఈనాటి యాసిడ్ కథలకూ అభయ కథలకూ భిన్నమైన వేమీ కాదు. కామానికీ ప్రేమకూ మధ్య హద్దుగా ఉన్న సన్నని గీతని చేరిపేస్తే వ్యథలే కథ లౌతున్నాయి.
పారిశ్రామికీకరణం లోంచి ప్రపంచీకరణం లోకి వ్యవస్థ మారుతున్నకాలంలో ఫేసుబుక్ ప్రేమలు సహజం అవుతాయి. ముక్కూ ముఖం తెలీని వాణ్ణి ఎలా ప్రేమించావే... అనడుగుతారు ఫేసుబుక్ ప్రేమికురాల్ని. ముక్కూ ముఖ తెలిసి ప్రేమించిన వాళ్లంతా సరైన నిర్ణయాలే తీసుకున్నారన గలమా...? అలాగని తల్లిదండ్రులు కుదిర్చిన సంబాంధాలన్నీ నిలకడగా ఉన్నాయా? విఫల దాంపత్యాలు ప్రేమ పెళ్ళిళ్లలో ఎన్ని ఉన్నాయో, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ల లోనూ అన్నీ ఉన్నాయి. కాబట్టి, కుటుంబాలు కూలటానికి, ప్రేమ వివాహాలకీ లంకె లేదు. రెండూ వేర్వేరు విషయాలు రెండింటికీ దేని కారణాలు దానివి.

ప్రేమ ముసుగులో సాగుతున్న వ్యభిచారం గురించి మాత్రమే మనం ఆలోచించాలి.  ఇది సమాజానికి ఏవిధంగా హాని చేస్తుందో గమనించాలి. భద్రం ప్రేమ సు మానుషస్య కథ మప్యేకం హి తత్ప్రాప్యతే! అంటుంది శాస్త్రం. ప్రణయ స్నేహం అనేది మాత్రమే మంచి మనుషుల్ని సృష్టిస్తుంది. తమది కామం కాదు, ప్రేమే అని వాదించే వాళ్ళు జీవితాన్ని సుఖమంతం చేసుకోవాలనే కదా ప్రేమిస్తున్నారు...! అందుకు మరింత ప్రణాళికా బద్ధంగా, హేతు బద్ధంగా, సర్వ జనామోదంగా, బాధ్యతాయుతంగా ఆలోచించాలి. తల్లి దండ్రుల బాధ్యతని కాదని తమ ప్రేమ దారిన తాము పోతున్నప్పుడు బాధ్యత తామే తీసుకోవాలి కదా!