తెలుగులో పేర్లు పెట్టటం నేర్పే
పద్యం
డా. జి వి పూర్ణచందు
“అమరుల బోనపుట్టిక, సహస్ర మయూఖుని జోడుకోడె, సం
తమసము వేరువిత్తు, కుముదంబుల చక్కిలిగింత, పుంశ్చలీ
సమితికి జుక్కవాలు, నవసారస లక్ష్మి తొలంగుబావ, కో
కములకు గుండెతల్లడము, కైరవమిత్రుడు తోచె దూర్పునన్”
‘ఎవ్వరూ
పుట్టించకపోతే భాషెలా పుడుతుందీ?’ అనడుగుతాడు మాయాబజారులో ఘటోత్కచుడు. అవును! పామర
జనులు, ప్రజాకవులు పుట్టించిన పదాలలో లోతు(డెప్త్) ఎక్కువగానూ పండిత కవుల పదాలలో ఎత్తు(ఉన్నతి)ఎక్కువగానూ కనిపిస్తాయి. పారిజాతాపహరణంలో కైరవ (కలువలకు) మిత్రుడైన చంద్రుడు ఉదయించటాన్ని చెప్తూ,
ప్రజాకవి నంది తిమ్మన అచ్చతెలుగులో చంద్రుడికి పెట్టిన ఆరు పేర్లు చాలా లోతుగా
కనిపిస్తాయి.
“మాకొలది
జానపదులకు(మాలాంటి పామరులకు) నీ కవనపు ఠీవి అబ్బునే! కూప నట ద్భేకములకు (నూతిలో
కప్పల్లా గెంతే మాకు) గగన ధునీ శీకరముల చెమ్మ (చల్లని ఆకాశగంగ జల్లువి) నంది సింగయ
తిమ్మా!” అని తెనాలి రామకృష్ణుడు గొప్పగా పొగిడిన కవి తిమ్మన. ఈ పద్యంలో తిమ్మన
సృష్టించిన కొత్త తెలుగుపేర్లు ఇవీ:
బోనపుట్టిక:
నక్షత్రాల హోటళ్ళలో భోజనానికి వెడితే స్థాలీ ఇస్తారు. అంటే
ఒక ముంతడు అన్నం పెడతారన్నమాట. స్థాలీ అంటే కుండ. డజన్లకొద్దీ వంటకాలున్న
చిన్నగిన్నెల్ని పెద్ద పళ్ళెంలోనూ,
పుల్కాలూ, నాన్‘లు, రకరకాల రోటీలు, పొరోటీలను చిన్న బుట్టలోనూ పెట్టి తెస్తారు. ఆ భోజ్యాలబుట్టని
‘బోనాల పుట్టిక’ అన్నాడు తిమ్మన. చంద్రుడి పదహారు కళల్ని రోజు కొకటిగా దేవతలు (ఫైవ్‘స్టార్ సంస్కృతి ఉన్నవారు) ఆస్వాదిస్తారు కాబట్టి, చంద్రుణ్ణి ‘దేవతల బోనపుట్టిక’
అన్నాడు.
జోడుకోడె: వలపట దాపట జోడెడ్లలో ఒక తెల్లగిత్త
సహస్రమయూఖుడైన (వేయి వెలుగులున్న) సూర్యుడైతే, అతని ‘జోడుకోడె’ అంటే, జోడుగా ఉండే
రెండో తెల్లగిత్తలాగా ఉన్నాడట ఆ నిండు చంద్రుడు! చంద్రుణ్ణి ‘రెండో ఎద్దు’ అనటం ఇక్కడి
విశేషం.
వేరువిత్తు:
వేరువిత్తు అంటే నాశనం చేసేదని! వేరువిత్తులాంటివాడు
వంశనాశకుడు! ఈ పద్యంలో సంతమసానికి(కటిక చీకటికి) నాశకుడు కాబట్టి చంద్రుణ్ణి ‘చీకటివేరువిత్తు’
అన్నాడు.
చక్కిలిగింత: కలువలకు చక్కిలిగింతలు పెట్టినంత ఆనందం కలిగించేవాడు చంద్రుడు. చక్కిలి అంటే
చంక. వేరొకరు చంకల్లో తడిమితే కలిగే ముదాన్ని(ఆనందాన్ని) చక్కిలిగింత అంటారు. ముదం
పొందేది కాబట్టి కుముదం పదాన్ని ప్రయోగించాడు. “చక్కిలిగింత”ని
నామవాచకం చేసి చంద్రుణ్ణి పిలవటమే ఇక్కడ విశేషం.
చుక్కవాలు: శుక్రగ్రహం, తిలకం బొట్టు, నీటి చుక్క, కన్నీటి చుక్క, చుక్క కూర వీటన్నింటినీ
చుక్క అనే అంటారు. జ్యోతిష శాస్త్ర రీత్యా శుక్రుడు శుభుడే అయినప్పటికీ, రాక్షసగురువు
కాబట్టి ప్రొద్దున్నే అతన్ని చూడకూడదని, శుక్రుడున్న దిక్కులో ప్రయాణం మొదలు
పెట్టేవాళ్ళు కాదు. చుక్క(శుక్రుడు) ఎదురైతే పనులు చెడతాయని ఒక నమ్మకం! అనుకున్నది
అవక పోతే, చుక్క వాలిందనీ, చుక్క ఎదురయ్యిందనీ అంటారు. ఇక్కడ నంది తిమ్మన “పుంశ్చలీ
సమితికి జుక్కవాలు” అన్నాడు.
పుంశ్చలీసమితి అంటే వేశ్యల గుంపు. రోడ్డు పక్కనే చీకట్లో ఏ
చెట్టుకిందో తమ వృత్తిని పూర్తి చేసుకునే వేశ్యలకు చీకట్లోనే బేరా
లెక్కువ. చంద్రుడు ఇంత వెలుగు లీనుతుంటే బేరాలకు
చుక్కవాల్తుంది కదా! అందుకని చంద్రుడు ‘వేశ్యలకు చుక్కవాలు’!
తొలంగు బావ:
నంది తిమ్మన క్రియారూపాన్ని
నామవాచకం చేసిన మరో గొప్ప ప్రయోగం ఇది: ఉమ్మడి కుటుంబవ్యవస్థలో కొత్తకోడలు తన భర్తకు
అన్నఅయిన బావగారు ఎదురైతే గౌరవంగా తలమీదకు ముసుగు లాగి పక్కకు తొలగి నిలబడుతుంది.
అలా తను తొలగే బావగారిని “తొలగుబావ” అన్నాడు తిమ్మన. తాను రాగానే నవసారసలక్ష్మి(తామరల శోభ) తొలగుతోంది కాబట్టి, చంద్రుడు తొలగుబావ అయ్యాడు.
గుండెతల్లడం: తిమ్మనగారు చంద్రుడికి పెట్టిన
మరోపేరు ‘గుండెతల్లడం’. చంద్రుడొచ్చాడంటే సూర్యుడు అస్తమించినట్టే! చీకటైతే
కోకం(చకోరపక్షులు) లకు కళ్ళు కనిపించవు. అందుకని చీకటంటే వాటి గుండె తల్లడిల్లి
పోతుంది కాబట్టి, కోకాలకు చీకటిచ్చే చంద్రుణ్ణి “గుండె
తల్లడి” అని పిలుస్తాడు.
దేనికైనా
ఒక మంచి పేరు పెట్టాలంటే పండితులు సాధారణంగా సంస్కృతంలోకి వెడతారు. ఫ్లై ఓవర్‘ని
ఊర్ధ్వవారథి అనాలని చూస్తారు. కానీ, పరమ పామరుణ్ణి దేని మీద నుండి వచ్చావని అడిగితే ‘పైవంతెన’ మీంచి అని
అలవోకగా అనేస్తాడు. కొత్త అంశాలకు పేర్లను తెలుగులోనే పెట్టటానికి ప్రయత్నించటం ఒక విఙ్ఞత.
అవసరం అయితే, క్రియారూపాన్ని ఇలా నంది తిమ్మనలా నామవాచకం చేసైనా సరే తెలుగులోనే
పేరు పెట్టాలనేది ఈ పద్య సందేశం. చంద్రుడికి బోనపుట్టిక, జోడుకోడె, వేరువిత్తు, చక్కిలిగింత, చుక్కవాలు,
తొలగుబావ ఆయన పెట్టిన అచ్చతెలుగు పేర్లు.