Saturday 3 April 2021

భోజన మర్యాద డాక్టర్ జి.వి. పూర్ణచందు, 9440172642

 భోజన మర్యాద

డాక్టర్ జి.వి. పూర్ణచందు, 9440172642

              ఎదురేగి సాష్టాంగ మెరగి పాద్యం బిచ్చి/నారికేళ కటాసనముల నునిచి

                             నును బోక పొత్తి గుట్టిన దొప్ప గమితోడ/రంభ విశాల పర్ణములు వరిచి

                             శాల్యన్న సూపాజ్య కుల్యా బహువ్యంజ/నక్షీర  దధులర్పణంబు జేసి

                వార్చిన  పిదప సంవాహన మంఘ్రుల/కొనరిచి తాంబూల మొసగి కుశల

                 మడిగి పోయెద మన్న దవ్వనిచి సిరికి/దగిన సత్కృతి జేసి ఖేదమున మగిడి

                యర్చన గావింతు రెపుడు నిట్లతిథులైన/భాగవతులకు నప్పురి భాగవతులు

ఆముక్తమాల్యద కావ్యంలో ఆనాటి భోజన మర్యాదల గురించి రాయలవారి వర్ణన ఇది. అతిథు లైన భాగవతులకు ఎదురేగి, కుశలప్రశ్నలు వేసి, సాష్టాంగ పడి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తారు. కాళ్లు కడుగుతారు. కొబ్బరీనెలతో అల్లిన చాపలు వేస్తారు. పెద్ద అరిటాకుల్లో వడ్డిస్తారు. తినని వాటిని పడేయటానికి వక్కచెట్ల ఆకుల్తో కుట్టిన డొప్పల్ని పక్కన ఉంచుతారు. విస్తట్లో వరి అన్నం, పప్పు వడ్డించి, కాలువలు కట్టేంతగా నెయ్యి పోస్తారు. పప్పుతోపాటుగా అనేక వ్యంజనాలు అంటే వ్యంజనాని ఓదనార్థాని”-తినటానికి ఉద్ధేశించిన కూరలు, పచ్చళ్లు, పులుసులు, పాలతో వండిన పాయసాలు, పెరుగు, ఉప్పు, పంచదార సహా వడ్డనకు సిద్ధంగా ఉన్న వంటకాలన్నీ కొద్దికొద్దిగా వడ్డిస్తారు. ఏ పదార్ధాన్ని తింటుంటే దాన్ని కొసరికొసరి వడ్డిస్తారు.

భోజనానంతరం నడుము వాల్చేందుకు శయ్య ఏర్పాటు చేసి, కాళ్ళు నొక్కి సేద తీరుస్తారు. వెళ్లేప్పుడు తాంబూల సత్కారాలు చేస్తారు. అల్లంత దూరం వెళ్లి ఆ అతిథి దేవుణ్ణి సాగనంపి, బాధగా వెనక్కు వచ్చి అప్పుడు ఆ గృహస్తు భోజనం చేసేవాడట. ఒక భాగవతుడికి ఇంకో భాగవతుడి అతిథి అర్చన ఇదని వ్రాశారు రాయలవారు.

వడ్దనయ్యాక, ఇంక కలుపుకోండని గృహస్తు కోరతాడు. గోవిందనామస్మరణ చేసి, పెద్దవాళ్లు కలుపుకున్నాక అప్పుడు తక్కిన వారు తినేవాళ్లు. వడ్డించింది వడ్డించినట్టు నోట్లో వేసుకోవటం అమర్యాద ఆనాడు. అతిథులు తిన్నాకే గృహస్థు భోంచేయటంలో ఒక భక్తి భావన ఉంది. ఇంగ్లండులో ముందు గృహస్తు ముద్ద నోట్లో పెట్టుకున్నాకే అతిథి తింటాడట. అది శబరిభక్తి లాంటి మర్యాద.

వడ్డించటానికే కాదు తినటానికీ మర్యాదలున్నాయి. గుటుకూగుటుకూ మంటూ జల్దీభోజనంచేస్తూ, బంతిలో మిగతావాళ్ళు  కూరలో ఉండగానే సాంబార్తెమ్మని కొందరు అరుస్తుంటారు. భోజనాన్ని ఆస్వాదిస్తూ తినేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది.

ఎడం చేత్తో రోటీని మడిచి పుచ్చుకుని కుడిచేత్తో తుంచుకు తినటం ఒక గొప్పగా భావించేవారు కొందరున్నారు. అది చూసేవారికి అసహ్యం అనిపిస్తుంది. ఫోర్కుని ఎడంచేత్తోనూ, కత్తిని కుడిచేత్తోనూ పుచ్చుకుని మాంసాన్ని కోసి తినటం ఇంగ్లీషువాడి మర్యాద. గోరుతో పోయే దానికి గొడ్డలి వాడినట్టు, ఇడ్లీ, అట్టుల్ని కూడా అలా ఫోర్కుతో తినటం ఇప్పటి విచిత్రం. చెంచాతో కాకుండా ఫోర్కుతో ఆహారాన్ని నోట్లో పెట్టుకోవటాన్ని థాయి ప్రజలు తప్పుపడతారు. చెంచాను నోట్లోకి తోసి, నాకటాన్ని యూరోపియన్లు అమర్యాదగా భావిస్తారు.

కూర్చుని, పళ్ళెం మీదకు వంగి ఆహారాన్ని తినాలే గానీ, నిలబడి పళ్ళేన్ని నోటి దగ్గరకు తీసుకెళ్ళకూడదు. పప్పన్నం, పప్పుచారు లాంటివి అలా తినటానికి అనువైనవి కాదు. కాబట్టి ఆ అలవాటు మన పూర్వులకు లేదు.

ఇంట్లో అయితే సరేగాని, ఎంగిలిచేత్తో గరిటెని పుచ్చుకుని వడ్డించుకోవటం లాంటివి హోటళ్ళ కొచ్చినప్పుడు కూడా చేయటం అమర్యాదకరమే!

అన్నాన్ని కలుపుకు తినటంలో నాజూకు తనం ఉండాలి. గోదుమ పిండిని పిసికినట్టు పిసికి కాదు, అన్నాన్ని నమిలి తినాలి! ఆ నమిలేప్పుడు  పెదాలు మూతపడి ఉండాలి. లేకపోతే చప్పరింత శబ్దం ఘోరంగా ఉంటుంది. చప్పుడు చేస్తూ తింటుంది కాబట్టి వరాహానికి చప్పరం అనే పేరుంది. మన భోజనతీరు అలా ఉండకూడదు. వండటానికన్నా వడ్డించటమూ, తినటమే అసలైన కళలు! 

మన భోజన విధి :: కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S. 9440172642

 

మన భోజన విధి

కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S.

9440172642

          ఆల ఘృతంబు వేడియగు నన్నము నుల్చిన  ముద్దపప్పు క్రొం

            దాలిపు కూర అప్పడము ద్రబ్బెడ చారులు పానకంబులున్

            మేలిమి పిండివంటయును మీగడతోడి దధి ప్రకాండముల్

            నాలుగు మూడుతోయములనంజులు గంజదళాక్షి పెట్టగన్

                                                        (తెనాలి రామకృష్ణుడు హరిలీలా విలాసం)

తెనాలి రామకృష్ణుడు హరిలీలా విలాసం అనే కావ్యం కూడా వ్రాశాడని చెప్తారు. ఇలాంటి కొన్ని పద్యాలే తప్ప ఆ కావ్యం అలభ్యం. తామర రేకులవంటి కన్నులు కలిగిన ఓ ఇల్లాలు వండి వడ్డించిన వంటకాల పట్టిక ఈ పద్యంలో ఉంది:

1) ఆలఘృతంబు=ఆవునెయ్యి; 2) వేడియగు నన్నము=వేడివేడి అన్నం; 3) నుల్చిన ముద్దపప్పు= నులించు అంటే to crush విసరటం. కందుల్ని దోరగా వేయించి విసిరి పొట్టు తీసి వండిన ముద్దపప్పుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే తేలికగా అరుగుతుంది. 4) క్రొందాలింపు కూర=వడ్డించబోయే ముందు తాలింపు పెట్టిన కూర. 5) అప్పడము= తమిళంలో పప్పటం, అప్పళం; మళయాళంలో పప్పటం; కన్నడంలో పప్పడి, అప్పడ, అప్పళ; సంస్కృతం పర్పట పేర్లతో కనిపించే అప్పడం మన ప్రాచీన వంటకం. అపూపం(ఋగ్వేద వంటకం), అప్పాలు అనే తీపి భక్ష్యం, ఈ అప్పడం ఇవన్నీ ద్రావిడ నామాలే! పెసరపిండి, మినప్పిండి లేదా కందిపిండిలో సర్జక్షారం, సైంధవలవణం, మిరియాలపొడి కలిపి, వత్తి నిప్పుల మీద కాల్చి, నెయ్యి రాసుకుని అన్నంలో తింటారు;

6) ద్రబ్బెడ= ద్రబ్బెడ అనేది ఒక అన్నపు వంటకం. నూక, తవుడు, తెలికపిండి, పొట్టు, మాఁడు ద్రబ్బెడ ఇలాంటి ద్రవ్యాలను ఎవరు తెచ్చిపెట్టినా అమృతంలా తింటున్న జడభరతుడి గురించి పోతనగారు భాగవతంలో (5-1) వ్రాశాడు. మూలభాగవతంలో కణ పిణాక పలీకరణ కుల్మాష స్థాలీపురీషాదీఅనే ప్రయోగ౦లో స్థాలీపురీష౦(అన్నపు కు౦డలో అడుగు మాడు)ని పోతనగారు మాడు ద్రబ్బెడఅని అనువది౦చాడు. మాడితే మాడు ద్రబ్బెడ! అన్న౦లో కమ్మని స౦బారాలు కలిపి మాడకు౦డా వేయిస్తే అది ద్రబ్బెడ (ఫ్రైడ్ రైస్?) కావచ్చు కదా! 

7) చారులు: చారంటే రసం (సారం). ధనియాలు, మిరియాలు, జీలకర్రల సారం. దీన్ని ఉలవలు, కాయగూరల రసాలతో కూడా కాయవచ్చు. చారులు అన్నది అందుకే! 8) పానకంబులు: అన్నపానాలు అనేది జంటపదం. అన్నమూ, పానమూ రెండూ తీసుకునేవారు. పాయసం, రసాల, శిఖరిణి, జంబీరపానకం(నిమ్మ షర్బత్) లాంటి తియ్యని పానీయాలను భోజనం చివర్లో సేవించేవాళ్లు. భోజనాంతే మధురసం భోజనం చివర తీపి తీసుకోవాలి అని సూత్రం.

9) మేలిమి పిండివంటయున్= రుబ్బిన పిండితో చేసిన వంటకాలు. ఇడ్లీ దోసె వడ వగైరా పిండివంటల్ని పూర్వం భోజనంలో ఒక భాగంగా తినేవారు. ఆనాటి వాళ్ళకి టిఫిన్లు తెలీవు.

10) మీగడతోడి దధి ప్రకాండముల్= గోప్రకాండము అంటే an excellent cow అని! ఇది మీగడతో కూడిన ఆవుపెరుగు

11) నాలుగు మూడు తోయముల నంజులు= నంజుకునే పచ్చడిని నంజు అంటారు. తోయమువారు అంటే companions అని! తోయముల నంజులు అంటే నాలుగైదు కూరగాయలు కలిపి చేసిన పచ్చళ్ళు కావచ్చు.

మన భోజన విధానంలో భక్ష్యాలు (కొరికి తినే గారె బూరెలు), భోజ్యాలు (నమిలి తినే పులిహోర, ద్రబ్బెడ లాంటివి) ఖాద్యాలు (చప్పరించే పచ్చళ్ళు) చోష్యాలు(చారు, సాంబార్ లాంటివి) లేహ్యాలు(నాలుకతో నాకి తినే నంజులు) ఇవీ పంచభక్ష్యపరమాన్నా లంటే!  మొదటిగా మృదువైనవీ, మధ్యలో కఠినమైనవీ, చివరిలో ద్రవ్పదార్థాలూ తీసుకోవటం తెలుగువారి ఆహార సంస్కృతి. పప్పు, కూర, పచ్చడి, పులుసు/చారు, పెరుగు ఈ వరుసలో తినటం మన విధానం. ఈ పద్యం మన సంపూర్ణ భోజన విధానాన్ని సూచిస్తోంది.

‘నల్లేరు’ పచ్చడి:: కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S. 9440172642

 

‘నల్లీనది’ పచ్చడి

కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S.

9440172642

నల్లీనదీ సంయుక్తం

విచారఫలమేవచ

గోపత్నీ సమాయత్తం

గ్రామ చూర్ణంచ వ్యంజనం(చాటువు)

            ఇది ఎవరు రాశారో తెలియదు గానీ, ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి:

          1)‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది. 2. విచారఫలమేవచవిచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు. 3) గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు. 4) గ్రామచూర్ణంఅంటే  ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి, ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

          ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు, అరటి దూట, అరటి పూలు, అరటి దుంపలు, కలువ దుంపలు, సొరమొక్క ఆకులు ఇలాంటి వాటిని మనలో చాలామంది వండుకోదగిన కూరగాయలనే విషయాన్ని మరిచిపోయారు. తమిళులు వీటిని శ్రద్ధగా తింటున్నారు.

          నల్లేరు కాడలు రోడ్డు పక్కన కంపల మీద పాకుతూ పెరుగుతాయి. వృక్షశాస్త్ర పరంగా సిస్సస్ క్వాడ్రా౦గ్యులారిస్ అంటారు దీన్ని. షుగరు వ్యాధి, ఎలర్జీ వ్యాధులు, స్థూలకాయం, చెడ్ద కొలెస్ట్రాల్ పెరగటం, ఆస్తమా, ఎముకలు మెత్తబడిపోవటం, కీళ్లవాతం, గౌట్ వ్యాధి, మొలలు ఈ వ్యాధుల్లో ఇది పనిచేస్తోందని ‘హెల్త్ లైన్’ 2019 మే 15 సంచికలో ఒక నివేదిక ప్రచురితం అయ్యింది. స్త్రీబాలవృద్ధు లందరికీ ఔషధమే ఇది! విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉన్నాయి.  

లేత నల్లేరు కాడలకు కడుపులో నొప్పి తగ్గి౦చే గుణం ఉంది. ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. మొలల తీవ్రతను తగ్గిస్తుంది. విరేచనం అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. అజీర్తిని, కఫ దోషాలను, కీళ్లవాతాన్ని, గౌట్ వ్యాధిని పైత్యాలను తగిస్తుంది. మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలు నల్లేరు కాడల్ని తప్పనిసరిగా  తింటూ ఉండటం మంచిది. ఆ వయసులోనే ఎముకలు శక్తినీ, ధృఢత్వాన్నీ కోల్పోయి గోగుపుల్లల్లాగా తయారు కాకుండా నిలుపుతుంది. పళ్లలోంచి, చిగుళ్లలోంచి రక్తం కారుతున్న స్కర్వీ వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. అతిగా తింటే వేడి చేస్తుంది. చలవచేసేవాటితో కలిపి తింటే మంచిది. కొన్ని శరీరతత్వాలకు సరిపడకపోవచ్చు. చూసుకుని తినాలి.  

cissus is known to have gum forming properties” అంటే నల్లేరుకు కడుపులో జిగురును తయారుచేసే గుణం ఉంది. దీనిని భోజనంలో ముందుగా తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా స్థూలకాయాన్ని తగ్గిస్తుందని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. 

ఎముకలు విరిగినచోట అనుభవం మీద కట్లు కట్టే వారిలో చాలామంది నల్లేరు గుజ్జును పట్టించి కట్టు కడుతుంటారు. నల్లేరులో కాల్షియమ్ ఆగ్జలేట్స్, కెరోటీన్ బాగా ఉన్నాయి. మూత్రంలోంచి కాల్షియం ఆగ్జలేట్స్ పోతున్నవారు తప్ప అందరూ ఈ నల్లీనది పచ్చడి తినవచ్చు.

మినప్పండిని రుబ్బి అందులో ఈ పచ్చడి కలిపి వడియాలు పెడతారు. చాదువడియా లంటారు వీటిని. నేతిలో వేయించి తింటే రుచిగా ఉంటాయి. అట్లు పోసుకోవచ్చు. ఇలాంటివి వదులుకుంటే, సాంస్కృతిక వారసత్వాన్నే కాదు, సాంస్కృతిక సంపదను కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం.                                                                    *

మనం అట్టేపెట్టుకున్న అట్టు:: కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S. 9440172642

 

మనం అట్టేపెట్టుకున్న అట్టు

కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S.

9440172642

                                                            చమ్మచక్క.. చారడేసి మొగ్గా..

                                                            అట్లుపొయ్యంగా.. ఆరగించంగా..

                                              (బాలక్రీడా విశేషం)

          పండగలు పబ్బాలప్పుడే కాదు, నలుగురు బాలికలు ఎప్పుడు కలిసినా చమ్మచక్క ఆటని ఎదురు బొదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ పాడుతారు. ఈ చేతులు తట్టడంలోనే ఉన్నది కథంతా!

          చమ్మచక్క ఏమిటీ? చారడేసి మొగ్గేమిటి? ఆ తరువాత అట్లుపోయడమేమిటీ? అట్లను హాయిగా ఆరగించటానికి ముందు ఎంత శ్రమ ఉంటుందో, అమ్మ ఎంత కష్టపడితే వంట తయారౌతుందో పిల్లలకు తెలియాలికదా! పెద్ద వాళ్లను పిల్లలు అనుకరిస్తారని ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. అమ్మ వంటింట్లో ఏం చేస్తుందో ఇక్కడ పిల్లలు అదే చేస్తున్నారు.

          చమరు లేదా చమురు అంటే అరచేతుల్తో తట్టటం (To give a slap with the palm) అని! గోధుమ పిండిని మర్దించి ఉండగా చేసి, బిళ్ళలా నొక్కి రెండు అరచేతుల మధ్య ఉంచి చమరుతూ అంటే తడుతూ ఉంటే అది గుండ్రంగా చక్రంలా సాగుతుంది. చమరి చక్రంలా తట్టింది చమ్మచక్క”. చక్రానికి చక్క అనేది పిల్లల భాషా రూపం.

          ఇలా చమ్మచక్కకొడితే అది చారెడంత అవుతుంది. దాన్ని పిల్లిమొగ్గలు, నెమలిమొగ్గలు వేయించి గిర్రున తిప్పుతుంటే ఆ చక్రం మరింత పెద్దదిగా సాగుతుంది. చారెడేసి మొగ్గలుఅనే మాటకు బహుశా ఇదే భావం కావచ్చు!! 

          రుమాల్ రోటీలు చేసేవాళ్లను ఎప్పుడైనా గమనించి చూడండి. అరచేతుల్లో ఆ పిండిని గిర్రున తిప్పుతూ పైకెగరేస్తూ అనేక మొగ్గలు వేయిస్తుంటారు. చారడేసి మొగ్గలతో అలా అట్టు (రోటీ) తయారౌతుంది.

          అట్అంటే తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చటం, శుష్కింపచేయటం అనే అర్థాలున్నాయి. అడుఅంటే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయటం. అన్నం అడుగంటింది అంటే తడి అంతా ఆవిరైపోయిందని! అట్టగట్టింది అంటే, ఎండి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యిందని! ఇంకా ఉంచితే మాడుతుంది. తమిళంలో కూడా అటు’, ‘అటువ్’ ‘అట్ట్అనే పదాలు వండటం, కాల్చటం, వేయించటం, ఉడికించటం అనే అర్ధాల్లోనే ఉన్నాయి. అటుక్కలై, అట్టుంబల, అడకల=వంట గది; అట్టు=తీపి రొట్టె.. అట్టము=ఆహారం. ఇలా అట్టుఅనే పదం ఆహార పదార్ధం అనే అర్ధంలోకి పరిణమించింది.

          అట్టుని దోసె అనే అర్థంలోనూ, చపాతీ, పుల్కా అనే అర్థంలో కూడా వాడుతున్నాం. పెనం లేకుండా నేరుగా నిప్పుల సెగ మీద కాల్చిన అట్టుని తెలుగులో నిప్పట్టు’ (నిప్పు+అట్టు) అంటారు. తండూరీ ప్రక్రియ ఇది. అరటి లేదా పనస ఆకుమడతల మధ్య ఉంచి కూడా కాలుస్తారు. నిప్పటి, ఇపటి, నిపటి (DEDR3670) అనే పేర్లూ ఉన్నాయి.

          గుండ్రని ఆ చమ్మచక్కల్ని మధ్యకు మడిచి, రెండు రెండు పొరలు మీద వత్తితే దౌపాతి, మూడు మడతల మీద త్రిపాతి, నాలుగు మడతల మీద చపాతీ అయ్యింది. పుల్కాకీ చపాతీకీ పిండి ఒకటే అయినా పొరకీ పొరకీ మధ్య నెయ్యి లేదా నూనె ఎక్కించటం వలన రుచి మారిపోతోంది.

          అట్టు మనదే! మనం అట్టే పెట్టుకున్నదే! బొబ్బట్లు, నిప్పట్లు, నీరట్లు, చాపట్లు...ఇలా చాలా అట్లు మనకున్నాయి. తండూరీ రోటీలు మనకూ ఉన్నాయి. తప్పాల చక్కలు లేదా మండెగలు అనేవి మన ప్రాచీన అట్టుకు మిగిలున్న సాక్ష్యాలు. వాటిగురించి మరోసారి చర్చిద్దాం.

కూరగాయల రారాజు “కాకర”

 

కూరగాయల రారాజు కాకర

కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు B.A.M.S.

9440172642

                                                    వేయారు వగల కూరలు

 కాయ లనేకములు ధాత్రి కల వందులో

                                                              నాయకములురా కాకర

     కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా !

                                                  (కవి చౌడప్ప శతకం)

          వెయ్యిపైన ఆరు రకాల కూరలు, కాయలూ ఉన్నాయి. వాటిలో కాకర కాయలది నాయక స్థానంఅంటాడు కవి చౌడప్ప. కాకరంటే చాలా మందికి ఇష్టమే! కాకర ప్రియులు ఇతరులకన్నా భిన్నంగా కనిపిస్తారు, కాకర చేదు టానిక్కదా!

క్రీ.పూ. 2వ శతాబ్దిలో ఈనాటి శ్రీకాకుళం ఒడీసా ప్రాంతాలను పాలించిన మేఘవాహన రాజవంశ (చేది) ప్రభువు ఖారవేల్ల, ఖారబేల్ల లేదా కారవేల్లుడు ప్రసిద్ధుడు. హాతిగుంఫ గుహల్లో కనిపించిన శాసనం ఈ జైన ప్రభువు చరిత్రకు ఆధారం. కారవేల్లం అంటే కాకర. కాయలలో కాకర లాగానే రాజులలో ఈ కళింగరాజు కారవేల్లుడు ప్రసిద్ధుడు.

          తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు...ఈ ఆరు రుచులతో కూడితేనే అది షడ్రసోపేతమైన భోజనం. వగరూ చేదూ లేకపోతే అది రిచ్చికాదు!

          లేత కాకరని సూపులో, టీ పొడిలో, బీరు తయారీలో కూడా చైనీయులు ఉపయోగిస్తున్నారు. ఆలూ, కాకర  కూర వీళ్లకి ఇష్టం. దక్షిణాసియా దేశాల్లో కాకర, కొబ్బరి తురుము, మషాలాకూర బాగా తి౦టారు. పాకిస్తానీయులు ఉల్లిముక్కలతో కాకర వేపుడు ఇష్టపడతారు. తైవానులో కాకర ఖిచిడీ ప్రసిద్ధి. ఫ్రెంచి గుయానాలో కాకరకాయల టీని పురుషత్వం పెంచే ఔషధంగా తాగుతారు.

          కాకర నిజానికి పండు జాతికి చెందిన మొక్క. కాకర పండు మంచిదే కానీ, దాని గింజల్లో vicine అనే విషపదార్ధం ఉంది. అందుకని గింజల్ని తినకూడదు.

          1962లో లొలిత్కార్, రావు అనే ఇద్దరు పరిశోధకులు కాకరకు రక్తంలో షుగరుని తగ్గించే గుణం ఉందని కనుగొన్నారు. చరాంటిన్ అనే రసాయనం ఇందుకు తోడ్పడుతోంది. కాకరలోని మొమోర్డిసిన్ పేగుల్ని బలపరచి, నులి పురుగుల్ని పోగొడుతుంది.

కాకరని తినడం వలనే తమ ఆయుష్షు పెరిగిందని జపానీయుల నమ్మకం. ఫిలిప్పైనులో కాకర రసంతో చేసిన మాత్రలు బాగా వాడుతారు. ఉప్పు వేసి పిసికి నీరు పిండేసిన నిమ్మరసం, పసుపు కలిపి ఎండించిన కాకర ఒరుగులు ఫిలిప్పైన్ కాకర మాత్రల్లా పనిచేస్తాయి. ఈ ఒరుగులకు సమానంగా ఉసిరికాయల బెరడు, పసుపు కొమ్ములూ కలిపి దంచిన పొడిని రెండు పూటలా టీలాగా కాచుకుని తాగితే షుగరు మీద బాగా పనిఒచేస్తుంది. అనేక షుగరు ఉపద్రవాలు ఆగుతాయి. ఇది గ్లూకోజుని శక్తిగా మార్చే ప్రక్రియని వేగవంతం చేసి, రక్తంలో గ్లూకోజు నిల్వల్ని తగ్గిస్తుంది. అతిగా తీసుకోకూడదు. షుగర్ డౌన్ అవుతుంది.

          షుగరు వ్యాధి వచ్చిన పిల్లలకు కాకర ఒక నిరపాయకర ప్రత్యామ్నాయం. కాకరను తరచూ ఆహార పదార్ధంగా తింటే, మెదడు మీద పని చేసి, ‘అతితిండి’ (బులీమియా) వ్యాధిని తగ్గిస్తు౦ది! దగ్గు, జలుబు, ఉబ్బసం, నీళ్ళ విరేచనాలు, కలరా, అతిసారం కడుపు నొప్పి, జ్వరం, నెలసరి నొప్పి, బొల్లి, సొరియాసిస్, ఎగ్జీమా అమీబియాసిస్, లివర్ వ్యాధులు, కామెర్లు, కీళ్ళవాతం, గౌట్, సయాటికా వ్యాధులలో కాకర ఒక ఔషధం. గర్భవతులు కాకరను ఇష్టంగా తింటే ఆమె కడుపున పెరిగే బిడ్డకు నరాల బలం కలుగుతుంది. మలేరియా జ్వరంలో క్వినైన్ బిళ్ళ లాగా కాకర పనిచేస్తుంది. ఆగాకర కాయలక్కూడా ఇవే గుణాలున్నాయి.

          కనీసం వారానికి మూడుసార్లయినా కాకరని వండుకుంటే ఇంటిల్లిపాదికీ మంచిది. కాకర రాజుగారి జేజేలు.

దేవుడి భోజనం :: కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందు

 

దేవుడి భోజనం

కళారత్న డాక్టర్ జి. వి. పూర్ణచందుB.A.M.S.

సెల్: 9440172642

                                      ఇందిర వడ్డించ నింపుగను/చిందక యిట్లే భుజించవో స్వామి

అక్కాళపాశాలు అప్పాలు వడలు/పెక్కైన సయిదంపు పేణులును

సక్కెర రాసులు సద్యోఘృతములు/కిక్కిరియ నారగించవో స్వామి

మీరిన కెళంగు మిరియపు దాళింపు/గూరలు కమ్మనికూరలును

                                              సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ

                                              పిండివంటలును పెరుగులు/మెండైన పాశాలు మెచ్చి మెచ్చి

                                              కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే వేంకటస్వామీ" (అన్నమయ్య కీర్తన)

          వేంకటేశ్వరుడి దివ్యాన్నాల వివరాలతో అన్నమయ్య  ఇచ్చిన మెనూకార్డ్ ఈ కీర్తన. వీటిని లక్ష్మీదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని ఒక్క మెతుక్కూడా వదలకుండా భుజించవో స్వామీఅంటున్నాడు అన్నమయ్య. ఆ వంటకాలను చూద్దాం:

అక్కాళ పాశాలు, అప్పాలు,వడలు:: అక్కుళ్లు అనే బియ్యంతో చేసిన నేతి పాయసాలు, బూరెలు, గారెలు

పెక్కైన సయిదంపు పేణులు: అనేక రకాల గోధుమ సేమ్యా వంటకాలు

చక్కెర రాసులు, సద్యోఘృతములు: పంచదారతో చేసిన తాజా నేతి వంటకాలు

మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: మిరియాల పొడి చల్లి వండిన తాళింపు కూరలు

కమ్మని కూరలును సారంపుబచ్చళ్ళు: కమ్మని కూరలు, చక్కని సుగంధ ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్ళు

చవులుగ నిట్టే కూరిమితో జేకొనవో స్వామీ: ఇట్టే నోరూరే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్యా స్వామీ

పిండివంటలును పెరుగులు: ఇంకా అనేక పిండివంటలు, పెరుగుతో చేసిన వంటకాలు

కిక్కిరియ నారగించవో స్వామి: దగ్గరగా పెట్టుకుని ఆరగించవయ్యా స్వామీ!

          తమ దేవుడికి ఏ ఆహారం నైవేద్యంగా పెట్టుకున్నారో అది ఆ ప్రజల నాణ్యమైన ఆహారంగా చరిత్రవేత్తలు భావిస్తారు. బూరెలు గారెలు, నేతి స్వీట్లు, తాలింపు కూరలు, సుగంధభరితమైన పచ్చళ్ళు, పెరుగు వంటకాలు, పాలవంటకాలూ వీటిలో ఉన్నాయి.

          ఇవే గదా ఇప్పుడు మనం తింటున్నవీ...అని అడగొచ్చు. కానీ, ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది...! చింతపండు రసం కలిపినవీ, అల్లం-వెల్లుల్లి దట్టించిన మసాలా కూరలు, నూనె వరదలు కట్టేలా వండిన వేపుడుకూరలు, ఎర్రగా మంటెత్తే ఊరుగాయలూ ఇంకా అనేక భయంకర వంటకాలేవీ ఈ పట్టికలో లేకపోవటం గమనార్హం.

          అన్నమయ్య తరువాత ఈ 500 యేళ్ళలో చింతపండు, మిరప కారం, నల్లగా వేయించిన కూరబొగ్గులు ఇవే చివరికి మనకు తినేందుకు మిగిలాయని ఈ వంటకాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. యాంటీ బయటిక్సు లేకుండానే మన పూర్వులు జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందించారంటే కారణం ఏమిటో అర్ధం చేసుకోగలగాలి.

          మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయాన్నే పెరుగు/చల్లన్నం తినటం మన ఆచారం. అది ఇప్పుడు నామోషీ అయ్యింది. దాని స్థానంలో ఇడ్లీ, అట్టు, పూరీ బజ్జీ, పునుగులు తినటం నాగరికం అయ్యింది. అన్నమయ్య కాలానికి మిరప కాయలు మనకింకా పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ లాంటి ఊరగాయలు అప్పటి ప్రజలకు తెలీవు. వాళ్లకు తెలిసిన ఊరుగాయల్లో మిరపకారం ఉండదు. అల్లం, శొంఠి మిరియాలనే కారపు రుచికి వాడుకునే వాళ్ళు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం.

          విదేశీ వ్యామోహం పెరిగి, ఇప్పుడు మనకు పీజ్జాల్లాంటి నిరర్థకాలే పవిత్ర వంటకా లయ్యాయి. ఏడుకొండలవాడి దగ్గరికి సూటూ బూటూ వేసుకు వెళ్ళి హాయ్/బాయ్ చెప్పి, ఐదు నక్షత్రాల చాక్లేట్లు నైవేద్యం పెట్టటమే గొప్ప అనుకునే రోజుల్లోకి మనం ప్రయాణం చేసేముందు దేవుడి భోజనం అంటే ఆరోగ్యదాయకమైన వంటకాలు ఎలా ఉండాలో గుర్తు చేసుకోవటానికే ఈ పద్యం! *

చలికాలంలో నులివెచ్చని ఆహారం

చలికాలంలో నులివెచ్చని ఆహారం

డాక్టర్ జి. వి. పూర్ణచందు, 9440172642

                        పునుగుం దావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతో జట్టి చు

                             య్యను నాదారని కూర గుంపు ముకు మందై యేర్చునావం జిగు

                                         ర్కొను పచ్చళ్ళును బాయసాన్నములు నూరుంగాయలున్ జే సురు

                             క్కనునేయుం జిరుపాలు వెల్లువుగ నాహారం బిడున్సీతునన్

    శీతాకాలంలో ఇంటికొచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు ఎలాంటి భోజనం వడ్డించాడో రాయలవారు ఆముక్తమాల్యదలోని ఈ పద్యంలో చెప్తున్నాడు. శీతాకాలంలో ఎలాంటి పదార్ధాలు తినాలో ఒక సూచన ఇందులో కనిపిస్తుంది

1.  పునుగుం దావి నవోదనంబు: అక్కుళ్లు మసూరీలు అని ఇప్పుడున్నట్టే ఆ రోజుల్లో పునుగుదావులనే ఒక రకం బియ్యం ఉండేవి. ఇవి కొంచెం వేడిని కలిగిస్తాయి కాబట్టి, చలికాలంలో వాటితో వండిన వేడి అన్నం.

2.  మిరియంపుం బొళ్ళతో జట్టి చుయ్యను నాదారని కూరగుంపు: మిరియాలపొడితో చట్టి (కుండ)చుయ్యనే చప్పుడు ఆగకుండా వండిన కూరగుంపులు అంటే రకరకాల కూరలు

3. ముకు మందై యేర్చునావం జిగుర్కొను పచ్చళ్ళు: కొద్దిగా ఆవపిండి లేదా ఆవాలపిండి చేర్చి, ఉరిన తరువాత తింటే మూర్ధన్యాలు అదిరేంత ఘాటురుచి కలుగుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బూడిదగుమ్మడి, సొర, పొట్ల, బీర, కంద లాంటి కూరల్ని ఉడికించి అందులో పెరుగు, ఆవపిండి కలిపి తాలింపుపెట్టి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దాన్ని ఆవపచ్చడి అంటారు. ఘాటైన ఈ ఆవపచ్చడి జలుబు రొంప బాధలకు ముక్కుమందు లాగా ఉపయోగిస్తుందని శీతాకాలంలో ఇలాంటివి తినాలని కవిగారి భావన.

4. పాయసాన్నములు: రకరకాల పాయసాలు

5. ఊరుంగాయలు: వేసవికాలం ఊరుగాయల సీజన్. జాడీలకు వాసెనగట్టి ఊరుగాయల్ని 3-4 నెలలు మాగనిచ్చి అప్పుడు తినేవారు. ఊరుగాయల్ని శీతాకాలంలో తినటం కోసమే పెట్టుకునేవాళ్లు. మనం వేసవిలోనే తిని పొట్ట పాడు చేసుకుంటున్నాం.

6. చే సురుక్కనునేయుం: చేతిపైన పడితే చురుక్కనేలా బాగా కాచిన వేడివేడి నెయ్యి. అరచేతిని గుంటలా పట్టి అందులో నెయ్యి వడ్డించుకుని అన్నం మీద ధారగా పోసి కలుపుకునేవాళ్లు. పాడి పంటల్ని ఈసడించే ఈ కాలీయులకు ఆ భాగ్యం ఎక్కడిది?

7. చిరుపాలువెల్లువుగ: సగం మరిగేంత వరకూ చిక్కగా కాచిన పాలను చిరుపాలంటారు. శీతాకాలపు భోజనంలో మిరియాల పొడి వేసి కాచిన చిరుపాలను వెల్లువగా వడ్డించేవాళ్లట. బహుశా, శీతాకాలంలో పెరుగు బదులు పాలు, పంచదార అన్నంలో కలుపుకుని తినటం అలవాటుగా ఉండేదేమో!  

లక్ష్మణవఝులవారి ఇంటి హోటల్లో ఒక రూక తీసుకుని వడ్డించిన పదార్థాలను శ్రీనాథుడు ఒక చాటువులో వర్ణిస్తాడు. అందులో గుప్పెడు పంచదార కూడా ఉంది. పంచదార ఎందుకంటే, ఇలా పాలుగానీ, పెరుగు గానీ వడ్డించినప్పుడు అందులో కలుపుకోవటానికే!

శీతాకాలంలో యిలాంటి భోజనం నిస్సందేహంగా ఆరోగ్యదాయకం.

తన పాఠకులకు నాలుగు మంచి విషయాలు చెప్పి మంచీ చెడుల గురించిన అవగాహన కల్పించాలనే కోరిక ప్రతీ కవికీ ఉంటుంది. ఆ తపన లేకపోతే ఇంత కావ్యం వ్రాయవలసిన అగత్యం కవికి ఏముంటుంది? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలాలలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పాఠకులకు తెలియచెప్పటం రాయలవారి లక్ష్యం. విష్ణుచిత్తుడనే భక్తుడు తన ఇంటికి వచ్చిన అతిథులకు ఏ కాలంలో ఎలాంటి భోజనం తినాలో అవే వండించి వడ్డించినట్టు ఈ కావ్యంలో వివరిస్తాడాయన!

ఆముక్తమాల్యద ఒక భక్తి ప్రబంధం మాత్రమే కాదు, ఒక సామాజిక విఙ్ఞాన సర్వస్వం కూడా! ఇందులో 500 యేళ్ల తరువాత కూడా ఇప్పటి కాలానికి పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. మనం వాటిని ఆ కోణంలోంచి పరిశీలించగలగాలి. అంతే! 

వడదెబ్బకు విరుగుడు పానీయాలు

 

వడదెబ్బకు విరుగుడు పానీయాలు

డాక్టర్ జి. వి పూర్ణచందు, 9440172642

              తెలి నులివెచ్చ యోగిరము దియ్యని చారులు దిమ్మనంబులున్

                             బలుచని యంబళు ల్చెరకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం

                             బులును   సుగంధి శీత జలముల్వడ పిందెలు నీరు జల్లయు

                             న్వెలయగ బెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్

    వేసవికాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు వడ్డించిన వంటకాలను రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలోని ఈపద్యంలో వివరించారు:

1. తెలి నులివెచ్చ యోగిరము= నులివెచ్చగా ఉన్న తెల్లన్నం అంటే వరి అన్నం. తేలికగా అరుగుతుంది. వడకొట్టదు.

2. దియ్యని చారులు=తియ్యని చారు అంటే, చింతపండు వెయ్యని రసం. తమిళనాడులో దీన్ని ‘టిక్కాచారు’ అంటారు

3. తిమ్మనంబులున్: తేమనం, తిమ్మనం ఈ రెండింటికీ ఒక రకమైన ద్రవ వంటకం(సాస్) అని సంస్కృత నిఘంటు అర్థం. తెలుగు నిఘంటువులు తేమనం అంటే మజ్జిగ పులుసు అని వ్రాసాయి. బియ్యప్పిండి, కొబ్బరి, అల్లం, మిరియాలు, వాము వగైరాలను పాలతో ముద్దగా కలిపి చిన్న ఉండలుగా చేసి మరుగుతున్న మజ్జిగపులుసులో వేసి ఉడికిస్తే అవి తిమ్మనలుకావచ్చు. అన్నంలో తినటానికి బావుంటాయి. వేసవిలో చలవనిస్తాయి. 

4. పలుచని అంబలి= వరి లేదా జొన్న నూకల జావ (Porridge). అంబకళము, పులియంబళకము ఇలా అంబలిని పులియబెట్టి తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇవి వడదెబ్బ తగలకుండా చేస్తాయి.

5. చెరకుపాలు= చెరకు రసం. వేసవి తాపానికి విరుగుడు పానీయం ఇది.

6. రసావళుల్ఫలంబులు= బాగారసం నిండిన తియ్యమామిడిపండ్లు

7. సుగంధిశీతజలాలు= ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క లాంటి సుగంధ ద్రవ్యాల పొడిని నీళ్లలో వేసి కాచి, చల్లార్చి కుండలో పోసిన చల్లని నీళ్లు. తమిళనాడు, కేరళలలో పచ్చి మంచినీళ్లకు బదులుగా జీరావాటర్, ధనియావాటర్, దాల్చినివాటర్, వాంవాటర్ లాంటివి ఈనాటికీ త్రాగే అలవాటుంది. వడదెబ్బకు విరుగుడు పానీయాలివి.

8. వడపిందెలు=లేతమామిడి పిందెలు. వగరుగా ఉంటాయి వీటిని తరిగి ఉప్పు వేసి ఊరబెట్టి, మిరియాలపొడితో అన్నంలో తింటారు. వడపిందెలు వడకొట్టకుండా కాపాడతాయి.

9. నీరుచల్ల: బాగా చిలికి 3 రెట్లు నీళ్లు కలిపి కనీసం 5-6 గంటలు కదల్చకుండా ఉంచిన మజ్జిగ నీటిని నీరుచల్లఅంటారు. దీన్నిండా ఉపయోగపడే బాక్టీరియాలు ఉంటాయి. చలవనిచ్చి, పేగులను సంరక్షిస్తాయి. ఉత్తమ వేసవి పానీయం.

    ఈ పద్యం చూస్తే విష్ణు చిత్తుడు అతిథుల్ని బ్రతిమాలి పిలిచి, చెరకురసం, గంజినీళ్లు, చారునీళ్లు, మజ్జిగనీళ్లు పోసి అన్నం

పెట్టాడని మనం అపార్థం చేసుకోకూడదు. ఎండలో పడి వచ్చిన అతిథికి ఇవి స్వాగతపానీయాలు (welcome Drinks). చందనచర్చ

అంటే మంచిగంథం పూసి వడదెబ్బ నుండి సేదతీర్చి, అప్పుడు భోజనం పెట్టేవాడన్నమాట.

    ఇంటికొచ్చిన అతిథి షుగరు రోగి అయినా, బలవంతంగా స్వీట్లు పెట్టి, ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర అదనంగా వేసుకోండని

ఉచిత సలహాలిచ్చే తరహా అతిమర్యాదలువిష్ణుచిత్తుడు చేయలేదు. కాలానికి తగ్గ ఆహార పదార్థాలను ఇంపుగా వడ్డించే వాడాయన.

    కావ్యాలు చదివితే కలిగే ప్రయోజనం ఇదే! చెయ్యవలసినవి, చెయ్యకూడనివి రెండూ తెలుస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈపద్యంలో వేసవిలో వడకొట్టనీయని ఆహార పదార్ధాల పట్టిక ఇచ్చాడు. వాటిని మనం అవశ్యం గమనించాలి.                                                                                                                                                                      *