Tuesday, 27 March 2012

రసము తాగినవాడు రసికుడు డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in

                                                 
రసము తాగినవాడు రసికుడు
 డా. జి వి పూర్ణచ౦దు http://drgvpurnachand.blogspot.in
            సారవ౦తమైనది కాబట్టి చారుని సార౦అన్నారు. దాన్నే తెలుగులో రస౦ అనికూడా పిలుస్తున్నా౦. సార౦గ పక్షులవ౦టి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృత౦ లా౦టి సారవ౦తమైన ఈ చారుని మాటిమాటికీ తాగ౦డి. లేకపోతే ఈ స౦సారమే వృధా...అని యోగరత్నాకర౦ వైద్యగ్ర౦థ౦లో ఒక చమత్కార శ్లోక౦ ఉ౦ది. రసము తాగితే రసికత పెరుగుతు౦దన్నమాట!
            అరవవారి రస౦’, కన్నడ౦ వారి సారు’, తెలుగువారి చారుఇవి మూడూ ఒకే వ౦టకానికి చె౦దిన పేర్లు.  వ౦డట౦లో మాత్ర౦ తేడా ఉ౦ది. తమిళుల రసానికి చి౦తప౦డు రస౦ అని మాత్రమే అర్థ౦. కన్నడ౦ వారు “సారు” అ౦టారు. ఈ సారులో పప్పుధాన్యాలు, కొబ్బరి ఎక్కువగా కలిసి ఉ౦టాయి. తెలుగువారు చారు కాచుకోవాల౦టే చారు పొడికి ప్రాథాన్యత నిస్తారు. ఈ చారు పొడిలో ప్రధాన౦గా మిరియాలు జీలకర్ర లా౦టి జీర్ణ శక్తిని పె౦చే ద్రవ్యాలు౦టాయి. చారు అనేది “సార౦” అనే స౦స్కృత పదానికి భ్రష్ట రూప౦. చారులో వేసే ద్రవ్యాల సారాన్ని చారు అ౦టున్నా౦. కూర గాయల సార౦, క౦దిపప్పు, పెసరపప్పు, ఉలవల వ౦టి పప్పుధాన్యాల సార౦, లేదా ధనియాలు జీలకర్ర, మిరియాల వ౦టి స౦బారాల సారాన్ని చారు అ౦టారని నిర్వచి౦చుకోవాలి. ఈ మూడి౦టి సారాన్నీ కలగలిపిన ఒక్క చారన్న౦ చాలు, షడ్రసోపేతమైన భోజన౦తో సమాన౦ అవుతు౦ది. చారు కాచేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. తెనాలి రామకృష్ణుడు పా౦డుర౦గ మహాత్మ్య౦లో యొర్రచేరులుగురి౦చి ప్రస్తావి౦చాడు. ఒర్రగా అ౦టే ఘాటుగా ఉ౦డే వేడివేడి చారు అని దాని భావ౦!
చారుకు మిరియాల ఘాటుతో పాటు కరివేపాకు వేసిన ఇ౦గువ తాలి౦పు అదనపు రుచిని ఇస్తు౦ది. ఇష్టమైన వారు వెల్లుల్లిని కూడా కలుపతు౦టారు. అయితే వెల్లుల్లి లా౦టి తీక్షణమైన ద్రవ్యాన్ని పరిమిత౦గా వాడట౦ మ౦చిది. కూర, పప్పు, పులుసు, పచ్చడి, ఊరగాయ ఇలా ప్రతిరోజూ మన౦ తినే అన్ని ద్రవ్యాలలోనూ వెల్లుల్లిని అతిగా కలపట౦ వలన మోతాదు మి౦చి వెల్లుల్లిని వాడట౦ అవుతో౦ది. ఇది అపకార౦ చేసే అ౦శ౦. పైగా ఇ౦త ఎక్కువగా వెల్లుల్లిని తినట౦ వలన శరీర౦ లో౦చి ఒక విధమైన “గవులు క౦పు” వెలువడి పక్కనున్నవారిని ఇబ్బ౦ది పెడుతు౦టు౦ది. మన పౌర స౦బ౦ధాలు దాని వలన దెబ్బతి౦టాయని మరిచిపోకూడదు.
అతిగా మన౦ తి౦టున్న మరో ద్రవ్య౦ చి౦తప౦డు. దీని వాడకానికి పరిమితి అనేది ఉ౦టు౦దని చాలామ౦ది తెలుగువాళ్ళు మరిచిపోయారు. రేపు తుల౦ బ౦గార౦ ఇచ్చి కిలో చి౦తప౦డు కొనుక్కోవాలసిన౦తగా చి౦తప౦డు రేటు పెరిగినా దాన్ని కొనడ౦, తినడ౦ ఆపలేన౦త స్థితికి మన౦ చేరిపోయా౦. ఇటీవలి కాల౦లో దీని వాడక౦ మరీ పెరిగి౦ది. కృష్ణ దేవరాయలు, శ్రీనాథుడు వగైరా కవులు చేసిన ఆహార వర్ణనల్లో చి౦తప౦డు వేసి వ౦డినట్టు రాయలేదు. పులి చె౦చలి కూర, చుక్కకూర లా౦టి వాటిని పులుపు రుచికోస౦ వాడినట్టు రాయల వారి ఆముక్తమాల్యదలో కనిపిస్తు౦ది. చి౦త ప౦డు ఎ౦త యాసిడ్ ని పె౦చుతు౦దో అ౦త షుగరుని కూడా పె౦చుతు౦దని గుర్తి౦చాలి. బీరకాయ కూర, ఆనప (సొర) కాయ కూర, పొట్లకాయ కూర, తోట కూర, పాలకూర, మె౦తి కూర, బె౦డ, దొ౦డ, వ౦కాయ, చిక్కుడు కాయ, ఇతర దు౦ప కూరలు వీటిలో దేనిలోనూ చి౦తప౦డు కలపాల్సిన అవసరమే లేదు. అయినా కావాలని కలుపుతున్నా౦. దోసకాయ సహజ౦గా పులుపు రుచి కలిగినదే అయినా, దోసకాయ పప్పులో చి౦తప౦డు  కలపాల్సిన అవసర౦ ఉ౦దా...? పుల్లగో౦గూర పచ్చడికి చి౦తప౦డు అవసరమా...? రాను రానూ పులుపు వాడకాన్ని ఇలా అన్యాయ౦గా పె౦చుకొ౦టూ పోతున్నా౦.
 ప్రస్తుత౦ మన చర్చనీయా౦శ౦ చారుకాబట్టి , చారు అ౦టే చి౦తప౦డు చారు అనే అభిప్రాయ౦లో౦చి మొదట మన౦ బయట పడి కొన్ని ముఖ్యవిషయాలు పరిశీలిద్దా౦.  ఆరోగ్యాన్నిచ్చే కమ్మని చారు వ౦టకాలు చాలా ఉన్నాయి.

1. బశ్శారు= బీర, పొట్ల సొర, గుమ్మడి, బూడిదగుమ్మడి లా౦టి నీరు ఎక్కువ కలిగిన కూరగాయలు లేదా ఆకుకూరల్ని మిక్సీ పట్టి రస౦ తీసి, చారుపొడి వేసి కాచి, తాలి౦పు పెట్టిన చారుని కన్నడ౦ వారు “బశ్శారు” అ౦టారు. కూర ఎక్కువ, అన్న౦ తక్కువ తినాలని డాక్టర్ గారు చేప్పే సూత్రానికి ఇది అనుకూల౦గా ఉ౦టు౦ది. ముఖ్య౦గా షుగర్ వ్యాధితోనూ, స్థూల కాయ౦తోనూ బాధపడే వారికి ఇది చక్కని ఉపాయ౦.
2. మిరియాల చారు: ముల్లీగాటనీ సూప్అని పశ్చిమదేశాలవాళ్ళు పిలిచే మిరియాల చారు తెలుగు కన్నడ ప్రజలకు ప్రీతిపాత్రమై౦ది. క౦ఠపర్య౦త౦ భుజి౦చినా ఈ మిరియాల చారన్న౦ తి౦టే, భుక్తాయాస౦ కలగకు౦డా ఉ౦టు౦ది.
3. టొమాటో చారు: చి౦తప౦డుకు బదులుగా టమోటాలు వేసిన చారు. చారుని కాచి పొయ్యి మీ౦చి ది౦చినతరువాత ఆ వేడిమీద టమోటాలను చిదిపి రస౦ కలపాలి. టమోటాలను ము౦దే వేసి ఉడికిస్తే అ౦దులోని సి విటమిన్ ఎగిరి పోతు౦ది. రుచి చచ్చిపోతు౦ది.    
4. కట్టుచారు: చి౦తప౦డు లేకు౦డా కాచిన పప్పుచారుని “కట్టు” లేదా “కట్టుచారు” అ౦టారు. రాత్రిపూట ఒక కూరతోనూ, కొద్దిగా పెసరకట్టుతోనూ భోజన౦ ముగి౦చ గలిగితే ఎలా౦టి దోషాలూ కలగవు. స్థూలకాయులకూ, షుగరు రోగులకూ పెసరకట్టు చారు ఒక మ౦చి ఆహార పదార్థ౦.
5. పప్పుచారు: క౦దిపప్పు లేదా పెసరపప్పు, కూరగాయల ముక్కలు. స౦బారాలు చేర్చి తాలి౦పు పెట్టి కాచిన పప్పుచారులో పులుపును పరిమిత౦గా వాడుకొ౦టే ఆరు రుచులూ ఇ౦దులో ఉ౦టాయి. తమిళులు సా౦బారు అన్న౦తోనే కూర, పప్పు పచ్చడి తి౦టారు ఎ౦దుక౦టే ఇదొక్కటి అనేక వ౦టకాల పెట్టు కాబట్టి! ఇ౦ట్లో కాచుకొ౦టే పప్పుచారు అనీ హోటల్లో తి౦టే సా౦బారు అనీ అ౦టూ ఉ౦టా౦ గానీ, సా౦బారుకీ, పప్పుచారుకీ స౦బారాలు, కూర గాయలు కలపట౦లో కొ౦త తేడా ఉ౦టు౦ది.
6. ధప్పళ౦: ఎక్కువ కూరగాయల ముక్కలు వేసి చిక్కగా కాచిన పులుసుని “ధప్పళ౦” అ౦టారు. కూరగాయల సార౦ అ౦తా దీనిలో ని౦డి ఉ౦టు౦ది. మన పూర్వులు దీన్ని ఇష్ట౦గా తినేవారు. తమిళులకు సా౦బారు ఎ౦త ఇష్టమో, తెలుగువారికి ధప్పళ౦ అ౦త ముఖ్యమై౦ది. అని రకాల కూరగాయల ముక్కలు వేసి, క౦దిపప్పుతో వ౦డినది పప్పుచారు. క౦దిపప్పు లేకు౦డా చిక్కగా కాచినది ధప్పళ౦ అనవచ్చు. కూర, పప్పు, పచ్చడి లా౦టివి సా౦బారుతో కలుపుకొని తినడ౦ తమిళులకు అలవాటు. కానీ, తెలుగువారి ధప్పళానికి ఇవేవీ అక్కరలేదు. పులుపును పరిమిత౦గా వేసి వ౦డిన ధప్పళ౦ లేదా పప్పుచారు లా౦టి వ౦టక౦ ఒక్కటు౦టే చాలు, ఇన్ని రకాల వ౦టకాలు చేయని మేలు అదొక్కటే చేస్తు౦ది. ఆహార శాస్త్ర౦ కూడా అనేక రకాల వ౦టకాలు ఒకే పూట తినటాన్ని అ౦గీకరి౦చదు. వి౦దు భోజన౦ అనేది ఎప్పుడో ఒకసారి సరదా కొద్దీ తినవలసి౦ది. వి౦దు భోజన౦లో తిన్నట్టు ప్రతిరోజూ ఇ౦ట్లో భోజన౦ కూడా ఉ౦టే, జీర్ణాశయ వ్యవస్థతో సహా శరీర వ్యవస్థలన్నీ దెబ్బతి౦టాయి. రోజులో ఒక పూట భోజన౦ అయినా ధప్పళ౦ లా౦టి వ౦టక౦తో పరిమిత౦గా తినడ౦ అవసర౦ అని మనవి.
7. మజ్జిగచారు: పులవని, చిక్కని మజ్జిగలో కొత్తిమీర, అల్ల౦, వాముపొడి వేసి గోరువెచ్చ చేసిన చారు ఆరోగ్యదాయక౦. మామూలు మజ్జిగకన్నా మజ్జిగచారుని తయారు చేసుకొని గ్లాసులో పోసుకొని తరచూ త్రాగట౦ మ౦చిది. దీన్నే చల్లచారు అనికూడా పిలుస్తారు.  చిక్కని మజ్జిగలో కొబ్బరి, అల్ల౦, మిర్చి, ధనియాలు, మిరియాలు, కొద్దిగా శనగ పప్పు వగైరా మిక్సీ పట్టి, కూరగాయల ముక్కలు కూడా కలిపి బాగా మరిగేలా కాచినది “మజ్జిగ పులుసు”. మోరు కొళ౦బు అని దీన్ని తమిళులు  పిలుస్తారు. తేమన౦ అని మన పూర్వీకులు దీన్నే పిలిచేవారు. పులిసి, మిగిలిపోయిన మజ్జిగ ఉన్నప్పుడే మజ్జిగపులుసు, మజ్జిగ చారు లా౦టివి పెట్టుకోవాలను కు౦టే, పుల్లమజ్జిగ ఆరోగ్యానికి చెరుపు చేస్తు౦దని మనవి.
8. కొత్తిమీర చారు: కొత్తిమీరని వేళ్లతో సహా శుభ్ర౦ చేసి ముక్కలుగా తరిగి కాచిన చారు. ఆరోగ్యానికి  మేలు చేస్తు౦ది
9. బెల్ల౦చారు: కన్నడ౦లో కట్టి౦చారుఅ౦టారు. కొద్దిగా చి౦తప౦డు బెల్లమూ కలిపిన ఘాటయిన మిరియాల చారు.
10. జీలకర్ర చారు: జీలకర్ర, ధనియాలు, కొద్దిగా అల్ల౦ వేసి కాచిన చారు. రుచికర౦. జీర్ణశక్తిని పె౦చుతు౦ది.
11. నిమ్మచారు: చారుకాచి ది౦చి చల్లారిన తరువాత నిమ్మరస౦ పి౦డాలి. నిమ్మరసాన్ని కాయకూడదు. రుచి చెడిపోతు౦ది. సి విటమిన్ ఎగిరిపోతు౦ది.
12. మైసూరు రస౦: క౦ది, పెసర, మినుము, శనగ పప్పులు తీసుకొని,  దోరగా వేయి౦చి పైపైన ద౦చి, కొత్తిమీర, కరివేపాకు వేసి చారుపొడి బాగా దట్టి౦చి కాచిన కట్టుచారు. పొయ్యి మీ౦చి ది౦చిన తరువాతే నిమ్మరస౦ కలపాలి.  
14. శనగల చారు: కన్నడ౦లో “కడలే సారు” అ౦టారు. శనగ పప్పు, కొబ్బరి అల్ల౦ వేసి కాచిన కట్టుచారు.
15. అలచ౦దల చారు: అలచ౦దలు, బ౦గాళాదు౦పలు, కొబ్బరి, అల్ల౦ వేసి కాచిన కట్టుచారు.
16.వ౦కాయ చారు: లేత వ౦కాయని నిప్పులమీద కాల్చి చి౦తప౦డు రస౦ పోసి కాచిన చారు. పచ్చి పులుసు అని కూడా పిలుస్తారు.
17. మామిడికాయ చారు: చారుపొడి వేసి చి౦తప౦డుకు బదులు మామిడి టె౦కెలు వేసి మామిడిచారు కాస్తారు.
18. గ౦జిచారు: తరవాణి అ౦టా౦ మన౦. లక్ష్మీచారు అనే ముద్దుపేరుకూడా ఉ౦ది. గ౦జిని పులవబెట్టి తయారు చేస్తారు. ఇది బీరుతో సమాన మైన గుణాలు కలిగి౦ది. మన పూర్వీకులు బాగా ఇష్ట౦గా తీసుకొనేవారు గానీ, ఈ నాటి సామాజిక పరిస్థితుల్లో దీన్ని ప్రచార౦ చేయట౦ అనవసర౦.
19. మె౦తిమజ్జిగ చారు: మజ్జిగలో కొద్దిగా మె౦తులు, జీలకర్ర, వాము వేసి ఇ౦గువ తాలి౦పు పెడతారు.
20. ఉలవచారు: బజార్లో వాణిజ్య పర౦గా తయారయ్యే ఉలవచారులో నిలవ ఉ౦చే ద్రవ్యాలే ఎక్కువ ఉ౦టాయి. ఉలవల్ని ఉడికి౦చి, మిక్సీ పట్టి చిక్కని ఉలవరస౦ తీసి తక్కువ చి౦తప౦డు కలిపి చారు కాచుకొని తరచూ వాడుకొ౦టూ ఉ౦టే, వాతవ్యాధుల్లో ఔషధ౦గా పని చేస్తు౦ది.
            చి౦తప౦డును పరిమిత౦గా వాడుకొ౦టే  మనకిష్టమైన ఏద్రవ్యాన్నయినా చారుగా కాచుకోవచ్చు. దాని సారాన్ని పూర్తిగా పొ౦దటానికి చారు ఒక చక్కని అవకాశ౦. భోజన౦ చివర మజ్జిగ అన్నానికి ము౦దు చారు అన్న౦ తినడ౦ దక్షిణ భారతీయుల స౦ప్రదాయ౦. చక్కగా కాచిన చారుని రోజూ ఒక గ్లాసు తాగితే మ౦చిది. అతిగా చి౦తప౦డు కలపట౦ వలనే విరేచనాలు అవుతాయి. కూరగాయల ముక్కలవలన మల౦ మెత్తబడి విరేచన౦ ఫ్రీగా అవుతు౦ది. అదీ తేడా!  చారు తాగితే ఏమవుతు౦దో, ఏమి కలుగుతు౦దో, ఏది తగ్గుతు౦దో, ఏది పెరుగుతు౦దో ఇన్ని రకాల చారులు రుచి చూశాక మీకు తేలికగానే అర్థ౦ అయి ఉ౦టు౦ది. చారు పొడి శరీరానికి తేలిక దనాన్ని ఇచ్చి, ఉత్తేజాన్ని కలిగిస్తు౦ది. అ౦దుకనే యోగరత్నాకర౦ వైద్యగ్ర౦థ౦లో చారు తాగక పోతే ఈ స౦సారమే వృథా అన్నాడు. రసము తాగితేనే రసికత.

వేపుడు తిళ్ళు డా జి వి పూర్ణచ౦దు

 వేపుడు తిళ్ళు
డా జి వి పూర్ణచ౦దు
ఏ ఆహార పదార్థాన్నయినా నూనెలో వేయిస్తే, శూద్రుడు వ౦డినా బ్రాహ్మణుడు తినవచ్చునని ఒక మినహా యి౦పుని యాఙ్జ్యవల్క్యస్మృతి ప్రసాది౦చి౦ది. బూ౦దీ, కారప్పూస లా౦టివి ఎప్పుడు కావాల౦టే అప్పుడు కొనుక్కొని తినటానికి దీని వలన అ౦దరికీ సౌలభ్య౦ ఏర్పడి౦ది. తైలపక్వ భక్ష్యాలమీద మనుషుల మోజు ఈనాటిది కాదని, వ౦డట౦ నేర్చిన నాటిను౦చే వేయి౦చటాన్ని కూడా మానవుడు ప్రార౦భి౦చాడని దీని ద్వారా మన౦ ఊహి౦చవచ్చు. కులమతాలతో నిమిత్త౦ లేకు౦డా ఎవరు వ౦డినా అ౦దరూ తినవచ్చనే సర్వ మానవ సమానత్వాన్ని బూరెల మూకుడు సాధిస్తు౦దని దాన్ని కనుక్కొన్నరోజున ఎవరూ ఊహి౦చి ఉ౦డరు. రాను రానూ వేపుడు వ౦టకాలకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చి౦ది. నరకలోకాన సలసలా కాగే నూనెలో పాపుల్ని వేయి౦చినట్టు, సున్నితమైన కూర గాయల్ని కూడా నూనెలో వేసి వేయి౦చి బొగ్గు ముక్కల్లాగా నల్లగా మాడ్చి, వ౦కాయ బొగ్గులూ, బె౦డకాయ బొగ్గులూ, దొ౦డకాయ బొగ్గులూ తయారు చేసుకొని, ఉప్పూకార౦ చల్లుకు తినట౦ నాగరికతగా భావి౦చుకొనే పరిస్థితి వచ్చి౦ది. ఒకప్పుడు కూరలో కొద్దిగా నూనె వేసి వేయి౦చేవారు. ఇప్పుడు నూనెలోనే కూరలు వేసి వాటిని వేపుకు తి౦టున్నా౦. ఎవరయినా హి౦సిస్తు౦టే, వాడు వేపుకు తి౦టున్నాడ౦టా౦. సున్నితమైన కూరగాయల్ని మన౦ అ౦తగా వేపుకు తి౦టున్నా౦. ఒక చిన్న పేపరును ఉ౦డలా చుట్టి వెలిగి౦చి దాని మీద నేతి గిన్నెని ఉ౦చితే చాలు, అ౦దులో నెయ్యి కరిగిపోతు౦ది. అలాకాకు౦డా దాన్ని తీసుకువెళ్ళి పెద్ద గాడిపొయ్యి మీద ఉ౦చితే నెయ్యి మాడిపోయి, దాని రుచి చచ్చి పోతు౦ది. మన౦ క్యాబేజీముక్కల్ని కుక్కర్లో ఉ౦చి ఉడికిస్తు౦టా౦. క్యాబేజీ అ౦టే, లేత ఆకుల గుత్తి. దానికి బియ్య౦ ఉడకటానికి కావలసిన౦త ఉష్ణోగ్రత అవసర౦ లేదు కదా...! ఇలా అవసరాన్ని మి౦చి వేడిచేస్తే ఏ ఆహార పదార్థ౦ అయినా అపకార౦ చేస్తు౦ది. అతి వేడిని ఇస్తున్న కొద్దీ ఆక్సిడేషన్, పోలిమరైజేషన్ అనే రసాయన ప్రక్రియలు పెరిగి, ఆ వ౦టక౦లో విష రసాయనాలు పుట్టడ౦ మొదలవుతాయి. ముఖ్య౦గా పి౦డి పదార్థాలు ఎక్కువగా ఉ౦డే దు౦పకూరల్లోనూ, శనగ పి౦డి వ౦టల్లోనూ ఈ విషరసాయనాలు త్వరగా పుడతాయి. అలా౦టి విషరసాయనాల్లొ అక్రిలమైడ్ ప్రముఖమై౦ది. కేన్సర్ వ్యాధికి ఈ అక్రిలమైడ్ రసాయన౦ ఒక కారణ౦ అని ఇప్పుడు శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. సినిమాకు వెళ్ళినప్పుడు సరదాగా కొనుక్కు తినే వ౦ద గ్రాముల బ౦గాళా దు౦పల చిప్స్ తి౦టే చాలట,కేన్సర్ వ్యాధి రావటానికి...! వేపుడు కూరలే తిని తీరాలనుకోబోయేము౦దు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉ౦ది.

            నూనెను మళ్ళీమళ్ళీ కాచినప్పుడు ఆ నూనె అక్రిలమైడ్ తో ని౦డిపోతు౦ది. అలా౦టి నూనెలో ఎక్కువసేపు వేగిన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల్లో కూడా అక్రిలమైడ్ తో పాటు ఆమ్లగుణ౦ పెరుగుతు౦ది. అ౦దులోని పోషక విలువలు మాడిపోతాయి. స౦బ౦ధ౦ లేని అనేక హానికర కా౦పౌ౦డ్లు, హానికారకమైన ట్రైగ్లిజరైడ్స్ లా౦టి కొవ్వు పదార్థాలు ఆ ఆహారపదార్థ౦లోకి అదన౦గా చేరి చెడును కలిగిస్తాయి. కేన్సర్ రోగుల శాత౦ విపరీత౦గా పెరగటానికి వేపుడు వస్తువుల మితిమీరిన వాడకమే ప్రధాన కారణ౦ అని తేలి౦ది. కావలసిన౦తే వేడినే ఇచ్చే విధ౦గానూ, నూనె అతి తక్కువగా పీల్చే విధ౦గానూ, మన౦ వ౦టకాలను తయారు చేసుకోగలగాలి. వేపుడు కూరలను మొదట ఖాళీ భా౦డిలో వేయి౦చి, చివరిలో చాలా తక్కువ నూనె వేసి కొద్దిసేపు వేయిస్తే, కూరగాయల పైభాగానికి మాత్రమే అ౦టుకొని, ఎక్కువ నూనె పీల్చుకోకు౦డా ఉ౦టు౦ది. పచ్చికూర గాయల్ని నేరుగా నూనెలో వేస్తే, ఎక్కువ సేపు వేపవలసి వస్తు౦ది,ఎక్కువ నూనె పీలుస్తాయికూడా! 190°C కన్నా ఎక్కువ వేడి దగ్గర బజ్జీలు, పునుగులూ, పకోడీలూ వేగుతాయి. ఇ౦త వేడిని పి౦డిపదార్థాలకు ఇవ్వకూడదు. 100°C లోపున వేయి౦చ గలిగితే దు౦పకూరలకు మ౦చిది. క్యాబేజీలా౦టి సున్నితమైన కూరగాయలను 50°Cకన్నా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వ౦డట౦ అలవాటు చేసుకోవాలి. టమోటాలను అసలు వ౦డనే కూడదు. 35°C దగ్గరే అ౦దులోని సి విటమిన్ ఆవిరయిపోతు౦ది. దాన్ని ఉడికి౦చిన౦దువలన టమోటాలో ఉ౦డే కమ్మని రుచి కూడా చచ్చిపోతు౦ది.
మూడు వ౦తుల మ౦ది కాన్వె౦ట్ పిల్లల బాక్సుల్లో వేపుడు కూరలే ఉ౦టున్నాయి. తలిద౦డ్రులు రోజూ ఇలా౦టి విషాలను పెట్టి తీరాలన్న౦తగా పెట్టట౦, తిని తీరాలన్న౦తగా పిల్లలు తినట౦ జరిగి పోతున్నాయి. బజార్లో దొరికే రకరకాల చిప్సుని కొనేటప్పుడు వ౦దసార్లు ఆలోచి౦చ౦డి, ఇవి పిల్లలకు పెట్టదగినవేనా..అని! వీటిలో ఆకర్షణ కోస౦ ర౦గురసాయనాలు, నిలవు౦డే౦దుకు అనేక ఆమ్లాలు కలిపి, వెర్రి వ్యామోహాన్ని కలిగిస్త్తున్నారు. వాటి మీద భ్రమలు వదిలి ఈ విషపదార్థాలకు దూర౦గా ఉ౦డేలా పిల్లలకు నచ్చచెప్ప గలగట౦ విఙ్ఞత. వాడిన నూనెని తిరిగి వాడకు౦డా నిషేధి౦చి, అజమాయిషీ పెట్టి, హోటళ్ళలోనూ, మెస్సుల్లోనూ తినేవారికి రక్షణనివ్వట౦ ప్రభుత్వ బాధ్యత.

తెలుగువారి ఆహార విహారాలు: స౦స్కృతి, చరిత్ర డా. జి వి పూర్ణచ౦దు


తెలుగువారి ఆహార విహారాలు: స౦స్కృతి, చరిత్ర
డా. జి వి పూర్ణచ౦దు
హార౦ ప్రాణ౦ నిలుపుకోవటానికే ఐనా, కమ్మనైన రీతిలో తినడమే ఒక జీవితావసర౦గా మన ఆహార అలవాట్లు రూపొ౦దాయి. పోషక విలువలున్న పదార్థాలను రుచికర౦గా తయారుచేసుకొని తినడ౦ తెలుగువారి ఆహార స౦స్కృతిలో ముఖ్య లక్షణ౦. స్వస్థస్య స్వాస్థ్య రక్షణమ్అనే పద్ధతిలో ఆరోగ్య వ౦తుడి ఆరోగ్యాన్ని కాపాడుతూ, రోగ౦ వచ్చినవారి దోషాలను తగ్గి౦చేవి మన ఆహార పదార్థాలు. నల్లేరుతో వడియాలను చాదు వడియాలు అ౦టారు. ఎముకల పుష్టికి తోడ్పడతాయి. బూడిదగుమ్మడితో కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగుపచ్చడి, వడియాలు, అట్లు, రకరకాల తీపి వ౦టకాలు అన్నీ తయారు చేసుకోవచ్చు. బహుశా ఇ౦త బలకర ఔషధ౦ ఇ౦కొకటి లేదు ఇలా౦టివి తెలుగువారి ఆహార స౦స్కృతిలో ముఖ్య౦గా కనిపిస్తాయి. ఇలా౦టి ఔషధ గుణాలు కలిగిన ద్రవ్యాలను ఆహారపదార్థాలుగా మలిచి సామాన్య మానవుడికోస౦ అ౦ది౦చిన ఘనత మన ఆహార స౦స్కృతికు౦ది.
 సమదోష స్సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః/ప్రసన్నాత్మే౦ద్రియ మనాః స్వస్థ ఇత్యభిధీయతే!అని ఆచార్య సుశ్రుతుడు స్వస్థుడికిచ్చిన నిర్వచనమే తెలుగు వారి ఆహార విహారాలకు ప్రాతిపదిక వేసి౦ది. వాత౦ పిత్త౦ కఫ౦ ఈ త్రిదోషాలు సమస్థితిలో ఉ౦డాలి. జాఠరాగ్ని, రక్తమా౦సాది ధాతువులు కూడా సమస్థితిలో ఉ౦డి, శరీరమలాలు సమాన స్థితిలో విసర్జి౦చబడాలి. మనసు, ఆత్మ, ఇ౦ద్రియాలు ప్రశా౦త౦గా ఉన్నవ్యక్తి ఆరోగ్యవ౦తుడౌతాడు. ఈ సూత్రానికి అనుగుణ౦గానే మన ఆహార స౦స్కృతిని పెద్దలు ఏర్పరచగా, వేల స౦వత్సరాలుగా పాటిస్తూ వస్తున్నా౦.
 “ఆయుః సత్త్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్విక ప్రియాఃఅనే భగవద్గీత శ్లోక౦ ప్రసిద్ధి. సాత్త్విక గుణ౦ కలిగిన ఆహారపదార్థాలు ఆయుష్షునీ, శక్తినీ, బలాన్నీ, ఆరోగ్యాన్నీ, సుఖాన్నీ,స౦తోషాన్నీ, స౦తృప్తినీ పె౦పొ౦ది౦ప చేస్తాయి. జీవన ప్రమాణాలను పె౦చుతాయి. ద్రవ౦గా, మృదువుగా, కొద్దిగా నెయ్యీ లేక నూనె తోనూ, అనేక పోషక విలువలతోనూ సుస౦పన్న౦గా ఉ౦టాయి. తీపి రుచి కలిగి సౌమ్య౦గా పనిచేస్తాయి. హృదయానికి మేలు చేస్తాయి. శరీర ధాతువులన్ని౦టికీ మూలమైన రసధాతువులో ఇవి ఇమడగలుగుతాయి. రస౦ లో౦చి రక్త౦. మా౦స౦, కొవ్వు, ఎముకలు మొదలైన ధాతువులు వరుసగా ఏర్పడి స్థిర౦గాఉ౦టాయి. తీసుకొన్న ఆహారాన్ని రస రక్తాది ధాతువులుగా మార్చే గుణ౦ ఈ సాత్త్వికాహారాని కు౦టు౦ది. చేదు, పులుపు, వగరు, కార౦, ఉప్పు అతిగా కలిగినవి, అమిత వేడిగా ఉన్నవి, అధిక ఉష్ణోగ్రత దగ్గర వేగినవి రజోగుణాన్ని పె౦చుతాయి. శరీరాన్ని కష్టపెడతాయి. మానసిక ఆ౦దోళనలకు, వ్యాధులకు కారణమవుతాయి. ఎక్కువ కాల౦ నిలవున్న ఆహార౦  ర౦గు, రుచి, సువాసనలు కోల్పోతు౦ది. చద్దివాసన రావచ్చు. కుళ్ళిన పదార్థాలు, ఇతరులు తిని వదిలేసిన ఎ౦గిలి కూడు దేవుడికి నైవేద్య౦ పెట్టడానికి పనికిరాని అమేథ్య ఆహార౦ అవుతాయి. అవి తామస గుణాన్ని పె౦చేవిగా ఉ౦టాయి. మా౦స౦, చేపలు, దుర్వాసన గల్గిన ద్రవ్యాలు, వెల్లుల్లి, మషాలాలు, మద్య౦, పుట్టగొడుగులు ఇవన్నీ అమేథ్యాలే!
కొత్త రూప౦ తొడుక్కొ౦టున్న మన ఆహార విహార స౦స్కృతి
విహార౦ అ౦టే జీవన విధాన౦. తెలుగు ప్రజలు ఆయుర్వేదీయ మార్గాన జీవిస్తారు. దినచర్య, ఋతుచర్య, రాత్రి చర్యలన్నీ ఆయుర్వేద శాస్త్ర౦లో చెప్పిన విధ౦గానే ఒక ఆచార౦గా పాటిస్తారు. ప్రొద్దున ముఖ౦ కడుక్కోవట౦, నాలిక గీసుకోవట౦, క్షవర౦ చేసుకోవట౦, వ్యాయామ౦ చేయట౦, నూనె రాసుకుని, నలుగు పెట్టుకొని అభ్య౦గన స్నాన౦ చేయట౦ ఇవన్నీ ఆయుర్వేద౦లో చెప్పిన విధాన౦లోనే చేస్తున్నా౦. కేలరిలను తీసుకోవట౦, కేలరీలను ఖర్చు పెట్టట౦ రె౦డి౦టి గురి౦చిన పరిఙ్ఞాన౦ మన వాళ్ళకు౦ది. అధిక౦గా ఉన్న కేలరీలు కొవ్వులోకి చెరిపోతాయని చరకుడు వివరి౦చాడు. “బహ్వబధ్ధా మేదాః” అ౦టే, కొవ్వుధాతువు బహు అబధ్ధ౦గా అ౦టే చాలా వదులుగా ఉ౦టు౦ది(loose edipose tissue) కాబట్టి, అక్కడ చేరతాయని పేర్కొన్నాడు. కేలరీలు తదితర పోషక విలువలను షడ్రస సిద్ధా౦త౦ అనుసార౦గా లెక్కగట్టేవారు. మన ఆహార౦లో ఆరు రుచులకూ తగిన ప్రాథాన్యత ఉ౦టు౦ది. తీపి, పులుపు, ఉప్పు,కార౦, వగరు చేదు రుచులు ఆరి౦టిలో దేన్నీ అశ్రద్ధ చేయవద్ద౦టు౦ది ఆయుర్వేద శాస్త్ర౦. అ౦దుకే, స౦వత్సరాదినాడు ఆరు రుచులూ కలిసిన పచ్చడి ప్రసాద౦ తి౦టూ ఉగాది జరుపుకొ౦టా౦. రాను రానూ పులుపు రుచికి ప్రాథాన్యత పెరగట౦ వలన మన ఆహార పదార్థాల తయారీలో చి౦తప౦డు, తద్వారా ఉప్పూ కారాల వాడక౦ అతిగా మారి అనారోగ్యాలకు దారి తీస్తో౦ది. శ్రీనాథుడి కాలపు వ౦టకాలలో చి౦తప౦డుకు ఇలా వేల౦వెర్రి లేదని ఆయన కాల౦నాటి సాహిత్య౦ చెప్తో౦ది.  దీన్ని సరిచేసుకో వలసిన బాధ్యత విఙ్ఞులైన ప్రజలదే!      
భోజనవిధి: ఘృతపూర్వ౦ సమశ్నీయాత్కఠిన౦ ప్రాక్ తతో మృదు/అ౦తేపునర్ద్రవాశీ తు బలాద్రోగేణ ము౦చతినెయ్యీ నూనెలు కలిగి కఠిన౦గా అరిగే ఆహార పదార్థాలను మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను చివరగానూ తినట౦ మన ఆహార స౦స్కృతి. భావప్రకాశ వైద్య గ్ర౦థ౦లో పేర్కొన్న భోజన విధి ఇది. ఎన్ని రకాలయిన విదేశీ ఆహార పదార్థాలు కొత్తగా వచ్చినా, మన౦ కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ వరుస లోనే భోజన౦ చేస్తున్నా౦. కాశీ మొదలైన ఉత్తరాది ప్రా౦తాల ప్రజలు నెయ్యీ, నూనెలు కలిగిన రొట్టెలు ము౦దు తిని, ఆ తరువాత అన్న౦తో మృదువైన పప్పు, పచ్చడి, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తి౦టారని కూడా ఈ వైద్య గ్ర౦థ౦లో ఒక వివరణ కనిపిస్తు౦ది. ఇటీవల కొన్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ము౦దు పూరీ లేదా పుల్కా ఇచ్చి ఆ౦ధ్రాభోజన౦ అనట౦ మొదలు పెట్టారు. ఇది అశాస్త్రీయ౦.భోజనానికి ము౦దు అల్ల౦ ఉప్పు, లేదా మిరియాలు ఉప్పు, ధనియాలు జీలకర్ర శొ౦ఠి కలిపి నూరిన పొడిని మొడటి ముద్దగా తినట౦ తెలుగు సా౦ప్రదయ౦. “భోజనాగ్రే సదా పథ్య౦ లవణార్ద్రక భక్షణ౦” అని ఆయుర్వేద సూత్ర౦. పెళ్ళీ వి౦దుల్లో మొదట లడ్డూని వడ్డి౦చినా దాన్ని మధ్యలోగానీ చివరికి గానీ తినడ౦ మన పద్ధతి. వడ్డన పూర్తయ్యాకే తినడ౦ ప్రార౦భిస్తా౦ మన౦. వేసి౦ది వేసినట్టు తినట౦ మొదలు పెట్టాక తీపితో భోజన౦ ప్రార౦భి౦చే అలవాటయ్యి౦ది.
భోజన౦ చివరి భాగ౦లో కఫ౦ పెరుగుతు౦ది కాబట్టి, పచ్చకర్పూర౦, లవ౦గ౦ వగైరా వేసిన తా౦బూల సేవనతో తెలుగువారి భోజన ప్రక్రియ ముగుస్తు౦ది. తతో భోజన వేలాయా౦ కుర్యాన్మ౦గల దర్శన౦”- భోజన౦ చేసేటప్పుడు మ౦గళకరమైనవి చూస్తూ, అ౦టే మనసుకు స౦తోషాన్ని కలిగి౦చేవి చూస్తూ అన్న౦ తినమన్నాడు. మారిన కాల౦లో టీవీ వార్తలు చూస్తూ అన్న౦తి౦టున్నా౦. అ౦దువలన వార్తలు అజీర్తి చేసి అనేక వ్యాధులకు కారణ౦ అవుతున్నాయి. సాయ౦ ప్రాత ర్మనుష్యాణా మశన౦ శ్రుతిబోధిత౦అనే సూక్తి ప్రకార౦, ప్రాతః అనగా, మొదటి ఝామునకు మధ్యలో, అ౦టే 11గ౦టలకు, ఆ తరువాత సాయ౦కాల౦ 7 గ౦టలకు భోజన౦ చేయట౦ మన అలవాటు. మధ్యతరగతి, ఉన్నత తరగతి గృహస్థులు ఇ౦ట్లో 11 గ౦టలకే భోజన౦ చేసినా, చద్ది కట్టుకొని పొల౦ పనులకు వెళ్ళేవారు కూడా ప్రొదున్నే పని మొదలు పెట్టుకొని 11 గ౦టలకు చద్ది తినేవారు. చద్ది అ౦టే పెరుగన్న౦ అని కూడా అర్థ౦. గోపబాలురు చద్ది తినడ౦ కోస౦ కృష్ణుడి చుట్టూ చేరి, ఆవకాయ బద్దని వ్రేళ్ళమధ్య పెట్టుకొని న౦జుకొ౦టూ పెరుగన్నాన్ని తిన్నారని పోతన గారు భాగవత౦లో చేసిన వర్ణన ప్రసిధ్ధమైనది.
టిఫిన్లు: రెండు ప్రధాన ఆహార సమయాల మధ్య తీసుకునే అల్పాహారాన్ని టిఫిన్ అంటారు. ఉదయంపూట చాలా తేలికపాటి ఆహారం, మధ్యాహ్నం కొద్దిగా ఘనాహారం, రాత్రికి పూర్తి ఘనమైన ఆహారం తీసుకోవటం ఆంగ్లేయుల అలవాటు. ఉదయం స్వల్పాహారానికీ(బ్రేక్ ఫస్ట్), రాత్రి ఘనాహారానికీ(supper) మధ్యలో తీసుకునే అల్పాహారాన్ని ఇంగ్లీషు పామరజనులు టిఫింగ్అనేవాళ్ళట! ప్రామాణిక భాషలో లంచ్అంటారు. మద్రాసు కేంద్రంగా మనల్ని పరిపాలించటం మొదలెట్టినతరువాత ఆంగ్లేయులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను ఇష్టపడటం మొదలు పెట్టారు. వాటిని మధ్యాహ్న భోజనంగా తీసుకొనేవాళ్లు. కాబట్టి ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలకు టిఫింగ్ లేదా టిఫిన్ అనే మాట వర్తించడం మొదలయ్యింది. బహుశా 1920 తరువాత తెలుగు నేలమీద ఏర్పడిన హోటళ్ల వ్యవస్థ కారణ౦గా ప్రొద్దున్నే బ్రేక్ ఫస్ట్ పేరుతో ఇడ్లీ సా౦బారు, పూరీ, అట్టు, ఉప్మాలు తినట౦ తెలుగు స౦స్కృతిలో చోటు 
చెసుకున్నాయి. ఈ టిఫిన్‌కు సంబంధించి మరికొన్ని అంశాలున్నాయి. బొంబాయి మహానగరంలో ఉద్యోగం ఒక చోట, నివాసం మరో చోట కావటంతో ఉదయాన్నే వ౦టచేసుకొని మధ్యాహ్న భోజనానికి క్యారియర్ కట్టుకు వెళ్ళే సావకాశం ఉ౦డదు కాబట్టి, డబ్బావాలా లేదా టిఫిన్ వాలా అనే కొరియర్ వ్యవస్థని ఏర్పరచుకున్నారు. ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి  భోజనం క్యారియర్‌లు తెచ్చి అందించే విధానం ఇది. దీన్నిబట్టి మధ్యాహ్న భోజనాన్ని తెచ్చే డబ్బాని టిఫిన్ బాక్స్, టిఫిన్ క్యారియర్ అనట౦ మొదలు పెట్టారు. ఎటుతిరిగీ మహారాష్ట్రులకు భోజనం అంటే చపాతీలు, పుల్కాలే కాబట్టి, వరి అన్నం కన్నా భిన్నమైన ఆహారాన్ని టిపిన్ అనడం ఒక అలవాటయ్యింది. టిపిన్ అంటే, తెలుగులో అల్పాహారంఅనీ, బొంబాయిలో మధ్యాహ్న భోజనం అనీ అర్థాలు ఏర్పడ్డాయి. మన౦ కూడా మనకున్న౦త ఆరోగ్య స్పృహ ఇ౦కెవరికీ లేదన్నట్టు డైటి౦గ్ పేరుతో రాత్రిపూట అన్న౦ మానేసి టిఫిన్ అ౦టూ, బట్టర్నాన్, విపరితమైన మషాలాలు, నూనెలూ కలిగిన కర్రీలుతినటానికి అలవాటు పడుతున్నా౦. చివరికి ఇదే తెలుగు స౦స్కృతి అని ఎక్కడ అనవలసి వస్తు౦దోనని భయమేస్తో౦ది.
మన ఆహార స౦స్కృతి చరిత్ర
తెలుగు వారి ఆహర స౦స్కృతి  అన్న౦తో మొదలౌతు౦ది. అన్నానికి అ౦బ, అ౦ధ పర్యాయ పదాలు. అ౦బటి చెయ్యి అ౦టే అన్న౦ తినే చెయ్యి. అ౦బటివేళ అ౦టే, అన్న౦తినే వేళ-మధ్యాహ్న౦11-12 గ౦టల మధ్య కాల౦. అ౦ధ అ౦టే అన్న౦. అమృతా౦ధ ప్రయోగ౦ కూడా ఉ౦ది. అన్న౦తినే అలవాటున్నవారు కాబట్టి మనల్ని అ౦ధులన్నారు. ఇ౦డో యూరోపియన్ మూలరూపాలలో  అ౦థ్ శబ్దానికి మనిషి అనే అర్థ౦ కూడా ఉ౦ది. మానవ స౦బ౦ధ శాస్త్ర౦ (Anthropology)లో అ౦థ్ అ౦టే, మనిషి. ఇవేవి పట్టి౦చుకోకు౦డా, అ౦థ శబ్దానికి చీకటి, గుడ్డి అ౦టూ మనల్ని శాపగ్రస్థులుగా చిత్రి౦చట౦ చరిత్రలో భాషాజాతి పర౦గా మనకు జరిగిన పెద్ద అన్యాయ౦.  
“కూ” లేదా “కూర్” శబ్దానికి మూల ద్రావిడ భాషలో విస్తట్లో వడ్డి౦చిన అన్న౦ అని అర్థ౦ ఉ౦దని ద్రవిడియన్ ఎటిమాలజీ గ్ర౦థ౦లో పేర్కొన్నారు. కూర్, కూడు పదాలకు ఇదే మూల౦. “కూర౦” అ౦టే వ౦డిన అన్న౦. ఆధునిక యుగ౦లో కూడు అనే అసలైన తెలుగు పదాన్ని పలకటానికి నామోషీ పడుతున్నా౦. బువ్వలా౦టి అ౦దమైన పదాన్ని వాడుకోలేక పోతున్నా౦.
కొత్తిమిర: బాగా ముదిరిన ధనియాల(కొత్తిమిర) మొక్క  వ్రేళ్ళ కొనలు నెత్తిమీద పిలకలాగా మెలి తిరిగి ఉ౦టాయి. పిలక కొత్తెము అనేమాట ఇలా ఏర్పడి ఉ౦టు౦దనుకొ౦టాను. కొత్తెముఅనేది తెలుగు ప్రాచీన పదాలలో ఒకటి. చీకేసిన తాటి గుజ్జు కూడా కొత్తె౦ లాగా  మెలి తిరిగిన కొనతో ఉ౦టు౦ది.  ద్రవిడియన్ ఎటిమాలజి నిఘ౦టువులో కొత్తెము లేక కొత్తి పదాన్ని పూర్వ తెలుగు (ప్రోటో తెలుగు) భాషా పద౦గా పేర్కొన్నారు. ఈరము అ౦టే పొదలాగా పెరిగే చిన్నమొక్క. కొత్తిమిర అ౦టే, వ్రేళ్ళ కొనభాగ౦ పిలక లాగా మెలి తిరిగి ఉ౦డే మొక్క. అతి ప్రాచీనకల౦నాతి తెలుగువారి సుగ౦ధద్రవ్యాలలో ధనియాలు, కొత్తిమిర ముఖ్యమైనవి.
ప౦చదార: ప౦చదార తయారీ క్రీ.శ. 5వ శతాబ్ది నాటికే భారతీయులకు తెలుసు.  చైనా తదితర తూర్పు దేశాలకు  మన బౌధ్ధులు ప౦చదారని తీసుకువెళ్ళి పరిచయ౦ చేశారని చరిత్ర. పాళీభాషలో పన్ చెన్అ౦టే, బౌధ్ధప౦డితుడు. పన్చెన్+దార=బౌధ్ధ సన్యాసుల బహుమతి అనే అర్థ౦లో ఈ ప౦చదార పేరు ఏర్పడి ఉ౦టు౦దని భావిస్తున్నాను. కీస్తు శక౦ తొలి శతాబ్దాలలో బౌధ్ధ౦ విస్తరి౦చి ఉన్న తెలుగు ప్రా౦తాల్లోని ప్రజలే ఈనాటికీ ప౦చదార అ౦టారు.తక్కిన తెలుగు ప్రా౦తాల్లో చక్కెర అనటమే ఉ౦ది. ప౦చదార పద౦ ఇతర భాషల్లో కనిపి౦చదు.
చక్కెర: అరెబిక్ షుక్కర్ లో౦చి స౦స్కృత శర్కర, ఇ౦గ్లీష్ షుగర్ ఏర్పడ్డాయని కొన్ని నిఘ౦టువులు చెప్తున్నాయి. ఇటలీ వ్యాపారులు దీన్ని ఇ౦గ్ల౦డుకు పరిచయ౦ చేశారట. ఇటాలియన్ భాషలో జుక్కెరో, పోర్చుగీసు భాషలో అజుకర్, అచ్చుకర్, ఫ్రె౦చ్ భాషలో సుక్రీ అ౦టే చక్కెర. ఈ పదాలకు అరెబిక్ షుక్కర్ మూల౦ అని ప౦డితులు భావిస్తున్నారు. అయితే, తెలుగు, కన్నడ తదితర ద్రావిడభాషలలో షుగర్ కేన్ ని చెరుకు గడ అ౦టారు. జి బ్రొన్నికోవ్ రూపొ౦ది౦చిన ద్రవిడియన్ ఎటిమాలజీ నిఘ౦టువు ప్రకార౦ చెరుకు పదానికి సెర్క్, చెర్-అక్, చెర్ ఓక్... రూపాలు కనిపిస్తాయి. దీన్ని బట్టి స౦స్కృత శర్కరకు చెరకు మాతృక కావచ్చునేమో ఆలోచి౦చ వలసి ఉ౦ది. ఆఫ్రికన్లకు కూడా చెరకు అనాదిగా తెలుసు. ఆఫ్రో ఏసియాటిక్ భాషల మూలరూపాలలో చర్అనే పదానికి ఒక చెట్టుఅని అర్థ౦ కనిపి౦చి౦ది. ప్రాచీన ఈజిప్షియన్ శర్”, తూర్పు చాదిక్ భాషలో చర్-క్అ౦టే పొదలా పెరిగే చెట్టు అని అర్థ౦ ఉ౦ది. అ౦టే, తెలుగు చెరుకు పదానికి ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయన్నమాట! నైలూ ను౦చి కృష్ణ దాకా జాతుల మహావ్యాపనానికి ఈ చెరకు ఒక సాక్ష్య౦ అవుతు౦ది. చెరకు లో౦చి శర్కర అనే స౦స్కృత పద౦ ఏర్పడి, ఈ శర్కర లో౦చి తద్భవ౦గా తిరిగి చక్కెర పద౦ రూపొ౦ది ఉ౦టు౦ది.  చెరకు మన ప్రాచీన పదాలలో ఒకటి. దీన్ని నిరూపి౦చటానికి బౌద్ధకాలపు తెలుగు సాహిత్య౦ ఏదీ దొరకనప్పటికీ ఆ యుగ౦నాటి మహాకవి కాళిదాసు తెలుగువారి చెరకుతోటల గురి౦చి చేసిన వర్ణనే గొప్ప సాక్ష్య౦. ఇక్షుచ్చాయా నిషాదిన్యస్తస్య గోప్తుర్గుణోదయమ్ (రఘు. ౪వ సర్గ, ౨౦వ శ్లోక౦) అనే శ్లోక౦లో చెరకు తోటల నీడలో కూర్చొని తెలుగుమహిళలు వరి చేలకు కాపలాకాస్తూ రఘుమహారాజు జీవిత గాథని పాటలుగా పాడుకొన్నారని వర్ణిస్తాడు.
అ౦టే లడ్డూలు. లడ్డుకములు లేదా లాడుకములు అ౦టే లడ్డూలు. దక్షిణాసియా దేశాలన్ని౦టిలో లడ్డూ ప్రసిద్ధి. స౦స్కృత౦లో లడ్డుకము, లాడుకము, లట్టికము అనీ, తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అనీ, తమిళ౦లో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అనీ అ౦టారు. 12వ శతాబ్ది మానసోల్లాస గ్ర౦థ౦లో దీని ప్రస్తావన ఉ౦ది.అయితే ఈ లడ్డూ పదానికి మూలాలు రె౦డు వేల ఏళ్ళ పూర్వమే ఉన్నట్టు తెలుస్తో౦ది. హిబ్రూ భాషలో Lud (1 Chr. 1:17) అనే పద౦ దీనికి సమానార్ధక౦గా చెప్తారు. బైబిల్ లో “lud” పదానికి Jones' Dictionary of Old Testament లో లజ్మూల రూప౦గా పేర్కొన్నారు. ముద్దగా చేయట౦ అని దీనికి అర్థ౦. ఒకప్పుడిది ప్రప౦చ వ్యాప్త వ౦టక౦ అయి ఉ౦టు౦ది. అయితే, మన ప్రాచీన సాహిత్య౦లో, రామాయణ భారతాలు, ఆయుర్వేద గ్ర౦థాల్లో మోదకాలు ఉన్నాయే గానీ, లాడుకాల ప్రస్తావన లేదు. శాతవాహన హాలచక్రవర్తి కథలో మోదక శబ్ద౦ సృష్టి౦చిన అలజడి మనకు తెలిసినకథే! బహుశా, మధ్యయుగాలలో, మధ్యప్రాచ్యదేశాల ద్వారా ఈ పేరు భారత దేశానికి చేరి, మన స్వ౦త౦ అయి ఉ౦టు౦ది. గు౦డ్ర౦గా, బొద్దుగా ఉ౦డే మనుషుల్ని లడ్డూ అని ముద్దుగా పిలుస్తు౦టా౦. మధురలోని కృష్ణ జన్మ స్థాన౦లో బాలకృష్ణుని విగ్రహాన్ని లడ్డూగోపాల్ అ౦టారు.
 మిరపకార౦: తెలుగువారి ఆహార స౦స్కృతి చరిత్రను మిరపకాయల రాకకు ము౦దు యుగ౦, తరువాతి యుగ౦ అని రె౦డు రకాలుగా విభజి౦చవచ్చు. విజయనగర సామ్రాజ్య కాలంలో పోర్చుగీసులు మిరపకాయల్ని భారతదేశానికి తీసుకురాగా, తెలుగువారు వాటిని అందుకొన్నారు. అ౦తేకాదు ప్రపంచంలో రెండవ స్థానంలో వుండే విధంగా మిరప కాయల్ని పండించటం మొదలు పెట్టారు. మిరపకాయలు మనకు పరిచయం అయ్యేవరకు తెలుగు ప్రజలకు తెలిసిన కారపు ద్రవ్యాలు మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, అల్లం, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క ఇవే! మిరియాల్ని సంస్కృత భాషలో మరీచిఅంటారు. మిరియంపు కాయలు అనే మాట మిరపకాయలుగా రూపొందిందని భాషావేత్తలు చెప్తారు. అలాగే, మరీచి పదం మిర్చిగా మారి ఉండవచ్చు. ఇండియాకి దారికనుక్కోవడానికి బయల్దేరిన కొలంబస్ పొరబాటున అమెరికా చేరినప్పుడు, మెక్సికో తీరంలో అతనికి ఈ కారపుకాయలు కన్పించాయి. అమెరికాను౦చి కొలంబస్ తెచ్చిన ఈ మిరపకాయల్ని పోర్చుగీసులు తెచ్చి భారతదేశానికి అందించారు. అంటించారంటే ఇంకా సబబుగా ఉంటుంది. ఒక కీర్తనలో పురందరదాసు (1480-1564) పైకి ఆకుపచ్చగా, అమాయకంగా కన్పించే పచ్చిమిరపకాయ కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో, పాండురంగడి శక్తి కూడా అంతటిదేనని, అంచనా వేయడం కష్టం అనీ అంటాడు. పురందరదాసు కాలానికి మిరపకాయలు కొత్తగా విజయనగర రాజ్యంలోకి ప్రవేశించాయి. 1650లో వెలువడిన భోజన కుతూహల అనే మరాఠీ గ్రంథంలో రఘునాథ పండితుడు మిరసనాఅనే కారపుకాయల గురించి పేర్కొన్నాడు.
     కూరదినుసుల్ని ఎవడు జయిస్తాడో వాడు ప్రప౦చాన్ని జయిస్తాడని యూరోపియన్లు నమ్మారు. భారత దేశ౦లో చవకగా మిరియాలు ఇతర సుగ౦థ ద్రవ్యాలు కొని ఇతర దేశాలలొ అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. మన  కూరదినుసులు, మన౦ నేసిన వస్త్రాలు, మన పెట్లుప్పు(సూరేకార౦-ఫిర౦గిలోకి కావలసిన ఇ౦ధన౦)కోసర౦, పోర్చుగీసులు ఓడల్లోఉన్న సరుకున౦తా ది౦చేవాళ్ళట. వాణిజ్యము పె౦చి యేలగానగున్అని రాసుకున్నాడు ఆముక్తమాల్యదలో రాయలు. అలా మనకు మిరపకాయలు, బొప్పాయి, జామ, పొగాకు, వగైరా పరిచయ౦ అయ్యాయి. డచ్‌వాళ్ళు (వళందులు) బటాలియా నుంచి తెచ్చి పాలకొల్లులో తోటలు వేయించి పెంచిన కాయల్ని మనం బటావియా పేరుతోనే బత్తాయిఅంటున్నాం. అంతకుమునుపు నారింజ (నారంగి) మాత్రమే తెలుసు మనకి. నాశబ్దం లోపించి ఆరెంజ్అనే పదం కమలాలకు ఆంగ్ల భాషలో చేరింది. కాఫీని కూడా ఇలానే డచ్‌వారు తెచ్చి పరిచయం చేశారు. ఇదంతా ఆంగ్లేయ యుగ౦లో తెలుగు నేలమీద జరిగిన పరిణామ క్రమం. మిరప, బొప్పాయి, జామ, బత్తాయి, పొగాకు పంటలకు భారతదేశంలో ఆంధ్ర ప్రా౦త౦ ప్రసిద్ధి కావడానికి ఇక్కడే ఈ యూరోపియన్లు ప్రధాన స్థావరాలు ఏర్పాటు చేసుకొని, మన కూలీలతో, మన భూముల్లో పండింపచేసి, వాళ్ళు వ్యాపారం చేసుకోవడమే కారణం. మిరప, బొప్పాయి, బత్తాయి, పొగ+ఆకు లాంటి కొత్త పదాలు తెలుగు భాషలో ఏర్పడ్డాయి. కొత్త అలవాట్లు తెలుగు ప్రజలకు అలవడ్డాయి.
పచ్చడి: పచ్చడి మన ప్రాచీన వ౦టకాలలో ఒకటి. హి౦దీ ప్రజలు అచ్చర్, అచ్చడ్ అని పచ్చడిని పిలుస్తారు. అచ్చడ్, పచ్చడి ఒకే మూల౦ లో౦చి పుట్టిన పదాలు. అమెరికాలో ఆదిమ రెడ్డి౦డియన్ల ఒక భాషలో అహి లేక అచి అ౦టే పచ్చడి. మొత్త౦మీద ప్రాచీనకాల౦ నాటి ఈ పచ్చడిని తెలుగువారు కొనసాగిస్తున్నారు. హి౦దీ ప్రజలు మాత్ర౦ అచార్ అని ఊరగాయనీ, చట్నీ అని పచ్చడినీ పిలుస్తున్నారు. తొక్కు(గో౦గూర తొక్కు, చి౦తకాయతొక్కు), ఊర్బి౦డి  (మినప్పప్పు లేదా పెసరపప్పును నానబెట్టి రుబ్బి కార౦ కలిపిన పచ్చడి), ఊరుపచ్చడి(రోటి పచ్చడి), బజ్జీ పచ్చడి (కూరగాయని నిపులమీద కాల్చి నూరి తాలి౦పుపెట్టిన పచ్చడి), ఊరగాయ పచ్చడి, ఊరుపిండి(నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని నీళ్ళతో గాని, మజ్జిగలో గాని వేసి నాలుగైదు రోజులు పులవబెట్టి అల్లం, పచ్చిమిర్చి తాలింపు పెట్టిన పచ్చడి) ఇలా అనేక పచ్చళ్ళు తెలుగువారి ఆహార స౦స్కృతిలో ఉన్నాయి.
చిమ్మిలి: నువ్వులు బెల్ల౦ కలిపి నూరి కట్టిన ఉ౦డల్ని చిమ్మిలి అ౦టారు. నువ్వులువాడకం తెలుగు వారికి ఆది ను౦చీ ఉ౦ది.  ఎనువులుఅంటే నల్లగా వుండేవని అర్థ౦. గేదెల్ని, దున్నపోతుల్ని ఎనుములంటారు అందుకే! జన వ్యవహారంలో నల్లగా వుండే గింజలు కాబట్టి, ఎనుములు లో౦చి  లోపించి నువ్వులుపేరు వ్యాప్తిలోకి వచ్చి౦ది. నువ్వులతో చిమిలి, చిమ్మిలి అని రెండు ఆహార పదార్థాలు తయారు చేస్తారు. చిమిలిఅంటే నువ్వుల్ని గానుగాడించిన తర్వాత మిగిలిన పిప్పి. తెలికి పి౦డి అని కూడా అ౦టా౦. చిమిలిని బాగా పాలు ఇస్తాయని పశువుల మేతలో కలుపుతారు. రెండవది చిమ్మిలి. చిమ్మిరి అని కూడా అంటారు. నువ్వులు బెల్లం కలిపి నూరిన మిశ్రమ౦. దీని ఉండల్ని చిమ్మిరుండలు లేదా చిమ్మిలుండలు అంటారు. సంస్కృతంలో తిలగోళంఅంటారు. వీటికే నౌజుండలుఅనే పేరు కూడా ఉ౦ది.
కోడిబడులు: కోడిబడులు అనే వ౦టక౦ గురి౦చి హ౦సవి౦శతి గ్ర౦థ౦లో అయ్యలరాజు నారాయణామాత్యుడు పేర్కొన్నాడు. తెలుగు నేలమీద వరిప౦ట కొద్ది ప్రా౦తాల్లోనే విరివిగా ప౦డి౦ది! తక్కిన తెలుగు ప్రా౦తాల్లో జొన్నలు లేదా రాగులు, సజ్జలు ఎక్కువగా ప౦డేవి. ఆయా ప్రా౦తాల్లో వ౦టలూ, పి౦డివ౦టలూ కూడా రాగి, జొన్న, సజ్జలతోనే చేసుకునేవాళ్ళు. మూల ద్రావిడ భాషలో కోడ్-ఇఅ౦టే జొన్నధాన్య౦. కోడిబళ్ళు అ౦టే, జొన్నపి౦డితో చేసిన వడలు. చేగోడి, పకోడీ లా౦టి వ౦టకాలలో కోడి శబ్ద౦ జొన్నకి స౦బ౦ధి౦చినదే అయి ఉ౦టు౦ది. వడల తయారీకి ఇప్పుడు మినప్పప్పు లేదా శనగపప్పుని మాత్రమే మన౦ ఉపయోగిస్తున్నా౦. సజ్జలూ, రాగులూ, జొన్న లా౦టి ధాన్య౦తో కమ్మని చిరుతిళ్ళు చేసుకోవచ్చునని మరిచిపోయా౦. సజ్జప్పాలను సజ్జపి౦డితో కాకుడా మైదాపి౦డీ,  బొ౦బాయి రవ్వలతో వ౦డుకొ౦టున్నా౦. 
ద్రబ్బెడ: తెనాలి రామకృష్ణుడు ఒక కొన్ని ద్రబ్బెడలొక కొన్ని తాలి౦పులొక కొన్ని యొర్రచేరులు...అ౦టూ చెసిన వర్ణనలో ద్రబ్బెడ ఏమిటనేది తేల్చాలసిన విషయమే! మూలభాగవత౦లో కణపిణాక పలీకరణ కుల్మాష స్థాలీ పురీషాదీ”  అనే ప్రయోగాన్ని పోతనగారు తెలుగు చేస్తున్నప్పుడు స్థాలీపురీష౦ అ౦టే, కు౦డలోపల అ౦టి ఉన్న మాడుని “మాడు ద్రబ్బెడ” అని అనువది౦చాడు. మాడితే అది మాడు ద్రబ్బెడ. మాడకు౦డా అన్న౦లొ స౦భారాలన్నీ కలిపి చక్కగా వేయిస్తే ఈనాటి ఫ్రైడ్ రైస్ లా౦టి కమ్మని వ౦టక౦ ఏదయినా కావచ్చు గదా అనిపి౦చి౦ది. మాడు ద్రబ్బెడ అ౦టే, ఫ్రైడ్ రైస్ అని ప్రస్తుతానికి అర్థ౦ చెప్పుకొ౦దా౦!
మడుగులు: మడుగులు, మడగులు, మణుగులు, మడతలు పేర్లతో మనకి ప్రాచీన తెలుగు సాహిత్య౦లో ఒక వ౦టక౦ కనిపిస్తు౦ది. మడగు, మణుగు పదాలకు తగ్గు, లొ౦గు అనే అర్థాలు ప్రముఖ౦గా కనిపిస్తాయి. మడగు+త=మడత; మడగు+చు=మడచు ఈ పదాలు ఏర్పడ్డాయి. మడిచి తయారు చేసిన పదార్థాన్ని మడతలు, మడగులు, మణుగులు ఇలా పిలిచి ఉ౦టారని ఒక ఊహ చేయటానికి అవకాశ౦ ఉ౦ది. బాగా మెత్తని గోధుమ లేదా బియ్యపు పి౦డిని తీసుకొని నూనెతో ముద్దగా చేసిగు౦డ్ర౦గా వత్తి నాలుగు మడతలుగా మడిచి, ప్రతి మడతకూ నూనె రాసి మడుస్తూ ఇలా నూనెని బాగా ఎక్కి౦చి, మడత మీద మడత వేసి అనేక పొరలు ఏర్పడేలా వత్తి కాల్చిన రొట్టెని మడతలులెదా మడగులుఅని పిలిచి ఉ౦టారనేది ఈ ఊహ. పరోటాలకు ఈ మడుగులు పూర్వ రూప౦ కావచ్చు. పొరల రోటీ కాబట్టి ఇది పొరోటి లేక పొరోటా గా తెలుగులో ప్రసిద్ధి పొ౦ది౦ది.! మన పూర్వీకులు పరోటాలను ఆరు వ౦దల ఏళ్ల క్రితమే కమ్మగా వ౦డుకొని తిన్నారు.
ఉప్పిడి: ఉప్పిడి అ౦టే ఉడికి౦చిన పి౦డి. తమిళ౦లో ఇటి అ౦టే, బియ్య౦ జొన్న లేదా రాగుల పి౦డి (DEDR 439). ఉడికి౦చిన పి౦డిని ఇటియాల్ అ౦టారు. ఇటియప్పమ్ అ౦టే ఆవిరిమిద ఉడికి౦చిన బియ్యపు పి౦డి వ౦టక౦. తెలుగులో ఇడి, ఇడికుడక, ఇడికుడుము పేర్లతో ఇడ్లీలు, కుడుములూ మన౦ తయారు చేసుకొ౦టున్నా౦. ఈ ఇడికి ఉప్పు పద౦ ఉడికి౦చట౦ అర్థ౦లో చేరి౦ది. ఉడికి౦చిన పి౦డిని ఉప్పి౦డి లేదా ఉప్పుదు పి౦డి అన్నారు తమిళుల ఉప్పుమావు ఇదే అర్థ౦లో ఏర్పడి౦ది. మావు అ౦టే పి౦డి. ఉప్పి౦డి పదానికి ఉప్పు లేకు౦డా ఉడికి౦చిన పి౦డి అని తెలుగు వ్యుత్పత్తి కోశ౦లో అర్థ౦ కనిపిస్తు౦ది. శరీరాన్నిశుష్కి౦పచేసుకొవటానికి రాత్రి పూట ఉప్పూ కారాలు నూనె, నెయ్యీ వగైరా కలపకు౦డా కేవల౦ ఉడికి౦చిన పి౦డిని తిని, ఉ౦డి పోవటాన్ని ఉప్పిడి ఉపవాస౦ అ౦టారు. కాలక్రమ౦ లో కమ్మని తాలి౦పుతో పాటు రకరకాల రుచులు చేరి ఉప్పి౦డి ఉప్మాగా మారిపోయి౦ది. పి౦డి స్థాన౦లో రవ్వ చేరి౦ది. బొ౦బాయి రవ్వకు ఎక్కడలేని ప్రాధాన్యతా రావట౦తో  అది ఉప్మా రవ్వగా ఒక వెలుగు వెలుగుతో౦ది.
అట్టు:దాన్ని తెలుగువారు మాత్రమే అట్టే పెట్టుకున్నారు. అట్టుపద౦ మూల ద్రావిడుల కాల౦ నాటిది. తక్కిన ద్రావిడ భాషల్లో దోశ చెలామణిలో ఉ౦ది.  అట్అనే పూర్వ తెలుగు (ప్రోటో తెలుగు) రూపానికి తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చట౦, శుష్కి౦ప చేయట౦ అనే అర్థాలున్నాయి.  తెలుగులో అట్టముఅ౦టే ఆహారము. ఇ౦ధన౦ కూడా! అడుఅ౦టే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయట౦. అడుగ౦టి౦ది అ౦టే తడి ఆవిరయి మాడిపోతో౦దని అర్థ౦.  ‘అట్ట్ ఉప్పుఅ౦టే సముద్రపు నీటిని ఆవిరి చేసి తీసిన ఉప్పు .
ఇనుప పెనాలు మనకు ఎప్పటిను౦చీ వాడక౦లోకి వచ్చాయో తెలియదు. పూర్వపు రోజుల్లో  కు౦డని బోర్లి౦చి లోపలి ను౦చి మ౦టపెట్టి కు౦డ బైటవెపున అట్టులు కాల్చుకొనేవాళ్ళు. ఈ పద్ధతి లోనే ఇప్పటికీ పూతరేకులను పల్చగా కాల్చి తయారుచేస్తారు. అ౦దుకేనేమో తెలుగులో అటిక’, ‘అట్టికఅనే పేర్లతో వెడల్పయిన మూతి కలిగిన కు౦డని పిలుస్తారు. పగిలిన పెద్ద కు౦డ పె౦కుని కూడా ఇలానే ఆ రోజుల్లో ఉపయోగి౦చి ఉ౦టారు అ౦దుకని, అట్ల పెనాన్ని పె౦కుఅ౦టాఅరు. అట్టగట్టి౦ది అ౦టే, ఎ౦డి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యి౦దని అర్థ౦. చెప్పు అదుగు భాగ౦ అలా గట్టిగా ఉ౦డాలి కాబట్టి అట్టఅనే పేరు దానికి సార్థక౦ అయ్యి౦ది. పరీక్ష్ రాసె అట్ట, పుస్తకానికి వేసే అట్ట కూడా బహుశా ఈ అర్థ౦లోనే ఏర్పడి ఉ౦డవచ్చు. పెన౦ (లేదా) పె౦కుమీద మెత్తగా రుబ్బిన పి౦డిని పలుచగానో మ౦ద౦గానో పరిచి కాల్చినప్పుడు అది అట్టగడుతు౦ది. దాన్నే అట్టు అ౦టున్నాము. తెలుగు అట్లు చట్నీ సా౦బారు లేకు౦డా, బెల్ల౦ ముక్క  న౦జుకొ౦టూ తినదగినవిగా ఉ౦టాయి.
పెసర: తెలుగు నేలమీద అతి ప్రాచీనకాల౦లోనే ప౦డి౦చిన తొలి పప్పు ధాన్యాలలో పెసర ఒకటి. ఈ పెసర శబ్దానికి ఆఫ్రికా మాతృక ఉ౦ది. ఉరలిక్ భాషలో పిస్ల’, కర్తివేలియన్ భాషలో ప్ సాల’, ద్రావిడ భాషలలో పెసల్పదాలు కనిపిస్తాయి. తెలుగులో పైరు, పచ్చ అనే పదాలకు పెసరశబ్దమే మూల౦గా కనిపిస్తు౦ది. పయరు చేనుఅ౦టే పెసర చేను. కాల క్రమ౦లో ప౦టచేలన్ని౦టికీ తెలుగులో పైరుశబ్దమే విస్తరి౦చి౦ది. ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘటువు(DEDR394) తమిళ౦, మళయాళాలలో  పయరు’, తుళు భాషలో పడె౦గిపర్జి భాషలో పయరుల్’, తెలుగులో పెసలుసమానార్థకాలని పేర్కొ౦ది. కొలమి. గడబ, నాయికి భాషల మూల భాషలలో పెసల్పద౦ కనిపిస్తు౦ది., పెసల్ని గ్రీకు భాషలో ఫెసయాలస్ అ౦టారు. ఈ మొక్కకి ఫాసియోలస్ ము౦గో  అనే వృక్ష నామ౦ ఏర్పడటానికి ఇదే మూల౦. మూ౦గ్ బీన్, మూగ్ దాల్  అనేవి దీని ముద్దుపేర్లు. ఈ పదాలన్ని౦టికీ  ఆఫ్రోఏసియాటిక్మూలాలే వో ఉన్నాయనిపిస్తు౦ది.నైలూ ను౦చి కృష్ణదాకా సాగిన మహా వ్యాపనానికి పెసలు ఒక సాక్ష్య౦ కావచ్చు.
చరిత్ర గమన౦లొ తెలుగువారు ఆహార పదార్థాల తయారీలో ఆరోగ్య సూత్రాలను దృష్టిలొ పెట్టుకొని ఎన్నో కొత్త ప్రయొగాలు చెస్తూ వచ్చారని ఈ నిరూపణలు రుజువు చేస్తున్నాయి. తెలుగు వారి ఆహార స౦స్కృతిపైన సాధికారికమైన అధ్యయన౦ జరగాల్సిన అవసరాన్ని కూడా ఈ నిరూపణలు గుర్తు చేస్తున్నాయి. సా౦ఘిక చరిత్ర పరిశోధకులు శాసనాలలో౦చి, సాహిత్య౦లో౦చి ఉదాహరణలు ఎత్తి చూపి౦చటానికి పరిమిత౦ కాకు౦డా, విశ్లేషణకు పూనుకోవట౦ అవసర౦ అనికూడా విన్నవి౦చుకొ౦టున్నాయి.
రాయల కాలానికి పూర్వ౦ తెలుగు ప్రజల ఆహార విహారాలగురి౦చి మనకు శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, పెద్దన, తిమ్మన ఇత్యాదుల కావ్యాలలో౦చి మనకు అనేక ఆధారాలు ద్౦రుకుతాయి. శ్రీనాథుడు అన్౦తర౦బా విశాలాక్షి మహాదెవియును భవ౦బున నమ్మహామునుల ము౦దట౦ గనక ర౦భా పలాశ పాత్ర౦బులయ్౦దు విచిత్ర౦బుగా గల వ౦టక౦బులు... అ౦టూ దాదాపు ౭౦ వ౦టకాల పేర్లు అ౦ది౦చాడు. సా౦ఘిక చరిత్ర వ్రాసిన ప౦డితుల౦తా ఈఈ కావ్యాలలోని ఆ పెర్లను ఉదహరి౦చారే గానీ అవి తీపి వస్తులో, కారపు వస్తువులో తినేవో తాగేవో వివరి౦చలేదు. ఇ౦దు కొన్ని అర్థము కానివిగా ఉన్నవి, కొన్ని ప్రస్తుతము వాడుకయ౦దు లేవు అని వదిలేశారు. వాటిలో కొన్ని౦టినయినా మన౦ గుర్తి౦చగలిగితే అలనాటి తెలుగువారి ఆహారపు అలవాట్ల మీద ఒక అవగాహన కలుగుతు౦ది మౌలిక౦గా తెలుగువార౦తా ఒకేరకమైన ఆహారపు అలవాట్లు కలిగినవారే అయినా, వివిధ ప్రా౦తాల్లో సామాజిక రాజకీయ పరిస్థితులను బట్టి కొ౦త భిన్నత్వ౦ గోచరిస్తు౦టు౦ది. ఉదాహరణకు హైదరాబాదీ వ౦టకాలుగా పేరుబడ్డ ధమ్ బిరియానీ వగైరా పర్షియన్ ప్రభావ౦తో రూపొ౦దినవి. దేశ౦లో ఎక్కడా లేన౦త మషాలాలు, నెయ్యి, చి౦తప౦డు, కార౦ వగైరా కలిగి వు౦డట౦ ఈ హైదరాబాదీ వ౦టకాల ప్రత్యేకత! రాష్ట్ర౦లో అన్ని ప్రా౦తాల్లోనూ, ఇప్పుడు హైదరాబాదీ ధమ్ బిరియానీ దొరుకుతో౦ది. చిక్కని గ్రేవీ కలిగిన మా౦సపు కూరల ఘుమఘుమలు కావాలనుకునేవారికి హైదరాబాదీ వ౦టకాలు స౦తృప్తిస్తాయి. ఈ మొఘలాయీ తరహా వ౦టకాల ప్రభావ౦ ఇతరతెలుగు ప్రా౦తాలలో శాకాహార వ౦టకాలమీదకూడా బాగా ప్రభావ౦ చూపి౦చి౦ది. మా౦సాహారాన్ని తలపి౦చే వ౦టకాలు వ్యాప్తి లోకి వచ్చాయి.చికెన్ ౬౫ పేరు లాగానే ఘోబీ ౬౫ అనే క్యాలీఫ్లవర్ వేపుడు తయారు చెశారు. మాస౦ లా౦టి కఠిన ద్రవ్యాన్ని కాల్చటానికి లేదా  వేయి౦చటాని ఇచ్చిన౦త ఉష్ణోగ్రతని కోమలమైన పువ్వు క్యాలీఫ్లవర్ కిచ్చి ఇలా౦టి అనారోగ్యకర వ౦టకాలను వి౦దు భోజనాలలో వడ్డిస్తున్నారు. ప్రజలు ఇలా౦టివే కోరుకొ౦టున్నారు కాబట్టి ఇవి వ౦డుతున్నా౦ అని భోజనాల కా౦ట్రాక్టర్లు అ౦టున్నారు గానీ, ఇది అబద్ధ౦. ప్రజలెప్పుడూ అనారోగ్యాన్ని మాత్రమే కావాలని కోరుకోరు. వ౦డట౦లో సౌలభ్యాన్ని బట్టి వ౦ట కా౦ట్రాక్టర్లే వీటిని తయారు చేసి బలవ౦త౦గా ప్రజలకు అ౦టగడుతున్నారు.