అచ్చతెలుగులోనే అందమైన కవిత
డా. జి వి పూర్ణచందు
“నీతో సైతము చెప్పిపోవుటకుంగానీ వచ్చితిన్నాగ, “నౌ
నాతో జెప్పగనేల? నేనెవరితో నస్వామీ! చెప్పన్ వలెన్?
మీ తల్లింగని మీరు చెప్పితిరి స్వామీ! నాకు లేదా భయం
బే తీర్థంబులు, నే వనంబులునుగా వెందేని నా తల్లియే”
రాముడు అరణ్య
వాసానికి బయల్దేరాడు. తను అభిమానించే వాళ్లనీ, తనను అభిమానించే వాళ్ళనీ కలిసి
‘వెళ్ళోస్తాలు’ చెప్తున్నాడు. వాళ్లమ్మని కలిశాడు.’ ఇప్పుడు నీతో కూడా
చెప్పిపోదామని వచ్చానంటున్నాడు సీతతో! ఇంగ్లీషువాడు “బాయ్”
అన్నంత తేలిగ్గా వెళ్ళొస్తా నంటాడేమిటీ…అనిపించింది సీతకి.
‘వావ్!విష్యూ ఎ హ్యాపీ జర్నీ’ అని అందరూ అనేయాలని కోరుకుంటున్నాడా రాముడు? ఆయన
అనుకున్నంత తేలికా తన మానాన తాను అరణ్య వాసానికి వెళ్ళటం?
“నాతోజెప్పగనేల?”
అనడిగింది సీత. నీక్కాక ఇంకెవరికి చెప్పాలన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు రాముడు.
“మీ తల్లింగని మీరు
చెప్పితిరి” మీరైతే వెళ్ళి మీ అమ్మకి చెప్పాలి, మీ హితులకీ, సన్నిహితులకీ అందరికీ
చెప్పాలి. వాళ్లందరినీ ఒప్పించాలి.
“స్వామీ! నాకు లేదా భయం”
నాకు అలాంటి భయం లేదు. అంత శ్రమ అవసరం లేదు.
“ఏ తీర్థంబులు, నే
వనంబులునుగా వెందేని నా తల్లియే” నేను భూమి పుత్రిని. భూమి లేని చోటు ఎక్కడుందీ? ఏ
తీర్థాలైనా(పుణ్యనదులు), ఏ వనాలైనా(పుణ్య క్షేత్రాలు) ఎందులోనైనా నా తల్లే ఉంది.
కాబట్టి నేను ప్రత్యేకంగా వెళ్ళి మా అమ్మకు చెప్పుకోవాలనే భయం నాకేమీ లేదు”
అంటుంది సీత.
సుదీర్ఘమైన
సంభాషణలను తగ్గించి. మూడు ముక్కల్లో చెప్పేయగలగటం ఈ పద్యంలో కనిపిస్తుంది. దీని
తరువాత సంభాషణ కొంత జరుగుతుంది. ‘అబ్బో! అడవులంటే చాలా ప్రమాదకరంగా ఉంటా’యని
రాముడంటే, ‘అంత ప్రమాద కరమైన చోటుకు నిన్ను వంటరిగా వెళ్ళనిస్తానా?’ అని సీత ఎదు
రడుగుతుంది. వానలో వెడుతూ గొడుగుని ఇంట్లో వదిలి వెడతానంటావు …అదేమిటయ్యా?” అని
నిలదీస్తుంది. తల్లి తర్వాత తల్లి తరుణి(ఇల్లాలు)ని వదిలి ఎలా వెడతావంటుంది.
తర్వాత పద్యంలో
‘అమ్మతరువాత అమ్మంతటి దాన్ని నేనే’నని సీత అంటుందని ముందుగానే ఊహించినట్టు, ఈ
పద్యంలో ‘అమ్మకి చెప్పి, నీతో కూడా చెప్పిపోదామని వచ్చా’ నంటాడు రాముడు. ‘అమ్మ
తరువాత అమ్మంతటి దాన్ని ఎలా వదిలి వెళ్తా’వని సీత అడుగుతుంది.
రాసేది పురాణేతి
హాసాలైనా మానవ స్వభావాలు పాత్ర చిత్రణలో కొట్టొచ్చినట్టు కనిపించినప్పుడు ఒక
దేశీయత, తద్వారా ఒక తాదాత్మ్యత ఆ కావ్యానికి కలుగుతాయి.
విశ్వనాథ
సత్యనారాయణ రామాయణ కల్ప వృక్షంలో పద్యం ఇది. మళ్ళీ రామాయణం దేనికంటే తనదైన పద్ధతిలో
కథని చెప్పుకోవటానికని గడుసుగా చెప్పుకున్నవాడు విశ్వనాథ. ఆయన కవిత్వం ఆయనలాగే
అర్థం కానిదిగా ఉంటుందని పెద్ద పేరుంది గానీ, ఇంత చక్కని లలిత లలిత తేట తెలుగు
పదాలతో అల్లిన పద్యాలు క్లిష్టమైన, ఉద్వేగ భరితమైన సన్నివేశానికి నప్పటమే విశేషం.
వన జీవితంలోని
ప్రమాదాలు, కౄరమృగాలతో సహజీవనం, దారీ డొంకా లేని ప్రయాణం, కస్సున దిగే ముళ్ళూ,
బుస్సున లేచే పాములు అంటూ సీతని బెదరగొట్టటానికి భయానక రౌద్ర రసాలు ధ్వనించటం కోసం
భీకర సంస్కృత సమాసాలు వ్యామోహం కొద్దీ ఉపయోగించ గలిగిన చోట విశ్వనాథ తనను తాను
చాలా నిగ్రహించుకున్నట్టు కనిపిస్తుంది. కరుణ, జాలి, దయలాంటి భావావేశాలు
కనిపించటానికి సంస్కృతం కన్నా జాణుతెలుగు ఎక్కువ ఉపయోగపడ్తుందని దీన్ని బట్టి
అర్థం అవుతుంది.
అమిత పదాడంబరం
డబ్బాలో రాళ్ళు పోసి గిలకొట్టినట్టు ఉంటుంది. గడగడా అలాంటి పద్యాలను అప్పచెపితే,
మయసభ ఏకపాత్రాభినయం లాగా ఒక్క ముక్క అర్థం కాకపోయినా శ్రోతలు చప్పట్లు
కొట్టేస్తారు. కానీ, దాన్ని చదివే పాఠకుడు ఆ కవిత్వంలోని స్వారస్యాన్ని పొందేందుకు
అందులో ఏమీ ఉండదు. అందుకే, తెలుగు మాటల కిన్నెరసాని ప్రవాహాన్ని ఆయన తన
కల్పవృక్షంలో చాలా చోట్ల ఉపయోగించుకున్నాడు.
ఎంతటి భావగర్భితమైన సన్నివేశానికైనా
జాణు తెలుగు దేశీయత సొబగులిస్తుందని మరో సారి గుర్తుచేసిన పద్యం ఇది.
అచ్చతెలుగులోనే అందమైన కవిత పుడుతుంది!