Tuesday, 25 August 2015

పట్టణ నాగరకత :: డా. జి వి పూర్ణచందు

పట్టణ నాగరకత
డా. జి వి పూర్ణచందు

“పద్మినీ పద్మాతపత్రంబు శిథిల పత్రాగ్రమై రాయంచ యాశ్రయించె
దాలు స్రవత్ఫేన జాలుబుతో ఘోణిపంచల రొంపి గలంచి యాడె
దూరొద్గమద్భావ ధూమ మంబుద బుద్ధి నెమ్మిలో పొదనుండి నిక్కిచూచె
జఠరస్త జలము నాసానళమున బీల్చిసామజంబరు ప్రక్క జల్లుకొనియె
సరసిపై నీరు సలసల తెరలి
సకల వీథులు నిర్మృగోఛ్ఛయములయ్యె
మట్టమధ్యాహ్నమిది సుధామధురవాణీ
యర్హమిచ్చొ బథ: శ్రమ మపనయింప”

ఎండకు విరుగుడు నీడ. దాహానికి విరుగుడు నీళ్ళు. ఆ నీళ్ళు కూడా ఎండ తీవ్రతకి సలసలమంటున్నాయి. జలాశయాలు వేడెక్కిక్కేటంత ఎండలో కూడా జీవరాశికి అంతో ఇంతో సేద తీరే సౌకర్యం ఉన్నప్పుడే అది మహానగరం అవుతుందని అగస్త్యుడు లోపాముద్రతో చెప్తున్నాడీ పద్యంలో!

ఎండ మండి పోతుంటే, ఒక రాయంచకు దిక్కుతోచలేదు. అప్పటికే దానిరెక్కలు అలిసిపోయాయి. ఆ చెరువులో తామరాకు అడుగున దూరి చల్లదనాన్ని అనుభవిస్తోందట. తామరాకు అడుగునైతే నీడ చల్లదనం రెండూ ఉంటాయని!

ఎండకి శోష వచ్చి రొప్పటం వలన ఒక వరాహం నోట్లోంచి నురుగులు కక్కుతోంది. చెరువు దగ్గర దానికి బురద కనిపించే సరికి ఎక్కడలేని ప్రాణాలూ లేచి వచ్చి, బురదలో పడి దొర్లిందట.

దూరంగా దావాగ్ని ముంచుకొస్తోంది. నల్లపొగలు కమ్ముకుంటున్నాయి. ఆ నల్లపొగని నల్లమబ్బులనుకుని ఎండకు తట్టుకోలేక ఎక్కడో పొదలో దాగి కూర్చున్న ఒక నెమలి ఆశకొద్దీ, తలకాయి బైటపెట్టి మెడ నిక్కించి తొంగి చూస్తోందట.

కడుపులో దాచుకున్న నీళ్ళనే తొండంతో బయటకు లాగి వీపు మీద పోసుకుని ఒక యేనుగు ఊరట పొందుతోందట...

చాలా జంతువులకు చర్మంలో స్వేదగ్రంథులు మనుషులకున్నంతగా ఉండవు. అందుకని వాటి శరీరంలో జీవనక్రియల వలన ఉత్పన్నమయ్యే వేడిని చల్లార్చేందుకు కావలసినంత చెమట పట్టకపోవటంతో మనుషుల కన్నా జంతువులు నీళ్ళకోసం ఎక్కువ అల్లాడతాయి. పంది బురదనే మెచ్చటానికి కారణం బురద ఎక్కువ సేపు దాని చర్మాన్ని చల్లగా ఉంచుతుంది కాబట్టి! ఇతర జంతువులు కూడా చెరువులో దిగి స్నానం చేసి ఒడ్డుకువచ్చి ఒంటిమీద దుమ్ము ఎత్తి పోసుకుంటాయి. ఎందుకంటే ఆ తడి ఎక్కువ సేపు నిలబడి ఉంటుందని! తెలుగునాట చెరువుల్ని అశ్రద్ధ చేయటం వలన పాడి పరిశ్రమ కూడా దెబ్బతింది రైతాంగం తెలిసి చేసిన తప్పే ఇది.  చెరువులు లేని ఊళ్ళలో జల్లు స్నానాలతో పశు సంపద బతకలేదు.

చెరువులో నీళ్ళు సలసల తెరలేంతగా ఎండ మిట్ట(మట్ట) మధాహ్నం మండిపోతుంటే, వీధులన్ని నరసంచారం లేక వెలవెలబోతున్నాయి. “చేసేదేమీ లేదు, ఇక్కడే ఎక్కడో నీడపట్టున కాసేపు సేదతీరుదా”మంటున్నాడు అగస్త్యుడు, తన భార్య లోపాముద్రతో! తెనాలి రామకృష్ణుడి పాండురంగ మాహాత్మ్యంలోది ఈ పద్యం. నగరంలో ఎండా, వానల బారినుండి కాపాడే ఏర్పాట్లు లేకపోతే ఊళ్ళోకి వచ్చేవాళ్ళు అగస్త్యుడిలానే అగచాట్లు పడాలని తెనాలి కవి ముఖ్యంగా రాజధాని నిర్మాతలను హెచ్చరిస్తున్నాడు.  

భుగభుగ ఎండలు, సుడులు తిరిగే తుఫానులు, వెల్లువెత్తి వచ్చే వరదలకు ప్రసిద్ధి చెందిన బ్లేజ్‘వాడ దగ్గర కొత్త రాజధాని వస్తోంది. రేపటినుండీ ఈ రాజధాని నగరానికి వచ్చే అగస్త్యులు, లోపాముద్రల కోసం ముందు చూపుతో తగిన ఏర్పాట్లు చేయవలసి ఉంది.

మానవులతో పాటు, ప్రకృతి, పర్యావరణం, పశుపక్ష్యాదుల సమజీవనం, సహజీవనం సాగనిస్తేనే అది ప్రపంచ స్థాయి ప్రజానగరం అవుతుంది. నగరాల వెలుపల మురుగువాడలు కాదు, వ్యవసాయ క్షేత్రాలు ఉండాలి. మౌలికంగా వ్యావసాయిక దేశం మనది. ఈ దేశంలో పట్టణ నాగరికత పొసగేది కాదు. చివరికి సింధునాగరికతకు పట్టిన గతే పడ్తుంది. వ్యవసాయాన్ని, పశు పోషణనీ కొనసాగనిచ్చిన నగరాలు పదికాలాల పాటు పదిలంగా ఉంటాయని తెనాలి వాని భావం.