Sunday 10 August 2014

కళాప్రపూర్ణ జాలాది గారి విగ్రహావిష్కరణ సభ దృశ్యాలు.

కృష్ణాజిల్లా రచయితల సంఘం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ సంయుక్తంగా 
9-8-14 ఉదయం 10గంటలకు విజయవాద తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనిర్వహించిన 
కళాప్రపూర్ణ జాలాది గారి 

విగ్రహావిష్కరణ సభ దృశ్యాలు.

శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, 
కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షులు ఆచార్య యార్లగడ్ద లక్ష్మీ ప్రసాద్
నీటిపారుదల శాఖామాత్యులు, దేవినేని ఉమామహేశ్వరరావు 
జాలాదిగారి ధర్మపత్ని  ఆగ్నేశమ్మగారు, కుమార్తె జాలాది విజయ
స్థానిక కార్పోరేటర్ శ్రీ ఎం వెంకటేశ్వరరావు,
నిర్వాహకులు శ్రీ గుత్తికొండసుబ్బారావు, శ్రీ గోళ్ళనారాయణరావు, డా.జి వి పూర్ణచందు పాల్గొన్నారు.













జారిపోయిన బాల్యం:: డా. జి వి పూర్ణచందు,

జారిపోయిన బాల్యం:: డా. జి వి పూర్ణచందు, సెల్ 9440172642
వాతెఱ తొంటి కైవడి మాటలాడదు
          కుటిల వృత్తి వహించె గుంతలంబు
లక్షులు సిరులు రా నఱ చూడ్కి గనుకొనె
          నాడించె బొమ గొని యాననంబు
చనుగొమల్నెగయ వక్షముపేక్ష గడకొత్తె
          బాణి పాదలెఱ్ఱవాఱ దొడగె
సారెకు మధ్యంబు దారిద్ర్యముల జెప్పె
          ఱొచ్చోర్వకిటు లోగ జొచ్చె మేను

వట్టి గాంభీర్య మెక్కుడు వెట్టుకొనియె
నాభి, నానాటికీ గతి నాటిపొందు
చవుక యైనట్టి యిచ్చట జనదు నిలువ
ననుచు జాఱిన కరణి బాల్యంబు జాఱె.
          ‘మనిషి యవ్వనంలోకి రావడం అంటే బాల్యాన్ని చులకన చేసి అవమానించి చేజార్చుకోవటమే’ అనటం ఓ గొప్ప ఆలోచన. ఈ ఆలోచన చేసినవాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు.
ఆయన రాజకీయ విజయ జీవితం అంతా ఒకెత్తయితే, ఆముక్తమాల్యద కర్తగా ఆయన సాహితీ జీవితం ఇంకొక ఎత్తు. అందుకు ఈ పద్యమే సాక్షి. ఈ పద్యంలో కనిపించే పడుచు గోదాదేవి. శ్రీ విల్లిపుత్తూరులో రంగనాథుడి దేవాలయం పక్కన పూలతోట ఆమె కార్యక్షేత్రం. అప్పుడప్పుడే ఆమె బాల్యం లోంచి యవ్వనంలోకి వస్తోంది. ఔచిత్యం తెలిసినవాడు కాబట్టి, రంగనాథుడికి కాబోయే భార్య ఆ శ్రీరంగనాయకి యవ్వనాంకురాల్ని ఎంత నిగ్రహంతో వర్ణించాడో ఈ పద్యంలో మనం చూడ వచ్చు.
గోదాదేవికి కొత్తగా వచ్చిన యవ్వనం అప్పటిదాకా ఉన్న బాల్యాన్ని కించపరిచి జార్చేసిందట. రోజురోజుకీ బాల్యం పలుచనైపోయి, ఇప్పుడామెకి బాల్యంతో స్నేహం అనేది లేకుండా పూర్తిగా చవకై పోయిందంటాడు. చవకైపోయిందంటే విలువలేకుండా పోయిందని! దాంతో బాల్యం చిన్నబుచ్చుకుని, ఈ అవమానాలు భరించలేక మౌనంగా వెళ్ళిపోవటమే మంచిదని ఇక్కడ ఉండటం మంచిది కాదని వెళ్ళిపోయిందట. యవ్వనం వచ్చాక బాల్యానికి జరిగిన అవమానాలేవిటీ? చాలా ఉన్నాయి.
బాల్యంలో వాక్కాయిలా ఉన్న వాతెర (పెదిమలు) ఇంతకు మునుపులాగా మాట్లాడకుండా మితభాషిత్వం పాటిస్తున్నాయి. మాట్లాడేవాళ్ళు లేకపోతే ఎవరైనా అక్కడుంటారా?
ఆమె ముంగురులు తిన్నగా (రుజువుగా) ఉండేవి ఇప్పుడు అవికూడా వంకరలు తిరిగి కుటిల వృత్తిని నేర్చుకున్నాయి. కుటిలమైన వతావరణంలో ఎవ్వరైనా ఉండగలరా?
పూర్తిగా విప్పారేలా తెరిచి సూటిగా చూసే కళ్ళూ అరచూపులు అలవాటు చేసుకుని క్రీగంట మాత్రమే చూస్తున్నాయి.
యవ్వనం వలన కొత్తగా వచ్చిన సిరిసంపదలు ఆమె కళ్ళలో కొత్త కాంతి తళుక్కు మంటోంది.
కనుబొమల్ని ఆడిస్తోనే అందరినీ అదిలిస్తోంది. మితభాషికదా!
బాల్యంలో ఉన్నప్పుడు వక్షస్థలం గురించి ఆమెకి పట్టింపే ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని కొంగుతో కప్పుకోవటం చేస్తోంది. “చనుగొమల్నెగయ వక్షముపేక్ష గడకొత్తె” చనుగొమలు అంటే అగ్రాలు నెగయటం వలన ఒకనాడు ఆ వక్షస్థలం అంటే ఉండే ఉపేక్ష ఇప్పుడు కడకొత్తిందట. అంటే, కడదాకా తోసేసిందని!
పాణిపాదాలు ఎర్రవారాయి. బాల్యంలో మట్టిలో ఆడుకున్న కాళ్ళూ చేతులు యవ్వనంలో శుచిని పాటించటం వలన ఎర్రబారి ఆమెలో సౌకుమార్యాన్ని పెంచాయి.
‘సారెకు మధ్యంబు దారిద్ర్యముల జెప్పె’ శరీరానికి మధ్యభాగం అయిన నడుముకి ఏదో దారిద్ర్యం వచ్చినట్టు మరీ సన్నబారిపోయిందట.
‘ఱొచ్చోర్వకిటు లోగ జొచ్చె మేను’ బాల్యం అంటే మట్టి, బురదే కదా ఆ రొచ్చును శరీరం ఓర్వలేకపోతోంది. దాని స్థానంలో అలంకారాల మీద ప్రేమ పెరుగుతోందన్నమాట.
ఇంత జరుగుతుంటే బాల్యం వెళ్ళి ఎవరితో మొరపెట్టుకుంటుందీ...ఆమె నాభికి చెప్పుకుందా మనుకుంటే, అది లోతైన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుకని ‘చవుక యైనట్టి యిచ్చట జనదు నిలువననుచు జాఱిన కరణి బాల్యంబు జాఱె’ బతుకు చవుకైనచోట ఉండలేక జారిపోయినట్టు బాల్యం ఆమె శరీరం లోంచి చేజారిపోయిందట.

ఔచిత్యం తెలిసిన కవి యువతి యవ్వనాన్ని పొగడకుండా, ఆమె కోల్పోయిన బాల్యం పట్ల సానుభూతి  చూపించటం గొప్ప విషయం.