Friday, 11 July 2014

కొవ్వులో బందీ అయిన కేలరీలు - ఊబకాయం డా. జి వి పూర్ణచందు

కొవ్వులో బందీ అయిన కేలరీలు - ఊబకాయం
డా. జి వి పూర్ణచందు
క్తిని సృష్టించ లేము-శక్తిని నశింపచేయ లేము అనే సిద్ధాంతం శరీర శక్తికి కూడా వర్తిస్తుంది.
ఆహారం ద్వారా శరీరం తీసుకునే కేలరీలలోంచి, శ్రమ ద్వారా శరీరం ఖర్చు చేసే కేలరీలను తీసేస్తే వచ్చే శేషం శరీరంలో మిగిలిన కేలరీలవుతాయి. మిగిలిన కేలరీలు బాగా వదులుగా ఉండే కొవ్వు కణాలలో చేరటం వలన కొవ్వు కణాలు వాటి పరిమాణాన్ని మించి ఉబ్బుతాయి. అందువలన వదులుగా ఉండే కొవ్వు పొరలు శరీరంలో ఎక్కెడెక్కడ ఉంటాయో ప్రాంతాలన్నీ అంటే పొట్ట, పిరుదులు, డొక్కలు, రొమ్ములు, పిర్రలు ఇవన్నీ లావుగా తయారై స్థూలకాయం ఏర్పడుతుంది. దీన్ని చరకుడు బహ్వబద్ధా మేదాః అంటూ ఒక సూత్రంలో వివరించాడు. బద్ధం అంటే బాగా బిగుతుగా ఉండటం. బహు అబద్ధంఅంటే, బాగా లూజుగా ఉండే మేదస్సు (కొవ్వు)లో చేరి స్థూలకాయాన్ని తెస్తున్నాయని చెప్పాడు.
యాబై యేళ్ళక్రితానికి వెడితే నాటి తెలుగు ప్రజలకు తినాలని వ్యామోహం కలిగించే (tempting foods) ఆహారాలు పీచుమిఠాయి, పూస మిఠాయి, నువ్వు జీడీలు, పప్పు చెక్కలూ ఇలాంటివి. రోజులు మారాయి. వాటిని ఇప్పటి పసిపిల్లలకు చూపిస్తే, ఛీ కొడతారు. అవేం తిళ్ళూ అంటారు. బర్గర్ల పర్వతాలూ, పీజ్జాల దొంతరలు, కేకుల గుట్టలు, స్టారు చాక్లేట్ల కొండలూ, రస్నాల వాగులూ నాటి తరానికి అవే ప్రకృతి సంపద. అవి తినటమే నాగరికత అనీ వాటిని తినటమే గొప్ప అనీ, పీచుమిఠాయిల్లాంటివి అలగా జనం తినేవనీ ఒక అభిప్రాయం ఇప్పటి పిల్లల్లో బలంగా నాటుకు పోయి ఉంది.
మానసికశ్రమ తప్ప శారీరకశ్రమ లేకపోవటాన, తీసుకునే కేలరీల సంఖ్య పెరిగి, ఖర్చయ్యే కేలరీల సంఖ్య తగ్గిపోయి బాల్యంలోనే స్థూలకాయానికి పునాదులు పడుతున్నాయి. జీవన వ్యవస్థ ఇదే రీతిలో కొనసాగటం వలన మనిషి స్థూలకాయానికి ఎర అవుతున్నాడు.
సిగరెట్ల పెట్టె మీద పుర్రె బొమ్మ వేసి హెచ్చరిక వ్రాసినట్టు, స్థూలకాయానికి కారణం అవుతున్న ఆహార పదార్థాల ప్యాకింగ్ మీద కూడా ఇది కొవ్వుని పెంచుతుంది అనే హెచ్చరిక వ్రాస్తే కొంత ప్రయోజనం ఉంటుందేమో...?
పిజ్జా అనే మాటకి A baked pie of Italian origin consisting of a shallow bread like crust అని అర్థం. దీన్ని టమోటా సాసుతోనో వెన్నతోనో, ఏదైనా నూనెపదార్థంతోనో నంజుకు తింటారు. అన్నానికి బదులుగా ఏదితిన్నా అది డైటింగు చేయటమే అనే ఒక బలమైన అభిప్రాయం చాలా మందిలో ఉంది. హోటల్లో బట్టరునానులూ, స్పైసీ కర్రీలు తెప్పించుకుని తింటూ ఒక పెద్దాయన, రాత్రిపూట తేలిగ్గా తినటం నాకు అలవాటండీ అని తన డైటింగు రహస్యం చెప్తున్నప్పుడు మనుషులు ఎంత త్వరగా భ్రమలకు లోనౌతారా అనిపిస్తుంది. ఒకాయన్ని ప్రొద్దునపూట కొంచెం పెరుగన్నం తినటం బలమా లేక, రెండిడ్లీలుగానీ ఒక దోశగానీ బలమా అనడిగితే, ఆయన మినప్పప్పు లాంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రెండిడ్లీలు లేదా దోశే బలం అన్నాడు. కానీ ఇడ్లీని ఇడ్లీ డోసెల్ని తినటానికి, నెయ్యీ కారప్పొడి, అల్లప్పచ్చడీ, శనగచట్నీ, సాంబారు ఇవన్నీ కావాలి కదా  వాటి మాటేవిటీ అని అడిగాను. ఆయన సమాధానం చెప్పలేదు.  
ఒక డబ్బా మినప్పప్పుకి రెండు నుండీ మూడుడబ్బాల ఉప్పుడురవ్వ కలిపి ఇడ్లీలు వేస్తారు. అంటే, ఇడ్లీలు ఇచ్చే కేలరీలూ పెరుగన్నం ఇచ్చే కేలరీలూ ఇంచుమించు సమానమే! కానీ ఇడ్లీకి తోడుగా తినే చట్నీల ద్వారా వెళ్ళే కేలరీలు ఇడ్లీని మించి ఉంటాయి. కాబట్టి ఇడ్లీయే స్థూలకాయాన్ని ఎక్కువ పెంచుతుంది. పైగా అవన్నీ కలిసి జీర్ణకోశవ్యవస్థని దెబ్బతీసి అజీర్తిని పెంచుతాయి. కాబట్టి, ఇడ్లీ కేలరీలగురించిమాత్రమే కాదు, వాటి ద్వారా కడుపులోకి చేరే ఇతర పదార్థాల గురించి కూడా ఆలోచించాలన్నమాట.
ఓవర్ ఈటింగ్ వలన స్థూలకాయం వస్తోందా... స్థూలకాయం వచ్చే పరిస్థితులు శరీరంలో నడవటం వలన ఓవర్ ఈటింగ్ జరుగుతోందా అనేవి వైద్యపరమైన ప్రశ్నలు. కేలరీలన్నింటినీ లాకరులో పెట్టినట్టు తెచ్చి భద్రంగా దాచటం వలన, శరీర వినియోగానికి చాలా పరిమితంగా కేలరీలు వెడతాయి.  దాంతో ఎంత తిన్నా ఈ నీరసం తగ్గటం లేదనిపిస్తుంది. తిండి ధ్యాస విపరీతంగా పెరిగి పోతుంది. వెర్రి ఆకలికి కారణం శరీరానికి కేవలసిన శక్తిప్రదాతలైన కేలరీలను శరీరం ఉపయోగించుకో లేక పోవటమే! వలన ఉపయోగ పడకుండా కొవ్వులో లాక్ అయిపోయిన కేలరీలు ఒక వైపు స్థూలకాయాన్ని పెంచుకుంటూ పోతుంటే, మరో వైపు నీరసం పెరిగి పోతుంటుంది. దాంతో అదనపు కేలరీల కోసం మెదడులోని నాడీ కేంద్రాలు ఆకలిని ప్రేరేపిస్తాయి. అటు ఊబశరీరమూ, ఇటు ఆకలీ రెండూ ఒకదాన్నొకటి పెంచుకుంటూ పోతాయి. మెటబాలిజం అంటే, శరీర నిర్మాణ క్రియలు దానివలన నిలిచి పోతాయి.
తినకుండా పూర్తి పస్తు ఉంటే కొవ్వులో దాగున్న కేలరీలు బయటకొస్తాయనేది కూడా భ్రమే! అందుకని ఆకల్ని బట్టి కాకుండా శరీర శ్రమను బట్టి ఆహారాన్ని తీసుకోవటానికి పథక రచన చేసుకోవాలి. శరీర పరిశ్రమ లేకుండానూ, కొవ్వు పదార్థాలను ఆపకుండాను, కేవలం డైటింగ్ చేస్తే, ఊబకాయం తగ్గక పోగా పెరిగే ప్రమాదం ఉందని దీన్నిబట్టి అర్థం అవుతోంది. పదిమందిలో ఒకరిక్కూడా ఏడాది కాలంలో 10% బరువు తగ్గిన దాఖలాలు లేవని ఒక సర్వే చెప్తోంది. అన్నం మానేస్తే అది డైటింగే అనుకునే వారికి ఈ వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. కేలరీలు దాక్కునేందుకు శరీరంలో కొవ్వు లేకుండా చేస్తేనే ఊబకాయం తగ్గుతుంది గానీ, కొవ్వును పెంచుకుంటూ, కేవలం వరి అన్నాన్ని మానేయటం వలన ఒరిగేదేమీ ఉండదన్నమాట. ఒరిగేదైతే గోధుమ రొట్టెల్ని మాత్రమే తినే వారిలో స్థూలకాయం ఉండకూడదు కదా...? వారిలోనే ఎక్కువగా ఉంటోందనేది ముఖ్య విషయం.
ఆరంభ శూరత్వంతో నెలరోజుల్లో ఈ బరువంతా తగ్గించేస్తానని పట్టుబట్టి విపరీతంగా వ్యామాలు చేసినందువలన కొవ్వులో కేలరీలు కొద్దిగా తగ్గేమాటే నిజమే! ఆ మేరకు లావు, బరువు కూడా తగ్గినట్టే అనిపిస్తాయి. కానీ, నాల్రోజులు ఏ కారణం చేతనైనా వ్యాయామం ఆపవలసి వచ్చిందనుకోండి... వెంటనే ఖాళీగా ఉన్న కొవ్వులోకి తిరిగి కేలరీల వెల్లువ ప్రారంభమౌతుంది. అంతే! మొదట ఉన్న దానికన్నా ఎక్కువ బరువు పెరుగుతారు.
ఇలా కొవ్వులో కేలరీలు బందీ కావటానికి జీవరసాయన కారణాలు, జెనెటీక్ కారణాలు చాలా ఉన్నాయి. శరీర శ్రమ, భోజనం చెయ్యగానే నిద్ర, మానసిక ఆందోళనలు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగక పోవటం వాటికి తోడౌతాయి. షుగరు రోగులకు ఇన్సులిన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు బరువు పెరగటాన్ని, ఇన్సులిన్ తగినంత లేనప్పుడు బరువు తగ్గటాన్నీ మనం గమనించ వచ్చు. ఇన్సులిన్ ఇస్తున్న కొద్దీ కేలరీలు ఖర్చయి పోయి ఆకలి డిమాండ్ ఏర్పడుతుంది.
కొవ్వులో ఉన్న కేలరీలు బయటకు రాలేవు కాబట్టి, అదేపనిగా ఏదోఒకటి తింటూ ఉంటే, కొవ్వులోకి పోయినన్ని పోగా మిగిలిన కొద్దిపాటి కేలరీలు  శరీరానికి శక్తిగా ఉపయోగపడతాయి ఆ కొద్ది పాటి కేలరీల కోసం తిండి ధ్యాస పెంచుకోవాల్సి వస్తుంది. తిన్న ప్రతిసారి మరిన్ని కేలరీలు కొవ్వులోకి చేరుతూనే ఉంటాయి. నీరసం తగ్గకపోగా ఊబకాయం మాత్రం పెరుగుతుంది.
ఈ నిరూపణలను బట్టి, వరి, గోధుమల్లాంటి ధాన్యాల ద్వారా శరీరంలోకి వెళ్ళే కేలరీల కన్నా వాటిని బంధించే నూనె పదార్థాలు ఎక్కువ హాని కారకం అని అర్థం చేసుకోవాలి.

కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ముప్పొద్దులా అన్నం తిన్నా ఊబకాయం రాదన్నమాట. కొవ్వులో దాగున్న కేలరీలనే మనం ఏమీ చేయలేకపోతున్నాం కాబట్టి, కొవ్వు కణాల తాకిడిని తగ్గించేయటమే పరిష్కారం అవుతుంది. నూనెలో వేసి వేయించిన కూరలు, ఊరగాయలు, అత్యంత స్పైసీ కూరలు, నూనె వరద కట్టే వంటకాలూ మనపాలిట శాపాలని గుర్తించాలి!