Sunday, 8 April 2018

వార్తకు వాత: డా. జి వి పూర్ణచందు

వార్తకు వాత: డా. జి వి పూర్ణచందు
వార్త యంద జగము వర్తిల్లుచున్నది/యదియు లేనినాఁడ యఖిల జనులు
నంధకార మగ్నులగుదురు గావున/వార్త నిర్వహింపవలయుఁ బతికి
లంచం పుచ్చుకునేవాణ్ణి చూస్తే మనకు ఒళ్లు మండిపోతుంది. లంచగొండి దొరికిపోయి, V ఆకారంలో వేళ్లు చూపిస్తూ చేతులూపుతూ అందరికీ బాయ్ చెప్తూ వెడ్తుంటే మనసు మరీ కుంగిపోతుంది...లోకం ఇలా అయిపోయిందేవిటా...ని!
ఇంత బాధపడ్తున్న మనకే ఒక్కో సారి విషమ పరిస్థితి వస్తుంది. ఆ దొరికిపోయిన లంచగొండి మనకు తెలిసినవాడో సన్నిహితుడో అనుకుందాం...అప్పుడు మన మనసుఎలా ఉంటుంది... ఈ మధ్య కొందరు బయటపడి మరీ నిస్సిగ్గుగా “దాడిచేసి పట్టుకోవటానికి మా కులంవాడే దొరికాడా?మా కులస్థులమీద ప్రభుత్వం ఉక్కు పాదాలు మోపి అణచి వేయాలని చూస్తోంది. ఫలానా కులం వారి అవినీతి కనబడదా...?” అంటూ మాట్లాడేవాళ్లు గణనీయంగానే ఉన్నారు. ఇంకనుండీ ఎవరైనా దొంగ లేదా హంతకుడు దొరికిపోతే వాడు మనకులం అవునో కాదో చూసుకుని స్పందించాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉన్నదని దీని సారాంశం.
అనుకూలత అనేది మితిమీరి ఆకాశానికి ఎత్తటం మొదలెడితే గాడ్సేలంతా గాంధీ లైపోతారా వర్ణనల్లో! ఒక సంఘటన జరిగిందని చెప్పేప్పుడు మనమే ఆ సంఘటనలో ఒక పక్షాన నిలబడి రెండోవాడికి వ్యతిరేకంగా ఆ వార్తని చిత్రించి చెప్తాము. అక్కడిదాకా ఎందుకు...మనం ఓటు వేసిన పార్టీ ఓడిపోతే అవతలివాడు బరితెగించాడని, మన పార్టీని తొక్కేశాడని, మనల్ని గెలవకుండా చేశాడనీ అంటాం. మనపార్టీ గెలిస్తే ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని ఘంట బజాయిస్తాం. వార్తాపత్రికలు కూడా అంతే! ప్రతీ పత్రికకీ ఒక నిబద్ధత ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆ నిబద్ధత యూటర్న్ తీసుకుంటూ ఉంటుంది కూడా! నార్లవారు బతికున్న రోజుల్లో సంగతి...అప్పటిదాకా ఎమర్జెన్సీనీ, ఇందిరాగాంథీని తెగపొగిడిన ఒక దినపత్రిక ఇందిరాగాంథీ ఓడిపోగానే ఎమర్జెన్సీని తెగతిడుతూ సంపాదకీయం వ్రాసింది. పత్రికల్లో ఇలాంటివి సహజం. ప్రతీ ఎన్నికలోనూ ఒకే పార్టీకి ఎల్లకాలం మనుషులు ఓటేస్తే ఓడలూ బండ్లూగా రాజకీయ చక్రాలు గిర్రున ఎలా తిరుగుతాయి...? మనం మనసు మార్చుకున్నట్టే పత్రికలూ పంథాను మార్చుకుంటూ ఉంటాయి
పూర్వం రాజులకి వేయి వేశ్యల మదమణచిన రసిక కులశేఖరుడు లాంటి బిరుదులిస్తే చాలా ఘనంగా వందిమాగధులతో స్తుతిస్తోత్రాలు చేయించుకొనేవాళ్లు. “అంత ఛండాలంగా ఎలా ఆనందించబుద్ధి అయ్యిందా ఆ రాజుకి?” అని అనిపిస్తుంది మనకి! తంజావూరుని పాలించిన విజయరాఘవనాయకుడు ఓ వెయ్యి మంది నగ్నసుందరుల్తో ఒకే చోట ఒకేసారి కేళీకలాపాలు చేస్తుంటే ఆయన రాణి, పిల్లలు,మనుమలు అంతా గేలరీలో కూర్చుని చూసి వినోదించారని రంగాజమ్మ అనే కవయిత్రి వ్రాసింది. ఇదేం పిచ్చి రాతలే అని రాణిగారొచ్చి రంగాజమ్మని నిలదీస్తే నీమొగుణ్ణి నీపక్కలోంచి నేను లేపుకొచ్చానా ... నువ్వు ఆడదానివికాదా?,మొగుణ్ణి ఎలా కట్టుకోవాలో తెలీదా...? తలోదరీ!!..అనడిగినట్టుకూడా కమ్మని పద్యాలున్నాయి. మన పండితులు ఈ రంగాజమ్మ పక్షమే వహించారు. ఆమెకు ఎక్కడలేని రాణిహోదాలూ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ఏది నిజం వార్త...? ఏది అబద్ధం వార్త...? అంకఛండాలాన్ని అంకఛండాలంగా వ్రాసినా పండితులకు నచ్చింది. నచ్చి ఉండకపోతే రంగాజమ్మ ఎక్రెడిషన్ గుర్తింపు కార్డు రద్దు చేసి, మొదటి తప్పు, రెండో తప్పు, మూడో తప్పు శిక్షలన్నీ ఒకేసారి విధించేవాళ్లు. రాధికా స్వాంతనం వ్రాసిన ముద్దుపళనిలో కనిపించిన తప్పు రంగాజమ్మలో కనిపించిన ఒప్పు ఏమిటో తేల్చి చెప్పటం కష్టమే! సంస్కర్త వీరేశలింగంగారే తీర్పరి పాత్ర పోషించి ముద్దుపళనికి నిషేధ శిక్ష విధించాడు.
నిజమే! ఫేక్ వార్తల్ని సృష్టించేవాడికి శిక్షపడాలి. కానీ, ఒక వార్తలోని కట్టుకథని అన్ని సందర్భాలలోనూ నిష్పక్షపాతంగా నిర్థారించటం చాలా కష్టం. విజయరాఘవనాయకుడు చేసిన పని ఒకరికి ఘనమైనదిగా కనిపిస్తోంది. అలానే ఘనమైన విషయంగా వార్తని రికార్డ్ చేసిందామే! అది అధికారపక్షానికి అనుకూలంగా వ్రాసింది కాబట్టి దానిలో ఫేక్ అనే ఎలిమెంటు అణిగిపోయింది. దాన్ని వ్యతిరేక దృష్టితో చిత్రిస్తే కచ్చితంగా తప్పుడు వార్తల్ని తప్పుగా చిత్రించినందుకు నిన్న కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన శిక్షలన్నీ పడేవి. ఇవి రాజులకాలం నాటి ఆలోచనావిధానం. అధికార పక్షం అంతకన్నా భిన్నంగా అలోచించగలదని ఊహించలేం. మాకు అనుకూలమైనవే నిజాలు. మాకు వ్యతిరేకమైనవన్నీ అబద్ధాలే ననేది కొత్త చట్టంలో సారాంశం.
చివరికి ఎవరి అబద్ధాలను వాళ్లనే రాసుకోనివ్వటం శ్రేయస్కరం అని సర్కారు వారు పునరాలోచించటం  కథకు ముక్తాయింపు.
నిజం అనేది ఒక పచ్చి మాంసం ముద్ద లాంటిది. దాన్ని ఉడికించి, మషాలాలు కుమ్మితేగాని అది కూర అవదు. వార్త కూడా అంతే! ప్రజలు అలా ఉంటేనే చదువుతున్నారన్నది నిజం. మామూలు వార్తలిస్తే మొత్తం పేపరంతా తిరగేసి ఇవ్వాళ్ పేపర్లో వార్తలే లేవంటాడు పాఠకుడు. యథా ప్రజా...తథా పత్రికా! పాఠకులనుబట్టే పత్రికలు. నిజాలు వద్దనుకునే ప్రజలకు చేదు మందులాగా నిజాలే ఎక్కిస్తానంటే ఏలిన వారికి కోపం వచ్చింది. అయినా ప్రస్తుతానికి తమాయించుకుంది.
ఇప్పుడైనా నన్నయగారి పద్యం మనకు గుర్తుకురావాలి. “వార్తలోనే ఈ ప్రపంచం మొత్తం నడుస్తోంది. వార్త లేకపోతే మనుషులంతా అంధకార మయం అవుతారు” అన్నాడు నన్నయ. వార్తని సక్రమంగా ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత నాలుగో స్తంభానిదే! దాని నిజానిజాలు ఒక రాజకీయ పార్టీ నడిపే ప్రభుత్వం లేదా దానిచే నియమితులైన వ్యక్తులూ నిశ్చయం చేస్తారనటం విచిత్రమే! వార్తల్ని చేరనివ్వండి. వార్త ప్రభావితం చేస్తుంది. ఒకసారి ఈ పార్టీని చేస్తే ఇంకోసారి ఇంకో పార్టీని చేస్తుంది. ఎల్లకాలం ఒక్కరే జెండాకర్రలా పాతుకు పోగలిగే పరిస్థితి ఇప్పుడు లేదు. ఉంటాననుకునే వారి వెర్రికల నిన్న ఉపసంహరించుకోబడిన పత్రికా చట్టం.