తొలి తిట్టుకవిత
డా. జి వి పూర్ణచందు
“మా నిషాద ప్రతిష్ఠాం త్వ, మగమశ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునా దేక, మవధీః కామమోహితం”
‘కొట్టు’, ‘చంపు’ అని రాస్తే విప్లవకవిత్వం అని నిషేధించాలని చూస్తారు. గట్టిగా తిరగబడి తిడితే, తిట్టుకవిత్వం అంటారు. కానీ, భారతీయ సాహిత్యానికి ఆదికావ్యం రామాయణాన్ని వాల్మీకి కవికోకిల ఇలా ఒక తిట్టుతోనే ప్రారంభించాడు. మామూలుగా తిట్టలేదు. అనేక అర్థాలు వచ్చేలా తిట్టాడు. కాబట్టి, యాదాలాపంగా కాక, బాగా ఆలోచించి తిట్టినట్టే లెక్క.! తిట్టాలనే తిట్టాడన్నమాట!
కాళిదాస మహాకవి ఈ శ్లోకం గురించి వ్యాఖ్యానిస్తూ, ‘శోకం లోంచే శ్లోకం’ పుట్టింది అన్నాడు. ఎవరినైనా ఎవరైనా తిట్టారంటే మనసులో కలిగిన బాధ(శోకం)వలనే అలా తిడతారు. బాధ పడేవాడి పక్షం వహించిన ఏ కవి అయినా, బాధ పెట్టిన విషయాన్ని తన కవితలో తిట్టి తీర్తాడు. వాల్మీకి ఆ పనే చేశాడు. ఆయనకు ఎవరి మీద కోపం వచ్చింది ...? ఏవని తిట్టాడు...?
“వేటగాడా! ఆ పక్షి జంట అనురాగంతో ఆదమరచి ఉన్న అదను చూసి బాణం వేశావు. ఆ జంటలో ఒకటి నేలకూలింది. ఇంత అప్రదిష్ట మూటగట్టుకున్నావు...నువ్వూ ఇలానే త్వరలోనే చస్తావ్!” అనేది ఈ శ్లోకంలోని తిట్టు సారాంశంగా పండితులు చెప్తారు. ఇక్కడ పక్షిని కొట్టిన వేటగాణ్ణి తిట్టినట్టు మనకి కనిపిస్తోంది.
ఇక్కడే మౌలికమైన ఒక ప్రశ్న అడగాలి. ‘అసలు ఈ తిట్టుకీ, తాను ప్రారంభించ బోయే రామాయణానికీ సంబంధం ఏవిటీ...?’ అని! వాల్మీకి నోట వెలువడిన ఈ ప్రథమ శ్లోకానికీ రామాయణ కథా క్రమానికీ అన్వయం ఏమీ కుదరక పోతే ఇది వ్యర్థ కవిత్వమే అవుతుంది.
‘తుపాకీ గోడకు వ్రేలాడి ఉన్నట్టు రాస్తే, కథ పూర్తయ్యే లోపు ఆ తుపాకీ పేలాలి’ అనే సూక్తి వాల్మీకి కవితకూ వర్తిస్తుంది. ఉత్తినే అలా తిట్టేసి వదిలేసి ఉంటే, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా వాల్మీకి గురించి మనం గొప్పగా అనుకోవాల్సిందేమీ ఉండేది కాదు. మరో కోణంలోంచి పరిశీలిస్తే తిట్టినట్టు కనిపిస్తూనే, పొగిడేదిగా కూడా ఈ కవిత కనిపిస్తుంది. ఎవర్ని పొగుడ్తున్నాడు...? కామమోహితుణ్ణి పట్టి కొట్టిన వాణ్ణి- అలా కొట్టినందుకు పొగుడ్తున్నాడు!
రామాయణంలో రాముడి చేతుల్లో చచ్చిన వాళ్ళంతా కామమోహితులే! తమ్ముడి భార్యని ఎత్తుకెళ్ళిన వాలిని, సాక్షాత్తూ తన భార్యని ఎత్తుకెళ్ళిన రావణుణ్ణి ఇంకా అతి కాముకత్వంతో వ్యవహరించిన వాళ్ళని శిక్షించటమే రామాయణ ప్రయోజనం!అలా చేయటం వలన అది రాముడికి శాశ్వతంగా నిలిచిపోయే ప్రతిష్ఠ నిచ్చిందే కానీ, ఎలాంటి పాపాన్నీ అంటగట్టలేదు.
రాముడు తన తండ్రిలాగా అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నవాడైతే,
ఇంకొకడి బహు భార్యాత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఆయన కుండేది కాదు! అందుకని కామమోహితమైన పక్షిని కొట్టే కథతో రామాయణాన్ని ప్రారంభించి ఏకపత్నీ వ్రతాన్ని ప్రబోధించనున్నట్టు వాల్మీకి ఒక ఈ శ్లోకం ద్వారా ఒక సూచన చేశాడన్నమాట. ఏకపత్నీ వ్రతులకు శాశ్వత కీర్తి లభిస్తుందనేది ఇందులో ప్రబోధం.
“కామంతో
కావరమెక్కిన వాణ్ణి చంపి
లోకంలో కీర్తిని గెలిచావు...
వేటగాడా! వర్థిల్లు”
అనేది ఈ తొలి తిట్టుకవితలోని అన్వయార్థం! రాముడు వాలిని కొట్టిన సమయంలో ‘జంతువుని చెట్టు చాటునుండి కొట్టటం వేటగాడి ధర్మమే’ నంటూ తనని వేటగాడిగానే సంభావించుకుంటాడు.
‘కవిత్వం అనేది
దుష్టుడి దౌష్ట్యాన్ని ఎత్తి చూపించటంలో ఉంటుంది గానీ, రాముడి
ఔన్నత్యాన్ని ఊరికే పొగడటంలో ఉండదు’ అని వాల్మీకి నమ్మినట్టు దీన్ని బట్టి అర్థం అవుతోంది. ‘విమర్శలో పరామర్శ’ని చొప్పించ గలవాడే మహాకవి! వాడిన ప్రతి
పదమూ లోతైన భావాల్ని పాఠకుడిలో రగిలించ గలిగినప్పుడు ఆ కవిత పది కాలాల పాటు మన
గలుగుతుంది.