Wednesday, 17 September 2014

లంచగొండి వ్యవస్థను ఎండగట్టిన పద్యం :: డా. జి వి పూర్ణచందు,

 లంచగొండి వ్యవస్థను  ఎండగట్టిన పద్యం
డా. జి వి పూర్ణచందు,
సెల్: 94401 72642
“అతివృష్టిన్ మును వార్థి గూర్చునెడ కా( డౌటన్ దమిన్ గూర్చున
న్మతి లంచంబుగ హేమటంకములు మింటన్ బొల్చు పర్జన్యదే
వతకీ నెత్తిన కేల నా( బొలిచె, నిర్వారిస్రవంతిన్ న్బయ
శ్చ్యుతి నమ్రచ్ఛద దృశ్య కర్ణికములై యున్నాళ నాళీకముల్”
వానలు బాగా కురిసేటువంటి ఆ రోజుల్లో, మనుషుల్లో కొద్దిగా నైనా పాపభీతి ఉండేది. మొక్కలు నరకటం, నీటిని వృధా చేయటం, అన్నం పారేయటం ఇలా చాలా విషయాల్లో పాపభీతి వెన్నాడేది. మనుషుల్లో మంచితనం వలన వానలు కొన్నయినా కురిసేవి. ఇప్పుడు మనకి ఎండాకాలం ఒక్కటే నడుస్తోంది. వాన కురిసినంత సేపే వానాకాలం! అపురూపమైన సమయం అది! అలాగే, చలి వేసిన ఆ కొద్దిసేపూ శీతాకాలం. మిగలిందంతా ఎండాకాలమే! మునిమాణిక్యం వారన్నట్టు మనది ఎండామండిత ప్రదేశంగా మారిపోయింది.
వానలు లేక అలా ఎండిన ఒక జలాశయంలో కృష్ణదేవరాయలు తామరపూలు వడలి పోతున్న ఒక దృశ్యాన్ని చూశాడు. అప్పటిదాకా నీళ్ళమీద తేలియాడిన తామర మొక్కల బతుకు బజార్న  పడిందని అనిపించిం దాయనకి! మనుషుల్లో నిజాయితీ చచ్చిపోతే ప్రకృతి కన్నెర్ర జేస్తుందని పరోక్షంగా హెచ్చరించాలనుకున్నాడు.
తామరతూళ్ళు నిట్టనిలువుగా జొన్నదంటుల్లా నిలబడ్డాయి. అంతరిక్షంలో ఎగిరే పళ్ళాల్లాగా విహరించిన తామర పూరేకులు ఎండకు మాడి వడలి వాలి పోయాయి. తామరపూల మధ్యన ఉండే కర్ణికలు పచ్చగా పొడుచు కొచ్చినట్టు ఉన్నాయి. ఈ కర్ణికల్ని తామర దుద్దులు అంటారు. చెవులకు పెట్టుకునే బంగారపు దుద్దులు కూడా వీటిలానే గుబ్బలాగా ఉంటాయి కాబట్టి, వాటిని దుద్దులన్నారు. తామర పూల మధ్య అమ్మవారు ఈ మెత్తని దుద్దుమీదే కూర్చుంటుంది. ఆ దుద్దులు ఎండి వడిలి పోయాయి. ఇదీ అక్కడ కనిపించిన దృశ్యం
నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. దీన్ని కవులు సాగర సమాగమం అని కూడా అంటారు. ప్రేయసీ ప్రియుల సమాగమం లాంటిదని! నదిని సముద్రంతో కలిపే వాడు పర్జన్యుడు. అంటే, ఉరిమే మేఘం! మామూలు భాషలో అమ్మాయిని అబ్బాయి దగ్గరకు చేర్చటాన్ని తార్చటం అంటారు. తమని సముద్రానికి తార్పులాడే మేఘుణ్ణి మంచి చేసుకోవటానికి నదులు సహజంగా ప్రయత్నిస్తాయి. అందుకు ప్రతిఫలంగా ప్రవాహాలు లంచం ఇచ్చుకున్నాయని రాయల వారంటారు. ఇప్పటి భాషలో దాన్ని బ్రోకరేజీ, కమీషన్ అని గౌరవంగా పిలుస్తున్నారు. రాయలవారు దీన్ని లంచం అనే అన్నారు. దిగువ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఎలా పనిచేస్తున్నాయో నాకు తెలుసనే హెచ్చరిక రాయలు చేస్తూ ఉండవచ్చు కూడా!
దీన్ని, ఇలాగే చెప్పి ఊరుకుని ఉంటే ఇందులో కవిత్వం ఏమీ లేదు. దీన్ని లోకానికి అన్వయించి చెప్పాలి. అది జనం మీద ప్రభావాన్ని చూపించాలి. కావ్య ప్రయోజనం అలా సిద్ధించాలని ఆశించాడు రాయలు. ఆముక్తమాల్యదలో ఈ దృశ్యాన్ని కవిత్వీకరించి చెప్పాలనుకున్నాడాయన.
మేఘుడి వాటా మేఘుడి కిచ్చేస్తే, బాగా వానలు కురిపించి తమని త్వరగా సాగరానికి చేరుస్తాడని నదుల ఆశ. అప్పటికే వడలిపోయిన తామర తూళ్ళు ఆ ఎండు జలాశయం చేతులుగా, వాడి వాలిపోయిన తామర పూలు చేతివ్రేళ్ళుగా ఆయన భావించాడు. పూల మధ్యన ఉండే కర్ణికలు అంటే తామరదుద్దులు లంచం ఇవ్వటానికి అరచేతిలో పట్టుకున్న హేమటంకా(బంగారు నాణేలు)ల్లా ఉన్నాయంటాడు. కృశించిన తన చేతుల్ని బారచాచి, నది అరచేతుల్లో బంగార నాణాలు చూపిస్తూ, ‘ఇవి తీసుకుని వాన కురిపించవయ్యా’ అని మేఘుణ్ణి అడుగు తున్నట్టుగా ఉందట.
ఇంత శక్తిమంతమైన ఉత్ప్రేక్ష చేసిన ప్రబంధ కవి ఇంకొకరు లేరని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు లంచగొడితనంతో భ్రష్టుపట్టి పోయాయని, ప్రభుత్వ వ్యవస్థ ఆనాడే బరితెగించిందని, అందుకు విరుగుడు అసాధ్యంగా ఉందనీ రాయలు గ్రహించాడు. దానికి తగ్గ నివారణ చర్యలు ఆయన తీసుకున్నట్టు రాయలనాటి వజ్రాల పరిశ్రమ సాక్ష్యం చెప్తుంది.
ఆ కాలంలో ‘అంగట్ల రతనాలు పోసి అమ్మినారట ఇచట...’ అనే మాట/పాట కూడా నిజమేనని చరిత్రెఅ వేత్తలు అంగీకరిస్తున్నారు. అంగట్లో అమ్మిన ఆ నాటి వజ్రాలు ప్రైవేట్ సంపద కాదు. పూర్తిగా ప్రభుత్వ సంపద! ఆయన వజ్రాల గనుల్ని ప్రైవేటీకరించి కబ్జాదారులకి గుత్త కివ్వలేదు. కఠోరమైన నియమాల మథ్య వజ్రాలు తవ్వించి, పదును పెట్టించి బజార్లో పెట్టి అమ్మించాడు. తగిన ఆధారం లేకుండా ఎవ్వరి దగ్గరైనా పెద్ద వజ్రం ఉన్నదంటే అది తస్కరించబడినట్టే లెక్క!
అందుకు శిక్ష ఘోరంగా ఉండేది.ఆ రోజుల్లో కోహినూరు వజ్రం అంతటి వజ్రాన్ని రోడ్డుమీద పారేసినా ఎవరూ ఎత్తు కెళ్లటానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎత్తుకెళ్ళిన దానికన్నా, తగిన ఆధారాలు లేకుండా ఆ సొమ్ము ఒక దగ్గర ఉండటం రెట్టింపు నేరం కాబట్టి.
లంచగొండి వ్యవస్థ గురించిన స్పష్టమైన అవగాహన  రాయలవారి కున్నదన్నమాట! అది ఆముక్తమాల్యదలో ఈ పద్యంలో ప్రతిఫలించింది. లంచగొండుల్ని ఒక కంట కనిపెడుతూనే,  ప్రభుత్వ యంత్రాంగాన్ని నడప గలిగాడంటే రాయల వారి అవగాహన గొప్పదనే అర్థం.