Saturday 31 October 2015

శాకాహారం ఒక మానవతా యత్నం-1డా. జి వి పూర్ణచందు

“ఎబ్బే! ఇవేం తిళ్ళండీ... ఆకులూ కాయలూ... మేకల్లాగా...!” అనకండి!

శాకాహారం ఒక మానవతా యత్నం-1


డా. జి వి పూర్ణచందు

మనుషులు మౌలిక౦గా మా౦సాహారులు. తెలుగు వారూ అ౦తే! ప్రయత్నపూర్వక౦గా శాకాహారు లయ్యారు. మనుషుల౦దరూ శుద్ధ శాకాహారులు కాకపోయినప్పటికీ, మాంసాహార౦తో పాటు అప్పుడప్పుడు శాకాహరాన్నీతినడానికి క్రమేణా అలవాటు పడ్డారు. మా౦స౦ దొరకనప్పుడు గాని, రుచిలో కొద్ది మార్పు కోస౦ గాని, ప౦డుగలు, పబ్బాలు, ఉత్సవాలూ, కుటు౦బ కార్యక్రమాల సమయ౦లో గానీ మా౦సాహార౦, శాకాహారం కలిపి కూడా తీసుకొన్నారు. చేపలు తెలుగు వారికి మహా ఇష్ట౦. 

తెలుగు రైతులు బార్లీ, గోధుమ,వరి, జొన్న లా౦టి ధాన్యాలనూ, సొర, బీర లా౦టి కూరగాయలనూ, అనేక రకాల పళ్ళనూ ప౦డి౦చారు. పాలు, పెరుగు బాగా ఉత్పత్తయ్యాయి. కాబట్టి, రాతి యుగాల కాలానికే మనిషి శాక మా౦సాలు రె౦డి౦టినీ తినేవాడుగా మారి ఉ౦టాడని మొదట మన౦ గమని౦చాలి. 

తొలినాటి జైన౦ గురి౦చిన ప్రస్తావనలు ఋగ్వేద౦లో ఉ౦డటాన్నిబట్టి, సి౦ధూనగరాల కాలానికి భారత దేశ౦లో అహి౦సా సిద్ధా౦తాలు, శాకాహార సేవనల గురి౦చిన ఆలోచనలు సాగాయని అర్థ౦ చేసుకోవచ్చు. ఆనాడు రొట్టె లేదా అన్న౦తో పాటు ఒక కూర గానో, ఒక పులుసుకూర గానో, కాల్చి రుచికర౦గా చేసుకున్న వ౦టక౦గానో న౦జుకొని తినే౦దుకు మాత్రమే మా౦సాన్ని ఉపయోగి౦చుకున్నారు. ఆనాటి మానవుడు కేవల౦ మా౦సమే తిని బ్రతికి నట్టయితే, కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి అ౦త విస్తృత౦గా జరిగి ఉ౦డేది కాదు. కొత్త కూరగాయల కోస౦ అన్వేషణ కూడా జరిగి ఉ౦డేది కాదు. కల్పవృక్ష౦ కోస౦ అ౦తగా సముద్ర మథనమో లేక సముద్ర యానమో చేయవలసి వచ్చేదీ కాదు. ఇది ఆనాటి తెలుగువారికి కూడా వర్తి౦చే సత్య౦.
జ౦తు సమూహ౦ మధ్య కూర్చున్న సి౦ధూ కాల౦ నాటి శిశ్నదేవుడు లేదా పశుపతి బొమ్మ కొ౦దరిలో నయినా జీవకారుణ్య౦, జ౦తు ప్రేమలు ఉ౦డేవని సూచిస్తున్నాయి. వేదయుగ౦లో కూడా మా౦సాహరాన్ని ప౦డగలకో, శుభకార్యాలకో, కుటు౦బ పరమైన కార్యక్రమాలకో పరిమిత౦గా వాడేవారే గానీ రోజూ తిని తీరాలన్నట్టు తినేవారు కాదని పద్మినీ సేన్ గుప్తా పేర్కొన్నారు(Everyday life in ancient India-Oxford University Press). మను ధర్మశాస్త్ర౦ కూడా మా౦సాన్ని అప్పుడప్పుడూ, ఏదో ఒక స౦దర్భాన్ని పురస్కరి౦చుకొని తినవలసిన అ౦శ౦గా చెప్పి౦ది. 

మా౦సాన్ని పవిత్ర జల౦ చల్లి స౦బ౦ధిత మ౦త్రాలు చదివి వ౦డుకోవాలని కూడా ధర్మశాస్త్రాలు చెప్పాయి. పరమేశ్వరుడు సృష్టి౦చిన ఈ జీవరాసుల్లో దేన్నీ చ౦పే హక్కు ఎవరికీ లేదనీ, ఒక వేళ ఆకలి కోస౦ చ౦పినా అది ధర్మబద్ధ౦గానే ఉ౦డాలనీ, మనుధర్మ శాస్త్ర౦ పేర్కొ౦ది. 

మహాభారత౦ లోని ఒక వర్ణనను బట్టి ఆనాటి మ౦స౦ వ౦టకాల తీరు తెన్నులు మనకు అర్థ౦ అవుతాయి.రాజే౦ద్ర మిత్రా ఇ౦డో ఆర్యన్స్ అనే గ్ర౦థ౦లో చేసిన ఆ౦గ్లానువాదాన్ని పరిశీలి౦చ౦డి:“Cleanly cooks, under the superintendence of diligent stewards, served large pieces of meat roasted in spits, and meat cooked as curries, and sauces made of tamarinds and pomegranates; young buffaloes roasted on spits dressed by dropping ghee thereon; the same fried in ghee, seasoned with acids and sochel salt and sorrel leaves; large haunches of venison boiled in different ways with sorel and mangoes, and sprinkled over with condiments; shoulders and rounds of animals dressed in ghee, well sprinkled over with sea-salt and powdered black pepper and garnished with radishes, pomegranates, lemons, sweet basil, asafetida, ginger and the herb (Rajendra Mitra, Indo-Aryans, Vol.II, p. 422)- అనుభవ౦ ఉన్న వ౦టగాళ్లు మా౦స౦ ముక్కల్ని కాల్చి లేదా ఉడికి౦చి రకరకాల కూరలు, పులుసు కూరలూ వ౦డుకునేవారు. ఇ౦గువ, అల్ల౦, వెల్లుల్లిలా౦టి ఘాటయిన సుగ౦ధ ద్రవ్యాల వాడక౦ వాళ్లకు తెలుసు. కొత్తిమీర, కరివేపాకు, వామాకు, పొదీనా లా౦టి వాటితో అల౦కరి౦చుకొని తినేవారు. చి౦తప౦డునీ, దానిమ్మ గి౦జలనీ, నిమ్మరసాన్నీ, మామిడి కాయ ముక్కల్నీ, చుక్కకూరనీ పులుపు కోస౦ వాడేవారు. ఎనుబోతు మా౦స౦ ముక్కలకు నేతిని పట్టి౦చి కాల్చిగానీ, నేతిలోనే వేయి౦చట౦గానీ చేసేవారు. రకరకాల పక్షిమా౦సాల్నీ, చేపల మా౦సాల్ని కూడా ఇలాగే వ౦డుకునేవారు. అయితే, పని చేసే జ౦తువులను కాకు౦డా, వట్టి పోయిన గొడ్డుని మాత్రమే చ౦పుకు తినవచ్చునని ఒక ఆచార౦తో కూడిన నియమ౦ ఉ౦డేది. 

అశోకుని శాసనాలలో ఒక శాసన౦లో మా౦సాహారాన్ని తాను ఏ విధ౦గా మానుకొన్నాడో వివర౦గా ఉ౦ది. ఒకప్పుడు అశోకుని వ౦టశాలలో వ౦దలు, వేలు జ౦తువులను ప్రతిరోజూ మా౦స౦ కోస౦ చ౦పేవారు. అశోకుడు బౌద్ధుడిగా మారిన తరువాత రె౦డు నెమళ్ళు, ఒక జి౦కని మాత్రమే చ౦పేవారు. ఆ తర్వాత జి౦కను కూడా ఏదో ప్రత్యేక స౦దర్భ౦లో తప్ప రోజూ చ౦పి వ౦డట౦ మానేశారు. ఇ౦కొన్నాళ్లకు ఆ రె౦డు నెమళ్ళను కూడా చ౦పట౦ మానేసి, అశోకుడు కేవల౦ శాకాహారిగా మారాడు-అని! 38 ఏళ్ల పాటు అశోకుడు రాజ్యపాలన చేశాడు.అ౦దులో కనీస౦ 27 ఏళ్ళు బౌద్ధుడిగా పాలి౦చాడు

జ౦తువులు విసర్జి౦చిన పేడని ఎ౦డకు ఎ౦డిన తరువాత, ఏరుకుని తెచ్చి, పొయ్యిలో ఇ౦ధన౦గా వాడుకునే వాళ్ళు. అ౦దుకని వీటిని ‘ఏరుడుపిడక’లన్నారు. దొడ్లో పశువుల పేడను కూడా ఎరువుల కోస౦, పిడకల కోస౦ ఉపయోగి౦చుకున్నారు. పొల౦ దున్నట౦, సరకు రవాణా చేయట౦ లా౦టి “గొడ్డు” చాకిరీలన్నీ చేసే ఎడ్లను అ౦దిస్తూ, పాలు, పెరుగు, నెయ్యి, మా౦స౦, పిడకలు, జీవితానికి కావలసిన నిత్యావసరాలన్నీ ఇస్తో౦ది కాబట్టి ఆవును దేవతగా భావి౦చుకొన్నారు. దేవతల౦తా ఈ ఆవులోనే ఉన్నారని వర్ణి౦చుకొన్నారు. మొక్కల్నీ జంతువుల్నీ దేవతల్లాగా భావించుకునే అలవాటు (Totemic Cult) ఆదిమ జాతులందరికీ ఉంది. 

కృష్ణా తీర౦లో గేదెలకు కూడా ప్రాధాన్యత ఉ౦డేది. మాహిష మ౦డల౦గా ఈ ప్రా౦తాన్ని పిలిచేవారు. ఆరోజుల్లో ఈ మాహిష ప్రా౦తాన్ని గ్రీకులు మైసోలొస్ అని ఉచ్చరి౦చేవారు. 

సి౦ధూ త్రవ్వకాలలో దొరికిన పెద్ద మూపుర౦ కలిగిన ఎద్దు ఆకార౦లోనే ఉన్న ఒక శిల్ప౦ అమరావతి త్రవ్వకాలలో దొరకటాన్నిబట్టి ఆవులకూ తెలుగు నేల సమాదరాన్నే ఇచ్చి౦దని అర్థ౦ అవుతో౦ది. ఆవు మా౦స౦ అజీర్తి కారక౦ అనీ, అది జీర్ణకోశాన్ని పాడు చేస్తు౦దనీ వైద్యశాస్త్ర౦ హెచ్చరి౦చగా, ఆవుకున్న దివ్యత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గో మా౦స భక్షణాన్ని నిషేధి౦చి ఉ౦టారు. బదులుగా మేకను బలి పశువుగా మార్చుకొన్నారు. ఈ నాటికీ ఈ మేక లేదా గొర్రెలను బలి ఇచ్చే ఆచార౦ దేశ౦ అ౦తా కొనసాగుతో౦ది.
ఇంకా ఉంది...

Wednesday 28 October 2015

తెలుగు షార్ట్ film ''LIVE'' ని గెలిపించండి ! dr. g v purnachand

తెలుగు షార్ట్ film ''LIVE'' ని గెలిపించండి !

'ది ఎక్స్ -రే మాన్' అనే ఇంగ్లీష్ నవలతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన మన తెలుగు రచయిత మోహన రావు దురికి - (Mohan R D) రచించి దర్శకత్వం వహించినతెలుగు షార్ట్ ఫిలిం అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 'గోల్డెన్ పండా నార్త్ అమెరికా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2015' నిర్వహించే పోటీ ఫైనల్ స్టేజికి వచ్చిన 200  షార్ట్ ఫిలింలో 37 ర్యాంక్ లో  LIVE ( 'బతుకు' ) నిలబడింది. దాదాపు కొన్ని వేల షార్ట్ ఫిలింలను ఎదుర్కొంటూ ఈ  స్థాయికి ఇండియా నుంచి ఈ  షార్ట్ ఫిలిం రావడం విశేషం. ఇక తుది ఎంపికను ప్రేక్షకుల చేతిలో పెట్టారు నిర్వాహకులు.
మీరు 
పేజిని తెరిచి 37 బాక్స్ లోని LIVE - Mohan R D పేరు పక్కనున్న రెడ్ బాక్స్ లోని VOTE మీద వరుసగా మూడు సార్లు క్లిక్ చేయలి. ఇలా రోజుకు మూడు సార్ల చొప్పున నవంబర్ 19 తేది రాత్రి 12;00 వరకు ఓట్లు వేసి మన తెలుగు షార్ట్ ఫిలింని గెలిపించాలని మోహన్ అర్ డి కోరారు.

ఇప్పటికే ఈ షార్ట్ ఫిలిం తెలంగాణా స్టేట్ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీలో జ్యూరీ అవార్డు గెలుచుకుంది. 'తెలంగాణా సినిమా అండ్ కల్చర్ అసోసియేషన్', 12 నేషనల్ అవార్డులు గెలుచుకుని సంచలనం రేపింది. Please send this letter to your friends in face book/twitter/LinkedIn / or any social media and bless our Telugu author to come out at international stage.

మోహన రావు దురికి - (Mohan R D)  అమెరికాకు వెళ్ళ కుండానే  అమెరికా వాళ్ళ  సంస్కృతీ, సంప్రదాయం మీద రాసిన తొలి ఇంగ్లీష్ నవలగా  'ది ఎక్స్ -రే మాన్'  రాసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు . ఇప్పటివరకు 'విష్ణు' లాంటి 12 సినిమాలకు కథా మాటలు రాసిన మోహన రావు దురికి ఓ తెలుగు వాడి సత్తాను అంతర్జాతీయంగా  చాటేలా మనం  ఓటు వేసి గెలిపిద్దాం.

న్యాయంగా పాలిస్తే బంగారంవాన :: డా. జి వి పూర్ణచందు

న్యాయంగా పాలిస్తే బంగారంవాన
డా. జి వి పూర్ణచందు
చతురంగ బలములు విజయవాడ దుర్గాంబ వరమున బడసి దుర్వార లీల
            జగతి స్థలంబెల్ల సాధించి జయ శాసనములు దిగ్ధంతి దంతముల సలిపి
పేదబాలునకు గా బ్రియసుత మోహంబు పట్టక బెజవాడ బాడి నిలిపి
కలయంగ బురమున గాంచన వర్షంబు గురియించి దేవతా కోటి పొగడ….”
ఇది దగ్గుపల్లి దుగ్గన రచించిన నాసికేతోపాఖ్యానము కావ్యంలో పద్యం ఇది. ఇందులో విజయవాడ విష్ణుకుండిన రాజు మాథవవర్మ గురించిన కథ మొత్తం నాలులైన్లలో చెప్పేశాడు కవి. నిజానికి  తలగడంత పుస్తకమే వ్రాయగల సమాచారం ఈ కథకు ఉన్నప్పటికీ దుగ్గన కవి `కట్టె కొట్టె, తెచ్చె, వదిలె అని రామాయణం చెప్పినట్టు నాలుగు వాక్యాల్లో ఈ కథను ఇమిడ్చి, ఈ పద్యం చెప్పాడు.
మాధవవర్మ విజయవాడ దుర్గాంబ దయతో చతురంగ బలాలూ సముపార్జించుకున్నాడు. అనేక ప్రాంతాలు జయించి జయ శాసనాలు నెలకొల్పాడు. ఒక పేదబాలుడు రధం కిందపడి చనిపోతే అతని చావుకు కారకుడైన తన కొడుకుని, పుత్ర వాత్సల్యం చూపించకుండా మరణ శిక్ష విధించి, బెజవాడ కీర్తిని చాటాడు. దాంతో దేవతాకోటి పొగిడి, నగరంలో బంగారంవాన కురిపించారు. ఇదీ ఆ నాలుగు మాటల కథ.
ఎవరీ మాథవవర్మ...? మన  విజయనగరం జిల్లా విజయనగరం సంస్థానాధీశులైన పూసపాటివారి తాత ముత్తాతల ముత్తాత తాత ఈ మాథవవర్మ. విష్ణు కుండినులు క్రీ. శ. 4 నుండి 7వ శతాబ్దివరకూ 23జిల్లాల ఆంధ్రప్రదేశ్‘ని పాలించిన ఘనులు. వాళ్ళకు ఆ రోజుల్లో చాలా రాజధాని నగరాలుండేవి. బెజవాడ వాళ్ల ప్రధాన రాజధాని.
14-15 శతాబ్దాల వాడైన దుగ్గన కవి ఈ పద్యంలో విజయవాడ, బెజవాడ అని, రెండు పేర్లూ వాడాడు.  ఆ కాలంలో బందరు-మచిలీపట్టణం అన్నట్టు ఈ రెండు పేర్లూ పర్యాయాలుగా వాడుకలో ఉండి ఉంటాయి.
విష్ణుకుండినులు జైన బౌద్ధాలకు వ్యతిరేకంగా వైదిక ధర్మాలను, వైదిక దేవతలను, సంస్కృతభాషను బాగా ప్రోత్సహించి, ఉత్తరాది వారికి ఆశ్రయాన్ని కల్పించారు. ఆ ఉత్తరాదివాళ్ళు తెలుగు వాళ్లలో తెలుగువాళ్లుగా కలిసి పోయారు. కానీ, మన వాళ్ళు తాము తెలుగువాళ్ళం అన్న సంగతి మరిచిపోయి, సంస్కృత భాషకు దాసోzహం అన్నారు. ఇప్పుడు  ఇంగ్లీషు విషయంలో జరిగిందే అప్పట్లో సంస్కృతం విషయంలో జరిగింది. సంస్కృత మెకాలేలు తెలుగు పేరెత్తనీకుండా పాలించారు. మాతృభాషాభిమానం మన రక్తంలోంచి తపుకోవటానికి ఇది కూడా కారణమే!
ఏది ఏమైతేనేం క్రీ. శ. 4వ శతాబ్దికి చెందిన మాధవవర్మ గారు బెజవాడ ప్రశస్తిని నిలబెట్టారు. మాధవర్మని మెచ్చుకోవటం కోసం దుర్గమ్మ బంగరు వాన కురిపించి తాను‘ కనకదుర్గ’ అయ్యింది.
పాలకుడు న్యాయబద్ధంగా వ్యవహరించాలే గానీ, దుర్గమ్మ బెజవాడలోనే కాదు, పాలకుడి ఇంటి పెరట్లో కూడా కనక వర్షం కురిపిస్తుంది. బెజవాడలో తుఫానులు తప్ప మామూలు వానలు అరుదు.  వాన అనేది కురిసినా కురవకపోయినా బంగారు నాణాల వడగళ్ళు మాత్రం పడతాయని దుగ్గన కవి గారి నమ్మకం. అందుకే, తన కావ్యాన్ని అంకితం ఇచ్చుకునే సందర్భంలో బెజవాడ మాధవవర్మను తలచుకున్నాడు.
బండిని ఎవరు నడుపుతున్నా యాక్సిడెంట్ అయినప్పుడు, బండి యజమానే నష్టపరిహారం ఇచ్చుకోవాలనేది మాథవర్మ తీర్పు సారాంశం. సుప్రీంకోర్టు కూడా బండి యజమానిని బాధ్యుణ్ణి చేస్తూ  తీర్పు నిచ్చింది. అందుకే యజమాని ప్రతి ఏడాది థర్డ్‘ పార్టీ  ఇన్సూరెన్సు కడుతున్నాడు. మన బండి వెళ్ళి అవతలివాడిమీద పడనవసరం లేదు, అవతలివాడే వచ్చి మన బండిమీద పడి దెబ్బతిన్నా థర్ద్ పార్టీ ఇన్సూరెన్సు ఉపయోగపడుతోంది.
మన చరిత్ర కథల్లో నేటి కాలానికీ వర్తించేవి చాలా ఉన్నాయి. వాటిని ఆపాదించుకో గలగాలి అంతే!



Wednesday 21 October 2015

ఎండలో ’‘చల్ల’న డా. జి వి పూర్ణచందు

ఎండలో ’‘చల్ల’న


డా. జి వి పూర్ణచందు

శివరాత్రికి శివ శివా అని చలి వెళ్ళిపోతుంది. ఉగాది నాటికి భుగభుగ మండుతూ ఎండలొచ్చేస్తాయి. అసలే ఆంధ్రుల్లో వేడి శరీర తత్త్వం ఎక్కువ. అంతలోనే వేడెక్కే ఆరంభ శూరత్వం మనకి ఇందుకే! పైగా మనది వేడి వాతావరణం! అది చాల దన్నట్టు, వేసవి ఎండల్లో కొత్తావకాయ పెట్టుకుని ప్రతిరోజూ రుచి చూసుకోవటంతోనే వేసవి సరిపోతుంది. ఇంతింత వేడిని తట్టుకోలేనంటూ శరీరం ‘వేడుకో్లు’ చేసుకోవటమే ‘వడదెబ్బ’ అంటే! ‘వడ’ని లేదా వేడిని తగ్గించే బ్రహ్మాస్త్రమే చల్ల(చల్ల)! అమ్మకడుపు ‘చల్ల’గా, అయ్య కడుపు చల్లగా, అందరి కడుపూ చల్లగా చేసేది చల్ల! వేసవిలో ‘చల్ల’గా జీవించాలంటుంది చల్ల!

తెలుగులో చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. మూలద్రావిడ పద౦ ‘సల్’ లోంచి వచ్చిన చల్ల(Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) ఇలా వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి.

భారత దేశంలో ‘చల్ల’ని తెలుగువారే ఎక్కువగా వాడుతారు. తెలుగు కృష్ణుడు చల్లలమ్మ బోయే భామల్నే అడ్డగించినట్టు తెలుగు కవులు వ్రాశారు. అతిథులకు కాఫీ టీలు ఇస్తున్నాం గానీ పూర్వం రోజుల్లో గ్లాసు చల్లఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో చలివేంద్రాలంటే ‘చల్ల’ కుండలు ఉండేవి!చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర... ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి చల్ల అ౦ది౦చే ప౦దిరి అనే అర్థం. ఓ గ్లాసు చల్ల ఇచ్చి, ‘కాస్త దాహం పుచ్చుకోండి’ అనేవాళ్ళు.

చలవ నిచ్చేది చల్ల

మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు, చల్ల దొరికే అవకాశల్లేవు. కాబట్టి,కైలాసవాసి శివుడికి, చల్ల తాగే అలవాటు లేకుండా పోయింది. అందుకని ఆయన నీలకంఠుడయ్యాడు. ఇంక, పాలసముద్రం మీద ఉండే విష్ణు మూర్తికి చల్ల దుర్లభం. కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో ‘సుర’ తప్ప చల్ల దొరక్కపోవటంతో ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. చల్ల పుచ్చుకునే అలవాటే ఉంటే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ వచ్చేవే కాదు…అని ‘యోగరత్నాకరం’ వైద్యగ్ర౦థ౦లో ఓ చమత్కారం కనిపిస్తుంది. చల్ల తాగేవాడికి ఏ జబ్బులూ రావనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి రాకు౦డా వు౦టాయనీ, విషదోషాలు, దుర్బలత్వ౦, చర్మరోగాలు, క్షయ, స్థూలకాయం, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి రంగు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ చల్లనీ భగవ౦తుడు సృష్టి౦చాడట! వేసవిలో ‘చల్ల’బడాలంటే చల్ల తాగాలి!

“తక్ర౦ త్రిదోష శమన౦ రుచి దీపనీయ౦” అని ఆయుర్వేద సూత్ర౦. అన్నివ్యాధులకూ కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలు మూడి౦టినీ ఉపశమి౦పచేసే గుణ౦ చల్లకు౦ది. అన్న హితవును కలిగిస్తు౦ది. ఆకలిని పుట్టిస్తు౦ది. తీసుకున్న ఆహార౦ సక్రమ౦గా అరిగేలా చేస్తు౦ది.శరీరానికి సుఖాన్నీ, మనసుకు స౦తృప్తినీ కలిగిస్తుందని చిలికిన చల్ల గురించి శాస్త్రం చెప్తోంది. ఆధునిక తెలుగు కుటుంబాల్లో చల్ల తాగే అలవాటు తగ్గుతూ వస్తోంది. చిలకటాన్ని మానేసి, చల్లకవ్వాలు పారేసి ఫ్రిజ్జులోంచే నేరుగా పెరుగు వేసుకుని తినే అలవాటు ఎక్కువయ్యింది. ఇలా తినటమే షుగరు వ్యాధికి కారణం అవుతోంది!

చల్లకవ్వ౦, చల్లబుడ్డి(చల్ల గిన్నె), చల్లపులుసు, చల్లచారు, పెరుగుపచ్చడిలాంటివి ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి. పాలలో నాలుగు చల్ల చుక్కలు కలపటం వలన తోడుకుని పెరుగు అవుతోంది. పాలలో ఉన్న పోషకాలన్నీ పెరుగులో ఉంటాయి. అదనంగా మన శరీరానికి లాక్టోబాసిల్లై అనే “ఉపయోగపడే బాక్టీరియా” కూడా చేరుతుంది. ఈ పెరుగుని చిలికితేతేలికగా అరిగే స్వభావం(లఘుత్వం) వస్తుంది. అందుకని, పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా చల్ల ఉత్తమోత్తమ౦గా ఉంటాయి.
వెన్న తీసిన చల్లకు రుచి, లఘుత్వ౦, అగ్ని దీపన౦, శ్రమహరత్వ౦ లా౦టి గుణాలు ఉ౦టాయి.చల్ల తాగితే ఎ౦తటి శ్రమనైనా తట్టుకునే శక్తి కలుగుతు౦ది. వడదెబ్బను తట్టుకోవటానికి చల్లని మి౦చిన ఔషధ౦ లేదు. చల్లతాగితే, కడుపులో ఆమ్లాలు పలచబడి, కడుపులో మ౦ట, గ్యాసు, ఉబ్బర౦, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్ధత, పేగులకు స౦బ౦ధి౦చిన వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఆపరేషన్లు అయిన వాళ్లకీ, మానని వ్రణాలతో బాధపడేవాళ్ళకీ చీము పోస్తుందనే అపోహతో ‘చల్ల’ ఇవ్వకుండా ఆపకండి! పుండు త్వరగా మానుపడాలంటే చల్ల తాగాలి!
ప్రొద్దున్నే చల్దన్నం
చల్ల కలిపిన అన్నాన్ని చల్ది అన్నం, చల్దన్నం, చద్దన్నం అంటారు. ప్రొద్దున్నే చద్దన్నం తినటమే భోగం. టిఫిన్లను తినేవారికి రోగం ఎక్కువ, భోగ౦ తక్కువ.పిల్లలకు చద్ది పెట్టట౦ మానేసి టిఫిన్లు అలవాటు చేశాకవాళ్ళు బల౦గా ఎదుగుతున్నా రనుకోవటమే ఒక భ్రమ! నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తింటారని చిన్నచూపు ఉంది. తెలుగు నిఘ౦టువుల్లో కూడా చద్దన్నం అంటే పర్యుషితాన్న౦ (stale food- పాచిన అన్న౦) అనే అర్థమే ఇచ్చాయి.ఇది చాలా అపకారం చేసింది. 

బాలగోపాలుడి చుట్టూ పద్మంలో రేకుల్లాగా కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని పోతన గారు వర్ణి౦చాడు. ఆ చద్దన్నం “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత మొనయ నునిచి/చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలువ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి” ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వ్రేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవించిన చల్ది ముద్దలో నంజుకొ౦టూ తిన్నారట! చద్దన్నం అంటే ఇది! మన ముంగిటముత్యాలకు పోతన మహాకవి చెప్పిన చల్లన్నం లేదా పెరుగన్నం పెట్టి పెంచండి. దేశానికి ఉపయోగ పడేవాళ్ళౌతారు.

గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన అంటే వేడి అన్నంలో చిక్కని చల్ల లేదా పెరుగుకలిపిన న్నాన్ని నైవేద్యం పెట్టే అలవాటు మనకుంది. గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. దధ్యోదన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేస్తారు. చద్దన్నంలో ఇవేవీ ఉండవు. ఇదీ ఈ రెండింటికీ తేడా!

“అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా...?” అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకొస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦! ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. ఆధునికంగా చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు వచ్చి చేరాయి.

చల్ల అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గించేదిగా ఉ౦టుంది. బలకర౦. రక్తాన్ని, జీర్ణశక్తినీ పె౦చుతు౦ది! బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని మూడు రకాలుగా చేసుకోవచ్చు.

1. అప్పుడు వ౦డిన అన్న౦లో చల్ల పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ చల్లలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు చల్ల చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టి, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకోవచ్చు. వీటిలోచల్లలో నానబెట్టింది తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అన్న౦లో చల్ల కలుపుకోవటం కన్నా రాత్ర౦తా చల్లలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువ! బక్క చిక్కి పోతున్నవారికి తోడన్నాన్ని . స్థూలకాయులకు చల్లలో నానిన అన్నాన్ని పెట్టడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦ లేదు.శొ౦ఠి,
ధనియాలూ, జీలకర్ర ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలిపిన పొడిని ఈ తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి. తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

వేసవి పానీయం‘రసాల”

శ్రీరాముడు అతిథిగా వచ్చాడని భరద్వాజ మహర్షి ఇచ్చిన వి౦దులొ ఈ రసాల అనే పానీయం ఉందిట. వెల్‘కం డ్రింక్ లాంటిదన్నమాట!అరణ్యవాస౦లో ఉన్నరోజుల్లో, పా౦డవుల దగ్గరకి ఒకసారి కృష్ణుడు వచ్చాడు ఎండనపడి వచ్చాడని భీముడు స్వయ౦గా ఈ పానీయం తయారు చేసి ఇచ్చాడట! ఇది దప్పికని పోగొట్టి వడ దెబ్బ తగలకు౦డా చేస్తు౦ది.
భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:

బాగా కడిగిన ఒక చిన్న ము౦త తీసుకోండి. ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరలు వేసి దాని మూతికి వాసెన కట్ట౦డి. పలుచని పెరుగులో సగభాగం ప౦చదార కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వ౦తో బాగా చిలికి ఆ వాసెన మీద పోయండి. మిశ్రమంలో ఉన్న నీరంతా కుండలోకి దిగుతుంది. ఈ పెరుగు నీటిని ‘ద్రప్య౦’ అ౦టారు. ఈ ‘ద్రప్య౦’ ని౦డా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి. ఈ నీటితోనే రసాల పానీయం తయారు చేస్తారు

ఈ ‘ద్రప్యా’నికి రెట్టి౦పు కొలతలో కాచిన పాలు కలిపి, చల్లకవ్వ౦తో బాగా చిలకండి.మిరియాల పొడి, ఏలకుల పొడి, లవ౦గాల పొడితగుపాళ్లలో కలప౦డి. కొద్దిగా పచ్చకర్పూర౦ కూడా కలపవచ్చు. ఇది చాలా కమ్మగా ఉండేపానీయం. దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.

రసాల పానీయం

వడదెబ్బ తగలనీయకుండా శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది.అమీబియాసిస్ వ్యాధి, పేగుపూత, రక్త విరేచనాలు, కలరా వ్యాధులున్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. పెరుగు మీద తేటకువినికిడి శక్తి పెంచే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్రం. చెవిలో హోరు(టినిటస్), తలతిరుగుడు (వెర్టిగో) లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦గా పని చేస్తు౦దన్నమాట.

“కూర్చిక”

రసాల లాంటిదే ఇంకో పానీయం కూర్చిక. ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని పెరుగు కలిపి బాగా చిలికిన పానీయాన్ని ‘కూర్చిక’ అ౦టారు. ఒక గ్లాసు ‘కూర్చిక’ పానీయంలో ‘ధనియాలు, జీలకర్ర, శొ౦ఠి
పొడి’ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడ దెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది
మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

తేమన౦ అనే చల్లపులుసు.

తేమన౦ అనేది శ్రీనాథుడి కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని తీపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేస్తుంటారు.చల్లలో పాలు, బెల్ల౦ తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తీపి పానీయ౦ తయారౌతు౦ది. ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తి నిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది. 

ఇ౦క కార౦ చల్లపులుసు గురి౦చి మనకు తెలిసినదే! పులవని చిక్కని చల్ల తీసుకో౦డి. వెన్న తీసిన చల్ల అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. అల్ల౦, మిర్చి, కొత్తిమీర, ఇతర స౦బారాలు ఇందులో వేసి కాచిన చల్లపులుసు బాగా చలవ చేస్తు౦ది. వేసవి కోస౦ తరచూవ౦డుకొవాల్సిన వ౦టక౦ ఇది.

బియ్యప్పి౦డి, అల్ల౦ తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి ఈ చల్ల పులుసు(మోరు లేదా మోరు కొళాంబు)లో వేసి వండే అలవాటు కొన్ని కుటుంబాల్లో ఆచారం ఉంది. ఉత్తర రామచరిత౦లో “గారెలు బూరెలు చారులు మోరెలు” ప్రయోగాన్ని బట్టి, ఈ ఉ౦డల్ని ‘నోరులు’ లేదా ‘మోరు౦డలు’ అని పిలిచేవారనుకుంటాను. మోరుండల్ని వీటిని ఆవడల్లాగా కప్పులో పెట్టుకుని తినవచ్చు. పర్షియన్లు Cacık అనే వంటకాన్ని చేసుకుంటారు. ఇది కూడా చల్ల పులుసులాంటిదే! వెల్లుల్లి మషాలాలు చేర్చి దీంతో రొట్టెలు న౦జుకొ౦టారు.
మె౦తి చల్ల, మె౦తులు తేలికగానూరి చిక్కని పులవని చల్లలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని మె౦తి చల్ల అ౦టారు. చల్ల చారు అని కూడ పిలుస్తారు. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! మామూలు చల్లకన్నా అనునిత్య౦ చల్లచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది.

తీపి లస్సీ

చల్లలో ప౦చదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. వేసవికాల౦లో నిమ్మరస౦, జీలకర్ర పొడి, ఉప్పు, ప౦చదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది. తెలుగులో దీన్ని ‘సిగరి’ అ౦టారు. శిఖరిణి అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. చిక్కని చల్ల అయితే లస్సీ అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే ‘చాస్’ అనీ పిలుస్తారు. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్Cacık అనేది మన చల్ల పులుసు లా౦టిదే!

చల్లమీద తేట

చల్లమీద తేటకు చల్లతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన చల్లని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తౌలవరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా వు౦చ౦డి. చల్లమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. చల్ల తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి చల్లనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ చల్ల నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. చల్ల వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!

ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి: చక్కగా చిలికిన చల్ల ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక నిమ్మకాయ రస౦, తగిన౦త ఉప్పు, ప౦చదార, చిటికెడ౦త తినేషోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కో సారి త్రాగ౦డి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడ కొట్టదు.

Tuesday 20 October 2015

అధికార మదం :: డా. జి వి పూర్ణచందు

అధికార మదం

డా. జి వి పూర్ణచందు


“అభ్రమండలి మోచునందాక నూరక/పెరిగినట్లౌ మేను నరవరేణ్య
యవధి భూధర సానువందాక నూరక/పరచినట్లౌ మేను పార్థివేంద్ర
యబ్జ భూభువనంబునందాక నూరక యెగసినట్లౌ మేను జగధీశ
యహిలోకతల మంటు నందాక నూరక/పడినయట్లౌ మేను ప్రభువతంస
యఖిల జగములు మ్రింగునంతాకలియును
నబ్దులేడును జెడగ్రోలు నంత తృషయు
నచల చాలన చణమైన యదట గలిగె
నసురభావంబు నను జెందు నవసరమున”
ఆల్కాహాల్ సేవించిన వాడిలో కలిగే లక్షణాన్ని ‘మదం’ అంటారు. మదం వలన చెలరేగి ప్రవర్తించటాన్ని ‘మదాత్యయం’ అంటారు. అప్పటిదాకా `ఏవండీ’ అన్నవాడు కాస్తా, రెండు చుక్కలు పడగానే ‘ఏరా’లోకి దిగిపోతాడు. “మదం ఎక్కిందా?’’ అని పెద్దలు కేకలేస్తున్నారంటే, అది తెనాలి రామకృష్ణుడు “కల్లు జవి గొన్నావా? లం…” అని తిట్టిన తిట్టు లాంటి దన్నమాట.
మద్యం చవిగొన్నాక, మదం ఎక్కగానే కొన్ని లక్షణాలు పేట్రేగుతాయి. తనను తాను ఆకాశం దాకా పెరిగిపోయి దాన్ని ఆక్రమించాననుకుంటాడు. భూమికి ఆ అంచునుంచీ ఈ అంచుదాకా అదంతా తనదే ననుకుంటాడు. కింద పాతాళం కూడా తన ఆధీనం లోనే నంటాడు. అన్ని లోకాల్నీ కబళించేయాలన్నంత ఆకలి, సప్త సముద్రాలనూ తాగేయాలన్నంత దాహమూ కలిగి, ఇంకా ఇంకా మదిర సేవిస్తుంటాడు.
ఇలా లోకాల్ని కబళించే తియ్యటి కలలు కనటాన్ని పామర భాషలో కిక్కు అనీ, పండిత భాషలో ‘మదం’ అనీ అంటారు. తను తలుచుకుంటే ఈ కొండని ఒక్క తన్ను తన్ని సినిమాలో లాగా అవతలికి విసిరి కొట్ట గలననుకునే వింత తత్వమే మదం. వీళ్ళని ఏ మురుక్కాలువలోనో పడి ఉన్నాడని తెచ్చి తెలిసినవాళ్ళు అప్పచెప్తుంటారు. మదం తెచ్చి పెట్టే ప్రమోదమూ, ప్రమాదమూ ఇలా ఉంటాయి.
ఇలాంటి ‘మదం’ మందు కొట్టటం వలన మాత్రమే కలగాలని లేదు, అధికారమదం అంతకన్నా ఎక్కువ కిక్కు ఇస్తుంది. పదవిలోకి వచ్చీరావటమే, అధికారమదం తలకెక్కిపోతుంది. ‘ఐ. వీ. ఇంజెక్షను’లా వెంటనే మత్తెక్కటాన్ని ‘యోగవాహి గుణం’ అంటారు. అంతటి యోగవాహి గుణాన్ని తెచ్చిపెట్టే శక్తి లౌకిక వ్యవహారంలో ఒక్క ‘అధికార పదవి’కి మాత్రమే ఉంది. పదవి రాగానే పైన ఆకాశం దాకా, కింద పాతాళం దాకా, చుట్టూ ఆకొన నుండి ఈ కొన దాకా మొత్తం తన కబ్జా లోనే ఉండా లంటాడు. లోకాలన్నింటినీ కబళించేసి, సప్త సముద్రాల్ని తాగేస్తానంటాడు. లోకానికి హాని చెయ్య గలగా లంటే మనిషి లోపలికి ఓ రాక్షసుడు ప్రవేశించాలి. ఆ రాక్షసుడు అతన్ని ఆక్రమించి నప్పుడు అతనిలో కలిగే ఇలాంటి లక్షణాల్నే మదం అంటారు.
పైన చెప్పిన పద్యం అల్లసాని పెద్దనగారి ‘మనుచరిత్ర’ లోది. తనకు వైద్యం నేర్పటానికి బ్రహ్మదత్తుడనే ముని ఒప్పుకో లేదని, ఇందీవరాక్షుడు ఆయన వైద్య పాఠాలు రహస్యంగా విని వైద్యం నేర్చేసుకుని, తిరిగి ఆ ముని దగ్గరకే వెళ్ళి వెక్కిరిస్తాడు. ఒళ్ళు మదం ఎక్కటం అంటే ఇదే! దాంతో ముని ఇందీవరాక్షుణ్ణి రాక్షసుడివి అయిపొమ్మని శపించాడు. ఆ క్షణంలో అతన్ని ఒక రాక్షసుడెవరో ఆవహించినట్టు తాను భూమ్యాకాశ పాతాళాల దాకా పెరిగిపోయిన భావన పొందినట్టు, లోకాల్ని కబళిస్తు న్నట్టు, సముద్రాల్ని తాగేస్తున్నట్టు అన్పించిందని, ఈ పద్యంలో ఇందీవరాక్షుడు స్వారోచిషుడికి చెప్పటం కనిపిస్తుంది.
ప్రతి మనిషిలోనూ ఒక సైతాన్ ఉంటాడు. మనసులోని సత్వగుణం ఈ సైతాన్ని అణచి ఉంచాలని చూస్తుంది. సత్వం గెలిస్తే మనిషి మానవుడు అవుతాడు. సైతాన్ గెలిస్తే మనిషి పొలిటీషియనో, మాఫియానో అవుతాడని నేటి జనవాక్యం. ఇది ఎవరో పుణ్యాత్ముడు వచ్చి ఇచ్చే శాపం వలన మాత్రమే జరగాల్సిన అవసరం లేదు. మనిషి మనసులో సాత్వికాంశ పలచ బడ్తున్న కొద్దీ సైతాను తనకు తానుగా విజృంభిస్తుంటాడు. “నాది దుందుడుకు స్వభావం. కోపం వస్తే అలాగే ప్రవర్తిస్తాను. అందుకే నా మీద వందలాది కేసులున్నాయి. కొట్టానంటే అందులో తప్పేముందీ…నా స్వభావమే అంత” అని ఒక నేత బహిరంగంగా పత్రికల్లో అన్నాడంటే, పాపాలకు శాపాలు కారణం కాదనీ, అవి భస్మాసుర వరాలేననీ అర్ధం అవుతుంది.
వెనకటికి ఒక బామ్మగారు “నీ ఇంట కోడి కాల్చా” అని శపిస్తే, శుభం అన్నాడట పక్కింటాయన రొట్టలేస్తూ! ఈ రోజుల్లో బ్రహ్మదత్తుడి లాంటి పుణ్యాత్ముడు వచ్చి దుర్మార్గం చేసిన వాణ్ణి ‘బ్రహ్మ రాక్షసుడివైపో’ అని శపిస్తే, వెంటనే సదరు దుర్మార్గుల వారు ముని గారికి ఆజన్మాంతం ఋణపడి ఉంటా నంటాడు. కలకాలం తననిలా రాక్షసుడిలానే ఉండనివ్వాలని కోరుకుంటాడు.
‘Drive the Devi out-నీలో సైతాన్ తరిమేయ్’ అనేది పాత సిద్ధాంతం. “Keep the Devil in-నీలో సైతాన్ని దాచేయ్-దోచేయ్” అనేది నేటి మేటి సిద్ధాంతం.

Monday 12 October 2015

కస్తూరి రంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు అల్లూరి వేంకటాద్రిస్వామి:: డా. జి. వి. పూర్ణచందు

కస్తూరి రంగని తెలుగింట  నిలిపిన వాగ్గేయకారుడు

అల్లూరి వేంకటాద్రిస్వామి


డా. జి. వి. పూర్ణచందు
     
అమరము నాంధ్రము కావ్యముఅంటూ, ఆంధ్ర భాష కూడా దేవభాషేనన్న వాగ్గేయకారుడు శ్రీమాన్ అల్లూరు వేంకటాద్రిస్వామి- తిరువరసుగానూ, శ్రీమత్ పరమహంస తిరువేంగడ రామానుజ జియరుగానూ వైష్ణవ భక్తకోటిలో ప్రసిద్ధుడు. హరికథాగానానికి విశిష్టత తెచ్చినవాడు. భద్రాచల రామదాసు పరంపరకు చెందిన కవి ఆయన. 

యేమయ్యా రామయ్యాఅని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిలా సంభావించిన వాడాయన. శ్రీరంగం రంగనాథస్వామిని కస్తూరి రంగయ్యగా తెలుగింట నిలిపాడు. కస్తూరిరంగయ్య, కరుణి0పవయ్య, సుస్థిరముగ నమ్మితి నయ్యఅనే హరికీర్తన వీరిదే! 

పరాకు సేయుట, పాడిగాదురా పరమపురుష వరదాపాట హరిదాసుల నోట వినిపిస్తూనే అంటు0ది. 

బిరాన బ్రోవక నిరాకరించుట బిరుదు నీకు దగురా-వరదాఅని ప్రశ్నిస్తాడు ప్రభువును. 
  
వేంకటాద్రి  స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు సిద్ధాంతం నంబి, ఆ నంబి గారి శిష్యుడు బుక్కపట్టణం తిరువేంగడదాసు...ఇలా వీరి శిష్యపరంపర తమిళనాట కొనసాగుతోంది. పెరంబూరులో అల్లూరి వెంకటాద్రి స్వామి భక్తజనసభపనిచేస్తోంది. శ్రీమాన్ అల్లూరి వెంకటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి సంఘంశ్రీరంగంలో ఏటా వెంకటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది. 

1955లో గానకళాప్రపూర్ణ  శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్ పాడిన వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదు కేంద్రాల నుంచి  భక్తి రంజని రేడియో కార్యక్రమంలో ప్రసారం అయ్యేవి. విజయవాడ రేడియో కేంద్రంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినపాటల  సి డి దొరుకుతోంది. 

 క్రీస్తు శకం 1807లో అక్షయనామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సోమవారాన ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజాం రాజ్యంలోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహారంలో ఈయన జన్మించారు. శ్రీవత్స గోత్రీకుడు. తండ్రి వేంకయ, తల్లి వేంకమ. ప్రక్కనే ఉన్న జుజ్జూరు గ్రామం లోని నృసింహ దేవాలయంలో ఈయన తపోదీక్షలో ఉండేవాడు. భద్రాచలం నుంచి తిరిగి వస్తూ దారిలో ఆగిన తూము నరసింహ దాసు ఈయనకు తన తంబురా, గజ్జెలు, కరతాళాలు మెచ్చిఇచ్చి ఆశీర్వదించాడు. 

ఈ సంఘటన తరువాత వెంకటాద్రి స్వామి పరమ వైష్ణవుడిగా మారిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళి, అక్కడి నుంచి భక్తజనంతో కలిసి కంచి చేరి అక్కడే స్థిరపడిపోయాడు. 

ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా కంచికే చేరేవి.

 ‘శ్రీ వేంకటాద్రిస్వామి హరినామ కీర్తనలుపేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తకం వెలువడింది. 170కి పైగా కీర్తనలు ఇందులో ఉన్నాయి. అందులో ఆయన జీవిత చరిత్ర కూడా సంక్షిప్తంగా ఉంది. 1972లో ఆర్ వెంకటేశ్వర్ సంకలనం చేసిన శ్రీ వేంకటాద్రిస్వామి కీర్తనలుపుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం 2009లో డిజిటలైజ్ చేసి  ఇంటర్నెట్ ఓపెన్ లైబ్రరిలో (ఓఎల్.5402127M) ఉంచింది. 1930 లలో ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా తమిళంలో వెలువడింది. 

శ్రీ పి సాంబమూర్తి సౌత్ ఇండియన్ మ్యూజిక్పరిశోథనాగ్రంథంలో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువందల సంవత్సరాల జ్ఞాపక సంచికలో ఈయన నివాసం ట్రిప్లికేన్ అని అంది. 

ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ఆంధ్రయోగులుగ్రంథంలో ప్రచురించిన వ్యాసంలో వేంకటాద్రిస్వామికి పాము పడగ పట్టటం, సీతారాములు కలలో కనిపించటం లాంటి కథలున్నాయి, కృష్ణాజిల్లా జుజ్జూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈయన బాల్యం అంతా గడిచినట్టు కనిపిస్తుంది. 

జుజ్జూరులో కొండపైన విగ్రహం స్వయంభువుకాగా, దానికి కొంచెం దిగువున యోగానంద నరసింహస్వామి గుడి అంది. 14-07-1818న పదేళ్ళ వయసులో ఉన్న వేంకటాద్రి స్వామికి తూము నరసింహదాసు తన తంబురా, కరతాళాలు అందించాడు. ఈ తాళాలు, తంబూర...  చెన్నై ముత్యాలపేట గజేంద్రవరద మందిరంలో భద్రంగా ఉన్నాయని రామరాజుగారు పేర్కొన్నారు. 

29-1-1820 న తన 13 వ ఏట ఎవ్వరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళపాటు అక్కడ రామనామ సంకీర్తన చేస్తూ, తూము వారిచ్చిన తంబురా, కరతాళాలకు అదనంగా కాళ్ళకు గజ్జెలు కట్టి ఆడి పాడటం అలవాటు చేసుకొన్నాడు. 

తంబురు తాళము చేత ధరియించి వేడుక మీఱ గంభీరముగా కాళ్ళగజ్జలు ఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జె0దుచుఅంటూ తన హరికథాగాన విధానం గురించి చెప్పుకున్నాడు. 

 వరదరాజ స్వామి పుష్ప కై0కర్యానికి పూలతోట పెంచటం కోసం తన ఆటని, పాటని ఉపయోగించుకొని డబ్బు సంపాదించటానికి వీధులలో బిచ్చమెత్తడంతో కంచిలో ఆయన జీవితం ప్రారంభమయ్యింది. ఇది 1828 నాటి సంగతి. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్ళు! 

పది రూపాయలైనా కళ్ళచూడనిదే భోజనం చేయకూడదనే నియమం పెట్టు కొన్నాడు. కంచిలో ఇంటింటికి తిరిగి తాను రచించిన కృతులు పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ ప్రాచుర్యాన్ని పొందాడు. 

దేశ సంచారం ప్రారంభించి, అనేక వేల రూపాయలు భగవంతుని పేర సేకరించి కాంచీపురంలో దేవీ దేవులకు రెండు పుష్పవనాలు, శ్రీచందనం, శయ్యాగృహంలో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియం మొదలయిన కైంకర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మంటపాన్నీ, ఇంకా కంచి నగరంలో వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేయించాడు. మహాబలిపురం లోని గుడిని కూడా బాగుచేయించాడు.

ఆరాధనాది కార్యక్రమాల కోసం, రూ. 5,000 పెట్టి మామండూరిలో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పించాడు. కంచి వరదరాజ స్వామి కోసం రత్నాలు పొదిగిన వైరముడిని చేయించి, గరుడోత్సవ సమయంలో అలంకరించే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయించాడు. 

శ్రీరంగం రంగనాథ స్వామి పాండియకుండె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయించమని కలలో చెప్పగా, నిద్ర లేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బంగారాన్ని, రత్నాలనూ సేకరించటంలో పడ్డాడు.  మరకతం ఒక్కటీ దొరకక చింతాక్రాంతుడై ఉంటే మళ్ళీ స్వామి కలలో కనిపించి, బంగ్లాదేశంలో మాధవదాసు అనే ఆయన ఇంట మరకతం తన కోసమే అందనటంతో మాధవదాసుని కలుసుకొని మరకతం తెచ్చి కిరీటం పూర్తి చేయించాడు. రంగనాథుడికి రెండు కిరీటాలు, ఒక మకరకంఠి కూడా చేయించాడు. తిరుప్పళాతురై ఊరుని కొని, దానిని స్వామివారికి నిత్య నైవేద్యాలకోసం సమర్పించాడు. 

ఆముక్తమాల్యద కావ్యంలొ ప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవికి అలంకరించే కిరీటం అమ్మవారి కోరిక మీద వీరు చేయించినదేనట! మాన్య మిత్రులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళినప్పుడు, అల్లూరి వారు చేయించిన అమ్మవారి వైరముడి కిరీటం చూపించమని అడిగితే పురోహితులు అమ్మవారికి అలంకరించినది అదేనని చెప్పారు. 

మదురై దగ్గర తిరుమాలిరుంశోలైఅనే గ్రామంలో సుందరరాజ స్వామిగుడి విమానాన్ని ఆ స్వామి కోరికమీద నిర్మింప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తోంది. 

బహుశా ఒక సంస్థానాధీశుని యావదాస్తీ చాలనంత పెద్ద మొత్తాన్ని వైష్ణవ దేవాలయాల కోసం ఖర్చుచేశాడు. వీరి శిష్యుడు అన్నలూరి నారాయణదాసు రత్నఖచిత మకుటాది విభూషణ రంగనాథ కైంకర్య ధురీణఅని గురువుని  కీర్తించాడు. ఒక అతిసామాన్యుడు తన నిజాయితీతో ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించ గలడని నిరూపించ గలిగాడు వేంకటాద్రిస్వామి. ప్రజల డబ్బుకు జవాబుదారీ (accountability)గా ఆయన వ్యవహరించ గలగటం వలనే ఈ విజయాలు సాధ్యం అయినాయి. నిజానికి  భద్రాచల రామదాసు, తూము నరసింహదాసుల అనుభవాలలోంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్త పడ్డాడు. 

 ఆచార్య బిరుదురాజు వారు వేంకటాద్రిస్వామి గురించి ఒక మహిమను చెప్పారు. ఒక రోజు కేవలం 5 రూపాయలే వచ్చిందని భోజనం చెయకుండా ఉండిపోతే, అప్పస్వామిరాజు అనే ఆంతరంగికుడు గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి ఇంకొక ఐదు రూపాయలు సంపాదించాక స్వామిని  ఇంటి దగ్గర దిగవిడిచి అప్పస్వామిరాజు వెళ్ళిపోయాడట. ఆ సాయంకాలం అప్పస్వామి రాజు గారింట్లో భజన కోసం వెంకటాద్రి స్వామి వేడితే అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు మంచాన ఉన్నాడని తెలిసింది. మరి ఆ వేంకటాద్రి స్వామికి గొడుగు పట్టిందెవరు... ? ఊరంతా చూసిన దృశ్యం కదా అది? పెరుమాళ్ళే స్వయంగా గొడుగు పట్టాడని ప్రజల నమ్మకం.               
                                                                          
ఆయన సంపాదించిన ధనం అంతా ఇలా యాచనద్వారానే అయినా ధనమదాంధుల ద్వారము దూరక కడు ధన్యుడనై నే నుండెదనుఅనటంలోని లోతైన భావాన్ని అర్థం చేసుకో గలగాలి.

 “జాలిజెంది జనుల-బేలనైయాచించి, చాల నలసి సొలసితి-నీవేగతిఅని చెప్పుకుంటాడు. కాసు చేయని ఖలులకెల్ల, దోసిలొగ్గి వేసారితినంటాడు. 

కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను/అచ్యుతుని దాస్యసుఖమనుభవించెదనుఅని ప్రకటించుకున్నాడు.       

తన జీవిత చరమాంకంలో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన తంబూర, గజ్జెలు, కరతాళాలు బహూకరించి తన కృషిని కొనసాగించవలసిందిగా కొరాడట . శ్రీ రంగనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసించి, తిరువేంగడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొందారు. కొళ్ళడం గట్టున శ్రీ అళవందార్ పడుత్తురై’  అనే సన్నిథి స్థలంలో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగింది. 

శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి కీర్తనలు పేరుతో ఆయన శిష్యపరంపరకు చెందిన శ్రీ పుష్పాలరామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో వావిళ్ళవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని కందపద్యాలు కూడా ఉన్నాయి. అందులో వేంకటాద్రిస్వామి రేఖా చిత్రం కూడా అంది. శ్రీమదాంధ్ర భక్త విజయము అనే గ్రంథంలో వేంకటాద్రిస్వామి జీవిత చరిత్ర కుంత అంది. వావిళ్ళ  ప్రతికి అదనంగా ఆయన ప్రదర్శించిన కొన్ని మహిమలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఆయనే పంపించారు. ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఒంగోలు దగ్గర నూనెవారి పాలెంలో గుడికి రథం చేయించటం కోసం ఇనుప ఊచలు, కర్ర దుంగలను  ఖరీదు చేసి, మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషనుకు స్వయంగా ఆయనే తెచ్చారట. కానీ, సమయం లేదని దుంగలు ఎక్కించుకోకుండానే రైలు బయలు దేరితే, వేంకటాద్రిస్వామి ఎలా వెళ్ళగలవన్నట్టు చూశారని, రైలు అకారణంగా ఆగిపోయి, దుంగలన్నీ ఎక్కించుకౌన్నాకే కదిలిందనీ, కానీ, ఆలశ్యం కాకుండా, సరిగ్గా సమయానికే గమ్యస్థానానికి చేరిందని ఒక కథ ఇందులో అంది..
      
ఇంచుకైన దయరాద-యిభరాజవరద’, 

సజల జలదగాత్రా-సరసిజ నేత్రా-నిజమని నీపదభజన జేసెదు వరద’, 

ఇంత పంత మేల నాతో నిందిరా రమణా’, 

నామస్మరణ సేయుడీ జనులార-హరినామ స్మరణఇలాంటి వీరి కీర్తనలు చదువుకోవటానిక్కూడా మనోహరంగా ఉన్నాయి. 

దుద్దుపెట్టి నీవు దూరాన యుండక పద్దులీడేర్చు నీపాల బడితినిక’ ‘ముద్దుపదములందు మువ్వలు గదలగలాంటి చరణాలు ఆయన సాహితీ వైదుష్యాన్ని తెలియచేస్తాయి.

 ‘ధనమదాంధుల చేరువ జేరక కడు ధన్యుడ నయ్యేదెన్నటికో....లాంటి పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కొసం ఆయన ఎన్ని అవమానాలు భరించి ఉంటాడో ననిపిస్తుంది. 

ఇంచుకైన యాది లేదా?’అనే ప్రయోగాన్ని 150 ఏళ్ళక్రితం తమిళ దేశంలోనే జీవితం అంతా గడిపిన వ్యక్తి చేయటం విశేషమే! 

నె0జిలిపడనేల, నిరతము శ్రీపతి మంజులమగు దివ్య మంత్రరాజముగల్గఅనే అనుపల్లవిలో నె0జిలిఅంటే ఆందోళన. నీల జీమూతవర్ణ0 అనేది రంగుల్లొ తేడాలను గుర్తించటానికి ఉపయోగపడే ప్రయోగం.  

గట్టి మనసు’ ‘మోడిచేయటం’, ‘వలరాజుకాకలాంటి చక్కనితెలుగు పదప్రయోగాలు ఈయన కీర్తనల్లో కనిపిస్తాయి. 

చందురుగేరుమోమందముతో నీ మందహాసము గనుగొందు రారా” “దండిపాతకముల నెల్ల మె0డుగాను జేసినట్టి దుండగీడనైన నా నెండ యెవరు లెరు తండ్రి” 

నీకే మరులుకుంటిరా నిగమగోచరా” 

ఘోర భవా0బుధి గొబ్బున దాటెడు నెరుపు గని మనవే ఓ మనసా!” “రంగుగ దాసుల రక్షించెడు శ్రీ రంగని మఱచిన దొ0గ జనములు” 

 “దుద్దుబెట్టి నీవు దూరాన యుండక పద్దులీడేర్చు నీ పాల బడితినిక” 

కుదురుగ గూర్చుండి-గోవింద యనగనే

  “ఒప్పులకుప్ప రారా, నే జెసిన తప్పులెన్నకు ధీరా”  

“పాంచాలి పరులచే బాధల బడగానె అంచితముగ నీ వక్షయమనలేద?"  

అంతరంగ భక్తమానసంతరంగమందు నేకాంతుడై యున్నవాడు-రంతులేలపోరే మీరు”  ఇలాంటి జాను తెనుగు పదాలు చదువుతుంటే మనసు పులకరిస్తుంది. 

అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న, యారగింతువు రంగ మెలుకోఅనే చరణంలో. ఆనబాలు అంటే, నీళ్ళు ఇగిరే0త  చిక్కగా కాచిన పాలు అని అర్థం. అవ్వ, చద్ది, రొట్టే అనేవి మూడు వేర్వేరు వంటకాలు. అవ్వ అంటే అవ్వం అనే ప్రసాదం. చద్ది అంటే చలిది అన్నం. తాలింపు పెట్టకుండా చల్ల కలిపిన అన్నం. రొట్టె అంటే పెద్ద పరిమాణంలో వేసిన దిబ్బరొట్టే లాంటి ప్రసాదం. ఈ మూడింటినీ కలిపి అవ్వచద్దిరొట్టెగా ఆయన వ్యవహరించి ఉండవచ్చు. 

భావకవులకు పదలాలిత్యం నేర్పిన కవి అల్లూరి వేంకటాద్రిస్వామి. ఆయనను కేవల మహా భక్తుడిగానే చూడటం వలన ఆయన సంగీత సాహిత్య జీవితాలు మరుగున పడిపోయాయి. 

ఆయన 1877 వరకూ జీవించే ఉన్నారు. అంతకు రెండుమూడేళ్ళ వరకూ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన్ని తెలుగు సాహితీ వేత్తలు అంత త్వరగా ఎలా మరిచిపోయారో ఆశ్చర్యమే! 

సంగీతవేత్తలు సరేసరి. అకాశవాణి, వావిళ్ళ వారు పూనుకొనక పోయి అంటే, అల్లూరి వారి కీర్తనలు, అన్నమయ్య కీర్తనల్లాగే అనేక శతాబ్దాలు మూలపడి ఉండేవి. అంతటి వాగ్గేయకారుని మరిచిపోగలగటం విశ్వా0తరాళ0లో ఒక్క తెలుగువారికే సాధ్యమని మరోసారి ఋజువయ్యింది.