చక్కెర ఉక్కెర
డా|| జి. వి. పూర్ణచందు
“ఓ
చిలుకరాజా-నీకుపెళ్లెపుడయ్యా _ ||
చక్కర ఉక్కెర పెడ్తా
నీకాలికి గజ్జలు కడ్తా
మెడలో మాలా వేస్తా
నీతో పాటే యెగిరొస్తా” || ఓ చిలుకరాజా ||
నాగయ్యగారు నటించిన పక్షిరాజావారి
బీదలపాట్లు (1950) సినిమాలో పాట ఇది. ఈ పాటలో లాగానే మన ప్రాచీన కవులూ
చక్కెర ఉక్కెరల్ని జంటపదాలుగానే ప్రయోగించారు.
ముద్దుపళని రాధికాస్వాంతనంలో చక్కెర, ఉక్కెరలను కలిపే చెప్పింది.
'చక్కెరలో, నిండువెన్నెలలో,
ఉక్కెరలో, యమృత ధారలో యివి యనగా' అంటూ తెనాలి అన్నయ్య సుదక్షిణా పరిణయం లో చక్కెరౌక్కెరల్ని జంటపదంగానే
ప్రయోగించాడు.
‘ఉక్కెఱకున్
బుఱుడలపై జక్కెరకున్, వడలపై నొసఁగు తేనెలకున్’ అంటూ కాళహస్తి సంస్థానాధీశుడు దామెరల వెంగళ
భూపాలుడు బహులాశ్వ చరిత్రలోనూ ‘చక్కెర
ఉక్కెర’ అనే వ్రాశారు.
దీన్నిబట్టి ఉక్కెర అనేది దీని అసలు
పేరన్మి, చక్కెర అనేది ఒక విశేషణం మాత్రమేనని భావించవచ్చు.
ఉక్కెర అంటే?
బియ్యప్పిండి, బెల్లం కలిపి తయరు చేసిన ఆహార పదార్దం అని సూర్యరాయాంధ్ర నిఘంటువు
పేర్కొంది.
చక్కెర కలిపి వేయించిన పిండి అని
శబ్దార్థచంద్రిక వ్రాసింది.
చక్కెర చేర్చి పొరటిన పిండి అని
ఆంధ్రవాచస్పత్యంలోవివరణ ఉంది.
‘పాలు కాగేప్పుడు, గోధుమ లేదా బియ్యప్పిండి కొద్దికొద్దిగా కలుపుతూ చక్కెర చేర్చి నెయ్యి
వేసినది’ అని వస్తుగుణమహోదధి ఉక్కెర గురించి వ్రాసింది.
దేహపుష్టిని బలాన్నీ, వీర్యవృద్దీనీ ఇస్తుందని, చక్కని ఆహార పదార్దం అనీ
ఆధునిక ఆయుర్వేద గ్రంథాలు పేర్కొన్నాయి. ఏ రెండు నిఘంటువులూ ఏకీభావంగా ఉక్కెర అంటే
ఏదో చెప్పలేదు.
ఉక్కబెట్టినది అంటే ఉడికించినది
కాబట్టి ఉక్కెర అనే పేరు వచ్చి ఉండవచ్చు ననే భావనతో ఉక్కెర గురించిన అన్వేషణ
ప్రారంభిద్దాం:
తెలుగులో ‘ఉక్కెర’
అని సంస్కృతంలో ఉత్కరిక అని పిలుస్తారని (DED (S) 483) ద్రావిడభాషానిఘంటువు పేర్కొంది.
ఉక్కెరను 'ఉక్కారై',
‘ఉక్కారి’ లేదా ‘ఉక్కాలి’
పేరుతో తమిళులు తీపి వంటకంగానే వండుకుంటారు.
బియ్యపు రవ్వలో పాలు, పంచదార కలిపి ముద్దలా చేసి భా౦డీలో నెయ్యి వేసి, ఆ
ముద్దని తడి పోయేలా పొరటినది ఉక్కెర. మొదట ఇలా బియ్యప్పిండితో ఉక్కెర
చేస్తున్నారు.
ఒంగోలు ప్రసిద్ధిగా చెప్పే మెత్తని
నేతి మైసూరుపాకం, అన్నవరం సత్యనారాయణస్వామి ప్రసాదం ఇవన్నీ
ఉక్కెరకు ఉదాహరణలే!
సాయ౦త్ర౦ పూట పిల్లలు బడి నుండి
రాగానే పెట్టడానికి ఈ ఉక్కెర అనువుగా ఉంటు౦ది.
శక్తి చాలని వారికి మంచిది. దీన్ని
తింటూ ఉంటే బాలి౦తలకు నడు౦ కట్టు బలంగా ఉంటు౦ది.
క్షయ రోగులకూ, క్షీణి౦ప చేసే వ్యాధులతో బాధపడేవారికి పెట్టదగిన పౌష్టిక ఆహారం.
జొన్న సజ్జ వగైరా చిరుధాన్యాలను
పిండిపట్టించి ఇలా ఉక్కెరని తయారు చేసుకోవచ్చు. మైదాపిండితో తప్ప ఏ ధాన్యపు పిండితో
చేసుకున్నా మంచిదే!
కొందరు తమిళులు బియ్యం, పెసరపప్పు కలిపి బెల్లం, నెయ్యి వేసి ముద్దగా
ఉడికించి ఉక్కారై చేస్తారు.
ఉక్కెర మన ప్రాచీన తీపి వంటకాలలో
ఒకటి. ఇప్పుడంటే హల్వాని విదేశీ వంటకంగా భావిస్తున్నాం కానీ, దాని మూలరూపం అయిన ఉక్కెర, ఉత్కారిక, ఉక్కారైలు 2000 యేళ్లుగా భారతీయులు వండుకుని ఆస్వాదించారు!
బ్రౌన్ నిఘంటువు ఉక్కెరని 'మక్కెరూన్'
( maccarGGn) అనే యూరోపియన్ల తీపి వంటకం లాంటిదని పేర్కొంది.
తీపి కలిపిన పాలగుజ్జు (క్రీము)లో
తురిమిన కొబ్బరి, కోడిగుడ్డు సొన కలిపి బాగా చిలికి ముద్దలా
చేసి,
గుండ్రటి బిళ్ళలుగా ఓ పళ్ళెంలో ఉంచి
ఓవెన్లో మగ్గబెడతారు. బాగా బంగారపు రంగులోకి వచ్చాక ఇవతలకు తీస్తారు. ఈ మకరూను
యూరోపియన్ల ఉక్కెరగా చెప్పుకోవచ్చు.
ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక
ఆంగ్ల పదం చివర 'ఊన్' అని ఉంటే,
అది ఫ్రెంచి నుంచి అరువు తెచ్చుకున్న 15వ శతాబ్ది నాటి ఆంగ్ల పదం
కావచ్చునని ఆంగ్ల భాషా పండితులుచెప్తారు.
15వ శతాబ్దికి ముందు 'మక్కెరూన్'
(మక్కెర+ఊన్) పాలలో చక్కెర, పిండీ కలిపి
ఉడికించిన నేతి వంటకమే అయి ఉండవచ్చు.
ఈ మక్కెరలో మన ఉక్కెర మూలాలు
ధ్వనిస్తున్నాయి...గమనించండి!
మక్కెరూన్లు పేరుతో ఇప్పుడు
సన్నగొట్టాల ఆకారంలో చేసిన వడియాలు అమ్ముతున్నారు. వాటిని పాలలో వేసి ఉడికిస్తే
పాయసం లాగా ఉంటుంది.
ఈ వడియాలను కూరల్లో ఇతర వంటకాల్లో
కూడా వేసి వండుతున్నారు. ఇవన్నీ కొత్త పరిణామాలు.
ఈ నిరూపణలన్నీ ఉక్కెర అనేది తెలుగు
వారి హల్వా అని నిస్సందేహంగా భావించవచ్చు.
No comments:
Post a Comment