ఘనంగా విశ్వనాథ 120వ జయంత్యుత్సవాల ప్రారంభోత్సవం
కవిసమ్రాట్ విశ్వనాథ 120వ జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధం కావటం ఒక శుభ పరిణామం. అద్రిప్రోన్నతమైన ఆ మహాశయుని వ్యక్తిత్వానికి ఆయన మరణించిన నాలుగు దశాబ్దాలకు ఒక ఘనమైన నివాళి అర్పించటం విశేషం.
2014 సెప్టెంబరు 10వతేదిన ఆయన జయంతి రోజున ఉదయం పది గంటలకు విజయవాడ బీసెంట్ రోడ్ చౌరాస్తా లో ఉన్న విశ్వనాథ కాంశ్య విగ్రహానికి శ్రీ బుద్ధప్రసాద్ గారు, ఇతర సాహితీ ప్రముఖులూ పూలమాలలు వేసి నివాళులర్పించారు,
ఆ తరువాత విజయవాడ మారుతీనగర్ లోని విశ్వనాథ వారింట్లో విశ్వనాథ ఫౌండేషన్ ప్రాంభోత్సవ సభ జరిగింది. ఆ సభలో విశ్వనాథ వారి కోడలు రాజ్యలక్ష్మిగారు( పావనిశాస్త్రి గారి భార్య) విశ్వనాథ వారి ఙ్ఞాపకాలెన్నింటినో మననం చేస్తూ అద్భుత ప్రసంగం చేశారు. ఆ ఇంటికి హక్కుదారైన తాను, తన పిల్లలూ విశ్వనాథ వారి స్మృతి చిహ్నంగా ఆ ఇంటిని తీర్చిదిద్దటానికి నిర్ణయం తీసుకున్న సంగతి ప్రకటించారు.
కృష్ణాజిల్లాలో ఉపఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారుణంగా ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాలేకపోయారని శ్రీ బుద్ధప్రసాద్ తెలిపారు.
సాయంత్రం ఆరున్నరకు విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో విశ్వనాథ ఫోటో, మరియూ వస్తు ప్రదర్శన ఏర్పాటయ్యింది. మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారు విశ్వనాథ వారి సాహితీ వ్యక్తిత్వం పైన అద్భుత ప్రసంగం చేశారు, సభానంతరం విజయవాడలోని సాహితీ ప్రముఖులు "విశ్వనాథ సాహితీదర్బార్" దృశ్య రూపకాన్ని ప్రదర్శించారు