Friday 26 June 2015

మనసులోని మర్మాలు దాచుకోలేని :: కవిత డా. జి వి పూర్ణచందు

మనసులోని మర్మాలు దాచుకోలేని కవిత
డా. జి వి పూర్ణచందు

“వరబింబాధరమున్,పయోధరములున్ వక్రాకంబుల్ మనో
హర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత యేమాయె, నీ
గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకుంజాలదె గంగ క
ద్దరిమే లిద్దరి కీడునున్ గలదె యుద్య ద్రాజబింబాననా!
తెనాలి రామకృష్ణుడు ఏ కూరగాయలు కొనుక్కోవటానికో మార్కెట్టుకు బయల్దేరాడు. కొంటెవాడు కాబట్టి అక్కలవాడగా పిలువబడే రెడ్‘లైట్ ఏరియా మీదుగా నడిచి వెడ్తున్నాడు. ఏ అమ్మయి కళ్లలోనైనా పడకపొతానా...అని దిక్కులు చూస్తూ నడుస్తున్నాడు. ఓ ఇంటి ముందు తనకు తగ్గ ఓ సుందరి కనిపించింది. ఆమె అతన్ని చూసింది. అతని భయంకరమైన పళ్ళు చూసి భయపడిందో లేక అతని ముగ్ధమోహనరూపానికి అచ్చెరువొందిందో గాని... ఠక్కున తలుపు చాటుకు ముఖం దూర్చేసింది. నడుముకు పైభాగం అంతా తలుపు వెనకాల ఉండగా, నడుముకు కింది భాగం అంతా తలుపుకు ఇవతలవైపున ఉంచి గుమ్మంలో వయ్యారంగా నిలబడింది. అతను మాత్రం ఆమె తనను చూసి సిగ్గుతోనే అలా చేస్తోందని అనుకున్నాడు.
ఆమెని ఉద్వద్రాజబింబాననా అని పిలిచాడు! అంటే, ఉదయిస్తున్న నిండు పున్నమి చంద్రుడు మబ్బు చాటున నక్కి చూస్తున్నట్టు, సగం శరీరాన్ని మాత్రమే చూపిస్తూ నిల్చున్నదానా...అని!
కనిపించిన వాటికన్నా కనిపించని వేవో గొప్పవనే దురాశ తెనాలి కవికి లేదు. చాలా పెద్దదైన ఆ నడుముని చూసి ఆమె వక్షోజాల పరిమాణాన్ని ఊహించుకున్నాడు. నీ జఘనం ఘనంగా ఉంది. నీ క్రొమ్ముడి అంతకంటే సౌకర్యవంతంగా ఉంది. ఇటువైపు కనిపించే సోయగాల్ని బట్టి అటువైపు దాక్కున్న సోయగాలు కూడా ఘనంగానే ఉంటాయీ...అని ఊహించాడు. మొత్తం మీద ఆమె అందగత్తేనని నిర్థారించుకున్నాడు.
మబ్బుచాటున సగం దాగిన చంద్రబింబమా! నీ ఎర్రని పెదాల్ని చీకట్లోకి తిప్పేశావు, ముఖంలో శృంగార చిహ్నాలైన అలకల వంటివి కనిపించకుండా దాచేశావు. చూడగానే ఐసైపోయే నీ కళ్ళని ఆ వైపే ఉంచేశావు! ఇంక నీ వక్షోజాల గొప్పతనం చెప్పనవసరంలేదు వాటిని కూడా ఆ వైపే అట్టేపెట్టేశావు” అన్నాడు. ఇది ఒకవిధమైన నిందా స్తుతి! బావున్నవంటూ పొగుడ్తూనే సరిగా చూడనివ్వలేదని ఎత్తిపొడుపు ఆయన మాటల్లో స్పష్టంగా ఉంది! ఆమాటలకు ఆమె నవ్వుకునే ఉంటుందని భావించాడు. ఆ అక్కలవాడ చిన్నదానికి ఈ మహాకవి మాటలు అర్థం అయి అది నిజంగానే నవ్వుకుందా లాంటి ప్రశ్నలు అప్రస్తుతం. రసపట్టులో తర్కం కూడదు.
ఆ తలుపుని గంగా ప్రవాహంతో పోల్చాడు. ఆ తలుపుకు ఇటు వైపున ఉన్న ‘శరీర దిగువ భాగం’ నదికి ఈవలిగట్టు అయితే, తలుపుకు అవతలి భాగాన దాగున్న చంద్రబింబం లాంటి ముఖమూ, వక్షోజాలు వగైరా ఆవలి గట్టుగా భావించాడు. నదికి ఇటు గట్టు ఎలాంటిదో అటు గట్టూ అలాంటిదే! ‘గంగకద్దరి మేలిద్దరి కీడునున్ గలదె...” గంగానదికి అటు గట్టు మేలు, ఇటు గట్టుకీడు అనేది ఉంటుందా...? అని ప్రశ్నించుకున్నాడు. ఇటు వైపు కనిపించే జఘనాదులు తనకు చక్కగా సరిపోయేవే కాబట్టి, నడుము పైభాగాన ఉండే వక్షోజాదులు కూడా చాలినవే అయిఉంటాయని ఆశించాడు. ఇవతలి గట్టు మీద ఎక్కువ ప్రేమ, అవతలి గట్టు మీద తక్కువ ప్రేమా ఉండవు కదా అని తనను సమాధానపర్చుకున్నాడు. ముఖ వక్షోజాలు, నడుము దిగువ భాగాలూ రెండింటి మీదా తనకు సమాన ప్రీతే ఉందని చాటుకున్నాడు.      
          ఈ పద్యంలో అసలు గమ్మత్తంతా “గురు భాస్వజ్జఘనంబు” అనటంలో ఉంది. సాధారణంగా అందమైన ఆడపిల్ల నడుముని సన్నగా నాజూకుగా ఉండే వాటితో పోలుస్తారు ఎవరైనా! కానీ తెనాలి రామకృష్ణ కవి గురు భాస్వజ్జఘనంబు-ఆమె చాలా లావైన నడుము కలదనీ, ఆ నడుము తనకు చాలినదేననీ ఘనంగా చెప్పుకున్నాడు. దాన్ని బట్టి తెనాలి కవి వరేణ్యుడి ఆకారాన్ని ఎవరైనా ఊహించుకోవచ్చు! ఆమె లావైన నడుము ఈయన లావైన పొట్ట బరాబరు అన్నమాట.
          ఆ పిల్లలో ఏం నచ్చిందని ప్రేమించావురా అని ఎవరూ వికారంగా ఉండేవాణ్ణి అడగరు కదా! గంతకు తగ్గ బొంతనే ఎంచుకున్నాడు ఈ చాటు కవి. ఇది రామకృష్ణుడి పద్యమేనని పండితుల భావన. ఒకవేళ అదే అయితే, తెనాలి రామకృష్ణుడు లేదా రామలింగడు ఏయన్నారేమీ కాడని మనం కచ్చితంగా నమ్మవచ్చు. మనసులోని మర్మాన్ని దాచుకోలేక కవి తన రచనలలో ఏదో ఒక రూపంలో బయట పెట్టుకుంటాడు. దాన్ని బట్టే విశ్లేషకులు కవుల జీవిత చరిత్రలు తయారు చేస్తారు.
తెనాలి రామకృష్ణుడి పాత్రని అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహను లాంటి అందగాళ్ళు వేశారు కాబట్టి రామకృష్ణ కూడా అలాగే అందమైన వాడని ఊహించుకుంటాం.
నిజానికి  తెనాలి రామకృష్ణ లేదా రామలింగడు భీకరమైన ఎత్తుపళ్ళ వాడనీ, కృష్ణదేవరాయలు పొట్టిగా పీలగా ఉంటాడనీ, ముఖం స్ఫోటకం మచ్చలతో వికారంగా ఉంటుందనీ కొందరు పరిశోధకులంటారు. కానీ, జాతి హీరోలుగా మన భావాల్లో నిలిచిపోయిన వాళ్ళని అలా అందమైన రూపాల్లో ఊహించుకో గలగటమే శ్రేయస్కరం. రామకృష్ణుడు అందగాడేనని మనం నమ్మితే వచ్చే అపకారం ఏమీ లేదు. కాదని నిరూపించేందుకు కసరత్తు చేయటం వృథా ప్రయాస. ఈ చాటు పద్యానికి ఎవరో ఊబకాయుడే కర్త కావచ్చు.

Friday 19 June 2015

కప్పలపెళ్ళి :: డా. జివిపూర్ణచందు

కప్పలపెళ్ళి
డా. జివిపూర్ణచందు
అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో/పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నావంకకు వచ్చి, రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే/యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము! వచ్చెదన్” ఇది పోతన గారి పద్యం. ప్రపంచం లోనే తొలి ప్రేమలేఖగా విశ్లేషకులు భావించే రుక్మిణి ‘ప్రేమలేఖ’లో ముఖ్యమైన పద్యం ఇది.
శ్రీకృష్ణుడికి యాక్షన్ ప్లానుతో లేఖ వ్రాసి ఓ పెద్దాయన చేతికిచ్చి పంపిస్తుంది రుక్మిణి.పద్మనాభుడవూ, పురుష సింహానివీ అయిన ఓ కృష్ణా! నా ప్రతిపాదనకి నువ్వు అడ్డు చెప్పేందుకు ఏమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగ బలాల్తో వచ్చి, శిశుపాల జరాసంధుల్ని ఓడించి, రాక్షస వివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించు. నేను నీ వెంట వస్తాను” అంటుంది. కానీ, మూలభాగవతంలో తనను రహస్యంగా వచ్చి తీసుకెళ్ళాలని రుక్మిణి కోర్తుంది. పోతనగారికి అది నచ్చినట్టు లేదు. చతురంగ బలాల్తో బాహాటంగా వచ్చి తనను గెలుచుకోవాలనటం వలన ఆమె ఔన్నత్యం నిలబడింది.
పెద్దనగారు తన కావ్యనాయిక వరూధినికి ఈ విధమైన గౌరవాన్ని ఇవ్వలేకపోయాడని కొందరు పండితుల్లో అసంతృప్తి ఉంది. వరూధిని ప్రవరుడి మీద పడి గోలగోల చేసింది. వనితలు వలచి వస్తే లోకువా... అని ఈసడించింది. అల్లరి చేసి, తను అల్ల రయ్యింది. వీణనో, అద్దాన్నో పుచ్చుకుని వయ్యారాలు పోవటం, చిలక నెత్తుకుని ఆడిస్తూ దానితో పనికిరాని ఊసులాడటం తప్ప పెద్దనగారి కాలానికి చెందిన కావ్యనాయకులకు రుక్మిణికున్నంత తెగింపు కనిపించదు. పైగా క్షత్రియ వీరుడితో నడపాల్సిన కథని పెద్దన భూసురోత్తముడితో నడిపించాడు. దాంతో, ‘డామిట్! కథ అడ్డం తిరుగు’తుంది.
కావ్య నాయికల విషయంలో ఇలాంటి అసంతృప్తులు లేకుండా జాగ్రత్త పడాలని తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం కావ్యంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాడు. “కందుకము గాదు కేళీశుకంబు కాదు, పల్కువీణియ గాదు, దర్పణము గాదు, వర్షపిశునంబు బట్ట బల్వరుస జనిరి చంచలాక్షులు చపల ప్రచారలెందు”అనే పద్యంలో నర్మగర్భంగా కావ్య నాయికలను ఎద్దేవా చేయటం కూడా కనిపిస్తుంది.
షుమారుగా 70,80 యేళ్ళ క్రితం వరకూ కూడా పెళ్ళికాని ఆడపిల్లల్ని ఓ హార్మోనియంపెట్టెముందు కూర్చోబెట్టి ఫొటోలు తీయించే వాళ్ళు. మధ్యతరగతి మందహాసాలలో ఈ ‘హార్మొనీ పెట్టె ఫోటో’ఒకటి! కంప్యూటరు ముందు కూచున్న  ఫోటోల్లాగానే ఆ రోజుల్లో ‘హార్మోనియం పెట్టె ఫోటో’లుండేవి. పెళ్ళికి సిద్ధంగా ఉన్న పిల్ల ఫోటోఅని చూడగానే స్ఫురిస్తుంది.
మధ్యయుగాల్లో కావ్యనాయికలు వీణవాయిస్తూన్నట్టూ, గోడకో, స్తంభానికో ఆనుకుని ఒక కాలు వెనక్కి ఆన్చి ఒక చిలుకని పట్టుకొని వయ్యారంగా నిలబడ్డట్టు, చేతిఅద్దంలో చూస్తూ ముంగురులు సరిచేసుకుంటున్నట్టు, తామర పూవు పుచ్చుకుని సుతారంగా ఛాతీ పైన ఆన్చి ఎదురు చూపులు చూస్తున్నట్టు ...ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపించేవి! గిరిక, వరూధిని లాంటి నాయికలు మధురంగా వీణ వాయించగల నేర్పరులు. రతి సంసిద్ధతనీ, ప్రేమను చెప్పుకోవటానికీ వాళ్ళు వీణను ఉపయోగించేవారు. తెలుగు సినిమాల్లో మనసుమాట తెలిపేందుకు వీణపాటలు బాగానే ఉపయోగపడ్డాయి.

తెనాలి రామకృష్ణ ఒక భిన్నమైన నాయికని సృష్టించా లనుకున్నాడు. అందుకోసం పాండురంగ మహత్మ్యం కావ్యంలో అయుతుడి కథని సృష్టించాడు. అయుతుడు శాపవశాత్తూ ఒక కప్పగా మారిపోతాడు. ఆ కప్పని పట్టుకోవాలని కన్యాకుబ్జ రాకుమారి, ఆమె చెలికత్తెలు ప్రయాస పడుతుంటారు. కావ్యనాయిక ఒక కప్పని చేత్తో పట్టుకుని విలాసంగా నిలబడ్డట్టుగానో,  కందుక క్రీడలాడినట్టుగానో వర్ణిస్తే పరమ అసహ్యంగా ఉంటుంది. అది, చేతిమీదకు ఎక్కించుకునే చిలుక గానీ, వాయించేందుకు పనికొచ్చే పలుకుతేనెల వీణ గానీ, నిమిషానికోసారి ముఖం చూసుకునే చేతిఅద్దంగానీ కాదు! అద్దం పట్టుకున్న ఆడవాళ్ళకి కప్పని పట్టుకోవటం సాధ్యమా...అని తెనాలి కవి యద్దేవా అదే!

ఇప్పటిలాగా ఫేస్‘బుక్కులూ, ట్విట్టర్లూ లేని ఆ రోజుల్లోహంసలూ, చిలకలూ, కాకులూ, గబ్బిళాలూ ప్రేమ సందేశాలకు సాధనాలుగా ఉపయోగపడ్డాయి. పలుకుతేనెల వీణ కూడా అటువంటిదే! దూరంగా వినిపిస్తున్న కూనిరాగం ‘రమ్మనే సంకేతంగా ప్రియుడు గ్రహించేట్టు గాథాసప్తశతి కాలం నుంచీ కవులు వ్రాస్తున్న విషయమే! అందుకని, తెనాలి కవి, తననాయిక చేత ఒక కప్పని ప్రేమించేలా చేశాడు. నాయిక తనూ శాపం పొంది కప్పలాగా మారిపోతుంది. కప్పనాయకుడు, కప్పనాయికా చూడముచ్చటగా ఏకం అవుతారు. రుక్మిణికన్నా, వరూధినికన్నా, ఈ కప్పనాయికలో ఎక్కువ తెగింపు కనిపిస్తుంది! భర్త అడవులకు పోవాల్సి వస్తే, భార్య కూడా అడవులకు పోయినట్టే, ప్రియుడు కప్పగా మారితే ప్రియురాలూ కప్పగా మారి పెళ్ళాడటం ఆదర్శవివాహం! వరూధిని ప్రేమ కన్నా, ఫేసుబుక్కు ప్రేమ కన్నాఈకప్పప్రేమగొప్పది

Sunday 7 June 2015

పేదకూళ్ళు - జాతికూళ్ళు :: డా. జి.వి. పూర్ణచందు

పేదకూళ్ళు - జాతికూళ్ళు
డా. జి.వి. పూర్ణచందు

గురుగుం జెంచలి దుమ్మి లేదగిరిసాకుం దింత్రిణీపల్లవో
త్కరముం గూడ బొరంటి నూనియలతో గట్టారు కుట్టారుకో
గిరము ల్మెక్కి, తమిం బసుల్పొలము వో గ్రేపు ల్మెయి న్నాక, మే
కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్”

గురుగుకూర, పులిచెంచలికూర, తుమ్మికూర, లేత గరిసాకు, చింత చిగురు... బహుశా ఈ తరం వాళ్ళకి ఈ ఆకుకూరలు పెద్దగా తెలియక పోవచ్చు. చింతచెట్లు ఆంధ్ర ప్రాంతానికి బాటచెట్లుగాఉన్నా, చింతచిగురు అత్యంత ఖరీదైన ఆకుకూరయ్యింది.

కృష్ణదేవరాయలు వర్షాకాలంలో రెడ్డి దొరలు ఇలాంటి ఆకుకూరలతో ఆధరవులు వండుకునే వారంటాడు ఈపద్యంలో! అదేమీ పేదకూడు కాదు, ఆనాటి మధ్య తరగతి ప్రజల ఆహారం. ఆకుకూరని ఉడకబెట్టి నీళ్ళు పిండేసి, ఉడికించిన పెసరపప్పుని కలిపి, నూనె వేసి పొరటిన పొడికూర గురించి ఈ పద్యంలో చెప్తడు. దీన్ని ఫలానా కూర పొరటు అనేవాళ్ళు.

రాయలవారు ఇన్ని ఆకు కూరలు చెప్పాడు గానీ ఇందులో గోంగూర గురించి లేదు. వీటిని వండుకోవటానికి చింతపండు, మిరపకాయలు కూడా చెప్పలేదు. రాయల వారి కాలం తర్వాతే మిరపకాయలు తెలుగిళ్ళని ఆక్రమించాయి. మన వంటకాల స్వరూప స్వభావాలను మార్చేశాయి.

తెలుగు వారి ఆహార  చరిత్రను మిరపకారానికి ముందు యుగం, తరువాతి యుగం అని రెండుయుగాలుగా విభజించ వలసి ఉంటుంది. మిరప కాయలకు తెలుగువారు బాగా అలవాటుపడ్డాక, డచ్చి, పోర్చుగీసులు ఆనాటి తెలుగు వాళ్ల చేత  రకరకాల ఊరగాయల్ని, నిలవుండే ఇతర వంటకాల్ని తయారు చేయించి, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేసే వాళ్లు. అలా, మిరపకాయల కారంతో పెట్టే ఊరుగాయలను తెలుగువారు స్వంతం చేసుకున్నారు. క్రమేణా, తెలుగు వంటకాలు మిరప కాయల చుట్టూ, అనుపానంగా చింతపండు చుట్టూ పరిభ్రమించాయి. ఆవకాయ లేదా ఈనాటి ఊరుగాయ చరిత్ర ఇలా ప్రారంభ మయ్యింది. గోంగూర కూడా అలానే తెలుగు దనానికి పర్యాయం అయ్యింది.

 మిరప కారాన్ని, చింతపండునీ ఉపయోగించి రకరకాల ప్రయోగాలు చేసి ఊరుగాయల్ని, ఊరు పళ్లనీ తయారు చేయటం నేర్చారు. టమోటా, దోస, ఉసిరి వగైరా పళ్లతో పెట్టే వాటిని ఊరుపళ్ళు అన్నారు. ఈ మిరపకాయలు లేని రోజుల్లో చాలా స్వల్పంగా మిరియాల పొడి, శొంఠి, పిప్పళ్ళు వగైరా కారపు ద్రవ్యాల తోనే తెలుగు వంటకాలు తయారయ్యేవి! మిరప రాకతో అవన్నీ వంటగది లోంచి అదృశ్యం అయిపోయాయి.

రాయలవారు చెప్పిన ఈ పద్యం జడివానలు కురిసే వానాకాలంలో ధనికులైన రెడ్లు ఎంత నిశ్చింతగా జీవించారో, చెప్తుంది. ఈ పద్యం రెండోభాగంలో కట్టారు కుట్టారు కోగిరముల్మెక్కి అంటాడు. ఆరికలు అనేవి ఒక రకమైన తృణధాన్యం. వాటిలో ఖనిజాలు, లవణాలు బాగా ఉన్నాయి. బియ్యం కన్నా బలకరంగా,  ఆరోగ్య కరంగా ఉంటాయి. వీటిని కొండలు గుట్టల మీద పోడు వ్యవసాయం చేసి పండించారట. అందుకే, గుట్ట ఆరికలుఅన్నాడు.  బాగా ఆరిన (కడు+ఆరు=కట్టారు) కట్టారు గుట్టారికల అన్నాన్ని జడివాన కురుస్తున్నప్పుడు రెడ్లు తృప్తిగా తిన్నారట.

ఇది మనకు ఉపయోగపడే సమాచారమే! పెద్ద పచారీ కొట్లలో ఇప్పటికీ ఆరికలు దొరుకు తున్నాయి. వాటితో అన్నాన్ని వండుకోవచ్చు. లేదా మరపట్టిన పిండితో రోటీలు చేసుకోవచ్చు.
ఆరోజుల్లోఆరికల్నిఇంకో కూడు గతిలేక తిన్నారేమో గానీ, నేటి రోజుల్లో షుగరు, స్థూలకాయం తగ్గటానికి తప్పకుండా తినవలసిన ధాన్యం అయ్యాయి

పశువులు పొలానికి పోగా దూడలు మాత్రం రైతుల పెరళ్ళలో తిరుగుతూ మంచం ఎక్కి పడుకున్న రెడ్డి దొరగారి పాదాలను నాకుతున్నాయట. ఆమంచం కూడా కుంపట్ల మంచం. వేడి కోసం కుంపట్లో ఎండు మేకపెంటికల్ని ఉంచి, వెలిగించి మంచం కింద పెట్టి మం ఎక్కి పడుకునే వారట.

ఆహారానికి పేదా ధనిక భేదం లేదు. ఉప్పుకూడా కొనలేని పేదవాడి కేవల కారపు అన్నాన్ని ‘గొడ్డు కారం’ అంటారు. ధనికులు తినే ఆహారంలో గొడ్డుకారం, గొడ్డు పులుపు, గొడ్డు ఉప్పు కూడా ఉంటాయి. అదీ తేడా! పేద కూళ్ళలో కనిపించే దేశీయత, జాతీయతఅనేవి సంపన్న భోజనంలోనూ ఉన్నప్పుడే అది జాతికూడు అవుతుంది.