Sunday 17 April 2016

భాషా గీర్వాణం:: డా. జి వి పూర్ణచందు

భాషా గీర్వాణం:: డా. జి వి పూర్ణచందు
"యతియుంబ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్య మందున్న భా
రత వేదాన( బదేను పర్వముల కాంధ్రత్వంబు నేర్పించి శా
శాశ్వతుడై పోయిన తిక్కయజ్వకు నివాసంబైన నెల్లూరికిన్
నతు లర్పింపుము; స్నానమాడు మతిగణ్యంబైన పెన్నానదిన్"
మహాకవి జాషువా...తనకు పాండిత్యం ఎంత ఉన్నా కులంచేత సామాజిక గౌరవాన్ని పొందలేక, పేదరికం చేత సుఖ జీవనాన్ని అందుకోలేక, తన దీన స్థితిని ఈశ్వరుడికి చెప్పవలసిందిగా గబ్బిళాన్ని ప్రార్థిస్తాడు.
ఇంటి చూరుకో, పైకప్పుకో పట్టుకు వ్రేలాడుతుంది గబ్బిళం . అది పట్టుకున్న చోట ఒక పెన్సిలుతో చుక్కపెడితే ఎక్కడెక్కడో తిరిగి, తిరిగి ఆ చుక్కమీదే వాలగల సమర్ధత కలిగింది. ‘గురి’ని అవలీలగా చేరగలది కాబట్టే, దాన్ని వేడుకున్నాడు కవి, తన పక్షాన దేవుడితో రాయబారం నడపమని!
గబ్బిళం అందరిలాగా మామూలు కళ్లతో చూడదు, ఙ్ఞాననేత్రంతో చూస్తుంది. దాని చూపుని అర్ధం చేసుకునే గదా రాడార్ వ్యవస్థని కనిపెట్టారు...
గబ్బిళం స్తన్య జీవి. అయినా దానికి పిల్లల్ని కని పాలిచ్చి పెంచే ఆవులాంటి జంతు జీవాలతో సమాన గౌరవం లేదు. పక్షిలా ఎగరగలదు. తూనీగలాగా దూసుకుపోగలదు. దానికన్నా వేగంగా దిశను మార్చుకోగలదు. అయినా చిలుకలాగా పరువు లేదు. గ్రద్దలాగా ప్రతిష్టలేదు. ఏ దేవుడూ పట్టించుకోని మేధావి గబ్బిళం. దానికి మొర పెట్టు కున్నాడు కవి. అణచివేతకు గురైన వ్యక్తులు అణచి వేసే వారికి చెప్పుకోలేరు కదా!
గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971) అందరూ భావ కవిత్వం వ్రాస్తున్న కాలంలో సామాజిక ప్రయోజనం కోసం రచనలు ప్రారంభించిన కవి. కవితాయుధంతో కులవాదుల మీద తిరగబడ్డాడు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
“యతిప్రాశలు లేని సంస్కృత కవిత్వ దుర్గమారణ్యంలో ఐదోవేదం బందీగా ఉంది. దాని బంధనాలు వదిలించి, పదిహేను పర్వాలను తేట తెలుగులోకి తెచ్చి, శాశ్వత కీర్తిని పొదాడు తిక్కన మహాకవి. ఆయన ఊరు నెల్లూరు. దాని మీదుగా వెళ్ళేప్పుడు ఆ నగరికి నమస్కారం పెట్టు. గొప్పదైన పెనానదిలో స్నానం చెయ్యి...” అని గబ్బిళానికి సూచిస్తాడు ఈ పద్యంలో. తంజావూరు సరస్వతీ మహలుని సందర్శించ మంటాడు. ఇంకా ఇలాంటి ముఖ్య దర్శనీయ స్థలాలకు మొక్కమంటాడు. సామాజిక కవితకు కొత్త ఊపిరి పోసిన పద్యకవి జాషువా!
మేథావుల్లోనూ పండితుల్లోనూ సంస్కృతాభిమానం జాస్తిగా ఉండి, అది మాతృభాషాభిమానాన్ని కప్పిపుచ్చుతోంది. తెలుగుభాషపై మక్కువని ఆంగ్ల భాషాభిమానులతో పాటు సంస్కృతభాషాభిమానులు కూడా ఈసడించటాన్ని చాలా మందిలో గమనించాను. ఒక సంస్కృతాభిమాని తన ఇంట్లో పనిమనిషితో కూడా గీర్వాణంలోనే మాట్లాడతానన్నాడు. అందువలన అమ్మభాషకు ఒరిగిందేమిటని అడిగాను. సంస్కృతం బతికితే అన్ని భాషలూ బతికినట్టే నని ఆయన సమాధానం. పూర్వం జయంతి రామయ్య, కొక్కొండవెంకట రత్నం లాంటి గ్రాంథిక భాషావాదులూ ఇలాగే ఇంట్లో కూడా గ్రాంథికమే మాట్లాడే వాళ్ళని ప్రతీతి. వీళ్ళు కారడవుల్లో బతకవలసిన వాళ్ళనేది జాషువా గారి అభిప్రాయం అందుకే “యతియుంబ్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్యం” అన్నాడాయన.
మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారి సంస్కృత వాఙ్ఞ్మయ చరిత్ర ప్రధమ భాగం చదివితే, సంస్కృతభాష ఎలా రూపొందిందో బాగా అర్ధం అవుతుంది. అది అన్ని అమ్మభాషల్లాగా ఏర్పడింది కాదు. మానవ నిర్మితం. ఏ భాషా రాత్రికి రాత్రే పుట్టదు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన కారణాలతో భాష ఎప్పటికప్పుడు కొత్త పరిణామాలు పొందుతూ ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. సంస్కృతం నేర్చుకోవటానికి దైవభక్తికీ ముడి పెట్టినందువలన కొత్త సమస్య లొచ్చాయి.
దేవుడికి సంస్కృతం మాత్రమే తెలుసని, తెలుగులో “అయ్యా నా సమస్య తీర్చు” అని వేడుకుంటే దేవుడికి అర్ధం కాదనీ జనంలో భ్రమలు కల్పించ నవసరం లేదు. వేదమంత్రాలను సంస్కృతం అని మన చేత నమ్మించాలని చూడటం అన్యాయం.
సంస్కృతం అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికీ గౌరవం ఉంటుంది. ప్రత్యేకంగా బోర్డు తగిలించుకుని ఆ అభిమానం చాటుకో వలసిన అవసరం లేదు. అలాగే మాతృభాషాభిమానానికీ బోర్డు అవసరం లేదు. కానీ, అమ్మభాష పట్ల చిన్నచూపునే ఆక్షేపించాల్సి వస్తుంది. వేరొక భాషాభిమానంతో అమ్మభాషని వాడకపోవటం మాతృభాషా ద్రోహమే!
పదిహేనుపర్వాల అచ్చతెలుగు ఆంధ్రమహాభారతాన్ని తిక్కనగారికి నమస్కరించుకుని, తెలుగు భాష కోసం చదవాలనేది జాషువా గారి అభిప్రాయం. సంస్కృత పదాలతో నింపి ఇదంతా తెలుగనటం పండితుల్లోని పాండిత్యప్రదర్శనా ధోరణికి అద్దంపట్టడమే అవుతుంది. భాషా గీర్వాణం వదిలి తెలుగులోనే మాట్లాడే వాడికి కోటి దండాలు

Monday 11 April 2016

తెలుగు తల్లికి ఉగాది సారె: : డా. జి. వి. పూర్ణచందు,

ఏప్రిల్ నెల వీక్షణ తరంగం మాసపత్రికలో ప్రచురితం

తెలుగు తల్లికి ఉగాది సారె


డా. జి. వి. పూర్ణచందు,

9440172642
కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పుకోవటం, రానున్న ఏడాది సుఖసంతోషాలతో గడవాలని కోరుకోవటం అనాదిగా ప్రపంచ జాతులన్నింటికీ ఆచారమే! క్రీస్తుపూర్వం అనేక వందల యేళ్ళ ముందే కొత్తసంవత్సరాలు వాడకంలో ఉన్నాయి. జనవరి 1 పండగే అన్నింటి కన్నా ఆఖర్న వచ్చిన పండుగ. వెనకొచ్చిన కొమ్ములు వాడికదా!
ఒక కొత్త ఆలోచనకు, కొత్త ఆచరణకు, కొత్త లక్ష్యానికీ, కొత్త యుగానికీ ఆరంభం కాబట్టి, సంవత్సరాదిని యుగాది-ఉగాది- అనటం మన పద్ధతి. భారత దేశంలో పంచాగానికి పవిత్రత ఎక్కువ. దాన్నిపూజించటం అంటే ఖగోళ శాస్త్రానికి మొక్కటమే!
కొత్త ఏడాది రోజున పంచాగానికి దణ్ణం పెట్టి ప్రసాదం తీసుకునే పద్ధతి మనది. కొత్తదేదో వస్తోందనే యావకొద్దీ పాతని వదిలేసి కొత్తదాని కోసం ఆబగా అర్రులు చాచటం పాశ్చాత్య విధానం. నిన్న పండిన పంటనే నేడు వండుకుంటున్నాం అనే స్పృహ ఉగాదిలో కనిపిస్తుంది. జనవరి ఒకటి ఈ స్ఫూర్తికి పూర్తిగా భిన్నమైంది. ‘నిన్న మనది కాదు, రేపు మనకు రాదు, నేడే సుఖం ధోరణి’ఈ జనవరి ఒకటిలో కనిపిస్తుంది. అందులో దేశీయత, జాతీయతలు కలికానిక్కూడా కనిపించవు.
ప్రపంచం అంతా ఒకే క్యాలెండరు అమల్లో లేదు. చాలా ప్రాచీన జాతులకు స్వంత క్యాలెండర్లున్నాయి. గ్రిగోరియన్ క్యాలెండర్, జులియన్ క్యాలెండర్, రోమన్ క్యాలెండర్ ఇలా అనే కరకాల క్యాలెండర్లు వివిధ కాలాలలో వాడకంలో ఉండేవి. ప్రపంచం అంతా అనుసరిస్తున్న గ్రిగోరియన్ క్యాలెండరు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 1ని సంవత్సరాదిగా జరుపు తున్నారు. భారతీయులతో పాటు, ఈజిప్షియన్లు, పర్షియన్లు ఫినీషియన్లు, గ్రీకులు జ్యోతిష, ఖగోళ విఙ్ఞానాలు అందుబాటులో ఉన్న ప్రాచీన జాతు లన్నీ ఒక్కో తేదీన ఒక్కో విధంగా తమ తమ ఉగాదుల్ని జరుపు కుంటున్నాయి.
క్రీస్తు పూర్వం జనుస్ అనే రోమన్ దేవత పేరున జులియన్ క్యాలెండర్ ఏర్పడింది. సృష్టి ప్రారంభకుడు, జనకుడుగా జనుస్ దేవతని (god of gateways and beginnings) ఆరాధించారు. రోమన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 1న సంవత్సరాది వాళ్ళకి. ఏప్రిల్ 1 నుండీ మరి కొందరు జరుపుకున్నారు. క్రీ. పూ. 2000 నాటి మెసపొటేమియా నాగరికతలో ఇప్పటి లెక్కల ప్రకారం మార్చి నెల మధ్య నుండీ కొత్త ఏడాది పండుగ జరుపు కునేవారు.
భారతదేశంలో కూడా వివిధ క్యాలెండర్లు అమలులో ఉన్నాయి. ఎవరి పంచాంగాలు వాళ్ళవే! ఎవరి ఆచారాలు వాళ్లవే! పంచాంగాలు తేదీని మాత్రమే నిర్ణయించగా, ఎలా జరుపుకోవాలో ప్రజలునిర్ణయిస్తారు. ఆ నిర్ణయం సంస్కృతిని సంరక్షించేదిగా ఉండాలి. జనాలోచనలోవాణిజ్య భావాలు లేనప్పుడు సంవత్సరాది పండుగ పవిత్ర ఉత్సవం అవుతుంది.
ప్రొద్దున నిద్ర లేస్తూనే రోజంతా బావుండాలని గుడ్‘మార్నింగ్ చెప్పుకున్నట్టే, ఏడాది ప్రారంభంలో శుభాకాంక్షలు చెప్పుకోవటం, ప్రారంభ దినాన్ని పవిత్రంగా భావించటం ప్రాచీను లందరికీ ఆచారమే! కానీ, వాణిజ్య సంస్కృతి పెచ్చుపెరిగాక, జనవరి ఒకటిగాడి తప్పింది. తన పవిత్రతను త్యాగం చేసుకుని, డిసెంబరు అర్థరాత్రిని తాగడాలకు, ఆగడాలకు ఒక లైసెన్సుగా భావించుకునే స్థితిని తెచ్చింది. సణ్వత్సరాదిలోని స్ఫూర్తి ఇగిరి పోయింది.
వాణిజ్య బంధాలు మానవ సంబంధాలను తిరస్కరిస్తాయి. నువ్వు ఎదగటానికి నీ చుట్టూ ఉన్నవాళ్ళంతా మోహరించి అడ్డు కుంటారనీ, అందరినీ తోసిరాజని ఒక్కడివే సాగి పొమ్మనీ, ఎవరికోసమూ ఆగవద్దనీ వాణిజ్య సంస్కృతి ప్రబోధిస్తుంది. ఏరు దాటాక ఇంకా ఆ తెప్పని ఎందుకు అట్టే పెట్టావని అడుగుతుంది. జనవరి ఒకటి అలాంటి వాణిజ్య సంస్కృతి పెంచి పోషిస్తున్న మాయాప్రవరుడు లాంటిది. అది కేవల లాభాపేక్ష పండుగ. ప్రాచీన జాతుల సంవత్సరాదులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అవి మానవ సంబంధాల కోసం అర్రులు చాచే పండుగలు. మొదట మనం ఈ సున్నితమైన అంశాన్ని అర్ధం చేసుకోవాలి.
తెలుగువారి ఉగాది ఊరుమ్మడి పండుగ. ఆ రోజున అందరూ కలిసి మేథోపరమైన అంశాలు పంచుకుంటారు. కవులు కవితాగానం చేస్తారు. గాయకులు పాడతారు. నర్తకులు నాట్యం చేస్తారు. ఐంద్రజాలికులు తమ విద్యలు ప్రదర్శిస్తారు.పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. ప్రపంచ మనుగడ ఎలా ఉంటుందో పెద్దలైన వారి ద్వారా విని, విషయాలు తెల్సుకుంటారు. లోకం సుఖంగా ఉండాలని ఆశిస్తారు. ఎల్లరూ సుఖంగానే ఉంటారని చెప్ప వలసిందిగా పంచాంగాన్ని పూజిస్తారు. రాశిఫలాలు తెలుసు కోవటం ద్వారా తమ బతుకు బండిని ఎలా నడుపుకోవాలో ఒక ఆలోచన చేస్తారు. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఇవి మత మౌఢ్యాలు, ఛాందసాలు కావు. ఇందులో ఆస్తిక, నాస్తిక విచికిత్స ఏమీ లేదు. ఇది తెలుగు పండుగ. తెలుగు భాష పండుగ.
"ఇట వసంతము లేదు, సహింపరాని గ్రీష్మ, హేమంత కాలకాళికలెగాని, ఇట ఉషస్సులు లేవు, భరింపరాని అంబువాహ సందోహ నిశాళి కాని”అని దాశరథి నేటి దుస్థితిని ఎంత ఈసడించినా రేపటి మీద ఆశతోనే బతుకుతున్నాడు మనిషి. ఆ ఆశను జ్వాజ్జల్యమానం చేసేదే ఉగాది! "నీళ్ళలో నిప్పుమాదిరి, నిప్పులోన నీళ్ళ మాదిరి, కష్టాల నీడలందు సుఖము నివసించునంట! ఉస్సురను వేడి ఊర్పులోన పరీమళా లున్నవంట!" అని ఆశావాదాన్ని రేపినవాడు కూడా దాశరధే! ఉగాది అందించేది ఈ ఆశ ఊతాన్నే! మన కుగాదు లున్నాయి! ఉషస్సు లున్నాయి! మనసు నిండా ఆశయాల ఆశ లున్నాయి. అవి నెరవేర్చుకునే సంకల్ప బలాన్నిస్తుంది ఉగాది.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతి రాష్ట్రమూ వారి వారి పద్ధతుల్లో సాంప్రదాయ బద్ధంగా సంవత్సరాదులు జరుపుకుంటోంది. వాటిని పరిశీలిస్తే నూతన సంవత్సరాది స్ఫూర్తి అవగతం అవుతుంది.
ఉగాది: తెలుగువారు, కన్నడిగులు, మహారాష్ట్రులు కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు కొత్త యుగానికి ఆరంభంగా చాంద్రమానం ప్రకారం చైత్రమాసం శుద్ధపాడ్యమిన ఉగాది (యుగాది) పండుగ జరుపుతారు.సృష్టి కార్యక్రమం మొదలు పెట్టిన రోజు అని బ్రహ్మను పూజిస్తారు. ఇది మన షడ్రుచుల పండుగ. ఆరు రుచులతో ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుంటారు. ఉగాదితో మొదలిడి శ్రీరామనవమి వరకూ రోజూ ఈ ఉగాది పఛ్ఛడి తిన్నందువలన రానున్న వేసవికి శరీరం తట్టుకో గలుగు తుందని ఆరు రుచుల ఉగాది పచ్చడిని ప్రసాదంగా మన పూర్వులు ఎంచుకున్నారు. వాత, పిత్త కఫ దోషాల సమస్థితికి ఇది దోహద పడుతుంది. ఎందుకంటే ఆరు రుచులూ ఇందులో తగు పాళ్లలో ఉంటాయి కాబట్టి!
తెలుగువారి ఆహారపు అలవాట్లు ఆయుర్వేద శాస్త్రానుసారంగా ఉండటాన తక్కిన రాష్ట్రాల వారికన్నా భిన్నంగా ఉంటాయి. ఆరోగ్యదాయకమైన ఉగాది పచ్చడి ఈ ఆయుర్వేద సిధ్ధాంతానుసారం ఉండటమే ఇందుకు సాక్షి.
హోలీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచలప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంవత్సరాది పండుగను హోలీ అంటారు. ఇది వాళ్ళకు రంగుల పండుగ. పంటల పండుగ. కొత్త వసంతానికి స్వాగతం చెప్పే పండుగ. సమభావం, సోదరబావం పెంపొందించే పండుగ. కుల, మత, వర్గాల తేడా లేకుండా అందరూ వసంతం చిమ్ముకుంటూ, గులాం కొట్టుకుంటూ జరిపే పండుగ. ధాన్య సంపద నిచ్చాడని, దేవుడికి ‘హోలా (ధన్యవాదాలు) చెప్పుకునే పండుగ!
హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక. ఆమెను అగ్ని దహించకుండా ఒక వరం ఉంది. ప్రహ్లాదుడికి ఎన్ని శిక్షలు వేసినా అతను లొంగక పోవటంతో హోలికను ప్రహ్లాదుడితో సహా మంటల్లో దూకమంటాడు హిరణ్యకశ్యపుడు. పరమ భాగవతుడి పట్ల అపచారం చేయటం కాబట్టి అగ్ని ఆమెను దహించి వేస్తాడు. ప్రహ్లాదుడు చల్లగా బైటకు వస్తాడు. అందుకనే పాపాన్ని దహించే పండుగగా దీన్ని జరుపుతారు.
గూఢీ పాడవా: మన ఉగాది రోజునే మహరాష్ట్రీయులు ‘గూఢీపడవా’ పండుగ చేసుకుంటారు. గూఢీ అంటే గుండు లేదా గుండీ.పొడవైన దుడ్డుకర్రకు జరీ అంచు ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని కొత్తచీర వ్రేలాడగట్టి, పైన చిన్న కలశాన్ని బోర్లిస్తారు. దాని మెడలో హారంలా వేపాకులు, మామిడాకులు, పంచదార చిలకల దండలు వేస్తారు. ఈ గూఢీ పవిత్రమైన బ్రహ్మదేవుడి జెండా! ఇంద్ర ధ్వజం కూడా! ఇంటి సింహద్వారానికి కుడి వైపున ఆవరణలో ఈ ధ్వజాన్ని నిలిపి, సృష్టిని ప్రారంభించిన రోజని బ్రహ్మను, రావణ సంహారం చేసిన రోజని రాముణ్ణి పూజిస్తారు. శాలివాహనులు శకుల్ని జయించినప్పుడు పైఠాన్లో ప్రజలు ఇళ్ళముందు దీన్ని నిలిపి స్వాగతం చెప్పారట.
రొంగాలిబిహూ:ఇది అస్సామీ సంవత్సరాది! మాఘమాసం పండుగ కాబట్టి మాఘబిహూ అని కూడా అంటారు. ఏప్రిల్14-15 తేదీల్లో ఈ పండుగ వస్తుంది. పశువుల్ని అలంకరిస్తారు. పీఠా పేరుతో ఒక కేకు తయారు చేసుకుంటారీ రోజు.
పుత్థాండు (పుత్తాంటు): తమిళ,ఆస్సాం, బెంగాల్, ఒరిస్సా, త్రిపురా, పంజాబ్ రాష్ట్రాల్లో సౌరమానం ప్రకారం మేష సంక్రాంతి మొదటి రోజు (ఏప్రియల్ 14)న ఒక దీపాన్ని వెలిగించటం ద్వారా సంవత్సరాదిని జరుపుకుంటారు.
విషు (బిసు): మళయాళీలు ‘మేదం’ మాసంలో (ఏప్రిల్ రెండోవారంలో) సంవత్సరాది జరుపుకుంటారు. దీపావళి పండుగలా దీపాలతో అలంకరించి సంబరంగా టపాసులు కలుస్తారు.
చైరావోబా: ఇది మణిపురి సంవత్సరాది. ఉగాది రోజునే వస్తుంది. జానపదుల పండుగ ఇది.
నవ్‘రే: కాశ్మీరీ హిందువులు భాద్రపద మాసంలో జరుపుకునే సంవత్సరాది ఇది. వసంత నవరాత్రులు కూడా జరుపుతారు. కాశ్మీరీ శైవులకు అది శివరాత్రి కూడా!
మహా బిషుబ సంక్రాంతి: ఒరియా వారి సంవత్సరాది ఇది. రకరకాల పళ్ళు, పాలు, వెలగ పండు గుజ్జు, పెరుగు, బెల్లం కలిపి ‘పానా’ పానీయం చేసి, శివుడికి అభిషేకం చేస్తారు. హనమజ్జయంతి జరుపుతారు పశు పక్ష్యాదులకు, ఆత్మలకు వీధుల్లో నీళ్ళతొట్టెలు పెట్టి దాహార్తి తీరుస్తారు. దీన్ని పానసంక్రాంతి, జలసంక్రాంతి అని కూడా పిలుస్తారు.
బేస్తు వారాస్: విక్రమాదిత్య కాలమానం ప్రకారం ఆషాఢ పూర్ణిమ నాడు గుజరాతీయుల సంవత్సరాది ఆట పాటలతో సంబరంగా సాగుతుంది.
థప్న: రాజస్థానీ మార్వాడిల సంవత్సరాది ఇది. ఆ రోజున యఙ్ఞాలు, హోమాలు ఎక్కువగా జరుపుకుంటారు.
చేతి చాంద్: సింధ్రీల ఉగాది పండుగ ఇది. చేత్ అంటే చైత్రమాసంలో రెండవరోజు అంటే చంద్రుడు వచ్చే మొదటి రోజున ఈ ‘చేతీ చాంద్’ పండుగ జరుపుతారు. ఉగాది మర్నాడు సింద్రీల సంవత్సరాది వస్తుంది.
చైత్తి: హిమాచల్ ప్రదేశ్ సంవత్సరాదిని చైత్తి అంటారు. ఉగాది రోజునే చైత్ర శుద్ధ పాడ్యమిని వాళ్ళు కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుతారు. వైశాఖమాసం ప్రారంభం రోజున కూడా వాళ్ళు వైభవంగా జరుపుతారు.
వైశాఖి: నానక్‘-శా-‘షాహి క్యాలెండర్ ప్రకారం పంజాబీల సంవత్సరాది. ఏప్రిల్ 13-14 తేదీల్లో ఇది వస్తుంది.
పోయిలా బోయిషక్: బెంగాలీ సంవత్సరాది. ఫిబ్రవరి 13-14 తేదీల్లో వస్తుంది. “శుభోనొబోబోర్షో” అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
పహ్లీవైశాఖ్: మైథిలీ/నేపాలీ భాష మాట్లాడే ప్రజల సంవత్సరాది ఇది. నిరయన మేష సంక్రాంతి అనీ పిలుస్తారు. మిథిలా రాజ్య జెండా గుర్తుగా హనుమంత్ ధ్వజదానం జరుపుతారు. హిమవంతుడి జన్మదినంగా కూడా ఇదే వాళ్ళకు.
ఇవన్నీ పరిశీలించి నప్పుడు దేశ వ్యాప్తంగా జరిగే సంవత్సరాది పండుగలన్నీ దేశీయతను, జాతీయతను, సంస్కృతినీ నిలబెట్టుకోవాలనే తపనతో జరుగుతున్న వైనాన్ని మనం గమనించ వచ్చు. సంస్కృతి ప్రధానం. అది మన సంస్కారానికి ప్రతీక! తేదీ ఏదయినా సంవత్సరాది రోజు జనసందోహం ఊరుమ్మడిగా జరుపుకునే ఈపండుగలోని స్ఫూర్తిని మనం అందుకో గలగాలి. సంస్కృతిని గౌరవించటం అంటే మూఢనమ్మకాలను ఆచరించటం ఎంతమాత్రమూ కాదు. ఉన్నతమైన, సంస్కార వంతమైన అంశాలను వక్రీకరించినందు వలన మనం సాధించగలిగేది కూడా ఏమీ ఉండదు.
తెలుగు వారికి ఉగాది తెలుగు భాషకు సంబంధించిన పండుగ. అనుక్షణం అమ్మభాషను కాపాడుకోవాలని మనల్ని హెచ్చరించే పండుగ. ఆరోజున భాష కోసం మనం ఏ కొంచెం చేసినా గొప్ప విషయమే! మన వృథావ్యామోహాల కారణంగా భాషా సంస్కృతులు ప్రమాదం అంచుకు చేరుతున్నఈ రోజుల్లో మన దృక్పథంలో మార్పు చాలా అవసరం. అన్నీ కలుషితం అవుతున్నాయి. ఉగాదినైనా భాషా కాలుష్యానికి బలికాకుండా కాపాడుకోవటం మన ధర్మం కూడా.
ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే దేవుడున్నాడు. ఆయన ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా దివిసీమ శ్రీకాకుళంలో కొలువై ఉన్నవాడు. మాతృభాషను మాతృ దేవతగా భావించుకున్న సంస్కారం మనది.
తెలుగు తల్లికి ఉగాది సారె పెట్టి కట్టుకుని, మంచి భవిష్యత్తు చెప్పుకుని, అందరం కలకాలం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంకల్పించు కోవటంలో ఉన్న తృప్తి జనవరి ఒకటి హంగామాలో కనిపిస్తుందంటారా? ఉగాదిని సాంప్రదాయానికి వ్యతిరేకంగా అలా జరుపుకోవటం ధర్మమంటారా?

విషదోషాలకు విరుగుడు :: ఉగాది పచ్చడిలో ఔషధ విలువలు డా. జి వి పూర్ణచందు,

విషదోషాలకు విరుగుడు
ఉగాది పచ్చడిలో ఔషధ విలువలు


డా. జి వి పూర్ణచందు, 9440172642

గాదులు నిండితే ఉగాదులు పండుతాయి. ఉగాదులు అన్ని జాతులకూ అన్ని భాషా జాతీయులకూ ఉన్నాయి. కానీ, తెలుగు ఉగాది వాటికి భిన్నమైంది. ఇది తెలుగు భాషా సంస్కృతుల పండుగ. అంతే కాదు, ఇది ఆరోగ్యాన్ని ప్రబోధించే పండుగ కూడా!
అన్ని పండుగల్లోనూ తీపి, కారం ఇష్టంగా వండుకు తింటాం. ఉగాది నాడు కావాలని వగరు, చేదు తెచ్చుకుని తింటాం. వగరూ చేదు రుచుల ( bitter Tonics) మహత్తుని తెలియజేసే పండుగ ఉగాది.
జీవిత మహాభారతానికి ఆదిపర్వం ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది. ఆరోజే ధర్మరాజు పట్టాభిషిక్తు డైనాడని ప్రతీతి. ప్రపంచ యుద్ధం తరువాత పునరుజ్జీవం పొందిన ప్రపంచ శాంతికి సంకేతం ఉగాది!
పాశ్చాత్యులకు జనవరి 1న ఉగాది. ముందురోజు అర్ధరాత్రి నుండే మందు ఏరులై ప్రవహించే పండుగ ఇది. దిశా గమనం, దిశానిర్దేశనం చేసుకోకుండా కేవలం సంబరాలు చేసుకునే పండుగ జనవరి ఒకటి. ఉత్తర భారతీయులకు హోలీ ఉగాది లాంటిది. జీవితం రంగులమయంగా ఉండాలనే ఆకాంక్షతో కులమతాలకు అతీతంగా అనందంగా జరుపుకుంటారు. మహరాష్ట్రీయులు గూఢీ పాడవా పేరుతో ఉగాదినిని ఇంటిముందు ఇంద్రుడి జెండా నిలిపి సగర్వంగా జరుపుకుంటారు. ఒరియా వారు వీధుల్లో మంఛినీటి కుండలు పెట్టి, వారి ఉగాదిని మహా బిషుబ సంక్రాంతి పేరుతో జుపుకుంటారు. అస్సామీయులు తమ ఉగాదిని బిహూ పండుగ అంటారు. పశువుల్ని పూజించి జరుపుకుంటారు. తమిళులు తమ ఉగాది రోజున పుత్తాంటు పేరుతో దీపం వెలిగించి చీకట్లను పారద్రోలాలని ప్రార్ధిస్తారు. మళయాళీలు ‘బిసు’ పండుగని దీపావళి లాగా దీపాలు వెలిగించి జరుపు కుంటారు. ఇలా ప్రతీ జాతీ తమతమ క్యాలెండర్లలో మొదటి రోజుని శుభకామనలతో పవిత్రంగా జరుపుకుంటారు
తెలుగు వారు ఒకింత కొత్త పుంతను తొక్కి ఉగాదిని జరుపుకుంటారు. తక్కిన దసరా, సంక్రాంతి లాంటి పండుగలకు భిన్నంగా తెలుగు భాషా సంస్కృతుల పండుగలా దీన్ని జరుపుకోవటానికి ఒక ముఖ్య కారణం ఉంది. ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే ఒక భాషా దేవుడున్నాడు. ఆయన పేరు ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా దివిసీమ శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. మాతృభాషను మాతృ దేవతగా ఆరాధించాలనే ప్రబోధాన్ని అందించిన దేవుడాయన. దేశభాషలందు తెలుగు లెస్స అని స్వయంగా తనకు కలలో కనిపించి చెప్పాడని, దాన్ని అధికార భాషగా చేసుకుని పాలించాలనీ, ఆ భాషలోనే తన దివ్య చరిత్రను తెలిపే కావ్యం వ్రాయాలనీ అన్నాడనీ. కృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద కావ్యంలో ముందుమాటగా వ్రాసుకున్నాడు.
అందుకే, తెలుగమ్మకు సారె పెట్టి కట్టుకుని ఉగాది జరుపుకుంటాం మనం.
ఉగాది రోజున మనం జీవన గమనానికి దిశా నిర్దేశం చేసుకుంటాం. లోకం పోకడ ఎలా ఉండబోతోందో పంచాంగ శ్రవణం ద్వారా ఒక అవగాహన కల్పించుకుంటాం. చాలా
మంది అనుకునేట్టు ఇది ఒక మూఢ నమ్మకం కాదు. ప్రపంచం తీరుతెన్నుల్ని అవగతం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం ఇది. వానలు ఎలా కురుస్తాయి... కరువు సూచనలు ఉన్నాయా... ఏ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది,.. వేటి రేట్లు పెరిగే అవకాశం ఉంది,.. రాజకీయ పరిణమాలు ఎలా ఉండబోతున్నాయి,.. ఉప్పెనలు, ఉపద్రవాలు వచ్చే సూచనలున్నాయా... గ్రహణాలూ, ముఖ్య సంఘటనలూ ఏవి ఎప్పుడు జరగబోతున్నాయి...లాంటి విషయాల్ని ముందుగా తెలుసుకోవటానికి సామాన్యుడు చేసే ప్రయత్నం ఇది. తెలుగువారు ఉగాది రోజున వాటిని తెలుసుకుని తగ్గట్టుగా ఈ ఏడాది కాలానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకో గలుగుతారు. భాషాసంస్కృతులను గౌరవించటం, దిశా నిర్దేశం చేసుకోవటంతో పాటు, ఆరోగ్య పరి రక్షణ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు.
గత 3,4 దశాబ్దాల కాలంలో, మీదు మిక్కిలి కొత్త మిలీనియం సంవత్సరంలో మన జీవిత విధానంలో పెనుమార్పులు చేరుకున్నాయి. విదేశీ వ్యామోహం కట్టలు తెంచు కుంది, ఆహారపు అలవాట్లన్నీ మన భౌగౌళిక పరిస్థితులకు వ్యతిరేకంగా వేలంవెర్రిగా సాగుతున్నాయి. ఏ ఆహార ద్రవ్యాన్ని కొనాలన్నా కల్తీలతో, విష రసాయనాలతో కూడి నవే దొరుకు తున్నాయి. పట్టించకునే నాథుడు కరువయ్యాడు. ఆహార అలవాట్లలో తీపి పులుపు ఉప్పు రుచుల వాడకం విపరీతమైంది. మజ్జిగ తాగడం మానేశారు. బూడిదగుమ్మడిని దిష్టి బొమ్మగా తప్ప అదొక కూరగాయ అనే సంగతి మరిచి పోయారు. వగరు, చేదు రుచుల్ని తినటం వదిలేశారు. ఈ కొత్త పోకడలకు తోడు అధిక ఉష్ణోగ్రత దగ్గర వేయించే వేపుడు వంటకాలు, నూనె పదార్ధాలను అపరిమితంగా తింటున్నారు. అనాలోచితంగా విషాల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడ్తున్నారు.
ఇది తెలుగువారికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అలవాటే! ఇలా ప్రవర్తించటం మనకు కొత్త కాదనుకుంటాను. 2000 యేళ్ళ క్రితం చరకుడు, సుశ్రుతుడు సమస్త వ్యాధు లకూ గ్రామ్యాహారాలే కారణం అన్నారు. గ్రామ్యాహారా లంటే పైన మనం చెప్పుకున్న నాగరిక ఆహార పదార్ధాలు. వాటిని వదులుకోవాలని చెప్పాడు. చరక సుశ్రుతాదులు చెప్పిన పధతిలో ఆయుర్వేద మార్గంలో భోజనం చేస్తున్నది మనమే! అంతేకాదు, అన్నం సంస్కృత పదం అంటారు గానీ, దేశంలో తమ ప్రధాన ఆహారాన్ని ఏ భాష వారూ అన్నం అనటం లేదు. రోటీలు సాపాటులే అందరికీ! అన్నం తింటున్నది తెలుగువారే! అది గ్రామ్యాహారం కాకుండా ఆరోగ్య దాయక్జంగా ఉండాలనేది ఉగాది ప్రబోధం. మనం స్వీటు షాపుకు వెళ్ళినప్పుడు కొద్దిగా రుచి చూసి కొంటాం. ఉగాది పచ్చడిని మన ఆహారం ఇలా ఆరురుచులతో సమృద్ధిగా ఉండాలని రుచి చూపించి ప్రబోధిసతోంది ఉగాది.
ఆహారంలో సహజంగా ఉండే విషదోషాలకు విరుగుడుగా పనిచేసేందుకు వగరు, చేదు రుచులను తింటూ ఉండాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరురుచుల కలయిక తోనే మన ఆహార పదార్ధాలు తయా రౌతాయి. ఆరురుచూలూ ఉన్న భోజనాన్ని షడ్రసోపేత భోజనం అంటారు. నిజానికి మనం షడ్రసోపేతమైన భోజనం చేస్తున్నామా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. ఎవరి ఆహారంలో వగరు రుచి చేదు రుచీ ఉందవో వారి శరీరాలు రోగాలకు తలుపులు తెరిచి నిల్చున్నట్టే లెక్క.
ఆరోగ్యదాయకమైన చేదు మనకు కాకర, ఆగాకర, మెంతుల్లాంటి ద్రవ్యాల ద్వారా, వగరు మజ్జిగ, పసుపు,ధనియాలు ఇంకా కొన్ని ఆకు కూరలద్వారా లభిస్తుంది. మనం వీటిని తక్కువగా వాడి, పులుపు ఎక్కువగా వాడుతున్నాం. పులుపు పెరిగే కొద్దీ ఉప్పు, కారం, తీపి కూడా పెరుగుతాయి. వీటితోనే సరిపోతోంది. ఇంక వగరు చేదు తినే ఉత్సాహం మనకు ఉండట్లేదు. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేందుకే ఉగాది నాడు వగరుగా ఉండే మామిడి వడపిందెల్ని, చేదుగా ఉండే వేపపూతనీ, తీపి, పులుపు ఉప్పు, కారంతో పాటు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాం.
తీపికోసం చెరుకు రసం, బెల్లం, పంచదార, పటికబెల్లం వీటిలో దేన్నైనా కలుపుకో వచ్చు. ఉప్పు తగినంత వేసుకుని కారం కోసం పచ్చి మిరపకాయ ముక్కలు లేదా ఎర్ర కారం కాకుండా మిరియాల పొడినీ వేసుకుని, వడ పిందెలు అంటే బాగా లేత మామిడి పసరు పిందెల ముక్కల్ని, వేపపూవునీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. తెలుగు భాషను పూజించుకుని, పంచాంగానికి దణ్ణం పెట్టి, వేపపూవు ప్రసాదం తినటం ఉగాది నాడు ప్రొద్దున్నే మనం విధిగా జరుపుకునే ఆచారం. ఇందులో కులాల ప్రస్తావన మతం ప్రస్తావన లేదు. అందరి పండగ ఇది. అందరి కోసం, అందరి ఆరోగ్యం కోసం, అందరి సంక్షేమం కోసం జరుపుకుంటున్న పండుగ!
ఉగాది పచ్చడిని ఉగాది రోజున మాత్రమే ఒక చెంచాడు తినటం వలన ఉపయోగం ఏమీ లేదు. దీన్ని సంవత్సరం పొడవునా తినాలనేది దీనిలోని అంతఃసూత్రం. రోజూ కనీసం వేప పూవునైనా కారప్పొడిగా చేసుకుని అన్నంలో మొదటి ముద్దగా తినటం వలన చేదు మనకు చేసి పెట్టే ఉపకారం నెరవేరుతుంది.
వేపపూల కారప్పొడిని ఇలా చేసుకోవచ్చు... ఒక భాగం అల్లం ముద్ద, 2 భాగాలు మిరియాలపొడి, 4భాగాలు జీలకర్ర, పొడి, 8 భాగాలు ఎండిన వేపపూల పొడి , 16 భాగాలు కొమ్ములు దంచిన పసుపు, 32 భాగాలు ధనియాలపొడి వీటిని వేరు వేరుగా దంచి, అన్నీ కలిపిన పొడిని తగినంత ఉప్పు కలిపి భద్రంగా ఒక సీసాలో దాచుకోండి. ఈ వేపపూల కారప్పొడి శరీరంలో విషదోషాలను హరిస్తుంది. ఏడాది పొడవునా తిన వలసిన, తినదగిన ఒక మంచి ఔషధం. దీన్ని ‘వేప వేసవారం’ అంటారు.
ఉగాది మార్గదర్శనం చేసే ఒక ప్రత్యేక పండుగ. మన మనసుల్లో నిర్మలమైన భావనలు పెందించు కోవటమే ఉగాది ప్రత్యేకత. భాష, సంస్కృతి, ఆరోగ్యం ఈ మూడింటి త్రివేణీ బంధమే ఉగాది! 

ఉగాదినాడు విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితం

Tuesday 5 April 2016

ugadi kavi sammerlanam 2016 by A.P. Government

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  ఉగాది కవి సమ్మేళన ఆహ్వానం