ఆహార ప్రణాళికలు
డా. జి వి పూర్ణచందు
పాత దైనంతమాత్రాన గొప్పదీ కాదు, కొత్త దైనంత మాత్రాన తిరుగులేనిదీ కాదు. ఒకప్పటి కూరగాయలకున్న రుచి ఈనాటి కూరగాయలకు
లేదు.ఆధునిక వంటపొయ్యిల మీద వండే వంటల్లో మనం గర్వించ వలసింది కూడా ఏమీ లేదు.
షుమారుగా ఓ ౩౦ యేళ్ల క్రితం వరకూ ‘రామ్ములకాయ’లే మనకు
దొరికేవి. వాటితో వండిన పప్పు అమృతంలా ఉండేది. పచ్చడి గానీ, ఊరుగాయగానీ వాటితో ఎ౦తో కమ్మగా ఉండేవి. ‘రామ్ములక్కాయ’లు టమోటాలుగా సంకరం అయి
మార్కెట్టు కొచ్చాయి. కొన్నాళ్ళు పాత రామములక్కాయల్ని నాటుకాయలంటూ అమ్మేవారు.
క్రమేణా అవి కూడా కనుమరుగయ్యాయి. నేలములక అని, చిన్న పొదలాంటి
చెట్టు౦ది. దాని కాయలు ఈ టమోటా పండు ఆకారంలోనూ, అదే రంగులోనూ ఉంటాయి.
కానీ, బఠాణీ గింజ౦త పరిమాణంలో ఉంటాయి. బహుశా పోర్చుగీసులు టమోటాని మన దేశానికి
తెచ్చినప్పుడు మన ములకపండు కన్నా కొంచెం పెద్దవిగా ఉన్నాయి కాబట్టి, రామములకపండు
అని పిలిచారు. ఆ తరువాత వీటిని ఇతర పళ్లతో సంకరం చేసి కొత్త పంటలను సృష్టి౦చే క్రమంలో
బజ్జీ వంకాయంత (egg
fruit) పెద్ద పరిమాణంలో టమోటా లొచ్చాయి. పరిమాణం పెరిగే కొద్దీ
వాటిలోని స్వారస్య౦ తగ్గిపోతూ వచ్చింది. దీని అర్ధం టమోటా పళ్లలో చిన్నవి బావుంటా యనీ, పెద్దవి రుచిగా ఉండవనీ కాదు. ఆ నాటి రామములక్కాయలకున్న రుచి ఈనాటి టమోటాలకు
లేదనేదే బాధ...అంతే!
ఆమాటకొస్తే ఒకప్పటి కందిపప్పు, పెసరపప్పు,
మినప్పప్పులకున్న రుచి ఇప్పటి వాటికుంటో౦దా? తోటకూర,
పాల కూర లాంటివి వెనకటి రుచినే ఇస్తున్నాయా? రుచిని చెడకొట్టి పండించటానికి కారణా లేమిటీ...?
మధుర రసాలైన మామిడి పళ్ళు నిజంగానే మధురంగా ఉంటున్నాయా...? యాసిడ్ కలిపినంత పుల్లని వాసనతో అతిపుల్లగా ఉండే రసాలను ఒక్కో కాయని 15 ను౦చి 20
రూపాయలకు అంటగడుతుంటే వినోదం చూడటం ప్రభుత్వానికి తగునా? విష కార్బయిడ్లు ఉపయోగించి కాయలను పండుగా మార్చటాన్ని నిషేధించటానికి ఈ
ప్రభుత్వం ఎందుకు జంకు తోంది. కార్బయిడ్లతో పండిస్తే ఆరోగ్యానికి చెడు చేయదని
శాస్త్రవేత్తలు ఏ విషవ్యాపారి పక్షానయినా వకాల్తా తీసుకొని చెప్పారా? కోసిన వెంటనే వ్యాపారుల చేతికి డబ్బు రావాలనే ఆతృత ఈ కార్బయిడ్ వాడకానికి కారణం
అవుతో౦ది. అది పండుని విషతుల్యం చేస్తుంటే మౌనం వహించటం మన వంతయ్యింది.
ప్రజలలో ఆరోగ్యస్పృహ తగినంత లేకపోవటం ఇందుకు ప్రథాన కారణంగా
చెప్పుకోవాలి. సహజమైన జీవిత విధానాన్ని కృత్రిమత్వంతో నింపుకోవటాన్ని ఒక ఘనతగా బావించుకునే
తత్త్వం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. దాన్నిబట్టే అనేక నిత్యావసర వస్తువులు కృత్రిమ విషాలుగా మారిపోతున్నాయి.
సింథటిక్ పాలు,
కబేళా నుంచి తెచ్చిన కొవ్వుతో కాచిన నెయ్యి, పటికపొడి-పసుపు-బెల్ల౦ పిప్పి కలిపి కాచిన తేనె ఇలా ఒకటేమిటీ, జనం వాడుకుంటున్నవాటిలో ‘అసలీ’ ఏదో ‘నకిలీ’ ఏదో తెలుసుకో గలిగేలోగా ఏ కేన్సరో
వచ్చిపోయేవారు పోతున్నారు. పుట్టేవారు ఎ౦దుకూ కొరగాని వారుగా పుడ్తున్నారు. ఎవరెట్లా
పోతే మనకేమి టనుకునే ఉత్పత్తిదారులూ, వ్యాపారులూ, వారిని అజమాయిషీ చేయాల్సిన అధికారులదే దీని ప్రధాన బాధ్యత. అలాగే, మంచీ చెడుల
విచక్షణ చూపించలేని మనదీ బాధ్యతే!
ఒక పళ్ల మొక్క మీద పురుగు మందు చల్లారనుకోండి... చెట్టుకొమ్మలకు, ఆకులకూ పళ్లక్కూడా ఆ విషపు మందు పట్టుకుంటుంది కదా! ఆ పండుని మనం తిన్నప్పుడు
దానితో పాటు విషాన్ని కూడా తిని, ఉంటే ఉంటాం పోతే పోతాం...
ఆ సంగతి పురుగుమందు అమ్మిన వాడిగ్గానీ, చెట్టుకు పురుగు మందు
కొట్టిన వాడిగ్గానీ,
అజమాయిషీ చేసే అధికారిగ్గానీ అనవసరం. ఇదే పురుగు మందుని ఒక
ఆకుకూర మొక్కకు కొట్టినపుడు దాని ఆకుల నిండా ఆ మందే వ్యాపి౦చి ఉంటుంది కదా...
దాన్ని పూర్తిగా మనం తింటున్నాం కదా...!
అమెరికావారు మనకు పురుగు మందులు అమ్ముతారు. కానీ, వారు అమ్మిన ఆ పురుగు మందుల్ని చల్లిన కూరగాయలను, పళ్లను, ఆకు కూరలనూ అమెరికన్లు తినరు. మన దేశీయులు బకరాలు కదా... చచ్చినట్టు పురుగుమందు
కొట్టుకొని తిని,
బతికి నంత కాలం బతుకుతారు.
ఆ మధ్య హైదరాబాదులో జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సులో
బిటి వంకాయలు మాకు వద్దని కొందరు తెలుగు వారు అడ్డుకోగా కన్నెర్ర జేసిన ఆనాటి మంత్రిగారూ, ఆయనకు వంతపాడిన కొందరు శాస్త్రవేత్తలే నిజమైన దేశభక్తులని మనం భావించాల్సిన
పరిస్థితి ఇది!
ఇలాంటి విషపూరిత ఆహారపదార్థాలను ఈ దేశీయులు తినరనీ, ఇది ఆయుర్వేదం లాంటి శాస్త్రాలు పుట్టిన ఙ్ఞాన భూమి అనీ, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులనీ, కల్తీలను, కృత్రిమ విషాలను దగరకు రానివ్వరనీ, ఈ దేశీయులతో జాగ్రత్తగా
వ్యవహరించాలనే భయం దుష్టశక్తుల కున్నప్పుడు కదా, ఇలాంటివి ఆగేది...!
రెండు వందల ఏళ్ల క్రితం మన తెలుగు వారి మామిడి కాయలను, ఊరగాయలను,
పళ్లరసాలనూ ఎగబడి కొనేది అమెరికా! అమెరికాతో వ్యాపారం ఊపందుకొన్నాక, ఇక్కడి డచ్చి,
ఫ్రె౦చి, ఇంగ్లీషు వ్యాపారులు
తెలుగు ప్రజల్ని ప్రోత్సహించి, రకరకాల ఊరుగాయలను మనతో
తయారు చేయించి అమెరికా ఎగుమతి చేసేవారు. తెలుగు వారికి ఊరగాయల తయారీలో అంత
ప్రసిద్ధి రావటానికి ఆనాటి అంతర్జాతీయ
వాణిజ్య౦ ఒక కారణం. క్రమేణా అమెరికాలో కూడా కొన్ని ప్రా౦తాల్లో మామిడి పండటం మొదలయ్యింది.
దాంతో బారతదేశపు మామిడి పళ్ల దిగుమతి తగ్గించుకుంది అమెరికా! గత పదిహేనేళ్ళుగా మన
మామిడి పళ్ళను నిషేధించింది కూడా!
మనం వాళ్ల పురుగు మందులూ, ఎరువులూ కొని స్వామి భక్తి చాటుకుంటున్నాం. అమెరికా మాత్రం మన ఉత్పత్తుల్ని
నిషేధిస్తుంది. మన ఒక వస్తువును వాళ్ళు నిషేధిస్తే బదులుగా హాని కారకమైన వారి మరొక
వస్తువును మనం నిషేధి౦చ గలిగే స్థితిలో ఉంటే వాణిజ్య౦ గౌరవప్రదంగా జరిగినట్టు
లెక్క.
ఎల్లకాలం మనం
పుచ్చుకొనే స్థితిలో (receiving
End) ఉండాల్సినంత అగత్యం మనకేముంది..? మనకు కావల్సిన దాన్ని కొనుక్కొనే స్వేచ్చ మనకుండాలి. అమ్మే వాడి దగ్గర ఉన్నదాన్ని
చచ్చినట్టు కొనుక్కుని వెళ్లటం అంటే, మనకి ఏది అవసరమో
అమ్మేవాడు నిర్దేశించటం అని అర్ధం. మనకు కావాల్సిందాన్ని మనం కోరి కొనుక్కునే కమాండింగ్
స్థితి మనకు ఉండాలి. లేకపోతే రేపు కాకా హోటల్లో కూడా ఇడ్లీ అట్టు, పూరీలకు బదులు పీజ్జా,
రోటీలు ఉంచి ఇవి మాత్రమే తినాలని మనల్ని శాసించే ప్రమాదం ఉంటుంది.
పెద్దపెద్ద మాల్సు ఏర్పడుతున్నకొద్దీ వినియోగదారుని ఇలా నిర్దేశించే ధోరణి మరింత
పెరుగుతు౦ది. మనలో అలాంటి వ్యవస్థపట్ల మోజు పెరగకుండా ఉండాలి. వ్యామోహం వలన మనం
చాలా నష్ట పోతాం!
ఇదంతా ప్రణాళిక లేని జీవిత విధానం వలన కలుగుగుతున్న ఇబ్బంది.
మనకు ఆర్థిక ప్రణాళిక,
ఆరోగ్య ప్రణాళిక, ఆహార ప్రణాళికలతో పాటు, ఆహార పదార్థాలను కొనే ప్రణాళిక కూడా కావాలి. సాంప్రదాయక మైన, సంస్కృతీ సంపన్నమైన మన జీవన వ్యవస్థను
అగౌరవ పరచు కున్నందు వలన కలిగే నష్టం ఇది!