పాలగుజ్జు అనే ‘కోవా’ కథ
డా|| జి. వి. పూర్ణచందు
“ఓ
అందమైన బావా... వహ్‌వా! ఆవు పాలకోవా... వారేవా!
విందుగా పసందుగా ప్రేమనందుకోవా...”
జూనియర్ సముద్రాల రాసిన ఈ తెలుగు
సినిమా పాట తెలుగు వారికి పాలకోవా అంతటి ఇష్టమైనది.
“రాగాల
రవ్వట్టు, భోగాల
బొబ్బట్టు, నా
ప్రేమ పెసరట్టు” తినవా
అనడుగుతుంది మరదలు పిల్ల.
అతను నో నో అంటూ తప్పించుకుంటూ
ఉంటాడు.
పాలకోవా తినని వాడికి ప్రేమలో తీపి
ఏం తెలుస్తుందన్నట్టు చూస్తుంది ఆమె!
పాలకోవా భారతీయుల అచ్చమైన తీపి
వంటకం. పాలను చిక్కగా మరిగించిన రకరకాల తీపి వంటకాలు గురించి బౌద్ధ సాహిత్యం లోనే
అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.సిహకేసర,
మొరందకె లాంటివి ఆనాటి పాలస్వీట్లు.
మౌర్యుల కాలం లోనూ, గుప్తుల కాలంలో
కూడా పాలను ఘనీభవింప చేసిన కోవా తీపిభక్ష్యాలు ప్రసిద్ధంగా ఉండేవి. కానీ, ఆహార
చరిత్రకారులు అంతకు పూర్వ చరిత్రను వదిలేసి,
స్వీట్లంటే బెంగాల్ వారి ఆస్తి అనే భావిస్తారు. ఆ ఘనతను కూడా పూర్తిగా
బెంగాలీలకు దక్కకుండా పోర్చుగీసుల నుండి నేర్చుకున్నవిగా చిత్రిస్తారు.
నిజానికి పాలను విరగకొట్టి చేసే
స్వీట్లు మాత్రమే పోర్చుగీసులు బెంగాలీలకు అంటగట్టారు.
విరిగిన పాలతో స్వీట్లు ఆయుర్వేద
శాస్త్రం ప్రకారం నిషిద్ధం. అందుకని మన
పూర్వులు వాటిని మెచ్చేవారు కాదు. పోర్చుగీసుల నుండే పాలవిరుగుడు స్వీట్లు అలవాటై, బెంగాలీ
స్వీట్లుగా వ్యాప్తికొచ్చాయి. కోవా కూడా వాటిలో . కలిసిపోయింది.
పాలను ఘనీభవింప చేసే వంటకాలు
అనాదిగా మనకు తెలుసు. ఖోవ అనేది ప్రాకృత పదం. ఇక్షు(తియ్యనైనది) ఉఖ (లోక
ప్రియమైనది) అని దాని అర్థాలు. కోయా,
కోవా, అని
కూడా పిలుస్తారు. ‘మావా’ అన్నా ఇదే! ఖోవ
పేరుతో ఊళ్ళపేర్లు, ఇంటిపేర్లున్నాయి.
ఖోవ అనే ఒక జాతి ప్రజలు ఇండో చైనా సరిహద్దు ప్రాంతాల్లో జీవిస్తున్నారు.
ఏ కారణం చేతో, ప్రాచీన తెలుగు
సాహిత్యంలో మాత్రం ఈ పాలకోవా ప్రస్తావన ప్రముఖంగా కనిపించదు. అలాగని, దాని గురించి మన
పూర్వులకు ఏమీ తెలీదనుకోవటానికి వీల్లేదు.
“గుజ్జుగా గాఁచిన గోక్షీర పూరంబు జమలిమండెగలపై జల్లిజల్లి
...” అంటూ
శ్రీనాథ మహాకవి పాలకోవా తయారీని వివరిస్తాడు. ఆవుపాలను గుజ్జుగా కాస్తే, కోవా
తయారౌతుంది.
జమిలిమండెగలు అంటే, రెండు రొట్టెల
మధ్య తీపిని ఉంచిన బర్గర్. ఈ జమిలిమండెగల పైన కోవాతో చక్కని డిజైన్లు వేసేవారని
శ్రీనాథుడి ఈ వర్ణన బట్టి తెలుస్తోంది.
ఈ డిజైన్ కూడా పెళ్లి కూతురు కట్టిన
చీర జరీ అంచులా ఉందంటాడు శ్రీనాథుడు. కోవా మనకి కొత్త కాదన్నమాట!
పాలలో నీరంతా ఆవిరైపోయేంత దాకా
కాయటం వలన పాలలోని హానికర సూక్ష్మజీవులన్నీ నశించిపోయి ఏ మాత్రం చెడు కలిగించని
స్వచ్ఛమైన (sterile) వంటకంగా
తయారౌతుంది పాలకోవా!
నిలవుంటే పాలు ఎలా పాడైపోతాయో కోవా
కూడా అలానే పాడైపోతుంది. కోవా తయారయ్యాక శుభ్రత పాటించకపోతే దాని మీద ఫంగస్
లాంటివి చేరి అది చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.
కోవాని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.
ఫ్రిజ్జులో కూడా 4-5
రోజులకు మించి ఉంచకండి. సాధ్యమైనంత వరకూ దీన్ని ఇంట్లో
తయారు చేసుకోవటమే ఉత్తమం.
మైదాపిండి కలిసినవి, పాలపొడితో
తయారైనవీ అంత రుచిగా ఉండవు. ఆరోగ్యదాయకం కూడా కాదు
పాలగుజ్జు స్వచ్ఛమైన తీపి వంటకం.
గాలిలో మనకు తెలీకుండానే సంచరించే సూక్ష్మజీవులు కోవాని త్వరగా ఆవహిస్తాయి.
అందుకని, అప్పటికప్పుడు
చేసుకుని తినటం వలన ‘తినరా
మైమరచి’ అనటం
సార్థకం అవుతుంది.
No comments:
Post a Comment