Tuesday 22 July 2014

మనసులోని మర్మాలు దాచుకోలేని కవిత డా. జి వి పూర్ణచందు

విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా పద్యానుభవం శీర్షికలో ఈ ఈవారం ప్రచురితం
మనసులోని మర్మాలు దాచుకోలేని కవిత
డా. జి వి పూర్ణచందు
“వరబింబాధరమున్,పయోధరములున్ వక్రాకంబుల్ మనో
హర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత యేమాయె, నీ
గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకుంజాలదె గంగ క
ద్దరిమే లిద్దరి కీడునున్ గలదె యుద్య ద్రాజబింబాననా!
తెనాలి రామకృష్ణుడు ఏ కూరగాయలు కొనుక్కోవటానికో మార్కెట్టుకు బయల్దేరాడు. కొంటెవాడు కాబట్టి అక్కలవాడగా పిలువబడే రెడ్‘లైట్ ఏరియా మీదుగా నడిచి వెడ్తున్నాడు. ఏ అమ్మయి కళ్లలోనైనా పడకపొతానా...అని దిక్కులు చూస్తూ నడుస్తున్నాడు. ఓ ఇంటి ముందు తనకు తగ్గ ఓ సుందరి కనిపించింది. ఆమె అతన్ని చూసింది. అతని భయంకరమైన పళ్ళు చూసి భయపడిందో లేక అతని ముగ్ధమోహనరూపానికి అచ్చెరువొందిందో గాని... ఠక్కున తలుపు చాటుకు ముఖం దూర్చేసింది. నడుముకు పైభాగం అంతా తలుపు వెనకాల ఉండగా, నడుముకు కింది భాగం అంతా తలుపుకు ఇవతలవైపున ఉంచి గుమ్మంలో వయ్యారంగా నిలబడింది. అతను మాత్రం ఆమె తనను చూసి సిగ్గుతోనే అలా చేస్తోందని అనుకున్నాడు.
ఆమెని ఉద్వద్రాజబింబాననా అని పిలిచాడు! అంటే, ఉదయిస్తున్న నిండు పున్నమి చంద్రుడు మబ్బు చాటున నక్కి చూస్తున్నట్టు, సగం శరీరాన్ని మాత్రమే చూపిస్తూ నిల్చున్నదానా...అని!
కనిపించిన వాటికన్నా కనిపించని వేవో గొప్పవనే దురాశ తెనాలి కవికి లేదు. చాలా పెద్దదైన ఆ నడుముని చూసి ఆమె వక్షోజాల పరిమాణాన్ని ఊహించుకున్నాడు. నీ జఘనం ఘనంగా ఉంది. నీ క్రొమ్ముడి అంతకంటే సౌకర్యవంతంగా ఉంది. ఇటువైపు కనిపించే సోయగాల్ని బట్టి అటువైపు దాక్కున్న సోయగాలు కూడా ఘనంగానే ఉంటాయీ...అని ఊహించాడు. మొత్తం మీద ఆమె అందగత్తేనని నిర్థారించుకున్నాడు.
మబ్బుచాటున సగం దాగిన చంద్రబింబమా! నీ ఎర్రని పెదాల్ని చీకట్లోకి తిప్పేశావు, ముఖంలో శృంగార చిహ్నాలైన అలకల వంటివి కనిపించకుండా దాచేశావు. చూడగానే ఐసైపోయే నీ కళ్ళని ఆ వైపే ఉంచేశావు! ఇంక నీ వక్షోజాల గొప్పతనం చెప్పనవసరంలేదు వాటిని కూడా ఆ వైపే అట్టేపెట్టేశావు” అన్నాడు. ఇది ఒకవిధమైన నిందా స్తుతి! బావున్నవంటూ పొగుడ్తూనే సరిగా చూడనివ్వలేదని ఎత్తిపొడుపు ఆయన మాటల్లో స్పష్టంగా ఉంది! ఆమాటలకు ఆమె నవ్వుకునే ఉంటుందని భావించాడు. ఆ అక్కలవాడ చిన్నదానికి ఈ మహాకవి మాటలు అర్థం అయి అది నిజంగానే నవ్వుకుందా లాంటి ప్రశ్నలు అప్రస్తుతం. రసపట్టులో తర్కం కూడదు.
ఆ తలుపుని గంగా ప్రవాహంతో పోల్చాడు. ఆ తలుపుకు ఇటు వైపున ఉన్న ‘శరీర దిగువ భాగం’ నదికి ఈవలిగట్టు అయితే, తలుపుకు అవతలి భాగాన దాగున్న చంద్రబింబం లాంటి ముఖమూ, వక్షోజాలు వగైరా ఆవలి గట్టుగా భావించాడు. నదికి ఇటు గట్టు ఎలాంటిదో అటు గట్టూ అలాంటిదే! ‘గంగకద్దరి మేలిద్దరి కీడునున్ గలదె...” గంగానదికి అటు గట్టు మేలు, ఇటు గట్టుకీడు అనేది ఉంటుందా...? అని ప్రశ్నించుకున్నాడు. ఇటు వైపు కనిపించే జఘనాదులు తనకు చక్కగా సరిపోయేవే కాబట్టి, నడుము పైభాగాన ఉండే వక్షోజాదులు కూడా చాలినవే అయిఉంటాయని ఆశించాడు. ఇవతలి గట్టు మీద ఎక్కువ ప్రేమ, అవతలి గట్టు మీద తక్కువ ప్రేమా ఉండవు కదా అని తనను సమాధానపర్చుకున్నాడు. ముఖ వక్షోజాలు, నడుము దిగువ భాగాలూ రెండింటి మీదా తనకు సమాన ప్రీతే ఉందని చాటుకున్నాడు.      
          ఈ పద్యంలో అసలు గమ్మత్తంతా “గురు భాస్వజ్జఘనంబు” అనటంలో ఉంది. సాధారణంగా అందమైన ఆడపిల్ల నడుముని సన్నగా నాజూకుగా ఉండే వాటితో పోలుస్తారు ఎవరైనా! కానీ తెనాలి రామకృష్ణ కవి గురు భాస్వజ్జఘనంబు-ఆమె చాలా లావైన నడుము కలదనీ, ఆ నడుము తనకు చాలినదేననీ ఘనంగా చెప్పుకున్నాడు. దాన్ని బట్టి తెనాలి కవి వరేణ్యుడి ఆకారాన్ని ఎవరైనా ఊహించుకోవచ్చు! ఆమె లావైన నడుము ఈయన లావైన పొట్ట బరాబరు అన్నమాట.
          ఆ పిల్లలో ఏం నచ్చిందని ప్రేమించావురా అని ఎవరూ వికారంగా ఉండేవాణ్ణి అడగరు కదా! గంతకు తగ్గ బొంతనే ఎంచుకున్నాడు ఈ చాటు కవి. ఇది రామకృష్ణుడి పద్యమేనని పండితుల భావన. ఒకవేళ అదే అయితే, తెనాలి రామకృష్ణుడు లేదా రామలింగడు ఏయన్నారేమీ కాడని మనం కచ్చితంగా నమ్మవచ్చు. మనసులోని మర్మాన్ని దాచుకోలేక కవి తన రచనలలో ఏదో ఒక రూపంలో బయట పెట్టుకుంటాడు. దాన్ని బట్టే విశ్లేషకులు కవుల జీవిత చరిత్రలు తయారు చేస్తారు.
తెనాలి రామకృష్ణుడి పాత్రని అక్కినేని నాగేశ్వరరావు, చంద్రమోహను లాంటి అందగాళ్ళు వేశారు కాబట్టి రామకృష్ణ కూడా అలాగే అందమైన వాడని ఊహించుకుంటాం.
నిజానికి  తెనాలి రామకృష్ణ లేదా రామలింగడు భీకరమైన ఎత్తుపళ్ళ వాడనీ, కృష్ణదేవరాయలు పొట్టిగా పీలగా ఉంటాడనీ, ముఖం స్ఫోటకం మచ్చలతో వికారంగా ఉంటుందనీ కొందరు పరిశోధకులంటారు. కానీ, జాతి హీరోలుగా మన భావాల్లో నిలిచిపోయిన వాళ్ళని అలా అందమైన రూపాల్లో ఊహించుకో గలగటమే శ్రేయస్కరం. రామకృష్ణుడు అందగాడేనని మనం నమ్మితే వచ్చే అపకారం ఏమీ లేదు. కాదని నిరూపించేందుకు కసరత్తు చేయటం వృథా ప్రయాస. ఈ చాటు పద్యానికి ఎవరో ఊబకాయుడే కర్త కావచ్చు.