Thursday 16 April 2015

పదేళ్ళ క్రితమే ఊహించిన రాజధాని అమరావతి -డా. జి వి పూర్ణచందు



పదేళ్ళ క్రితమే ఊహించిన రాజధాని అమరావతి -డా. జి వి పూర్ణచందు

కృష్ణా తీరంలోని ప్రాచీన రాజధాని నగరాల గురించి 2005లో మొదలు పెట్టి దాదాపు నలబై వారాలపాటు రేడియో ప్రసంగాలు చేశాను. 2006లో “అలనాటి పట్టణాలు పేరుతో పుస్తక రూపంలో ఈ వ్యాసాలు వచ్చాయి. అందులో అమరావతి గురించి వ్రాస్తూ, “భవిష్యత్తులో ఇది మళ్ళీ తెలుగువారి రాజధాని నగరం అయినా ఆశ్చర్యం లేదనీఆ క్షేత్ర మహాత్మ్యం అలాంటిదనీ వ్రాశాను. ఒకనాటికి అమరావతికి ప్రాధాన్యత వస్తుందనే నమ్మకం గట్టిగా ఉండేది మా జీవిత కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి అవతరించ నుండటం ఆనందంగా ఉంది.
కృష్ణాగుంటూరు జిల్లాల్లో ఏ వూరును పలకరించినా తట్టలకొద్దీ చారిత్రక అంశాలను తవ్వి పోస్తుందనీచారిత్రక ప్రాధాన్యత కలిగినమహత్తు కలిగిన క్షేత్రాలనూఆ చరిత్రనూ మనం అలక్ష్యం చేయకూడదని చరిత్ర ఒక పాఠం నేర్పుతోంది. బౌద్ధం,జైనంశైవాలకు ఆనాటి అమరావతి నెలవుగా ఉండేది. శాతవాహనులతో ప్రారంభించి బ్రిటిషర్ల వరకూ ప్రతి రాజవంశమూ అమరావతి కేంద్రంగా పాలించింది. కాకతీయ ప్రతాప రుద్రుడు చాలా కాలం ఇక్కడే ఉన్నాడు. ఆయన కాలంలో జైనులను మోసపూరితంగా కాశీ పండితులు ఓడించటంఓడిన జైనుల్ని గానుగలో వేసి ఆడించటం లాంటి కథలు ఇక్కడే జరిగాయని గుంటూరుజిల్లా కైఫీయత్తుల్లో ఉంది. బ్రిటిషర్ల ప్రోద్బలంతో ౩౦౦ మంది చెంచు జాతి ఆదివాశీలను కుట్రపూరితంగా చంపిన సంఘటన కూడా అమరాతికి సంబంధించిన కథే! వీటిని అలా ఉంచితే ఇది బుద్ధుడు స్వయంగా ఇక్కడకు వచ్చికాలచక్ర తంత్రాన్ని నేర్పించాడని తాను నమ్ముతున్నట్టు ప్రకటించిన దలైలామా అమరావతి నగర ప్రశస్తిని లోకానికి చాటాడు.
రెండు శతాబ్దాల క్రితంరాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారికి అక్కడ తాను త్రవ్విస్తున్న మట్టి దిబ్బ అడుగున తొలి బౌద్ధ చైత్యారామాలలో ఒకటైన బౌద్ధ స్తూపం ఉందనిదాన్ని ధ్వంసం చేస్తున్నాననే గ్రహింపు లేదు. రాజధాని నిర్మించటమే ఆయన ధ్యేయం. ఇప్పుడుకూడా అదే తప్పు జరక్కూడదు. రాజా వారి కాలాని కన్నా చారిత్రక అవగాహన ఎక్కువగా ఉన్న యుగం ఇది. రాజధాని నిర్మాణ ఆత్రుతలో మట్టితో కప్పబడిన చరిత్రని అప్పటిలాగా తవ్వించేస్తే,విలువైన చారిత్రక వారసత్వ సంపదను నష్టపోయే ప్రమాదం ఉంది. భారతీయ పురావస్తు పరిశోధనల శాఖ(A.S.I.)వారు ముందుగా మేల్కొని చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. జరగకూడని నష్టం జరిగాక అయ్యో అనుకున్నా ప్రయోజనం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అమరావతి అని ఆ ఊరికి వెంకటాద్రి నాయుడు నామకరణం చేయటం గురించి ఘనంగా చెప్పారు. రాజావారి స్ఫూర్తిని మన ముఖ్యమంత్రిగారు పొందినట్టు కనిపిస్తోంది. చారిత్రక స్థలాల పరిరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటే ఇది ఆహ్వానించదగిన అంశమే!
అమరావతి బౌద్ధ స్తూపంలోని మొత్తం ఫలకాలలో పోయినన్ని పోగా ఆనాటి బ్రిటిష్ అధికారులు తస్కరించినన్ని తస్కరించగామిగిలినవి కొన్ని ఇప్పటి అమరావతి మ్యూజియంలోనూమద్రాస్ మ్యూజియంలోనూ ఉన్నాయి. ఎక్కువ భాగం లండన్ నగరంలోని బ్రిటిష్ మ్యూజియంలో ఒక ప్రత్యేక అంతస్తులో చలువమందిరంలో భద్రంగా ఉన్నాయి. గుడివాడ బౌద్ధ స్తూపంలో దొరికిన బుద్ధుని అస్థికల భరిణలు మూడు కూడా అక్కడే ఉన్నాయి. శ్రీ బుద్ధప్రసాద్ గారితోనూ శాసనమండలి అధ్యక్షులు శ్రీ చక్రపాణిగారితోనూ కలిసి ఈ బ్రిటిష్ మ్యూజియంను సందర్శించే భాగ్యం నాకు కలిగింది.
ప్రేమలో పడేసే భాష
“తెమ్ము బంగారు కుండ జలమ్ము లనుచు( / దెమ్ము లతకూన మంచి సుమమ్ము లనుచు(
దెమ్ము బాగైన కొమ్మ ఫలమ్ములనుచు / మించుబోడిని నేరుపు మించ( బలుకు” అని చేమకూర వేంకట కవి విజయవిలాసంలో రెండర్థాల పద్యం ఒకటి వ్రాశాడు. బంగారు కుండలో నీళ్ళు పట్టుకురా! లేతతీగ కున్నమంచిపువ్వులు పట్టుకురా! బాగైనకొమ్మకు కాచిన పళ్ళు పట్టుకురా!” అని, కపట సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడు సుభద్రని ప్రేమలోకి దింపేందుకు వాడిన రెండర్థాల భాష పద్యంలో కనిపిస్తుంది. “బంగారు కుండా! నీళ్ళు పట్టుకురా! లేత తీగలా నాజూకుగా ఉన్నదానా! మంచి పూలు పట్రా! బాగైన కొమ్మా(అందమైన అమ్మాయీ)! పళ్ళు పట్టుకురా!” అనేది ఇంకో అర్థం. బంగారు కుండల్ని కుదురైన స్తనాలతోనూ, పూలను మేను మార్దవంతోనూ, పళ్లను ప్రేమలోని తియ్యదనంతోనూ పోలుస్తున్నాడు అర్జునుడు.
కవులు ఇలా రాస్తారు, సినిమా వాళ్ళు కూడా ఇలానే తీస్తారు గానీ, ఇంతమాత్రానికే ఆడపిల్లలు ఫ్లాట్ అయిపోతారని మగాళ్లు ఊహించటం అన్యాయం. స్త్రీలప్రేమ నీటి బుడగలాంటిదనీ అదిపైపై మెరుగులుచూసే గానీ, అందులో చెప్పుకోదగిన లోతేమీ ఉండదనే భావన ఎక్కువ మందిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 16వ శతాబ్ది నాటి చేమకూర వెంకట కవి గారి కాలానికీ, నేటి సినిమాల కాలానికీ ఈ విధమైన మగభావనలో ప్[ఎద్ద తేడా ఏమీ లేదు.
కానీ, ఒక వాస్తవాన్ని మనం మరిచిపోకూడదు. ప్రేమ పెళ్ళిళ్ళు కానీండి, పెద్దలు చేసిన పెళ్ళిళ్లు కానీండి, మూణ్ణాళ్ళ ముచ్చటగా ముగిసిపోతున్న సందర్భాలు నానాటికీ పెరగటానికి దంపతుల మధ్య ఉత్త ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ కుదరక పోవటం ఒక ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ప్రేమ బలంగా ఉన్నప్పుడు చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది అది లేనప్పుడు రామా అంటే ఏదోలా వినిపించినట్టే అవుతుంది. ‘ప్రేమలో గాఢతతగ్గినప్పుడు అది దేవదాసు ప్రేమలా అస్థిరంగానూ, బలహీనంగానూ, పిరికిగానూ ఉంటుంది.
రతి కార్యానికి ముందు బలమైన ఉత్తేజం కలగటానికిఉపరతిఎలా ఉపయోగ పడుతుందో, బలమైన ప్రేమను పొందటానికిఉపప్రేమవాచకాలు అలా ఉపయోగ పడతాయి. రెండర్థాల సంభాషణ అలాంటి ఒకఉపయోగం. ప్రేమ బలంగా ఉండాలంటేఉపప్రేమఅవసరంసినిమాల్లో చూపించినట్టు  ‘సిటీబస్సు ప్రేమ’ (బస్సులో చూడంగానే ప్రేమించేయటం, స్విజ్జర్లాండు మంచుకొండల్లో డ్యూయెట్టు పాడుకోవటం) లాంటి ప్రేమలు పెళ్ళిదాకా వెళ్ళేవి తక్కువ. వెళ్ళినా ప్రథమ వైవాహిక వార్షికోత్సవం జరుపుకున్నవి కూడా తక్కువే! బలమైన ప్రేమను పొంది, శాశ్వతమైన దాంపత్య బంధాన్ని పెంచుకోగలగాలి! పెద్దలు చేసిన పెళ్ళిళ్లక్కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది
సుభద్రలో తనపైన ప్రేమని రెచ్చగొట్టి, దాన్ని భద్రం చేసుకోవటానికి అర్జునుడు ఎన్ని కష్టాలు పడ్డాడో కావ్యం చదివితే తెలుస్తుంది. ప్రతీదీ సులభమ్ముగా సాధ్యపదదులెమ్ము-నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ముఅని గాలిబ్  గీతాన్ని దాశరథి గారు అనువదించి వ్రాసింది ప్రేమకు కూడా వర్తిస్తుంది. ప్రేమలో పడేయటానికి, ప్రేమలో పడటానిక్కూడా ప్రేమభాష తెలిసి ఉండాలి. నమ్మకాన్ని పెంచటం, నమ్మకాన్ని నిలబెట్టటం, నమ్మగలగటం అనేవి భాషలో ముఖ్యాంశాలు. అవి సుస్థిరంగా ఉండాలి. విడాకుల బారిన పడకుండా ఉండాలంటే ప్రేమికులు నేర్వాల్సింది ప్రేమభాషనే!


అనువాదంలో తెలుగు దనం :: డా. జి వి పూర్ణచందు

అనువాదంలో తెలుగు దనం
డా. జి వి పూర్ణచందు
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!”
                సాగర మథనం జరుగుతోంది. సురాసురు లిద్దరూ పోటాపోటీగా మథనం చేస్తున్నారు. చల్లకవ్వంగా ఒక కొండ, కవ్వం తాడుగా ఒక పాముఅట్నుండి దేవతలు, ఇట్నుండి రాక్షసులు కలిసి చెరోవైపూ నిలబడి రాగుంజులాట, పోగుంజులాట లాగా చిలకగా చిలకగా హఠాత్తుగా అమృతానికి బదులు హాలాహలం పుట్టింది. అది సముద్రాన్ని దాటి పొంగి పొరిలి లోకాల్ని నాశనం చేయసాగింది.
రాక్షసులకు నిలువెల్లా విషమే కాబట్టి హాలాహలానికి వాళ్ళు పెద్దగా భయపడలేదు కానీ, దేవతలు బాగా వణికి పోయారు.
వాళ్ళ భయం వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే దేవతలకు చావుపుట్టుకలూ, ఆకలిదప్పులూ ఉండవు కదా…! లోకం గురించే వాళ్ళ ఆందోళన. లోకక్షేమం గురిచి ఆలోచించేవాడు దేవుడు, లోక సంక్షోభ కారకుడు రాక్షసుడు. అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకొన్నారు. దేవదానవుల గొడవలో తలకాయ దూర్చని శివుడు విష ప్రభావం వలన విశ్వం యావత్తూ అల్లకల్లోలం అవుతోంది కాబట్టి లోకాన్ని కాపాడటానికి ముందుకొచ్చాడు. హాలాహలం మొత్తాన్ని తాగేస్తానని ప్రకటించాడు! తాగేముందు ఒకసారి తన భార్య పార్వతి వంక చూశాడు.
మామూలు ఇల్లాలైతే భర్త విషం తాగుతానంటే ఎలా స్పందిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. కానీ, పార్వతీ దేవి చిర్నవ్వు నవ్విహలాగేనండీఅన్నదట! పద్యంలో పోతనగారు ఒకే ఒక వాక్యంలో ఇలా చెప్తారు: “మేలని ప్రజకున్ మ్రింగుమనె సర్వమంగళఅని!
ఆవిడ ధైర్యం అంతా ఆవిడ మంగళ సూత్రమేనట. తన తాడు గట్టిది కాబట్టి, దాన్ని మహాదేవుడు కట్టాడు కాబట్టి,  అది తేలిగ్గా తెగేది కాదు కాబట్టి, జనం మేలు కోసం విషమైతేనేం తాగేయవయ్యాఅని చెప్పిందట. తన మాంగల్యం గట్టిని నమ్ముకున్నదనే సూచన కోసం ఆమెను సర్వమంగళా…’అంటాడు పోతన! మ్రింగేది గరళం అయినప్పటికీ మ్రింగేవాడు తన భర్త కాబట్టి, ప్రజలందరికీ మేలు కలుగు తుంది కాబట్టి, సర్వమంగళ తన మనసులో మంగళ సూత్రాన్నే ఎంతగానో నమ్ముకుని, శివుడికి తన అంగీకారం తెలిపిందని దీని భావం. భర్త లోకోపకారం చేస్తున్నప్పుడు, తెలుగమ్మాయైనా స్వంత లాభ నష్టాలను చూడదన్నమాట! ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందన్న ఆంగ్ల సామెతకి ఇది నిదర్శనం.
వీరతిలకాలు దిద్ది భర్తల్ని యుద్ధాలకు పంపిన వీర నారీమణులు, భర్త యుద్ధం లోంచి పారిపోయి వస్తే పసుపు నీళ్ళు పోసి తలంటి, రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధానికి పంపిన మహా పతివ్రతలూ దేశ సంస్కృతికి వారసులు. పార్వతి వాళ్లందరినీ ఒక్క క్షణం గుర్తుకు తెస్తుంది పద్యం ద్వారా!
శుకమహర్షి హాలాహలం కథ చెప్పినప్పుడు పరీక్షిత్తుమహారాజుకు  సందేహం వచ్చి, “మహర్షీ! ఎంత మహాదేవుడైతే మాత్రం, ఆయన గరళం తాగుతుంటే పార్వతి ఏమీ అనలేదా?” అని అడిగాడట. అప్పుడు శుకమహర్షి చెప్పిన సమాధానమే పద్యం.
మూలభారతంలో, శివుడు పార్వతి వంక తాగమంటావా అన్నట్టు చూశాడని, ఆమె చిర్నవ్వుతో ఒప్పుకుందనీ, వర్ణించారు. పోతనగారు ఆంధ్రమహా భాగవత రచన కదా చేస్తోందిఅందుకని, పార్వతిని తెలుగమ్మాయిని చేసి, “నా తాడు గట్టిది!” అనిపిస్తాడు.
తాళి బొట్టుకు తెలుగు మహిళ ఎలాంటి ప్రాధాన్యత నిస్తుందో, ఒక్క మాట ద్వారా చెప్పేశాడు పోతన. అదీ కవిసమయం అంటే!
నిబద్ధత కలిగిన అనువాదకుడు తను తెలుగులోకి తెస్తున్న కథలో తెలుగుదనం నింపకుండా ఆపుకోలేడనటానికి ఇదే సాక్ష్యం.

తెన్నేటి సూరి రెండు మహానగరాలు నవలను ఆంగ్లం లోంచి తెలుగులోకి తెస్తూ, “సంగీతంలో సాపాసాలు తెలీని వాడు నేను పాడిన బిళహరి రాగాన్ని వెక్కిరిస్తే నా కేవిటీ…?” అని వ్రాస్తాడు. అందుకే నవల గొప్ప అనువాద నవలగా వాసికెక్కింది.