Tuesday 5 May 2015

తొలి తెలుగు నాటక సన్నివేశాలు :: డా. జి వి పూర్ణచందు

తొలి తెలుగు నాటక సన్నివేశాలు
డా. జి వి పూర్ణచందు

డిఅరస్స అసుద్ధమనసః కులవహూణి అఅకుడ్డలిహిఇం
ది అహంకహేఇరామాణులగ్గ సోమిత్తిచ రిఆఇం
ఇది గాథాసప్తశతిలో ఒకగాథ. ఛందస్సుతో ఉన్న రచనని తెలుగులో పద్యం అన్నట్టే, సంస్కృతంలో శ్లోకం అనీ ప్రాకృతంలో గాథ అనీ అంటారు. కాలక్రమంలో ఈ గాథ కథకు పర్యాయంగా వ్యవహారం లోకి వచ్చింది. ఈ గాథల్లోలు అంటే పద్యాల్లో సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి ముందూ వెనకల అనేక సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలకు తగిన రీతిలో ఈ సన్నివేశాన్ని ఆపాదించుకుని గాథను అర్ధంచేసుకోవాలి. సంఘటనతో కూడిన సన్నివేశ చిత్రణే నాటక రచనకు మూలంగా కనిపిస్తుంది.
క్రీ.శ. 1 లేదా2వ శతాబ్దానికి చెందిన ఆంధ్ర శాతవాహన ప్రభువు హాల చక్రవర్తి ఆనాటి అనేక మంది గాథా రచయితల రచనలను ఏరి కూర్చి గాథాసప్తశతిపేరుతో వెలువరించిన ఒక సంకలనం. స్థూలంగా గాథాసప్తశతి అంటే గాథల కోశం అని అర్ధం. ఇది కృష్ణా గోదావరీ తీర ప్రాంతాలలో నివసించిన ఆనాటి తెలుగు ప్రజల సామాజిక జీవనానిలి తొలి సాక్ష్యాలు. ఇవి ప్రాకృత భాషలో ఉన్నాయి. ప్రాకృతం అంటే natural, common అనే అర్ధాలలోనూ, సంస్కృతం అంటే refined అనే అర్ధంలోనూ ఏర్పడిన పదాలు. ప్రాకృతం సహా అనేక భాషాపదాలను ఇమిడ్చి పండితులు రూపొందించిన భాష సంస్కృతం. ప్రజలు మాట్లాడుకునే నాటుభాష లేదా ప్రజాభాష ప్రాకృతం.
తొలి శాతవాహనుల కాలంలో సంస్కృతం కన్నా నాణ్యమైన ప్రాకృతానికి రాజాదరణ ఎక్కువ ఉండగా, ప్రజలు మాత్రం దేశిభాష తెలుగులోనే మాట్లాడేవారని పరిశోధకుల భావన. అందుకే ప్రాకృత గాథాసప్తశతిలో తెలుగు పదాలు ధారాళంగా కనిపిస్తాయి. తిరుమల రామచంద్ర, చీమకుర్తి శేషగిరిరావు, బూదరాజు రాథాకృష్ణ ప్రభృతులు ఈ కోణంలోంచి విశేష పరిశోధనలు చేశారు. మల్లాది వారి సంస్కృత వాఙ్ఞ్మయచరిత్ర ప్రథమ బాగంలో సంస్కృతం ఎలా రాజబాషగా ఎదిగిందో గొప్పగా వివరించారు.
గాథాసప్తశతి 2,000 ఏళ్ళనాటి తెలుగువారి సాంఘిక చరిత్రకు అద్దం పట్టిన గ్రంథం. ఇది స్త్రీ మనోగతాన్ని ఆవిష్కరించిన తొలి మహిళావాద రచన. దాన్ని ఆ కోణంలోంచి పరిశీలన చేస్తే చాలా ఆలోచన లొస్తాయి. పురుషుణ్ణి ప్రేమించినా, ఆరాధించినా, ద్వేషించినా, దండించినా, మోసగించినా తెలుగమ్మాయికి సాటి మరొకరు లేరన్నట్టుగా ఈ గాథల్లోని సన్నివేశాలు  సాగుతాయి. 
కొత్తగా పెళ్ళయి అత్తింటి కొచ్చిన కొత్తకోడలు (కులవథువు) తన పైన మరిది చెడు ఆలోచనలో ఉన్నాడని గ్రహించి ఆ పూటంతా అతన్ని కూర్చోబెట్టి వనవాస సమయంలో లక్ష్మణుడు తన అన్న భార్యతో ఎలా వ్యవహరించాడో గోడమీద బొమ్మలు చూపిస్తో బుద్ధి చెప్పిందిట. ఇది ఈ గాథలో కనిపించే ఒక సన్నివేశం. నాటకంలో పడక సీను, కాటిసీను అన్నట్టే ఇది గోడబొమ్మ సీను. రచనలో నాటకీయత కనబరచటమే నాటక నిర్వచనం అయితే, గాథాసప్తశతి నాటక దృశ్యాల ఆల్బమ్ లాంటిది. సంఘటనలూ, సన్నివేశాల సంచీ అది! నాటక రచనకు మూలాలు గాథాసప్తశతిలో ఉన్నాయనీ, తెలుగు నాటకానికి కనీసం 2,000 యేళ్ళ  ఘన చరిత్ర ఉన్నదనీ దీని బావం.
పైన పేర్కొన్న సన్నివేశంలో మనకు చాలా సాంఘిక చరిత్ర తెలుస్తోంది: ఆ రోజుల్లో తెలుగింట కులవధువుకు గౌరవ నీయ స్థానం ఉండేది. కుటుంబ కట్టుబాట్లు ఎక్కువ. చీకటి కలయికలూ, అక్రమ రహస్య సంబంధాలూ ఎక్కువే! స్త్రీ మానసిక పరిపక్వత పురుషుడిని మించి ఉన్నట్టు చాలా గాథల్లో కనిపిస్తుంది. మరిది కామించినప్పుడు వదినగారు, ఆ సంగతి చెప్తే ఇంట్లో గొడవలైపోతాయని, కూర్చోబెట్టి లక్ష్మణుని కథ చెప్పి మనస్సు మార్చిందని ఇంకో గాథలో కూడా ఉంది. ఇంటి గుట్టును కాచిన ఆ స్త్రీ ఔన్నత్యాని ఆ గాథ తార్కాణం. కాళిదాసాదులకన్నా కనీసం రెండు మూడొందల యేళ్ళ ముందునాటి ఆ కాలంలోఉజ్జయిని ఒక్కటే కాదు, ఆంధ్ర రాజ్యం కూడా ఉన్నత సంస్కృతినే కలిగి ఉండేదని గాథాసప్తశతి చెప్తోంది.   
అప్పటికే రామాయణ ప్రాచుర్యం తెలుగువారి పైన గణనీయంగా ఉంది. చిత్రకారులు రామాయణ కథా చిత్రాలను క్యాలెండరు పోష్టర్లుగా చిత్రిస్తే, సామాన్య ప్రజలు వాటిని ఫ్రేములుకట్టి ఇంట్లో గోడలకు తగిలించుకునే వాళ్ళంటే రాముడు తెలుగువారి ముద్దుబిడ్డడన్నంత ఆదరణ ఉండేదన్నమాట! కాళిదాసు రఘువంశంలో ఇక్షుచ్చాయా నిషాది న్యస్తస్య గోప్తు ర్గుణోదయమ్ (రఘు. 4వ సర్గ, 2౦వ శ్లోక౦) అనే శ్లోక౦లో చెరకు తోటల నీడలో కూర్చొని ఆడవాళ్ళు వరి చేలకు కాపలా కాస్తూ రఘుమహారాజు జీవిత గాథని పాటలుగా పాడుకొన్నారని వర్ణిస్తాడు. ఇది అబద్ధం కాదు. కాళిదాసు కన్నా రెండు శతాబ్దాల ముందే తెలుగు ప్రజలు రామాయణం బొమ్మల క్యాలెండర్లు ఇళ్ళలో తగిలించుకున్నారు!

గాథాసప్తశతిలో గాథలన్ని నాటక సన్నివేశాలే!  ప్రతిభావంతులు పూనుకుని వాటిని చిన్నచిన్న స్కిట్టులుగా ప్రదర్శిస్తే మంచి ప్రదర్శన అవుతుంది. తెలుగు నాటకరంగ చరిత్రని హాలుడితో ప్రారంభించి పరిశీలిస్తే, మన యక్షగాన నాటక ప్రదర్శనకు మూలాలు దొరుకుతాయి.