Monday 23 June 2014

రుచి లేని రచన లేల? :: డా. జి వి పూర్ణచందు

రుచి లేని రచన లేల?

డా. జి వి పూర్ణచందు


తేనె సోక నోరు తియ్యన యగు రీతి
దోడ నర్థమెల్ల దోచకున్న
గూడశబ్ద వితతి కొట్లాట పనియెల్ల
మూగ చెవిటి వారి ముచ్చటరయ...”


నాలుక మీద తేనె పడగానే నోరంతా తియ్యగా మారిపోతుంది. అలాగే, ఒక మంచి రచన చదివీ చదవంగానే దాని అర్ధం పూర్తిగా బోధపడి దాని రుచిని ఆస్వాదించ గలిగేలా ఉండాలి.

ఏవేవో నిగూడార్ధాలతో ఒక్క ముక్కకూడా అర్ధంకాకుండా వ్రాస్తే, చివరికి అది కొట్లాటకు దారితీసేదే అవుతుందిగానీ ఆ రచన వలన ఫలితం ఏ మాత్రం ఉండదు.
అలాంటి రచనలను చదువుతుంటే వినేవాళ్లకి మూగ చెవిటి వాళ్ల ముచ్చటలా వుంటుంది...!

ఎలా రాయకూదదో తెలియ చెప్పే ఈ మాటలు అన్నది రామాయణాన్ని చంపువుగా వ్రాసిన తొలి కవయిత్రి మొల్ల! ఈ పద్యంలో కవయిత్రి రచయితలకు చేసిన ఈ సూచన ఎన్ని యుగాలకైనా ఉపయోగ పడేదిగానే ఉంటుంది.

ఎవరి కోసం రాస్తున్నామో, ఎందుకోసం రాస్తున్నామో తెలియని కవుల రాతలు వట్టి నీటి మూటలే తప్ప కలకాలం నిలిచేవి కావనే హెచ్చరిక ఈ పద్యంలో కనిపిస్తుంది.
జనం కోసం వ్రాస్తున్నాననే స్పృహ ఉన్న కవికి, తను వ్రాస్తున్నది ఆ జనానికి అర్ధం అవుతున్నదా లేదా అనే స్పృహ కూడా ఉండాలి. అర్ధం అయినంత మాత్రాన సరిపోదు. దాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారా లేదా అనేది కూడా ముఖ్యం.

కవి సమ్మేళనాల్లో ఇలాంటి దృశ్యాలు అనేకం చూస్తుంటాం. తను చదువుతున్నది వింటున్నవారికి బుర్రకెక్కుతున్నదో లేదో గమనించక పోతే చెవిటీ మూగా ముచ్చటే అవుతుంది.

ప్రాచీన కావ్యాలు పాఠకుడి కోసం కన్నా, శ్రోతకోసం ఎక్కువ ఉద్దేశించి వ్రాసినవి. ఇప్పటిలాగా అచ్చుయంత్రాలూ, పేపర్లూ లేవు కాబట్టి, ఆ రోజుల్లో ఒకరు చదువుతుంటే అందరూ విని ఆకళింపు చేసుకునే వాళ్ళు. ఆ చదివే వ్యక్తి కాస్త పాండితీ ప్రకర్ష కలిగిన వాడైతే, అవసరమైన చోట వ్యాఖ్యానాలు జోడించి, ఆ రచనలోని ఔన్నత్యాన్ని విచరించే అవకాశం కూడా ఉంటుంది.

ఇంగ్లీషు సినిమా తెలుగు డబ్బింగు చూస్తే ప్రతి మాటా అర్థం అయినట్టే, రచనకూ శ్రోతకూ మధ్య సంధానకర్తగా ఈ చదువరి రచనా సారాన్ని అందరికీ ఆకళంపు చేసేవాడు.

గత నూట యాబై యేళ్ళుగా పుస్తక ప్రచురణారంగం అభివృద్ధి చెందుతూ వచ్చింది. రచనలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. శ్రోత స్థానంలో పాఠకుడు ప్రధానం అయ్యాడు. పాఠకుడు రచనను స్వంతంగా చదివేప్పుడు పక్కన వ్యాఖ్యాత ఉండడు కాబట్టి, చదువుతూనే రచనను అర్థం చేసుకునేందుకు వీలైన వచన సాహిత్యం, కథలు, నవలల్లాంటి ప్రక్రియలు ఈ యుగంలో వ్యాప్తిలోకి వచ్చాయి.

ఇప్పుడు రోజులు ఇంకా మారాయి. వినే యుగంలోంచి చూసే యుగంలోకి వచ్చేశాం మనం. టీవీలో వార్తలు చూస్తున్నాం. పేపర్లో హెడ్లైన్లు మాత్రమే చూస్తున్నాం. ఒక్కముక్కలో చెప్పాలంటే అక్షరాల్ని చూస్తున్నామే గానీ, చదవటం తగ్గించేశాం. ఈ అత్యాధునిక యుగంలో సాహిత్యం ప్రాధమ్యాలు మరింతగా మారాయి.

మరింత తేట తెల్లంగా, అరటి పండు వలిచి ఇచ్చినంత సులువుగా, చదవగానే అలా అర్ధం అయ్యే సాహిత్యానికి ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. ఈ ప్రజల్ని రచనలకు శ్రోతలు, పాఠకులూ కాకుండా ప్రేక్షకులుగా భావించి నేటి రచయితలు తమ రచనా విధానాలను మార్చుకునే ప్రయత్నాలు చేయాలి. జనం కోసమే కదా మనం వ్రాస్తున్నది!

వెయ్యేళ్ళనాటి కవయిత్రి మొల్ల మహాదేవి, అర్ధం కాని రచనలను చెవిటీ మూగ ముచ్చటగా భావించినట్టే, చాలామంది నేటి సాహిత్యాన్ని అలానే భావిస్తున్నారు. సాహిత్యం జనంలోకి పోవాలంటే దాని పంధా మారాలి. రుచిలేని రచనలు చేసే వారి తీరు మారి తీరాలి.