Friday 1 May 2015

తెలుగు దీపాలు :: డా. జి వి పూర్ణచందు

తెలుగు దీపాలు
డా. జి వి పూర్ణచందు

జగతీజ్యోతులు కాగడాలు బలుబంజాయీలు మోబత్తులున్
    బగలొత్తుల్ దివిటీలు( దిర్వశిఘలుం బంజుల్ మహాజ్యోతులున్
   దగ సూర్యప్రభ లామలాయులును జంద్రజ్యోతులున్ మైనపున్
జిగటాల్ నిచ్చెనపంజు లారతులు నగ్ని జ్యోతులున్ వెల్గగన్
అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతికావ్యంలో తెలుగులో ఎన్ని రకాల దీపాలున్నాయో ఈ పద్యంలో  చెప్పాడు. క్రీ.శ. 1660 ప్రాంతాలలో కడపజిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడని కవి గురించి చెప్తారు. 16 - 17 శతాబ్దాల నాటి ఆంధ్ర ప్రాంత సామాజిక వ్యవస్థను కావ్యం ఒక విఙ్ఞాన సర్వస్వం లాగా వివరిస్తుంది. ప్రతీ పద్యంలోనూ, ప్రతీ పదంలోనూ తన  సమాజాన్ని ప్రతిబింబింప చేయాలని ఐదు వందల యేళ్ళనాడే ఒక కవి తాపత్రయ పడ్డాడంటే అది గొప్ప విషయమే!
తెలుగుని ఓ పెద్దాయన దిక్కుమాలినభాషఅన్నాడు. తూర్పు పశ్చిమం లాంటి దిక్కులకు తెలుగులో పదాల్లేవు కదా... అందుకని...అని వివరణ ఇచ్చాడాయన. దిక్కులకే కాదు, అన్నానికి, పుస్తకానికీ, ఆఖరికి రోజూ వెలిగించే దీపానికి కూడా తెలుగులో సమానమైన పదాల్లేవు. లేవంటే లేవని కాదు, జనం నాలుకల మీంచి పక్కకు తప్పుకుని వ్యాప్తిలో లేకుండా పోయాయి. రోలు, కుంది, రోకలి, ఊక, తవుడు లాంటి పేర్లు ఇప్పటి తరానికి తెలిస్తేనే ఆశ్చర్యం. యువతలో చల్లకవ్వం చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? భాష నశిస్తుందంటే వాడకంలో లేకపోతే జరిగేది అదే! చెవులు శుభ్రం చేసుకోవటం కోసం దూది చుట్టిన పుల్లని (ear bud) తెలుగులో తిరిఅంటారు. చంటి బిడ్డలకు స్నానం చేయించి ఒళ్ళు తుడిచాక ముక్కుల్నీ చెవుల్నీ తిరి పెట్టి శుభ్రం చేస్తారు. ఇంత చక్కని పేరు వదిలేసుకోవటం దౌర్భాగ్యం కాదా?
పద్యంలో అయ్యలరాజు నారాయణామాత్యుడు తన కాలం నాటికి ఎన్ని రకాల దీపాలు ఉన్నాయో చెప్పాడు.
జగతీజ్యోతి: ఆరంజోతి (అరుంధతీ నక్షత్రం) లాంటి పదం కావచ్చు. కాగడా: దీన్ని చేదివ్వె’, ‘చేవెలుగు’, ‘దుందుముఇలా పిలిచేవాళ్ళు. పంజాయీ: పంజాయీ’(లేక పంజు) అంటే, నేరుగా ఒక కట్టెపుల్లని వెలిగించి వెలుగు చూపేది. అగ్గిపుల్లని అందంగా పంజు అని పిలవచ్చన్నమాట! మోబత్తు: ఇది ఈ నాటి కొవ్వొత్తి. మరాఠీలో ఇదే పేరుతో పిలుస్తారు. పగలొత్తు: పగలు వత్తి(పగలొత్తు) అంటే మతాబులని ఆంధ్రదీపికనిఘంటువులో ఉంది. ఓ డజను పగలొత్తులతో దీపావళిని సరిపెట్టుకో గలిగితే బోళ్ళెడంత జాతీయ సంపద పొదుపు చేసినట్టే! దివిటీ: కాగడా లాంటిదే ‘దివటీ’(దివిటీ)కూడా! దివిటీకీ, కాగడాకూ, పంజాయీకి మౌలికమైన తేడాలున్నాయి. ఇనుప సలాక(రాడ్డు)కి గుడ్డలు చుట్టి నూనెతో తడిపి వెలిగిస్తే అది దివిటీ. చెక్క లేదా కట్టెకు గుడ్డలు చుట్టి వెలిగిస్తే అది కాగడా! కట్టెనే నేరుగా వెలిగిస్తే అది పంజాయి. తిర్వళిఘ: తిర్వళిఘ, తిర్వలిక, తిర్లిక ఈ పేర్లన్నీ నిఘంటువుల్లో దీపం అనే అర్ధాన్నేఇస్తున్నాయి. తమిళంలో దీపాన్ని ‘విళక్కు’ అంటారు. దేముడి దగ్గర దీపారాధన చేసిన చిన్న దీపాన్ని తిరువిళక్కు’ అంటారు. దీన్ని ‘తిర్వళిగ’, ‘త్రిల్లిక’ అని తెలుగులో పిలిచే వాళ్ళు
బంజు, సూర్యప్రభ, చంద్రజ్యోతి, లాంటి దీపాలు కూడా ఉండేవి. మహాజ్యోతి అంటే అఖండ జ్యోతి లాంటిది. దగ: దగదగమని వెలిగే దీపం. అగ్నిమణి లాంటిది కావచ్చు. ఆమలాయి అనే దీపం ఉన్నదట. అది ఎలా ఉంటుందో తెలియదు
కజ్జల ధ్వజము, గృహమణి, దశాకర్షము, దిబ్బెము(దివ్వె), దోషాతిలకము, దోషాస్యము, ద్యౌత్రము, నయనోత్సవంనివాళి, తిరువడి, శీతపంచకము, శీతరమ్యము, స్నేహప్రియము, స్నేహాశయము లాంటి సంస్కృతం పేర్లు కూడా ఉన్నాయి. దీపం పుచ్చుకుని దారి చూపించే వాణ్ణిదీవెలవా’డంటారు. దీపంలో వేసే వత్తిని దీపవల్లి అని పిలుస్తారు. పూర్వకాలపు ఇళ్లలో దీపం పెట్టేందుకు గుమ్మం పక్కనే గూళ్ళు ఉండేవి. దీపపు గూడునిదీగూడు’, ‘దివ్వెసుడి’ అనేవాళ్ళు. పెరుమాళ్ల తిరుణాళ్ళ సమయంలో ఉపయోగించే దీపస్తంభాన్ని తిరువడికోల, దీపవృక్షం, దీపపు సెమ్మె ఇలా పిలుస్తారు. దీప నిర్వాణ గంథము అంటే దీపం ఆరేటప్పటి వాసన! దీన్నే కాటుపోయింది, కాటువాసనఅంటారు. నూనె అయిపోయింది, గమనించాలని చెప్పటానికి ఈ మాట ని వాడుతుంటారు.
 ‘ప్రమిదకు నూనెచిప్ప, సానిక. మల్లం, మటి (ట్టి) కంచం లాంటి పేర్లున్నాయి. నిజానికి ప్రమిద కన్నా మట్టికంచంఅనటంలో జాతీయత ఇమిడి ఉంది. భావం, స్వభావం రెండూ కనిపిస్తాయి. ఇలాంటి సోకైన నుడుల్ని వాడకంలోపెడితే భాష బలంగా ఉంటుంది. భాషల ఆకాశంలో ప్రతి పదమూ ఒక నక్షత్రమేఅని యునెస్కో ఇచ్చిన నినాదం ఒక ఊపుగా మనం బరువుని తలకెత్తుకోవాలిప్రతి మాటనీ అచ్చతెలుగులో అనాలనుకుంటే మనకు పదాలు లేక కాదు. మన పాత సాహిత్యం లోంచి ఇలాంటి పదాలను వెదికి పట్టుకో గలగాలి.