Friday 28 February 2014

నల్లేరు వడియాలు :: డా.జివి.పూర్ణచందు

 నల్లేరు వడియాలు

డా.జివి.పూర్ణచందు

తింటానికి ఇంకేమీ దొరకలేదా...నల్లేరుకాడలు తిని బతకాలా..అని ఎవరూ అనుకోకుండా ఉంటే ఎముకలు మెత్తపడిపోయే పరిస్థితులకూఎముకలు విరిగి అతకటం ఆలశ్యం అవుతున్న పరిస్థితులకూ నల్లేరు ఆహార వైద్యమేనని గుర్తించ గలుగుతాం. నల్లేరుమీది బండిలాగా మన నడక సాగాలంటేమనం అప్పుడప్పుడూ అయినా నల్లేరు కాడలతో నచ్చిన వంటకాన్ని చేసుకు తినాలన్నమాట! గిరిజన వైద్యంలో పాము కరిచిన చోట రాగి రేకు గానీ రాగి పైసా గానీ ఉంచి దానిమీద నల్లేరు కాడలను దంచిన గుజ్జుని పట్టించి కట్టు గడతారు. విష౦ ఎక్కకుండా ఉంటుందని అనుభవ వైద్య౦. సాక్షాత్తూ విషానికే విరుగుడయిన ఈ నల్లేరు శరీరంలో విషదోషాలకు ఇంకెంత విరుగుడుగా పని చేస్తుందో ఆలోచించండీ...!

అనాలోచితంగా ఆవేశపడే వాళ్ళు౦టారనిఒక చమత్కార కవి నల్లేరుకాడలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఒక సరదా తెలుగు చాటువులో కనిపిస్తుంది
         నల్లీనదీ సంయుక్తం/విచారఫలమేవచ
         గోపత్నీ సమాయత్తం/గ్రామ చూర్ణంచ వ్యంజనం

         ఈ చాటువుని ఎవరు రాశారో తెలియదు గానీగొప్ప వంటకాన్ని మాత్రం చక్కగా విడమరిచారు. నల్లీ నదీ సంయుక్తం” అంటే నల్లి అనే ఏరు= నల్లేరుతో ఈ వంటకం తయారౌతోందన్నమాట. అందులో కలప వలసిన వాటిని చెప్తూ, “విచారఫలమేవచ” అంటున్నాడు. విచారఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు అవుతుంది. లేత నల్లేరు కాడల్ని తీసుకొని దంచితగినంత చింతపండు వేసి రుబ్బుతూ, “గోపత్నీ సమాయత్తం” -గోపత్నిని సమాయత్తం చేసుకోమంటున్నాడు. గోపత్నిని తెలుగులోకి మారిస్తే ఆవు+ఆలు=ఆవాలు అవుతుంది. నల్లేరు చింతపండు కలిపి రుబ్బుతూ అందులో తగినంత ఆవపిండి కలిపి, “గ్రామచూర్ణం” తయారు చేసుకోమంటున్నాడు. గ్రామచూర్ణాన్ని తెలుగులోకి మారిస్తే ఊరుపిండి అవుతుంది. వడియాలు పెట్టుకొనేందుకు మినప్పప్పు వేసి రుబ్బిన పిండిని ఊరుపిండిఊరుబిండి లేక ఊర్బిండి అంటారు. ఆ పిండితో వడియాలు పెట్టుకుంటే కమ్మగా నేతిలో వేయించుకొని తినవచ్చు. రుచికరంగా ఉంటాయి. ఎముక పుష్టినిస్తాయి. లేదా అట్లు పోసుకొని తినవచ్చు. లేక మినప్పప్పు కలపకుండా తక్కినవాటిని యథా విధిగా రుబ్బి తాలింపు పెట్టుకుంటే నల్లేరు కాడల పచ్చడి అవుతుంది. వీటిలో ఏది చేసుకున్నా మంచిదే! ఈ నల్లేరు వడియాలను చాదువడియాలు” అంటారు. ఇంత అందమైన పేరు ఈ వడియాల కుందంటేమన పూర్వీకులు ఈ నల్లేరు కాడల్ని తోటకూర కాడలుగా వంటకాలు చేసుకోవటానికి బాగానే వాడే వారని అర్థం! మనం ఇలాంటివి పోగొట్టుకుంటేసాంస్కృతిక వారసత్వాన్నే కాదుసాంస్కృతిక సంపదను కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం.
లేత నల్లేరుకాడలను కణుపుల దగ్గర నరికి వాటిని తీసేస్తేలేత కాడలు వంటకాలకు పనికొస్తాయి. చింతపండును వేయమన్నారు కదా అని వేసేయకుండా చాలా తక్కువగా వాడండి. నల్లేరుకు కడుపులో నొప్పి తగ్గి౦చే గుణం ఉంది. చింతపండు అతిగా వాడితే ఆ గుణం దెబ్బతింటుంది. పైనేం కారణంగా ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ అకారణంగా వచ్చే దగ్గు జలుబుఆయాసం తగ్గి౦చటానికి ఇది మంచి ఔషధం. కాడల్నితరిగి కుమ్ములో పెట్టిగానీకుక్కర్లో పెట్టిగానీ ఉడికించి రసం తీసిరెండుమూడు చె౦చాల మోతాదులో తీసుకొని సమానంగా తేనె కలుపుకొని తాగితే ఏ గుణాలు వస్తాయో అవే గుణాలు నల్లేరు పచ్చడికినల్లేరు దోశెలకునల్లేరు వడియాలకు ఉంటాయని ఇక్కడ మనం గమనించాలి.
నల్లేరు కాడల్ని పైన చెప్పినవాటిల్లో మీకిష్టమైన వంటకంగా చేసుకొని కమ్మగా తినండి. ఎలర్జీ వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఎముక పుష్టినిస్తుంది. కీళ్ళు అరిగిపోయాయని డాక్టర్లు చెప్పే మోకాళ్ళ నొప్పినడుం నొప్పివెన్నునొప్పి తగ్గటానికి ఇది మంచి ఉపాయం. మొలల తీవ్రతను తగ్గిస్తుంది. విరేచనం అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. అజీర్తిని పోగొడుతుంది. నల్లేరు వడియాలు కఫ దోషాలను పోగొడతాయి. నల్లేరు అట్లు వాతాన్ని తగ్గిస్తాయి. నల్లేరు కాడల పచ్చడి కీళ్ళనొప్పుల్నీకాళ్ళనొప్పుల్నీనడు౦ నొప్పినీపైత్యాన్ని తగిస్తుంది. అయితే పరిమితంగా తినాలి. లేకపోతే వేడి చేస్తుందంటారు. వాతాన్ని తగ్గి౦చే ద్రవ్యాలు
 వేడిని సహజంగా పెంచుతాయి. బదులుగా చలవ చేసేవి తీసుకో గలిగితే వేడి కలగదు.

నల్లేరు కాడలు రోడ్డు పక్కన కంపలమీద తీగలా పాకుతూ పెరుగుతాయి. నడి వయసు దాటిన పెద్దవాళ్ళకీఎదిగే శరీరులైన పిల్లలకు తప్పనిసరిగా నల్లేరు కాడల వంటకాలు పెడుతూ ఉండాలి.

వృక్షశాస్త్ర పరంగా సిస్సస్ క్వాడ్రా౦గ్యులారిస్” అనే పేరుతో పిలిచే ఈ నలు పలకల కాడలున్న నల్లేరు కాడల్నీ. ఆకుల్ని కూడా ఎండించి మెత్తగా దంచిన పొడిని జీర్ణకోశ వ్యాధుల్లో ప్రయోగిస్తుంటారు. బహిష్టు సక్రమంగా రాని స్త్రీలకు నల్లేరు కాడ మేలుచేస్తుందని శాస్త్రం చెప్తో౦ది. మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలకు నల్లేరు కాడల అవసరం ఎంతయినా ఉందన్నమాట! ఆ వయసులోనే ఎముకలు శక్తినీధృఢత్వాన్నీ కోల్పోయిగోగుపుల్లల్లాగా తయారవుతాయి. పళ్లలోంచిచిగుళ్లలోంచి రక్తం కారుతున్న స్కర్వీ వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. 
ఎముకలు విరిగినచోట అనుభవం మీద కట్లు కట్టే వారిలో చాలామంది నల్లేరు గుజ్జును పట్టించి కట్టు కడుతుంటారు. నల్లేరులో కాల్షియమ్ ఆగ్జలేట్స్కెరోటీన్ బాగా ఉన్నాయి. సి విటమిన్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ చెడకుండామనకు దక్కాలంటేచాదు వడియాలుదొశెలుపచ్చడి లాంటి వంటకాలను నల్లేరు కాడలతో చేసుకోవటం అవసరం. మూత్రంలోంచి కాల్షియం ఆగ్జలేట్ పలుకులు పోతున్నవారు తప్ప అందరూ దీన్ని అనుమానం లేకుండా తినవచ్చు. ఎక్కువసేపు ఊడికించకుండానూ, వేయించకుండానూ వండకుంటే సి విటమిన్” పూర్తిగా దక్కుతుంది.

Thursday 27 February 2014

రసగుల్లాల కథ :: డా. జి వి పూర్ణచందు

రసగుల్లాల కథ
డా. జి వి పూర్ణచందు

భారతదేశంలోకి యూరోపియన్లు రావటం ప్రారంభించాక తెలుగునేల పైన వారి ప్రభావం విపరీతంగా పడినట్టే బెంగాల్‌ మీద కూడా ప్రసరించింది. ఇది తక్కువ చేసి చూడాల్సిన చారిత్రక అంశం కాదు, ఈనాటికీ ఆ ప్రభావంలో౦చి మనం బయట పడలేక పోయినంత బలంగా ప్రసరించిన అంశం.
పోర్చుగీసులద్వారా పొగాకు, మిరపకాయలు, బత్తాయిలు, బొప్పాయిలూ అంది పుచ్చుకొని తెలుగు వారు స్వంతం చేసుకొన్నారు. కానీ, బెంగాలీలు విదేశీయుల నుండి రకరకాల మిఠాయీల తయారీని అందుకొని లాభించారు.
 క్రీ.శ.1650 నాటికి ఒక్క హుగ్లీలోనే 20,000 వరకూ పోర్చుగీసు కుటుంబాలు ఉండేవట! స్వీట్ల తయారీలో ప్రపంచంలోనే పోర్చుగీసులది అందె వేసిన చేయి. పోర్చుగీసుల ఇళ్ళలో పనికి కుదిరిన బెంగాలీలకు పోర్చుగీసు దొరసానులు రకరకాల కొత్త మిఠాయీల తయారీ నేర్పించారని చెప్తారు. చూడచక్కని పూలూ, కాయల ఆకారంలో రంగురంగుల స్వీట్లను బెంగాలీ వంటగాళ్ళు పోర్చుగీసుల దగ్గరే నేర్చారు. దానికి స్వంత పరిజ్ఞానం కూడా ఉపయోగించి, తాటిబెల్లం, చెరుకు రసం, బెల్లం, పంచదార, తేనెలతో ప్రయోగాలు ప్రారంభించారు.
పాలకోవాతో, పాల విరుగుడుతో ఎన్నో రకాల మిఠాయీల తయారీలో ప్రత్యేకత వీటిలో ముఖ్యమైంది. పాల విరుగుడుతో రసాల అనే వంటకం లాంటివి మన ప్రాచీన ఆహార పదార్థాలలోనూ, పానీయాలలోనూ అనేకం ఉన్నాయి. కానీ, బెంగాలీలు పాలను విరగకొట్టడానికి లాక్టిక్ యాసిడ్ గానీ, సిట్రిక్ యాసిడ్‌గానీ కలిపి, ఒక ప్రత్యేక విధానాన్ని అలవరచు కున్నారు. బహుశా పోర్చుగీసుల ద్వారానే అది వారికి అలవడి వుండవచ్చు కూడా!
1868లో నోబిన్ చంద్రదాస్ అనే 22 ఏళ్ళ కుర్రాడు కలకత్తా మార్కెట్లోకి రసగుల్లాలను పరిచయం చేశాడు. బెంగాలీ ఆహార చరిత్రలో రసగుల్లా పితామహుడిగా అతను నిలిచిపోగా, అతని కొడుకు కృష్ణ చంద్రదాస్ రసమలాయ్సృష్టికర్తగా ప్రసిద్ధి పొందాడు. కె.సి.దాస్ అండ్ కంపెనీ నెలకొల్పి మోయిరా, ఖీర్ మోహన, చమ్ చ్‌మ్, గులాబ్‌జామ్, వౌచక్, సీతాభోగ్, లాల్‌మోహన్, తోటాపూరి లాంటి స్వీట్లను తయారు చేసి వాటికి బెంగాలీ స్వీట్లుగా ప్రాచుర్యం తెచ్చాడు కృష్ణదాస్.
 ఆ నాటి గవర్నర్ జెనెరల్ లార్డ్ కానింగ్ భార్య పేరుతో లేడీ కానింగ్అనే స్వీట్ తయారుచేశాడు. జనవ్యవహారంలో అది లేడీకేనీగా మారింది. జిలేబీని  శనగపిండితో వండి చానాజిలిపిలేక జిలిబీపీఅన్నారు. అదే జిలేబిగా దేశవ్యాప్త ప్రసిద్ధి పొ౦ది౦ది.
పంచదార పాకంలో తేలే మిఠాయీలలో రసగుల్లా ఆధునిక భారతదేశపు తొలి మిఠాయి అని ఆహార చరిత్రవేత్తలు చెప్తారు. దాన్ని రసగోళకం అన్నారు. రసగోళ్ళ, రొసోగోల, రోషోగోల్ల, రసగుల్లా పేర్లతో దేశ వ్యాప్త ప్రసిద్ధి పొందింది. 600 ఏళ్ళ క్రితం మొదటగా పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంలో లక్ష్మీదేవి ప్రసాదంగా దీని వినియోగం మొదలుపెట్టారట. దాన్ని అప్పట్లో ఖీరామోహనఅని  పిలిచారు.
  ఖీరామోహన అనేవి తియ్యని శనగపిండి ఉండలు. మధ్యలో జీడిపప్పు పెట్టి ఘనంగా చేసేవారు. క్రమేణా వాటిని పంచదార పాకంతో ఇవ్వటం మొదలుపెట్టారు.
కటక్ దగ్గర సాలేపూర్ పట్టణంలో బికలానంద కార్ సోదరులు ఈ ఖీరామోహనతయారీలో నిష్ణాతులని ఒరియా ఆహార చరిత్ర చెప్తోంది. అందుకనే, దీన్ని బికలీకార్ రసగుల్లాఅంటారు. 1850 ప్రాంతాల్లో ఈ మిఠాయిని హర్ ధాన్ మోయిరాఅనే వ్యాపారి ఒరిస్సా నుండి తీసుకు వెళ్ళి బెంగాల్‌కి పరిచయం చేశాడు. దాన్ని నోబిన్ చంద్రదాస్ మెరుగుపరిచి పాల విరుగుడుతో తయారుచేయటం ప్రారంభించాడు. అదే ఈనాటి ప్రసిద్ధ రసగుల్లా అయ్యింది. ఇది రసగుల్లా నేపథ్యం
విరిగిన పాలను ఒక మంచిగుడ్డలో లేదా సంచీలో వడగట్టి ద్రవాన్నంతా పిండేస్తారు. దాన్ని చన్నీళ్ళతో కడిగితే తెల్లని పాలగుజ్జు మిగులుతుంది. దానిలో తీపి కలిపి, ప్రత్యేకమైన మిషన్లమీద సన్నని బంతులుగా చేస్తారు. పలుచని పంచదార పాకంలో ఈ ఉండల్ని నిలవబెడతారు. పంచదార పాకంలో కాకుండా తియ్యని పాలలో నిలవ ఉంచితే అది రసమలాయ్అవుతుంది. రసమలాయిని బూరె అప్పచ్చులుగా చేసి తియ్యని పాలలో ఉంచుతారు.
పాల విరుగుడు అంటే పాలలోని ప్రొటీన్లు, కాల్షియం, పాస్ఫరస్, కొవ్వు వీటి మిశ్రమం అని అర్థం. విరిగినప్పుడు ఈ ప్రొటీన్ పదార్థం ముద్దగా అయ్యేలా కొవ్వు సహకరిస్తుంది. ఒకవిధంగా అతి చిక్కని పాలతో సమానమైన గుణాలు దీనికి ఉంటాయని చెప్పవచ్చు. పాలు ఎలా విరిగాయన్నదే ఇక్కడ ప్రశ్న. కాయడం ఆలశ్యం అయితే విరిగిన పాలు చేదుగా ఉంటే  రసగుల్లాకు పనికిరావు. అందుకని రసగుల్లా తయారీకి ఆవుపాలను రుచిచెడకుండా ఉండేలా చేసే రసాయనాలతో విరగగొట్టే ప్రక్రియని చేస్తుంటారు.
విరగకొట్టడానికీ, నిలవ ఉంచడానికీ యాసిడ్ల వాడకం పరిమితంగా ఉన్నట్టయితే రసగుల్లాలు ఆరోగ్యానికి మంచివేనని చెప్పాలి. మనకన్నా యూరోపియన్లు గ్రీకు నాగరికత కన్నా ముందు నుండే పాల విరుగుడునీ, చీజ్‌ నీ వాడే అలవటు ఉండేది. గుజ్జుగా కాచిన గోక్షీరాల గురించి అమ్టే పాలకోవాల గురించి శ్రీనాథుడు ప్రస్తావించాడు. కానీ పాల విరుగుడు మనకు అలవాటైన విషయం కాదు. ఆ ఘనత బెంగాలీలదే!

రసాయనాలు కలిపి పాలను విరగ్గొట్టే ప్రక్రియకు బె౦గాలీలే ఆద్యులు. ఇవి మేలు చేస్తాయా కీడు చెస్తాయా అనే అంశం మీద వైద్య పరంగా ఎలాంటి విశ్లేషణా లేదు. రసగుల్లాలు, రసమలాయ్ లాంటి తీపి పదార్థాలకు బె౦గాలీలు అద్భుతమైన ప్రఖ్యాతి తీసుకు వచ్చారు. ప్రపంచ మార్కెట్లో స్వీట్ల తయారీలో శతాబ్దాల మన వెనకబాటుతనాన్ని బెంగాలీలు కేవలం ఒకటిన్నర శతాబ్దాల కాలంలోనే పూరించగలిగారు.

Wednesday 26 February 2014

గోంగూర-గోనుసంచీ :: డా. జి వి పూర్ణచందు

గోంగూర-గోనుసంచీ
డా. జి వి పూర్ణచందు
గోను కూరని గోనుగూర, గోంగూర, గో(గూర అంటారు. గో(గూర నిచ్చే మొక్కని గో(గు మొక్క అని పిలిచారు. 
గోంగూరను అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, కెనాఫ్ అని పిలుస్తారు. Deckanee hemp అనే పేరుతో కూడా కొన్ని దేశాల్లో పిలుస్తారు. తెలుగు ప్రజలతో ఈ మొక్కకు అనుబంధం ఉందన్న సంగతి ప్రపంచాని కంతటికీ తెలుసు. మనం గోంగూర పచ్చడి చేసుకుంటే యూరోపియన్లు kenaf pesto తయారు చేసుకుంటారు. ఇంచుమించు రెండూ ఒకటే!
దీనికి అంబరి, లాలంబరీ, నలి, అమ్లపీలు, కంటక పీలు లాంటి సంస్కృత పేర్లు చెపుతారు గానీ, అవి నిఘంటువులలో కనిపించవు. శాకాంబరీ దేవి ప్రసాదం అని గోంగూర పచ్చడిని కీర్తించటం కవుల చమత్కారం. గోంగూరకు అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే సంస్కృత పర్యాయ నామాలున్నాయి. కర్ణికార పుష్పము అంటే కుండగోంగూర పువ్వు. అభిమన్యుడి రథ౦ మీద ఎగిరే జె౦డా ఈ గుర్తు గలిగి ఉంటుందట! మూలభారతం భీష్మపర్వం (6.26,27)లో శివుడు కర్ణికార పుష్పమాలను పాదాలదాకా ధరించాడని ఉంది. కర్ణికార వనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు కూడా మూలభారతంలో ఉంది. వసుచరిత్ర(3.146)లోనూ, హంసవింశతి(4.11)లోనూ గోంగూర ప్రస్తావన కనిపిస్తుంది. గోగులమ్మ అనే గ్రామదేవత గురించికోమలార్థేందుధరుకొమ్మ గోగులమ్మ(ఆ.౧ప.౯౯) అంటూ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. గోంగూరపువ్వు పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబంలాగా, పద్మ౦లో కేసరాలు౦డే కర్ణికలాగా ఉంటుంది. అందుకని దీనికా పేరు వచ్చి ఉంటుంది. మందారం, బె౦డ, తుత్తురబె౦డ, గోంగూర ఇవన్నీ ఒకే కుటుంబానికి చె౦దిన మొక్కలు. గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను అలంకరించటం సాంప్రదాయం.
గోంగూరని ఎంత ఇష్ట పడతారో చాలామంది, దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దాని అతి పులుపే అందుకు కారణం! మనం రోజువారీ ఆహార పదార్థాలలో అతిగా చింతపండునో లేకపోతే ఆమ్ చూర్నో వాడటం వలన కడుపులో యాసిడ్ నిండిపోతోంది. గోంగూర తింటే మరింత యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో, ’పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకొన్నాను, అంతే... కాళ్ళూ చేతులూ పట్టేశాయిఅంటుంటారు చాలామంది. ఇతర పులుపు పదార్థాల వాడకాన్ని పరిమితం చేసుకోగలిగితే గోంగూరని రోజూ తిన్నా ఏమీ కాదు. మన పూర్వీకులు గానీ, ఇతర రాష్ట్రాల వారుగానీ మనం తింటున్నంత వెర్రిపులుపు తినరు. ముఖ్య౦గా చింతపండు వంటి౦టికి రారాజు అయిపోయింది. దాన్ని వెళ్ళగొట్ట గలిగితే గోంగూరను ఎవరైనా చక్కగా వాడుకోవచ్చు. వైద్య శాస్త్ర ప్రకారం గోంగూరలో అపాయకారకమైన రసాయనాలు ఏమీ లేవు. పడకపోవటం దాని స్వభావం కాదు. దాన్ని వండటంలోనే మనం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసి ఉంది. మొదటగా గోంగూరని నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి తయారు చేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకగంగా ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలివంచని వాటితో మాత్రమే గోంగూరను తయారు చేసుకోవాలి. తగినంత మిరియాల పొడి, ధనియాల పొడి కలిపితే ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ఉంటుంది. రుచిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. గోంగూర పువ్వులూ వంజల్ని కూడా కలుపు కోవచ్చు. రుచిగా ఉంటాయి.
గోంగూర చక్కని ఆకలిని కలిగిస్తుంది. లివర్ వ్యాధుల్లో మేలు చేస్తుంది. రేజీకటి రోగంతో బాధపడే వారికి తరచూ వండి పెడితే చూపు పెరుగుతుంది. మలబద్ధత పోగొడుతుంది. వీర్యవృధ్ధీ, లైంగిక శక్తీ, లైంగిక ఆసక్తీ పెంపొ౦దింప చేస్తుంది. ఉడికించిన గోంగూర ఆకు ముద్దని కడితే సెగగడ్డలు మెత్తపడి త్వరగా పక్వానికొస్తాయి. రక్తం గూడు కట్టిన కౌకుదెబ్బలు తగిలినచోట దీనితో కట్టు గడితే వాపు అణిగిపోతుంది. దేశవాళీ గోంగూర ఆకుల్లో ఉండే ఇనుము, అలాగే, కుండగోగు వేళ్ళలో ఉండే చలవ దనమూ, రెండూ వైద్య పరంగా ప్రసిధ్ధాలే. కుండగోగు మొక్కల్ని వ్రేళ్ళతో సహా పీక్కొచ్చి అమ్ముతారు. మనం ఆకుల్ని వలుచుకొని మొక్కని అవతల పారేస్తా౦. దాని వేళ్ళను దంచి, చిక్కని కషాయం కాచుకొని పంచదార కలుపుకొనితాగవచ్చు. వేసవికాలంలో వడదెబ్బ కొట్టనీయని పానీయం ఇది.
గోంగూర మౌలికంగా నారనిచ్చే మొక్క. గోంగూర, జనుము లాంటి మొక్కల్లో౦చి వచ్చే నారని గ్రీన్ ఫైబర్ అంటారు. తెల్లకాగితం తయారీకి పనికొచ్చే 500 మొక్కలతో పోల్చినప్పుడు అమెరికన్లు గోంగూర అన్ని౦టికన్నా ఉత్తమ మైన మొక్కగా తేల్చారు. ఇవ్వాళ అమెరికావారి కాగితం అవసరాలను గోంగూర మొక్కలే తీరుస్తున్నాయట! ఆ౦ధ్రమాతగా గోంగూరను గౌరవించే తెలుగుప్రజలు ఈ రహస్యాన్ని త్వరగా గుర్తించటం మంచిది. విదేశాలలో పైన్ లాంటి కొన్ని మహా వృక్షాలను, మన దేశంలో ముఖ్య౦గా సరుగుడు మొక్కల్ని పేపరు తయారీకోసం కూల్చి వెస్తున్నారు. అడవులను నరికి, పర్యావరణానికి హాని చేయటాన్ని ఈ గోంగూర కాగితంద్వారా నివారించవచ్చు. పాండురంగ మహాత్మ్య౦లో సుశర్మ పాపాలను లెక్క రాసే కళితం లేదా కడితం అనే కాగితాల కట్ట గురించి ప్రస్తావన ఉంది. ఆ౦ధ్రుల సాంఘిక చరిత్రలో కడితం అంటే మసి పూసి గట్టన చేసిన చదరపు గోనెపట్టతో(గోగునారతో) చేసిన లెక్కపుస్తకంఅని అర్థాన్ని ఇచ్చారు. 15వ శతాబ్ది నాటికి గొగునార కాగితం తయారీ మన వాళ్ళకు తెలుసు నన్నమాట! దీని ఆకుల్ని ఆహార అవసరాలకు వలుచుకుంటూ, మొక్కని నిటారుగా పెరగనిస్తే150 రోజుల్లో 12-18 అడుగులు పెరుగుతుంది. ఈ మొక్కల్ని నీళ్ళలో నానబెడితే నార తేలికగా ఊడివస్తుంది. ఎకరానికి 5-10 టన్నులు గోగునార లేక గోనునార ఉత్పత్తి వస్తుందని అంచనా! ఈ గోనునారని పురిపెట్టి పురికొస తీస్తారు. దానితో నేసిన పట్టాని గోనుపట్టాఅనీ, సంచీని గోను సంచీఅనీ పిలుస్తారు. గోతాము పదం కూడా గోనుకు సంబంధించినదే కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, ఎద్దుల బండి మీద అడ్డ౦గా వేస్తారు కాబట్టి గొతాము అని అర్థాలు చెప్పారు గానీ, మౌలికంగా ఇది గోను శబ్దానికి సంబధించిన పదం. గోవు ఎంత ముఖ్యమో, గోను కూడా అంతే ముఖ్య౦---సద్వినియోగపరచుకొనే తెలివి ఉండాలి,

గోంగూరకు నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆఫ్రికా దీని పుట్టిల్లు. భారత దేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. చరక సుశ్రుతాది ఆయుర్వేద గ్ర౦థాల్లో గానీ, ధన్వంతరి నిఘంటువులోగానీ, గోంగూర గురించి వివరాలు లేకపోవటాన, దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిధ్ధి కాకపోవటాన అమరకోశంలో చెప్పిన కర్ణికారం అంటే, కుందరు పండితులు రేలమొక్కగా భావించారు. ఈ కారణంగా మధ్య యుగాలలో ఈ గోంగూర భారత దేశంలోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేసే సమాచారం బసవ పురాణంలో ఉంది. శివ పూజ చేయనిదే ముద్ద ముట్ట కూడదనే నియమం కలిగిన ఒక వర్తకుడు బోర్లించిన కుంచాన్ని శివలింగంగా భావించి కుండగోగు పూలతో పూజ చేసినట్టు కుంచంబు గొ౦డగోగుల( బూజసేసిఅనే వర్ణన వెయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రజలకు గోంగూర పవిత్రమైనది, పూజనీయార్హమైనదీ అనటానికి తిరుగులేని సాక్ష్య౦గా కనిపిస్తుంది. జానపదగేయాలలో కూడా కుండగోగు ప్రస్తావన కనిపిస్తుంది. శైవులకు ఇది ప్రముఖమైనదంటే, తెలుగు నేలమీద దాని ప్రాచీనత గొప్పదనే మనం నమ్మవచ్చు.

అన్నం ఎందులో తినాలి? :: డా. జి వి.పూర్ణచందు

అన్నం ఎందులో తినాలి?
డా. జి వి.పూర్ణచందు


మన సమాజం వ్యావసాయిక సమాజంగా పుట్టి ఆర్థిక సమాజంగా ఎదిగింది. ఎదగటం అంటే అభివృద్ధితో కూడిన ఎదుగుదలేనా అనేది ప్రశ్న. అమ్మనాన్నలని కాళ్ళకు దండం పెట్టి కుర్చోబెట్టి, వాళ్ల మంచీ చెడుల్ని కడదాకా చూడటం వ్యావసాయిక సంస్కృతి. అలా కాకుండా వాళ్ల మానాన వాళ్ళను వదిలేసి, లేదా వృద్ధాశ్రమంలో చేర్పించి మన వృత్తి ఉద్యోగాలు మనం చూసుకోవటం అర్థిక సమాజం. దీన్ని ఎదుగుదల అనుకొనేవారు అనుకోవచ్చు. మనం చేయగలిగిందేమీ లేదు. ఆహారం విషయంలో కూడా ఇలాంటి ఎదుగుదలలన్నీ చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. వ్యావసాయిక సమాజంలో అయితే, కూరలో నూనె వేసి వండేవారు. ఆర్థిక సమాజంలో నూనెలో కూర వేసి వండుతున్నారు. అదీ తేడా! నాడబ్బు- నాఇష్టంఅనేది ఆర్థిక సమాజ ధోరణి. ఇవన్నీ ఎదుగుదలలే ననుకోవచ్చు. భోజనం ఎందులో తినాలి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఈ కోణంలో౦చి పరిశీలిద్దాం
ఒకప్పుడు, అంటే మరీ ఇక్ష్వాకుల కాలం నాటి సంగతి కాదు, మొన్న మొన్నటి దాకా భోజనం చేయటానికి కుటుంబంలో అందరూ కలిసి కూచుని, వండిన వన్నీ విస్తట్లో వడ్డించే వరకూ ఆగి, ఒకసారి భగవన్నామ స్మరణ చేసుకొని. సంతోషంగా భోజనం చేసే వారు. ఇప్పుడా పరిస్థితి మారింది. డైనింగ్ టేబులూ, టీవీ ఒకే గదిలో ఉంటాయి. టీవీలో హత్యల వార్తలు చూస్తూ టేబుల్ భోజనం చేయటానికి అలవాటు పడ్డాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడా పరిస్థితి కూడా మారింది. సోఫాలో కూర్చుని, పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని ఒక్కక్క మెతుకే తింటూ ఇంకో చేత్తో రిమోటు నొక్కుకొ౦టూ, భోజన కార్యక్రమానికి రె౦డో ప్రాథాన్యత నిస్తున్నాం. దాదాపు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న తతంగం ఇదే! చాలా ఇళ్లలో డైనింగ్ టేబుల్ కూడా అలంకార ప్రాయం అయి, ఒక మూలకు తోసేశారు. వాడని వంట సామాన్లు వగైరా దాని మీద చేరి పోతున్నాయి. ఆర్థిక సమాజం తెచ్చిన మార్పు ఇది. భోజనం పట్ల మునుపటి శ్రద్ధ, గౌరవం, భక్తి లేకుండా పోయాయనేది ఇక్కడ మనం బాధపడవలసిన అంశం.
ఒకప్పుడు బంగారం పళ్ళెంలో తినటం తాహతుకు గుర్తు. మామూలు స్టీలు పళ్ళాలలో తినటం మధ్యతరగతి వారికే చెల్లి౦ది. దిగువ తరగతుల్లో కొ౦చె౦ స్థితిమంతులు అప్పట్లో కొత్తగా వచ్చిన జెర్మన్ సిల్వర్ అనే సత్తు పళ్ళాలలో తినేవారు. మిగిలిన హీనులూ, దీనులూ అనబడేవారంతా మట్టి  లేదా రాతి పాత్రలలో తినేవారు.
సింధూ నాగరికతా కాలంలో కంచు పళ్ళెంలో తినటం పుణ్యప్రదంగా ఉండేది. ఎందుకంటే ఆ నాగరికతా కాలంలో అక్కడ కొత్తగా రాగిని కనుగొన్నారు. సింధునాగరికత త్రవ్వకాలలో ఇప్పుడు మనం తింటున్న కంచం లాంటిదే గుండ్రని కంచు కంచందొరికి౦ది. కా౦శ్య౦ అంటే కంచు. కంచుతో చేసింది కాబట్టి కంచం అయ్యి౦ది. కంచరి అంటే కంచుతో పని చేసే లోహకారుడని! ఏ లోహంతో చేసినా దాన్ని కంచం అనే అంటున్నాం ఇప్పుడు.
సింధునాగరికతలో కంచు వాడకంలో ఉన్న సమయంలో, తెలుగు నేల మీద ఇనుమును కూడ కరిగించ గలిగారు. అందుకని, కంచు కంచాలతో పాటు స్టీలు పాత్రల వాడకం అనాది కాలంగా మనకి ఉంది. కానీ, యాగాలు, క్రతువులు వగైరా జరుపుకోవటానికి రాగి చె౦బులూ, రాగి అరివేణము, ఉత్తరిణి(చె౦చా) ఇతర రాగి పాత్రలే వాడతారు. లేదా కంచు పాత్రలు వాడతారు. స్టీలు వాడరు ఎందుకంటే వేదకాలం వారికి స్టీలు తెలియదు కాబట్టి!
యోగరత్నాకరం అనే వైద్యగ్రంథం తెలుగు వారి ఆచార వ్యవహారాలకు పెద్ద దిక్కుగా చెప్పదగిన గొప్ప వైద్య గ్రంథం. ఇందులో ఏ లోహంతో చేసిన పళ్ళెంలో తింటే ఎలాంటి సుగుణాలు కలుగుతాయో వివరంగా చెప్పింది.
బంగారు పళ్ళెం: సంతోష దాయకంగా ఉంటుంది. అనారోగ్యాలున్నప్పుడు ఆహారాన్ని బంగారు పళ్ళెంలో కలిపి పెడితే దోష హరంగా ఉంటుంది.
వెండి పళ్ళెంలో భోజనం కూడా ఇలాంటి గుణాలే కలిగి ఉంటుంది గానీ, బంగారం కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది. వెండి పళ్ళాలలో తింటే కంటికి మంచిది. శరీరంలో వేడి తగ్గుతు౦ది. కానీ కఫవాత దోషాలను ప్రకోపి౦ప చేస్తు౦ది.
కంచు పళ్ళెంలో భోజనం బుద్ధి ప్రదంగా ఉంటుంది. ఇందులో తింటే ఆహారం రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తు౦ది. రక్తప్రసార వ్యాధులతో బాధపడేవారికి, బీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి బంగారం పళ్ళెం తరువాత చెప్పుకోదగినది ఈ కంచు పళ్ళెమే!
ఇత్తడి పళ్ళెంలో భోజనం పరమ అనారోగ్య కరం. వాత దోషాలను పె౦చుతు౦ది. బాగా వేడిచేస్తు౦ది. కాబట్టి, ఇందులో తినకుండా ఉంటేనే మంచిది.
స్టీలు పళ్ళెంలో భోజనం సిద్ధికారకమ్అన్నాడు ఈ వైద్యగ్రంథంలో. కాయ సిద్ధి అంటే శరీరానికి అన్నివిధాలా శక్తి, బలమూ కలగటమేనని అర్థ౦ చేసుకోవాలి. పైగా రక్త క్షీణత లాంటి వ్యాధుల్లో మంచే చేస్తు౦ది గానీ చెడు చేయదని దీని భావం.
రాతి పాత్రలు, మట్టి మూకుళ్ళలో భోజనం మన దారిద్ర్యానికి గుర్తుగా ఈ గ్రంథం భావి౦చి౦ది. అంతేగానీ, అందువలన ప్రమాదాలేమీ చెప్పలేదు. మట్టి కుండలో అన్నం వండుకొనేవారు. మూకుళ్లలో ఆహారపదార్ధాలు ఉంచుకొనేవారు. దాలిగుంటలో కుండను ఉంచి కాచిన పాలు గాని తోడుపెట్టిన పెరుగుగానీ  చాలా రుచికరంగా ఉంటాయి. తిన్న అదృష్టవంతులకు తెలుస్తు౦ది దాని మాధుర్య౦. ఫ్రిజ్జుల్లో పెట్తుకొని తినే స్టీలుగిన్నె పెరుగుకే౦ తెల్సు కుండపెరుగు రుచి!ఆలాగే, రాతి పాత్రలలో(రాచ్చిప్ప అనేవారు) పులుసు, పప్పుచారు కాచుకొనేవారు. ఎక్కువ సేపు వేడిని నిలబెడతాయి. కానీ వేడెక్కటానికి ఎక్కువ సమయం తీసుకొ౦టాయి. కట్టెపుల్లల మీద వంటలు చేసుకొనే రోజుల్లో ఈ రాతిపాత్రలు చెల్లాయి. ఇప్పుడు సంవత్సానికి ఆరు సిలి౦డర్లే ఇస్తామని చెప్తున్న ప్రభుత్వ జనరంజక పాలనలో ఇలాంటివి సానుకూలపడే అంశాలు కాదు.
చెక్కపళ్ళాల్లో భోజనానికి ఈ వైద్య గ్రంథం ఓటు వేయ లేదు.
అరిటాకులో గానీ, బాదం ఆకులో గానీ భోజనం శ్రేష్టదాయకంగా చెప్పింది. విషదోషాలు పాపాలను హరిస్తు౦దని కూడా చెప్పింది. ఇప్పుడు అడ్డాకు విస్తట్లో లోపలి వైపు తగరం కాయితం అంటి౦చి ఉన్నవీ, లేకపోతే ధర్మోకూల్ బె౦డు పళ్ళేలు వాడుతున్నారు. వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఏ నాడయినా ప్రభుత్వ౦ ఆలోచి౦చిన దాఖలా లేదు. ఇలాంటివి మార్కేట్టుకి తీసుకు రాబోయే ము౦దు, ప్రజారోగ్య శాఖ వాటిని క్షుణ్ణ౦గా పరిశీలి౦చి, అవి జనారోగ్యానికి చెరుపు నిచ్చేవి కావని చెప్పాలి. ఘనత వహి౦చిన మన ప్రభుత్వ శాఖలు చెప్పే ఉంటాయని ఆశిద్దాం. కానీ, వైద్యపరంగా భరోసా ఇవ్వగలిగే స్థితి లేదు.
ఇవికాక ఇప్పుడు పి౦గాణీ, సిరామిక్ గాజు పళ్ళాలు విస్తృతంగా వస్తున్నాయి. స్ఫటిక పళ్ళెంలో భోజనం తింటే పవిత్ర౦, చలవ నిస్తాయని చెప్పింది. ఇవే గుణాలను గాజు వగైరా పళ్ళాలకు కూడా అన్వయి౦చు కోవచ్చు.
రాగి పళ్ళెంలో భోజనం కాకుండా రాగిగ్లాసులో నీరు తాగితే మంచిదనీ, శరీరాన్ని మృదువు పరుస్తు౦దనీ ఈ వైద్యగ్రంథం పేర్కొ౦ది. మృదువు పరచటం అంటే యా౦టీ ఆక్సిడే౦ట్గా అంటే విషదోష నివారకంగా ఉంటుందన్నమాట, ఇందులో పోయగానే నీరు రుచి మారిపోయి కమ్మగా ఉంటుంది.
ఈ వివరాలన్నీ ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. భోజనం చేయటానికి బంగారు పళ్ళాలే అక్కరలేదు. వెండి పళ్ళానికన్నా, స్టీలు పళ్ళానికన్నా, కంచుకంచాలు మేలయినవి. పెళ్ళిళ్లలో పెళ్లికొడుకు వెండికంచమూ, వెండి చె౦బూ అడుగుతాడు. తెలివైన వాడయితే, కంచు కంచం, రాగి చె౦బు అడగాలి. కానీ, మనం ప్రస్తుతం ఆర్థిక సమాజంలో ఉన్నాం కాబట్టి, డబ్బుకున్న విలువ ఆరోగ్యానికి లేదు కాబట్టి, ఈ అంశాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకొ౦టే అంత మంచిది.


తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి.వి. పూర్ణచందు

తెలుగువారు అట్టేపెట్టుకున్న అట్టు::

డా. జి.వి. పూర్ణచందు
ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు భాషకి మూలభాషని పరిశోధకులు పునర్నిర్మించారు. ద్రవిడియన్ ఎటిమాలజీ పేరుతో ఈ పూర్వతెలుగు భాషా నిఘంటువు ఇంటర్ నెట్లో అందుబాటులో ఉందికూడా! ఇందులో అట్అనే పూర్వ తెలుగు (ప్రోటో తెలుగు) రూపానికి తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చటం, శుష్కింపచేయటం అనే అర్థాలున్నాయి. తెలుగులో అట్టముఅంటే ఆహారము. ఇంధనం కూడా! అడుఅంటే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయటం. అన్నం అడుగంటి౦ది అంటే తడి అంతా ఆవిరి అయి పోయి ఇంక మాడిపోతోందని అర్ధం. అట్ట్ ఉప్పుఅంటే సముద్రపు నీటిని ఆవిరి చేసి తీసిన ఉప్పు అని!.
ఇనుప పెనాలు మనకు ఎప్పటినుంచీ వాడకంలోకి వచ్చాయో తెలియదు. పూర్వపు రోజుల్లో కుండని బోర్లించి లోపలి నుంచి మంటపెట్టి కుండ బైటవెపున అట్టులు కాల్చుకొనేవాళ్ళు. ఈ పద్ధతి లోనే పూతరేకులను పల్చగా కాల్చి తయారు చేస్తారు. అందుకేనేమో తెలుగులో అటిక’, ‘అట్టికఅనే పేర్లతో వెడల్పయిన మూతి కలిగిన కుండని పిలుస్తారు. పగిలిన పెద్ద కుండ పెంకుని కూడా ఇలానే ఆ రోజుల్లో ఉపయోగించి ఉంటారు అందుకని, ఇప్పటికీ అట్ల పెనాన్ని చాలామంది పెంకుఅనే పిలుస్తారు. మూతి భాగాన్ని పగలకొట్టి ఆ కుండని బూరెలమూకుడు మాదిరిగా వాడుకోవటాన్ని పల్లెల్లో చూడవచ్చు.
అట్టగట్టింది అంటే, ఎండి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యిందని అర్ధం. చెప్పు అడుగు భాగం అలా గట్టిగా ఉండాలి కాబట్టి అట్టఅనే పేరు దానికి సార్థకం అయ్యింది. పరీక్ష్ రాసె అట్ట, పుస్తకానికి వేసే అట్ట కూడా బహుశా ఈ అర్ధం లోనే ఏర్పడి ఉండవచ్చు. పెనం (లేదా) పెంకుమీద మెత్తగా రుబ్బిన పిండిని పలుచగానో మందంగానో పరిచి కాల్చినప్పుడు అది అట్టగడుతుంది. దాన్నే అట్టు అంటున్నాము.
తమిళంలో అటు, అటువ్ అట్ట్ అనే పదాలు వండటం, కాల్చటం, వేయించటం, ఉడికించటం, కరిగించటం ఇన్ని అర్థాల్లో కనిపిస్తాయి.. అటుక్కలై = వంట గది;. అటుచిల్ = ఉప్పుడు బియ్యం; అట్టు = తీపి రొట్టె.. ఆటు= వండటం; అట్టుంబల=వంటగది; అడకల=వంటశాల; అట్టము=ఆహారం. ఈ నిరూపణల్ని బట్టి,’అట్టుఅనే పదం తెలుగు తమిళ భాషల్లో ఆహార పదార్ధం అనే అర్ధంలోకి పరిణమించిందని భావించవచ్చు.
పెనం లేకుండా నేరుగా నిప్పుల సెగ మీద కాల్చిన అట్టుని తెలుగులో నిప్పట్టు అంటారు. నిప్పటి, ఇపటి, నిపటి అనే ప్రయోగాలు కూడా (DEDR367౦) ఉన్నాయి. అది ఒక రకం తండూరి ప్రక్రియ కావచ్చు. అప్పడాలు, ఫుల్కాలు నిప్పులమీద కాల్చే ప్రక్రియ ఇప్పటికీ ఉంది
ఈ అట్టు పదం తెలుగులొకీ తమిళంలోకీ తల్లి ద్రావిడ భాషలోంచే వచ్చింది! ఈ పదం ఎంత ప్రాచీనమో అట్టు కూడా అంతే ప్రాచీనం. అట్టు అనే పదానికి మరికొన్ని ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. అట్టేపెట్టు, అట్టే అగు గాక,అట్టనా..!, అట్టులా...? అట్టిది! వచ్చేటట్టు, చేసినట్టు, అట్టే పోయినాడు లాంటి ప్రయోగాలు- ఉండు, ఉంచు అర్థాల్లో కనిపిస్తాయి.
Blintz (బ్లిని), Mofletta (ముఫ్లెట్ట) పేర్లతో అట్టుని ప్రపంచంలో చాలా దేశాల వాళ్ళు వండుకుంటున్నారు. జపాన్ లో అట్టుకు ఒకోనోమియకీఅనే గమ్మత్తయిన పేరుంది. ఇష్టమొచ్చినట్టు కాల్చుఅని దీని అర్ధం. ఇథియోపియాలో కూడా అట్లు పోసుకొనే అలవాటుందని తెలుస్తోంది. వాళ్ళు వాఝైఅని పిలుస్తారు.
ఆఫ్రికానుంచి బయలుదేరిన ద్రావిడులు అనేక మజిలీల అనంతరం క్రీస్తు పూర్వం 2౦౦౦ నాటికే తెలుగునేలమీద చేరారు. వస్తూ తెచ్చుకున్న వంటకాలలో అట్టుకూడా ఉందన్నమాట! తెలుగింట అట్లకు కనీసం నాలుగువేలయేళ్ళ చరిత్ర ఉందని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. రవ్వట్టు. పెసరట్టు, మినపట్టు గుడ్డట్టు(ఆమ్లెట్ట్), చాపట్టు, నీరొట్టు, అట్లపెనము, అట్లకాడ. అట్లపొయ్యి పదాలు తెలుగు భాషలో రూపొ౦దాయి.. తెలుగువారు అంతగా అట్టుని అట్టేపెట్టుకున్నారు.
అట్ల తదియని ఉయ్యాల పండుగగానూ, గోరింటాకు పండుగగానూ జరుపుకొనే ఆచారం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ముత్తైదువులకు అలంకారం చేసి 1౦ అట్లు వాయనంగా సమర్పించటం అట్లతదియ నోము. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్" అనే పాటని బట్టి, అట్టుని ముద్దపప్పుతో నంజుకొని తినే అలవాటు తెలుగువాళ్ళకుండేదని అర్ధం అవుతోంది. శృ౦గారనైషధంలో (2-12౦) శ్రీనాథ మహాకవి చాపట్లతొ పెసరపప్పుని నంజుకొని తినడం గురించి ప్రస్తావించాడు.
శనగ చట్నీ, సాంబారు, నెయ్యి, కారప్పొడి వగైరా లేకపోతే హోటళ్ళలో దొరికే దోశెలు తినడం కష్ట౦. కానీ తెలుగు అట్టుని తినడానికి ఇవేవీ అవసరం లేదు. కాసింత ముద్దపప్పు చాలు లేదా కొంచెం బెల్లం ముక్క సరిపోతుంది. చెరుకురసాన్ని కాచి బెల్లం తయారు చేసేటప్పుడు ఆ తీపి ద్రావణంలో అట్టుని ఉంచి తినే వాళ్ళు. ఇదే దోశెకీ, అట్టుకీ తేడా! రెండూ ఒకటి కావని గట్టిగా చెప్పవచ్చు.
ప్రయాణాలప్పుడు వె౦ట తీసుకొని వెళ్ళి తినడానికి అట్టు అనుకూలంగా ఉంటుంది. నూనెని అతి తక్కువగా వేస్తారు. ఉల్లి, మషాలాల అవసరం ఉండదు. అందుకని అట్టు కడుపులో ఎసిడిటీని పెంచకుండా తేలికగా అరుగుతుంది. కన్నడం వారి దోసెకు లేని ఈ సుగుణాలు తెలుగు అట్టుకి ఉన్నాయి. తమిళులు అట్టు పదాన్ని ఏనాడో వదిలేసి, దోసైనే వాడుకోవటం మొదలు పెట్టారు. అట్టు తెలుగువారి స్వంతంగా మిగిలి పోయింది.