తేనెతొలలు
"తేనెతోలల్
వలే విలసిలి, "తేనతొలల్ చిగురులనెడు
తియనవాతెఱలన్
దేనెతెరల్'
గల తెఱవలు, తేనెతోలల్ పంచి రెడల దెప్పలు గాఁగన్” (దామరల వెంగళభూపాలుడు-బహుళాశ్వచరిత్ర)
1550-1600
మధ్యకాలపు వాడైన రాజకవి దామరల వెంగళభూపాలుడు వ్రాసిన బహుళాశ్వచరిత్రలో ఆహార
పదార్థాల వర్ణనలు చాలా ఉన్నాయి. తెలుగువారి ఆహార చరిత్రకు ఈ గ్రంథం ఉపకరిస్తుంది.
ఈ పద్యంలో ‘తేనెతొలలు’ అనే వంటకం గురించిన వర్ణన
ఉంది. తేనెపట్టులాగా మెరిసిపోతూ, తేనెతెరల్లాంటి తియ్యని
అధరాలు కలిగిన (-తెర+వాయి) తెరవలు అంటే అమ్మాయిలు అందరికీ తేనెతొలల్ని వడ్డించారట.
నిఘంటువులు తేనెతొల, తేనెతొన ఒకటేనని వ్రాశాయి.
కానీ, తేనెతొలల్ని ఏ కవీ
తేనెతొనలు అన్నట్టుగా కనిపించదు. కాబట్టి ఇది తేనెతొలే!
తేనెతొల అంటే ఏది?
“శ్రీ ప్రబంధ రాజవేంకటేశ్వర
విజయవిలాసము”లో గణవరపు వేంకటకవి “కాటుసంపెంగలు, కందర్పభోగులు,
గజపతిలాలు, బోందడీలు, పునుఁగుఁదావులు, తేనెతొలలు, మోసనాలు, గుఱ్ఱపుతోకలు, కేటచలములు, ఊదుఘుటికలు, గాజుకడియములు” అంటూ ధాన్యాల పేర్లు, వంటకాల పేర్లు కలగలిపి చెప్పటంతో తేనెతొలలు తీపి వంటకమా లేక
ఏదైనా ధాన్యం పేరా? అనే సందేహం తప్పకుండా
కలుగుతుంది.
ఆ రోజుల్లో
తేనెతొలలు అనే ధాన్యం ఉన్నాయనుకున్నా, ఇది ఆ ధాన్యపు
పిండితో చేసిన వంటకంగా భావించలేం. ఆబియ్యం ప్రత్యేకత తెలిస్తే గానీ ఆ వంటకం
ప్రత్యేకతని గుర్తించలేము. ఇక్కడ అలాంటి ప్రత్యేకత ఏదీ కనిపించదు.
“కలవంటకములు,
బూరెలు తేనెతొలలు” అంటూ కళాపూర్ణోదయంలో పింగళి సూరన పెళ్లి విందులో వడ్డించిన
వంటకాల మెనూకార్డు ఇచ్చాడు. సురవరం ప్రతాపరెడ్డిగారు “పైవన్నియు బ్రాహ్మణుల విందులే! ఇతరులలో ఇన్ని లేవు, వాటికి మారుగా మాంస
మత్స్యాది పాకములు
చేరును” అన్నారు.
శాకాహారం, మాంసాహారం అనే రెండు రకాల ఆహారపదార్థాల్లో తెలుగువారికి
అల్పాహార భక్ష్యాలు ఎక్కువగా శాకాహారానికి సంబమ్ధించినవేనని చెప్పటం సురవరం వారి
ఉద్ధేశం కావచ్చు. కమ్మటి శాకాహార వంటకాన్ని ఏ కులస్థులైనా తినవచ్చు కదా!
తిరుమల తిరుపతి
దేవస్థానం అధికారిక వెబ్‘సైట్లో గురువారం తిరుప్పావడ
సేవలో ప్రవేశం పొందిన భక్తులకు ఒక పంచె, రవికల గుడ్డ,
7 పెద్ద లడ్డూలు, 5 జిలేబీలు, ఒక అప్పం, దోశ, తేనెతొల, పులిహోర ఇస్తారని ఉంది.
హరికొలువు అనే
గ్రంథంలో సప్తగిరి మాసపత్రిక పూర్వపు సంపాదకులు జూలకంటి బాలసుబ్రహ్మణ్యంగారు- “ప్రతి గురువారం జరిగే తిరుప్పావడసేవలో సుమారు 420 కిలోల
బియ్యంతో తయారుచేసిన పులిహోరను స్వామివారి మూలమూర్తికి ఎదురుగా బంగారువాకిలి ముందర
పెద్దరాశిగా అమర్చి నేరుగా నివేదిస్తారు. దీనితోపాటు ప్రత్యేకంగా చాటంత పెద్ద
జిలేబీలు, చాటంత పెద్ద మురుకులు
(తేనెతొల) కూడ తిరుప్పావడ సమయంలో శ్రీవారు ఆరగిస్తారు” అని వ్రాశారు.
పెనుగొండ రాజధానిగా
విజయనగర ప్రభువు శ్రీరంగరాయలు పాలిస్తున్నప్పుడు అచ్యుతప్పనాయకుడికి ఇచ్చిన
శాసనంలో ఆదివరాహ స్వామికి సమర్పించవలసిన నైవేద్యాల పట్టిక ఉంది ఇందులో తేనెతొల
ఉంది. భద్రాచల రాముడికి, శ్రీరంగనాయకుడిక్కూడా
తేనెతొల నైవేద్యం పెడ్తారు.
ఈ వ్యాసాన్ని
వ్రాసేప్పుడు శ్రీ జూలకంటివారితో తేనెతొల అంటే ఏదనే విషయమై సమ్ప్రదించాను వారు “ఈ వంటకం పేరులోనే తేనె ఉంది. నేతిబీరలోనెయ్యిలాగా తేనెతొలలో
తేనే ఉండదు, తీపీ ఉండదు. అలాగని
కారంగానూ ఉండవు. నేతి చక్కిలం(మురుకు)లాగా
లావుగా, పెద్దదిగా వత్తి ఈ
తేనెతొలల్ని వండుతారని చెప్పారు. దీనినిబట్టి తేనెతొల అనేది పెద్దదిగా, గుండ్రంగా వేసిన చక్కిలం. మినప్పిండితోనే చేస్తారు. ఇందులో
తీపి కలవదు. నేతిలో వేయించి స్వామికి నివేదన పెడతారని అర్థం అవుతోంది. తీపిలేని
పెద్ద జిలేబీ లాంటిది తేనెతొల. మరి, తీపిలేనప్పుడు
దీన్ని ‘తేనెతొల’ అని ఎందుకన్నారు?
తొల అంటే రంధ్రం.
రంధ్రాల్లో తేనెటీగలు తేనెని తెచ్చి నింపుతాయి కాబట్టి, తేనెపట్టుని(honeycomb) తేనెతొల అంటారు. తేనెపట్టుని తెచ్చి పెట్టారా అన్నట్టుగా
బంగారపు రంగులో వేగిన చిక్కగా వత్తిన మురుకుల చుట్ట కాబట్టి, దీని ‘తేనెతొల’ అన్నారు.
తెలుగు వ్యుత్పత్తి కోశం దీన్ని ‘మణుగుబువ్వులు’ లాంటి వంటకం అంది. మణుగుబూలంటే మురుకులే! వాటికంటే లావుగా ఎక్కువ చుట్లు చుట్టి వేగించిన చక్కిలం ఇది. చాటంత పెద్ద మురుకు లేదా జంతిక! దీనికి ఇంగ్లీషు పేరు కావలనుకుంటే ఒకరకం macaroni అనవచ్చు!
No comments:
Post a Comment