దానశీలికి అడ్డుతొలగాలి!
డా. జి వి పూర్ణచందు
శ్లో: నైవాహమేతద్ యశశే దదాని న చార్థ హేతోర్న చ భోగతృష్ణయా
పాపైరనాసేవిత ఏష మార్గః ఇత్యేవమేతత్ సకలం కరోమి
సద్బిః సదాధ్యాసితం తు ప్రశస్తం తస్మాత్ప్రశస్తం
శ్రయతే మతిర్మే
ఏతన్మహాభాగ్యవరం శిబేస్తు తస్మాదహం వేద యథావదేతత్
అష్టకుడు అశ్వమేథ యాగం చేశాడు. యాగం పూర్తయ్యాక
అతని సోదరులు ప్రతర్థనుడు, వసుమనస్సు, శిబి ఈ ముగ్గురినీ తీసుకుని విమానం (రథం)ఎక్కి
స్వర్గానికి బయల్దేరాడాయన! దారిలో నారదుడు కనిపిస్తే ‘రాండి రాండి’ అంటూ ఆయన్నుకూడా
ఎక్కించుకుని మొత్తం ఐదుగురూ కలిసి వెడ్తున్నారు. కొంతదూరం వెళ్ళాక ఆ నలుగురు సోదరులకీ
ఒక సందేహం వచ్చింది. మనం గనక స్వర్గానికి వెళ్ళలేకపోతే భూమ్మీద దిగిపోవల్సిందే కదా…మనలో
ముందు ఎవరు దిగాల్సి ఉంటుంది… అని! దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు:
“ఒకసారి అష్టకుడూ, నేనూ కలిసి ఆకాశయానం చేస్తుంటే,
నేలమీద రంగురంగుల ఆవులు కనిపించాయి. అవన్నీ తాను దానం ఇచ్చినవే అంటూ గొప్పలు చెప్పుకున్నాడు
కాబట్టి, ‘అష్టకుడు’ మొదట భూమికి దిగాలి. ఒకసారి ‘ప్రతర్థనుడు’ విసుక్కొంటూ దానం చేశాడు.
అందుకని రెండవ వాడుగా అతను దిగాలి. ఇంక మూడవవాడు ‘వసుమనస్సు’. ఈయన లోక సంచారం చేసే
ఆకాశరథాన్ని చూపించి, ‘ఇది నీకే’ అని నాతో
అన్నాడు. ఆ తరువాత అవసరార్థం నేను పరోక్షంగా అడిగి చూశాను. అతను ఇవ్వకుండా ముఖం చాటేశాడు.
కాబట్టి, మూడో వ్యక్తిగా ‘వసుమనస్సు’ దిగాలి.
ఇంక చివరికి మిగిలింది నేనూ, శిబి ఇద్దరం…! నాలుగో
వ్యక్తిగా నేనే దిగిపోతాను. ఎందుకంటే శిబికి నేను సరిపోను. దానగుణంలో అతనికి సాటి ఎవరూ
లేరు… కన్నకొడుకునే నరికి మాంసం
వండి దానం ఇచ్చిన త్యాగమూర్తి” అంటాడు నారదుడు.
“ఏవిటయ్యా…ఎవడో దానం అడిగాడని, కన్నకొడుకుని చంపటం
ఏవిటీ…? ఆ మాంసాన్ని తినమని అతను ఆదేశిస్తే నువ్వు తినబోవటం ఏవిటీ…?” అని, మంత్రులు
అడిగితే, శిబి చక్రవర్తి ఆ బ్రాహ్మణుడు నా పుత్రుడి మాంసం కావాలని, వండి పెట్టమనీ దానం
అడిగాడు. నేను ఇచ్చాను…అంటూ తాను అలా ఎందుకు చేశాడో ఒక వివరణనిస్తూ, పై శ్లోకాన్ని చెప్తాడు:
“పేరు ప్రతిష్ఠల కోసం గాని, సిరి సంపదల కోసం గాని,
స్వంతలాభం కోసం గాని, స్వర్గభోగాలు ఆశించి గాని,
నేను ఏ దానమూ చెయ్యలేదు. దానం అనేది పాపాత్ములు చెయ్యలేని పని! ఒక్క సత్పురుషులు
మాత్రమే దానమార్గాన్ని అనుసరించ గలరు. అందుకని ఆ మార్గానే నేను వెడుతున్నాను” అని!
. శిబిని
గురించిన ఈ కథనంతా చెప్పి, ఆయనకున్నంత దానగుణం తనకు లేదు కాబట్టి, శిబికన్నా తాను ముందు
దిగిపోవాల్సి వస్తుందంటాడు నారదుడు. సంస్కృత మహాభారతం అరణ్యపర్వం (188.54)లో ఈ ఉదంతం
ఉంది చివరికి మిగిలేది దానగుణం మాత్రమేనని,
దానశీలికి స్వర్గద్వారాలు ఎప్పుడూ బార్లా తెరిచే ఉంటాయని దీని సారాంశం….
ఇస్తానని ఇవ్వని వాడు, విసుక్కుని ఇచ్చిన వాడు,
ఇచ్చి గొప్పలు చెప్పుకున్నవాడు ఒకరిని మించి ఒకరు పాపాత్ము లని ఈ కథలో మనకో సూత్రం
కనిపిస్తుంది. ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పుకునేవాళ్ళు, ‘నేను కాబట్టి ఇ’చ్చానని గొప్పలు
చెప్పుకునేవాళ్ళు, అప్పుడప్పుడూ అంతో ఇంతో ఇస్తుండకపోతే, నరఘోష పెరిగిపోతుందని కొంత
సొమ్ము దాన ధర్మాలకు కేటాయించేవాళ్ళు, రూపాయి
ఇచ్చి వందరూపాయల ఫోటోలు దిగేవాళ్ళు… ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారీ కాలంలో. వాళ్లకు
స్వర్గానికి వెళ్ళే బండెక్కే అవకాశమే రాదు!
శిబి చక్రవర్తి ఒక సన్నని దారిలో రథం తోలుకుంటూ
వెడ్తున్నాడట. అదే సమయానికి సుహోత్రుడనే రాజు కూడా ఆ దారినే వచ్చాడు. రెండు బళ్ళు పట్టని
ఇరుకుదారి అది. ఎవరో ఒకరు రోడ్డు మార్జిన్ దిగాలి. ఇద్దరూ సమానమైన అధికారాలు కలిగిన
వాళ్ళు. కాబట్టి ముందు ఎవరు దిగాలి… అని తర్కిస్తున్నారట.
ఆ సమయంలో నారదుడు వచ్చి, రాజకీయపరమైన ప్రోటోకాల్
సమానంగా ఉన్నప్పటికీ, వ్యక్తిత్వం రీత్యా ఇద్దరిలో ఎవరు తక్కువో వాళ్ళు ముందు పక్కకు
తప్పుకుని దారివ్వాలి….” అంటాడు. అయితే వారిద్దరిలో ఎవరి వ్యక్తిత్వం గొప్పదని అడిగితే
నారదుడు ఇలా చెప్తాడు-
“తనకు ఒక ఉపకారం చేస్తే తిరిగి వంద ఉపకారాలు చేసే
గుణం శిబి చక్రవర్తికుంది. లోభిని దానం చేత, అబద్ధాన్ని, నిజం చేత, క్రూరుణ్ణి ఓర్పు
చేత, అసాధువుని సాధుత్వం చేత గెలుచుకునే లక్షణం శిబికి ఉంది” అని చెప్తాడు. అప్పుడు
సుహోత్రుడు నారదుడి తీర్పుకు కట్టుబడి, రథం దిగి వచ్చి శిబికి దణ్ణం పెట్టి రథాన్ని
పక్కకు లాగి దారి ఇస్తాడు.
అనేక ట్రాఫిక్ జాముల్ని పరిశీలిస్తే, చాలా సందర్భాలలో “ముందు నువ్వు అడ్డుతీయాలంటే
నువ్వు తీయాలనే తగూలాటలే ఎక్కువ కారణంగా కనిపిస్తుంటాయి. సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్
జామై బళ్ళు కదిలే పరిస్థితి లేనప్పుడు అక్కడ చాలా మంది బిచ్చగాళ్ళు చేరటానికి కారణం,
బహుశా, మొదట బండి కదిలే అవకాశం ఇప్పించేందుకే నన్నమాట. ఎవడికి దాన గుణం లేదో వాడు రెండు
చేతులతోనూ నోరు మూసుకుని బండిని అడ్డుతీయాలనేది నారదుడి పేరుతో మహాభారతం ఇచ్చిన తీర్పు.
దానం చేసినవాడి బండే ముందు కదలాలి! దానశీలికి అడ్డు తప్పుకోండి.