Tuesday 28 July 2015

ధగిడీ రాజ్యంలో మేలిమి రచనలు :: డా. జి వి పూర్ణచందు

ధగిడీ రాజ్యంలో మేలిమి రచనలు
డా. జి వి పూర్ణచందు

జగలోభుల్ మలభాండ విగ్రిహులు గంజాతిండి జండీలు మొం
డి గులాముల్ మగలంజె లాగడపు టెడ్డేల్ ఘోర క్రూరాథముల్
ధగిడీలుండగ నేమి యర్థుల గృతార్ధత్వంబు నొందింతురే
జగదేవక్షితి పాల రాజకుల తేజా! దీనకల్పద్రుమా!

ఇన్నిన్ని తిట్లు తిన్నాక ఎవడైనా బతికుంటే వాడికన్నా గాడిద నయం అన్నమాట! ‘గాడిద కొడకా’ అని తిడితే, ‘వీడా నా కొడుక’ని గాడిద కూడా ఏడ్వగలదు కాబట్టి గాడిదే నయం!!

ఇంతకీ, ఇన్ని తిట్లు తిన్న ఆ ‘అడ్డగాడిద’ ఎవరు? ఒకడేమిటీ ఈ కవిగారికి పెట్టని వాళ్ళందరినీ కలిపే తిట్టాడు. పెట్టిన వాణ్ణి పొగడటానికి బదులుగా పెట్టనివాళ్ళను తిట్టటం ఓ టెక్నిక్. ‘నువ్వలాంటి వాడివి కాదు నాయనా’ అనటమూ పొగడటమే! పద్య కవి ఎవరో తెలియదు. చాటు పద్యంగా చెలామణిలో ఉంది. తాను తిట్టిన వాళ్ళ పేర్లు చెప్పకుండా సాధారణీకరించి వదిలేశాడు కవి. ఆ కవిగారిని గౌరవిస్తానన్నన్నవాడు ఇమ్మడి జగదేవరాయుడనే ప్రభువని ఇందులో ఉంది.

జగదేవరాయుడు ఒక గొప్ప సంస్థానాధీశుడేమీ కాదు. బెంగుళూరు దగ్గర చెన్నపట్టణం అనే ఒకమండల స్థాయి చిన్న రాజ్యానికి పాలకుడు. షుమారుగా 1620 నాటివాడు కావచ్చని నిడదవోలు వెంకట్రావుగారు ‘దక్షిణదేశీయాంధ్రవాఙ్ఞ్మయం’లో ఇతని గురించి వ్రాస్తూ, ఈ చాటు పద్యాన్ని ఉదహరించారు. 

‘అర్థుల కృతార్థత్వంబు నొందింపని’, సత్కవి పండితులను గౌరవించి ప్రోత్సహించటం తెలియని ధనమదాంధుల్ని జగలోభులు, మలభాండవిగ్రిహులు, గంజాతిండి లండీలు, మొండి గులాములు, మగలంజెలు, ఆగడపు ఎడ్డెలు, ఘోర క్రూరాథములు, ధగిడీలు ఇలా తిట్టి పోశాడు. ధగిడీ అంటే పచ్చి నీచమైన స్త్రీ. లండీలంటే కుత్సితులు. జగదేవరాయ అలాంటివాడు కాదనీ, అతను దీనకల్పద్రుమం అనీ ఈ పద్యంలో పొగిడాడు.

సాహితీ సేవ అనేది ఈరోజుల్లో చాలామందికి ఒక హాబీ! సినిమా రచయితలకు వచ్చినట్టు ఇతరులకు సాహిత్యాదాయం ఉండదు. పోతన ఐదువేళ్ళూ నోట్లోకి పోయే పరిస్థితి ఉన్నవాడు కాబట్టి కూళలకు తన కృతిని ఇవ్వనని కరాఖండిగా చెప్పేయ గలిగాడు. నిత్యపేదరికంలో జీవించిన త్యాగరాజు కూడా రాముడికి తప్ప మరొకరికి తలవొంచ నన్నాడు. విశేషం ఏమంటే, రాజులకు కృతినివ్వని కావ్యాలు ఎన్నో నేటికీ నిలిచి ఉండగా, రాజాదరణ పొందిన కావ్యాలలో కవి ఎవడో తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయినవే ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి, సాహిత్య పోషకులు మంచి సాహిత్యం రావటానికి ప్రేరకులేగానీ, కారకులు కాదన్నమాట.

రచయిత రవ్వంత గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని మాత్రమే కోరుకుంటాడు. నేటికాలంలొ అదే తగ్గిపోతోంది! ప్రభుత్వ పురస్కారాలు, విశ్వవిద్యాలయ పురస్కారాలు, అకాడెమీ పురస్కారాలు అత్యధికంగా నవ్వుల పాలౌతున్నాయి.
తెలుగు పుస్తకాలకు అంతర్జాతీయ ఖ్యాతి రావటం లేదని అంటారు గానీ, అంతర్జాతీయ స్థాయిలో పుస్తక ప్రచురణ చేసేంత స్థితి మన ప్రచురణ రంగానికి లేదు. అయినా చాలామంది ప్రచురణకర్తలకు రచయితలంటే చిన్నచూపు.
అప్పో సొప్పో చేసి, రచయితే స్వంతంగా ప్రచురించుకుంటే, ఉచితంగా పంచుకోవటం తప్ప ఆ పుస్తకాలు ఏం చేసుకోవాలో తెలీదు. ఇరుకు కొంపలో ఈ పనికిమాలిన పుస్తకాల కట్టలు అడ్డంగా ఉన్నాయని ఇంట్లోవాళ్ళ తిట్లు నిత్య నైవేద్యా లౌతాయి. అత్యున్నత సాహితీ విలువలున్న పుస్తకాలకు మార్కెట్ ఉండదనే ఒక అపనమ్మకం పుస్తక విక్రేతల్లో ఉంది కాబట్టి, స్వీయ రచనలను షోరూములో ఉంచటానిక్కూడా చాలామంది అంగీకరించటం లేదు. జిల్లాగ్రంథాలయాలు స్వీయప్రచురణ కర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ప్రచురణ తనకు వృత్తి కాదు కాబట్టి, గ్రంథాలయ సంస్థల చుట్టు తిరిగే అవకాశం రచయితల కుండదు.  

వ్రాసిందంతా అచ్చు కావాలనే దుగ్ధలోంచి మొదట రచయిత బయటకు రావాలి. “మొక్కుబడి ముందుమాట”లతో పేజీలు నింపటం కన్నా, ఆ రంగంలో నిపుణుడి చేత తన పుస్తకాన్ని ఎడిట్ చేయించి, నిర్దుష్టంగా అచ్చు వేస్తే, మంచి  పుస్తకాలకు తప్పకుండా మార్కెట్టు ఉంటుంది. పబ్లిషర్లు కూడా ఎడిటర్లను నియమించి, ప్రతి అక్షరాన్నీ  పరిశీలించాకే పుస్తకం అచ్చు వేయటం  మంచి అలవాటు. నిగ్గు తేలిన మేలిమి రచన ఒక పేజీడైన చాలు.

చుట్టూ ధగిడీల కారణంగా నేటికాలపు రచయితలు రాయని భాస్కరులుగా మారిపోతున్నారు. ఒకరిని నిందించి ఉపయోగం లేదు.

     

శస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుతుడు డా. జి వి పూర్ణచందుశస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుతుడు

శస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుతుడు
డా. జి వి పూర్ణచందు

ప్రాచీన భారత దేశంలో క్రీ.పూ ౩౦౦౦ నాటికే శస్త్ర చికిత్సా పరమైన పరిశోధనల గురించి బీజాలు పడ్డాయని బుద్ధుడి కాలానికి చాలా విస్తృతమైన అధ్యయనం జరిగిందనీ, పరిశోధకుల భావన.

చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడూ ఈ ముగ్గురూ ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని అత్యున్నత స్థితికి తీసుకు వెళ్ళారు. చరకుడు ఔషధచికిత్సకు, సుశ్రుతుడు శస్త్రచికిత్సకూ పితామహులుగా నిలిచారు. వాగ్భటుడు ఆ ఇద్దరికీ సమన్వయంగా అష్టాంగ హృదయం గ్రంథాన్ని రచించాడు. ఈ ముగ్గురునీ బృహత్త్రయంగా పిలుస్తారు.
ఆధునిక వైద్యానికి పితామహుడని భావించే హిప్పోక్రేట్ర్స్ (క్రీ పూ. 460-370) కన్నా ఎంతో ముందునాటి వాడు సుశ్రుతుడు. ఆయన చెప్పిన ఎన్నో వైద్యక విషయాలు ఈనాటికీ ప్రామాణికంగా ఉన్నాయి.
క్రీ.పూ. 600-1000 ఆచార్య సుశ్రుతుడి కాలంగా ఎక్కువమంది భావిస్తున్నారు. బహుశా బుద్ధుడికి ఈయన సమకాలికుడు కావచ్చు. సుశ్రుతుడి పైన బౌద్ధం లేదా జైనం ప్రభావం ఎంత ఉన్నదో ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది.


ఈజిప్ట్‘లోని Komomboలో ఒక ప్రాచీన దేవాలయం గోడల మీద శస్త్రచికిత్స ఉపకరణాలను చెక్కారు. అవి సుశ్రుతుడు చెప్పిన ఉపకారణాలను పోలి ఉన్నాయట. ఆ గుడి ఏ కాలం నాటిదో తెలీదు. కానీ, దాని కన్నా నిస్సందేహంగా సుశ్రుతుడు ప్రాచీనుడు. బారతీయ విఙ్ఞానం అప్పటికే నైలూ నది దాకా విస్తరించిందన్నమాట!
కాశీరాజైన ‘దివోదాస ధన్వంతరి’ శిష్యుడిగా సుశ్రుతుడు తన గురించి చెప్పుకున్నాడే గానీ, తానే శల్యతంత్ర ప్రవర్తకుడి నని ఎక్కడా పేర్కొనలేదు. అనేక శస్త్రచికిత్సలు, వాటిని నిర్వహించే ఉపకరణాలను వివరించాడు. వీటిలో కొన్ని బంగారం, వెండి, ఏనుగు దంతాలతో చేసినవి కాగా, శ్రేష్ఠమైన ఉక్కుతో చేయవలసినవే ఎక్కువ ఉన్నాయి. ఒక వెంట్రుకని నిలువుగా చీల్చ గలిగే టంత నిశితంగా శస్త్రం ఉండాలన్నాడు.

సుశ్రుతుడు బహుశా, సింధునాగరికత అంతరించి వైదిక యుగం ప్రారంభమైన తొలి రోజుల నాటివాడు కావచ్చు. అప్పటికి, ఉత్తరాదిలో రాగి, కంచు మాత్రమే వాడకంలో ఉన్నాయి. అదే కాలానికి దక్షిణాదిలో తెలుగు నేలపైన లోహయుగం నడుస్తోంది. ఉక్కుతో ఆయుధాలు, ఇతర పనిముట్లు తయారయ్యే కర్మాగారాలు కూడా ఇక్కడ ఉండేవి. ఆంధ్రప్రదేశ్‘లో బయల్పడిన ప్రాచీన బూడిద కుప్పలే దానికి సాక్ష్యం. ఆ బూడిదను పరిక్షిస్తే అత్యధిక వేడిమీద అది బూడిదయ్యిందని, నిస్సందేహంగా ఇనుమును కరిగించి పనిముట్లు తయారు చేసే కర్మాగారాలకు చెందిన బూడిదకుప్పలే అవి అని నిర్ధారించారు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని దండకారణ్యానికి తెచ్చి అస్త్రశస్త్రాలు ఇచ్చాడని రామాయణంలో ఉంది. ఇక్కడ ఉన్న ఉక్కు ఆయుధాల కర్మాగారాల దగ్గరకు ఆ రాకుమారులను తీసుకువెళ్ళి వాళ్ళ కొలతలకు తగ్గ ఆయుధాలు తయారు చేయించి ఇప్పించాడని దీని అర్ధం కావచ్చు. విశ్వామిత్రుడిద్వారా ఆయన దత్తపుత్రుడైన సుశ్రుతుడికి తెలుగునేల మీద ఉక్కు పరిశ్రమల చిరునామాలు తెలుసు కాబట్టి, తన శల్యచికిత్సా ఉపకరణాల్ని నాణ్యమైన ఉక్కుతో తయారు చేయించుకో గలిగాడు. ఆ విధంగా సుశ్రుతుడి శస్త్రోపకరణాల తయారీలో ఆనాటి తెలుగు లోహ పనివారి పాత్ర కూడా ఉండి ఉండాలి. పంచాణనం వారికి, ముఖ్యంగా లోహ పనిముట్లు తయారు చేసే కమ్మరులకు శస్త్ర వైద్యంతోనూ శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించే ఉపకరణాలతోనూ ఎక్కువ పరిచయం ఉంటుంది. కాబట్టి, సుశ్రుత సంహిత పరిరక్షకలు వీరేనని ‘హిష్టరీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ’ గ్రంథంలో మేథ్స్ పండితుడు పేర్కొన్నాడు.

ఈ కోణంలోంచి చూసినప్పుడు సుశ్రుతుడి కాలం క్రీ.పూ. 1000 వరకూ ఉండే అవకాశం ఉంది. భారతీయ వైద్యానికి అంత ప్రాచీనత ఇవ్వటానికి ఇష్టపడని పాశ్చాత్య పరిశోధకులు సుశ్రుతుణ్ణి క్రీ.శ.4,5 శతాబ్దాల దాకా తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేశారు. ఒక పండితుడు సుశ్రుతుణ్ణి క్రీ.శ. 11వ శతాబ్ది దాకా లాక్కురావాలని చూశాడు. చరిత్రకారుల వ్యక్తిగత రాగద్వేషాల వలన మన చరిత్రకు చాలా అపకారం జరిగింది.
అధర్వణ వేదంలో కూడా సుశ్రుతుడి పేరు కనిపిస్తుంది. సుశ్రుతాచార్యుడు అంతటి ప్రాచీనుడే నని నిస్సందేహంగా భావించవచ్చు. “విశ్వామిత్ర సుతం శిష్య మృషిం సుశ్రుత మన్వశాత్” “విశ్వామిత్ర సుతాం శ్రీమాన్ సుశ్రుతః” సుశ్రుత సంహిత లోని ఈ వాక్యాలు సుశ్రుతుడు విశ్వామిత్రుడి పుత్రుడని చెప్తున్నాయి. మహాభారతం అనుశాసన పర్వంలో “శ్యామాయనోzథః గార్గశ్చ జాబాలి సుశ్రుతస్తథా”-విశామిత్రుడి పుత్రులలో శ్యామ, గార్గి, జాబాలితో పాటు సుశ్రుతుడు కూడా ఉన్నట్టుగా ఉంది. సుశ్రుతుడు శాలిహోత్రు డనే ఋషి పుత్రుడని కొన్ని చోట్ల ఉంది. శాలిహోత్రుడి పుత్రుడు విశ్వామిత్రుడికి దత్త పుత్రుడు కాకూడదని లేదుకదా!
విశ్వామిత్రుడి పుత్రుల్లో దత్త పుత్రులు చాలా మంది ఉన్నారు. అందుకే ఆయనకు నూర్గురు కొడుకులనే నానుడి ఉంది. రాజకీయ, సామాజిక ప్రయోజనాల కోసం ఆయన ఇలాంటి దత్తతలు చాలా స్వీకరించినట్టు వేదహరిశ్చంద్రుడి కథ చెప్తోంది. నిజపుత్రులు విశ్వామిత్రుడి దత్తతల్నిఒప్పుకోక ఆయనతో వైరాన్ని పెంచుకున్నారు. అలా తండ్రితో పోట్లాడి, శాపగ్రస్థులై వెళ్ళి పోయిన పుత్రుల్లో ఆంధ్రుడనే వాడున్నాడని, అతని సంతతే ఆంధ్రులయ్యారనీ శతపథ బ్రాహ్మణం చెప్తోంది. మొత్తం మీద సుశ్రుతుడికీ ఆంధ్రులకూ సోదర సంబంధం ఉందన్నది వాస్తవం.

ఆచార్య నాగార్జునుడు సుశ్రుత సంహితను సంస్కరించి, ఆ గ్రంథానికి పెంపుగా ఉత్తర తంత్రాన్ని రచించటాన్ని బట్టి సుశ్రుతుడు నిస్సందేహంగా నాగార్జునుడికి పూర్వుడేనని తేల్తోంది. నాగార్జునుడి సహచరుల్లో తొలి శాతవాహనులు, కనిష్కుడు కూడా ఉండటాన అతని కాలం క్రీస్తు శకానికి ఒక శతాబ్ది అటూ ఇటూగా ఉండవచ్చు. ఆవిధంగా చూస్తే, సుశ్రుతుడు క్రీ.పూ. 3-4 శతాబ్దాలకన్నా ముందు వాడవ్వాలి! పతంజలి మహా భాష్యంలో సుశ్రుతుడి ప్రస్తావన ఉండటాన, పాణిని కన్నాపూర్వుడు అంటే కీ. పూ. 6వ శతాబ్ది కన్నా ముందువాడు కావాలి!

అమ్మోనియస్ (క్రీ.పూ. 283-247), సెల్సస్ (క్రీశ.1వ శతాబ్ది) పేర్కొన్న perineal vesicolithotomy లాంటి శస్త్ర చికిత్సా విధానాలు సుశ్రుత సంహిత గ్రంథం ఆధారంగా చేసినవేనని ఋజువైంది.
క్రీపూ. 326లో అలెగ్జాండర్ దండయాత్ర తరువాతే, భారత దేశంలో వర్ధిల్లుతున్న విఙ్ఞానం గురించి గ్రీకో రోమన్లకు తెలిసింది. శ్ట్రాబో, ప్లినీ, ప్లూటార్చ్ లాంటి చరిత్రకారులు ఆ రోజుల్లో గ్రీకు, భారతీయ శాస్త్రాలను పరస్పరం మార్పిడి చేసుకోవటం ద్వారా విఙ్ఞానం పెంచుకోవటం కోసం ప్రయత్నించారు. పాశ్చాత్య వైద్య పోకడలను తెలుసుకుని ఆయుర్వేద శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకో వలసిందిగా చరకుడు కూడా సూచించాడు. ఈ సూత్రాన్ని పాటించక పోవటం వలన రెండు శాస్త్రాలకూ నష్టమే జరిగింది.

సుశ్రుత సంహిత సంస్కృత శ్లోకాలలో వ్రాయబడింది. కొండంత విషయాన్ని గోరంతకు సంక్షిప్తీకరించటానికి వీలుగా ఉంటుందనీ, బాగా గుర్తు పెట్టుకోగలుగు తారని అలా శ్లోకాల్లో శాస్త్రాలు వ్రాసేవారు. భాష్యకారులు, వ్యాఖ్యాతలు ఆ శ్లోకాలలోని రహస్యాలు విప్పిచెప్పగలగాలి. అది జరగనప్పుడు ఆ గ్రంథం ఎవరికీ అర్ధం కానిదిగా ఉండి పోతుంది.

‘సుశ్రుత సంహిత’ ఇప్పటి ‘బైలీ అండ్ లవ్- Text book of surgeory పుస్తకం లాగా ఆ రోజుల్లో శస్త్ర వైద్య విద్యార్ధులకు ఒక పాఠ్య గ్రంథంగా ఉండేది. సుశ్రుత అంటే చక్కగా వినేవాడనే అర్ధం కూడా చెప్పుకోవచ్చు. రోగి చెప్పుకునే బాధను చక్కగా వినటం మంచి వైద్యుడి లక్షణం!

క్రీ.శ. 8వ శతాబ్దిలో సుశ్రుత సంహితని ఖలీఫ్ మన్సూర్ ఆదేశానుసారం Kitab-i-Susrud పేరుతో అనువదించారు. అక్కడి నుండి హెస్లెర్ అనే పండితుడు లాటిన్ లోకి, వెల్లర్స్ జర్మనీ లోకి, హెర్న్‘లే ఇంగ్లీషులోకి అనువదించారు. 1907లో సంస్కృతమూలం లోంచి, కవిరాజ కంజన్‘లాల్ భిషగ్రత్న చేసిన ఇంగ్లీషు అనువాదం ప్రామాణికంగా నిలిచింది.

చక్రపాణి దత్తు, గయదాసు (క్రీ.శ. 1100), డల్హణుడు (క్రీ.శ. 1200) , ప్రభృతులు వ్యాఖ్యానాలు వ్రాశారు. సుశ్రుత సంహితలోని కొన్ని భాగాలను కె ఎస్ శాస్త్రి, చావలి రామమూర్తి శాస్త్రి, రాణీ వెంకటాచలపతి ప్రసాద శాస్త్రి, ఉపాధ్యాయుల సూర్య చింతామణీ శాస్త్రి, టి పి రామానుజ స్వామి, ప్రభృతులు తెలుగులోకి అనువాదాలు చేసి ప్రచురించారు.

సుశ్రుత సంహిత గ్రంథంలో ఆయుర్వేద మౌలిక సిద్ధాంతాల్ని సూత్రస్థానంలో46 అధ్యాయాల్లో చెప్పారు. రోగకారణాల గురించి నిదాన స్థానంలో 16 అధ్యాయాల్లో చెప్పాడు. పెథాలజీ అంటారు దీన్ని. శరీర స్థానం పేరుతో 10 అధ్యాయాల్లో శరీరం లోపలి అవయవాలు, అస్థిపంజరం అమరిక లేదా అనాటమీని వివరించారు. 34 అధ్యాయాల్లో వ్యాధులకు ఔషధ మరియు శస్త్ర చికిత్సల గురించి వివరించారు. విషదోషాల నివారణ గురించి కల్ప స్థానంలో 8 అధ్యాయాలున్నాయి.

రోగానికి కారణమయ్యే త్రిదోషాలు వాతపిత్త కఫాలని తక్కిన ఆయుర్వేద గ్రంథాలు చెప్పగా రక్త ధాతువును నాలుగో దోషంగా సుశ్రుతుడు పేర్కొన్నాడు. రక్త ధాతువు దుష్టి చెందితే ఇతర ధాతువులను దుష్టి చెందిస్తుందన్నాడు.

యుద్ధ సైనికుల ఆరోగ్య రక్షణ, గాయలకు వ్రణరోపణ చికిత్సలు, శల్యోద్ధరణం అంటే, గుచ్చుకుని విరిగిన బాణపు ములుకుల్ని తొలగించే శస్త్ర చికిత్సలు చెప్పాడు. విష ప్రయుక్తమైన ఆహారాదులు, వాటి విరుగుడు చికిత్సలు చెప్పాడు. యుద్ధాలకు తరలి వెళ్ళినప్పుడు వెంట వెళ్ళే పరివారంలో రాజవైద్యులు కూడా ఉండేవారు. వాళ్ళు అక్కడికక్కడ తక్షణ చికిత్సా కేంద్రాలు నడిపేవారు. అందుకే శస్త్రవైద్యుల్ని ప్రాణాచార్యులని పిలిచేవాళ్లు.

నాణ్యమైన ఉక్కు ఉపకరణమే అయినా దాన్ని ప్రయోగించేది వైద్యుడి ‘చెయ్యి’ కాబట్టి, ఉత్తమ శస్త్ర ఉపకరణం (best surgical instrument) ఏదని అడిగితే “మానవ హస్తం-human hand” అన్నాడు సుశ్రుతుడు. శస్త్ర చికిత్స ఒక గొప్ప కళ! శస్త్ర చికిత్సకుడికి హస్త కౌశలం కావాలి!

సుశ్రుతుడు చెప్పిన నూటొక్క శస్త్ర ఉపకరణాలకు స్వస్తిక, సందంశ, తాళ, నాడీ, శలాక లాంటి పేర్లున్నాయి. సర్జరీకి ముందు అగ్నితో “ఉపకరణ పాయనం” అంటే sterilization of instruments చేయాలన్నాడు. ఒక్కో ఉపకరణాన్నిభద్రపరచు కోవటానికి వాటి ఆకారానికి తగిన సంచులు కుట్టించాలన్నాడు.

వ్యాధులు మందులతో తగ్గేవి, ఆపరేషను ద్వారా తగ్గేవి అని రెండు రకాలుగా ఉంటాయి. ఏది మందులతో తగ్గేది, ఏది శస్త్ర చికిత్స అవసరమయ్యేది అనే చర్చ సుశ్రుతంలో బాగా కనిపిస్తుంది. మందులతో తగ్గే వాటికి ఆపరేషను చేయబోవటం, ఆపరేషను అవసరమైన వాటికి మందులు ఇవ్వబోవటం రెండూ అశాస్త్రీయమే! శల్యం అంటే శరీరంలో దిగబడిన ములుకు. వాడి మాటలు నన్ను శల్యంలా బాధించాయి...అనటంలో అర్ధం ఇదే! దానిని తొలగించి గాయం తగ్గేలా చేస్తారు కాబట్టి, శల్యానైకి చేసే చికిత్స శల్యచికిత్స! శస్త్రం అంటే సర్జరీ చేసే ఉపకరణం. దాన్ని ప్రయోగించి నేర్పుగా చేసేది శస్త్ర చికిత్స.

విష్పల అనే స్త్రీ తన కాలు కోల్పోయినప్పుడు లోహంతో చేసిన కాలుని అమర్చాడని ఒక ఐతిహ్యం ఉంది. కండ తెగి రక్త స్రావం అవుతున్నప్పుడు ఆ కండరం రెండు అంచులను దగ్గరకు లాగి కుట్లు వేయటం (సూచరింగ్), క్షారాలను ఉపయోగించి స్రావం అవుతున్న రక్తనాళాన్ని కాల్చటం ద్వారా రక్తస్రావాన్ని ఆపటం (కాటరైజేషన్) లాంటి ప్రక్రియలు సుశ్రుతుడు చెప్పినవే!

చీము పట్టి కుళ్ళిపోతున్న ‘దుష్టవ్రణా’న్ని ‘శుద్ధవ్రణం’గానూ, పుండు తగ్గే దశలో దాన్ని ‘రుద్ధవ్రణం’గానూ మార్చే (ulcer healing) విధానాలను సుశ్రుతుడు పేర్కొన్నాడు. వైను, సారాయిల్ని ఎనస్థీషియాగా ఉపయోగించాడు. Excision (ఛేదనం), Incision (భేదనం), Scraping (లేఖనం) లాంటి విధానాలను అనుసరించాడు. వరిబీజంలో నీటిని తీసేందుకు ‘వ్యవధాన’ అనే ఉపకరణాన్ని ఉపయోగించాడు. నాళాల లోపల ఇరుక్కున్న వాటిని తొలగించే ప్రోబ్‘ని ‘ఈషణ’ అన్నాడు. లోపలి భాగంలో ఏర్పడే మొలలను, లూఠీ వ్యాధిని (ఫిష్ట్యులా ఇన్ యానై) తొలగించటానికి లాంగలక, అర్థలాంగలక, సర్వభద్ర, చంద్రాథ వగైరా  ఉపకరణా లను ఉపయోగించాడు. పేగులలో ఏర్పడే అవరోధాలను (intestinal obstructions-బద్ధ గుదోదరం) తొలగించ టానికి, అలాగే చిల్లులు పడిన పేగులకు (ఛిద్రోదరం-perforated intestines) శస్త్రచికిత్సలు చెప్పాడు.  షుగరు బీపీ వ్యాధుల గురించి సుశ్రుతుడు వివరించిన విషయాలు ఆధునిక వైద్యానికి దగ్గరగా ఉంటాయి.

 ఎలాంటి సౌకర్యాలూ లేని ఆ రోజుల్లో ఒక మనిషి శవాన్ని కుళ్ళిపోకుండా కాపాడుతూ, ఒక్కక్క పొరనీ విడదీసి చూస్తూ శరీర రచన (అనాటమీ) గురించి సుశ్రుతుడు చేసిన అధ్యయనం గొప్పది. పిండ స్థాయినుంచి అంటే ఎంబ్రియాలజీ నుండి, ఎముకలు ఆస్టియాలజీ, కండరాలు (మయాలజీ), కడుపులో ఉండే అవయవాలు స్ప్లాన్‘క్నాలజీ ఇలా ఎన్నో అధ్యయనాలు సుశ్రుత సంహితలో కనిపిస్తాయి.

జేమ్స్ ఫిండ్లే, ఠామస్ క్రూసో అనే ఇద్దరు బ్రిటిష్ సర్జన్లు పూనా బ్రిటిష్ రెసిడెన్సీ శస్త్రవైద్యులుగా ఉన్నారు. ఒక కమ్మరి సామాజిక వర్గానికి చెందిన శస్త్ర వైద్యుడు ప్లాష్టిక్ సర్జరీ ద్వారా తెగిన ముక్కు సరిచేయటం కళ్ళారా చూసి ఆ విషయాన్ని 1794 మద్రాస్ గెజెట్లోనూ, లండన్‘లోని Gentleman's magazine లోనూ ఇండియన్ రైనోప్లాస్టీ (ముక్కుకు చేసే ప్లాస్టిక్ సర్జరీ) పేరుతో వ్రాసి ప్రచురించారు. ఆ తరువాత జరిగిన పరిశోధనల్లో అతని సర్జరీ విధానం సుశ్రుతుడు చెప్పిన విధానాని కన్నా మెరుగు పరచ బడినదిగా గమనించారు.

శరీరంలోపలికి ప్రవేశ పెట్టేందుకు 28 రకాల కేథెటర్లను ఇరిగేషన్ సిరింజిలను వివరించాడు. అనేక క్షారాలతో alkalies and caustics గాయాలను శుభ్రపరచటం గురించి చెప్పాడు. అమ్మవారు లాంటి వ్యాధుల వలన పెదిమలు ముక్కు, బుగ్గలకు సంబంధించిన అంగవైకల్యాలు ఏర్పడినప్పుడు ఆ భాగాలను పునర్నిర్మించటం (ప్లాస్టిక్ సర్జరీ) గురించి తొలి సారిగా ప్రస్తావించింది సుశ్రుతుడే! నుదుటిపైన ఉండే చర్మపుపొరని నిలువుగా గాయపడిన ముక్కు భాగానికి తెచ్చి అంటుగట్టి, ముక్కు తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేసే ప్లాష్టిక్‘సర్జరీ పద్ధతి ఇది. నుదుటి చర్మపు పొరని pedicled forehead flapని ‘ఇండియన్ ఫ్లాప్’అని పిలుస్తారు. ముఖానికి సంబంధించిన ఈ ప్లాష్టిక్ సర్జరీకి భారతీయ నామం రావటానికి సుశ్రుతుడు కారకుడు.

పొట్ట లోపలి అవయవాలలో కుళ్ళును తొలగించటానికి పొట్టను కోసి తెరిచే ప్రక్రియ లాపరాటమీ గురించి సుశ్రుతుడు వివరించాడు. పేగులకు అయిన గాయాలను repair of intestinal injuries సరిచేయటం, హెర్నియా, హైడ్రో సీల్, మొలలు, ఫిష్ట్యులా విరిగిన ఎముకలు సరిచేయటం, కొన్ని శరీర భాగాలు తొలగించటం, కంటి శుక్లాలకు ఆపరేషన్లతో సహా చాలా శస్త్రచికిత్సలను సుశ్రుతుడు తన గ్రంథంలో వివరించాడు.

మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ల గురించి కూడా సుశ్రుతుడు ప్రస్తావించాడు. మూత్రనాళం మూసుకుపోవటాన్ని (stricture of the urethra) సరి చేసే చికిత్సను నిరుద్ధ ప్రకాశ అన్నాడు. పుస్తకాలు కుట్టే సూది లాంటి సన్నని పొడవైన ఇనుప శలాకను మూత్ర నాళంలోకి నెమ్మదిగా ఎక్కిస్తూ అవరోధాన్ని తొలగించే ప్రక్రియని సుశ్రుతుడే చెప్పాడు. ప్రతి మూడు రోజులకు సూది మందం పెంచుతూ పోవాలన్నాడు. ఇది మూత్రనాళం విప్పారేలా dilatation చేసే ప్రక్రియ. మూత్రనాళాలను శుద్ధి చేసే ‘వస్తి శోథక యంత్రం’(bladder syringe)ని కనిపెట్టాడు. మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు, వాటిని తొలగించే చికిత్సల గురించి కూడా చెప్పాడు. చాలా వ్యాధుల్ని మందులతో తగ్గించేందుకు కొన్ని ఫార్ములాలు కూడా సూచించాడు.

8 విధాలైన శ్రోతస్సులలో (Ducts) ఏర్పడే అవరోధాలను తొలగించటానికి ఆ శ్రోతస్సుల అనాటమీ సరిగా తెలియని వాడు శస్త్ర చికిత్సకు పూనుకుంటే రోగి మరణానికి కారణం అవుతాడని హెచ్చరించాడు.తొలి ప్లాష్టిక్ సర్జన్ గా సుశ్రుతుడు అందించిన విఙ్ఞానాన్ని ఈ యుగం ప్రజలు సరిగా ఉపయోగించుకోకపోవటం వలన నష్తం మనకే జరుగుతోంది. గురుశిష్య పరంపరలో తగిన గురువులు లేక, systematic surgical teaching and practice లోపించిన కారణంగా, ప్రభువుల ప్రొత్సాహం కరువై, శస్త్ర చికిత్స భారతదేశంలో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది.ఇందుకు బౌద్ధమో, జైనమో ప్రవచించిన అహిమ్సా సిద్ధాంతం ఎంతమాత్రమూ కారణం కాదు. అ శాస్త్రాన్ని దక్కించుకోవలన్న చొరవ మనకు లేకపోవటాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

గౌతమ బుద్ధుడు, జైన మహావీరుడు, వేదవ్యాసుడూ ఈ యుగానికి ఎంత అవసరమో సుశ్రుతుడు కూడా అంతే అవసరం.