Baby's first cry in Mother Tongue only
అమ్మభాషలోనే
అసలు ఏడుపు
డా.
జి వి పూర్ణచందు
బిడ్డ పుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో
ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. తల్లి కడుపులో ఉన్నంత కాలం తల్లి మాట్లాడుతుండగా
వింటూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరించే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు. భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదనం మాతృభాషలోనే
ఉంటుందని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొందుతుందని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే పాతకాలం
నాటి మన నమ్మకం వమ్ము అయ్యి౦ది.
ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంఛి
భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తా రనేది ఈ తాజా పరిశోధనా
సారాంశం. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడించే ప్రయత్నం (ability to
actively produce language) అనేది పుట్టిన క్షణంను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్ధం అవుతోంది.
తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు
పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు
చెప్తున్నారు.
ఇక్కడ “యాస” అనే మాటని “భాషలోని లయ(rhythm)” అనే
అర్ధంలో వాడటం జరిగి౦ది. తమిళ౦,ఆంగ్లం, తెలుగు, సంస్కృతం మొదలైన భాషలలో లయపరంగా ఉన్నతేడాలు
మనకు తెలుసు. అలాగే, జెర్మనీ, ఫ్రెంచి భాషల లయలలో తేడాలు ఎలా ఉంటాయో శాస్త్రవేత్తలు
విశ్లేషించారు. సాధారణంగా జెర్మన్ పదాలు పై స్థాయి నుండి కి౦దిస్థాయికి వస్తాయని, ఫ్రెంచి పదాలు క్రి౦దిస్థాయి నుండి పై స్థాయికి
వెడతాయనీ గుర్తించారు. ఫ్రెంచి భాషలో తండ్రిని “papaa” అని ఆరోహణంలో పలికితే, జెర్మన్
భాషలో “paapa” అని అవరోహణంలో పలుకుతారట. జెర్మన్,
ఫ్రెంచి బిడ్డలు మొదటి ఐదు రోజులలో చేసిన రోదనల ధ్వని తరంగాలు sound tracks ని ప్రయోగాత్మకంగా
విశ్లేషణ చేశారు. పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల
విరామానికి ముందు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువ స్థాయిలో ఉన్నదా అని పరిశీలించారు.
ఆకలి వలన, అసౌకర్యం వలన, వంటరితనం వలన పసికూనలు చేసే రోదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని
విశ్లేషించారు. జెర్మన్ బిడ్డల రోదనం హెచ్చుస్థాయి నుండి తగ్గుస్థాయికి అవరోహణ క్రమంలో
ఉండగా, ఫ్రెంచి బిడ్డల రోదనం దిగువస్థాయి నుండి పై స్థాయికి ఆరోహణ క్రమంలో ఉన్నట్టు
తేలింది.“వా…వ్హ్” అని ఏడ్చే బిడ్డకీ “హ్వో…యీ…” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా
ఉండటాన్ని ఈ విధ౦గా గమనించారు. పుడుతూనే “mam…mam” అని ఇ౦గ్లీషు బిడ్డ ఏడిస్తే, “అమ్…మ”
అని తెలుగు బిడ్డ ఏడవటాన్ని మనం కూడా గమనించవచ్చు. ఏడుపుకు భాష ఉంది. అది మాతృభాషలో
ఉంటుంది.
జెర్మనీలోని ఉర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయానికి
చె౦దిన ప్రొఫెసర్ Kathleen Wermke అనే మానవీయ శాస్త్రవేత్త ఈ పరిశోధనలకు నాయకత్వం వహించారు.
తల్లి గర్భంలో ఉండగా తాను నేర్చుకున్న భాషలోనే కొత్త పాపాయి మాట్లాడు తుందనేది ఈమె
పరిశోధనల సారాంశం. ఎలా మాట్లాడుతుంది? తన ధ్వనులతో మాట్లాడుతుంది. బిడ్డ ఎదుగుతున్న
కొద్దీ మనం మన ధ్వనులను నేర్పి౦చటం ప్రారంభిస్తాం. భాషలొ మెళకువలన్నీ తెలియ పరుస్తాం.
కానీ, మనం నేర్పించటం మొదలు పెట్టకుండానే, ఇ౦కా పుట్టకుండానే, అమ్మ కడుపులోనే ఈ నేర్చుకోవటాలన్నీ
స్వయంగా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ. దీన్ని
మనో విశ్లేషణ శాస్త్ర పరిభాషలో
“pre-adaptation for learning language” అంటారు.
అమ్మభాష ప్రభావంతో బిడ్డ మనసు రూపొంది, అమ్మభాషలోనే
అది పరిణతి పొందుతుంది. బిడ్డను అమ్మభాష తెలియకుండానే పెంచితే, మానసిక దౌర్బల్యానికి
దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే పెరుగుతూ, బడిలో చేరాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్ధం చేసుకొనే
ప్రయత్నం చేస్తారు. ప్రాథమిక పాఠశాలలలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ
(language disorder) ఏర్పడుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహి౦చిన కథ్లీన్ వెర్క్ శాస్త్రవేత్త
చాలా స్పష్ట౦గా పేర్కొన్నాడు.
“నిఃశ్వాసోఛ్చ్వాస సంక్షోభస్వప్నాశాన్
గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస సంక్షోభ స్వప్న సంభవాన్” అనే సుశ్రుతుని ఆయుర్వేద
సిద్ధాంతాన్ని ఇక్కడ పరిశీలించాలి.
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస,
నిఃశ్వాసాలు, తల్లి మనోభావాలు ప్రభావం చూపుతాయి. అలాగే, బిడ్డ మనో భావాలు కూడా తల్లిపైన ప్రసరించటం వలనే
గర్భవతులకు వేవిళ్ళు కలుగు తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ
శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడటం మొదలౌతాయి. కాబట్టి, నాలుగవనెల గర్భవతిని “దౌహృదిని” అంటారు.
తనదొకటీ-తన కడుపున పెరిగే బిడ్డదొకటీ రెండు హృదయాలు కలిగినది దౌహృదిని!
హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు
కలగటంలో మాతృభాష నిర్వహించే పాత్ర ఎంతయినా ఉందని దీన్ని బట్టి అర్థం అవుతోంది. మన శబ్దాలు,
మావిపొరల మధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్న శిశువులకు యథాతథంగా వినిపించవు. నీటిలో చేపలు
వాటి శరీరాంగాలనుండి, ఎముకల నుండీ మెదడుకు చేరిన ధ్వని తరంగాలను గ్రహించినట్టు, బిడ్డ
ఉమ్మనీటి లోంచి తల్లి భాషను స్వీకరించటం ప్రారంభిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max
Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D.
Friederici వెల్లడించారు. అందుకే, వివిధ భాషలు
వినిపించే గందరగోళ వాతావరణంలో నెలలు నిండిన తల్లులు తిరగకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పేదంతా కడుపులో
బిడ్డ విన్నాడనే కథలో అసాధ్యం లేదన్న మాట!
నెలలు నిండుతున్న తల్లులు మన టీవీ యా౦కర్ల సంకరభాష అదేపనిగా వింటే, దాని చెడు
ప్రభావం పుట్టేబిడ్డ మానసిక స్థితిపైన తప్పకుండా పడుతుందన్నమాట! గర్భంలో పెరిగే శిశువులు
గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదడు ధ్వని తరంగాలను స్వీకరిస్తుందని ఈ పరిశోధనలు
చెప్తున్నాయి.
మాతృభాషల మీద కార్పోరేట్ విద్యారంగం తీవ్రమైన
అఘాయిత్యాలు జరుపుతున్న సమయంలో, 2009 నవంబర్ 5న కరెంట్ బయాలజీ అనే వైద్యపత్రికలో ఈ
“సైకో లింగ్విస్టిక్స్” అంశంమీద తొలి పరిశోధన వెలువడింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య
సమావేశంలో 2009 మే, 16న “ప్రపంచంలోని అన్ని దేశాల, ప్రా౦తాల, ప్రజలు మాట్లాడుకొనే భాషలను
సంరక్షి౦చే కార్యక్రమాలు చేపట్టా”లని (A/RES/61/266) తీర్మానం చేసిన నేపధ్యంలో ఈ పరిశోధనాంశాలు
ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
భాషాసంస్కృతులకు జాతులు పునరంకితం కావాలని యునెస్కో
సంస్థ 2010 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పిలుపు నిచ్చింది. అందుకు అనుగుణంగా
మన విద్యావ్యవస్థ గానీ, మన ప్రభుత్వ యంత్రాంగం గానీ గట్టిగా స్పంది౦చిన సందర్భాలు లేవనే
చెప్పాలి. ప్రాధమిక విద్య వరకూ అయినా తెలుగు చదివిస్తే తెలుగు పిల్లలకు గ్రహణ శక్తి
బాగా పెరుగుతుంది. కానీ, ఎల్ కేజీ పిల్లలు కూడా
తెలుగే మాట్లాడ కూడదనే వెర్రి నిబంధనని
కార్పోరేట్ విద్యాసంస్థలు సృష్టిస్తే, “పులిని చూసి వాత” అన్నట్టు మధ్య తరగతి
విద్యాలయాలూ ఈ వెర్రిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాయి. గత రె౦డు దశాబ్దాలుగా ఈ
ధోరణి కొనసాగుతూ వస్తో౦ది.
“తెలుగు
రావటం” అనే తప్పు తమ విషయంలొ జరిగి పోయిందనే ఒక అపరాథ భావన పిల్లల్లో కలిగి, అది మనోదౌర్బల్యానికి దారితీస్తోంది. తెలుగు రాని
తెలుగుబిడ్డ తెలుగు వచ్చిన వాడితో పోలిస్తే, మానసికంగా బలహీనుడనే బలమైన అభిప్రాయం ఏర్పడిపోయింది.
అది తెలుగు మాట్లాడ గలిగిన వాడిలో ఆత్మ న్యూనతకు కారణం అవుతోంది.
“మాకు తెలుగు
రాదండీ” అని గొప్ప చెప్పుకోవటం విద్యారంగం
సృష్టి౦చిన వెర్రి ప్రభావమే! పిల్లల కోసం తల్లిద౦డ్రులు
కూడా విదేశీ భార్యా భార్తల్లా ఇంట్లో ఇంగ్లీషులో మాట్లాడు కోవాలసిన దుస్థితిని కావాలని
విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టింది. ఏవో కొన్ని పడిగట్టు పదాలే తప్ప, మనసు విప్పి మాట్లాడు
కునేందుకు తెలుగు రాకపోవటం, పరాయి భాషలో నేర్చిన మాటలు చాలకపోవటం తెలుగు సమాజం ఎదుర్కొంటున్న
ప్రధాన సమస్య. మాతృభాషను దెబ్బతీసిన ఏ దేశంలోనైనా ఇలానే జరుగుతుంది. మనో దౌర్బల్యం
పెరిగి, బలహీన మైన తరాలు తయారవుతాయి.
మాతృభాషలోనే పెరగటం అనేది పిల్లల హక్కుగా చట్టం
తీసుకు రావలసిన అవసరం ఉంది. ప్రాధమిక విద్యలో
మాతృభాషని తప్పని సరి చేయాలనే జీఓని సమర్ధవంతంగా అమలు చేయాలి. మన పిల్లలకు రేపు ఇ౦గ్లీషు
బాగా రావటం కోసమే ఇవ్వాళ తెలుగు నేర్పిస్తున్నామని గ్రహించాలి. కార్పోరేట్ విద్యాసంస్థలు
వ్యాపార పోటీలో తమకు తెలియకుండానే తెలుగు భాషా ద్రోహానికి తలపడ్తున్నారని గమనించాలి.
ఆంగ్లం కూడా నేర్వాలి. కానీ ఆంగ్లం మాత్రమే నేర్వాలనే విధానాన్ని మాతృభాషా ద్రోహమూ,
మాతృద్రోహమూగా పరిగణి౦చి తీరాలి!